మాఘమేఘవృష్టి
మాఘం!
ఎంత విలక్షణమైన విశిష్టమైన కావ్యం ! అందులో ఈ చతుర్థ సర్గ!
ఈ అనుశీలకుడికి ఓ కవి మీద ఇష్టం ఏర్పడింది అంటే - ఆ కవిలో ఈ భావుకుడు తనకు చెందిన ఏదో అభిరుచిని వెతుక్కుంటున్నాడని అర్థం., ఆ అభిరుచి సర్వతోముఖంగా ఆ కవికల్పనల్లో కనిపించి ఈ అనుశీలకుణ్ణి అంతర్ముఖుణ్ణి చేయడమే కాక, ఓ రసమయప్రపంచంలో విహరింపజేస్తుంది.
కవుల్లో ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రత్యేకత.
మాఘకవి విస్తృతికి వ్యాప్తికి విలక్షణత్వానికి పట్టుగొమ్మ. విస్తృతికి - వ్యుత్పత్తి హేతువు.
కవులందరిలోనూ సాధారణలక్షణాలు, ప్రత్యేకలక్షణాలు కద్దు.
సంస్కృతకావ్యప్రపంచంలో కవికులతిలకుడైన కాళిదాస కవి కవిత సుకుమారం, ధారాసదృశం. కవిత ఆయన కట్టిన పట్టుపంచెపై జీరాడే జరీ అంచు. అలా అలవోకగా ఒక కమనీయమైన భావాన్ని చెప్పడంలో కవి సిద్ధహస్తుడు. ఈ కవి మరీ గహనమైన, మరీ విలక్షణమైన శ్లోకాల జోలికి సాధారణంగా వెళ్ళడు. సంస్కృతభాష గ్రామగ్రామాల్లో ప్రజల భాషగా ఉన్నప్పటి రోజుల్లో బహుశా కాళిదాసకవి కవిత్వాన్ని రచ్చబండల్లో, పల్లెపట్టుల్లో ఎందరో మాట్లాడుకొని ఉంటారు. లేపోతే ఆ కవి మీద అన్ని చాటుకథలు, ఉదంతాలు రావు, పుట్టవు. కాళిదాసు ప్రజాకవి.
కాళిదాస కవి - కవిత్వం కూడా అనాయాసభరితం. వర్ణింపబోయే వస్తువును ఒక ఉపమతోనో, ఒక స్వభావోక్తితోనో రంగరించటం ఈ కవికి నల్లేరుపై నడక.
"వాగర్థావివ సంపృక్తౌ"
"దీపశిఖా ఇవ"
"ఉద్బాహురివ వామనః"
"ఇందుః క్షీరనిధావివ"
"దినక్షపా మధ్యగతేవ సంధ్యా"
- ఇలా ఇవార్థకాలు కాళిదాసు కవిత్వంలో అనాయాసంగా దొరలిపోతుంటాయి. అట్లే స్వభావోక్తులూనూ. కావ్యమేదైనా, శ్లోకాల్లో, భావాల్లో సింహభాగం ఈ అలంకారాలే ముఖ్యం. ఇతరాలు లేవని కాదు తాత్పర్యం. వాటిపై కాళిదాసు దృష్టి లేదని విన్నపం.
కాళిదాసు ప్రజాకవి.
భారవి పండితకవి.
శ్రీహర్షుడు మహాపండితకవి.
దండి, జయదేవుడు నాదకవులు. వీరి కవిత్వం మనోహరమైన తుమ్మెద ఝంకారాన్ని పోలి ఉంటుంది.
భోజుడు భావుకవరేణ్యుడు.
భాసకవి దృశ్యనిపుణకవి. ఈయన కవిత్వం నాటకానికి చక్కగా అమరే స్వభావం కలది.
కులశేఖరాది కవులు భక్తితత్పరులు.
సేతుబంధకారుడిది - విస్మయాత్మకప్రపంచం.
