క్రొందలిరుటాకులు

 


శిశుపాలవధం లో నాలుగవ సర్గ అనుశీలిస్తూ, కనుక్కున్నదేమంటే - మాఘుని కవిత్వం విస్తృతి నిష్టం.

ఈ విస్తృతి ఛందోపరమైనది కావచ్చు, అలంకారసంబంధి కావచ్చు, శబ్ద సంబంధమైనది కావచ్చు, విలక్షణమైన భావాలకు చెందినది కావచ్చు.

ఇవి సాధారణ లక్షణాలు.

అటుంచితే ఈ కవి యమకచపలుడని, కొన్ని సార్లువికటమైన భావాలను కూడా నిర్మొహమాటంగా కవిత్వంలో సంతరించటం ఉందని కనుక్కున్నాం.

ఇవి విశిష్టలక్షణాలు.

ఇట్టి లక్షణాల పర్యవసానంగా మాఘకవి - అనుశీలన అరణ్యప్రయాణం అని, ఇది శ్రమదాయకం, ఆసక్తిదాయకం, ఎంతో విభ్రాంతి గొలిపేది కూడానని ఊహించుకున్నాం.

ఒక విస్తారమైన అరణ్యంలో ఆయాసపూర్వకమైన, గహనమైన భాగం దాటి అరణ్యమధ్యంలో వస్తే చిన్నచిన్న జనపదాలు, ఆ జనపదాల ప్రజలు అరణ్యమధ్యంలో సాగు చేసుకున్న మాగాణులు, చుట్టుపక్కల కొన్ని పూలచెట్లు, మనోహరమైన నదీప్రవాహాలు, పక్షుల కలరవాలు, అరణ్యజంతువుల పిలుపులు..ఇలా మనోహరమైన భాగం కనిపిస్తుంది. అరణ్యమధ్యంలో కొంతకాలం నివసించి అక్కడ భూభాగంతో మమేకం అయితే ఆ అనుభూతుల పరంపరయే వేరు.

సరిగ్గా ఆ అనుభూతి ప్రపంచానికి మాఘుడు ఋతువర్ణన ద్వారా తీసికెళతాడు. ఈ ఘట్టంలో ఆయాసపూరితమైన భావాలు ఉన్నాయి కానీ గుణప్రధానమైన శ్లోకాల సంఖ్య యెక్కువ.

గుణం - ఇక్కడ గుణశబ్దం ఆలంకారిక సాంప్రదాయ పరంగానూ చెప్పుకోవాలి.

కావ్యానికి శబ్దగుణాలు, అర్థగుణాలు ఉన్నాయని, ఇవి అలంకారాలకు భిన్నమైనవని ఇవి కవి అంతఃకరణలో భాగమై కావ్యంలో ప్రోదిపడిన లక్షణాలని కావ్యానుశీలకులు పేర్కొన్నారు. అలంకారాలు బాహ్యాలు. తెచ్చిపెట్టుకొన్న మెరుగులైతే, గుణాలు స్వీయాలు.

ఈ గుణాలు ౧౦ విధాలని జగన్నాథపండితరాయలు వింగడించాడు.

శ్లేషః ప్రసాదః సమతా మాధుర్యం సుకుమారతా ।

అర్థవ్యక్తిః ఉదారత్వం ఓజః కాంతి సమాధయః ॥ 

ఈ గుణాల్లో కొన్ని చిత్తద్రుతికి అంటే చిత్తం ఆర్ద్రం చెయ్యడానికి, కొన్ని చిత్తదీప్తికి, ఇంకొన్ని చిత్తవికాసానికి దోహదకారులు. 

మొదటి నాలుగు గుణాలు చిత్త ద్రుతికారకాలు. 

అందులో ప్రసాదగుణం అన్నది ప్రముఖమైనది. ఇది రీతి/ ద్రాక్ష లేక కదళీ పాకానికి దగ్గరి బంధువు.

ప్రసాద(శబ్ద)గుణం అంటే - "గాఢత్వ శైథిల్యానాం వ్యుత్క్రమేణ మిశ్రణం బంధస్య ప్రసాదః" అని జగన్నాథరాయని వింగడింపు.

బంధం (కూర్పు)లో సమాసాలు, అలతి అలతి పదాలు - రెండున్నూ సమపాళ్ళలో ఒక వ్యుత్క్రమంలో (వరుసలో) ఉంటూ ఉంటే అది ప్రసాదం. 

