25, జులై 2014, శుక్రవారం

వీచిక - 3



సంచారిణీ దీపశిఖేవ రాత్రౌ యం యం వ్యతీయాయ పతింవరా సా |
నరేన్ద్ర మార్గాట్ట ఇవ ప్రపేదే వివర్ణభావం స స భూమిపాలః ||

కాళిదాసు రఘువంశం ఆరవసర్గలో ప్రసిద్ధికెక్కిన శ్లోకం ఇది. స్వయంవరంలో దీపశిఖ లాంటి అమ్మాయి - క్రింది బొమ్మలో కేవలం వెలుగు ఉన్న దీపం తాలూకు ఆకారం - ఎదరకు వస్తుంటే రాకుమారుల ముఖాలు ఆ వెలుగులో కాంతివంతమవడం, అమ్మాయి రాకుమారుని వరించకుండా దాటిపోగానే రాకుమారుని ముఖం చీకటిలో కలిసిపోవడమూ (చిన్నబుచ్చుకోవడం) ఎలా ఉందో అలా ఉంది రాకుమారి ఇందుమతి నడక అక్కడ.

ఈ శ్లోకం నుండీ కాళిదాసుకు దీపశిఖాకాళిదాసు అన్న పేరు వచ్చిందని ఐతిహ్యం. చక్కని శ్లోకం చెబితే ఆ శ్లోకాన్ని కవికి బిరుదుగా తగిలించడం సంస్కృతంలో సకృత్తుగా కనబడుతుంది. దీపశిఖాకాళిదాసు, ఘంటామాఘుడు, ఆతపత్రభారవి, రత్నఖేటదీక్షితులు, వక్షఃస్థలాచార్యులు....ఇలా.  తెలుగులో మాత్రం - ఆలోచిస్తే - ఒక్క ముక్కుతిమ్మన మాత్రం కనబడుతున్నాడు, ముక్కు గురించిన పద్యం ఆయనది కాకపోయినా.నిజానికి ఆ ముక్కు పద్యం కూడా సంస్కృతం నుండీ దిగుమతి అయినది.

ఇందుమతి - చంద్రుని వంటి దీపశిఖ - సూర్యవంశజుడైన అజుడిని వరించింది. అజుడు - న జాయతే ఇతి అజః - జన్మ లేని వాడు అని వ్యుత్పత్తి. బ్రహ్మదేవునికి గల పేరు అది. అలాగే సంస్కృతంలో మేకకు కూడా అజః అని పేరు. (ఎందుకో తెలియదు).

************************

సంస్కృతాధ్యయనంలో ఒక పద్ధతి ఉంది. ముందుగా బాలరామాయణం, అమరం, శబ్దాలు, ఇలా ఆరంభించి రఘువంశం మొదటి సర్గ, కుమారసంభవం ఆపై కిరాతార్జునీయం ఇంకా కాస్త ముందుకు వెళితే నైషధం ...ఈ వరసలో వెళుతుంది. అయితే ఈ అధ్యయనంలో రఘువంశంలో అన్ని సర్గలూ చదవరు విద్యార్థులు. మూడు లేదా నాలుగు సర్గలను, అన్వయసహితంగా సాధిస్తూ వెళ్ళడం పద్ధతి.

సంస్కృతంలో అభినివేశం వచ్చిన తర్వాత ఎవరి రుచి మేరకు వారు మాఘమో, రఘువంశంలో మిగిలిన సర్గలో, ఇతర కావ్యాలో వ్యాఖ్యానసహితంగా చదువుకుంటారు.

ఈ పద్ధతిని శ్రీపాద వారు తమ జీవిత చరిత్ర - అనుభవాలు జ్ఞాపకాలులో చక్కగా వివరిస్తారు. అలా వివరిస్తూ రఘువంశంలో అష్టమసర్గ అజవిలాపం గురించి ప్రస్తావించారొకచోట.

