15, జూన్ 2017, గురువారం

అశోకుడెవరు? - 1

ప్రస్తావన:

ఈ వ్యాసానికి ముందు మరొకసారి ఇదివరకటి "భారతదేశ అస్తవ్యస్త చరిత్ర - మౌలిక ప్రాతిపదికలు - ప్రశ్నలు"  - అన్న వ్యాసంలో ముఖ్యమైన అంశాలను పునశ్చరణ చేద్దాం. 
  • క్రీ.శ పద్దెనిమిదవ శతాబ్దంలో ఆధునిక భారతదేశచరిత్రను వ్రాయతలపెట్టింది ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగి, రాయల్ ఏషియాటిక్ సొసయిటీని స్థాపించిన సర్ విలియమ్ జోన్స్. ఆ సంస్థలో భారతీయులు ఒక్కరూ లేరు. 
  • సర్ విలియమ్ జోన్స్ కు భారతదేశంపై, ఈ దేశ ఔన్నత్యంపై, చరిత్రపై ఏమాత్రం సదభిప్రాయం లేదు. అతడు వ్రాయదల్చుకున్నది పాలకుల దృష్టిలోని భారతదేశచరిత్ర మాత్రమే.
  • జోన్స్ కు సంస్కృతం, ఇతర భారతదేశభాషలు రావు. ఇక్కడి సంస్కృతి సాంప్రదాయాలపై ఆతనికి అవగాహన శూన్యం. ఈతడు రాధాకాంత తర్కవాగీశుడనే అతనితో పౌరాణిక రాజవంశావళిని చెప్పించుకున్నాడు.
  • ఆతడు వ్రాసిన చరిత్రకు Sheet anchor - అనామతు గ్రీకు పుస్తకపు అనువాదంలోని సాండ్రోకొట్టసు అనబడే వ్యక్తి. అతణ్ణి మౌర్యచంద్రగుప్తునిగా, క్రీ.పూ. 327 కాలం నాటి వాడిగా ఆతడు నిర్ణయించినాడు.
  • ఆతడు నిర్ణయించిన Sheet anchor ను కోల్ బ్రూక్ తదితర ఉద్యోగులే ఖండించారు. 
  •  గ్రీకు అలెగ్జాండరూ, భారతదేశ సాండ్రోకొట్టసు సమకాలీనులన్న ఆతని నిర్ణయం - శ్రీలంక, చైనా, భారతదేశ సాంప్రదాయ చరిత్రలకు పూర్తిగా వ్యతిరేకం. 
  • విలియమ్ జోన్స్ భావాలను తదనంతరం సమర్థించినది మాక్స్ ముల్లర్ అనబడే ఆతని వారసుడు. ఆపై ఆ పరంపర ఏ అభ్యంతరాలను ఖాతరు చెయ్యక అలానే కొనసాగింది. 
విలియమ్ జోన్స్ తనకు తోచిన చరిత్రను వ్రాసి తగలేసిన తర్వాత కొంత కాలానికి జేమ్స్ ప్రిన్సెప్ అనే వాడు జోన్స్ వారసుడయ్యాడు. ఆంగ్లేయుల ఆలోచనాతీరు "సరళరేఖ" అని ఇదివరకటి వ్యాసంలో చెప్పుకున్నాం. అంటే ఏమిటంటే, జోన్స్ వ్రాసిన దాన్ని ఆ తర్వాతి వాడు ప్రశ్నించడు. అందులో అవకతవకలున్నాయని అనిపించినా, సమన్వయలోపాలు కనిపించినా, ఈ కొత్తవాడు పట్టించుకోడు. ఈతని పని కేవలం - అదివరకు ’ఏదోవిధంగా’ నిర్ధారితమైన నిజాన్ని అనుసరించి, వాటిని వాస్తవాలుగా స్వీకరించి పరిశోధనలో ముందుకెళ్ళిపోవడమే. అందులో సందేహాలొస్తే "ఎలాగో" సమర్థించుకోవడమే. అంతే తప్ప తమ సీనియర్  ప్రాతిపదికను ప్రశ్నించడం జూనియర్ కు దైవధిక్కారం క్రింద లెక్క. ఆ లెక్కన ప్రిన్సెప్ కూడా ’క్రీ.పూ 327 చంద్రగుప్తుని కాలం అని నిర్ణయించుకుని, ఆ Sheet anchor తో తన పరిశోధన మొదలెట్టాడు. దరిమిలా క్రీ.శ. 1838 లో ప్రిన్సెప్ హయాంలో వెలుగులోకి వచ్చిన పేరు ’ అశోకుడు’. 

ఎవరా అశోకుడు? 

