24, జూన్ 2010, గురువారం

చిత్రభారతీ పంచకము - 5

స్వరములకు రాణి, వాణికి శంఖబంధపు నుతి.

శంఖ బంధము

కం||
ఖరకరచర సితనారీ!
స్ఫురతాధరసుమపరాగశోణా భూరీ!
స్వరధురధర హితకారీ!
బెరయున్ ధర,సురప రాగవీణాధారీ!

ఖరకరచర = ఖరకరుడు - సూర్యుడు, ఖరకరచర - సూర్యునివలె చరించు,
సితనారీ = సర్వశుక్ల యగు వనితా (సరస్వతి)
స్ఫురతాధర = తళతళమను మెఱయు అధరము(స్ఫురదధర శీధవే అని జయదేవుడు. స్ఫురతాధర తప్పుకాదనుకుంటున్నాను)

స్వరధురధర = స్వరములభారము మోయునది
బెరయున్ ధర = ఇలను సర్వాంతర్యామిగ వ్యాపించినయట్టి

శంఖ బంధములో ప్రతిపాదపు చివరి అక్షరం ఆవృత్తి కావాలి. అదే శంఖపు కన్ను.


ఈ పద్యము శంఖబంధమే కాక ఛురికా బంధము కూడా.

అలాగే ఈ పద్యము గోమూత్రికాబంధము కూడా.

సి నా రీ! స్ఫు రి తా సు రా శో ణా భూ రీ!
స్వ ధు హి కా రీ ! బె యున్ , సు రా వీ ణా ధా రీ!

 మూడు చిత్రములు కలిగినది కావున, ఇది త్రిచిత్ర పద్యమనబడును.

23, జూన్ 2010, బుధవారం

చిత్రభారతీ పంచకము - 4

తమోహతం చేసే చదువులతల్లి పదాలకు ఛురికా బంధముతో చిత్రించిన ఈ చిన్ని పద్యసుమార్చన.

ఛురికా బంధము


కం||
సకలకళాకలితవికసి
తకమలదళలోచని లలితసురుచిరలతాం
గి కమలభవురాణి భవప
ద కమలములనే భజించెదఁ మది వినయమున్

ఛురికాబంధము, కటాహక బంధము మొదలైనవి ఖడ్గబంధము యొక్క వివిధ రూపాలు. అలాగే ఈ పద్యములో ఒకే పిడి గుబ్బ ఉన్నది. రెండు పిడి గుబ్బలను కూర్చి పద్యం వ్రాయటం మరొక పద్ధతి. ఈ ప్రయోగం ఆంధ్రామృతం, శంకరాభరణం బ్లాగులలో పెద్దలు చేసి ఉన్నారు.

ఈ ప్రయోగంలో మొదటి పాదంలో రెండవ, నాలుగవ, ఆరవ అక్షరాల ఆవృత్తి, తిరిగి అదే అక్షరం నాలుగవ పాదం రెండవ అక్షరంగా రావలసిన అవసరము ఉన్నది.

22, జూన్ 2010, మంగళవారం

చిత్రభారతీ పంచకము - 3

మూడవ బంధము స్వరకల్పిత డిండిమము. డిండిమము అంటే ఢమరుక.స్వరాల కల్పవల్లి అంబకు డిండిమ స్వరాల నీరాజనం. స్వర కల్పిత డిండిమము కం|| రాజిత రజనీకరసువి రాజిత రంజిత సరోజ రాజ సుహాసీ! రాజిత సార సుర, జలజ రాజి తనూలత సుగంధి రహి సారతరా! రాజిత = ప్రకాశించు రజనీకర = చంద్రుని వలె సువిరాజిత = అందముగను, మిక్కిలి ప్రకాశముగను, రంజిత = రంజింపజేయు, సరోజ రాజ = శతదళపద్మము వంటి సుహాసీ = అందమైన చిరునగవు కలిగిన దానా. రాజిత సార సుర = అమృతముల సారము వలె శ్రేష్టమైనదానా. (స్వరముల సారముతో రాజిల్లునది) జలజ రాజి తనూలత సుగంధి = పద్మముల రాశిచే (పూజించబడిన/నొప్పుచు) తనూలతచే సుగంధము చిందుచు రహి సారతరా = శ్రేష్టమైన ఆనందములకు నెలవైనదానా. ఈ బంధంలో పద్యము మొదటి అక్షరం, చివరి అక్షరం ఒకటిగా ఉండవలెను. రెండవ, నాలుగవ పాదముల మొదటి అక్షరములునూ ఆవృత్తి కావలెను. ఈ పద్యము నిరోష్ట్యము కూడా. అంటే పెదవులు కలువనవసరం లేకనే ఉచ్ఛరింపబడునది.

21, జూన్ 2010, సోమవారం

చిత్రభారతీ పంచకము - 2


అంబను గోమూత్రికా బంధముతో కూర్చిన పద్యముతో నుతి చేద్దాము. ఈ బంధము గురించి ఆంధ్రామృతం బ్లాగులో వివరించబడి ఉన్నది.

గోమూత్రికా బంధము

౧.