మాఘకవి కవిత్వంలో ప్రసాద గుణభరితమైన్, ద్రాక్షాపాకయుతమైన శ్లోకాలు నాలుగవ సర్గలో తక్కువే. ఈ ఋతువర్ణన సర్గలో కవి ఈ బాట పట్టటం మొదటగా మనం గమనించవచ్చు. 

ఈ క్రింది శ్లోకాలు చూడండి. 

నవపలాశ పలాశవనం పురః స్ఫుటపరాగ పరాగతపంకజం

మృదు లతాంత లతాంత మలోకయత్ సః సురభిం సురభిం సుమనోభరైః ||

పై శ్లోకంలో నవపలాశ, పలాశవనం - ఇది మొదట గాఢత్వ వ్యుత్క్రమం. అటుపై పురః అని ఒకింత శైథిల్యం. తిరిగి స్ఫుటపరాగ పరాగతపంకజం మరొక గాఢత్వ వ్యుత్క్రమం.

మిగిలిన పాదాల్లో శైథిల్యం. 

ప్రసాదగుణానికి అనుప్రాస, యమకాదులు తోడైతే ఆ రుచియే వేరు.

సురభిం సురభిం - దీన్ని లాటానుప్రాస అంటారు. అంటే ఒకే శబ్దాన్ని రెండు భిన్నార్థాల్లో ఉపయోగించటం. సురభిం = పరిమళభరితమైన, సురభిం = వసంతము.

ఈ శ్లోకం వసంతాగమనాన్ని సూచించే శ్లోకం. సర్గ ఆరంభంలో రెండవది కావడం విశేషం! 

సః = మాధవుడు; పురః = యెదురుగా/ముందుగా;  నవపలాశ = క్రొందలిరుటాకులతో కూడినది; పలాశ = మోదుగుపూలతో ఒప్పునది అయిన; వనం = ఉద్యానమును; స్ఫుటపరాగపరాగతపంకజం; స్ఫుట = వికసించిన;(మఱియు) పరాగ = పుప్పొడిచేత; పరాగత = ఆవరించిన; పంకజం = కమలములు గలది; మృదుల-తాన్త-లతాంత; మృదుల = కోమలమైన; తాన్త = యెండవేడిమికి కొంచెము వాడిన; లతాంతం = ఆకులు గలది; సుమనోభరైః = కుసుమముల సమృద్ధి గలది అయిన; సురభిం = పరిమళభరితమైన; సురభిం = వసంతమును;  అలోకయత్ = వీక్షించెను.

భావం ఇదిః

అప్పుడు - క్రిందలిరుటాకులు, మోదుగుపూలతో నిండింది, బాగా వికసించి పుప్పొడిపరాగం కప్పేసిన తామరపూలు ఉన్నది, ఎండవేడికి కొంచెం కమిలిన ఆకులు ఉన్నది, పూలతో నిండినది, పరిమళభరితమైనది అయిన వసంతాన్ని ఎదురుగుగా ఉన్న వనంలో మాధవుడు చూచాడు. 

ఈ ఆరంభాన్ని చూస్తూనే అర్థమైపోతుంది. ఈ కవి మనోహరగుణశ్రేణి అన్వేషణలో పడ్డాడని. ఇదివరకు సర్గలో పాదద్వయయమకాలకు బాహ్య ఆలంకారాలకు ప్రాధాన్యత నిచ్చిన కవిలో మార్పు ఇది.

అన్వేషక కవిలో ఈ మార్పు వస్తే ఇక గుణాధిక్యానికి చెప్పే పనేముంది?

మధురయా మధుబోధిత మాధవీ మధు సమృద్ధి సమేధిత మేధయా|

మధు కరాంగనయా ముహురున్మదధ్వనిభృతా నిభృతాక్షరముజ్జగే ||

మధురయా = మనోహరమైన;  మధుబోధితమాధవీ; మధు = వసంతము చేత; బోధిత = పూచిన; మాధవీ = మాధవీలతలలో;  మధుసమృద్ధిసమేధితమేధయా; మధుసమృద్ధి = మిక్కుటమైన తేనెలు ; సమేధిత మేధయా = సంబంధముగా గల పరాగపు సంపదచేత; ఉన్మదధ్వనిభృతా = మత్తెక్కిన ఝుంకారము గల;  మధుకరాంగనయా = తేంట్లచేత; ముహుః = మరల;  నిభృతాక్షరం = ఏదియో చెప్పరాని అందమైన గానము;  ఉజ్జగే = వెలువడెను.