*************

అనగనగా పాటలీపుత్రాన్ని మహాపద్మనందుడనే మహారాజు పరిపాలించేవాడు. ఆతడు ఓ సందర్భంలో చాణక్యుడనే బ్రాహ్మణుని అవమానించాడు. ఆ బ్రాహ్మడు ఆ అవమానాన్ని భరించలేక, ఆ మహాపద్మనందుని సర్వనాశనం చేస్తానని ప్రతిన పూనాడు. ఆపై ఆ బ్రాహ్మడు చంద్రగుప్తమౌర్యుడనే ఒక యువకుని చేరదీసి, మహాపద్మనందుని రాజ్యాన్ని కూలదోశాడు. మగధసింహాసనంపై చంద్రగుప్తమౌర్యుని ప్రతిష్ఠించాడు. అలా ఆ చంద్రగుప్తుడు 34(24?) వత్సరాలు పరిపాలించాడు. ఆ మౌర్య చంద్రగుప్తుని కొడుకు బిందుసారుడు. ఈతడు చంద్రగుప్తమౌర్యుని తర్వాత రాజ్యానికి వచ్చాడు. ఆ బిందుసారునికి, జనపదకల్యాణి అనే స్త్రీకి అశోకుడు అనేవాడు పుట్టాడు. 

ఈ మౌర్య అశోకుడు భారతదేశ మహారాజులలో మహా గొప్పవాడు. అఖండ జంబూద్వీపాన్ని తన ఏలుబడిలోనికి తీసుకువచ్చేడీయన. ఓ మారు అశోకుడు కళింగ పై యుద్ధానికి దండు వెడలినాడు. ఆ యుద్ధంలో కళింగ తరపున లక్షమంది పాల్గొన్నారు. యుద్ధం భీకరంగా జరిగింది. రక్తం ఏరులై పారింది. యుద్ధం తర్వాత ఎటు చూచినా గుట్టలు గుట్టలుగా శవాలు. క్షతగాత్రులు. యుద్ధంలో చనిపోయిన తమ బంధువులను వెతుక్కోలేక, గుర్తుపట్టలేక అలమటించిన స్త్రీలు. శవాలకోసం చేరిన రాబందులు. చనిపోయినవారు చనిపోగా పట్టుబడి బందీలైన మిగిలిన శత్రుసేన. ఈ తతంగమంతా చూసిన మహారాజు గుండె ఆర్తితో తరుక్కుపోయింది. ఆతని మనసులో కరుణ ఉప్పొంగింది. ఆపై తన రాజ్యంలో యుద్ధాలు మానివేశాడు. బౌద్ధమతం స్వీకరించాడు. ఎన్నో ధార్మిక కార్యక్రమాలు చేపటినాడు. ’బాటకిరువైపులా చెట్లు నాటించి’నాడు. జంతుబలులను అడ్డుకొన్నాడు. ఇంకెన్నో పుణ్యకార్యాలు చేసినాడు. తన కుమారుడు మహేంద్రుడు, కుమార్తె సంఘమిత్ర లను బౌద్ధమత వ్యాప్తికై పంపినాడు. ఇతని ధర్మచక్రప్రవర్తనకు సాక్షిగా మూడు సింహాలను, ఆ సింహాసనాల క్రింద ఎద్దు, గుర్రము, మధ్యలో ’సత్యమేవ జయతే’ అన్న ముద్రను ఒకానొక శిలాస్థంభంపై చెక్కించాడు. అశోకచక్రం గుర్తు కూడా అందులో ఓ భాగం. ఈ కథంతా జరిగింది క్రీ.పూ. రెండవ శతాబ్దం. 

ఇది మనం పాఠ్యపుస్తకాలలోనూ, చరిత్రగానూ చదువుకుంటూ వస్తున్న కథ. మన తలల్లో, ఆలోచనల్లో, రక్తమాంసాల్లో, మూలిగలో అన్నిటా పాతుకుని పోయిన కథ. మననుండి మనం వేరు చేసుకోలేని విధంగా మనకు చెప్పిన కథ. మనం రోజూ వాడే నాణేల్లో, నోట్లలో కనిపించే కథ.

