26, జనవరి 2019, శనివారం

విద్యానగర విహారం

అనుకోకుండా లైఫ్ లో కొన్ని అవకాశాలు వస్తుంటాయి. అలాంటిదే హఠాత్తుగా ఓ పొద్దున తగిలిన హంపి జర్నీ. (జూలై 2016) మా ఆవిడ కొలీగ్ కారు అనుకోకుండా దొరికింది. డ్రైవరూనూ. ఓ గంటలో అంతా అయిపోయింది. మా వూరి నుంచి బళ్ళారి 100 కి.మీ. అక్కడ నుంచి హంపి 60 కి. మీ.  అయితే దరిద్రమైన రోడ్డు! ఆహ్లాదకరమైన వాతావరణం.

ఆషాఢస్య ప్రథమ దివసే..... ఆషాఢం మొదట్రోజు పడమర సూర్యాస్తమయాన మేఘాలు కమ్ముకుంటే ఆ యేడాది వర్షాలు విరివిగా పడతాయట! ఆ రోజంతా అలానే వుంది. బళ్ళారి దాటాక, సండూరు కొండల దగ్గర మరీ అద్భుతంగా వుంది. తెనాలి రామకృష్ణ పండితుడు వర్ణించిన స్వామిమల నే సండూరు అంటారు. ఇక్కడ ప్రముఖమైన కుమారస్వామి దేవాలయం ఉంది.

1.

హంపి! ఓ జీవిత కాలపు అనుభవం. రాయలసీమకు నీళ్ళు దొరికి సస్యశ్యామలమైతే అచ్చం హంపి కి ఛాయలా వుంటుంది. అలా ఒకప్పుడు వుండేది కూడా. ఎందుకంటారూ? నేటి పెనుగొండ - నాడు విజయనగరరాజుల రెండవ (చలువ) రాజధాని. రాయలవారి దండ నాయకులు పెమ్మసాని వారు. వారిది తాడిపత్రి. (పెమ్మసాని వారి దేవాలయాలు తాడిపత్రిలో నేటికీ ఉన్నాయి. ఈ దేవాలయాల వల్ల తాడిపత్రిని రెండవ హంపి అంటారు) వారి వద్దకూ విజయనగర రాజుల రాకపోకలు ఉండేవి. ప్రబంధకావ్యాల్లో వర్ణనల్లో ఎక్కువభాగం పరిసరాలు సీమవి.

ఎక్కడ చూచినా కొండలు, గుట్టలు, బండరాలూ, అక్కడక్కడా చెరువులూ, అరటి తోటలూ, విపరీతమైన చారిత్రక ప్రశస్తి, చిలక్కొట్టిన జాంపండు లాంటి భాష, కొంత కొట్టినట్టుండే మాటతీరు. నేలబారు మనుషులు, ముక్కు పగిలినా ముందుకే పోయే సూటి మనస్తత్వాలు. ఇవి రాయలసీమ స్వభావాలు. నాటికీ నేటికీ.

హంపి! ఓ రోజులో చూసిన హంపిని, నా అక్షరాల్లో వ్రాసిన కథనం యిది.

ఆ కనిపించేది మాతంగిబెట్ట. మాతంగపర్వతము. అంజనాద్రి అనీ అంటారు. ఆంజనేయుని జన్మస్థలంగా ప్రసిద్ధి. ( అంజనాద్రి పేరిట తిరుపతి కొండల్లో కూడా ఒకటి ఉన్నది. మన దేవుళ్ళకు అనేక జన్మ స్థలాలు ఉండడం సాధారణమే) ఆ పైన్నుంచీ హంపి విహంగవీక్షణం చేయవచ్చు. బాలాంజనేయుడు అక్కడనుండీ సూర్యుని చూచి "పండు" అనుకున్నాడు. అందులో అతిశయోక్తి లేదు. ఆ కొండపై నుంచి సూర్యోదయం చూడటానికి ఎందరో యాత్రికులు వెళతారు. లోఫర్క్స్ అనే పాశ్చాత్యుడు "అంత అద్భుత దృశ్యం భారతదేశంలో మరోచోట లే"దన్నాడట.


కొండ క్రింది వీథి సూళెయబజారు. (కన్నడలో సూళె అంటే వేశ్య) ఇక్కడే కృష్ణ రాయలవారు పట్టం కట్టుకోక మునుపు చిన్నాదేవిని చూశారు. కలిశారు. తాను రాజైతే రాణిని చేస్తానని బాసలు చేశారు. అన్నంతపనీ చేశారు. ధూర్జటి ఈ వీథులలో తిరిగేవాడన్న కథలు మనకు తెలుసు. తెనాలి వాని పాండురంగమహత్మ్యంలో కాశీ వేశ్యావాటిక ఇక్కడిదే. రాయల ఆముక్తమాల్యద వర్ణనా ఇక్కడిదే. మనుచరిత్ర సరే సరి. పెద్దన వారి "అరుణాస్పద" పురము ఇక్కడ పుట్టిందే. 

"అచటి వెలయాండ్రు రంభాదులైన నరయ కాసెకొంగున వారించి కడపగలరు నాట్యరేఖా కళా ధురంధర నిరూఢి" 

ఇది మంగళవారం ఓపెన్ అయేదట. నాటి విద్యానగరపు 7 బజార్లలో ఇది వకటి. దూరాన కనిపంచే గోపురం అచ్యుతరాయని గుడి. ఇది తిరువేంగళనాథుని గుడైనా ఈ పేరు మీదే వ్యవహారం. ఇప్పుడు శిథిలమయింది. దీనిని కృష్ణరాయల తర్వాతి రాజు అచ్యుతరాయలు కట్టించాడు. ఆ కట్టడాలు మాటేమైనా, నాటి వైభవం నశించినా, నేడూ యిది ఆహ్లాదకరమైన వీథి. విపరీతంగా సీతాకోకచిలుకలు. బహుశా నాటి ముదితలే నేటి సీతాకోకచిలుకలుగా జన్మించారా! తుంగభద్ర కనిపించదు కానీ, ఇక్కడికి కూతవేటు దూరం.

ఋష్యముఖము, గంధమాదనము, మాతంగము, మాల్యవంతము, హేమకూటము - ఈ పర్వతాలు ఉన్న ప్రదేశం రామాయణంలోని కిష్కింధ. ఇదే నేటి హంపి. ఇందులో ఋష్యమూక పర్వతం పై సప్తర్షులు తపస్సు చేశారు. ఇది హంపి ఉన్న తుంగభద్రకు ఆవలి వడ్డున కనిపిస్తుంది. దీని పేరు ఆనెగొంది. వాలి ఈ పర్వతంపైన అడుగుపెడితే తలపగిలి ఛస్తాడని శాపం ఉండడంతో సుగ్రీవుడు ఇక్కడ నివాసం ఏర్పరుచుకున్నాడని రామాయణకథ. ఇక్కడే రాముడు మొదటిసారి హనుమంతుని కలుసుకున్నాడట. ఈ ఋష్యముఖానికి ఆనుకుని ప్రవహించే తుంగభద్రకు చక్రతీర్థమని పేరు. వర్షాకాలంలో సుళ్ళు తిరుగుతూ, విపరీతమైన వేగంతో ప్రవహిస్తుంది. వందల యేళ్ళుగా నీళ్ళు పారి, అక్కడ శిలలన్నీ నున్నగా మారి పోవడం కనిపిస్తుంది. ఈ చక్రతీర్థం దగ్గర నది రెండుగా వీడి గంధమాదనపర్వతం చుట్టూతా ప్రవహిస్తూంది. ఇటువైపు ప్రదేశం మహా రమణీయంగా ఉంటుంది. ఆ మర్రిచెట్టు క్రింద వీచే గాలి, ఆ ఆకుల గలగల - అనిర్వచనీయం. ఈ ప్రదేశాన్ని, ఇక్కడి ప్రశాంతతను, ఆ మర్రిచెట్టునూ వర్ణించటానికి శబ్దాలు చాలవు.




తెనాలి రామకృష్ణుడు తుంగభద్రను ఎన్నిసార్లు చూచి పరవశించిపోయాడో పాపం! ఆ నది ఆయన మనోకుహరాల్లోనూ ప్రవహిస్తూ ఉంటుంది కాబోలు!

శా||
గంగాసంగమమిచ్ఛగించునె మదిన్ గావేరి దేవేరిగా
నంగీకారమొనర్చునే యమునతో నానందమున్ బొందునే !
రంగత్తుంగతరంగహస్తముల నా రత్నాకరేంద్రుండు నీ
యంగంబంటి సుఖించునేని గుణభద్రా! తుంగభద్రానదీ! 

(పాండురంగమహత్మ్యం 1-139)

ఓ గుణభద్రా, తుంగభద్రా! సముద్రుడు గంగను, కావేరిని, యమునను పట్టించుకుంటాడా, నీ ఎత్తైన అలలతో కూడిన చేతులను అందుకోగలిగితే?

ఇక్కడ జనం కూడా ఎవరూ రారు, దాదాపుగా. హంపిలో చాలా పాత దేవాలయాల్లో ఒకటైన కోదండరామాలయం ఇక్కడ ఉంది. సీతారామలక్ష్మణుల నిలువెత్తు విగ్రహాలతో బాటు సుగ్రీవుని విగ్రహం (హనుమంతుడు కాదు, సుగ్రీవుడు!) ఒకే శిలపై ఉంటుంది. వెనుక యంత్రోద్దారక హనుమంతుని దేవాలయం ఉన్నది. ఇక్కడికి చేరుకోవాలంటే ఇంతకు ముందు చూపిన అచ్యుతరాయకోవెల నుంచి ఎడమవైపుకు రావాలి.

అదృష్టవశాత్తూ ఆ పొద్దున పూట సన్నగా వర్షంపడుతున్న సమయాన మేం ఇక్కడికి వచ్చాం. కనిపిస్తున్నది నిజానికి గుహ కాదు.  రాళ్ళను తొలిచి ఏర్పరిచిన మార్గం. ఈ దారిని కంపరాయలు ఏర్పరచాడట.




వెనుక కనిపిస్తున్నది కోదండరామాలయం, యంత్రోద్దారక హనుమంతుని దేవాలయం. వ్యాసరాయలవారు ధ్యానం చేసుకుంటుంటే కోతులు దాడి చేశాయట. అప్పుడాయన ఓ యంత్రంలో హనుమంతుని బంధించి ప్రతిష్ఠించాడని ఇక్కడ కథ. అక్కడి విగ్రహమూ అలానే ఉంటుంది. హంపి...కాదు కాదు, అసలు భారతదేశంలోని రమణీయమైన స్థలాల్లో ఇది ఒకటి.

నేటి హంపి పట్టణం పేరు ఒకప్పుడు విద్యానగరం. హొస్పేటకు వెళుతూ యెడమవైపుకు తిరిగి లోపలకు వస్తే కామలాపురం, ఆపై హంపి వస్తాయి. కామలాపురం నుండి హంపికి వెళుతూ ఎడమవైపుకు తిరిగితే, ఆ రోడ్డు కంప్లి (కాంపిల్యనగరం) కి దారితీస్తుంది. ఆ దారిలో మొదట కనిపించేది గాణిగిత్తి అనే జైన దేవాలయం. దీనిని హరిహర రాయల వారు కట్టించినారు. ఆ తర్వాత అదే దారిన కొంతదూరాన వచ్చేది మాల్యవంత పర్వతశ్రేణి. అక్కడ ఓ గుట్ట ప్రస్రవణగిరి. ఆ కొండపైన కట్టిన రఘునాథాలయం ఉంది. హంపి దగ్గర దేవాలయాల్లో ఇప్పటికీ పూజలు నడుస్తున్న వాటిలో ఇది ఒకటి. ఈ ప్రస్రవణగిరి వర్ణన - రామాయణం కిష్కింధాకాండలో ఇలా ఉంది.

