4, డిసెంబర్ 2014, గురువారం

సంస్కృత సౌరభాలు - 22




సాధ్వీ గౌః సురభిర్నామ సాగరాదుదభూత్స్వయమ్ |
గోప్రసూతా హి గావీ స్యాదసాధుశ్చేతి జానతీ ||

సురభిః నామ = సురభి అన్న పేరుగల
సాధ్వీ గౌః = సాధువైన కామధేనువు
సాగరాత్ = పాలసముద్రం నుండీ
స్వయమ్ = తనకు తానుగా
ఉదభూత్ = పుట్టినది.

గోప్రసూతా హి = గోవునకు పుట్టినది
గావీ స్యాత్ = (సంస్కృతవ్యాకరణరీత్యా) "గావీ" అయినా
అసాధుః చ ఇతి = అసాధువే కదా అని
జానతీ = ఎఱిగినది.

***************************

ఓ పరమభక్తాగ్రేసరుడైన పండితుడు తన చరమదశలో ఉన్నాడు. విశ్వజిద్యాగం చేసి ఉన్నదంతా దానం చేశాడు. విశ్వజిద్యాగం అంటే సంపాదించినదంతా దానం చేసి కట్టుబట్టలతో మిగలటం. ఈ యాగాన్ని రఘుమహారాజు చేశాడని కాళిదాసు రఘువంశంలో చెబుతాడు. మన పండితుడు కూడా ఆ యాగం చేసి ఒంటరివాడై చిదంబరంలో నటరాజసన్నిధిలో ఆర్తుడై జీవితపు క్షణాలు వెళ్ళదీస్తున్నాడు. 

చిదంబరమిదం పురం ప్రథితమేవ పుణ్యస్థలం
సుతాశ్చ వినయోజ్జ్వలాః సుకృతయశ్చ కశ్చిత్ కృతాః |
వయాంసి మమ సప్తతేరుపరి నైవ భోగే స్పృహా
న కించిదహమర్థయే శివపదం దిదృక్షే పదమ్ ||

(ఈ పురము చిదంబరము. ఇది ఒక గొప్ప పుణ్యక్షేత్రం. సుతులు వినయవంతులు.నావి ఏవో కొన్ని కావ్యాలు ఉన్నాయి. నా వయసు ఏడుపదులు దాటింది. భోగాలమీద ఏ కాస్తా స్పృహ లేదు. ఈ చరమాంకంలో ఏమీ వద్దు. శివపదమునే ఇప్పుడు చూస్తున్నాను)

ఆ శివపదం ఆ మహానుభావునికి గోచరించింది. ఇలా అన్నాడు.

ఆభాతి హాటకసభానటపాదపద్మ
జ్యోతిర్మయో మనసి మే తరుణారుణోऽయమ్ |

( ఆహా, ఆ నటరాజు పాదపద్మముల వెలుగుల ఎరుపుదనం నా మనసులో మొలకెత్తింది!) 

ఈ మాటతో ఆ పండితుని ఆత్మ శివైక్యంచెందింది. 

పక్కన పండితుని (అన్నగారి) మనమడు పన్నెండేళ్ళకుర్రవాడు తాతయ్య శివైక్యం చెందడాన్ని స్పష్టంగా చూశాడు. మిగిలిన శ్లోకపాదాలను పూరించాడు.

నూనం జరామరణఘోరపిశాచకీర్ణా
సంసారమోహరజనీ విరతిం ప్రయాతా ||

(ఆ మనసు అల్పమైన ముసలితనం, మరణాలనే పిశాచావిష్టమై, సంసారమోహమనే చీకటి యొక్క అనిష్టాన్ని దాటిపోయింది)

పండితుని పేరు శ్రీమదప్పయ్యదీక్షితులు. కుర్రవాడైన పండితుని పేరు నీలకంఠదీక్షితులు.  ఈయనే ఈ వ్యాసంలో ప్రస్తావనాంశం.

