29, జూన్ 2012, శుక్రవారం

పాదచతుష్టయములో దుష్టచతుష్టయము

శంకరాభరణం బ్లాగులో ద్రౌపదీవస్త్రాపహరణం, శ్రీకృష్ణుని ఆర్తరక్షణ ఘట్టానికి నా పద్యము.


సీ ||

రాలె - సితయశము రారాజమకుటశో
            భాయమానోజ్జ్వలితాంశుకమ్ము,
తునిగె నల విపులఘనభుజావేష్టిత
           
శూరత - మార్తాండసుతుని గుణము,

ఈగె నిశ్శేషము రాగకల్మాషయు
            తాక్షదృష్టి శకునిపక్షశక్తి,
వ్రయ్య లవదె నిజభ్రాతప్రబలపరి
            ష్వంగిత్యురుతరదుశ్శాసనురము,
 

గీ ||
కౌరవాదులకుఁ దొడరె కాలవశము,
దమనమాయెనట ధరణి ధర్మ మెల్ల,
నిదురవోయె కొలువునందు నీతి నియతి,
కలియుగమ్మునకును నాంది కలిగె సుమ్ము.


సీసపద్యములో 

మొదటిపాదము లో దుర్యోధనుడు
రెండవపాదము లో కర్ణుడు
మూడవ పాదము లో శకుని
నాలుగవ పాదములో దుశ్శాసనుడు 

ప్రస్తావింపబడినారు. 
 
అంశుకమ్ము = కిరణసముదాయం అని ఒక అర్థం, వస్త్రము అని మరొక విశేషము.
గుణము = అల్లెత్రాడు, శీలము (character) అని అర్థాలు.
అక్షము = పాచిక, కనులు అని రెండు అర్థాలు.
పక్షము = రెక్క, side వైపు అని అర్థాలు.
శకుని = గాంధారరాజు, పక్షి అని అర్థాలు.


శ్లేషలు
౧. మొదటిపాదము - రాలినది ద్రౌపది చీర కాదు, రారాజు కిరీటములో శోభాయమానమైన ఉజ్జ్వలమైన కిరణసమూహము, ధవళకీర్తి అనుట.
౨. రెండవపాదము - తునిగినది. సూర్యపుత్రుని విశాలమైన భుజములలో ఆవరించిన శూరత్వము అను శీలము, శ్లేషార్థంలో ఆతని అల్లెత్రాడు అని.
౩. తొలగినది కుటిలమైన పాచికల ప్రభావము, శ్లేషార్థంలో కుటిలమైన చూపు. శకుని పక్షశక్తి అంటే శకుని బలగం తాలూకు శక్తి, శకుని రెక్కల శక్తి అని రెండు అర్థాలు.


సీసపద్యంలో ప్రతిపాదంలో సంస్కృతసమాసాలకు క్రియ తెలుగులో కూర్చబడినది. (రాలె, తునిగె, ఈగె, వ్రయ్యలు). సంస్కృతసమాసాలు ఇవి.

సితయశము = ధవళకీర్తి
రారాజమకుటశోభాయమానోజ్జ్వలితాంశుకమ్ము = రారాజు కిరీటంలో శోభాయమానమై, ప్రకాశిస్తున్న కిరణసముదాయం.
విపులఘనభుజావేష్టిత
శూరత = విశాలమైన, ఘన భుజములను ఆవరించిన శూరత్వము

రాగకల్మాషయుతాక్షదృష్టి = కుటిలత్వముచే ఎరుపెక్కిన కంటిచూపు

శకునిపక్షశక్తి = శకుని రెక్కల బలము
నిజభ్రాతప్రబలపరిష్వంగిత్యురుతరదుశ్శాసనురము = అన్న చేత గాఢంగా కౌగిలించబడిన శ్రేష్టమైన దుశ్శాసనుని రొమ్ము.



ఈ పద్యానికి ప్రేరణ ఇచ్చిన శంకరయ్య గారికి ప్రణామాలు.



12, జూన్ 2012, మంగళవారం

ఆనందవర్ధనకృతదేవీశతకము - శ్లోకము



చిత్రకావ్యం అంటే అధమ కావ్యమని అలంకారజ్ఞులనేకుల యొక్క అభిప్రాయం. ఈ అభిప్రాయాన్ని తొలిసారి ఖండించిన పండితుడు శ్రీమాన్ అప్పయ్యదీక్షితులు. వీరి ’చిత్రమీమాంస’ గ్రంథంలో చిత్రకావ్యంలో వ్యంగ్యము, అప్రధాన వ్యంగ్యము లేకపోయినా, చారుత్వము లేదని చెప్పడానికి వీల్లేదన్నారు. కాబట్టి చిత్రకావ్యము ’చారు’ కావ్యమే, చిత్రకవిత చారుకవితయే.

అదలా ఉంటే సాక్షాత్తూ ధ్వని సిద్ధాంత కర్త ఆనందవర్ధనుడు ఒక చిత్రకావ్యాన్ని రచించాడు. ఆ కావ్యం పేరు దేవీశతకమ్. అందులో ఒక శ్లోకం, ఆ శ్లోకానికి అనుసరణ - ఈ క్రింద.

సరస్వతి ప్రసాదం మే స్థితిం చిత్తసరస్వతి |
సర స్వతి కురు క్షేత్రకురుక్షేత్రసరస్వతి ||

క్షేత్రకురుక్షేత్రసరస్వతి సరస్వతి = శరీరమనే కురుక్షేత్రమున సరస్వతీ నదివైన ఓ సరస్వతీ
ప్రసాదం సర = ప్రసన్నతను పొందుము
మే చిత్తసరస్వతి = నా యొక్క చిత్తమనే సముద్రంలో
స్థితిమ్ = స్థితిని
స్వతి = బాగుగా
కురు = చేయుము

తెనుగు సేత:

కం||
అరయగ దేహం బనదగు
కురుభువిని వరనది పగిదిఁ గూర్పుమ శమమున్,
కరణపు శరనిధి యందున
సరస్వతి! యునికిఁ బనుపున చక్కగ నిమ్మా!   

వరనది = సరస్వతి నది
కరణపు శరనిధి = చిత్తమనెడు సముద్రము
ఉనికిన్  = స్థితిని
పనుపున = లాభముగా