27, ఆగస్టు 2019, మంగళవారం

మయూఖము - 5

విష్ణువు - వైష్ణవం
ఇంద్రుడు - ఐంద్రీ (తూరుపు దిక్కు)
వినత - వైనతేయుడు
మిత్రుడు - మైత్రి
విరాగి - వైరాగ్యము
విదేహ - వైదేహి
వివిధములు - వైవిధ్యత
ధీరుడు - ధైర్యము

సంస్కృతంలో ’ఇ’ కారంతో ఆరంభమయ్యే కొన్ని శబ్దాలయొక్క ’సంబంధించిన’ అన్న అర్థంతో వచ్చు రూపాలు ’ఐ’ కారంతో ఏర్పడతాయని మనకు తెలుస్తోంది. నేను వ్యాకరణ వేత్తను కాను కాబట్టి ఏ శబ్దాలకు అలా ’ఐ’ కారపు రూపాలు ఏర్పడతాయో తెలియదు.

విష్ణువు - నకు "సంబంధించినది" వైష్ణవము. ఈ "సంబంధించిన" అన్న అర్థమే ఇటువంటి శబ్దాలన్నిటికీ ఏర్పడుతోంది. ఇదే రకంగా "కైలాసము" అన్న శబ్దం ఎలా ఏర్పడి ఉందాలి?

’కిలాసః - కైలాసము.’

కిలాసః = పరమేశ్వరుడు. ఆతనికి సంబంధించినది/ఆతని నివాసము కైలాసము అని వ్యుత్పత్తి సాధ్యం కావాలి.

అయితే ఒక ఇబ్బంది. "కిలాసమ్" అంటే అమరకోశం ప్రకారం పొడ వ్యాధి. "కిలాసం సిధ్మకచ్ఛ్వాం తు పామపామే విచర్చికా" - ఇవన్నీ పొడ/గజ్జి/కుష్ఠు పేళ్ళు. కిలాసిన్ అంటే పొడ వ్యాధి గ్రస్తుడు. కిలాస శబ్దానికి పండుబారిన జుత్తు అని కూడా అర్థం ఉందట. "కిలాస" శబ్దానికి పరమేశ్వరార్థం సాధారణంగా కనిపించదు. ఎక్కడో మారుమూల గ్రంథాల్లో తప్ప. ఆ కిలాస శబ్దాన్ని ఈశ్వరుడికి అన్వయిస్తూ చేసిన ఒకానొక స్తుతి ఇది.

యః కిలాస స కిలాస ఈశ్వరః 
ఖ్యాతసత్త్వలులితోర్ధ్వమూర్ధని |
ప్రత్యహం జనని! యత్ర తిష్ఠతి
త్వం స సత్త్వవపురద్రిరస్య యః ||

అన్వయం: యః, ఆస కిల, సః ఈశ్వరః, కిలాసః;   ఖ్యాతసత్త్వలులితోర్ధ్వమూర్ధని, యత్ర, ప్రత్యహమ్, యః తిష్ఠతి, సః అద్రిః, అస్య, సత్వవపుః,  జనని, త్వం (ఏవ).

యః = ఎవడు, ఆస కిల = ఉండెను అట (అని అనుచున్నారో), సః ఈశ్వరః = ఆ పరమేశ్వరుడు, కిలాసః = కిలాస నామధారి.  ఖ్యాతసత్త్వలులితోర్ధ్వమూర్ధన ఖ్యాత = ప్రసిద్ధమైన,  సత్త్వ = సత్వగుణము చేత, లులిత = వ్యాపించిన, ఊర్ధ్వమూర్ధని =  శిఖరము గల, యత్ర = దేనియందు, ప్రత్యహం = ఎల్లవేళలా, యః తిష్ఠతి = ఏది స్థిరమై ఉన్నదో, సః అద్రిః = ఆ పర్వతము, అస్య = ఆతనికి,  సత్త్వవపుః = సత్త్వరూపమైన శరీరము, జనని ! = ఓ అమ్మా !, త్వం (ఏవ) = నీవే కాదా!