మనకు మూణ్నాలుగు తరాలుగా వచ్చిన సమ్రాట్టు అశోకుని కథ - చాలా ఆశ్చర్యకరంగా భారతీయ సంస్కృతకావ్యాలలో, నాటకాల్లో నామమాత్రంగా కూడా ఎక్కడా లేదు. కాళిదాసు, మాఘుడు, హర్షుడు, భవభూతి, భాసుడు, విష్ణుశర్మ, భట్టనారాయణుడు, భట్టబాణుడు, భోజుడు, బిల్హణుడు, భారవి, శూద్రకుడు, దిజ్ఞాగుడు, హాలుడు,సుబంధుడు, బాణభట్టు, దండి,  ఇత్యాది ప్రసిద్ధకవులెవ్వరూ ఆ సమ్రాట్టును, ఆతని గొప్పతనాన్ని గుర్తించలేదు.  బృహత్కథ వంటి అపూర్వమైన సంకలనంలో కూడా ఈ అశోకుని ప్రస్తావన లేదు. కావ్యాలలో కాదు కదా, పురాణాలలో కూడా అశోకుని కథ విశదంగా కాకపోయినా కనీసం ఓ కథగా అయినా లేదు. దిలీపుడు, నహుషుడు, మాంధాత, సగరుడు, శిబి, బలిచక్రవర్తి, ఇత్యాది మహా రాజులను, మహనీయులను గుర్తించిన పురాణాలు కనీసం అశోకుని గురించి ఉటంకించి అయినా ఉండాలి. చాణక్యుని సహాయంతో అఖండ మగధ సామ్రాజ్యాన్ని నెలకొల్పిన చంద్రగుప్తుని గురించి మనకు తెలుసు. ఆ కథ ఆధారంగా విశాఖదత్తుని ముద్రారాక్షసమనే సమగ్రమైన నాటకం సంస్కృత సాహిత్యంలో ఉంది. అటువంటప్పుడు చంద్రగుప్తుని వంశంలో ఈ నాడు మనం ఘనంగా చెప్పుకుంటున్న అశోకుని గురించిన ఉదంతం ఎందుకు భారతదేశంలో ఉండరాదు? భారతదేశచరిత్రలో ఓ మహారాజు కళింగపై దండు వెడలి ఆపై పరివర్తన చెందటం అంత ముఖ్యమైన ఘట్టమే అయితే - ఆ ఘట్టాన్ని గురించి ఏదో మూల ఎవరో ఒక కవి/చారిత్రకుడు/రాచరికవారసుడు గుర్తించి ఉండాలి. భారతదేశీయులకు చారిత్రక పరిజ్ఞానం లేదు అని ఎవరెంత ఎద్దేవా చేసినా, పురాణ రాజవంశావళి, కల్హణుని కాశ్మీరరాజచరిత్ర, విక్రమాంకదేవ చరిత్ర ఇత్యాది కావ్యాలు, చరిత్ర మీద ఆధారపడిన సంస్కృతకావ్యాలలో కనీసం ఓ సమ్రాట్టును గురించి ప్రస్తావనా పూర్వకంగానైనా ఉటంకింపును ఆశించడం దురాశ కాకూడదు.కానీ చిత్రంగా అశోకుడు అనే సమ్రాట్టు గురించి అలాంటి ఊసే భారతదేశంలో లేదు! ఆ మాటకు వస్తే క్రీ.శ. 1838  కి ముందు అంటే ప్రిన్సెప్ అనే ఆంగ్లేయుడు అశోక శాసనాలను కనుగొనక ముందు భారతదేశచరిత్రలో మౌర్య అశోకుని ప్రస్తావన లేనే లేదు. ఆఖరుకు ’రాయల్ ఏషియాటిక్ సొసైటీ’ ని స్థాపించి, భారతీయ చరిత్రను వ్రాయపూనుకున్న విలియమ్ జోన్స్ కు కూడా అశోకుడి గురించి తెలియదు! 

ఇక గ్రీకు పుస్తకాలలో ఎక్కడా అశోకుని ఊసే లేదు. అసలా అరకొర గ్రీకు పుస్తకాలలో చంద్రగుప్తుని నిలబెట్టిన చాణక్యుని గురించిన వివరాలే లేవు.

సరే ఈ దేశం హిందూ దేశం కాబట్టి అశోకుడు బౌద్ధుడు కాబట్టి ప్రాచీన కావ్యాల్లో, ఇతిహాసాలలో, పురాణాలలో అతని చరిత్రను పట్టించుకోలేదేమో అన్న అనుమానం కొందరికి రావచ్చు. అయితే బౌద్ధంలో, బౌద్ధ గ్రంథాలలో కూడా అశోకుడి చరిత్ర ఘనంగా ఏమీ లేదు. ఆతని గురించిన వివరాలు సింహళ, టిబెటన్ బౌద్ధ పాళీ గ్రంథాల్లో ఉన్నై. వీటిలో అశోకావదానం, మహావంశం, దీపవంశం, ఆర్యమంజుశ్రీమూలకల్పం, లంకావతారసూత్రం మొదలైనవి ముఖ్యం. వీటిలో మౌర్యఅశోకుని కథలను చూద్దాం.


అశోకావదానము లో అశోకుని కథ 


బౌద్ధ కథలలో భాగమైన దివ్యావదానాలలో అశోకుని కథ యిది. ఈ కథ శ్రీలంక బౌద్ధ సాహిత్యంలో భాగం. ఈ కథ సంస్కృతంలో ఉంది. తదనంతర కాలంలో ఫా హియాన్ అనే చైనా యాత్రికుడు ఈ కథను చీనా భాషలో అనువదించాడు.

అనగనగా చంపానగరంలో పిళిందవత్సుడనే బ్రాహ్మడు ఉండేవాడు. అతనికి ఓ అందమైన కూతురు ఉండేది. ఆమె పేరు సుభద్రాంగి. ఆమెనే జనపదకల్యాణి అనేవారు. ఆమె మహారాజును పెళ్ళాడి ఇద్దరుకొడుకులను కంటుందని, అందులో ఒకడు ప్రవ్రజితుడౌతాడని, మరొకడు మహారాజు అవుతాడనీ జ్యోతిష్కులు చెప్పారు. ఆమె పెరిగి పెద్దయిన తర్వాత పిళిందవత్సుడు ఆమెను ఆ రాజ్యానికి రాజయిన బిందుసారుడికి ఆమెను ఒప్పగించి స్వీకరించమన్నాడు. రాజు ఆమెను అంతఃపురంలో పెట్టాడు.

