27, ఫిబ్రవరి 2010, శనివారం

నీరస చంద్రుడు

చరమాద్రి దావాగ్ని సంప్లుష్ట సుర సౌర భేయీ కరీషైకపిండ మనగ బహు చకోరక దంశ పరిపీత చంద్రికా క్షౌద్రనీరస మధుచ్ఛత్ర మనగ బ్రత్యఙ్ముఖోచ్ఛల ద్రాత్రి వర్షీయసీ పలిత పాండుర కేశబంధమనగ గగన సౌధాలేపకర కాలశిల్పి ని ర్ముక్త సుధావస్త్రముష్టి యనగ సుమహిత జ్యోత్స్నికాలతా సుమగుళుచ్చ మనగ నతిధూసరచ్ఛాయ నబ్జవైరి చెలువు వోనాడి బింబావశిష్టుడగుచు నల్ల నల్లన వ్రాలెడు నంబుజాక్ష! సుర సౌరభేయి = ఆవు కరీషం = పిడక ఆవుపిడక ఎటువంటిదంటే - చరమాద్రి దావాగ్ని సంప్లుష్టము(కాలినది) - ఎర్రటి ఎండకు పొద్దుటి నుండి సాయంత్రం వరకు కాలినది. అలా కాలికాలి గట్టిబడింది, పొద్దుటి నుంచి అలానే, ఎవరూ కదిలించకుండా పడి ఉంది కాబట్టి గుండ్రంగా ఉంది(కరీషైక "పిండం"). ఆ ఎండిన పిడక లాగా - మధుక్షత్రం - తేనెపట్టు. ఎలాంటిది - క్షౌద్రనీరసం - క్షౌద్రం అంటే తేనె(ట). క్షౌద్రనీరసం - తేనెలేకుండా వట్టిపోయినటువంటిది. (ఈ క్షౌద్రానికి ఒక ఉపమ - చంద్రికా క్షౌద్రం - అంటే వెన్నెల అనే తేనె.) ఎందుకలా వట్టిపోయింది? చకోరక దంశ = వెన్నెల పునుగుల గుంపులు(దంశ). ఈ చకోరాలు, వెన్నెల పునుగులు అనేవి కావ్యాలలో మాత్రం కనిపిస్తాయి. ఇవి గుంపులు గుంపులుగా బయల్దేరి వెన్నెలను తాగేస్తూ ఉంటాయిట. ఇవి వచ్చి తేనె తాగేయటంతో, తేనెపట్టు నీరసమయింది. అంటే వట్టిపోయింది. బహుచకోరక దంశ పరిపీత చంద్రికా క్షౌద్రనీరస మధుచ్ఛత్రం - అనేకమైన వెన్నెల పునుగుల గుంపులచే వెన్నెల అనే తేనె పీల్చివేయబడి, తేనెపట్టులా రసవిహీనయిపోయి కనిపిస్తున్నట్టుగా - ఇక్కడో సందేహం రావాలి. పౌర్ణమి చంద్రుడిని వర్ణిస్తూ, వెన్నెల (అనే మధువు) పీల్చివేయబడ్డ తేనెపట్టు అంటున్నాడు కవి. అలా ఎందుకంటే, ఈ చంద్రుడు - రాత్రి గడిచిన తర్వాత, తెలతెలవారుతున్న సమయంలో కనిపించే చంద్రుడన్నమాట. ఆయన సారం (వెన్నెల) అంతానూ ఖర్చయిపోయి ఉంటుంది కదా. వర్షీయసీ (ముసలిది) పలిత (నెరసిన) పాండుర (తెల్లటి) కేశబంధం (కొప్పు ముడి) ఆ ముసలిది ఎలాంటిది? ప్రత్యక్ + ముఖ + ఉచ్ఛలత్ + రాత్రి వర్షీయసి రాత్రికి వయసయిపోయింది. ముసలిది అయింది. (అంటే తెలవారుతోంది). కుక్కిమంచం వైపు నుండి పడమటి వైపు ముఖం ఉండేలా లేచి నడుస్తూంది. ఆవిడ నెరసి పోయిన జుట్టు ముడిలా - సుధావస్త్ర ముష్టి - పిడచకట్టేసిన సున్నం గుడ్డ ఎలాంటిది? గగన సౌధాలేపకర కాలశిల్పి నిర్ముక్తము - గగనమనే సౌధానికి ఆలేపం (వెల్ల) వేస్తున్నాడు కాలశిల్పి. ఒక వస్త్రాన్ని కుంచెలా కర్రకు చుట్టి, సున్నపు కుండలో ముంచి రాత్రంతా వెల్ల వేస్తూ కూర్చున్నాడు. పని పూర్తయిన తర్వాత ఆ వస్త్రాన్ని ఉండచుట్టి ఓ మూలకు విసిరేశాడు. అలా విసిరి వేయబడ్డ వస్త్రముష్టి లా - (ఇక్కడా ఓ సందేహం - రాత్రంతా వెల్ల వేశాడన్నారు. వెల్లవేసిన గోడ తెల్లగా ఉండటం న్యాయం. కవి పగటి పూట ఆకాశాన్ని గగన సౌధం అని ఉంటే ప్రశ్న లేదు. రాత్రిని గగన సౌధమంటున్నాడు. అంతరార్థమేమిటో ఏమో?) సుమహిత జ్యోత్స్నికాలతా సుమగుళుచ్చము - అందమైన వెన్నెల తీగల చివర్న పూచిన పుష్ప గుచ్ఛం అతిధూసరచ్ఛాయ - వెలి బూడిద రంగుతో సొగసంతా కోల్పోయి (చెలువు బోనాడి) బింబమాత్రావశిష్టుడై అబ్జవైరి - పద్మాలకు శత్రువు పడమటి దిక్కున వాలిపోతున్నాడు. ఓ అంబుజాక్ష, నిద్ర మేలుకో! చంద్రుణ్ణి ఇలా పిడకలతోనూ, వస్త్రముష్టితోనూ, ముసిలావిడ జుట్టుముడితోనూ, చీకేసిన తేనెపర్ర తోనూ పోల్చినాయన, ఆ తర్వాత కనికరించి సుమహిత జ్యోత్స్నికాలతా సుమగుళుచ్ఛమని అందమైన కల్పన చేశాడు. మొదట ముసలావిడ కొప్పుతో పోలికకూ, చివర వెలిబూడిదరంగుకూ కొంత సమన్వయం కుదురుతుంది. ముసలావిడ కొప్పుముడి మరీ పాల తెలుపులా ఉండదు. కాస్త వెలిసిపోయిన రంగులో ఉంటుంది కాబట్టి. ఈ పద్యం నంది తిమ్మన పారిజాతాపహరణం లోనిది. శ్రీకృష్ణుని వైతాళికులు నిద్ర మేల్కొలుపే సందర్భంలోదట. (కవి గారికి భార్యతో ఏదైనా పేచీ వచ్చిందో, వెన్నెల రాత్రి ఖర్చయిపోతోందన్న ఉక్రోషమో తెలీదు, అగడ్త లాటి పొగడ్తలోకి చంద్రుణ్ణి తోశేసాడు!) ఇంత ప్రౌఢంగా ఉంది, సూక్ష్మ పరిశీలనా దృష్టితో వ్రాసినది కాబట్టి, రాయలవారి పద్యమా అనిపిస్తుంది. ఓ అందమైన వస్తువును రసహీనమైన వస్తువుకు జోడించి వర్ణన చేసిన సందర్భాలు బహు తక్కువేమో. ఈ రకమైన వర్ణనలు పాశ్చాత్య సాహిత్య ప్రభావంతో చోటు చేసుకున్న ఆధునిక కవితారీతులని చాలారోజుల క్రితం ఓ వ్యాసం చదివాను. ఇలాంటి వర్ణనలు మరెక్కడైనా ఉన్నాయేమో తెలియదు.ఆ విధంగా ఈ పద్యం అరుదయినదేమో. (పద్యకవితా పరిచయం - నన్నయ నుంచీ కంకంటి దాకా - బేతవోలు రామబ్రహ్మం)