తా: ఎవడు అక్కడ ఉన్నాడని అనుకొనుచున్నారో, ఆ ఈశ్వరుడు కిలాసనామధారి; ఆ పరమేశ్వరుని సత్త్వమయశరీరము శక్తియు కైలాసశిఖరమే. ఆ శిఖరముపైననే అతడు నివసించుచున్నాడు. ఓ తల్లీ, ఆ శంభుని సత్వమయ శరీరము నీవే కాదా!



శాక్తేయానికి సంబంధించిన గ్రంథంలోని శ్లోకం అది. శాక్తేయం ప్రకారం ఈశ్వరుడు శుద్ధసత్త్వగుణప్రధానుడు. ఆదిమధ్యాంతరహితుడు. కాలస్వరూపుడు. ఈ మహేశ్వరుడు శుద్ధసత్త్వరూపి అయినప్పటికీ సృష్టి సమయాన రజోగుణాన్ని ఆవేశించి బ్రహ్మగానూ, స్థితికై సత్వగుణప్రధానుడై విష్ణువు గాను, లయమున రుద్రుడుగా తమోగుణ ప్రధానుడై ఉంటాడట. ఉమాదేమి - ప్రకృతి/మాయ స్వరూపిణి. ప్రకృతి/మాయ లేని ఈశ్వరతత్వానికి స్వరూపలాభము ప్రయోజనమూ లేదు. అందువలన ఈశ్వరతత్త్వం యొక్క మూలం శక్తి స్వరూపిణి అయిన ఉమాదేవి.

శివుని శక్తి వలన ప్రపంచంలో ఏది శక్యమో, అట్టి శక్తి - అమ్మవారిదే అని ఆది శంకరాచార్యుడు.

ఆ ఈశ్వరుడు భౌతికంగా కైలాసపర్వత శిఖరంపై కొలువై ఉన్నాడని శాక్తేయుల, అనేకానేక భారతీయుల విశ్వాసం. కైలాసం శుద్ధసత్వరూపమైన మహేశ్వరుడి రూపం. ఆ రూపం, రూపం యొక్క శుద్ధసత్త్వభావమూ రెండూ అంబవే అని కవి తాత్పర్యం.

ఈ శ్లోకానికి ఇంకా సుదీర్ఘమైన వ్యాఖ్యానం ఉంది కానీ, స్థూలంగా ఇదీ సంగతి. ఒకప్పుడు కాశ్మీరంలో, ఉత్తరకురు రాజ్యంలోనూ ప్రబలంగా ఉన్న శాక్తేయారాధనకు చెందిన ’చిద్గగన చంద్రికా’ అన్న స్తోత్రకావ్యం లోని ఓ శ్లోకం ఇది. నిజానికి ఇది చాలా గహనమైన శాక్తేయ తంత్రానికి చెందిన గ్రంథం. చాలా సుదీర్ఘమైన వ్యాఖ్యాన సాయంతో, వీలైతే గురుముఖతః అధ్యయనం చెయ్యవలసిన గ్రంథం ఇది.

ఆ వెసులుబాటు ఈ రోజుల్లో దాదాపుగా లేదు. అయితే సంస్కృతపండితుల దోర్బల విశ్వనాథ శర్మ గారి విపులమైన వ్యాఖ్యతో ఈ పుస్తకాన్ని తెనాలి సాధకమండి వారు ప్రకటించినారు.  వ్యాఖ్యానం కూడా గహనంగానే ఉంది.

ఈ చిద్గగన చంద్రికా అన్న స్తోత్ర కావ్యరచయిత - కాళిదాసు. అయితే ఈ కాళిదాసు, సంస్కృతసాహిత్యంలో కవికులగురువుగా ఖ్యాతి పొందిన కుమారసంభవ, రఘువంశ, అభిజ్ఞానశాకుంతాలది కావ్యాలు రచించిన కాళిదాసు ఒకరేనా? బహుశా కాకపోవచ్చు.