పిమ్మట మనోహరమైన వసంతకాలాగమనము చేతపూచిన మాధవీలతలందు మిక్కుటముగా పరాగము, తేనెలు నిండుట చేత వాటిని పానము చేసిన తుమ్మెదల యొక్క అవ్యక్తగానము ఆ పరిసరముల వెలువడెను. 

వదన సౌరభ పరిభ్రమద్ భ్రమర సంభ్రమ సంభృత శోభయా|

చలితయా విదధే కలమేఖలాకల కలోలకలోలక దృశాన్యయా||

వదనసౌరభలోభపరిభ్రమత్; వదన = ముఖముయొక్క; సౌరభ = పరిమళము చేత; లోభ = మోహమంది; పరిభ్రమత్ = చుట్టూ తిఱుగు; భ్రమరసంభ్రమసంభృతశోభయా; భ్రమర = తుమ్మెదల కారణము చేత; సంభ్రమ = గగురుపాటుతో; సంభృత శోభయా = ఒప్పారు సౌందర్యముతో;  చలితయా = కదలుట చేత;  అలకలోలదృశా; అలక = ముంగురుల చేత; లోలదృశా = చలించు చూపులు గల; అన్యయా = ఇంకొక లావణ్యవతి చేత; కలమేఖలాకలకలః = కాలిగజ్జెలయొక్క రమ్య రవళి; విదధే = తాల్చబడినది;

ముఖపరిమళముచేత ఆకర్షింపబడి చెంతచేరిన తుమ్మెదల చేత సంభ్రమమంది మిగుల శోభతో కదలునది, ముంగురులు పడుటచేత చలించిన చూపులు గలది అయిన మరొక లావణ్యవతి కాలిఅందెల మధురరవమును తాల్చినది.  (అమ్మాయి వేగలుగా కదలుట చేత ఆమె కాలిగజ్జెలు మధురాలాపనములు గావించినవని తాత్పర్యము)

ఇదమపాస్య విరాగి పరాగిణీరలికదంబకమంబురుహాం తతీః ।

స్తనభరేణ జితస్తబకానమన్నవలతే వలతే౽భిముఖం తవ ॥

స్తనభరేణ = నీ పయోధరాల భారంతో;  జిత-స్తబక-నమన్-నవలతే;జిత = జయించిన; స్తబక = పూలగుత్తి గల; నమన్ = వంగిన; నవలతే = క్రొత్త తీవె గలదానా!  (అత ఏవ) ఇదం = ఈ; విరాగి = (కమలాలపై)విరక్తి పొందిన; అలికదంబకం = తుమ్మెదలగుంపు; పరాగిణీః = పుప్పొడితో నిండిన; అంబురుహాం తతీః = తామరపూల వరుసను; అపాస్య = విడచి; తవ = నీ; అభిముఖం = ముఖము వైపుకు; వలతే = కదలుచున్నవి.

పూలగుత్తితో వంగిన క్రొందీవెలను జయించిన స్తనములు గల పూబోడి! పరాగాలతో నిండిన ఈ కమలాలను విడచి విరాగులై తుమ్మెదల గుంపు నీ ముఖం వైపుకు వస్తున్నాయి.
(అమ్మాయి ముఖం కమలాలకన్నా విశిష్ఠమైన ఇంకేదో కుసుమం అని భ్రమరాలు అనుకుంటున్నట్టు కల్పన. - భ్రాంతిమదలంకారం.)

ఈ శ్లోకానికి తెనుగు సేత -
ఆ.వె.
ననలతతి భరమున నమ్రమగు నవల
తల నుసుగు కుచముల దాన! తేటి
దండిట విరిధూళి నిండిన కమలముల్
వదలి నీదు మోము వైపు పాఱె! 

గజ కదంబక మేచక ముచ్చకై ర్నభసి వీక్ష్య నవాంబుద మంబరే |

అభిససార న వల్లభ మంగనా న చకమే చ కమే కరసం రహః ॥

శ్రావణమాసమున మింట ఏనుగులగుంపువలే నల్లనివి, ఉన్నతమైనవి అయిన తొలకరి మేఘములను చూచి యువతి శృంగారము తప్ప ఇతరభావములను వర్జించి, ఏకాంతమున  పతిని చేరికొనదు? ఏల అతనితో అభిసరింపదు?

మరో సారి పైశ్లోకాన్ని యెలుగెత్తి "చదువుకోండి". పై శ్లోకం తెలుగులో అల్లసాని పెద్దన గారి ఈ పద్యాన్ని ఎక్కడో....... గుర్తు తెప్పిస్తున్నట్టు లేదూ? (మద్దెల ధ్వని లా ధ్వనించే అక్షరావృత్తితో..)