మాఘుడు? మాఘుడు - అన్వేషకకవి అని నా అభిమతం. ఈ కవిది నిరంతర పరిశీలన, శోధన, అన్వేషణ. తుమ్మెద ఏ ఒక్క పూవు వద్దనో ఆగదు. అది నిరంతరాయంగా కుసుమాలను చవి చూస్తుంది. తేనెను సేకరిస్తుంది. భ్రమరం చంచలం. అయితే భ్రమరం అంతిమకూర్పు మధురం. మనోహరం. ఆస్వాదభరితం.
ఈయన్ను అనుశీలించటం రహదారిపై ప్రయాణం కాదు. ఓ దట్టమైన, అందమైన, విస్మయకరమైన అరణ్యంలో ప్రయాణం. ఇది కొంత సాహసికుల ప్రస్థానం.
మాఘకవిది అన్వేషణాపరాయణత్వం. నిరంతరాయంగా శబ్దంలో, భావంలో, అలంకారాదుల్లో, చందస్సులో, భాషలో నవనవోన్మేషణతను వెతకడం ఈ కవి స్వభావం. ఏ ఒక్క భావం వద్దనో, ఏ ఒక్క అలంకారం వద్దనో ఆగటం మాఘకవి కవిత్వం లో కనిపించదు. ఆ కారణం చేత మాఘకవి కవిత్వానుశీలనం కాళిదాసాది కవుల వలే సులభతరం కాదు. అలా అని కావ్యలక్షణాలలో మౌలికమైన ధార, రీతి, గుణాది లక్షణాలు ఈ కవి కవిత్వంలో లేవా? - అంటె శుభ్రంగా ఉన్నాయి. అయితే కవి ప్రాధాన్యతలు వేరు.
మాఘకవి ఏ ఒక్క అలంకారాన్నో విరివిగా విస్తృతంగా వాడడు. ఉపమ, ఉత్ప్రేక్ష, తద్గుణం, విరోధాలంకారం, భ్రాంతిమదం, సమాసోక్తి, తుల్యయోగిత, కావ్యలింగం, నిదర్శన, వ్యతిరేకాలంకారం - నాల్గవ సర్గలో ఈ అలంకారాలన్నీ కుప్పగా పోశాడాయన. అలంకారాల సంకరం విరివిగా కనిపిస్తుంది. క్వాచిత్కంగా వస్తుధ్వని, అలంకారధ్వని కూడా లేకపోలేదు. నాలుగవ సర్గలో రసధ్వని జోలికి ఈ కవి పోలేదు.
అట్లే చందస్సు - సాధారణంగా ఓ సర్గలో ఒకే చందస్సును నిలిపి రచన చెయ్యడం రివాజు. అయితే మాఘకవి తీరు వేరు. మాఘం లో చతుర్థ సర్గలో కవి కూర్చిన కొన్ని చందస్సులు చూడండి.
మాలిని, వంశపత్రపతితం, పృథ్వీ , భ్రమరవిలసితం, పుష్పితాగ్రా, జలోద్ధత, ప్రహర్షిణి, ఆర్యా, దోధక, మత్తమయూరం, స్రగ్విణి, కురకీరుత, ద్రుతవిలంబిత, ప్రమితాక్షర, జలధరమాలా, శాలిని....ఇత్యాది.
సర్గలో ఉన్న మొత్తం శ్లోకాల సంఖ్య 68. ఈ కొన్ని శ్లోకాల్లో ఈయన చూపిన అలంకార, చందో విస్తృతి ఇది. ఇక భావవిస్తృతికి వ్యాఖ్యాన సార్వభౌముడు మల్లినాథ సూరి "మాఘే మేఘే గతం వయః" అన్న నిర్దేశమే నిదర్శనం. మహాప్రతిభాశాలి, శిశుపాలవధకావ్యానికి మాతృక అయిన కిరాతార్జునీయ కావ్యస్రష్ట భారవికి మల్లినాథసూరి ఈ నిర్దేశం చేయలేదు. గమనించాలి.