మానవ శరీరం షట్చక్రమయం. మూలాధార, స్వాధిష్ఠాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞా అన్నవి వాటి పేర్లు. అందులో అనాహత చక్రం (మానవుని ఱొమ్ము) మధ్యన ఉన్న శూన్యమే చిద్గగనమట. ఆ చిద్గగనంలోనే వాక్కు పరా (శక్తి) రూపాన ప్రభవిస్తుంది. ఆ పరా అన్న జ్యోతిరూపమైన వాక్కు - పశ్యన్తి, మధ్యమ, వైఖరి రూపాలలో పరిణమించి, శబ్దంగా వెలువడుతుందని ఒక వాదం. (స్ఫోటవాదం). ఆ చిద్గగనంలో ఉదయించిన వెన్నెల అని ఈ కావ్యం అర్థం.

ఇంకో రెండు ముఖ్యవిషయాలతో ఈ వ్యాసం ముగించుకుందాం.

౧. వాక్కు: అనాది నుండి భరతవర్షంలో వాక్కునకు గొప్ప ప్రాధాన్యత ఉంది. వాక్కు, అర్థం ఒకదానితో ఒకటి కలిసినవి అయినా, అర్థంకన్నా ముందు వాక్కు, దానిని స్వస్వరూపజ్ఞానాన్ని తెలుసుకొనే ప్రయత్నం ప్రాచీనులు ఎక్కువగా చేసినట్టు కనిపిస్తుంది. అందులో భాగంగా వ్యాకరణంలో మాహేశ్వరసూత్రాలని ఏర్పరచుకున్నారు. ఆ క్రమంలో అక్షరాక్షరానికి వ్యుత్పత్తులు, మంత్రాలను సస్వరంగా, సుస్వరంగానూ ఉచ్ఛరించడమూ వంటివి ఏర్పడినట్టు తెలుస్తున్నది. ఆ వాక్కు ఎలా పుడుతుందన్న విషయంలో భాగంగా స్ఫోటవాదం, దానికి అనుగుణంగా తంత్రం, శాక్తేయం,  కాశ్మీరశైవం వంటి సాంప్రదాయాలు ఏర్పడ్డాయి.
 
౨. శూన్యం:  బౌద్ధంలో ఉన్న ప్రధానమైన వాదం - పరిణామవాదం. సృష్టిలో ఏదీ లేదు, ఉన్నదంతా ఒక వస్తువు మరొకటిగా పరిణామం పొందటమేనని ఆ వాదం తాత్పర్యం. దీనికే శూన్యవాదం అని పేరు. హిందూ దార్శనిక శాస్త్రాల్లోనూ శూన్యం అన్నది ఉన్నప్పటికీ ఆ శూన్యం - సత్తుగానే పేర్కొన్నారు.

బౌద్ధుల శూన్యం = ఏమీ లేకపోవటం. (Perfect Nothing/Emptiness. Not even describable by any word). దీనిని అసత్ అన్నారు.
హిందూ చింతనల ప్రకారం శూన్యం = ఏమీ లేకపోవటం అన్నది ఏదైతే కలదో ఆ అస్తిత్వం శూన్యం. ఇది "కలదు". (An empty space, which is describable as 'empty space'). ఇది సత్.

ఈ సత్ అన్న శూన్యం/సూక్ష్మం నుంచి వస్తువులు సృజింపబడతాయని సాంఖ్యం, శాక్తేయం వంటి దార్శనిక శాస్త్రాలు పేర్కొంటాయి. ఈ సత్ యొక్క రూపమే చిద్గగనం కూడా.

******

ఈ చర్చా, శాక్తేయం, శైవం, తంత్రం వంటివి ఆధ్యాత్మిక తలానికి, అనుభవ జ్ఞానానికి దారితీసే ఉపకరణాలని మనం గ్రహించాలి. ఈ విద్యలతో సామాజికమైన చర్చలకు ఆస్కారం లేదు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Comments ridiculing, abusing, bullying and forcing to agree in any form, if objectionable to the blog owner will be removed.