అటఁజని కాంచె భూమిసురుఁడంబరచుంబిశిరస్సరజ్ఝరీ

పటల ముహుర్ముహుర్లుఠదభంగతరంగమృదంగనిస్స్వన

స్పుటనటనానుకూలపరిపుల్లకలాపకలాపిజాలమున్

గటకచరత్కరేణు కరకంపితసాలము శీతశైలమున్

                                                           (మనుచరిత్ర - 2 - 3)

********

అలా ఉంటే - ప్రసాద గుణం కాక, ఓజస్సును కూడా అక్కడక్కడా కవి పోషిస్తాడు. ఈ ఓజస్సు ఆయాసకరమైన ఓజస్సు కాదు. సంస్కృతసమాసభూయిష్ఠమైనా అనాయాసభరితమూ, మనోహరమూనూ.


ద్రుతసమీరచలైః క్షణలక్షితవ్యవహితా విటపైరివ మంజరీ | 

నవతమాలనిభస్య సభస్తరోరచిరరోచిరరోచత వారిదైః ||


ద్రుతసమీరచలైః = ఝంఝామారుతము చేత చలించిన; వారిదైః = మేఘముల చేత;  క్షణలక్షితవ్యవహితా = లిప్తపాటున పుట్టి నశించినట్లున్న; అచిరరోచిః = మెఱుపు; (అపి చ = ఇంకనూ)

(ద్రుతసమీరచలైః = ఝంఝామారుతము చేత చలించిన) విటపైః = కొమ్మలచేత; (క్షణలక్షితవ్యవహితా = లిప్తపాటున పుట్టి నశించినట్లున్న;) నవతమాలనిభస్య = కానుగు చెట్టు కాంతి వలే నల్లనిదై; నభస్తరోః = అంతరిక్షమను చెట్టు యొక్క; మంజరీ ఇవ = పూగుత్తి వలే;  అరోచత = ప్రకాశించెను.

తీవ్రమైన గాలి చేత చలించిన మేఘములు, ఆ మేఘముల మధ్య క్షణమాత్రమున పుట్టి కనుమరుగవుతున్న మెఱుపులు - అదే గాలిచే లిప్తపాటున గోచరించు చలించిన కొమ్మలు గల కానుగు చెట్టు లా నల్లని అంతరిక్షమనే చెట్టుకు పూచిన పూగుత్తి లా మెరుస్తున్నవి.

(శబ్దగుణాలు ఈ శ్లోకం భావానికి ఎంత్గా దోహదం చేస్తున్నాయో విస్పష్టం. ఓ మారు శ్లోకాన్ని భావాన్ని మళ్ళీ చూడండి!)

*************

భ్రమరం లాంటి ఓ చంచలమనస్కుడైన కవివరేణ్యుడు -  ఓ అందమైన,విశాలమైన తోటలో అడుగుపెడితే మకరందం చిప్పిల్లదూ?

ఈ క్రింది భావాలు చూడండి.

ఆ లవంగపూల మీద వ్రాలుతూ ఉంటావు కాబట్టి దాని పుప్పొడి మసితో ఇలా నల్లగా అయ్యావు" - అప్పుడప్పుడే మొగ్గ తొడుగుతున్న మొల్ల తుమ్మెదను చూచి నవ్వింది. 

శరత్కాలంలో నిర్మలమైన ఆకాశంలో ఎర్రని ముక్కులున్న రామచిలుకల దండు యెగురుతోంది. అది దేవతలు మధుసూదనుని అలరించటం కోసం హరితపత్రాలతో చేసిన మనోహరమైన మాల అన్నట్టు అమరింది.

" మేఘాల నుండి వీచే చల్లని గాలికి విరాగి అయిన మనిషే  అల్లల్లాడిపోడా?" - చిటారుకొమ్మన చివురుటాకుతో అంది తుమ్మెద. నిజమంటూ చివురుటాకులు అల్లల్లాడుతూ నృత్యం చేశాయి. 

దిశలు (విరహిణుల్లా) దట్టమైన మేఘాలను చీరలుగా కట్టుకున్నాయి. అడవిలో అంతటా పరుచుకున్న విరహిణులపట్ల దయలేని కడిమిపూలు వాటి పరాగాన్ని ఆ దిశలపైకి (పసుపు లాంటి) మంగళప్రదమైన చూర్ణం లా వెదజల్లుతున్నాయి.

