మయూఖము - 1
సంస్కృత సాహిత్యంలో ’నాటకం’ అన్న ప్రక్రియను తన ఎడమచేత్తో ఆడించిన కవి భాసకవి. నాటకకళలో ఆయనకు సాటి రాగల ప్రతిభావంతులు నిస్సందేహంగా మరెవ్వరూ లేరని నా భావన. ఆయన తర్వాత శూద్రక కవి. ఈ శూద్రకుడు కూడా తన మృచ్ఛకటిక నాటకానికి మూలంగా భాసుని చారుదత్తాన్ని ఎంచుకోవడం గమనార్హం. దశరూపకాలలో పలు ప్రక్రియల్లో ఈ భాసకవి తన రచనలను చేశాడు. ఇతివృత్తాన్ని ఎంచుకోవడంలోనూ, దాన్ని "దృశ్య" బద్ధంగా మలచటంలోనూ, పతాకాస్థానకాలను (Dramatic Ironies) అక్కడక్కడా అందంగా పొదగటంలోనూ, ధ్వని మార్గంలో విషయాలను చెప్పటంలోనూ, ఔచిత్యం లోనూ, అన్నిటికన్నా ముఖ్యంగా - అతి సామాన్యులకోసం నాటకప్రక్రియను నిర్వహించటంలోనూ ఈయనది అసమానమైన ప్రతిభ. మహాభారతంలోని విరాటపర్వం ఆధారంగా భాసుడు రచించిన ఓ రూపకం పంచరాత్రమ్. పన్నెండేళ్ళ అరణ్యవాసం, ఓ యేడు అజ్ఞాతవాసం పూర్తవుతున్న తరుణం. పాండవులు విరాటరాజు కొలువులో మారువేషాల్లో ఉన్నారు. ఇటు దుర్యోధనుడు ఓ యజ్ఞం తలపెట్టి అందులో భాగంగా బ్రాహ్మలకు దానాలు చేస్తుంటాడు. ఆ బ్రాహ్మలలో ఒకడై ద్రోణుడు రారాజును పాండవులకు వారి అర్ధరాజ్యం ఇచ్చివెయ్యవలసిందని వరం యాచిస్తాడు. రారాజు శకునితో యోజించి, ఓ షరతు పెడత...