పోస్ట్‌లు

సీత సమాధానం

కం|| ఉవిద! హృది సదా కరుణము కవిస్మరణభాజి గాథ కమలాశ్రితమే, అవికలసచ్ఛీలి యశము. భువిద్విష! దురిత కరహిత ప్రోక్తులు చాలున్. చ్యుతాక్షరి ఒక ప్రహేళిక. అంటే అక్షరాలతో ఆట. రావణాసురుడు సీతతో అంటున్నాడు. (మొదటి మూడుపాదాలు) అమ్మాయీ! నా హృది సదా కరుణతో ఉన్నది. నా గాథ కవిస్మరణభాజి - కవులచే స్మరించదగినది, నా గాథ కమలాశ్రితము అంటే లక్ష్మీస్వరూపమైనది. నా కీర్తి - అవికల - దోషాలు లేని, సచ్ఛీలి = మంచి శీలము గలది. దీనికి సీత సమాధానం భువిద్విష = భూమికి శత్రువుగా అయిన వాడా! దురితకర హిత = పాపం చేసే వారికి హితమైన ప్రోక్తులు = ప్రసిద్దమైన పలుకులు చాలున్ = చాలును. దురితకరహిత - ఇక్కడ మరొక విధమైన శ్లేష కూడా ఉంది. దురిత = పాపీ "క" రహిత = నీవు పైన చెప్పిన మాటలలో "క" తీసివేస్తే వచ్చే ప్రోక్తులు = పలుకులు చాలున్ = చాలునులే. క తీసివేస్తే ఏమి వస్తుందో చూద్దాం. ఉవిద! హృది సదారుణము = అమ్మాయీ, నా హృదయము దారుణమైనది విస్మరణభాజి గాథ మలాశ్రితమే నా గాథ - విస్మరణభాజి = గుర్తుంచుకోదగ్గది కాదు. నా గాథ మలాశ్రితము = నా కథ మలానికి ఆలవాలమైనది. ఇక యశము అవిలసచ్ఛీలి యశము. అవిలసత్ శీలి...

సంస్కృతసౌరభాలు - 18

చిత్రం
క్షీర సాగర తరంగ శీకరాసార తారకిత చారుమూర్తయే! భోగిభోగ శయనీయశాయినే మాధవాయ మధువిద్విషే నమ:!! క్షీరసాగర తరంగ = పాలకడలి అలల యొక్క శీకరాసార = బిందువులచేత నింపబడిన తారకిత చారుమూర్తయే = చుక్కలు కలిగిన అందమైన వానికి భోగి భోగ శయనీయ శాయినే = ఆదిశేషుని పై పవళించిన వానికి మాధవాయ = మాధవునకు మధువిద్విషే = మధు అను రాక్షసునకు శత్రువైన వానికి నమః = జోత. శ్రీ మహావిష్ణువు పాలకడలిలో ఆదిశేషునిపై పవళించి ఉన్నాడు. ఆ పాలకడలి తరంగాల తుంపరలు ఆయన నల్లని తనువుపైన అక్కడక్కడా చింది ఆకాశంలో చుక్కల్లా మెరుస్తున్నాయి. అలాంటి మహావిష్ణువుకు నమస్కారం. *********************************************** తెలుగు భాష నేర్చుకునేప్పుడు మొట్టమొదటగా వేమన పద్యాలు, చిన్న చిన్న పొడుపు కథలూ, సుమతీశతక పద్యాలు, పోతన భాగవతపద్యాలు - ఇలా ఆరంభిస్తాం. సంస్కృతాధ్యయనం లోనూ ఒక వరుస ఉంది. మొదట బాలరామాయణం, అమరకోశం, శబ్దమంజరీ, ముకుంద మాల, ధాతువులూ, భర్తృహరి, ఆపైన రఘువంశం, కుమారసంభవం.... పై వరుసలో ముకున్దమాల ఉండటమే ఆ మహనీయమైన స్తోత్ర కావ్యం గొప్పతనాన్ని చెప్పక చెబుతుంది. విశిష్టాద్వైత మతం - అందుకు సంబంధించిన భక్తి సాహిత్యం అనర్ఘ, అమూల్య రత్నాలను ...