"నవ సర్గగతే మాఘే, నవ శబ్దో న విద్యతే" అని మరొక అభాణకం. తొమ్మిది సర్గల మాఘకావ్యం చదివిన తర్వాత సంస్కృతభాషలో కొత్త శబ్దం అంటూ మిగిలిఉండదని అర్థం. ఈ శబ్ద విస్తృతికి కావ్యం అంతా ఉదాహరణగా నిలుస్తుంది.
ఇన్ని విధాలుగా విలక్షణత్వాన్ని, విస్తృతిని కలిగి ఉన్న కావ్యం శిశుపాలవధం. ఇందాక చెప్పుకొన్నట్టు ఇది సునాయాసభరితం అని చెప్పవీలు లేదు కానీ, విలక్షణం అనటం సముచితం. ఒక్క వస్తువును ఒకే పద్ధతిలో కవులు ఏర్పరచుకున్న ముడిసరుకుల్లో, కవిసమయాల్లో నిమంత్రించడం మాఘకవికి దూరం. ఈయన వర్ణ్యవస్తువు నిముషనిముషానికి తన రూపాన్ని, వర్ణాన్ని, ఆకారాన్ని కూడా మార్చుకొంటుంది. ఈ కవియే ఓ శ్లోకంలో చెప్పినట్టు - "క్షణే క్షణే యన్నవతాముపైతి తదేవ రూపం రమణీయతాయాః" (ప్రతిక్షణానికి నవ్యత్వాన్ని సంతరించుకునే రూపమే రామణీయత కదా! ) - ఇదే ఈ కవి శైలి.
(మాఘకవిని, ఇంకెవరైనా సంస్కృతకవితో పోల్చదల్చుకుంటే గుర్తుకు వచ్చే కవి బాణభట్టు అని నా నమ్మకం. బాణుడిది బహుశా మరింత విస్తృతమైన, విస్మయకరమైన ప్రపంచం. 'బాణోచ్ఛిష్టం జగత్సర్వమ్' కదా. అయితే బాణుడు గద్యకవి. గద్యంలో చందోబంధనాలు లేవు కనుక ఆ కవి తన పురాణధురీణతను, లోకజ్ఞతను కావ్యంలో రంగరించి పరిపుష్ఠం చేశాడు. పద్యకావ్యప్రపంచం వేరు. విస్తృతి విషయంలో ఈ ఇద్దరు కవుల దృష్టి, అభిరుచి ఒకే విధమని నా మతం.)
మాఘకవి కవిత్వంలో కొన్ని నలుసులూ లేకపోలేదు. (ఇవి మాట్లాడ్డం బహుశా నావంటి అతిసామాన్యుడు చేయదగింది కాదు. కానీ చెప్పాలి). అవి మాట్లాడుకొని ఆపై గుణాలూ చర్చించుకొందాం.
యమకచపలత్వం
ఈ కవి యమకచపలుడు. పాదద్వయ, పాదచతుష్టయ యమకాలంటే ఈ కవికి పరమప్రీతి. ద్విపాదయమకం ఈ సర్గలో పెక్కుచోట్ల కనిపిస్తుంది. ఎక్కడైనా యమకం దొరికితే కవి, భావానికి లెక్కించకుండా యమకాన్ని శ్లోకంలో అట్టిపెట్టటం కనిపిస్తుంది. ఈ క్రింది శ్లోకం చూడండి.
ఇతస్తతో౽స్మిన్ విలసన్తి మేరోః సమానవప్రే మణిసానురాగాః ।
స్త్రియశ్చ పత్యౌ సురసుందరీభిః సమా నవప్రేమణిసానురాగాః ॥
మేరోః = సుమేరుపర్వతము యొక్క; సమానవప్రే = సమమైన కొండచరియలు గల; అస్మిన్ అద్రే = ఈ యచలమందు; ఇతస్తతః = అక్కడక్కడా; మణిసానురాగాః = వివిధకాంతుల మణులు/ఎర్రని కెంపులు; విలసన్తి = మెరుస్తున్నవి;
సురసుందరీభిః సమాః = అప్సరసల బోలు; స్త్రియః చ = ఈ జనపదముల జవ్వనులునూ; పత్యౌ = పతులయెడ; నవప్రేమణి - నూత్నప్రణయభావములలో; సానురాగాః = అనురాగవతులై ; విలసన్తి = క్రీడించుచున్నారు;
సుమేరు పర్వతసమానసానువుల ఈ రైవతకాచలమున అక్కడక్కడా కెంపుల సొబగులు ద్యోతకమగుచున్నవి. అచ్చరలబోలు ఈ జనపదభామినులు పతులయెడ సానురాగముతో క్రీడించుచున్నారు.