ఋక్షవానరగోపుచ్ఛైర్మార్జారైశ్చ నిషేవితామ్
మేఘరాతినిభం శైలం నిత్యం శుచిజలాశ్రయామ్ ||
... ..
తస్య శైలస్య శిఖరే మహతీమాయతాం గుహామ్ |
ప్రత్యగృహ్ణత వాసార్థం రామస్సౌమిత్రిణాసహ ||
.... ....
ఇయం చ నళినీ రమ్యా ఫుల్లపంకజ మండితా |
నాతిదూరే గుహాయానౌ భవిష్యతి నృపాత్మజ ||

ఆ ప్రస్రవణగిరిపైన ఎలుగు బంట్లూ, కోతులూ, కొండముచ్చులూ, పిల్లులూ ఉన్నాయి. (గోపుచ్ఛములు అంటే నల్లమూతి కోతులు. వీటిని కొందముచ్చులు అంటారు. ఇవి ఆకారంలో ఎర్రమూతి కోతులకంటే పెద్దవి.) మేఘాల్లాగా నల్లటి రాలు ఆ కొండంతటా నిండినై. ఆ కొండల నడుమ గుహలో వర్షాకాలం నాలుగు నెలలు సౌమిత్రితో సహా రాముడు నివాసమున్నాడు. ’లక్ష్మణా....ఇదుగో మనగుహకు కొంతదూరంలో వికసించిన తామరపూలతో అలంకారం చేసుకున్న చెఱువుంది....

ఈ వర్ణన ఇంకా విస్తారంగా ఉంది. వాల్మీకి రామాయణం కిష్కింధకాండలో 27 వ సర్గ చదువుకోవచ్చు. సీతను ఎడబాసిన రాముడు ఆమెను వెతుకుతూ, పరితపిస్తూ ఇక్కడకు వచ్చాడు. సుగ్రీవునితో మైత్రి చేసి, ఆపై సుగ్రీవుణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చేసి రాముడు, లక్ష్మణునితో సహా నాలుగునెలలు ఇక్కడే, ఈ ప్రస్రవణగిరిపైనే గడిపేడు. ఆశ్చర్యంగా, వేలాది యేళ్ళ మునుపు వాల్మీకి వర్ణించిన విధంగానే ఇక్కడి పరిసరాలు ఉన్నాయి.

ఋక్షములు - వాల్మీకి వర్ణించినట్టుగానే ఇక్కడ ఎలుగు బంట్లు ఎక్కువ. ఈ ప్రస్రవణగిరికి చాలా దగ్గర్లోనే "దరోజి బేర్ సాంక్చువరీ" ఉండడం గమనార్హం. ఇక కోతులు, కొండముచ్చులు, మేఘం వంటి రాలతో ప్రకాశించే గుట్టలు, బాగా గాలి వచ్చే గుహ....ఇవన్నీ సరేసరి. కామలాపురం చెరువు కూడా ఇక్కడికి దగ్గరే. (~2 కి.మీ) ఇందులో కమలాలు బాగా ఉండటం మూలాన ఈ చెఱువు గట్టున ఊరికి కామలాపురం అన్న పేరొచ్చింది.(వాల్మీకి ఆ చెఱువునే చెప్పాడా?) ఆ చెఱువులో కమలాలతో విజయనగర రాజులు విరూపాక్షస్వామికి నిత్యపూజలు చేసేవారట!

ఆ ప్రస్రవణ గిరి (గుట్ట)పైన అందమైన దేవాలయం ఉంది. దీని పేరు రఘునాథాలయం. ఆ పక్కన హనుమంతుని దేవళమూ ఉంది. ఇక్కడ శిల్పకళ అద్భుతంగా ఉంటుంది.

ఆ రోజు మంగళవారం. మధ్యాహ్నం దాదాపు ఒంటిగంట. ఆకలితో నకనకలాడుతూ మేం ఇక్కడికి చేరేం. కారులో ఇంటినుంచి తెచ్చుకున్న పులిహోర, దద్దోజనాలు, నీళ్ళు ఉన్నాయి. ఈ కొండపైన భోజనాలు కానిచ్చాము. గాలి తాకిడికి అరిటాకులను పట్టుకోవటం చాలా ఇబ్బంది అయినది. చేతిలోంచి జారిన అరిటాకు పట్టుకోబోయేంతలో ఎగిరి కనుమరుగయేంత దూరానికి ఎగిరిపోయింది. అంత తీవ్రమైన గాలి!





ఆ కాసేపూ దగ్గర్లో నెమళ్ళ అరుపులు. మనోహరంగా ఉంది ప్రకృతి. విపరీతమైన గాలి. రఘునాథాలాయంలో పూజలు జరుగుతున్నాయి. ఈ ఆలయ ప్రాంగణాన రాముడు, లక్ష్మణుడూ బాణాలతో కొడితే ఊటలు ఉబికాయని రెండు బావులు ఉన్నాయి. హనుమంతుని మందిరం ఉంది. ఆ మందిరపు పూజారిది మధ్యప్రదేశ్ అట. చాలా ఆత్మీయంగా పలుకరించాడు హిందీలో. అక్కడే ఉంటాడట.

రఘునాథాలయం పదహారవ శతాబ్దంలో కట్టించారని అక్కడ రాశారు. అయితే దీనికి ఆరుద్ర అడ్డుపడుతున్నారు. ప్రోలుగంటి తిప్పయ - హంపిని పాలించిన సంగమవంశానికి చెందిన రెండవ దేవరాయలకు (క్రీ.శ 1422-1446) దండనాథుడు. ఈయన విరూపాక్షస్వామి దేవాలయగోపురాన్ని కట్టించాడు. ఈ తిప్పయ్యే మాల్యవంతరఘునాథునికి కిరీటం చేయించాడని, ఈయన మనమడు చెన్నప్ప - తెలుగులో మొదటి యక్షగానకర్త అని ఆరుద్ర సమగ్రాంధ్రసాహిత్యంలో చెబుతున్నాడు. (అయితే నేడు మనకు కనిపించే విరూపాక్షగోపురం తిప్పయ గారిది కాదని, 17 వ శతాబ్దంలో బిష్టప్ప గారు శిథిలగోపురాన్ని పునరుద్ధరించారని స్పష్టమైన ఆధారాలతో ఈ మధ్యన మరొక చారిత్రకులు చెబుతున్నారు.)

2.

విజయవిట్ఠల దేవాలయం.

నేటి హాడుపట్టణ లోని పలు ప్రదేశాల్లో అత్యంత ప్రాముఖ్యమైనది విజయవిట్ఠల దేవాలయం. ఈ ఒక్క దేవాలయం మీద ఒక్క పెద్ద పుస్తకం వ్రాయవచ్చు. కవులైతే ఓ కావ్యం వ్రాయవచ్చు. మనసున్న మనిషైతే కూడా చాలు. ఆ ప్రాభవానికి పట్టిన గతి చూసి వేదనతో కన్నీటిచుక్క విడవచ్చు. మనుషులు సరే, దుర్మార్గులు. సంగీతం వినిపించే రాళ్ళు, మంటపాలు ఏం చేశాయో అర్థం కాదు. ముష్కరులు వాటిని కొట్టిపారేశారు. జీర్ణించుకోలేని విషయాలు ఇవి.

ఈ గుడికి రెండు దార్లు ఉన్నాయి. హంపి బస్టాండ్ దగ్గరున్న విరూపాక్ష స్వామి గుడి ఎదురుగుండా నడుచుకుంటూ వచ్చి, అచ్యుతరాయ దేవాలయం, వరాహ దేవాలయం చూసి అలాగే వస్తే, విజయవిట్ఠల దేవాలయపు వెనుక భాగానికి (పశ్చిమానికి) రావచ్చు. ఇది నడక దారి. లేదా ’తలారిగట్ట’ అనే విద్యానగరప్రాకారపు ఎంట్రన్స్ గేటు నుంచి వస్తే విజయ విట్ఠలాలయం బోర్డు కనిపిస్తుంది. అక్కడి నుంచి బ్యాటరీ వెహికిల్ లో రావచ్చు. (ఈ గుడి గోపురం, లోపలి మంటపాలు శిథిలావస్థలో పరమదయనీయంగా ఉన్నాయి. అందుకే ఇక్కడికి కార్లను అనుమతించట్లేదు). ఈ దేవాలయంలో పూజలు లేవు. విట్ఠలాలయం ధ్వజస్థంభం విరిగి దేవాలయం ముందుభాగాన దిక్కులేకుండా పడి ఉంది. (క్రింది ఫోటో)


విజయనగరపు రాజులలో కృష్ణదేవరాయల కీర్తి ముందు అంతకు మునుపు రాజుల కీర్తి చిన్నబోయింది (సచిన్ ముందు గవాస్కరు కపిల్ లాగా), కానీ అంతకు ముందు గొప్ప రాజులున్నారు. వారిలో రెండవ దేవరాయల వారు ఒకరు. ఆయనే విజయవిట్ఠల దేవాలయాన్ని కట్టించాడు. (విరూపాక్షగోపురాన్ని కట్టించింది, మాల్యవంతరఘునాథునికి కిరీటం చేయించిందీ ఈయన హయాం లోనే) అయితే లోపల మంటపాలను, రెండు గోపురాలనూ కృష్ణరాయలు నిర్మించాడు. మంటపాలు ఐదు. ౧. ముఖమంటపం ౨. సభామంటపం ౩. అర్చా మంటపం ౪. కల్యాణమంటపం ౫. ఉత్సవమంటపం

రాతిరథం కూడా ఇక్కడిదే. దీనిని ఏకశిలరథం అంటారు కానీ, ఈ రథం అంతా ఒకే రాయితో మలచింది కాదు. 24 భాగాలు విడివిడిగా శిల్పాలుగా చెక్కి అతికించినది. ఇటువంటి రథాలు కోణార్క్, మహాబలిపురం లలో ఉన్నాయి. (అవి ఏకశిలరథాలు. అక్కడి చక్రాలు కూడా ఎక్కువ). తాడిపత్రిలోనూ ఓ రాతిరథం ఉంది. ఇది హంపికి నమూనా.



ఏకశిల అయినా కాకపోయినా, ఈ రథం మాత్రం విజయనగరప్రాభవానికి మణిమకుటం. ఈ రాతిరథపు నాలుగు చక్రాలలో ఒక్క చక్రం మాత్రం జోరుగా తిరిగేదట. దానిని పూజాసమయాలలో మాత్రం తిప్పే వారట. సరిగ్గా ఇలాంటి రథం చెక్కతో కూడా ఒకటి ఉండేదట. దానిని ఉత్సవాల సమయంలో వాడేవారట. ఈ రథం వెనకల ఐదు పీఠాలు కనిపిస్తాయి. ధ్వజస్థంభపీఠం, నవగ్రహపీఠం, పద్మపీఠం, బలిపీఠం (మరొకటి తెలియదు). సరిగ్గా ఇలాంటివే ఐదు పీఠాలు విరూపాక్షాలయంలోనూ ఉన్నాయి.