సంస్కృతసౌరభాలు - 17

స్మృతాऽపి తరుణాతపం కరుణయా హరన్తీ నృణాం అభంగురతనుత్విషాం వలయితా శతైర్విద్యుతాం | కళిందగిరినందినీ తటసురద్రుమాలంబినీ మదీయ మతి చుంబినీ భవతు కాపి కాదంబినీ || నృణాం = మానవుల తరుణాతపం = సంసార బాధను స్మృతాऽపి = తలిచినంతమాత్రమున కరుణయా = కరుణతో హరన్తీ = పోగొట్టునది అభంగుర తనుత్విషాం = నాశము లేని శరీరకాంతిని కలిగిన విద్యుతాం = మెరుపుల శతైః = శతములను వలయితా = చుట్టుకున్నది కళిందగిరినందినీ = యమునానది యొక్క తట = ఒడ్డున ఉన్న సురద్రుమ = కల్పవృక్షమును (వేపచెట్టును) ఆలంబినీ = ఆశ్రయించినది (ఆ చెట్టు చిటారుకొమ్మల నుండునది) కాపి = ఒకానొక కాదంబినీ = కారు మేఘము మదీయ = నాయొక్క మతి చుంబినీ = మతిని చుంబించునది భవతు = అగుగాక. అదేదో తెలుగు సినిమాపాటలా యమునానది గట్టుంది. గట్టుపైనా చెట్టుంది. చెట్టు చివరనా మేఘముంది మేఘమే నా మది మెదిలింది. అన్నట్లుగా యమునానది నాశ్రయించిన కృష్ణుడు అన్న మేఘాన్ని కవి మంగళాచరణలో ప్రార్థిస్తున్నాడు. ఆ కాదంబిని (మేఘం) యమునాతటిని ఉన్న ఒక విశాలవృక్షాన్ని ఆశ్రయించింది. మెరుపుతీగలశతములు (అనబడే గోపస్త్రీలతో) చుట్టుకుని ఉన్నది. స్త్రీ లింగమైన కాదంబిని ద్వార...

సంస్కృతసౌరభాలు - 16

రాముడు శివధనుస్సును ఎక్కుపెట్టాడు. అప్పుడు - రుంధన్నష్టవిధేః శ్రుతీర్ముఖరయన్నష్టౌ దిశః క్రోడయ న్మూర్తీరష్ట మహేశ్వరస్య దిశయన్నష్టౌ కులక్ష్మాభృతః తాన్యక్ష్ణా బధిరాణి పన్నగకులాన్యష్టౌ చ సంపాదయ న్నున్మీలత్యయమార్యదోర్బలదళత్కోదండకోలాహలః || విధేః అష్ట శ్రుతీః రుంధన్ = బ్రహ్మ యొక్క ఎనిమిది చెవులను గింగురులెత్తిస్తూ అష్టౌ దిశః ముఖరయన్ = ఎనిమిది దిక్కులు మారుమ్రోగిస్తూ మహేశ్వరస్య అష్టమూర్తీః క్రోడయన్ = ఈశ్వరుని అష్టమూర్తులను ఆవహిస్తూ అష్టౌ కులక్ష్మాభృతః దళయన్ = ఎనిమిది కులపర్వతాలను పగులగొడుతూ తాని పన్నగకులాని అష్టౌ = ప్రసిద్ది పొందిన ఎనిమిది విధాలైన నాగములను అక్ష్ణా బధిరాణి సంపాదయన్ = చూపులతో చెవిటివిగా చేయుచూ ఆర్య = పూజ్యుడైన రాముని దోర్బల = భుజబలముచే దళత్ = విరుగుచున్న కోదండ కోలాహలః = శివధనుస్సు యొక్క తీవ్రమైన ధ్వని అయమ్ = ఇదే ఉన్మీలతి = పెద్దదవుతున్నది. అనర్ఘరాఘవం అనే ఏడంకాల నాటకంలో మూడవ అంకంలో రాముడు శివధనుర్భంగం చేసే ఘట్టంలోనిది ఈ పద్యం. ఈ నాటకకర్త మురారి పండితుడు. మహేశ్వరునికి ఎనిమిది రూపాలున్నవి.  ఇవి - శర్వ, భవ, పశుపతి, ఈశాన, భీమ, రుద్ర, మహాదేవ, ఉగ్ర   కులపర్వతాలు - మహేంద్ర, ...

సంస్కృతసౌరభాలు - 15

ఇప్పటికి సరిగ్గా ఒక తరం క్రిందటి ప్రజానీకానికి ఆకాశవాణి తమ జీవితంలో ఒక భాగం. ఆకాశవాణి తో అణుమాత్రం పరిచయం ఉన్న వారికి ఎవరికైనా ఈ క్రింది పద్యం తెలిసి తీరుతుంది. కేయూరాణి న భూషయన్తి పురుషం హారా న చంద్రోజ్జ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాऽలంకృతా మూర్ధజాః | వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయన్తేऽఖిలభూషణాని సతతం వాగ్భూషణం భూషణమ్ || మనిషికి భుజకీర్తులు, చంద్రు నిలా ఉజ్జ్వలంగా మెరిసే ముత్యాలహారాలు, స్నానం, గంధలేపనాలు, పువ్వులు, శిరోజాऽలంకరణలూ శోభనివ్వవు. శాస్త్ర సంస్కారము కలిగిన వాక్కు ఒక్కటే అతడికి శోభ చేకూరుస్తుంది. అన్ని భూషణాలు నశిస్తాయి కానీ వాగ్భూషణం మాత్రమే నిజమైన భూషణంగా నిలిచి ఉంటుంది. బాల్యంలో ఒక వ్యక్తి చుట్టూ ఉన్న సంఘటనలు, చిన్న చిన్న అంశాలు ఎంత చిన్నవైనా జీవితంలో గొప్ప ప్రభావం చూపిస్తాయి. ఏ ఉత్తమ సంస్కారానికైనా ఎక్కడో ఒక చోట చిన్న బీజం ఉండక తప్పదు. చాలామంది జీవితాలలో ఈ పద్యం అలాంటి ఉత్తమ సంస్కారబీజం అయి ఉంటుంది. వారి సంస్కారానికి కారణం ఈ బీజం అని మరిచిపోయి కూడా ఉండవచ్చు గాక. పుట్టపర్తి నారాయణాచార్యులు గారు వాల్మీకి రామాయణం గురించి వ్రా...

