26, మార్చి 2014, బుధవారం

సంస్కృత సౌరభాలు - 20


మిత్రమపి యాతి రిపుతాం
స్వస్థానాత్ ప్రచ్యుతస్య పురుషస్య |
కమలం జలాదపేతం
శోషయతి రవిర్న తోషయతి ||

స్వస్థానాత్ = తన నెలవు నుండి
ప్రచ్యుతస్య = తొలగిన
పురుషస్య = మనుజునికి
మిత్రం అపి = మిత్రుడు కూడా
రిపుతాం = శత్రుత్వమును
యాతి = పొందును.
రవిః = సూర్యుడు
జలాత్ = నీటి నుండి
అపేతం = వేరు చేయబడిన
కమలం = పద్మమును
శోషయతి = ఎండిపోయేలా చేస్తాడు.
న తోషయతి = వికసింపజేయడు.

(మిత్రం - నపుంసకలింగమైతే స్నేహితుడని, మిత్రః పుల్లింగమైతే సూర్యుడని సంస్కృతంలో అర్థం)

ఈ పద్యానికి తాత్పర్యం ఇది.

కమలములు నీట బాసిన
కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్‌
తమ తమ నెలవులు దప్పిన
తమ మిత్రులు శత్రులౌట తథ్యము సుమతీ.

తెలుగైనా, సంస్కృతమైనా నీతి అంటే అలా వెన్నతినిపిస్తున్నట్టు, అమ్మ చేతి గోరుముద్దలాగా, నాన్నచిటికెన వ్రేలి ఆసరా లాగా అనిపించాలి. వేప బెత్తం పక్కన బెట్టుకుని అయ్యవారు ఝళిపిస్తున్నట్టుగా ఉండరాదు మరి. ఇంకోరకంగా - అంటే పెద్దవాళ్ళ భాషలో చెప్పాలంటే -

అల్పాక్షరరమణీయం
యః కథయతి నిశ్చితం స వై వాగ్మీ |
బహువచనమల్పసారం
యః కథయతి విప్రలాపీ సః ||

ఎవడైతే తక్కువ అక్షరాలలో, రమణీయంగా మాటలాడతాడో నిశ్చయంగా వాడే చక్కని వక్త. ఎవడైతే అల్పమైన సరుకున్న సారంలేని మాటలను చెబుతూ ఉంటాడో వాడు ఒక వదరుబోతు.

ఎంత అల్పాక్షరరమణీయంగా చెప్పాడో. ఈ ఛందస్సు పేరు ఆర్యా. సంస్కృతంలో ప్రాచీనమైన ఛందస్సు ఇది. తెలుగు కందపద్యంలో కొన్ని మార్పులు చేస్తే ఈ ఛందస్సు వస్తుంది. ఈ ఆర్యా ఛందస్సు గురించి ఈమాటలో జెజ్జాల కృష్ణమోహనరావు గారు విశదంగా వ్రాశారు. ఆసక్తి గలవారు చదువుకోవచ్చు.

పైని శ్లోకాలు ఉన్న కావ్యం పేరు కూడా ఆర్యా.

సుందరపాండ్యుడు అనే ఆయన వ్రాసిన ప్రాచీన కావ్యం ఇది. దీనికే నీతిద్విషష్టికా అని పేరు. ద్విషష్టికా అంటే 62 నీతి శ్లోకాలు అని చెప్పుకోవాలి. అయితే ఇందులో నూటపదహారు శ్లోకాలు ఉన్నాయి. నూటపదహారు శ్లోకాలలో చెప్పిన నీతుల సంఖ్య మాత్రం అరవై రెండు కాబట్టి నీతిద్విషష్టికా అని పేరు వచ్చి ఉండవచ్చునను ప్రాజ్ఞులు ఊహించారు. ఈ కావ్యం పంచతంత్రం కన్నా పురాతనమైనదని ఊహిస్తున్నారు.

మనకు నీతిశతకం అంటే భర్తృహరి గుర్తుకు వస్తాడు. భర్తృహరి నీతిని రకరకాల పద్ధతుల సారంగా చెప్పాడు. మూర్ఖపద్ధతి, అర్థపద్ధతి, సుజనపద్ధతి, ఇలా..సుందరపాండ్యుని నీతిశ్లోకమాల ప్రాచీనమైనది. ఇందులో అటువంటి విభాగాలు లేవు,

అయితే శ్లోకాలలో ఆయా పద్ధతులు కనిపిస్తాయి. చాలా సులభంగా గుర్తుంచుకొనేలా, మిత్రుడు సలహా చెబుతున్నట్టుగా అలవోకగా ఈ శ్లోకాలు ఉంటవి.

రజనికరః ఖలు శీతో
రజనికరాచ్ఛన్దనో మహాశీతః
రజనికరచ్చన్దనాభ్యాం
సజ్జనవచనాని శీతాని.

