శిశుపాలవధమ్ నాలుగవ సర్గ తెలుగు టీక, తాత్పర్యములు - (31 - 40)

 ౩౧.

వ్యోమస్పృశః ప్రథయతా కలధౌతభిత్తిరున్నిద్రపుష్పచణ చంపకపింగభాసః ।

సౌమేరవీమధిగతేన నితంబశోభామేతేన భారతమిలావృతవత్ విభాతి ॥


వ్యోమస్పృశః = అంతరిక్షాన్ని అంటుచున్నది; ఉన్నిద్రపుష్పచణ = వికసించిన సుమసంపదచేత; (తేన విత్త ఇతి చణప్రత్యయః); చంపకపింగభాసః = మొగలిపూల యొక్క సువర్ణవర్ణముతో వెలుగునది అయిన; కలధౌత భిత్తి = పసిడి సానువు; సౌమేరవీం = సుమేరుసంబంధమైన; నితంబశోభాం = శిఖరముల శోభను; అధిగతేన = ప్రాపించెనో (యన్నట్లు); ప్రథయతా = ప్రకటించుచున్నది. ఏతేన = ఈ రైవతకాద్రి చేత; భారతం = భారతమను ఈ భూఖండము; (దీనికే హైమవతమని మరియొక నామము గలదు – సర్వంకష) ఇలావృతవత్ = ఇలావృతఖండము వలే; విభాతి = ఒప్పుచున్నది.


ఆకాశమును తాకు ఈ రైవతకము వికశించిన సుమసంపదగల మొగలిపూల రంగుతో మెఱయు పసిడి సానువుల సుమేరు శోభను ప్రాపించెనో యన్నట్లు ప్రకటించుచున్నది. ఈ రైవతకాద్రి ఇచ్చట నుండుట చేత భారతము ఇలావృతఖండము వలే ఒప్పుచున్నది.


సర్వంకష

కలధౌత రౌప్యహేమ్నౌః ఇతి విశ్వః

ఇలావృతవర్షము సుమేరుపర్వతమును ఆవరించియున్న భూభాగము. ఇది దేవభూమి.

మామ్నేదం భారతం వర్షం హిమాద్రేస్తచ్చ దక్షిణే ।

తేన హైమవతం నామ పరేష్వప్యేవమున్నయేత్॥

ఇలావృత సౌమేరవం సుమేరో పరితేవ యత్ ॥। ఇతి వైజయంతీ.

౩౨.

రుచిరచిత్రతనూరుహలోమభిర్విచలితైః పరితః ప్రియకవ్రజైః ।

వివిధరత్నమయైరభిభాత్యసావవయవైరివ జంగమతాం గతైః ॥


అసౌ = ఈ గిరి; రుచిరైరుజ్వలైః = నానావర్ణములతో; తనూరుహలోమభిః = గాత్రమునందు పొడమించిన రోమములు గలదైన; ప్రియక వ్రజైః = ప్రియక మను పేరుగల మృగముల గుంపుతో ;(కంబలయప్రకృతః మృగవిశేషః) పరితః = అంతటను; ప్రచలితైః = వ్యాపించినదై; జంగమతాం = చరించుటను; గతైః =పొందిన; వివిధరత్నమయైః = వివిధరత్నములతో; అవయవైరివ = తన దేహభాగములతో; ప్రతిభాతి = ఒప్పుచున్నది.


ఈ గిరి వివిధములైన రంగులతో, దేహముపైని రోమములతో ఒప్పారు ప్రియకమను పేరుగల మృగసమూహముతో, నిశ్చింతగా చరించు జంగముల వ్యాపారమును పోలి,నానారత్నములను,తన దేహభాగములవలే వహించి ఒప్పారుచున్నది.


సర్వంకష - ప్రియక్ రోమభిర్యుక్తో మృదూచ్చమసృణైర్ఘనైః - ఇతి వైఅయంతి.

ద్రుతవిలంబిత వృత్తము.

౩౩.