రాతిరథం ముందు భాగాన ఏనుగులు ఉన్నాయి. కానీ జాగ్రత్తగా చూస్తే - ఈ ఏనుగులను వేరే ఎక్కడి నుంచో తెచ్చి అతికించినట్టు తెలుస్తుంది. అవి టెంపరరీగా రెండు రాళ్ళపై నిలబడున్నై. ఆ ఏనుగులకు వెనకాల గుర్రం తోక, వెనక కాలూ లీలగా కనిపిస్తాయి. అంటే - ఒకప్పుడు రాతిరథానికి ముందు గుర్రాలు ఉండేవి కాబోలు. ఈ రాతిరథం లోపల గరుడాళ్వారు విగ్రహం ఉంటుంది.

విజయవిట్ఠలాలయం ముందు ఓ కిలోమీటరు వరకూ ఓ పెద్ద బజారు ఉంటుంది. ఈ బజారు గుర్రాల బజారు. గుర్రాలను అమ్మడమూ, కొనడమూ ఇక్కడ జరిగేది.



ఇక్కడ శిల్పాలలో చైనావాడు, బుడతకీచు వాడు, పర్షియా, రష్యా, మరొకడెవడో కనిపిస్తారు. గుర్రం క్వాలిటీని చూడడానికి తాని పళ్ళనూ, వెనుక తోకను, తోక వెంట్రుకలనూ చూస్తారట. అవి శిల్పాలలో ఉన్నాయి.

హంపి ప్రాభవానికి, భారతీయుల శిల్ప వైభవానికీ పరాకాష్ట విజయవిట్ఠల దేవాలయంలోని రంగమంటపం. ఈ మంటపం రాతిరథానికి ఎదురుగా ఉంటుంది. ఈ ఒక్క మంటపమే ఒక విశ్వవిద్యాలయం పెట్టు. ప్రపంచంలో ఇటువంటిది మరొకటి లేదు.



ఒకే రాతికొండను మలిచి నిర్మించిన బేలూరు, హళేబీడు వగైరా దేవాలయాలూ, ఆ దేవాలయాల గోడలపై అద్భుతశిల్పాలనూ చెక్కిన హొయసళుల ప్రతిభకు ఈ విజయనగర రాజ్య రంగమంటపం సాటి రాగలదు.

ఈ మంటపంలో 56 సంగీతస్థంభాలు నిర్మించారు. ఓ పెద్ద స్థంభం మధ్యలో రెండుచేతుల మధ్యపట్టే చిన్న చిన్న స్థంభాలను చెక్కారు. ఒక్కొక్క ప్రధాన స్థంభం - ఒక్కొక్క సంగీతపరికరానికి సంబంధించినది. మృదంగానికి ఒకటి, తబలాకొకటి, తాళాలకు ఒకటి, సరిగమలకొకటి ఇలా. ఆయా స్థంభాలపై వాటికి తగిన పరికరాలనూ చెక్కారు. వీటిపై గంధపు చెక్కతో తడితే ఆయా పరికరాలకు అనుగుణంగా సంగీతం వస్తుందని హంపి చూసిన వారికీ, హంపి గురించి తెలిసిన వారికీ విదితమే.

(అసలు కంబాలతో సంగీతం సృష్టించాలనే out of box ఆలోచన వచ్చినది ఏ మహానుభావునికో ఏమో! వాడికి పొర్లుదండాలు పెట్టాలి. ఫ్రిజ్జులు, టీవీలు కనిపెట్టిన వాళ్ళను తప్ప ఇలాంటి వాటిని చేసిన వాళ్ళ ’ప్రతిభ’ ఎలా ఉండి ఉండేదో అని ఆలోచించే శక్తి, ఊహాబలం మనకు నశించినాయి. కళకు Utilitarian aspect లేదు. ఉన్నా, దాన్ని గుర్తించే వాడేడీ?)

ఆకారం ఒకేలా కనిపిస్తున్న స్థంభాలలోంచి భిన్న స్వరాలు ఎల వస్తున్నాయి? ఆ శిల్పులు స్థంభపు లోపలి వైపు డొల్లగా చేసి ఏదైనా చేశారా? - అని తెలుసుకోవటానికి బ్రిటీష్/రష్యన్ వాళ్ళు రెండు స్థంభాలను విరగ గొట్టి చూశారు. అలాంటిదేమీ లేదు. స్థంభాల వ్యాసం, వాటికెన్నుకున్న రాయి, బేస్ మెంట్ పై నిలిపిన విధానం బహుశా ఇవన్నీ ఆ సంగీతానికి కారణం కావచ్చు. టెక్నాలజీ బలిసిన ఈ రోజుల్లో కూడా అటువంటి స్థంభాలు చెక్కడం దుస్సాధ్యం. (తేలిందిగా! భారతదేశంలో సైన్సు లేదని అన్నవారికి తెలియాలి యిది. భారతదేశంలో సైన్సు అస్సలు ఉండక కాదండి, కళకు పక్కవాయిద్యంగా ఉంటుంది!)

ఈ రంగమంటపాన్ని పెద్దపెద్ద సిల్కు పరదాలతో నలువైపులా మూసివేసి, క్రింద - రంధ్రాలలో ఆ సిల్కు గుడ్డలను జొనిపి ముడి వేసి, దీపాలతో అలంకరించి, ఆ దీపపు కాంతులు స్థంభాలలో కూర్చిన మణులపై ప్రతిఫలించేలా చేసి, లోపల భిన్న కాంతులు ఏర్పడేలా చేసే వారుట. మంటపం కూడా ఒకప్పుడు కృత్రిమ రంగులతో ఉండేదట. రంగు వెలిసిన కొన్ని కంబాలు మనం నేడు చూడవచ్చు. అలా మంటపం లోపల వెలుగు వచ్చేలా చేసిన తర్వాత, ఆ సంగీత స్థంభాలపై, సంగీత విద్వాంసులు గంధపు చెక్కతో తడుతూ సంగీతాన్ని పలికించేవారు.

రంగమంటపం మధ్యన - నాట్యకత్తె లేదా రాణి ’జిగేలు’ మనే నాట్యప్రదర్శన చేసేది. ఆ నాట్యం రాచపరివారానికే సొంతం. ఆ సంగీతవాయిద్యాల ’జుగల్ బందీ’ మాత్రం ఒక కిలోమీటరు వ్యాసంలో విద్యానగరంలో వినిపించేదట. అదీ వైభోగం!

ఈ మంటపాన అద్భుతమైన శిల్పాలూ ఉన్నాయి. ఓ శిల్పంలో ఆరు విభిన్నమైన బొమ్మలు కనిపిస్తాయి. హనుమంతుడు, పడుకున్న పాప, మహిషం ....ఇలా ఏవేవో.

ఏ కట్టడానికైనా మొదట బ్లూ ప్రింట్, మీనియేచర్ మాడల్ ఒకటి ఉంటుంది. ఈ రంగమంటపానికీ అలాంటిది ఉంది. ఆ మీనియేచర్ రంగమంటపమూ - కట్టడానికి దిగువ భాగాన కనిపిస్తుంది. (పైని ఫోటో చూడండి). ఈ నమూనాకు సంస్కృతంలో "వర్ణిక" అని పేరు.

సిల్కు గుడ్డలు జొనిపి ముడివేయటానికి ఉపయోగించిన కన్నాలు, మీనియేచర్ మాడల్ లోనూ ఉన్నాయి. ఆ కన్నాలు - ఈ మాడల్ లో అగ్గిపుల్ల వ్యాసార్థంలో ఉంటాయి. ఓ చిన్న పుల్ల జొనిపి చూసుకోవచ్చు మనం. సంగీత కంబాలు, పక్కనున్న మహామంటపంలోనూ ఉన్నాయి. అయితే సరిగమల స్థంభాలు లేవు. తబలా, మృదంగం వగైరాలు ఉన్నాయి. దురదృష్టవశాతూ ఈ మంటపం శిథిలమవుతున్నది. పురావస్తుశాఖ వారు దీనిపై యాత్రికులను అనుమతించట్లేదు. కృత్రిమంగా స్థంభాలు కూడా కట్టినారు. ఇవి వెలవెలబోతూ, నాటి స్థంభాల పక్కన వికారంగా కనిపిస్తాయి. ఈ మంటపంలో ఒక్కొక్క స్థంభాన్ని, శిల్పాన్ని జాగ్రత్తగా, కనీసం మూణ్ణాలుగు రోజులు స్టడీ చేయవచ్చు. రంగమంటపం పక్కన నూటయాభై ఏళ్ళ దేవగన్నేరు చెట్టు ఉంది. దీన్ని బ్రిటీష్ హయాంలో హూపర్ అనే వాడు ఫుటో తీశాడట.



ఈ రంగమంటపంలోనే ’అనాస’ (pine apple) పట్టుకున్న యువకుడూ, నాటి బ్రేక్ డాన్స్ వగైరా విచిత్ర శిల్పాలూ ఉన్నాయి.




3.

నరసింహకృష్ణరాయలు!

చుట్టూతా కొండలు చల్లని గాలి అరటి తోటలు,
వరిపయిరులు జనసమ్మర్దం లేని ప్రదేశాలు,
అమాయకులైన జానపదులు,
అపూర్వమైన ప్రకృతి,
అక్కడక్కడా వినిపించే నెమళ్ళ క్రేంకారవాలు,
ఒకట్రెండు చోట్ల తుంగభద్ర నుంచి త్రవ్వి తీసిన పంటకాలువలు,
అడుగడుగునా కనబడే పాతకాలపు మంటపాలు,
ఆంజనేయుని విగ్రహాలు,
ఇబ్బడి ముబ్బడిగా శాసనాలు,
శిలలు మౌనంగా చెప్పే కథలు,
శిల్పాలు వినిపించే కవిత్వాలు,
నది పరుగుల సోయగాలు
....
....
వేదాలకు భాష్యం చెప్పిన చోటు,
ప్రబంధకవిత ఉత్తుంగ తుంగభద్రలా ఉరకలెత్తిన నేల,
సరస్వతి కొలువున్న పీఠం,
జీవవైవిధ్యం తొణికిసలాడే పరిసరాలు,
రామాయణపు కిష్కింధ,
ప్రకృతికాంత సోయగపు రాశి,
తేనె తెలుగుభాషకు పట్టుగొమ్మ,
రాయలేలిన రాజసమున్న ప్రదేశం - హంపి.

సీ||
అచటి విప్రులు మెచ్చ రఖిలవిద్యాప్రౌఢి
ముది మదితప్పిన మొదటివేల్పు
నచటి రాజులు బంటునంపి భార్గవునైన
బింకాన పిలిపింతు రంకమునకు
అచటి మేటికిరాటు లలకాధిపతినైన
మును సంచిమొదలిచ్చి మనుప దక్షు
లచటి నాలవజాతి హలముఖాత్తవిభూతి
నాదిభిక్షువు భైక్షమైన మాన్చు

గీ||
నచటి వెలయాండ్రు రంభాదులైన నరయ
కాసెకొంగున వారించి కడపగలరు
నాట్యరేఖా కళా ధురంధర నిరూఢి
నచట పుట్టిన చిగురు కొమ్మైన చేవ. (మనుచరిత్ర 1.50)

హంపి ఓ అనుభవం. తెలుగువాడు...కాదు కాదు భారతీయుడు తన జీవితకాలంలో తప్పక దర్శించవలసిన చోటు.