5 కామెంట్‌లు:

  1. ఎంత చక్కగా చెప్పారండీ..ఇలాంటివి ఇంకా ఇంకా చెప్పాలని నా మనవి.

    రిప్లయితొలగించండి
  2. రవి గారూ..ఇంత చక్కటి పద్యాలు రాస్తూ(శంకరయ్య గారి సమస్యా పూరణం-15 బస్సు నీటఁ దేలె పడవ వోలె )..ముక్కు తిమ్మన లాంటి మహానుభావుల రచనల్లోని అర్ధాలు వివరిస్తూ.."నేను jack of all master of non" అంటారేంటండీ..

    నిండు కుండ తొణకదు అనే మాట ఎందుకొచ్చివుంటుందో ఇప్పుడర్ధమైంది.

    రిప్లయితొలగించండి
  3. రవి గారూ,
    మంచి వ్యాసం ఇచ్చారు. బాగింది.

    రిప్లయితొలగించండి
  4. రవి గారూ,
    మీ బ్లాగులో "అతిథులు", "తాజా వ్యాఖ్యలు" ఉన్నాయి కదా. నా బ్లాగులో వాటిని ఎలా చేర్చాలి? నాకు అంతగా సాంకేతిక జ్ఞానం లేదు. దయచేసి నాకు వివరాలు మెయిల్ చెయ్యండి. shankarkandi@yahoo.com

    రిప్లయితొలగించండి
  5. pedda vyaakhyani raasEnayya . adi eTupOyindO ? maLLee type chesE Opika ledu . saaraamsam Edaina timmanaki ooha chaalaa balaheenamainadi . chetta pOlikalani chEyaDam lO aayana ghanuDu.

    రిప్లయితొలగించండి

Comments ridiculing, abusing, bullying and forcing to agree in any form, if objectionable to the blog owner will be removed.