కుశేశయైరత్ర జలాశయోషితా ముదా రమన్తే కలభా వికస్వరైః ।

ప్రగీయతే సిద్ధగణైశ్చ యోషితాముదారమంతే కలభావికస్వరైః ॥


అత్ర = ఇచ్చట; జలాశయ = హ్రదములలో; ఉషితా = నివసించు; (గత్యర్థ అకర్మకములలో క్త ప్రత్యయము); కలభాః = ముప్పది ఏండ్ల యేనుగులు;  వికస్వరైః = వికసించిన; కుశేశయైః = శతపత్రముల తామరల చేత;  ముదా = ఆనందముగా ; రమన్తే = క్రీడించుచున్నవి; (కమలములకు, కరివిహారములకు ఈ అద్రి నెలవని తాత్పర్యము) కల = అవ్యక్తమధురముగా; స్వరైః = స్వరములతో; భావికాః = ఆనందాన్వేషకులు అయిన; సిద్ధగణైః = సురసంఘములచేత; యోషితాం = తమ ప్రియతమ స్త్రీల; అంతే = సమీపమున; ఉదారం = కమ్మగా; ప్రగీయతే = గానము చేయబడుచున్నది.


ఇచ్చట జలాశయములలో నివసించు కరిణులు ఆ సరములందు వికసించిన తామరలతో క్రీడించుచున్నవి. అవ్యక్తమధురముగా, చక్కని స్వరముతో దేవగణములిచ్చట తమ ప్రియతమస్త్రీలను కూడి కమ్మగా పాడుచున్నారు.(ఇది భూతలస్వర్గమని భావము).


సర్వంకష

త్రింశద్వర్షస్తు కలభః ఇతి వైజయంతీ.

శతపత్రం కుశేశయం ఇత్యమరః


ఇతరములు - ద్విపాదయమకము.

౩౪.

ఆసాదితస్య తమసా నియతేర్నియోగాదాకాంక్షతః పునరపక్రమణేన కాలమ్ ।

పత్యుస్త్విషామిహ మహౌషధయః కలత్రస్థానం పరైరనభిభూతమమూర్వహన్తి ॥


ఇహ = ఈ నగమున; అమూ మహౌషధయః = ఈ యొక్క వనమూలికలు; నియతే నియోగాత్ = నిర్భాగ్యమున (ఈ సమయమున నిట్లగును అను దైవశాసనముచేత); తమసా = చీకటితో; (వ్యసనముతో);ఆసాదితస్య = క్రమ్ముకొనినట్టి; పునరపక్రమణేన = మరియు, దానినుండి బయటపడుట చేత; కాలం = పునస్సమాగమ సమయమును; ఆకాంక్షతః = అభిలషించుచున్న; త్విషాం పత్యుః = తేజో పతి (రవి)యొక్క; పరైః =అన్యతేజముతో;  అనభిభూతం = తిరస్కారము కాని; కలత్రస్థానం = కలత్రస్థానమును; వహన్తి = పొందుచున్నవి. 


విరాట్ స్వరూపుని సంకల్పము చేత రాత్రి సమయమున సూర్యుని - అంధకారము క్రమ్ముకొనినది. తిరిగి యా అంధకారము త్రొలగుట చేత సూర్యుడు ప్రభాపతి అగుటకు నిచ్ఛగించెను. త్విషాపతి సూర్యుని భార్యయే - తేజము. ఆ తేజమును - అంధకారసమయమున ఈ పర్వతమున గల ఓషదులు తమ సంరక్షణమున నుంచుకొన్నవి. ఓ వ్యక్తి వ్యసనగ్రస్తుడై భార్యను వీడియుండు సమయమున, ఆతని పతి మరియొకరి సంరక్షణమున నుండునో అట్లు ఈ ఔషధులు ప్రవర్తించినవి. పునస్సమాగమమును అభిలషించిన పతి తిరిగి వచ్చిన పిదప (ఆ స్త్రీని) తేజస్సును (సంరక్షకుడు) ఓషధులు ఆతనికి ఒప్పగించినవి.


రాత్రియందు ఈ పర్వతమున గల మహౌషధములు సూర్యతేజముతో వెలుగొందుచున్నవని తాత్పర్యము.


సర్వంకష

సమాసోక్తి అలంకారము.