ఆ శ్లోకంలో రెండవ నాల్గవ పాదాలు సమానం. దీన్ని ద్విపాదయమకం అంటారు.
"సమానవప్రే మణిసానురాగాః"
"సమా నవప్రేమణిసానురాగాః"
సుమేరువు వంటి రైవతకంలో కెంపుల సొబగులు కనిపిస్తున్నాయి. ఈ భావం సాధారణంగా ఉంది. బానే ఉన్నది. అయితే రెండవపాదంతో నాల్గవపాదం యమకం సాధ్యం అవుతుంది కనుక అందుకు తగినట్టు కని సురసుందరీమణులను తీసుకు వచ్చాడు! మొదటి రెండుపాదాలభావాలకు, మూడు నాలుగు పాదాల భావాలకు అంగాంగి సంబంధం కానీ, పరస్పర పూరకత్వం కానీ కనిపించదు. ఇది కేవలం శబ్దచిత్రం. వినడానికి, చదవటానికి అందంగా ఉన్నా, భావాన్ని యమకనిర్దేశం కోసం త్యాగం చెయ్యటం ఈ శ్లోకంలో కనిపించే అంశం. అపురూపమైన ఎన్నో భావాలను కూర్చిన కవి ఒకట్రెండు చోట్ల ఇలా యమకచపలత్వాన్ని చూపటం ఉంది. కవులు కూడా చిన్నపిల్లలవంటివారేనేమో. ఈ మాఘకవి కి శబ్దాలే బహుశా ఆటవస్తువులు!
అయితే కొన్ని చోట్ల యమకం అందమైన సున్నితమైన భావానికి సానబెట్టటమూ ఉంది. ఈ క్రింది శ్లోకం చూడండి. ఇందులోనూ రెండవ, నాల్గవ పాదాలు సమానం.
యా న యయౌ ప్రియమన్యవధూభ్యః సారతరాగమనా యతమానమ్ ।
తేన సహేహ బిభర్తి రహః స్త్రీ సా రతరాగమనాయతమానమ్ ॥
మానవతి బహులజ్జావతి అయిన యువతి ఒకతె మగని ప్రయత్నమునకు లొంగక యుండెనో, అట్టి స్త్రీ ఈ సానువుల సౌందర్యమునకు ఉద్దీపితురాలై అభిమానమును వర్జించి శృంగారాభిలాషతో పతిని చేరినది.
గాథాసప్తశతి వంటి ప్రాకృతకావ్యస్పర్శ ఇది. భావం మరీ శబలం కాకపోయినా, సరళంగానూ, మనోహరంగానూ ఉన్నది. యమకం కూడా అల్పప్రాణాక్షరాలతో మనోహరంగా భాసిస్తూంది. (సారతరాగమనా యతమానమ్, సా రతరాగమనాయతమానమ్). ద్విపాదయమకాలను అటు మనోహరంగానూ, ఇటు కేవల శబ్దచిత్రంగా నిలపడమూ మాఘుని కవిత్వంలో ఎడనెడ కనిపించే అంశం. "చపలత్వం" అని ఉపశీర్షికలో పేర్కొన్నమాట దూషణ కాదు, కవిత్వ స్వభావమని నా మనవి.
భావంలో వైరూప్యత
కీకారణ్యంలో నడుస్తూంటే - అందమైన ప్రకృతి శోభ, మనోహరమైన కుసుమాల తావి, ఒడలు పులకింపకేసే జలప్రవాహాలతో బాటు, విషకీటకాలు, కంటకాలు కూడా తప్పదు. ఈ కావ్యంలో అక్కడక్కడా కొంచెం విచిత్రమైన శ్లోకాలు, భావాలు కనిపిస్తే ఆశ్చర్యం లేదు. ఈ క్రింది శ్లోకం చూడండి.