తాత్పర్యం సులువుగానే తెలుసుకోవచ్చు, సంస్కృతంలో ఉన్నప్పటికీ.

ఈ సుందరపాండ్యుడు ఎలా వ్రాశాడో ఏమో కానీ, కొన్ని శ్లోకాలు నేటి మృలాంత్రనిపుణులను ఉద్దేశించి వ్రాశాడు.

గర్జతి శరది న వర్షతి
వర్షతి వర్షాసు నిస్స్వనో మేఘః
నీచో వదతి న కురుతే
న వదతి సుజనః కరోత్యేవ

శరత్కాలంలో మేఘం ఊరికే గర్జిస్తుంది. వర్షాకాలంలో చప్పుడు చేయకున్నా వర్షిస్తుంది. నీచుడు మాటలు చెప్తాడు కానీ పని చెయ్యడు. సుజనుడు మాటలు చెప్పడు, చేసి చూపుతాడు.

పైన శ్లోకం లో నీచుడెవరో ఊహకే వదులుతున్నాను.

ప్రతివాదినీ చ భార్యా
పరసేవా పరగృహే సదా భుక్తిః
క్షిప్రం జరయతి పురుషం
నీచైర్వాసః ప్రవాసశ్చ

ప్రతి మాటకూ అడ్డుచెప్పే భార్యా, పరసేవా, ఇంటిబయట (మెస్సులో) మీల్సూ, నీచులతో వాసమూ, ఆన్సైట్ లో ఎక్కువకాలం ఉండటం ఇవన్నీ మనిషిని తొందరగా ముసలివాడిని చేస్తాయి.

తత్క్లిష్టం యద్విద్వాన్
విద్యాపాఙ్గతోऽపి యత్నేన
విజ్ఞాతారం అవిన్దన్
భవతి సమః ప్రాకృతజనేన

ఎంతో శ్రమపడి సకల విద్యాలు ఉన్న విద్వాంసుడూ, తనను గుర్తించేవారు లేక సమాన్యులతో బాటుగా గుర్తుంచబడుతూ ఉంటాడు.

(అప్రైసల్ బేడ్ గా వచ్చిన వారికి ఈ శ్లోకం బాగా అర్థమవుతుంది)

తలనెప్పులెలా ఉంటాయో కూడా ఓ చోట చెబుతాడు.

అవిధేయో భృత్యజనః
శఠాని మిత్రాణి నిర్దయః స్వామీ
వినయరహితా చ భార్యా
మస్తకశూలాని చత్వారి

మాట వినని పనివాళ్ళు, మోసం చేసే మిత్రులు, దయలేని యజమాని, వినయం లేని భార్య - ఇవి నాలుగు తలనొప్పులు.

సుందరపాండ్యుని ఆర్యా గ్రంథంలోని శ్లోకాలను తెలుగులో శ్రీనాథుడు, సుమతీశతకకారుడు, మంచన కవీ వంటి ప్రముఖకవులు అనుసరించారు(ట).

అక్కడక్కడా కొన్ని పరిచయమైన వాక్యాలు కనిపిస్తాయి.

అతిపరిచయాత్ అవజ్ఞా, సంతతగమనాత్ అనాదరః - సంస్కృతంలో ఇదొక సామెత. పరిచయం ఎక్కువైతే లోపాలు బయటపడతాయి. అదేపనిగా ఒకరి ఇంటికి వెళుతూ ఉంటే అనాదరం ఏర్పడుతుంది అని దీని అర్థం. ఇందులో మొదటి భాగం ఆర్యాలో ఉంది.

పరవాదే దశవదనః
పరరంధ్రనిరీక్షణే సహస్రాక్షః
సద్వృత్త విత్తహరణే
బాహుసహస్రార్జునో నీచః

ఇతరుల దోషాలు కనుక్కునేప్పుడు పది ముఖాలు, ఇతరుల లోపాలు చూడ్డంలో వేయి కళ్ళు. ఇతరుల డబ్బు దొంగిలించడంలో వేయి చేతులు - ఇది నీచుని స్వభావం. ఈ శ్లోకం మా తాతయ్య ద్వారా విన్నట్టు గుర్తు.

వేమన పద్యం లేని తెలుగు ఎలా ఉంటుందో, బహుశా ఆర్యా లేకపోతే సంస్కృతం అలా ఉంటుంది.