౩౫.

వనస్పతిస్కంధనిషణ్ణబాలప్రబాలహస్తాః ప్రమదా ఇవాత్ర ।

పుష్పేక్షణైర్లంభితలోచకైర్వా మధువ్రతవ్రాతవృతైర్వ్రతత్యః ॥


అత్ర = ఈ శైలమందు; వనస్పతిస్కంధనిషణ్ణబాలప్రబాలహస్తాః; వనస్పతి = తరువుల; (ముంగట నిలబడియున్న భర్త యొక్క) స్కంధ = కొమ్మలలో; (బాహువులపైన); నిషణ్ణ = నెలకొన్న (ఊతముగా గొనిన); బాలప్రవాలహస్తాః = చివురుటాకుల చేతులు; మధువ్రతవ్రాతవృతైః; మధువ్రత = ఝుంకారము సేయు తుమ్మెదల;  వ్రాత = సమూహపు; వృతైః = స్వనములచేత; (అత ఏవ = మరియు) లంభితలోచకైః వా; లంభిత = ప్రాపించిన; లోచకైః వా = చుక్కలు గలవియును అయిన; (కాటుక కంటి); (వా ప్రయోగము ఉత్ప్రేక్ష కొరకు ఉపయోగింపబడినది); వ్రతత్యః =  తీవెలు; పుష్పేక్షణైః = పుష్పములను వీక్షించుటకై ; ప్రమదా ఇవ = ముదితల వలే; (లక్ష్యంతే = లక్షించుచున్నవి)


ఈ శైలమందు తరువుల విటపములలో నెలకొన్న చివురుటాకుల చేతులవంటివి ఝుంకారము సేయు భ్రమరసమూహముల స్వనములచేతను మరియు ప్రాపించిన తారలు గలవియును అయిన తీవెలు పుష్పములను సందర్శించుటకై ముదితల వలే నున్నవి.


ఈ శైలమందు ముందున్న పతి భుజములను ఊతముగా గొని, చివురుటాకుల చేతులను, ఝుంకారము సేయు తుమ్మెదల సమూహపు స్వనముల వలే కూజించు మరియు కాటుకనలదిన కన్నుల,  కన్నియలు కుసుమములను వీక్షించుటకా యన్నట్లున్నవి.


సర్వంకష

'వనస్పతివృక్షమాత్రే బినాపుష్పఫలద్రుమే' ఇతి విశ్వః

'లోచకో మాంసపిండే స్యాదక్షితారే చ కజ్జలే' ఇతి విశ్వః

౩౬.

విహగాః కదంబసురభావిహ గాః కలయంత్యనుక్షణమనేకలయమ్ ।

భ్రమయన్నుపైతి ముహురభ్రమయం పవనశ్చ ధూతనవనీపవనః ॥


కదంబసురభౌ = కడిమిపూల తావితో పరిమళభరితమైన; ఇహ = ఈ ధరణీధరమున; విహగాః = పక్షులు; అనుక్షణం = ప్రతి క్షణమూ; అనేకలయం = బహువిధములైన వైవిధ్యములైన; గాః = శబ్దములను; కలయంతి = కూయుచున్నవి; అయం = ఈ యొక్క; ధూతనవనీపవనః = కదంబముల వనమును కదిలించిన; పవనః = గాలి; ముహుః = ఇంకా;  అభ్రం = మేఘమును; చ = కూడా; భ్రమయన్ = చలింపజేయుచు; ఉపైతి = సమీపించుచున్నది;

కడిమిపూల తావితో పరిమళభరితమైన ఈ శైలమున పక్షులు అనుక్షణమూ బహువిధములైన వైవిధ్యములతో కూజితములను జేయుచున్నవి. కదంబముల వనమును చలింపజేసిన మారుతము తిరిగి జలదములను కూడ కంపింపజేయుచు మనలను సమీపించుచున్నది.


సర్వంకష - అర్జునీనేత్ర దిగ్బాణ భూ వాక్ వారిషు గౌర్మతా - ఇతి విశ్వః (గాః అనునది వాక్కు విషయమున ఉపయోగించదగు.)