బింబోష్ఠం బహు మనుతే తురంగవక్త్రశ్చుంబనం ముఖమిహ కిన్నరం ప్రియాయాః ।
శ్లిష్యంత ముహురితరో౽పి తం నిజస్త్రీముత్తుంగస్తనభరభంగభీరుమధ్యామ్ ॥
గంధర్వులు రెండు రకాలు. మొదటి రకం - తురగదేహం + మనిషి మోము. రెండవ రకం - మనుజదేహం + తురగవదనం. మొదటి రకపు గంధర్వులకు సుదతి ని చుంబించటంలో, రెండవ రకపు గంధర్వులకు రమణి కౌగిలిలోనూ వెసులుబాటు బావుంటుంది కనుక, వారిని వీరు, వీరిని వారు చూసి అసూయపడతారన్నట్టు ధ్వనింపజేశాడు!
ఈ భావం విచిత్రంగానూ, కొత్తగానూ ఉంది. అయితే శృంగారరసపోషకత్వం కానీ, మైమరపు కానీ కలిగించని భావం ఇది. భావం విచిత్రమూ, విలక్షణమే. అయితే కొంతమేరకు వైరూప్యం అని అనుకోవలసి వస్తుంది. ఇంతకన్నా సున్నితంగా ఈ శ్లోకం గురించి మాటలాడటం సభ్యత కాదు.
అట్లే మరొకచోట కవి పర్వత సానువులను వృద్ధస్త్రీ పయోధరాలతో పోల్చి విముఖత కల్పిస్తాడు.'అపారే కావ్యసంసారే కవిరేకః ప్రజాపతిః యథాస్మై రోచతే విశ్వం తథేదం పరివర్తతే' (అపారమైన కావ్యసంసారంలో కవి అనువాడు బ్రహ్మ. అతడు జగత్తును చూచే తీరుననే అతడి కావ్యజగత్తు పరివర్తన పొందుతుంది) , 'నియతికృతనియమరహితాం' (కవి సృష్టికి కట్టడిలేదు) - ఇవన్నీ నిజమే. అయినా కవి కల్పన లో నలుసులు కొంత ఇబ్బందే. బహుశా ఇటువంటి కంటకాలను కూర్చకపోతే రమణీయమైన కావ్యానికి, కావ్యభాగాలకు శోభ రాదని కవి శశభిష యేమో!
అవి నలుసులు మాత్రమే. గుణాధిక్యత ముందు ఆ నలుసులు నిలువవు. "ఏకో హి దోషో గుణసన్నిపాతే నిమజ్జతీందో కిరణేష్వివాంకః" !
కవి ఆరంభంలోనే విస్మయపరుస్తాడు.
క్వచిజ్జలాపాయ విపాండురాణి ధౌతోత్తరీయప్రతిమచ్ఛవీని ।
అభ్రాణి విభ్రాణముమాంగ సంగ విభక్తభస్మానమివ స్మరారిమ్ ॥
ఆ రైవతకం పర్వత సానువుల నేపథ్యంతో ఆకాశాన అక్కడక్కడా తెల్లని వెలిమేఘాలు కనిపిస్తున్నాయి. ఆ మేఘాలు వర్షాన్ని భువికి ధారవోసిన తర్వాత తెల్లనివై, శుభ్రంగా ఉతికిన ఉత్తరీయాల్లా అగుపిస్తున్నాయి. ఆ మేఘాల అచ్చాదనం కాకుండా ఉన్న మిగిలిన భాగాలు గల పర్వతం స్నిగ్ధంగా ఉంది. ఇలా ఆ పర్వతం - ఉమాదేవి కౌగిలించి, ఆ కౌగిలి నుండి విడివడిన పరమేశ్వరుని శరీరంలా ఉంది.ఉమాదేవి ఈశ్వరుని కౌగిలించుకున్నప్పుడు, పరమశివుని శరీరంపై పూర్తిగా అలదుకుని ఉన్న భస్మం, ఆమె స్పర్శతో అక్కడక్కడా తొలగిపోయింది. శంకరుని గాత్రంపై ఉమాదేవి సంస్పర్శ కలుగని కొన్ని చోట్ల మాత్రం భస్మం అలానే ఉంది. భస్మసహితమైన ముక్కంటి గాత్ర భాగాలకు మేఘాలపోలిక. భస్మవిహితమైన గాత్రభాగాలకు మేఘాచ్ఛాదనం లేని పర్వతభాగాల పోలిక. ఇలా రైవతకం ఉమాదేవి కౌగిలిని పొంది, విభజింపబడిన భస్మపు పూత గల స్మరారి దేహంలా ఉందని భావం. అంతకు మునుపు శ్లోకంలోనే కవి విరాట్పురుషుని స్ఫురణతో శైలాన్ని వర్ణిస్తాడు. ఆపై పరమేశ్వరుడు. మరొకచోట రామాయణకావ్యంతోనూ శైలాన్ని కవి నిర్దేశిస్తాడు.