.....దురదృష్టవశాత్తూ మతమౌఢ్యానికి కూడా ఇది నిలువెత్తు నిదర్శనంగా నేడు నిలబడి ఉంది.

****************

రాయలు కళింగాన్ని జయించాడు. లేదా తిమ్మరుసు తెలివితేటలతో గట్టెక్కాడు - రాయవాచకం ప్రకారం. గజపతులను ఎదుర్కోవాలని బయలుదేరిన కృష్ణరాయలు వాళ్ళ రాజ్యంలో ఇరుక్కు పోయాడు. అప్పుడు తిమ్మరుసు మొదట విసుక్కుని, ఆ పై కార్యం ఆలోచించి - గజపతిగారి ఏడు మంత్రులకూ ఒకరికి తెలీకుండా ఒకరికి శ్రీముఖాలు పంపుతాడు, తమతో చేరినందుకు ఒప్పుకుంటున్నందుకు సంతోషం అన్నట్టుగా. ఈ విషయాలు నట్టనడి సభన బయటపడ్డంతో గజపతి భయపడి, తన రాజ్యంలో తనకు తెలీకుండా కుట్ర జరుగుతా ఉందనుకుని పారిపోయాడు. అలా రాయలు గజపతిని జయించాడు. జయించి సింహాచలాన్ని క్రీ.శ. 1516 లో దర్శించుకున్నాడు. ఆలయానికి గ్రామాలు రాసిచ్చాడు. భూరిదానాలు చేసినాడు. ఆపైన విద్యానగరానికి వచ్చి, ఆ సింహాచలంలో నారసింహునికి ధీటుగా ఓ అద్భుతమైన శిల్పం చెక్కించాడు.



ఆ శిల్పాచార్యుడు ఏవో కారణాల చేత పూర్తి శిల్పం చెక్కలేకపోయినట్టు ఓ శాసనపు కథ! హంపి విరూపాక్షదేవళానికి వెళుతున్న దారిని, రోడ్డుకు ఎడమవైపున అరటితోటల పక్కన చిన్న మట్టిదారిలో లోనకు వెళితే నరసింహుని విగ్రహం, ఆ మందిరం ముందు రాయలవారి శాసనం (అలుక్కుపోయిన అక్షరాలతో), పక్కనే తుంగభద్ర పంటకాలువ, ఆపక్కన తుంగభద్ర నీళ్ళు నిండిన మంటపంలో కొలువైన బాడవలింగని శివలింగం(పెద్ద లింగడు) కనిపిస్తాయి. ఈ పంటకాలువ నీళ్ళు అలా ముందుకు ప్రవహిస్తూ, ఓ మంటపం మధ్యనుంచీ పారుతుంటాయి. ఆ మంటపం - మనుచరిత్ర లో అల్లసాని పెద్దన  వరూధినిని కూర్చోబెట్టి ఆమె చేత వీణె వాయింపజేసిన మంటపమయి ఉంటే బావుణ్ణని నా సుదూరమైన ఊహ!.

హంపిలో ఊపిరి స్థంభించిపోయేంత అందమైన చోట్లలో ఈ నారసింహుడు, బాడవలింగడు, కాలువ ఆ పరిసరాలున్నూ చేరతాయి.  బాడవలింగనికి పూజలు జరుగుతున్నాయి. ఈ లింగప్రతిష్ఠాపన సదాశివరాయల వారి కాలంలో జరిగింది.

ఇంకో కథ. అనగనగా ధర్మప్ప, సిద్దప్ప అని ఇద్దరన్నదమ్ములు. వాళ్ళిద్దరిదీ చంద్రగిరి. ఇద్దరున్నూ వైశ్యులు. ఆవగింజలతో అన్నయ్య, కందిపప్పుతో తమ్మయ్యా వ్యాపారం చేసి బాగా డబ్బు సంపాదించారు. విద్యానగరానికి వచ్చారు. రాయల అభిరుచికి, తమ దాతృత్వానికి నిదర్శనంగా రెండు మంటపాలను, వినాయక విగ్రహాలను నిర్మించారు.




సాసువె కాలు గణప (ఆవగింజల గణపతి) కడలె కాలు గణప (కందిబేడల గణపతి). హేమకూటానికి దిగువ ఉన్నాయివి. సాసువె కాలు గణపతి అపూర్వమైన విగ్రహం. వెనుకభాగాన వెళ్ళి చూస్తే పార్వతి ఒడిలో వినాయకుడు కూర్చున్నట్టు కనిపిస్తుంది. ముందు భాగాన కేవలం వినాయకుడు కనిపిస్తాడు. ఇది శిల్పి చాతుర్యం.

4.

సీ|| 
కలమపాలికల యాలలమేటి పాటల 
జుమ్మని మ్రోయు మించులసితారు, 
తెనుగుపెద్దన్నల గొనబుపల్కుల గుబా 
ళించిన జాజిమల్లెలగుడారు, 
జిలుగుజరీబుటా వలువ సింగారింపు 
మెలకువలూర్చు నిగ్గులకొఠారు, 
తలకు మించిన సత్యముల లోతులను జీల్చి 
కొనివెళ్ళు తెల్వియంచుల కఠారు, 

గీ|| 
కడిది మొనగాని యెడదచిక్కనకు పేరు, 
కటిక ఱాలను కరగించి గజ్జకట్టి 
చిందు ద్రొక్కించు మాయల జిలుగుతేరు, 
కలదు రాయలసీమ పచ్చలబజారు.  (విద్వాన్ విశ్వం - పెన్నేటిపాట)

(మించుల సితారు = మెరుపులవీణ,గొనబుపల్కులు = ముద్దుమాటలు)

కూసింత చరిత్ర తెలిన వ్యక్తి కానీ, లేదా కూసింత మనసున్న వాడెవడైనా నేటి హంపిలో తిరుగుతూ ఉంటే మనసు మూగపోతుంది. మాటలు రావు. కన్నీళ్ళు కూడా వస్తాయి. హంపి మొత్తం అలా ఉన్నా, బాలకృష్ణుని దేవాలయం, హజారరామాలయం వంటివి మరీ.

రాయలు ఉదయగిరిని జయించిన తర్వాత అక్కడి బాలకృష్ణుని తెచ్చి విద్యానగరంలో ప్రతిష్టించాడు. ఇది హంపికి వెళ్ళే ప్రధాన రహదారిలో ఎడమవైపు ఉంది. గుడి ఎదురుగుండానే విశాలమైన బజారు. (ఏడు బజార్లలో మూడవ బజారు). దీనిని కృష్ణబజారు అని అంటారు. ఇదే పచ్చలబజారు! అంగళ్ళ నాలు అమ్మినది ఇక్కడే. ఇది ఉబుసుపోకకు చెప్పే మాటలు కావు. వీటిలో ఏ మాత్రమూ అతిశయోక్తి లేదు.



"Going forward, you have a broad and beautiful street, full of rows and fine houses and streets of the sort I have described, and it is to be understand that the houses belong to the men rich enough to afford such. In this street live many merchants, and there you will find all sorts of rubies, diamonds, emeralds, pearls, seed pearls, cloths, and every sort of thing there is on earth and that you may wish to buy......."(Domingo Paes -1520 A.D) 

కిటకిటలాడుతూ క్రిక్కిరిసి ఉండేదేమో నాటి రోజుల్లో. ఈ రోజు నిర్మానుష్యంగా ఉంది. ఆ రోజు....ఆ రోజు...ఆ వీథి దైన్యాన్ని చూసి ఆకాశం కూడా కన్నీరు విడిచినట్టు సన్నగా చినుకులు! అక్కడ వరుసగా కనిపించే మంటపాల్లో ఒకదాని బేస్ మెంట్ దగ్గర - ఆ బజారు ఎప్పుడు తెరవబడుతుంది అన్న వివరాలు తెలిపే శాసనం ఉందట.

*******


బాలకృష్ణుని దేవాలయం అపూర్వమైన శిల్పవైభవానికి పేరు. మేం వెళ్ళినప్పుడు కేవలం నేను, మా ఆవిడా, పాప మాత్రమే ఉన్నాం. నాట్యమంటపంలో సన్నగా ఉన్న స్థంభాలు సంగీతస్థంభాలేమో అని సంహిత చేత్తో కొట్టి చూసింది, కానీ స్వరాలు పలుకలేదు. :) ముఖ్యమైన బాలకృష్ణునికే కాక, ఇతర దేవుళ్ళ గుళ్ళో ఈ ప్రాంగణంలో ఉన్నాయి. ఉదయగిరి యుద్ధదృశ్యాలూ ఒకచోట చెక్కారు. విజయనగరరాజుల శిల్పాలలో స్థంభాలపై కనిపించే ముఖ్యమైన శిల్పం ఒకటి ఉంది. దాని పేరు "యాళి". ఏడు జంతువుల అమరిక యిది. సింహం ముఖం, డ్రాగన్ కళ్ళు, పాము తోక, క్రిందవైపు మొసలి, గుర్రం శరీరం ...ఇలా. ఈ గుడి రెనోవేషన్ లో ఉంది. మూలవిగ్రహమూ, పూజలూ లేవు.శిల్పాలు మాత్రం అద్భుతం. ప్రాంగణం అపురూపం. తంజావూరు బృహదీశ్వరాలయపు ప్రాంగణం గుర్తొస్తుంది. ఈ గుళ్ళోనూ రాయలవారి శాసనం ఉంది.

కృష్ణుని గుడి ముందున్నది గుర్రాలకు నీళ్ళు తాపే తోట్టి. ఇటువంటి తొట్టి గురించి తిరుమల రామచంద్ర గారు ’హంపీ నుంచి హరప్పా దాక’ పుస్తకంలో వ్రాశారు.

ఈ దేవాలయం దారిలోనే, అక్కాతంగి గుండు, మాధవుని గుడి, చండికేశ్వరి వగైరా దేవాలయాలున్నాయి. వేటిల్లోనూ పూజల్లేవు.

5.

నిరుపహతిస్థలంబు రమణీప్రియదూతిక తెచ్చి యిచ్చు కప్పురవిడె మాత్మకింపయిన భోజన మూయలమంచము...... ఇవన్నీ కావాలట అల్లసాని పెద్దన కృతి రచించటానికి. ఏకాంతము, అందమైన దూతిక తెచ్చి ఇచ్చే కర్పూరతాంబూలము, చక్కని భోజనమూ, ఆపైన తూగుటుయ్యాల.... ఇవాళ మనకు గొంతెమ్మ కోరికల్లాగా కనబడవచ్చు కానీ - విజయనగర సామ్రాజ్యపు రోజులలో అవి చాలా చిన్న కోరికలు.