నీపప్రియకదంబాస్తు హలిప్రియః - ఇతి అమరః

ప్రమితాక్షర వృత్తము - స జ స స - అని గణములు/ 'ప్రమితాక్షరా సజససైరుదితా'

౩౭.

విద్వద్భిరాగమపరైర్వివృతం కథంచిచ్ఛృత్వాపిదుర్గ్రహమనిశ్చితధీభిరన్యైః ।

శ్రేయాన్ ద్విజాతిరివ హంతుమఘాని దక్షం గూఢార్థమేష నిధిమంత్రగణం బిభర్తి ॥


అన్వయము - విద్వద్భిః, ఆగమపరైః, వివృతం, కథంచిత్, శృత్వా అపి, దుర్గ్రహం, అనిశ్చితధీభిః, అన్యైః, శ్రేయాన్, ద్విజాతిరివ, హంతుం, అఘాని, దక్షం, గూఢార్థం, ఏష, నిధిమంత్రగణం, బిభర్తి.


ఏషః = ఈ పర్వతము; శ్రేయాన్ = శ్రేష్ఠుడు; ద్విజాతిరివ = బ్రాహ్మణుని వలే; ఆగమపరైః = భూగర్భవిద్యలో (మంత్రశాస్త్రమున); విద్వద్భిః = పండితులైన వారలచే;  కథంచిత్ = ఏదో విధముగా; వివృతః అపి= మార్పునొందియు;  అనిశ్చితధీభిః = శాస్త్రనిపుణులు కానివారలైన; అన్యైః =అన్యులచేతను; శృత్వా అపి = వినియున్నను; (ఇచ్చట నిధి గలదు, ఈ మంత్రమునకు ఈ సిద్ధి గలదని ఆగమవేత్తలచే నెఱింగియు), దుర్గ్రహమ్ = దుస్సాధ్యము;

అఘాని = దుఃఖములను (పాపములను); హన్తుం = పోగొట్టుటకు; దక్షమ్ = సమర్థమైనది.

గూఢం = ఆవరించిన, అర్థం = ధనమును (ప్రయోజనమును); నిధిమంత్రగణం = ధనరాశుల చయమును (నిధుల వంటి మంత్రములను) బిభర్తి = ధరించినది.


ఈ పర్వతశ్రేష్ఠము ద్విజులకు సమానమైనది. భూగర్భవిద్యావేత్తలచేత యెట్లో (అతి కష్టతరముగ పరిశోధింపబడి) చెప్పబడినను, అర్థము చేసుకొనజాలని చంచల, అనిశ్చితబుద్ధి గల పురుషులకు దుర్లభమైనది. అట్లే ఈ పర్వతము దారిద్ర్య దుఃఖమును బాపు గూఢమైన ధనరాశులను తనయందు కలిగియున్నది.

ఈ పర్వతశ్రేష్ఠము ద్విజులకు సమానమైనది. మంత్రశాస్త్రవేత్తలచేత యెట్లో (అతి కష్టతరముగ పరిశోధింపబడి) వివరింపబడినను,అర్థము చేసుకొనజాలని చంచల, అనిశ్చితబుద్ధి గల పురుషులకు దుర్లభమైనది.అట్లే ఈ పర్వతము పాపములను నశింపజేయు గూఢమైన మంత్రచయమును తనయందు కలిగియున్నది.


సర్వంకష

దుఃఖైర్నోవ్యసనేష్వఘమ్ ఇతి వైజయంతీ

౩౮.