ఇదీ మాఘుని దృష్టి! మాఘుని వృష్టి కూడా!
పైని శ్లోక వ్యాఖ్యానంలో వ్యాఖ్యానసార్వభౌముడు మల్లినాథుని వ్యాఖ్యానపరిమళాలను యెన్నక తప్పదు. 'ఉమాంగసంగవిభక్తభస్మానమివ స్మరారిమ్" అన్న వాక్యానికి వ్యాఖ్యానసార్వభౌముని వివరణ అపూర్వం!
మాఘునికి ఘంటామాఘుడని పౌరుషనామం. ఆ ఘంటల శ్లోకం ఈ చతుర్థ సర్గలోనే ఉంది. ఆ శ్లోకం గొప్పదే. అయితే పైన చూసిన స్మరారి శ్లోకం మరీ అమోఘంగా ఉంది. "భిన్నరుచిర్హి లోకః" కదా.
ఉపమా కాళిదాసస్య భారవేరర్థ గౌరవమ్ ।
దండినః పదలాలిత్యం మాఘే సన్తి త్రయోగుణాః ॥
అని ఒక చాటూక్తి. పైన ఉపమ ఆ ఉక్తిలో ఒక పార్శ్వానికి నిదర్శనం అయితే, ఈ క్రింది శ్లోకం పదలాలిత్యానికి
మాఘుడనే అరణ్యంలో అక్కడక్కడ రమణీయమైన కుసుమాలు, భ్రమరనాదాలూ కూడా కద్దు.
రాజీవరాజీవశలోలభృంగ ముష్ణంతముష్ణం తతిభిస్తరూణామ్ ।
కాన్తాలకాన్తా లలనాః సురాణాం రక్షోభిరక్షోభితముద్వహన్తమ్ ॥
తామరపూలబారులపై మకరందం కోసం చేరిన తేంట్లు; వేడిమిని పోగొట్టే వృక్ష సమూహాలు; రాక్షసుల బాధలేక స్వేచ్ఛగా విహరిస్తూ, గాలికి చెదిరిన ముంగురుల అప్సరోభామలు; ఈ సమూహాలతో ఒప్పారే రైవతకపర్వత సానువులు..పై శ్లోకం చదువుకుంటే చాలు. ఆ శబ్దమాధుర్యం తెలియటానికి.
కవి ఒక చమరీమృగాన్ని ఇలా చూస్తాడు.
"ఈ వనములందు వెదురుతోపులనేకము గలవు. చమరీంఋగమొకటి ఆ వెదురుతోపులయందు ప్రవేశించి, కండూతి (దురద) బాపుకొనుటకై వెదురుతోపునకు మేనిని సంఘర్షించుటచేత కాబోలును, రోమము తెగి, ఆ భయము చేత ఈ తోపులయందే తిరుగాడుచున్నది. వెదురుతోపులయందు మందమారుతములు వీచుటచేత ఆ తోపుల నుండి వెలువడు సన్నని మధురమైన నాదమును విని, ఆ నాదము యొక్క మత్తు చేత (భయమును వీడి) ఆ ప్రదేశమునుండి వెడలుటకు ఉత్సాహము చూపకున్నది."