స్వరచణ శతధృతినారీ!
స్ఫురితాధరసుమసురాగశోణా వాణీ!
స్వరగుణజిత మతితారీ!
బిరికీధర,సుధసు రాగవీణాపాణీ!

స్వ ధృ తి నా రీ! స్ఫు రి తా సు సు రా శో ణా వా ణీ!
స్వ గు జి తి తా రీ ! బి రి కీ , సు సు రా వీ ణా పా ణీ!

స్వరచణ = స్వర జ్ఞానము కలిగినది
శతధృతి నారీ = శతధృతి అంటే బ్రహ్మ. శతధృతినారీ = బ్రహ్మ యొక్క నారి.
స్ఫురితాధరసుమసురాగశోణా =
స్ఫురిత = మెరయు, తళుకులీను
అధరసుమ = అధరమనే పూవు
సురాగ = రాగమంటే ఎఱుపు, కోపము, సిగ్గు, ప్రేమ, రంగు ఇలా నానార్థాలు. సురాగమంటే, చిక్కటి రంగు
శోణా = ఎఱుపు
(కుంకుమ రాగశోణే అని కాళిదాసు ప్రయోగం)
వాణీ = సరస్వతీ
స్వరగుణజిత = స్వరగుణములను జయించినది
మతితారీ = తారీ అంటే నేర్పరి, సూత్రధారి. మతితారీ = బుద్ధులకు సూత్రధారి
బిరికీధర = చెవిపోగు ధరించినది
సుధసురాగవీణాపాణీ = సుధలు చిందు, మంచి రాగాలనొలికించే వీణను హస్తమున ధరించినది.

౨.

సురగణనుత సితనారీ!
స్ఫురితాధరసుమపరాగశోణా వాణీ!
స్వరగుణజిత,హితకారీ!
బిరికీధర,సురప రాగవీణాపాణీ!

సు ను సి నా రీ! స్ఫు రి తా సు రా శో ణా వా ణీ!
స్వ గు జి హి కా రీ ! బి రి కీ , సు రా వీ ణా పా ణీ!

(ప్రతి రెండవ అక్షరమూ ఒకటిగా ఉండును. ఆకుపచ్చ రంగు అక్షరములతో సూచింపబడినది)

సురగణనుత = దేవతాగణముచే కొలువబడినది
సితనారీ = సర్వశుక్ల అయిన యువతి (యా కుంద ఇందు తుషార హార ధవళా)
స్ఫురితాధరసుమపరాగశోణా
స్ఫురిత = తళుకులీను
అధర = పెదవి
సుమపరాగ శోణా = పుష్పముల పుప్పొడి వలె ఎఱ్ఱనైనది
వాణీ = సరస్వతీ
స్వరగుణజిత = స్వరముల యొక్క స్వభావములను జయించినది
హితకారీ = హితము గూర్చునది
బిరికీధర = చెవిపోగు ధరించినది
సురప రాగవీణాపాణీ
సురప = సురులకుపతి సురపుడు అంటే ఇంద్రుడు. ఇంద్రుడు అంటే శ్రేష్టుడు, శ్రేష్టము అని అన్వయం
లేదా సుర అంటే అమృతము. సురప అంటే అమృతపు అని అన్వయం
రాగవీణా = రాగములను పలికించు వీణను
పాణీ = చే ధరించినది.

గోమూత్రికా బంధములో  రకరకములు ఉన్నవి. అక్షరములతో మాత్రమే కాక పదములతో గోమూత్రిక చేకూర్చడమూ ఒక పద్ధతి అట.

19, జూన్ 2010, శనివారం

చిత్రభారతీ పంచకము - 1

నమస్కారం. భారతీ కృపతో, పెద్దలు, గురువర్యుల ఆశీస్సులతో, మిత్రుల ప్రోత్సాహంతో, బంధకవిత్వం మీద ఆసక్తితో నేను ప్రయత్నించిన పద్యాలివి. దోషములున్న మన్నించదగును. మొట్టమొదటిగా, భారతీదేవిని చిన్న పద్యంతో సింహాసనారూఢను చేసికవనముతో నుతిచేద్దాము. సింహాసన బంధము కం || కలువల చెలువమునఁ గనులు వెలుగఁగ ముత్తియపుకాంతి వెలితో దంతం బులతతి యలరుచు, నుతిచే పిలువఁగ పలికెడి సుదతిని పేర్మి భజింతున్. చెలువము = విధము, అందము పద్యానికి పాటించిన నియమములు. 1. పద్యము కందమనే ఛందస్సులో వ్రాయబడినది. 2. మొదటి పద్య నియమావళిననుసరింపబడినది. ( నియమములిక్కడ) 3. సింహాసన బంధములో మధ్య వరుస అక్షరములు కలిపి చదివిన అర్థవంతమైన వాక్యము రావలెను. పద్యమునకవనముతో నుతిఅన్న వాక్యం వస్తుంది. బొమ్మలో గమనించండి. 4. సింహాసనమున ప్రతి వరుసలోనూ మధ్య అక్షరానికి అటూ ఇటూ సమముగా అక్షరములుండవలెను. అయితే ఇది ఖచ్చితమైన లక్షణముగ పేర్కొనబడి ఉండుట చూడలేదు. బాగుగా చూడటానికి బొమ్మపై నొక్కండి.