************************

ఆ అష్టమ సర్గలోని ఉదంతం ఇదీ -

అజుడు, ఇందుమతీ దేవి దంపతులకు దశరథుడు అనే కొడుకు పుట్టాడు. (దశపూర్వరథుడని కాళిదాసు ప్రయోగం). ఆ తర్వాత ఒకనాడు అజుడు, ఇందుమతీదేవీ కలిసి ఉద్యానవనంలో విహరిస్తున్నారు. అదే సమయంలో నారదుడు గోకర్ణక్షేత్రంలో ఈశ్వరునికై వీణోపాసన చేయడానికి ఆకాశమార్గాన వెళుతున్నాడు. నారదుని వీణ చివరన అలంకరించి ఉన్న దేవలోకానికి చెందిన కుసుమాలతో అల్లిన మాలిక - గాలి ఉద్ధృతం వల్ల ఎగిరి నేలపై వచ్చి సరిగ్గా ఇందుమతీ దేవి స్తనములపై పడింది.

ఆ అదటుకు ఉలిక్కిపడి ఆమె కనులు నిమీలించి గతప్రాణయై నేలపై పడింది! రాహువు చంద్రుని యొక్క వెన్నెలను అపహరించినట్టు (గ్రహణ సమయంలో మెలమెల్లగా వెన్నెల తగ్గిపోయినట్టు) ఆమె కనులు అలా నిమీలితం గావించింది.

ఆమె శరీరం క్రిందకు పడుతున్న విధాన్ని కాళిదాసు వర్ణిస్తాడు -

వపుషా కరణోజ్ఝితేన సాి నిపతంతీ పతిమప్యపాతయత్ |
నను తైలనిషేకబిందునా సహ తైలార్చిరుపైతి మేదినీమ్ ||

ఇంద్రియవివర్జితమైన శరీరముతో ఆమె నేలపై పడుతూ అజుని కూడా పడవేసింది. దీపజ్వాల నేలపై జారేప్పుడు తైలబిందువుతో సహా జారుతుంది కదా!

మొదట స్వయంవరంలో ఇందుమతిని దీపశిఖగా వర్ణించిన కాళిదాసు విగతజీవి అయిన ఇందుమతీదేవినీ దీపార్చిగా వర్ణిస్తున్నాడు. అజుని తైలబిందువుగా ఉద్యోతించాడు. అంటే ఏ తైలబిందువు చేత అయితే దీపజ్వాల వెలుగులీనిందో, అదే తైలబిందువులో చివరికి ఆమె లీనం అయిపోయిందన్న మాట! కాళిదాసుకు మాత్రమే సాధ్యమైన ఒక అద్భుతమైన భావం ఇది.

దీపం అలా వెళ్ళిపోయింది. తైలం మాత్రం మిగిలిపోయింది శుష్కంగా. అజుని విలాపం కరుణరసార్ద్రంగా ఉంటుంది ఈ ఘట్టంలో. కరుణ, విప్రలంభశృంగారం పరస్పరం పోషకరసాలయినా, ఆ రెండు రసాలనూ పరస్పరం దోహదకారులుగా ఎంత చక్కగా మలచవచ్చుననడానికి ఈ ఘట్టం చక్కని చిక్కని ఉదాహరణ.

అజుని దుఃఖం నుండీ మరల్చడానికి కులగురువు వశిష్టుడు ఇందుమతి వృత్తాంతం తెలుపుతాడు.

పూర్వం తృణబిందువు అనే మహర్షి తపస్సు చేస్తుంటే ఇంద్రునికి యథావిధిగా భయంపుట్టి హరిణి అనే అప్సరను పంపుతాడు. ఆమె తన విలాసాలతో మహర్షి మనసును మరల్చడానికి ప్రయత్నించింది. మహర్షి కోపంతో భూమిపై జన్మించమని ఆమెను శపించాడు. అటుపై ఆ అప్సర - తను కేవలం ఇంద్రుని ఆజ్ఞను నెరవేర్చడానికి అలా చేశానని చెప్పుకుంటే కరుణించి ఆ మహర్షి శాపవిమోచనం అనుగ్రహించాడు. ఏ రోజైతే దేవలోకానికి చెందిన పుష్పమాల ఆమెపై పడుతుందో ఆ రోజు ఆమె భూమిని వీడి అచ్చరగా దేవలోకానికి మరలిపోతుంది.

అలా శాపగ్రస్త అయిన హరిణి భూమిపై విదర్భరాకుమారిగా పుట్టి అజునికి భార్య అయింది. శాపం తొలగి స్వర్గానికి వెళ్ళింది.