నాడు తాంబూలానికి చాలా ప్రాధాన్యం ఉండేది. అవకాశం చిక్కినప్పుడల్లా తాంబూలం సేవించడం ఆనాడు స్త్రీపురుషులందరికీ రివాజు. రాజు సభ తీర్చినప్పుడు ఆయన ఎదురుగా మాత్రం తాంబూలం వేసుకోరాదు. సభాప్రాంగణంలోకి చెప్పులు కూడా వేసుకుని వెళ్ళరాదు. అఫ్కోర్స్, చాలామంది చెప్పులు వేసుకునే వారు కాదట. ఒక వేళ వేసుకున్నా, పాముకోళ్ళు మాత్రమే. వాటికీ ప్రవేశం లేదు. కానీ మహారాజుల చామరగ్రాహిణులకూ (వింజామరలు పట్టే వారికి), నర్తకీమణులకూ, అంతఃపురభామినులకూ మాత్రం తాంబూలం విషయంలో మినహాయింపు. వారు రాజు ముందు కూడా తాంబూల చర్వణం చేయవచ్చునట. (Paes).




అప్పటి ప్రజలు అంతగా అభిమానించిన కిలోమీటరు పొడవు గల ’క్రాముక పర్ణపాన వీథి’ లేదా ’పెద్ద అంగడి వీథి’, లేదా ’పాన్ సుపారి బజారు’ - హజారరామస్వామి దేవాలయానికి ఎదురుగా ఉంది. ఈ సంత నాడు ప్రతి రోజూ నడిచేది. శుక్రవారాలు స్పెషల్ సంత. ఈ హజారరామస్వామి గుడి విజయనగర రాజ్యపు రాచనగరులో, ఏడవప్రాకారం (కోటగోడ) లోపల ఉంది. రాచనగరులో వున్న ఒకే ఒక పెద్ద దేవాలయం యిది. అద్భుతమైన ప్రాకారం (outer wall). , వరుస ఏనుగుల, గుర్రాల, పదాతి దళాల శిల్పాలు, ప్రాకారంపై గుండ్రటి పలకలలో విష్ణు అవతారాలు, ఇతర విజయనగర శిల్పాలతో వైభవోపేతంగా ఉంటుంది. ఈ ప్రాకారంలో గొప్ప రసికత కనిపిస్తుంది. ఈ దేవాలయమూ కృష్ణరాయల పుణ్యమే. దేవాలయపు నవరంగమంటపంలో నల్లటి గ్రానైటు రాయితో చెక్కిన నాలుగు స్థంభాలు ప్రముఖంగా కనిపిస్తాయి.

చిత్రఖండస్థంభాలు అంటారు వీటిని. ఈ రాయి ఇక్కడిది కాదు. ఏ ద్రవిడ దేశం నుంచో తెప్పించి ఉండాలి. ఈ స్థంభాలు నిన్ననో, మొన్ననో చెక్కినట్టు నిగనిగలాడుతూ ఉన్నాయి. చూపు తిప్పుకోలేనంట అందమైన స్థంభాలవి.

హజారరామస్వామి దేవాలయం చుట్టూ అనేక రాముని శిల్పాలు, భాగవత కథలూ కనిపిస్తాయి. ఈ దేవాలయం ముఖ్యంగా రాచనగరు వారికోసం ఉద్దేశించినది. ఇతర సామాన్యజనానికి ప్రవేశం సాధారణంగా ఉండదట. రాణులు వెళ్ళటానికి దక్షిణాన చిన్న సందు ఉన్నది. కాళి గుడి కూడా ప్రాంగణంలో ఉంది. గర్భగుడిలో విగ్రహం లేదు కాబట్టి నిత్యపూజలకు ప్రస్తుతం నోచుకోవట్లేదు. తూర్పుముఖంగా ఉన్న ఈ దేవాలయానికి ఎడమవైపున పట్టణద ఎల్లమ్మ గడి (చిన్న గూడు) ఉంది. ఇది చాళుక్యుల కాలం నాటిది. ఎల్లమ్మ గుడి ముందు ఓ దిగుడుబావి ఉంది. అ దిగుడుబావిలో ఇబ్బడి ముబ్బడిగా జంతుబలులు ఇచ్చేవారట. సరిగ్గా ఇదేవిధమైన బావి అనంతపురం కంబదూరులో ఉంది. ఇంకా నోలంబుల రాజధాని హైమావతిలో (అనంతపురం జిల్లా) ఉంది. ఇంకా చాలా దేవాలయాల్లోనూ. ఇటువంటి బావులు సీమలో అక్కడక్కడా శిథిలాలుగా కనిపిస్తాయి.

హజారరామస్వామి దేవాలయాన్ని పునరుద్దరించి, ఠీవిగా తయారు చేసినందుకు పురావస్తు శాఖవారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి.

6.

ఇప్పటి వరకు హంపిలో గల నాలుగు బజార్లను గురించి చెప్పుకున్నాం.

1. అచ్యుతరామరాయల గుడి ఎదురుగా ఉన్న సూళెయబజారు
2. విజయవిట్ఠల గుడి ఎదురుగా ఉన్న గుర్రాల బజారు
3. శ్రీకృష్ణుని గుడి ఎదురుగా ఉన్న పచ్చలబజారు
4. హజారరాముని గుడెదురు వీథి - పాన్ సుపారి బజారు.

ఇంకా మూడు మిగిలినాయి.

హంపిలోకెల్లా ప్రాచీనమైన బజారు - విరూపాక్ష బజారు. దీన్నే విరూపాక్షపురం, తేరువీథి, హంపి బజారు - అన్న పేర్లతో పిలుస్తారు. ఇది విరూపాక్షస్వామి దేవాలయ ప్రధాన గోపురానికి ముందు, తుంగభద్రకు సమాంతరంగా ఉన్నది. వీథికిటుచివరన ఎడూరు బసవ (నంది విగ్రహము), ఆపైన వెళితే అచ్యుతరాయల గుడికి దారితీస్తుంది.

ఇది ప్రధానంగా విరూపాక్షస్వామి/పంపాపతి, అమ్మవారు భువనేశ్వరీదేవి, గణపతి - ఈ దేవుళ్ళ తేరును, మెరవణిగా తోడుకుని పోవడానికి ఉద్దేశించింది. కాలక్రమంలో ఇక్కడ అంగళ్ళు వచ్చాయి. తినుబండారాలూ, దేవుని బొమ్మలూ చిన్నపిల్లల ఆట వస్తువులూ, దేవునికి టెంకాయ, పూలు వగైరా... హంపి బజార్లలో ప్రస్తుతం ’లైవ్’ గా ఉన్న బజారు వీథి ఇదొక్కటే.

విద్యానగరంలో చారిత్రకులు పేర్కొన్న ప్రధానమైన పండుగలు రెండు. ఒకటి మహర్నవమి. మరొకటి ఉగాదికి తర్వాత నవమి వరకూ జరిగే మహానవమి (శ్రీరామనవమి) ఉత్సవాలు. ఆ సమయంలో విరూపాక్షతేరు జరుగుతుంది. అది ఇప్పటికీ పారంపరికంగా వస్తోంది. నాటి రోజుల్లో ఈ వీథిన, ఈ మహానవమి ఉత్సవాల్లో నాటకాలు ప్రదర్శించేవారట. ఈ ప్రదర్శనకోసం అని కవులు నాటకాలు వ్రాశారు. వామన భట్టభాణుడు పార్వతీపరిణయం నాటకం ఆ సందర్భాన వ్రాసిందని భోగట్టా. అదే విధంగా శ్రీకృష్ణరాయల వారు కూడా ’జాంబవతీపరిణయం’ అన్న సంస్కృత నాటకాన్ని రచించారు. అది నేటికి కాలగర్భంలో కలిసిపోయింది.





హంపి విరూపాక్షస్వామి గుడి చాలా ప్రాచీనమైన దేవస్థానం. గొప్ప ప్రశాంతత, ఆధ్యాత్మిక వాతావరణం కనిపిస్తాయి ఈ దేవాలయంలో. విరూపాక్ష - అంటే విరూప-అక్షుడు. మన్మథ బాణానికి దెబ్బతిని కన్నుచెదరిన పరమేశ్వరుడని, రెండు కళ్ళకు అడ్డంగా నిలువుకన్ను (విరూపమైన కన్ను) ఉన్న స్వామి అని అర్థాలు వస్తాయి.

మూలవిరూపాక్షస్వామి దేవాలయం పక్కనున్న హేమకూటం పైన ఉత్తరదిశగా ఉన్నది. అక్కడి విగ్రహాన్ని - విద్యారణ్యస్వామి ప్రస్తుతదేవాలయానికి తెచ్చి ప్రతిష్టించారు. ఇది విజయనగరసామ్రాజ్యస్థాపన సమయంలో, హరిహర రాయలను పట్టాభిషిక్తుని చేసే సమయంలో జరిగింది. ప్రస్తుత దేవాలయపు తూరుపు వాకిలి గోపురాన్ని, ఇటు దక్షిణాన ఉన్న గోపురాన్ని ప్రోలుగంటి తిప్పయ అనే దండనాథుడు - రెండవదేవరాయని కాలంలో కట్టించాడు. అయితే బిష్టప్ప అనే శిల్పి ఈ గోపురాన్ని 17 వ శతాబ్దంలో పునరుద్ధరించాడని ఈ మధ్యన ఖచ్చితమైన ప్రమాణాలతో చెబుతున్నారు.

ఈ రెండవ దేవరాయడే - ఇమ్మడి ప్రౌఢదేవరాయలు. ఇతడికి ’గజబెంటెకర’ (ఏనుగులను మచ్చిక చేసేవాడు) అని పేరు. ఈయన కాలంలోనే శ్రీనాథుడు - అరుణగిరినాథుడనే పండితుని కంచుఢక్కను పగులగొట్టించాడు. (డిండిముడని ఆయనకు బిరుదనామం. ఆ బిరుదనామం వివిధ కాలాల్లో ఒక్కో కవికి ఉండేది. వారిలో శ్రీనాథుని సమకాలికుడు అరుణగిరినాథుడు)

దేవరాయలు విరూపాక్షవీథిలో రాలను, ముళ్ళను, గడ్డినీ తీయించి, చదును చేసి శుభ్రపర్చాడట. లక్ష్మణదండేశుడనే కన్నడ కవి, తన కవితలో చాలా ఆర్ద్రంగా కీర్తించాడు రాయలను.

త్రిపుర విజయిత విరూపాక్షన మనోరథకె సుపథవాదుదు దేవరాజేంద్రనుదయదిం.... 
విపులయొళుదృష్టవిదెయిందంబ మాళ్కెయిం పంపాపురదొళనుదినం 
... 
... 
...
చరణాంబుజక్కె శరణు 

లోన ఉన్న నాట్యమంటపం, చిన్న గోపురం - వీటిని కృష్ణరాయలు తన పట్టాభిషేకసమయంలో కట్టించుకున్నాడు. ఆయనకు అత్యంతప్రియమైన గోపురమట యిది. విరూపాక్ష స్వామి విగ్రహం అంటే - శిరస్సు చాలా అద్భుతంగా ఉంటుంది. మనోహరమైన రూపం. మీసాలు ఉన్న దేవుడీయన.

ఈ విరూపాక్షస్వామి దేవాలయం గర్భగుడి వెనుకవైపున చిన్న మెట్లదారి ఉంటుంది. ఆ మెట్లు పైకెక్కితే ఓ కన్నం ఉంటుంది. ఆ కన్నం గుండా చూస్తే - విరూపాక్షగోపురపు నమూనా తలక్రిందులుగా కనిపిస్తుంది. ఇది చాలా తెలివైన నిర్మాణం. చూచి తీరాల్సిన విషయం. ప్రాంగణంలో ఇంకా రకరకాల దేవుళ్ళ మందిరాలు ఉన్నాయి. దేవాలయం బయట మన్మథన హొండె (మన్మథపుష్కరిణి ఉంది). ఆ దారి వెంబడి వెళితే మెట్లు, క్రింద తుంగభద్రమ్మ కనిపిస్తాయి.