కాళిదాసు కుమారసంభవంలో హిమాలయవర్ణనలో ఒక శ్లోకభావం ఇది. "మదపుటేనుగొక్కటి దురద బాపుకోవడానికి - దేవదారు వృక్షానికి మేనిని రుద్దుకొని, ఆ వృక్షపు సుగంధం, తన మేని సుగంధం బహిర్గతం కాగా, ఆ సానువులన్నీ ఘుమఘుమలాడుతున్నాయి".
మాఘకవి మదిలోని ఈ చమరికి - కాళిదాస కవి మదిలోని ఆ గజమే ప్రేరణ యేమో!
కవి అరణ్యాలను, నదీప్రవాహాలను మానవసంవేదనలకు ప్రతిరూపంగా నిలుపుతాడు. వర్ణసంచితమైన ఒక చిత్రకారుడి దృష్టితో చూస్తాడు. పక్షుల, భ్రమరాల కూజితాలను వినిపిస్తాడు. రకరకాల మణులతో అలంకరిస్తాడు. వెఱసి ఒక ప్రపంచాన్ని ఆవిష్కరిస్తాడు. ఈ చిన్న వ్యాసంలో మొత్తాన్ని చెప్పటం కావ్యఘట్టానికి అన్యాయం చెయ్యటమే అవుతుంది.
ఇది ఒక సర్గ. మిగిలిన సర్గలన్నీ ఊహించుకుంటే, చదువుకుంటే ఈ కవి ప్రపంచం ఎంత విస్మయమైనదో, విస్తృతమైనదో తెలుస్తుంది.
*******
"రవీ! మాఘ కావ్యానికి వ్యాఖ్యానం ఇంతవరకూ ఎవరూ వ్రాయలేదు. ఆ పని నువ్వెందుకు చెయ్యరాదు?" అని ఆత్మీయులొకరు నిర్దేశించారు.
ఆశ్చర్యం ! భారవి కిరాతార్జునీయానికి, శ్రీహర్షుని నైషధానికి కూడా తెనుగున సమగ్రవ్యాఖ్యలున్నాయి.
మరి ఎందుకు తెనుగులో మాఘకావ్యానికి వ్యాఖ్యానం రాలేదు? లేక ఎవరైనా వ్రాసి పెట్టిన వ్యాఖ్యానం చరిత్రలో ఖిలమయిందా?
విస్తృతి, వ్యుత్పత్తి - తెలుగువారి అభిరుచిలో లేని పదార్థాలని నాకొక అనుమానం. మహా పండితకవులను కూడా ఆదరించే తెలుగువారు వ్యుత్పత్తిప్రధానకవులను ఎందుచేతనో అప్పుడూ ఇప్పుడూ కూడా చిన్నచూపు చూస్తారని కొన్ని దృష్టాంతాలను చూస్తే అనిపిస్తుంది. బహుశా మాఘకవి అందుకే ఆనలేదేమో!
ఏదేమైనా, ఓ మనోహరమైన ప్రపంచంలో కొన్నాళ్ళు విహరించటానికి ఉపయోగపడింది. ఓ సర్గమాత్రం పూర్తయ్యింది. అయితే ఇది ఏ విధమైన సాధికారతా లేని ఒక పామరుడి ప్రయత్నం. లొసుగులన్నీ నావి. గుణాలన్నీ కవివి.
ఇది వెలుగు చూస్తుందా? ఎలా? దీనిని ఎవరైనా సమగ్రంగా పరిశీలిస్తారా? - ఇప్పటికేమీ తెలీదు.
ఓ కలలాంటి ప్రపంచాన్ని చూసి మలకువకొచ్చి, తొందర ఆపుకోలేక ఈ వ్యాసం.
*******
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Comments ridiculing, abusing, bullying and forcing to agree in any form, if objectionable to the blog owner will be removed.