అజుడు కూడా తనయుడు దశరథుడు యుక్తవయస్కుడు అవగానే ఆతనికి పట్టాభిషేకం చేసి ప్రాయోపవేశం ద్వారా తనువును చాలించి స్వర్గాన్ని, స్వర్గవాసి అయిన హరిణినీ చేరుకున్నాడు.

************************

అజవిలాపం అన్న ఈ ఘట్టం విక్రమోర్వశీయంలోని నాల్గవ అంకాన్ని పోలి ఉంటుంది. అయితే ఇక్కడ, కరుణ విప్రలంభమూ కలిసి ఉండడం ప్రత్యేకం. విప్రలంభం ఎందుకంటే - చివర్న అజుడూ స్వర్గ వాసి గా హరిణిని తిరిగి చేరుకున్నాడు కాబట్టి. ఈ ఘట్టం - వ్యాఖ్యాన సహితంగా, శాస్త్రార్థ విశేషాలతో, ఆలంకారిక విశేషాల వివరణతో, కావ్యానుశీలన ద్వారా సంపాదించుకున్న చిక్కటి సహృదయత తోనూ తెలుసుకోవలసిన ఘట్టం.

19, జులై 2014, శనివారం

వీచిక - 2


దోహదక్రియ.


హైటెక్ సిటీ రహేజా వారి కాంపస్ లో ప్రధానద్వారానికి కుడి వైపు బాట పక్కన చక్కని పూలచెట్లు కూర్చారు.పొద్దున లేయెండలో రోడ్డుపై హడావుడి పడుతున్న వాహనాల ప్రక్కన అనాయాసంగా చెట్టు నుండి రాలిన ఒక తెల్లటి పూవును తీసుకోవడం, జేబులో పెట్టుకోవడమో లేక ఎవరూ తొక్కకుండా పక్కన చెట్టు దగ్గర విడిచిపెట్టడమో చేయటం ఎంత ఆనందకరమైన పని!

నిన్నటి వరకూ ఆ తెల్లని పూవు పేరు తెలియదు. అది అశోక పుష్పజాతికి చెందినదట. అశోకపుష్పాలు సాధారణంగా ఆరంజ్ రంగులో ఉంటాయని గూగులు. దీన్నే రక్తాశోకమంటారుట. రామాయణంలో రావణుడు సీతమ్మను ఎత్తుకొచ్చి పెట్టిన చోటు అశోక వనం - ఈ ఆరంజ్ రంగు పూలతో నిండిన చెట్లదేనట. అయితే నేను రోజూ చూస్తున్న తెల్లటి పూల చెట్టు అశోక జాతిదని ఒక పాతభారతి సంచిక తిరగేస్తుంటే కనిపించింది.

నిజానికి అశోకచెట్టు అంటే క్రిస్మస్ చెట్టు లా పొడుగ్గా పెరిగిన చెట్టని చిన్నప్పటి నుంచి వింటూ వస్తున్న విషయం. బడిలో సంస్కృతం చదువుకుంటున్న రోజుల్లో అయ్యవారు కూడా ఓ మారు అశోకచెట్టును చూపి ఒక ఆశ్చర్యమైన విషయం చెప్పినట్టు చూచాయగా తెలుసు. ఆయన చూపిన అశోకచెట్టు (Polyalthia longifolia) తప్పు. అయితే అయ్యవారు చెప్పిన ఉదంతం తాలూకు శ్లోకం ఇది.

పాదాహతః ప్రమదయా వికసత్యశోకః
శోకం జహాతి వకుళో ముఖసీధుసిక్తః |
ఆలోకితః కురవకః కురుతే వికాసం
ఆలోడితస్తిలక ఉత్కలికో విభాతి ||

అశోకచెట్టు పూలు బాగా పూయాలంటే ఒక తరుణయువతి గోరింటాకు/పారాణి పెట్టుకున్న తన పాదాన్ని ఆ చెట్టును తాకించాలి. అలాగే పొగడపూవు - అమ్మాయి చెబుతున్న ఊసులు వింటే తన శోకాన్ని విడిచి వికసిస్తుంది. కురవకమేమో రోజూ అమ్మాయి తనను చూస్తే చాలు, పొంగిపోతుంది. కుంకుమపూవును కావిలించుకుంటే పులకిస్తుంది!