మరో విషయం.

గీ || 
అట్లు తడవుగ గొల్చి సాష్టాంగమెఱఁగి 
గర్భమంటపి కడిగిన కలఁకజలము 
లోన ఱాతొట్టి నిండి కాలువగఁ జాగి 
గుడి వెడలు వచ్చు నది శూద్రుడిడఁగ గ్రోలి

...

ఆముక్తమాల్యదలో మాలదాసరి - దేవాలయంలోనుండి బయటకు కాలువలా జారిన నీటిని త్రాగాడట. ఇలా దేవాలయంలో నది పాయ పారడం విరూపాక్షస్వామి గుడిలో ఉందట. నదిలో నీరెక్కువగా ఉన్నప్పుడు ఉండాలి బహుశా యిది.

ఆముక్తమాల్యదలో మరో పద్యమూ ఉంది.

మలయపుగాలి రేలు వనమాలి విమానపతాక ఘల్లుమం
చులియ బసిండి మువ్వగమి నొక్కొకమాటు గదల్ప, నుల్కి మి
న్నలము తదీయ హేమవరణాంచల చంపకశాఖలందు బ
క్షులు రొదసేయ, వేగెనని కూడుదురల్కలు దీఱి దంపతుల్ (1.74)

రాత్రి చిరుగాలి వీచింది. ఆ గాలి ధ్వజస్థంభాన్ని కదిలించింది. ఆ స్థంభపు గంటలు అల్లల్లాడాయి. ఆ గణగణలకు దేవాలపు పక్కనున్న చెట్టు పై పక్షులు కలకలం చేశాయి. పక్కన గుడిసెలో కొత్త కాపు దంపతులు - రాత్రి ఒకరితో ఒకరు పోట్లాడి ఎడమొహం - పెడమొహంగా పోట్లాడుకున్న వారు కలకలానికి నిద్రచెదరి, ఒకరి మొఖమొకరు చూసుకుని, అర్థవంతమైన భావంతో నవ్వుకుని కౌగిలించుకున్నారట.

ఆ ధ్వజస్థంభమూ, చెట్టూ, విరూపాక్షదేవాలయానివే.



ఈ దేవాలయంలోనే రాయలవారి సంతకమూ ఓ శాసనంలో ఉంది. మేము వెళ్ళినప్పుడు ఈ దేవాలయం పక్కనే ఓ ఇంట్లో పేయింగ్ గెస్ట్ గా ఉన్నాము. రాత్రి మా పాపతో ఆ గుడికీ పక్కన నదికీ షికారు వెళ్ళడం, సన్నగా చినుకులూ, ఆపై తేరువీథిలో మిరపకాయబజ్జీలూ, మా సీమ ట్రేడ్ మార్క్ ఉగ్గాని :), ఆపై పొద్దున ఐదు గంటలకు ఇంటి డాబాపై నుండి విరూపాక్షగోపురదర్శనం, ఆపోజిట్ గా మాతంగపర్వతదర్శనం....చాలు. ఏమి అదృష్టం!



పక్కనే ’శాలె’ - కన్నడ స్కూలూ ఉంది.

మా పాప అంది. "నాన్నా - ఇక్కడే ఉండిపోతే ఎంత బాగుంటుంది!"
మా ఆవిడ - "ఇక్కడ టూరిస్ట్ గైడుపని చేసుకుంటూ సెటిల్ అయితే చాలు".

నేనేమీ అనలేదు.

7.

పసిడి రాశి!

’అమెరికా అమెరికా’ అని కన్నడంలో ఓ సినిమా ఉంది. ఆ సినిమాలో ఒకతను, అమెరికా కు వెళ్ళిపోతున్న ఫ్రెండు గురించి అంటాడు.

"అమెరికానల్లి ఎష్టు దైత్యశక్తి యిదె. కర్ణాటకద కొనెయె యావదో హళ్ళినల్లిరువె ఒబ్బనె ఇల్లింద కిచ్చుకొండు ఆకడె కర్కొండు హోగుత్తిదె" (అమెరికాలో ఎంత రాక్షసశక్తి ఉంది! కర్ణాటక మూలన ఉన్న ఒక పల్లె విద్యార్థిని తన దగ్గరకు ఈడ్చుకొని పోతోంది...)

ఇలాంటి ఓ బలీయమైన 'సాత్వికమైన' శక్తి హంపికి కూడా ఉందని నా విశ్వాసం. బుధవారం తెల్లవారు ఝామున ఐదున్నర. లేచి ఆ ప్రభాతకాంతులలో ఇంటి మేడపై మాతంగపర్వతాన్ని, విరూపాక్షస్వామి బిష్టప్ప గోపురాన్ని దర్శించుకున్న తర్వాత కాసేపటికి తుంగభద్రలో స్నానానికి బయలుదేరాను, మా పాప కూడా వస్తానంటే వెంటబెట్టుకుని.

గోపురం పక్కన దారి మన్మథుని కోనేరుకు దారితీస్తుంది. కోనేటి నీరు శుభ్రంగా లేదు. ఆ దారినే ముందుకు వెళ్ళి మెట్లు దిగితే తుంగభద్ర! మేం ఆ మెట్ల దారినే వెళ్ళి దూరాన ఏనుగులు స్నానం చేసే చోటుకు వెళ్ళేం. జనం దాదాపుగా ఎవ్వరూ లేదు. నది నీళ్ళు చాలా నిర్మలంగా ఉన్నాయి.

’గంగా స్నాన, తుంగా పాన’ (గంగలో స్నానము = తుంగనీటి పానము!). మా ఊరికి వచ్చే కాలువ కూడా తుంగభద్రదే! ఇదేగా తుంగభద్ర! తెనాలిరామకృష్ణుడు పరవశించి పోయిన నదీమతల్లి ఇదేగా!

కం|| 
పంపాతరంగ రింఖణ 
ఝంపా సంపాద్యమాన జలకణరేఖా 
సంపాతశీతలానిల 
సంపదవొదలించె పరమ శైవోత్తంసున్. 

(పాండురంగమహత్మ్యం - తెనాలి రామకృష్ణుడు)

"పంపానది (తుంగభద్ర) లో అలల వేగానికి నీటి తుంపరలు ఎగిరి, అక్కడ వీచే చల్లని గాలితో బాటూ తన మేనిని తాకి అగస్త్యమహర్షికి హాయి కలిగించాయి" అన్నట్టుగా ఉంది ఆరోజు తుంగభద్ర ఒడ్డు కూడానూ.

ఆ పద్యపు నడతలానే ఉంటుంది బండ రాల మధ్య తుంగభద్రప్రవాహం. నీళ్ళ మధ్య ఓ మంటపాన్ని, అందులో లింగాన్ని, ఎదురుగా బండపై నందిని కూడా నిర్మించారు. అంతే కాదు, చెదురు మదురుగా లింగాలు, నంది విగ్రహాలున్నూ. నీళ్ళు లోతు లేవు. కానీ అక్కడక్కడా జారుతోంది.

హాయిగా స్నానం చేసి, ఓ అరగంట నీళ్ళదగ్గర గడిపిన తర్వాత ఒడ్డున మంటపానికి వచ్చాము. అక్కడ క్రింద గచ్చుపై ఏదో శాసనాన్ని చూసింది పాప. ఏమి రాశారో అర్థం కాలేదు.



(శుభమస్తు.....)

మెట్లకు పైన నల్లమూతి కోతుల హడావుడి. ఈ ప్రాంతాలలో వీటి తాకిడి ఎక్కువ. ఉడతలు కూడా ఎక్కువే.

*******

ఆపై గుడికెళ్ళిన తర్వాత హేమకూటాద్రికి వచ్చాము. విరూపాక్షగుడికి దక్షిణం వైపున ఉన్న చిన్న గుట్ట హేమకూటం. పురందరదాసు కీర్తన "లంబోదర లకుమికర, అంబాసుర అమరవినుత..." అన్న కీర్తన ఈ హేమకూటపు వినాయకునిపైనే నట. శివుని మూడవకన్ను తాకిడికి కరిగి ఇక్కడి శిలలు మన్మథసరస్సుకు చేరాయని స్థలపురాణం. మహాభారతంలో ఓ హేమకూటప్రస్తావన ఉంది. (ఆ హేమకూటం - హిమాలయాల తాలూకుది అయి ఉండవచ్చు.) భారతదేశంలో అందమైన సాయంసమయాలున్న ప్రదేశాల్లో ఈ ’పైడిరాశి’ కూడా ఒకటి. హేమకూటానికి ’ద్వారం’ కూడా ఉంది.

అక్కడక్కడా నిలిచిన నీళ్ళతో, మంటపాలతో, బాగా వీచే గాలితో, చిన్న చిన్న పూలతో నయనమనోహరమైన ప్రాంతం ఇది. తొమ్మిది నుంచి పదకొండవ శతాబ్దం మధ్యలోని చాళుక్యుల ’రేఖానగర నిర్మాణం’ గల దేవాలయాలు ఇక్కడ కనిపిస్తాయి. ఇవన్నీ శైవాలయాలు.







హరిహరరాయ, వీరకంపరాయల శాసనాలు కూడా ఉన్నాయట ఇక్కడ. మూలవిరూపాక్షస్వామి కోవెల కూడా ఈ కొండపైనే ఉంది. ఈ కొండపై నుంచి విరూపాక్షుని ప్రస్తుత గుడి మొత్తాన్ని చూడవచ్చు. సుప్రసిద్ధ రచయిత తిరుమల రామచంద్ర గారి  ’హంపీ నుంచి హరప్పా దాకా’ పుస్తకంలో హంపిని అద్భుతంగా వర్ణించారు. హేమకూటపై ఓ సారి సైకిలు తొక్కుతూ క్రిందపడి అపాయం తప్పించుకున్న ఉదంతం వ్రాశారాయన.

8.

హాడుపట్టణ.

విద్యానగరానికి ఒకదాని బయట ఒకటిగా ఏడు ప్రాకారాలు ఉండేవి. ప్రభావతీప్రద్యుమ్నములో పింగళి సూరన - గూగుల్ ఎర్త్ లో నుండి చూసినట్టు ’ద్వారక’ పట్టణాన్ని సప్తప్రాకారశోభితంగా వర్ణిస్తాడు. అది నాటి విద్యానగరమే.

హంపి ఏడు ప్రాకారాల్లో - ఏడవ ప్రాకారం లోపల రాచనగరు. ఇది కామలాపురం దాటగానే సరస్వతీదేవాలయంతో మొదలవుతుంది. సరస్వతి దేవాలయం, వెనుక అష్టభుజి స్నాన మందిరం, ఇటుగా వస్తే - పద్మమహలు, ఎల్లమ్మ, మహర్నవమి దిబ్బ, రాణుల స్నానపు మందిరం, మరో స్నానఘట్టం, ఏనుగుల శాల, దణాయకుని ఇల్లు ...... ఈ ప్రాంతాన్ని హాడుపట్టణ అంటారు.