సంస్కృతసౌరభాలు - 14

చిత్రం
రస్యతే, ఆస్వాద్యతే అనేనైవ రసః రససిద్ధాంతం సంస్కృత లాక్షణిక సిద్ధాంతాలలో ముఖ్యమైనది. రసం అంటే కావ్యం వలన జనించే ఒక లోకోత్తరమైన అనుభూతి. కావ్యానికి సంబంధించి రసం తాలూకు స్థితి ఎక్కడ నిరూపితమై ఉంటుంది అన్న విషయానికై ఉద్భటుడు అనే లాక్షణికుడు ఒక ప్రతిపాదన చేశాడు. - "వాచి వస్తున్యపి రసస్థితిః" రచనాసంవిధానం లోనూ, వస్తువు అంటే - ఇతివృత్తంలోనూ రసస్థితి ఉంటుంది. ఇతివృత్తం అంటే - పాత్ర  చిత్రణ, సన్నివేశకల్పనల సమాహారం. దృశ్యనాటకాలకు సంబంధించిన సంవిధానాలలో - స్థూలంగా ముఖ్యమైన రెండు ధోరణులు కనిపిస్తాయి. మొదటిది భాస, శూద్రకాదులకు సంబంధించిన వస్తునిర్వహణ ద్వారా రసస్ఫూర్తి కలిగించే ధోరణి, రెండవది రచనా శైలి, శిల్ప చాతుర్యాదుల ద్వారా రసనిష్పందం కలిగించగల భవభూతి కాళిదాసాదుల ధోరణి. అభినేయమైన కృతులు భాసకవివైతే నాటకీయమైన కావ్యాలు భవభూతికాళిదాసాదులవి. మొదటిది నాట్యకళ, రెండవది కావ్యకళ. ఈ ధోరణులలో భాసమహాకవి మార్గానికి చెందిన మరొక కవి దిజ్ఞాగుడు లేదా ధీరనాగుడు. ఈ కవి రచించిన అపూర్వమైన నాటకం పేరు కుందమాల. కుందమాల అంటే మల్లెపూదండ అని అర్థం. ********************** అభినవరచిత...

సంస్కృతసౌరభాలు - 13

చిత్రం
రజోజుషి జన్మని సత్త్వవృత్తయే స్థితౌ ప్రజానాం ప్రలయే తమఃస్పృశే | అజాయ సర్గస్థితినాశహేతవే త్రయీమయాయ త్రిగుణాత్మనే నమః || రజోజుషి జన్మని = సృష్టి జరిగే సమయంలో రజోగుణం వహించి స్థితౌ సత్త్వవృత్తయే = స్థితి (రక్షణ) సమయంలో సత్వవృత్తిని కూడి ప్రజానాం ప్రలయే తమఃస్పృశే = లయ సమయంలో తమస్సును చేబట్టిన అజాయ = జన్మరహితుడైన వానికి (న జన్మః యస్యాస్తీతి అజః = జన్మము లేని వాడు అజుడు) సర్గస్థితినాశహేతవే = పుట్టుక, రక్షణ, నాశములకు హేతువైన వానికి త్రయీమయాయ = త్రిమూర్తి స్వరూపునకు త్రిగుణాత్మనే = త్రిగుణాత్మునకు నమః = వందనము. భట్టబాణకవి కాదంబరి కావ్యారంభంలో మంగళాచరణం ప్రథమ శ్లోకం ఇది. సాధారణంగా దృశ్యకావ్యాలలో మంగళాచరణశ్లోకంలో అంతర్లీనంగా కథను సూచించడం ఒక సాంప్రదాయం. కాదంబరి ప్రధానంగా గద్యకావ్యం. ఈ మంగళాచరణశ్లోకంలో కాదంబరి కథను సూచించినట్లుగా వ్యాఖ్యాతలు వ్రాయలేదు. అయితే కాదంబరి కావ్యకథలో మూడు జన్మల వృత్తాంతం, మూలసూత్రమైన ప్రేమైకస్వరూపాన్ని కవి పైని శ్లోకంలో నిక్షేపించాడా అని ఎదో మూల అనుమానం కలుగుతుంది. కాదంబరి కథను తూగుటుయ్యాల మీద అర్థనిమీలిత నేత్రాలతో విని "కాదంబరీః కాదమ్బరి" అ...