ఆమె అందం చూసి అక్కడి స్త్రీలకు కన్నుకుట్టింది. అంతటి అందగత్తె తమ మధ్య ఉంటే రాజు ఆమెను తప్ప ఇతరులను పట్టించుకోడని ఆ స్త్రీలు తలపోసి, ఆమెకు క్షురకర్మకు సంబంధించిన విద్య నేర్పారు. జనపదకల్యాణి ఆ విద్యలో ఆరితేరింది. ఆమె రాజుకు క్షురకర్మ చేస్తూ ఉండేది. ఆమె ఆ పని ఎంతనేర్పుతో చేసేదంటే రాజుకు క్షురకర్మ జరుగుతోందన్న స్పృహ కూడా ఉండేది కాదు. ఆతనికి ఆ సమయంలో సుఖంగా నిద్రపట్టేసేది. జనపదకల్యాణి సేవలకు మెచ్చి బిందుసారుడు ఓ మారు ఆమెను ఏదైనా వరం కోరుకోమన్నాడు. ఆమె బిందుసారుడితో శృంగారాన్ని కోరింది. అయితే రాజు క్షత్రియుడు కాబట్టి ఆమె క్షురకస్త్రీ అని, కలయిక కుదరదని చెప్పాడు. అప్పుడామె తాను బ్రాహ్మణస్త్రీ అని, అంతఃపురవాసులు తనకు ఈ విద్య నేర్పించి క్షురకురాలిని చేశారని చెప్పింది. రాజు సంతోషించి ఆమెను పెళ్ళాడాడు. వారికి అశోకుడు, వీతశోకుడు అని ఇద్దరు పుత్రులు కలిగారు.

అశోకుడి చర్మం గరుకుగాను, ఆతడు పొట్టిగానూ ఉండటంతో బిందుసారుడు అతణ్ణి చేరదీసేవాడు కాడు. ఇద్దరు పుత్రులూ, రాజు గారి ఇతర భార్యల సంతానమూ పెరిగి పెద్దయిన తర్వాత రాజు వారిలో ఎవరు రాజు కాగలరో విచారించమని పింగళవత్సజీవుడనే వాణ్ణి నియమించాడు. పింగళవత్సజీవుడు వారిని పరీక్ష చేసేందుకు ఒక చోటకు పిలిచాడు. 

అశోకుణ్ణి రాజు చేయాలని రాధాగుప్తుడు (విష్ణుగుప్తుడు/చాణక్యుని వారసుడు) అనే మంత్రి ఆలోచన. ఆ రాధాగుప్తుడు అశోకునికి ఓ తెల్ల ఏనుగుపై పింగళవత్సజీవుడు పిలిచిన చోటుకు వెళ్ళమన్నాడు. అక్కడ చేరిన రాకుమారులందరినీ తమ తమ ఆసనాలు అలంకరించమని పింగళవత్సజీవుడు చెప్పాడు. అశోకుడు భూమిపై కూర్చున్నాడు. మట్టి పాత్రలో పెరుగు కలిపిన వరి బియ్యాన్ని అమ్మ పంపగా, ఆ అన్నాన్ని ఆరగించినాడు. ఈ లక్షణాలన్నిటినీ పరిశీలించి పింగళవత్సజీవుడు అశోకుణ్ణి రాజుగా అనుకున్నప్పటికీ బిందుసారుడికి అశోకుడు నచ్చడన్న నిజాన్ని గ్రహించి మిన్నకున్నాడు. అయితే అతను జనపదకల్యాణితో నిజాన్ని చెప్పాడు.

ఇంతలో బిందుసారుడి రాజ్యంలో భాగమైన తక్షశిలలో తిరుగుబాటు రేగింది. ఆ తిరుగుబాటును అణచడానికి అతడు అశోకుడిని పంపాడు. అశోకుడు యుద్ధం చేయకుండానే అక్కడి ప్రజల మన్నన ద్వారా ఆ తిరుగుబాటును అణిచివేయగలిగాడు.  ఆపై ఖశ రాజ్యంలోనూ తిరుగుబాటును అదే విధంగా అణచివేశాడు. ఈ పరిణామాల ద్వారా అశోకుడు ఉజ్జయిని ప్రాంతానికి అధిపతి అయ్యాడు. (ఇలా అశోకుడు ఉజ్జయినికి రాజై, అక్కడ 'దేవి' అనే యువతిని చేరదీసి, ఆమెతో మహేంద్రుడు, సంఘమిత్ర అనే బిడ్డలను కన్నాడు. - వీరిద్దరి చరిత్ర ’మహావంశం’లో వస్తుంది.)