పై వరుసలో మా అయ్యవారు స్కూల్లో చెప్పింది ఒక్క అశోకాన్ని గురించే. అదీనూ అర్థం మాత్రమే గుర్తుంది. పూలు పూయటానికి అమ్మాయి చేసే చర్యలను దోహదక్రియ అంటారు. (దోహదమంటే ఎరువు). కర్పూరమంజరి అనే ప్రాకృతనాటకంలో నాయిక ఈ దోహదక్రియలను జరుపుతుంది. తరుణదశలో ఉన్న పూల కొమ్మ అమ్మాయి గాఢంగా కౌగిలింపగానే పూలతో నిండి, మదనశరంలా వికసించిందని ఉత్ప్రేక్షిస్తాడు ప్రాకృత కవి.


బాలోऽపి కురబకస్తరుస్తరుణ్యా గాఢముపగూఢః |
సహసేతి పుష్పనికరం మదనశరమివ సముద్గిరతి || (కర్పూరమంజరి - రెండవ జవనికాంతరమ్)

బాల అయినా, ఆ కురవక తరువు, అమ్మాయి చేత గాఢంగా కౌగిలింపబడినదై, వేల పూలు విప్పారి, మదనశరంలా తీక్షణమైనది.

***************************************************

కాళిదాసు రఘువంశంలో ఒక శ్లోకం ఇదీ.

స్మరతేవ సశబ్దనూపురం చరణానుగ్రహమస్య దుర్లభమ్ |
అమునా కుసుమాశ్రువర్షిణా త్వమశోకేన సుగాత్రి శోచ్యసే ||

అజమహారాజు భార్య ఇందుమతీదేవి మరణించినప్పుడు ఆతని మనోవేదన ఇది. - "ఓ సుతను! నీ అందెలరవళులతో కూడిన పాదాల అనుగ్రహం ఇక దొరకదు అని చింతిస్తూ అశోకపుష్పాలు నీ మృతదేహంపై పూలవర్షాన్ని తమ కన్నీరులా కురిపిస్తున్నాయి."

ఘుప్పుమని తాకుతోంది కదూ ఈ భావం! బహుశా కాళిదాసు ఒక్కడే ఇంత చక్కని శబ్దాలతో, ఇంత అందమైన భావాన్ని ఇంత క్లుప్తంగా వ్రాయగలడేమో! అమ్మాయిలకీ, పూలతీవెలకూ మధ్య కెమిస్ట్రీ కూడా కాళిదాసుకు బాగా తెలుసేమో. అందుకనే విక్రమోర్వశీయంలో ఊర్వశిని తీవెలా అయిపోమని, తిరిగి పురూరవసుడు కావిలించుకుంటే అమ్మాయి కమ్మని తీయని శాపాన్ని సృష్టించాడు!

అశోకం అని పేరెట్టుకున్న ఈ పూవు శోకసందర్భాల్లోనే ఎక్కువగా కనబడ్డం ఓ విచిత్రం!

*********************************

మన ధవళ అశోకానికి వద్దాం.

ఈ పూలు మా ఆఫీసు దగ్గర, వచ్చే దారిలోనూ చాలా ఉన్నాయి. పూలపైనా, ప్రకృతిపైనా చూపే లేని ఈ రోజుల్లో, దారిన పోయే అందమైన అమ్మాయిల్లో యే అమ్మాయీ ఈ అశోకాన్ని పట్టించుకునేట్టు లేదు. మనం చాలా ఆధునికులం. చెట్టుకు ఆహారం సూర్యరశ్మి, నీరు అని, వాటిని కలగలిపి కిరణజన్యసంయోగక్రియ ద్వారా పత్రహరితం తయారు చేసుకుంటాయని అని తార్కికంగా ఆలోచించి యే టీవీ షో లోనో చెప్పగలం.

కానీ అమ్మాయి పాదం తాకితేనో, చూపు చూస్తేనో, పలకరిస్తేనో, చిర్నవ్వితేనో పూలు వికసించడమంటే ఒప్పుకోవడమూ, నమ్మడమూనా ! షిట్!

*********************************