బింబోష్ఠం బహు మనుతే తురంగవక్త్రశ్చుంబనం ముఖమిహ కిన్నరం ప్రియాయాః ।

శ్లిష్యంత ముహురితరో౽పి తం నిజస్త్రీముత్తుంగస్తనభరభంగభీరుమధ్యామ్ ॥


ఇహ అద్రౌ = ఈ గిరి కడ; తురంగవక్త్రః = అశ్వము యొక్క ముఖము వంటి ముఖము గల (దేవజాతి పురుషుడు); బింబోష్ఠం = పండిన దొండపండువంటి పెదవిగల; ప్రియాయాః = ప్రియురాలి ;ముఖం = ముఖమును; చుంబంతం = ముద్దాడు; కిన్నరం = మనుషముఖము, అశ్వశరీరము గల కిన్నెరుని; బహు = గొప్పగా; మనుతే = భావింతురు; ఇతరః అపి = అన్యులు;(అశ్వశరీరము,మనుషముఖము గల వారు) ఉత్తుంగస్తనభరభంగభీరుమధ్యాం = ఘనమైన పయోధరముల భారముచేత (ఈ కుచములను మోయుటెట్లు యని) భయముతో కృశించిన నడుముగల; నిజస్త్రీం = తన ప్రియురాలిని; ముహుః = తిరిగి; శ్లిష్యంతం = కౌగిలించుకొను; తం = అశ్వముఖము, మానుషశరీరము గల కిన్నెరుని;   బహు మనుతే = శ్రేష్ఠుడని తలంతురు.  


ఈ గిరి కడ అశ్వము యొక్క ముఖము వంటి ముఖము గల (దేవజాతి పురుషుడు) పండిన దొండపండువంటి పెదవిగల ప్రియురాలి మోమును ముద్దాడు మనుషముఖము, అశ్వశరీరము గల కిన్నెరుని గొప్పగా భావింతురు;  అన్యులు(అశ్వశరీరము,మనుషముఖము గల వారు) ఘనమైన పయోధరముల భారముచేత కృశించిన నడుముగల ఇష్టసఖిని కౌగిలించుకొను అశ్వముఖము, మానుషశరీరము గల కిన్నెరుని శ్రేష్ఠుడని యెంచుదురు.  


గంధర్వులు రెండు రకాలు. మొదటి రకం - తురగదేహం + మనిషి మోము. రెండవ రకం - మనుజదేహం + తురగవదనం. మొదటి రకపు గంధర్వులకు సుదతి ని చుంబించటంలో, రెండవ రకపు గంధర్వులకు రమణి కౌగిలిలోనూ వెసులుబాటు బావుంటుంది కనుక, వారిని వీరు, వీరిని వారు శ్రేష్ఠులని భావిస్తారు.


సర్వంకష

తురంగవక్త్రః - బహువ్రీహిసమాసము

బింబోష్ఠము - ఉపమాలంకారము

బింబోష్ఠం - ఇక్కడ బింబౌష్ఠం అని మరొకపాఠం. బింబోష్ఠం - ఇక్కడ ఓ కారం ఎందుకంటే - ఓత్వ ఓష్ఠయోః  సమాసే వా పరరూపం వక్తవ్యమ్ (వార్తికమ్)

ఉత్తుంగస్తనభరభంగభీరుమధ్యాం - భంగము (శిథిలము) కాకున్నను భంగము అయినట్లు కల్పించుటచేత అతిశయోక్తి తో కూడిన ఉపమ.

ప్రహర్షిణీవృత్తము

౩౯.

తదేతదస్యానుతటం విభాతి వనం తతానేకతమాలతాలమ్ ।

న పుష్పితాత్ర స్థగితార్కరశ్మావనంతతానే కతమా లతాలమ్ ॥


అస్య = ఇచ్చట; అనుతటం = ఎల్లెడలా; తతానేకతమాలతాలం; తత + అనేక + తమాల +తాలం = పెక్కు తమాల, తాడి చెట్ల వరుసలను; తదేతత్ = పురోవర్తిగా; వనం = అడవి; విభాతి = సోయగములీనుచున్నది; స్థగిత అర్క రశ్మౌ = చల్లారిన యెండగల; అనంతతానే = అపారమైన విస్తారము గల; అత్ర =  ఈ వనమున; కతమా లతా = ఏ విధముగా తీవెలు; అలం న పుష్పితా? = వికసింపవు? మిక్కిలిగా వికసించునని భావము.


ఈ అద్రియందు గల ప్రదేశములలో అనేకమైన, చీకటి మ్రాను, తాడి వృక్షముల వరుసలను ఎదుటగా కన్పట్టు అడవి సోయగములీనుచున్నది.  చల్లారిన సూర్యతాపము గల, విస్తారమైన ఈ పట్టుల ఏ విధముగా తీవెలయందు సుమములు మిక్కిలిగా వికసింపవు?