1, మార్చి 2014, శనివారం

సంస్కృత సౌరభాలు - 19


కళానిధికలావతీకలిత జూటవాటీలసత్
త్రివిష్టపతరంగిణీ లలితతాండవాడంబరః |
మదాంచితవిలోచనో మధురముగ్ధవేషస్సదా
పరిస్ఫురతు మానసే గిరిసుతా ऽ నురాగాంకురః ||

కళానిధి = కళలకు నిలయమైన రేరాజును,
కలావతి = కళలే నెలవైన ఉమను,
కలిత = కూడి
జూటవాటీ = జటలు
లసత్ = ప్రకాశించుచుండగా
త్రివిష్టపతరంగిణీ = మూడులోకాలలో ప్రవహించే గంగ యొక్క
లలితతాండవాడంబరః  = సుకుమారమైన అలల నృత్యమునే విలాసముగా కలిగిన వాడు

మదాంచితవిలోచనః = మత్తమైన చూపులను కలిగినవాడును
గిరిసుతా = గిరితనయయొక్క
రాగాంకురః = అనురాగమునకు మొలక ఐన
మధురముగ్ధవేషః = మధురము, ముగ్ధము అయిన వేషము కలిగిన అర్ధనారీశ్వరుడు
మానసే = మనసునందు
సదా = ఎప్పుడూ
పరిస్ఫురతు = మెదలుచుండుగాక!

*************************************

అందమైన, మనోహరమైన శబ్దాలతో పద్యాన్ని తీర్చి ఈశ్వరుని పేరు పెట్టి పిలువకుండా, గిరితనయ అనురాగానికి మొలక అని ఉద్యోతించి పిలుస్తున్నాడు కవి. రాగము అంటే ఎరుపు రంగు అని రూఢ్యర్థం కూడా ఉంది. అమ్మాయిలో ఎరుపు రంగు సిగ్గుకు సంకేతం అనుకుంటే - గిరితనయ రాగానికి మొలక అంటే - అమ్మాయి సిగ్గులకు మొలక అని మనోహరమైన అర్థం కూడా వస్తుంది. ఈ పద్యానికి తాత్పర్యం వ్రాసిన పండితులు దీనిని ఈశ్వరపరంగా అర్థం చెప్పారు. అయితే ఇది అర్ధనారీశ్వరుని గురించినదా? మధురముగ్ధవేషః అని మరొక మాట. ముగ్ధత్వం - సగభాగం అయిన పార్వతికి చెందటం న్యాయం. కాదూ?

మాధుర్యమూ, సౌకుమార్యమూ, ప్రాసాదగుణమూ చిప్పిల్లే భావయుక్తమైన రచన ఇది.

ఈ కావ్యంలోని మరి కొన్ని శ్లోకాలు చూద్దాం.

రాజరాజసఖశ్శంభూ రాజరాజితమస్తకః |
రాజీవసమనేత్రాంశో మమ లోభాయితో హరః ||

రాజరాజు అయిన కుబేరునికి మిత్రుడూ, రాజు (అంటే చంద్రుడు) తో విరాజిల్లే మస్తకం ఉన్న వాడు, ఎర్రతామరలవంటి కనులు కలిగిన హరుడు నన్ను అనుగ్రహించుగాక!

ధిమిధిమితక మర్దల మర్దన నిన
దా ऽ నుగమ కోమల విచలితపాదః |
ప్రతిపదవలన వికల్పితవేదః
ప్రతిపదమవతాన్మునిగణబోధః ||

మద్దెల తాలూకు ధిమి ధిమి తక శబ్దాలకు లయబద్ధంగా తన కోమలమైన పాదాలని కదిలిస్తూ, పదఘట్టనంతో (నాట్య) వేదాన్ని సృజిస్తూ, మునులకు జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్న శంకరుడు రక్షించుగాక! 


అంబరగంగాచుంబితపాదః పదతలవిదళితగురుతరశకటః - అన్న మధ్వాచార్యుని కందుకస్తుతి లీలామాత్రంగా కనబడుతుంది ఈ శ్లోకంలో.

మస్తకచాలితమందానురణత్ గంగాకణముక్తాంచితఫాలః |
నిటలాఫలకా నృతదభంగాగ్ని శిఖాకృతనీరాజనమాలః ||

ఆ మహేశ్వరుడు తన శిరస్సును కదిలిస్తే శిరస్సుపై మందధ్వనితో ప్రవహించే గంగ తాలూకు జలబిందువులు ఆయన నుదుటిపై ముత్యాలలాగా పడినవి. ఆ ఫాలఫలకం లోని మూడవకన్ను ఆయనకే నీరాజనమాలగా ఉంది. (అట్టి శివుడు నన్ను రక్షించనీ) భక్తిని, అద్భుతరసాన్ని ఒక్క చోట ఆవిష్కరించటం అత్యద్భుతం కాదూ?