ఇదిలా ఉంటే బిందుసారుడికి తన పుత్రులలో సుశీముడంటే చాలా ఇష్టం. అతడు సుశీముణ్ణి యువరాజును చేశాడు. ఈ యువరాజు సుశీముడు ఓ నాడు రాధాగుప్తుడు దారిన వెళుతుంటే ఆతని బట్ట తలపై చిటిక వేశాడు. రాధాగుప్తుడికి ఆతనిపై పట్టరాని కోపం వచ్చింది. దరిమిలా అతడు ఇతర మంత్రివర్గంలో సుశీముడిపై దురభిప్రాయాన్ని కలుగజేశాడు. ఇంతలో తక్షశిలలో మరోమారు తిరుగుబాటు రేగింది. రాజు సుశీముణ్ణి, అశోకుణ్ణి ఇద్దరినీ రప్పించాడు. అశోకుణ్ణి తక్షశిలవైపుకు వెళ్ళేట్టు, సుశీముణ్ణి మహారాజుగా సింహాసనాధీశుడు అయ్యేట్టు నిర్దేశించాడు. దీనికి మంత్రివర్గం వ్యతిరేకించింది. వారు అశోకుణ్ణి రాజుగా అలంకరించి బిందుసారుడి వద్దకు తీసుకొని వెళ్ళారు. బిందుసారుడు ఆరోగ్యం చెడి రక్తం కక్కుకుని చనిపోయాడు. అశోకుడు రాజయ్యాడు.

ఇంతలో ఈ వార్త విని సుశీముడు తన బలగంతో పాటలీపుత్రాన్ని చేరుకున్నాడు. అతనికి రాధాగుప్తుడు ఎదురై, తూర్పు వాకిలి వద్ద అశోకుడు ఒంటరిగా ఉన్నాడని చెప్పాడు. సుశీముడు తూర్పుద్వారాన్ని సమీపించి అక్కడ ఓ కొయ్య ఏనుగుపై అశోకుని ప్రతిమను చూసి నిజమని అనుకుని ముందుకు వెళ్ళాడు. అలా వెళ్ళినవాడు అదివరకే అక్కడ రాధాగుప్తుడు త్రవ్వించిన గుంతలో,కాలుతున్న బొగ్గులలో పడి దుర్మరణం చెందాడు.

రాజయిన తర్వాత అశోకుడు తన పట్ల అసంతృప్తితో ఉన్న ఐదువందల మంది అమాత్యుల శిరస్సులను ఖండించి చంపివేశాడు. తన తమ్ములలో ఒక్క వీతశోకుణ్ణి తప్ప మిగిలిన 99 మందిని అంతమొందించాడు. అశోకుడంటే అంతఃపురకాంతలకు పడదు. అందుచేత వారు అశోకునికి ప్రీతిపాత్రమైన ఉద్యానంలో అశోకవృక్షాన్ని నరికివేశారు. ఆ చర్యకు పట్టరానంత కోపోద్రిక్తుడై అశోకుడు ఆ ఐదువందలమంది అంతఃపురస్త్రీలనూ నిప్పుల్లో దహించేశాడు. ఇట్లాంటి చర్యల వల్ల ఇతనికి చండాశోకుడు అని పేరొచ్చింది. 

ఈ పేరును రూపుమాపడానికై రాధాగుప్తుడు అశోకుణ్ణి ఇటువంటి చర్యలు తనే చేయడం వద్దని నివారించి, చండగిరికుడనే వధకుణ్ణి ఏర్పాటు చేశాడు. ఆ గిరికుడు ఓ మారు కుక్కుటారామానికి చెందిన బౌద్ధభిక్షువును బంధించాడు. ఆతని ఎదురుగానే అశోకుని ఆనతిమీద ఓ అంతఃపురకాంతను, ఆమె ప్రియుణ్ణి రోకళ్ళతో దంపించి చంపించాడు. బౌద్ధభిక్షువునూ చంపబూనితే ఆతడు అక్కడి నుంచి ఎగిరిపోతూ, అశోకుడు మంచివాడవుతాడని, 84000 ధర్మరాజికలను ప్రతిష్టిస్తాడని చెప్పాడు. ఆ సమయంలో అశోకుడు అక్కడికి వచ్చి జరిగింది తెలుసుకున్నాడు. చండగిరికుణ్ణి చంపి, ఆపై అశోకుడు బుద్ధధాతువులతో 84000 ధర్మరాజికలను ప్రతిష్టించాడు. ఇలా ధర్మరాజికలను ప్రతిష్టించిన తర్వాత అతడు ధర్మాశోకుడుగా పిలువబడినాడు. (ఈ 84000 ధర్మరాజికలు/స్థూపాల విషయం చాలా విలువైనది. దాదాపు అన్ని బౌద్ధగ్రంథాల్లో దీని గురించి పదే పదే చెబుతూ వచ్చారు.ఈ సమాచారాన్ని ప్రిన్సెప్ వాడుకున్నాడు. అయితే విచిత్రమైన విషయమేమంటే - ఈ 84000 ధర్మరాజికల గురించి ఈ కాలపు అశోకుని బ్రాహ్మీశాసనాల్లో ఒకటంటే ఒక్క దానిలో కూడా ప్రస్తావనామాత్రంగా కూడా లిఖితమై లేదు! ఈ విషయాలను రాబోయే వ్యాసాల్లో చూద్దాం.) 

తన చివరిరోజుల్లో అశోకుడు 96 కోట్ల ధనాన్ని బుద్ధసంఘానికి దానంచేశాడు. మిగిలిన నాలుగు కోట్లను సమకూర్చుకోలేక మట్టిపాత్రలలో భుజించి చివరి రోజుల్లో ’అర్ధ ఉసిరికాయ’ ను దానం చేసాడని మరొక కథ చెబుతుంది. ఈ కథల్లో అశోకుని కుమారుడయిన కునాలుని కథ కూడా ఉంది, కానీ ఆ కథ ఇప్పటికి అప్రస్తుతం.