క్రీ.శ. 1565 తర్వాత సుల్తానులు - ఆరునెలలు ఓవర్ డ్యూటీ చేసి మరీ విద్యానగరాన్ని ధ్వంసం చేశారు. పైగా ఇది రాచనగరు కాబట్టి ఏ విధమైన సొమ్ము దొరికినా వదలకూడదన్నట్టు ధ్వంసం చేశారు. ఇప్పుడక్కడ శిథిలాలు కనిపిస్తాయి.

అందులో ముఖ్యమైనది మహర్నవమి దిబ్బ. మహర్నవమిదిబ్బ/దసరాదిబ్బ పాడుపట్టణం లోపల ఈశాన్యమూల ఎత్తున ఓ Open theater ఉంది. హంపిలో చాలా ప్రఖ్యాతమైన కట్టడం యిది. దీని అసలు పేళ్ళు విశయదశమిసింహాసనము/ సింహాసనవేదిక/విజయభవనము.

క్రీ.శ. 1513 లో కళింగను జయించిన తర్వాత కృష్ణరాయలు బాలకృష్ణదేవాలయాన్ని, తదనంతరం ఈ మంటపాన్ని కట్టించాడు. బహుశా అంతకు ముందున్న మంటపాన్ని పునరుద్దరించి ఉండవచ్చు కూడా. ఈ కట్టడంలో గ్రానైట్ రాయిని ఉపయోగించారు. విజయనగరసామ్రాజ్యం ధ్వంసమయిన తర్వాత ఈ మంటపం మట్టి కొట్టుకుపోయింది. దీని క్రింద, చుట్టుపక్కల భూమిలోతున నిధులున్నాయని తవ్వి పాడుచేశారట. ఆపైన అవి పూడుకుపోయి, దిబ్బగా ఏర్పడి చుట్టూ ముళ్ళు పెరిగి దయనీయస్థితిలో ఉండేది.అందుకే దీనిని ’దిబ్బ’ గా పిలిచే వారు. (బ్రిటీష్ వాళ్ళ హయాంలో ఫుటో యిది).



ఈ కట్టడం చుట్టూ ఓ ప్రాకారం కూడా ఉండేది. ఈ ప్రాకారపు అవశేషం మంటపానికి కుడివైపు కనిపిస్తుంది. ఈ దిబ్బకు పక్కనే బహుశా హజార రామస్వామి దేవాలయం తాలూకు రాతి వాకిలి కొట్టి పడవేశారు. చివుక్కుమంటుంది ఆ వాకిలిని చూస్తే.

దసరా రోజుల్లో ఈ మంటపం పైన రాయలు దేవేరులతో కొలువుతీరేవాడు. తొమ్మిది రోజులు ఉత్సవాలు నడిచేవి. ఆ ఉత్సవాలను వీక్షించడానికి ప్రత్యేకంగా రాయలకు ఒక రత్నోపచిత స్వర్ణ సింహాసనం ఉండేది. (ఈ సింహాసనాన్ని భోజుని సింహాసనంలా రాజే ఎక్కాలి. అది కూడా ఈ పర్వదినాల్లోనే ఎక్కాలి. ఆ రాజు సత్యసంధుడై ఉండాలి. కృష్ణరాయల తర్వాత అచ్యుతరాయలు ఈ సింహాసనాన్ని ఎక్కటానికి ఎదురుకున్నాడని ఏవో కథలు.)

ఉత్సవాలలో భాగంగా జంతుబలులు సాగేవి. నవమి రోజు - తొమ్మిది పోతులు, తొమ్మిది వేట లు, తొమ్మిది మేకలు. ఆపై రోజు రోజుకూ సంఖ్య పెరిగేది. ఆ జంతువుల మాంసం ఉపయోగపడింది ఉపయోగపడగా మిగిలిన అవశేషాలు యల్లమ్మ గుడి ముందున్న బావిలోకి వెళ్ళేవి. (ఈ బావి ఇప్పటికి ఉంది).

ఈ పండుగలప్పుడు నృత్యప్రదర్శనలూ, సంగీతం, చిత్రలేఖనం, ఇతర కళలూ, మల్లయోధుల కుస్తీ పోటీలూ, కర్రసాములూ, ఇతర దేశాల నుంచి వచ్చిన వారి ఐంద్రజాలిక ప్రదర్శనలూ, అన్నీ జరిగేవి. మంటపంపై సిల్కుపరదాలతో తెరలు వేలాడేవి. వాటి వెనుకనుంచి రాణులు ఆ ఉత్సవాలను చూచేవారట. ఈ దిబ్బకు కొంత అటూ ఇటూ ఎడంగా స్నానఘట్టాలు ఉన్నాయి. ప్రౌఢదేవరాయలు కట్టించిన తుంగభద్ర తుర్తు కాలువ (Emergency canal) నుంచి రాతి కాలువ ద్వారా నీరు వచ్చేలా రాయలు ఓ పోర్చుగీసు ఇంజినీరును నియమించి కట్టించాడు. దీని ఒక భాగం రాణుల కొలనులోకు నీరు నింపుతుంది. ఈ తొమ్మిది రోజుల ఉత్సవాల తర్వాత రాయలు సైనికసమీకరణాలను సరిచూచుకునేవాడు. ఆపై తుంగభద్రలో మైల స్నానాలు చేసి, శాంతి పూజలు జరిపించి తిరిగి కొలువు తీరేవాడు.



మహర్నవమి దిబ్బ పై నాటి సామాజిక జీవితం శిల్పాలలో కనిపిస్తుంది. పందులను కాడిపై మోసుకెళ్ళే బోయలు, జంతువుల వేట, యుద్ధసన్నివేశాలు, ఒక్క వేటుతో పోతును నరుకుతున్న మనుష్యులు, బాతులు, నెమళ్ళు, ఒంటెలూ, నాటి వాహనాలు, వస్తుసామగ్రి, నృత్యభంగిమలూ, వాయిద్యాలూ, స్త్రీల అలంకరణా, దండలాసకమూ (దాండియా రాస్), జైనులు, స్త్రీ సహగమనాలు ఇలా...

దిబ్బ వెనుక దిగుడు మెట్లు ఉన్నాయి. అక్కడ ఐదుగురి విగ్రహాలుండేవి (ప్రస్తుతం కనిపించట్లేదు). ఇవి పాండవులవని అని రెండు/మూడు తరాల క్రిందటి వరకూ స్థానికులు పూజించేవాళ్ళట. ఈ మహర్నవమి దిబ్బకు దక్షిణ దిక్కున శిల్పాలు అందమైనవి. చాలా ఆసక్తికరమైన స్టడీ యిది. విచిత్రమేమంటే - ఇంత ప్రాముఖ్యం ఉన్న మహర్నవమి గురించి విజయనగరానికి చెందిన ప్రబంధాలలో వివరణ లేనే లేదు. ఎందుకో అర్థం కాదు.

మహర్నవమి రోజున జరిగే ఈ కొలువు, ఉత్సవాలు వగైరాలు ఎప్పటి కాలం నుంచో పరంపరాగతంగా వస్తున్నాయా అని సందేహం వస్తుంది. కర్ణాటక - బెంగళూరు వద్ద నందిబెట్ట అని ఒక గుట్ట ఉంది. (పెన్నా నది పుట్టిందిక్కడే). ఈ నందిబెట్ట వద్ద భోగనందీశ్వరం ఒక ప్రసిద్ధ దేవాలయం. ఈ దేవాలయాన్ని, గాంగ, నోలంబ, విజయనగర రాజులు ఆదరించారు. ఈ దేవాలయ ప్రాంగణంలోనూ మహర్నవమి దిబ్బ ఉంది. ఇది కూడా హంపి మహర్నవమి దిబ్బను పోలి ఉంది.

9.

పరిశిష్టం. 

మాతంగపర్వతానికి క్రింద అచ్యుతరాయని దేవాలయం ఉంది. ఇది నిజానికి ’తిరువేంగళనాథుడు’ - వేంకటేశ్వరస్వామి గుడి. బహుశా కృష్ణదేవరాయలతో పోటీ పడాలని కాబోలు, విశాలమైన ఈ దేవాలయాన్ని అచ్యుతరాయలు కట్టించినట్టు ఉన్నాడు. క్రీ.శ. 1539 లో ఈ కట్టడం నిర్మించబడింది. ఒక మోస్తరుగా ఈ దేవాలయం - లేపాక్షి వీరభద్రస్వామి దేవాలయాన్ని స్ఫురింపజేస్తుంది. లేపాక్షి కూడా అచ్యుతరాయల కాలం నాటిదే.

రెండు ప్రాకారాలు, నాలుగు గోపురాలు, విశాలమైన ప్రాంగణం, కల్యాణమంటపం, అంతరాళం, వరుస స్థంభాలతో కూడిన వసారాలూ, దశావతార శిల్పాలూ, యాళిస్థంభాలూ, అపురూపమైన శిల్పశోభ, ద్వారంపై అప్సరసలూ, తీవెలూ - ఈ దేవాలయానికి సొంతం. ద్వారం వద్ద మొసలిపైన గంగాదేవి, తాబేలుపై యమున కూర్చుని ప్రయాణిస్తున్నట్టు అద్భుతంగా చెక్కారు. సుదీర్ఘమైన శాసనం కూడా ద్వారం దగ్గర ఉంది.

దేవాలయానికి వెనుకవైపు అరటి, కొబ్బరితోటలూనూ. ముందు సుదీర్ఘమైన బజారు, చివర్న పుష్కరిణీ, వరాహ దేవస్థానం. సరిగ్గా ఈ అచ్యుతరాయన గుడి వెనకాల - అరటి తోపులో - మనోహరమైన పరిసరాల మధ్య ’హత్తు కై యమ్మ’ (పదిచేతుల అమ్మవారు) విగ్రహం ఉంటుంది. రంగులలో ఉన్న ఈ అమ్మవారి విగ్రహానికి పూజలు ఇప్పుడు నడుస్తున్నాయి. పక్కనే ఓ ’బోరింగ్’ ఉంది. ఆ బోరింగ్ నీరు - అచ్చం ఎళనీరులా ఉంటుంది. అక్కడ కన్నడలో బోర్డు కూడా పెట్టారు. ’ఈ నీటిని త్రాగటానికే ఉపయోగించండి’ అంటూ.

ఈ దేవాలయం చాలా ఎక్కువగా ధ్వంసమయ్యింది. మాతంగ పర్వతం పైనుండి, ఆ మెట్ల నుండి ఈ దేవాలయం అద్భుతంగా అగుపిస్తుంది.




కామలాపురంలో - ఓ పెద్ద మ్యూజియం ఉంది. ఆ మ్యూజియం ప్రాంగణంలో అనేక శిల్పాలు ఉన్నాయి. లోపల అడుగుపెడుతూనే రాయలవారు దేవేరులతో కూడిన రెండు కంచు విగ్రహాలు కనిపిస్తాయి. సరిగ్గా ఇవే విగ్రహాలు - చిన్న సైజులో తిరుమల తిరుపతి దేవస్థానం - గుడిలోపల కనిపిస్తాయి.