***************************

శ్రీ నీలకంఠదీక్షితుల వారిది 17 వ శతాబ్దం. ఈయన తాతయ్య అప్పయ్యదీక్షితులు గొప్ప ఈశ్వరాద్వైతి. పరమభక్తుడు. నీలకంఠదీక్షితులు కూడాను. గొప్ప వైరాగ్యం, భౌతికవిషయవిముఖత్వం, ఆధ్యాత్మికతలకు గొప్ప హాస్యస్ఫోరకతకూ దగ్గర సంబంధం ఉంది. ఇది ఒక paradox. బౌద్ధము, తావోయిజం, జెన్ వంటి మతాలలో వీటికి గొప్ప దృష్టాంతాలు కనబడతాయి. నీలకంఠ దీక్షితులు గొప్ప విరాగి. ఈయన కవిత్వంలో అక్కడక్కడా దేవుళ్ళనూ, లోకసామాన్యమైన భావనలను పరిహసించటం, సరూపార్చన అంచులకు చేరిన నిర్గుణపరబ్రహ్మోపాసన ఛాయలూ కనబడతాయి. 

ధన్యాస్తే బహుదేవాః స్వామిని యేషాం న దుర్భిక్షమ్ |
జాతు నజానీమో వయమేకమపి స్వామినం పూర్ణమ్ ||

కొలుచుకునేటందుకు దేవతల దుర్భిక్షం లేని అనేకానేకులు ధన్యులు. మాకైతే పూర్ణమైన ఒక్క స్వామి కూడా లేడు. (తన స్వామి అర్ధనారీశ్వరుడు. ఆయన పూర్ణావతారంగా కూడా లేడని శ్లేష)

అన్నాభావే మృత్యుః శాలిభిరన్నాని శాలయో వృష్ట్యా |
వృష్టిస్తపసేతి వదన్ అమృత్యవే తత్ తపశ్చరతు ||

అన్నం లేకపోతే చావు. అన్నం కోసం వర్షం కావాలి. వర్షం రావాలంటే తపస్సు - ఇలా అంటున్నప్పుడు (వర్షం కోసం, ఆపై సస్యం కోసమూ, ఆపై శరీరాన్ని పోషించడమూ, ఆపై భగవంతుడూ ఇలా సుదీర్ఘంగా కాక సూటిగా) మృత్యురాహిత్యం కోసం తపస్సు చేయొచ్చు కదా!

మరొకచోట అంటాడు - అందరూ వంగదేశం కబుర్లేమిటి, అంగదేశ విశేషాలేమిటీ అనడుగుతారు. యమలోకం విశేషాలేమిటీ అని అడగరేం?

( ఈ ఉటంకింపులన్నీ వైరాగ్యశతకంలోనివి)

అయితే దీక్షితకవి కేవలం విరాగి కాదు. ఆయన పండితుడు, తిరుమలనాయకునికి మంత్రి. లౌకికజీవితం అనుభవించి విరక్తుడైన భక్తాగ్రణి. కవిత్త్వం అలవోకగా పట్టుబడిన పండితుడు, వశ్యవాక్కు కూడా. వ్యాకరణంలో దిట్ట. 

ఇక మొదటి శ్లోకం కథాకమామీషు ఇది -

నీలకంఠదీక్షితకవి విజయచంపువు అనే ఒక అద్భుతమైన చంపూకావ్యాన్ని రచించాడు. చంపూ కావ్యమంటే గద్యపద్యమిశ్రితమైన కావ్యం. దేవేంద్రుడు దుర్వాసముని కోపానికి గురు అయి దానవులతో యుద్ధంలో ఓడటం, ఆపై దేవదానవులు కలిసి సాగరమథనం చేయడం, అక్కడ ఏవేవో పుట్టి చివరన అమృతం పుట్టటం, ఆ అమృతాన్ని దేవతలు పంచుకోవటం ఈ చంపూకావ్యకథాంశం.

ఈ కావ్యంలో దేవదానవులు సముద్రాన్ని మథిస్తుంటే సముద్రం నుండి గొప్ప గొప్ప విశేషాలు బయటపడుతున్నాయి. సముద్రంలో కామధేనువు పుట్టడాన్ని కవి వర్ణించాడు.

ఎక్కడైనా గోవు, గోమాత నుండి పుడుతుంది కానీ సముద్రం నుండీ పుడుతుందా? సాధ్వి అయిన కామధేనువు అలా ఎందుకు పుట్టింది? 

ఎందుకంటే - 
సంస్కృతవ్యాకరణం ప్రకారం గోవునకు పుట్టే దూడ పేరు "గావీ". వ్యాకరణరీత్యా ఇది సమంజసమైనా, మరో విధంగా ఈ "గావీ" అన్న మాట అసాధువు కనుక. "గావీ"  శబ్దం అసాధువు ఎలా అయింది అంటే - మహాభాష్యకారుడు పతంజలి ఒక్కొక్క శబ్దానికి అనేక అపభ్రంశ రూపాలను ఉటంకిస్తూ, గోవు అన్న శబ్దానికి "గావీ, గోణీ, గోతా, గోపోతలికా.."అన్న వివిధ రూపాలను చెప్పాడట. 