ఇది క్లుప్తంగా అశోకావదానంలో అశోకుని కథ. విశదంగా ఆంగ్లంలో ఈ కథను ఈ క్రింది లంకెలో చదువుకోవచ్చు. 

The legend of King Asoka: By John S. Strong

తెలుగులో అశోకావదానాన్ని శ్రీ మోక్షానంద గారు అనువదించారు. క్షేమేంద్రుని అవదాన కల్పలత అనే మొత్తం అవదాన కథలన్నిటినీ తిరుమల రామచంద్ర గారు అనువదించారు. అందులోనూ అశోకావదాన కథలున్నవి. 

*************

పైని కథ బౌద్ధ సాహిత్యంలో ఉన్న అశోకుని కథ. ఇందులో చెప్పుకోగల అంశాలేమంటే -


  1. అశోకుడు కళింగ యుద్ధం చేసినట్టు ఈ కథల్లో నామమాత్రంగా అయినా లేదు.
  2. దరిమిలా ఆ యుద్ధంలో అశోకుడు లక్షమందిని చంపిన ఉదంతమూ లేదు. చంపడం లేదు కాబట్టి ’కరుణ’ ప్రసక్తి అంతకన్నా లేదు.
  3. అశోకుని బౌద్ధమత స్వీకారానికి కారణం - ’కళింగయుద్ధం’ కాదు.
  4. అశోకుడు పరమదుర్మార్గుడైన రాజు. పైని కథయే కాక, అవదానాల్లో మరొక కథ ప్రకారం - అశోకుడిరాజ్యంలో పుండవర్ధనమనే నగరం ఉంది. అక్కడ ఓ అజీవకుడు - బుద్ధుడు నిర్గ్రంథనాథునికి నమస్కరిస్తున్నట్టుగా ఓ చిత్రాన్ని గీశాడు. ఆ ఉదంతం విన్న అశోకుడు ఆ నగరంలో ఉన్న 18000 అజీవకులను చంపించాడు. ఆపై, పాటలీపుత్రంలో అలాంటి కారణం చేతనే ఒకానొక చిత్రకారుని కుటుంబాన్నీ కాల్చిచంపాడు. అంతటితో ఆపక, ఒక్కొక్క అజీవకుని తలకు ఒక్కొక్క దీనారం చొప్పున బహుమతినీ ప్రకటించినాడు. ఆ దీనారానికి ఆశపడి తన తమ్ముడైన వీతశోకుని తలనే ఎవరో పట్టుకువచ్చి చూపడంతో ఆ దుష్టచర్యను ఆపాడు. 

*************

పనికిమాలిన కారణాలకు స్త్రీలను తగలబెట్టించటం, తనను కాదన్న అమాత్యుల తలలు నరికించటం, తమ్ముళ్ళను చంపడం, అంతఃపురంలో ప్రేయసీప్రియులను రోకళ్ళతో దంచటం, ఓ చిత్రాన్ని గీసిన పాపానికి 18000 మంది అజీవకుల తలలు నరికించటం, మరో కుటుంబాన్ని తగలబెట్టటం - ఈ చర్యలు అసలు ఏ మనిషీ కలలో కూడా ఊహించనంత పాశవికమైన చర్యలు.  ఇటువంటి చర్యలు చేపట్టిన మహారాజు ’ఉదారుడు’, 'కరుణాసముద్రుడు’ భారతదేశం గర్వించదగిన సమ్రాట్టు ఎలా అయ్యాడు?  

ఇలాంటి చర్యలు అన్నీ మానివేసి (బౌద్ధ గ్రంథాల్లో అసలు ఊసే లేని) ’కళింగ యుద్ధం’ తర్వాత సాధువుగా, ధర్మాశోకుడుగా మారిపోయాడు, అందుకే ఆతడు గొప్పవాడు/గర్వించదగ్గ సమ్రాట్టు అయినాడు - అని చెప్పారనుకోండి. అప్పుడు ఈ క్రింది ప్రశ్నలు ఉదయిస్తాయి.

మౌర్యాశోకుడు నిజంగా కళింగయుద్ధం చేశాడా?

సమాధానం: 

లేదు. అలా పౌరాణిక/సాహిత్య/ఐతిహాసిక ఆధారాలు లేవు. ఆ యుద్ధం చేయవలసిన అవసరమూ అశోకునికి లేదు. కళింగ మహాపద్మనందుని రాజ్యంలోని భాగం. మౌర్య అశోకునికి తన పితామహుడు చంద్రగుప్తుని ద్వారా కళింగ పారంపరికంగానే సంక్రమించింది. అందుకు ఆధారం మత్స్య, వాయు, బ్రహ్మాండపురాణాల్లో ఉంది. ఈ పురాణాల ప్రకారం మహాపద్మనందుడు - "సర్వక్షత్రాంతకుడు" అంటే అన్నివంశాల క్షత్రియులను నాశనం చేసిన నృపుడు.  ఆ క్షత్రియులలో కళింగులూ ఉన్నారు. అలా అనేకరాజవంశాలను నిర్మూలించి ఆతడు ఏకచ్ఛత్రాధిపత్యంగా 88 యేళ్ళు (అష్ట అశీతి తు వర్షాణి) పాలించాడు. 