కపాలీ భిక్షాశీ పితృవననివాసీ పశుపతిః
వినాశీ పాపానాం స్మితమధురవేషీ మృగధరః |
పరానందస్తోత్ర శ్రవణమృదుసంచాలితశిరః
విధత్తామంఘ్రిం మే మనసి తపసా ధూతతమసి ||

కపాలీ = కపాలాన్ని ధరించినవాడు
భిక్షాశీ = భిక్షాన్నము తినేవాడు
పితృవనవాసీ = శ్మశానవాసి
పశుపతిః = గోరక్షకుడైన ఈశ్వరుడు
పాపానాం వినాశీ = పాపాలను పోగొట్టేవాడు
స్మితమధురవేషీ = మధురమైన నవ్వును ధరించిన
మృగధరుడు = మృగధరుడు
పరానందస్తోత్ర = ఆనందంతో భక్తులు చేసే స్తోత్రాలను
శ్రవణమృదు సంచాలితశిరః = విని మెల్లగా తల ఊచే వాడు (భోళాశంకరుడు)
ధూత ధూతతమసి = తపస్సుతో నిర్మలమైన
మే మనసి = నా మనస్సులో
అంఘ్రిం = కాలు
విధత్తాం = మోపుగాక.

భిక్షాశీ, పితృవననివాసీ. పాపవినాశీ, స్మితమధురవేషీ - ఎక్కడో మృచ్ఛకటికంలోని శ్లోకం ఛాయ! అయితే భక్తిరసాన్వితమైన ఆవిష్కరణ.

రకరకాల ఛందస్సులతో కూడిన ఈ ముక్తక కావ్యంలో చాలా చిన్న చిన్న శ్లోకాలతో బాటు వృత్తపద్యాలు కూడా ఉన్నాయి. ప్రాసాదగుణమూ, రసనిర్భరత నిండుగా ఉన్న మెండైన చల్లకుండ ఇది.


శివకర్ణామృతం అనే ఒక కావ్యం లోనివి ఇవి. మనకు లీలాశుకుడు అనే కవి వ్రాసిన శ్రీకృష్ణకర్ణామృతం, అలాగే సదుక్తికర్ణామృతం వగైరా కావ్యాలున్నాయి. ఇవన్నీ కర్ణామృతాలు ఎందుకు అయినాయి? నేత్రామృతాలు ఎందుకు కాలేదు? ఎందుకంటే భావంకంటే శబ్దం విస్మరణీయం కాదు కనుక, భారతీయభాషలు కర్ణేంద్రియం పై కూడా ముఖ్యంగా ఆధారపడినవి కనుక. గురువు ద్వారా విని వల్లె వేయటం భారతీయభాషలకు ముఖ్యమైన అవసరం కనుక అని రకరకాల అర్థాలు చెప్పుకోవచ్చు. శబ్దాన్ని, భావాన్ని సమానంగా పండించే కవిని మహాకవి అంటారు. ఈయన కవో, పండితుడో ఏమైతేనేం. నిశ్చయంగా మాత్రం సరస్వతీపుత్రుడు.

జన్మతః విశిష్టాద్వైతి అయిన ఈయన ఇలా చెపుతాడు.

శేషశైలశిఖరాధివాసినః కింకరాః పరమవైష్ణవావయమ్ |
తత్తథాపి శశిఖండశేఖరే శాంకరే మహసి లీయతే మనః ||

శేషశైల వాసి అయిన విష్ణువుకు భృత్యులమూ, పరమవైష్ణవులమూ మేము. అయినా బాలేందుమౌళి శంకరునిపై మనస్సు బలంగా లీనమవుతున్నది.


*************************************

ఈయన తెలుగులో శివుణ్ణి, శివతాండవాన్ని వర్ణిస్తే ఇలా ఉంటుంది.

మొలకమీసపు కట్టు ముద్దు చందురు బొట్టు
పులితోలు హొంబట్టు, జిలుగు వెన్నెలపట్టు
నెన్నడుమునకు చుట్టు క్రొన్నాగు మొలకట్టు
క్రొన్నాగు మొలకట్టు కురియు మంటలరట్టు
సిగపై ననల్పకల్పక పుష్పజాతి, కల్పక
పుష్పజాతి చెర్లాడు మధురవాసనలు
బింబారుణము కదంబించు తాంబూలంబు
తాంబూల వాసనల దగులు భృంగగణంబు
కనులపండువసేయ, మనసు నిండుగపూయ
ధణధణధ్వని దిశాతతి పిచ్చలింపంగ

ఆడెనమ్మా శివుడు,
పాడెనమ్మా భవుడు!

హొంబట్టు = బంగారు జరీ చీర.
క్రొన్నాగు = లేతవయసులో ఉన్న సర్పం
భృంగగణంబు = తుమ్మెదలరాశి

జ్ఞానస్వరూపిణి, పరబ్రహ్మస్వరూపిణి అయిన సరస్వతి శంకరునికి చెల్లెలని చెపుతారు. సరస్వతీపుత్రునికి శంకరుడు మేనమామ. మేనమామపై మేనల్లునికి ఇష్టం, మనస్సు కలుగడంలో ఆశ్చర్యమేమున్నది?