సంస్కృతసౌరభాలు - 14
రస్యతే, ఆస్వాద్యతే అనేనైవ రసః రససిద్ధాంతం సంస్కృత లాక్షణిక సిద్ధాంతాలలో ముఖ్యమైనది. రసం అంటే కావ్యం వలన జనించే ఒక లోకోత్తరమైన అనుభూతి. కావ్యానికి సంబంధించి రసం తాలూకు స్థితి ఎక్కడ నిరూపితమై ఉంటుంది అన్న విషయానికై ఉద్భటుడు అనే లాక్షణికుడు ఒక ప్రతిపాదన చేశాడు. - "వాచి వస్తున్యపి రసస్థితిః" రచనాసంవిధానం లోనూ, వస్తువు అంటే - ఇతివృత్తంలోనూ రసస్థితి ఉంటుంది. ఇతివృత్తం అంటే - పాత్ర చిత్రణ, సన్నివేశకల్పనల సమాహారం. దృశ్యనాటకాలకు సంబంధించిన సంవిధానాలలో - స్థూలంగా ముఖ్యమైన రెండు ధోరణులు కనిపిస్తాయి. మొదటిది భాస, శూద్రకాదులకు సంబంధించిన వస్తునిర్వహణ ద్వారా రసస్ఫూర్తి కలిగించే ధోరణి, రెండవది రచనా శైలి, శిల్ప చాతుర్యాదుల ద్వారా రసనిష్పందం కలిగించగల భవభూతి కాళిదాసాదుల ధోరణి. అభినేయమైన కృతులు భాసకవివైతే నాటకీయమైన కావ్యాలు భవభూతికాళిదాసాదులవి. మొదటిది నాట్యకళ, రెండవది కావ్యకళ. ఈ ధోరణులలో భాసమహాకవి మార్గానికి చెందిన మరొక కవి దిజ్ఞాగుడు లేదా ధీరనాగుడు. ఈ కవి రచించిన అపూర్వమైన నాటకం పేరు కుందమాల. కుందమాల అంటే మల్లెపూదండ అని అర్థం. ********************** అభినవరచిత...