౪౦.

దంతోజ్జ్వలాసు విమలోపలమేఖలాంతాః

సద్రత్నచిత్రకటకాసు బృహన్నితంబాః ।

అస్మిన్ భజంతి ఘనకోమలగండశైలాః

నార్యో౽నురూపమధివాసమధిత్యకాసు ॥


అస్మిన్ = ఈ భూధరమునందు;

ఉజ్జ్వలాసు దంతాసు = కాంతివంతమైన పొదరిళ్ళలో; (దంతో నికుంజో దశనే - ఇతి విశ్వః)

(ఉజ్జ్వలాసు దంతాసు = కాంతివంతమైన దంతములలో)

సద్రత్నచిత్రకటకాసు = నాణ్యమైన రత్నములను కలిగిన సానువులలో (పర్వతమధ్యభాములలో)

(సద్రత్నచిత్రకటకాసు = చక్కని రత్నములతో కూడిన కంకణములలో)

అధిత్యకాసు = ఊర్ధ్వభూములయందు;

విమలోపల = నిర్మలమైన శిలల;

(విమలోపల = నిర్మలమైన రాలతో కూడిన)

మేఖలాంతాః = రమ్యమైన కొండచరియల;

(మేఖలాంతాః = రమణీయమైన మొలనూలు గల)

బృహత్ నితంబాః = విశాలమైన శిఖరముల;

(బృహత్ నితంబాః = ఘనమైన జఘనములు గల)

ఘనకోమలగండశైలాః = గొప్పవి, నునుపువి అయిన గండశిలలతో కూడిన ప్రాంతములను;

(ఘనకోమలగండశైలాః = చక్కని కోమలమైన చెక్కిలి భాగములు గల)

నార్యః = జవ్వనస్త్రీలు;

అనురూపం = తమ ఇచ్ఛకు తగినట్టులు

(అనురూపం = తమ రూపమునకు అనుగుణమైన/ఆత్మసదృశమైన)

అధివాసం = నివాసముగా చేసికొని;

భజంతి = సేవించుచున్నారు.


గోపికావల్లభా!

ఈ భూధరమునందు కాంతిమయమైన పొదరిండ్లలోనూ, చక్కని రత్నములు గల్గిన సానువులయందును, ఊర్ధ్వభూములయందు నిర్మలమైన శిలలు గల రమ్యమైన కొండచరియలను, విశాలమైన శిఖరములను; నున్నని గండశిలలతో కూడిన ప్రాంతములను కాంతలు తమ ఇచ్ఛకు తగినట్టులు నివాసముగా చేసికొని సేవించుచున్నారు.


ఈ ధరణీధరమందు రుచిరమైన దశనములలో, చక్కని రత్నములు తాపిన కంకణములలో; నిర్మలమైన రాలతో కూడిన మొలనూళ్ళు గల ఘనజఘనములతోనూ, చక్కని కోమలమైన చెక్కిలిభాగములు గల ఇంతులు తమ రూపమునకు అనుగుణముగా ఇచ్చటి నివాసమును సేవించుచున్నారు.

సర్వంకష -

కటకం వలయే సానౌ ఇతి విశ్వః

భూమిరూర్ధ్వమధిత్యకా ఇత్యమరః

మేఖలా ఖడ్గబంధే స్యాత్ కాంచీరత్ననితంబయోః ఇతి విశ్వః

నితంబో రోధసి స్కంధే శిఖరే౽పి కటేరధః ఇతి విశ్వః

ఇచ్చట స్త్రీలు, ఊర్ధ్వప్రాంతములయందు కూడా ప్రకృతత్వమున కేవలప్రకృతగోచరమైన శ్లేషోపస్థాపిత తుల్యయోగిత.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆధునికుని ఒక రోజు కాశీయాత్ర - 2018

ధ్రువనక్షత్రం - శింశుమారుడు

భారతదేశ అస్తవ్యస్త చరిత్ర - మౌలిక ప్రాతిపదికలు - ప్రశ్నలు