(THE PURANA TEXT OF THE DYNASTIES OF THE KALI AGE F.E. Pargiter )




ఈ మహాపద్మనందుణ్ణి చాణక్యుడు భేదోపాయంతో నాశనం చేసిన తర్వాత - మౌర్యచంద్రగుప్తునికి ఆతడి ద్వారా ఆయా రాజ్యాలు సంక్రమించినాయి. అదే పరంపరగా బిందుసారుడికీ, అశోకునికీ కూడా ఆ రాజ్యాలు సంక్రమించినాయి. అంటే అశోకుడికి కళింగ సహజంగా, పారంపరికగా సంక్రమించిన రాజ్యం.  పోనీ, సరిగ్గా అశోకుడి సమయానికి కళింగ తిరుగుబాటు లేవదీసింది అందుచేత యుద్ధం చేశాడు అని సర్దిచెప్పుకోవాలంటే - అందుకూ చారిత్రక ఆధారాలు లేవు. మనకు తెలిసిన విశాఖదత్తుని ముద్రారాక్షసం వృత్తాంతం ప్రకారం, చాణక్య విష్ణుగుప్తుడు చంద్రగుప్తుని సింహాసనంపై నిలిపిన తర్వాత వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించాడు. అయితే ఆర్యమంజుశ్రీమూలకల్ప అనే బౌద్ధగ్రంథం ప్రకారం - విష్ణుగుప్తుడు మూడు తరాలపాటు మంత్రిత్వం నెరపినాడు. అంటే చంద్రగుప్తుడు, బిందుసారుడు, ఆపై అశోకమౌర్యుని హయాంలో కొంతకాలం బాటున్నూ చాణక్యుడు మంత్రిగా ఉన్నాడు. ఆపై విష్ణుగుప్తుని వారసుడు రాధాగుప్తుడు మంత్రిగా అశోకమౌర్యునికి కుదురుకున్నాడు. (త్రీణి రాజ్యాని వై తదా)



(ఆర్యమంజుశ్రీమూలకల్ప:

ఈ పుస్తకం బౌద్ధచారిత్రక గ్రంథాల్లో ఒకటి. ఇందులో బుద్ధుడు దైవాంశ సంభూతుడు. హీనయానంలో గౌతమబుద్ధుడు సాధారణమైన వ్యక్తి అయితే మహాయానం, వజ్రయానాల ప్రస్థానం తర్వాత గౌతమబుద్ధుడు మానవాతీత లక్షణాలు కలిగిన మహిమాన్వితుడుగా, సాక్షాత్తూ స్వర్గవాసి అయిన దైవంగా చిత్రించబడినాడు. ఆర్యమంజుశ్రీమూలకల్పం ఈ విధమైన వాతావరణంలో వ్రాసిన పుస్తకం. అయితే ఈ పుస్తకంలో చారిత్రక విశేషాలకు ప్రాధాన్యత ఉంది. 

ఆర్యమంజుశ్రీమూలకల్పం సంస్కృత గ్రంథానికి రెండు ప్రతులు ఉన్నై. ఒకటి కేరళ (ట్రివేండ్రం సంస్కృత సిరీస్), మరొకటి టిబెటన్ ప్రతి. ఈ రెండు ప్రతులను సమగ్రంగా పరిశీలించి పుస్తకాన్ని జైస్వాల్ గారు ప్రచురించారు. ఈ ప్రతిలో అశోకుడి గురించిన ఉదంతం చాలా అవకతవకలతో ఉందని జైస్వాల్ గారన్నారు. ఈ అశోకుడు బుద్ధునికి నూరేళ్ళ తర్వాత పుట్టాడు. ఇలా చెప్పిన తర్వాత తిరిగి AMMK లో చంద్రగుప్తుని గురించి, బిందుసారుని గురించీ వస్తుంది. చాణక్యుడు మూడు తరాల పాటు మంత్రిత్వం నెరపినాడు. చంద్రగుప్తుడు, బిందుసారుడు, అశోకుడి హయాంలో కొంత.)

విష్ణుగుప్తుడి కాలంలో చంద్రగుప్తుడు గొప్ప యుద్ధాలను చేసింది లేదు. ఆ కాలంలో సమస్యలన్నిటినీ చాణక్యుడు భేదోపాయంతోనే నెగ్గుకుని వచ్చాడు. ఆతడే అశోకుని కాలం వరకూ ఉన్నాడు. తదనంతరం విష్ణుగుప్తుని వారసుడు రాధాగుప్తుడు మంత్రి అయినాడు. అంతటి మంత్రి చాణక్యుడు, ఆతని వారసుడు రాధాగుప్తుడు పక్కన ఉండి రాజ్యాన్ని వేయికళ్ళతో కాపాడుతూ ఉండగా, కళింగ అనే ఓ చిన్న రాజ్యంలో అంత భయంకరమైన యుద్ధం ఉత్పన్నమయే అవకాశమే ఉండరాదు. ఒకవేళ అలాంటిదేదో వచ్చి ఉన్నా, చాణక్యుడు లేదా రాధాగుప్తుడు ఆ యుద్ధాన్ని ఎలాగో నివారించి ఉండగలరు. అలా కాకుండా  కాకుండా యుద్ధపరిణామం వచ్చిందనటం - సందేహాస్పదమైన విషయం. 

