శిశుపాలవధమ్ తెలుగు టీక, తాత్పర్యములు - ముందుమాట

 ముందుమాట.

మాఘుడనే కవి రచించిన అపూర్వసంస్కృత మహాకావ్యం శిశుపాలవధమ్. దీనినే మాఘం అంటారు. ఈ కావ్యం సంస్కృత పంచమహాకావ్యాల్లో ఒకటి. కావ్యానికి ఎన్నో వ్యాఖ్యానాలు ఉన్నాయి. అయితే మహామహోపాధ్యాయ కోలాచలం మల్లినాథసూరి రచించిన "సర్వంకష" వ్యాఖ్యానం ప్రామాణికంగా పేర్కొంటారు.

అఘము అంటే పాపం. మాఘము అంటే పాపము కానిది; పుణ్యము. 

మాఘుడు ఘూర్జరదేశకవి. మహా పండితుడు, భాషావేత్త. 

శిశుపాలవధమ్ కావ్యంలో మొత్తం 20 సర్గలు ఉన్నాయి. మొదటి మూడు సర్గలకు వావిళ్ళ వారు టీకాతాత్పర్యసహితంగా వ్యాఖ్యానం ప్రకటించి ప్రచురించారు. సంస్కృతం నేర్చుకోవాలని, నేర్చుకున్న సంస్కృతాన్ని నిత్యం మననం చేసుకోవాలని కోరుకునే వారు ఆ మూడు పుస్తకాలను తప్పక పఠించాలి.

అయితే ఎందుచేతనో మొదటి మూడు సర్గలు తక్క మిగిలిన 17 సర్గలకు టీక, తాత్పర్యాలు ఎవరూ వ్రాయలేదు. ఎవరైనా వ్రాసి ఖిలమై పోయినా ఆశ్చర్యం లేదు. ఆంధ్రమాఘము పేరిట తెనుగులో పద్యరూపంలో ఎవరో మాన్యులు అనువదించారు.

అయితే శిశుపాలవధమ్ కావ్యాన్ని సంస్కృతంలోనే చదువుకోవలసిన అవసరం ఉంది. ఎందుకంటే కావ్యంలో శబ్దాలంకారాలు, శబ్దచిత్రాలు, బంధకవిత్వం చిక్కగా అల్లుకొని ఉన్నాయి. అందుచేత ఈ కావ్యపు నాలుగవ సర్గకు టీక, తాత్పర్యాలను కూర్చే బాధ్యత భారతి అనే కలంపేరు గల భవదీయుడు తలపెడుతున్నాడు. ఈ కార్యంలో అనర్హతే అర్హత కన్నా ఎక్కువగా ఉంది. అయితే ఏం చెయ్యాలి? ఏ చెట్టూ లేకుంటే ఆముదపు చెట్టే గతి. ఏ వ్యాఖ్యానమూ తెనుగున దొరక్కపోతే ఇదుగో, ఇలాంటి అల్పులే అటువంటి పనులు చెయ్యవలసి ఉంటుంది. 

కావ్యంలో మొదటి మూడు సర్గలకు టీక తాత్పర్యాలు ఉన్నందున, నాలుగవ సర్గకు టీక తో మొదలు. మిగిలిన సర్గలకు సమయం ఎప్పుడో!

దీనిని ప్రకటించడం, పుస్తకరూపంలో తేవడం - ఇవన్నీ నా తాహతుకు ఓపికకు, ఆసక్తికి ఆవల ఉన్న పనులు. అందుకనే ఇది బ్లాగులో ప్రకటించక తప్పదు.

ఈ టీకా తాత్పర్య కూర్పులో తప్పులన్నీ నావి. ఒప్పులన్నీ మల్లినాథసూరి పండితునివి. కావ్యసౌరభాలన్నీ మాఘకవివి.



మీ,

భారతి

(రవి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అశోకుడెవరు? - 1

Disclaimer

విద్యానగర విహారం