శ్రావణమాసంలో దట్టమైన మేఘాల మధ్య ఒరిపిడికి ఏనుగుకొమ్ములా తెల్లగా ఉన్న నెలవంక నేలకు రాలిపడింది. అలా రాలిన నెలవంక వాడి కొస గల మొగలిపూవయింది. చంద్రుని మధ్య జింక (మచ్చ) - మొగలిపూవు మీద వాలిన భ్రమరమేమో అన్నట్టు అగుపిస్తోంది. 

ఇదీ ఋతువర్ణన ఘట్టంలో కవి భావసౌందర్యం. జాగ్రత్తగా చూస్తే కవి, వస్తువునే కాదు, మనుష్యుల భావాలను, సంవేదనలను, ముఖ్యంగా విరహిణుల మనస్సులో తాపాన్ని చిత్రించటానికి ఈ ఋతువర్ణనలో వెనుకాడలేదు. ఇది మాఘుని విశిష్టగుణం. 

*********

అయితే ఒకటి. అన్నయ్య అన్నయే పేకాట పేకాటే చందాన కవి - తన స్వభావరీత్యా చంచలమైన యమకాలకు, భిన్న ఛందస్సులకు ఈ సర్గ చివర్న తిరిగి తలవొగ్గుతాడు. 55 శ్లోకాల వరకు ద్రుతవిలంబితంలో శ్లోకాలను, భావాలకు, గుణాలకు ప్రాధాన్యత ఇచ్చిన కవి తర్వాత ఉన్నట్టుండి మనస్సు మార్చుకొంటాడు. ఋతువర్ణనలో భాగంగా ఈ కవి ఆరు ఋతువులను ఒక పర్యాయం వర్ణించిన తర్వాత చివర్న తిరిగి ఇంకొకమారు అన్ని ఋతువులను పాదద్వయ యమకాలతో,  కొత్త కొత్త ఛందస్సులతో వర్ణించటానికి పూనుకొంటాడు. ఇవి ఓ 15 శ్లోకాలు దాదాపు. (సర్గలో మొత్తం శ్లోకాలు 79) ఈ ఆరంభంలో మల్లినాథసూరి చెబుతున్న వ్యాఖ్యానం చూడండి -

"అథ యమకవిశేషకౌతికతయా కవిః పునర్ద్వాదశర్భిరృతూన్ వర్ణయతి..."

యమకవిశేషకౌతుకమని వ్యాఖ్యానసూరి వ్యాఖ్య. దీనిని ఇదివరకే యమకచపలత్వమని భవదీయుడు భావించడం జరిగింది. అయితే ఈ ఘట్టంలో అశ్లీలమైన, వికటమైన భావాలను కవి పరిహరించాడు. అది విశేషం. అంతే కాదు ఒకచోట రెండు శ్లోకాల్లో కవి ఒకే భావాన్ని రెండు భంగ్యంతర విధానాల్లో చెబుతాడు. ఇది వ్యర్థంగానే కనిపిస్తుంది. 

*********

దరిమిలా మాఘకవి - ఇదివరకటి చందోవ్సితృతికి, అలంకారవిస్తృతికి 

ఎందుకు ఈ కవి ఇలా యమకవిశేషకౌతుకాన్ని ప్రదర్శిస్తున్నాడు? 

దీనికి ఓ అనాలజీ గుర్తొచ్చింది. అదేంటో చెబుతాను.... :)

కామెంట్‌లు

  1. మొదటిసారి కృష్ణపక్షం చదివినప్పుడు "తలిరాకు జొంపముల సందులత్రోవల నేల వాలు తుహినకిరణ కోమల రేఖవొ!" అన్న దేవులపల్లివారి కవితలో మొట్టమొదటిసారి కనుగొన్నా "తలిరాకు"ని.

    మళ్లీ ఇన్నేళ్లకి ఆ తలిరాకుని మీ బ్లాగ్ శీర్షికలో ఇక్కడ చూసి ఇటు వైపు వచ్చాను.

    ఎంత బాగా రాశారండి. అది ఎంత బాగానో చెప్పడానికి నాకొచ్చిన భాష చాలదు.

    ఈ వ్యాఖ్య ఉంచడానికి కారణం - మీ బ్లాగుకి నేను అభిమానిని - చదువుతూ ఉంటాను అని చెప్పడానికి మాత్రమే!

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Comments ridiculing, abusing, bullying and forcing to agree in any form, if objectionable to the blog owner will be removed.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వాఙ్మయచరిత్రలో కొన్ని వ్యాసఘట్టాలు - శ్రీ ఏల్చూరి మురళీధరరావు గారు.

అశోకుడెవరు? - 1

ముకుందవిలాసః - కుంటిమద్ది శేషశర్మ.