శిశుపాలవధమ్ తెలుగు టీక, తాత్పర్యములు - ప్రాంజలి

 .

శ్రీపదనూపురస్వన వశీకృత మానస హంసి; శ్రీలలా

టోపరి కుంతలాళి మృదుడోలన సర్కము; శ్రీ ప్రసూన పా

దోపరిలిప్త కుంకుమ రసోద్గత దీపిత సానురాగమౌ

శ్రీపతి నండగా తలఁతు శ్రీకృతి కెన్నగ టీక గూర్పగన్.


ఉ.

తొల్లిని కేలుమోడ్పు సరి తోరపు మై చిటికాడ! దెప్పకన్

కల్లలు కాయవోయి సుముఖా! సముఖంబున నీకు మ్రొక్కెదన్, 

చల్లని ఱేని తోడు, యదుచంద్రుడు నీకును నుద్దికాఁడుగా

చెల్లుట యొప్పి తొల్త హరిచింతనఁ జేసితి నాఖువాహనా! 

కం.

జిలుగుల కబ్బము మాఘము 

చిలుకగ వెన్నలు సిలసిల చిందెడు సరణిన్;    

నలనయ్య కృతిని నాయెడ

పలుకు పలుకున పలుకమ్మ పలుకుల కలికీ! 

చం.

సరసము కావ్యసృష్టి; సుమ సౌరభమెంతయు కావ్యవృష్టి; ద్రా

క్షరసము రీతి పుష్టి; కను గానని దృష్టి మదీయమే గతిన్;

నెరపుట పెద్ద ఇష్టి; మది నిష్టము పెంపుగ ప్రోది జేసి, నే   

మరచెద కష్టమున్; కలిమి మాఘము నొందగ, తీర్తు మాఘమున్;     

కం.

బల్లిదమౌ మాఘమునకు

చల్లని వ్యాఖ్య సలిపి కృతి సార్థకమవగన్

వెల్లని వెలుగును సూపిన

మల్లివిభుని బాసట మది మరువగ తరమే?

వ.

ఇట్లు ఇష్టదేవతలకు జోతలిడి, కవి వరేణ్యులను మది తలంచి, యందరకు నంజలి ఘటించి

నారంభించెద శిశుపాలవధాఖ్యాన కావ్యపు తెనుగు టీక, తాత్పర్యాదుల కూర్పు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మయూఖము - 2

వాఙ్మయచరిత్రలో కొన్ని వ్యాసఘట్టాలు - శ్రీ ఏల్చూరి మురళీధరరావు గారు.

ధ్రువనక్షత్రం - శింశుమారుడు