అలా గోవు గర్భంలో పుట్టిన మరొక గోవు ("గావీ") అసాధువయింది కనుక, మన కామధేనువు సముద్రంలో పుట్టి సాధ్విగా ఉండాలనుకుని క్షీరసముద్రంలో పుట్టిందట!

ఇలాంటి చమత్కారాలను ఈయన అడుగడుగునా గుప్పిస్తాడు. విజయచంపువు ఆరంభమే ఇలానే మొదలవుతుంది.

వన్దే వాంఛితలాభాయ కర్మ కిం? తన్న కథ్యతే |
కిం దంపతిమితి బ్రూయామ్? ఉతాహో దంపతీ ఇతి ||

ఇష్టకామ్యార్థ సిద్ధికోసం నమస్కరిస్తున్నాను. ఎవరికి? చెప్పలేను. అర్ధనారీశ్వరుడికి అని పుల్లింగంలో చెప్పాలంటే - "దంపతి" కి అని చెప్పాలి. కానీ "దంపతి" అన్న శబ్దం దోషం. దంపతీ అనాలి. (జాయాచ పతిశ్చ దంపతీ - ఇది నిత్యద్వివచన శబ్దం). అలా దంపతీ అని అందామంటే ఉన్నది అద్వైతం. ఒక్కరే. ఒక్కరిని నిత్యద్వివచనశబ్దంతో పిలుస్తే అది తత్వ దోషమవుతుంది కదా!

ఇలాంటివి నీలకంఠుల వారి కావ్యాలలో చాలా కనిపిస్తాయి. ఈ కవి శాంతివిలాసమనే కావ్యం వైరాగ్యాన్ని చాలా అందమైన శబ్దాలలో నిమంత్రించిన కావ్యం. 

అందులో చిన్న ఉటంకింపు ఇది.

నానోపాయైర్దిశి దిశి ధనానార్జయిత్వా వ్యయిత్వా
సమ్యక్ సంపాదితమహో స్థౌల్యమేకం శరీరమ్ |

నానా ఉపాయాలతోటి దిశలన్నీ తిరిగి డబ్బునార్జించీ ఖర్చు చేసీ చివరకు నాకోసం మిగలబెట్టుకున్నదేమంటే - ఇదుగో ఈ స్థూల శరీరం మాత్రమేను! (సాఫ్ట్ వేరోళ్ళూ విన్నారాండీ?)

కలివిడంబనశతకంలో అడుగడుగునా విసుర్లు విసురుతాడు కవి.

ఆ కాలంలో వైద్యులను, జ్యోతిష్కులను భలే ఎండగడతాడు. వైద్యుడు మందు ఎలా ఇచ్చినా రోగికి పథ్యం మాత్రం చాలా కఠినంగా సూచించాలట.ఎందుకంటే - వైద్యం ఫెయిలయితే "ఒరే నీవు పథ్యం సరిగ్గా పాటించలేదు" అని తప్పించుకునే మార్గం అట. 

నీలకంఠ దీక్షిత కవి చాలా గొప్ప కవి, అంతకన్నా గొప్ప పండితుడు, అంతకన్నా విరాగి. అంతకన్నా గొప్ప భక్తుడు. ఈయన కవిత్త్వం నవ్విస్తుంది, అలరిస్తుంది, వైరాగ్యాన్ని కలిగిస్తుంది, తీవ్రమైన భక్తిభావాన్ని రేపుతుంది. ఈయన కవిత్త్వ రీతి కూడా ఇతరకవులకన్నా బహుభిన్నం. సాధారణమైన ఉపమలు, ఉత్ప్రేక్షలూ కాక, దృష్టాంతాలూ, విరోధాభాసలు, భ్రాంతిమదాలంకారాలు ఈ కవి ప్రయోగిస్తాడు. సంస్కృత సాహిత్యంలో బహుగ్రంథకర్తలయిన గొప్ప కవులపరంపరలో ఈ కవి బహుశా చివరి కొద్దిమందిలో ఒకరు. (ఆ వరుసలో విస్మరించదగని మహానుభావులు కావ్యకంఠగణపతి ముని ఉన్నారనుకోండి)