శ్రీలంక బౌద్ధ గ్రంథాలయిన దీపవంశ, మహావంశ గ్రంథాల్లో అశోకుడు న్యగ్రోధుడనే బౌద్ధభిక్షువు (ఈతడు అశోకునికి కొడుకు వరస) ద్వారా బౌద్ధతీర్థం పుచ్చుకున్నాడు. (ఇంకో ఉదంతం ప్రకారం సముద్రుడనే భిక్షువు ద్వారా.) ఈ గ్రంథాల్లో ముఖ్యంగా అశోకుని వారసులుగా చెప్పబడుతున్న మహేంద్ర, సంఘమిత్ర ల గురించి వస్తుంది. 

ఈ గ్రంథాల్లో మరొక ప్రముఖ విషయమేమంటే - అశోకుడి కాలం బుద్ధుని తర్వాత 218 యేళ్ళని, బుద్ధుని తర్వాత 100 యేళ్ళకు అశోకుడు పుడతాడని - ఇలా అస్తవ్యస్తంగా ఉంది.  

*************

అశోకావదాన గ్రంథాన్ని తదనంతర కాలంలో ఫాహియాన్ అనే యాత్రికుడు చీనా భాషలోకి అనువదించాడు. ఈ యాత్రికుడు భారతదేశానికి యాత్రీకుడుగా క్రీ.శ. రెండవ శతాబ్దంలో వచ్చాడు. (కొందరు నాలుగవ శతాబ్దమంటారు) గమనార్హమైన విషయమేమంటే - ఈ ఫాహియాన్ యాత్రలలో రెండు చోట్ల బుద్ధుని కాలాన్ని క్రీ.పూ. 2000 దరిదాపుల అని చెబుతాడు. దీన్ని convenient గా ఆంగ్లేయులు పట్టించుకోలేదు.

*************

మొత్తానికి శ్రీలంక బౌద్ధ గ్రంథాల ద్వారా కనిపించే -

అశోకుడెవరు? - అశోకుడు ఓ మహారాజు. ఈతడు బౌద్ధం పుచ్చుకున్నాడు. 84000 ధర్మరాజికలను ప్రతిష్ఠించాడు. అంతే.


  • ఈతడు కళింగయుద్ధం చేయలేదు.
  • ధర్మకార్యాలు చేసినట్టు ఎక్కడా లేదు.
  • జంతువధను నిషేధించలేదు. శాకాహారాన్ని బలవంతంగా రుద్ధలేదు.
  • గొప్ప యుద్ధాలవీ చేసి భారతదేశాన్ని శకయవనాదుల నుంచి కాపాడిన దాఖలాలు లేవు. దరిమిలా ఈయన వీరుడూ, శూరుడూ ప్రతాపవంతుడూ కాడు.
  • తొంభైయారు కోట్ల ధనాన్ని అర్పించిన గొప్ప త్యాగిగా ఓ కథ అశోకుని గురించి తెలుపుతుంది కానీ ఈ దానం ’అపాత్రదానం’ గా మాత్రమే పాఠకుడిగా అందుతుంది. ఈ దానం వల్ల బౌద్ధసంఘమూ, అనూచానంగా జంబూద్వీపమూ బాగుపడినట్టు ఋజువులు లేవు. (బాగుపడ్డమంటే ఇక్కడ context లో లలితకళల అభివృద్దీ, శాస్త్ర పరిజ్ఞానం వగైరా వగైరా)   
  • మనకు ఈ నాడు తెలిసిన అశోకుని లక్షణాలు బౌద్ధ సాంప్రదాయక అశోకునిలో దాదాపుగా కనిపించవు. 

ఇంతకూ మనకు తెలిసిన నేటి కాలపు అశోకుడు, బౌద్ధ సాహిత్యపు అశోకుడూ ఒకరేనా? 
సందేహాస్పదం. 

ఈతడు (పాళీ బౌద్ధ అశోకుడు) నేడు భారతదేశం గర్వించే సమ్రాట్టు ఎలా అయ్యాడు?
రాజకీయ కారణాల వల్ల. లేదా ప్రాపగాండా వల్ల. 

Probably the current Asoka known today (by inscriptions) can be different from Pali texts. 
No concrete evidences are there to prove the Pali Textual Asoka and Asoka we know today are same.

Implies -

Current Asoka is either FAKE or can be a DIFFERENT KING from texts. It is possible that this "DIFFERENT KING" can be from other than Mourya Dynasty., which may imply further that, the chronology of kings has to be re-vamped, re-calculated. In such a case - sheet anchor (Sandrokottas as Chandragupta Mourya) should also be questioned.  

(ఇంకా ఉంది)