ఈ విగ్రహంలో విశేషం ఏమంటే - రాయల వారి కాలి రెండవ వ్రేలికి మెట్టె ఉంటుంది. ముత్తైదువలకు రెండు మెట్టెలుంటే - రాయలకు ఒక్క మెట్టె కనిపిస్తుంది. బహుశా ఆ రోజుల్లో మగవాళ్ళకూ అవి ఉండేవేమో. నాటి రోజుల్లో పురుషులు కూడా పూలు పెట్టుకునే వారని రాళ్ళపల్లి వారు వ్రాశారు.

శ్రీకృష్ణ రాయలు పొద్దునే బ్రాంహ్మీ ముహూర్తాన లేచి ఒళ్ళంతా కుసుమ నూనె పూసుకుని, ఓ గుప్పెడు కుసుమనూనె సేవించి సంది దండలతో ’జిమ్ము’ చేసేవాడట. (బ్రాంహ్మీ - మీరు సరిగ్గానే చదివారు. రాయవాచకమ్) అదుగో ఆ సంగడాలు కూడా - కామలాపురం మ్యూజియంలో ఉన్నాయి. చాలాకాలం వాటిని వాడినట్టు చూడగానే తెలిసిపోతుంది.( ఇలా నూనె సేవించి అతి వ్యాయామం చేయటమే రాయల ప్రాణం మీదకు వచ్చిందంటారు). వ్యాయామం చేసి చేసి శరీరం చాలా పటుత్వంతో ఉండేదని అల్లసాని పెద్దన అంటాడు. "వ్యాయామ స్థిరసంధిబంధ!" అని ఆయన పిలుపు.(మనుచరిత్ర)  శ్రీకృష్ణరాయలు సంది దండలు రెండు చేతులతో త్రిప్పుతూ వ్యాయామం చేస్తుంటే, ఆకాశాన సూర్యచంద్రులు అటూ ఇటూ తిరుగుతున్నట్లు ఉందని ప్రబంధకవి ఉత్ప్రేక్ష.



ఇంకా శిల్పాలూ, వీరగల్లులూ, తాటాకు గ్రంథాలూ, ఘంటం, ఆయుధాలు, ఇవన్నీ ఆ సంగ్రహాలయంలో ఉన్నాయి.

********************

హంపిలో ఒక్కరోజులో నేను చూసిన ప్రదేశాల గురించి, అనుభూతుల గురించి, ఆలోచనల గురించి సంగ్రహం యిది. (సంగ్రహం కూడా కాదు. కొంత భాగం) కొన్ని మిగిలిపోయి ఉంటాయి. గానిగిత్తి జైన గుడి, ఉద్దాన వీరభద్రుడు, విజయనగర సామ్రాజ్యంలో కల్లు అమ్మేస్థలం, తలారి ఘట్ట గేటు, ఒకదానిపై ఒకటి ఒరుసుకుని నిలబడిన అక్కా తంగి గుండు రాళ్ళు, వరాహ దేవాలయం, పురాతన శివాలయం, సుగ్రీవ గుహ ఇలా... ఎడూరు బసవన విగ్రహం - ఒకే రాయిపై చెక్కిన నంది విగ్రహం - విరూపాక్షస్వామి గుడి ఎదురుగా ఉంది.




అన్నట్టు ఏడు బజార్లలో ఐదే వచ్చాయి. మిగిలిన రెండూ - మాల్యవంతబజారు, అనంతశయన బజారు. ఈ రెంటి ఆనవాళ్ళూ ప్రస్తుతం లేవు. చెప్పనివి చెప్పలేనివి చెప్పుకోలేనివి వున్నాయి.

నేటి హంపి ఊళ్ళో కొట్టొచ్చేలా కనబడే మరొక విషయం ఉంది. ఇది ఒక చిన్న పల్లెటూరు. అయితే వీథులు చాలా శుభ్రంగా ఉన్నాయి. ప్లాస్టిక్ - దాడి అంతగా లేదు. కమర్షియలైజేషన్ లేదు. ఊరులో ’పల్లె’ తనం, అమాయకత్వం, ముగ్ధత్వం అలానే ఉన్నాయి. తుంగభద్ర ప్రవాహం - పసిపాప చిరునవ్వులానే ఉంది. హోటళ్ళవీ ఎక్కువగా లేవు. నాన్-వెజ్ దొరకదు. వీథుల్లో చక్కటి టిఫిన్ దొరుకుతుంది. అక్కడా అరటాకులూ, విస్తరాకులూ, పేపర్లే. ప్లాస్టిక్ వాడకం లేదు.

కామలాపురంలో సైకిళ్ళు దొరుకుతున్నట్టున్నాయి. ఫారినర్స్ చాలా మంది సైకిళ్ళలో తిరుగుతూ కనిపిస్తారు. అయితే కాళ్ళు పులిసిపోయేలా చాలా దూరం నడవాల్సి ఉంటుంది. హంపిలో ’తెలుగు’ చెల్లుతుంది. (రాయవాచకం తెలుగు :) ) హంపిలో మేము చూడనివి చాలా ఉన్నాయి. పట్టాభిరామన గుడి, ఆనెగొంది, వాలికాష్టం, పంపా కొలను, అనంతశయన గుడి, సూళెయ బావి...

కామలాపురం చెరువు ఓ కూతవేటు దూరం ఉండగా చూడలేకపోవడం వెలితి. నిజానికి హంపిని ఎంత చూసినా తిరిగి వచ్చేప్పుడు - ’ఫలానా’ అని చెప్పలేని ఏదో వెలితి పీడిస్తూనే ఉంటుంది. హంపి - కర్ణాటక లో ఉంది. కానీ ఈ ఛాయ దక్షిణదేశమంతా ఉంది. రాయలసీమ ప్రాంతంలో ఎక్కువగా ఉంది. భాష పరంగా, సంస్కృతి పరంగా, ప్రకృతి రమణీయత, ఆధ్యాత్మికత, ఇలాంటి అనేక విషయాలకు సంబంధించి. హంపి సంస్కృతి ఛాయలు రాయలసీమలో చాలా చోట్ల, రోజువారీ జీవితంలోనూ కనిపిస్తాయి.

హంపి - రాయలసీమ అబ్బ గంటు!  తెలుగువాడిది కూడా. తెలుగు వాడు దిక్కులు పిక్కటిల్లేలా చెప్పుకోగలిగేంత స్ఫూర్తి ఈ శిథిలాల్లో హాడుపట్టణలో ఉంది. దురదృష్టవశాత్తూ తెలుగులో ఏ మాత్రం ఆత్మాభిమానం లేని హీనులు, వెన్నెముక లేని సినిమావాళ్ళు - రాయలను, రాయలసీమను కించపరుస్తూ ఆ జాడ్యాన్ని అమాయకులైన ప్రేక్షకుల మనసున రుద్దుతున్నారు. శోచనీయమైన విషయం. వివేకవంతులు ఆలోచించాలి.

శుభమ్.

23, జనవరి 2019, బుధవారం

బాదామి - పట్టదకల్లు

1.

యేళ్ల క్రితం, కాలేజీ రోజుల్లో  బళ్ళారిలో మా మామయ్య, రాయచూరు జిల్లా మస్కి అనే గ్రామంలో లో మా పిన్నమ్మ వాళ్ళు ఉండేవాళ్ళు. మస్కి - ఇక్కడ ప్రాచీన కాలానికి చెందిన ఓ బ్రాహ్మీలిపి శాసనం ఉంది.ఇది ఊరుబయట ఓ చెట్టుక్రింద బండపై చెక్కి ఉంది. సమ్మర్ వెకేషన్స్ కు బళ్ళారికి కానీ,మస్కికి కానీ వెళ్ళినప్పుడు రేడియో (హుబ్లి స్టేషన్)లో ఒక పాట తరచుగా వినిపించేది.

ಹುಟ್ಟಿದರೆ ಕನ್ನಡ ನಾಡಲ್ ಹುಟ್ಟಬೇಕು
ಮೆಟ್ಟಿದರೆ ಕನ್ನಡ ಮಣ್ಣ ಮೆಟ್ಟಬೇಕು
ಬದುಕಿದು ಜಟಕ ಬಂಡಿ,
ಇದು ವಿಧಿ ಓಡಿಸುವ ಬಂಡಿ....

ఈ పాటలో మొదటి చరణంలో ఓ రెండు పాదాలు ఇవి.

అజంతా, యెల్లోరాన బాళల్లి ఒమ్మె నోడు
బాదామి ఐహోళెయ చందాన తూక మాడు....

అంటే - "అజంతా కుడ్యశిల్పాలను చూడు, బాదామి, ఐహోళె అందాలతో తూచి చూడు" అని అర్థం. నేను అజంతా యెల్లోరాలు చూడలేదు. చూచినా ఆ అందాలను తూచలేను. కానీ ఒకరకంగా ఆ సినిమాకవి చెప్పింది నిజమని బాదామి పట్టదకల్లు చూసిన తర్వాత అనిపించింది. అవును. కర్ణాటకలో బాగల్ కోట్ జిల్లాలో ఉన్న బాదామి, పట్టదకల్లు, ఐహోళె ప్రాంతాలు చూడటం నిస్సందేహంగా ఒక మరపురాని అనుభూతి. (నేను ఐహోళె చూడలేదు).

హైదరాబాదు నుండి బాదామికి నేరుగా ట్రయిన్ ఉంది. ఆ ఊళ్ళో దిగడానికి చక్కని వసతులు కూడా ఉన్నై. అయితే ట్రయిన్ ఊరికి కాస్త దూరం. ట్రయిన్ సరిగ్గా రాత్రి సమయంలో ఆ ఊళ్ళో ఆగుతుంది. స్టేషన్ నుండి ఊళ్ళోకి వెళ్ళటానికి మధ్యరాత్రి సదుపాయం సరిగ్గా లేదు. ముందే రిసార్టు/లాడ్జి వాడితో మాట్లాడుకొని రవాణా మాట్లాడుకోవాలి.

బాదామి ఒక చిన్న పల్లెటూరు. ఊళ్ళో ఎక్కువగా బ్రాహ్మణ భోజనశాలలు. బాదామి - ఈ చిన్ని గ్రామం ఒకప్పుడు చాళుక్యుల రాజధాని. ఈ ఊరికే వాతాపి అని ఒకప్పటి పేరు. "వాతాపి గణపతిం భజే" అన్న వాతాపి గణపతి ఇక్కడి దేవుడే. అయితే పల్లవులు వీరిని జయించి ఆ గణపతి విగ్రహాన్ని పట్టుకుపోయారట.

అలాగే వాతాపి, ఇల్వలుల కథ కొంతమందికి తెలిసి ఉంటుంది. ఒకప్పుడు వాతాపి, ఇల్వలుడు అనే రాక్షసులు దారిన పోయే ఋషులను ఆతిథ్యానికి పిలిచేవారు. వాతాపి మేక రూపం ధరించేవాడు. ఆ మేకను చంపి ఇల్వలుడు మాంసం, ఆహూతులకు వడ్డించేవాడు. అందరూ తిన్న తర్వాత "వాతాపీ, వాతాపీ" అని పిలవగానే వాతాపి అతిథుల కడుపు చీల్చుకుని వచ్చేవాడు. ఆపై అన్నదమ్ములిద్దరూ ఆ ఋషులను తినేవారు. ఇలా ఉండగా ఓ మారు అగస్త్య మహర్షిపై ఇదే ప్రయోగాన్ని చేశారట. అగస్త్యమహర్షి కడుపు నిమురుకుంటూ "వాతాపి జీర్ణం, వాతాపి జీర్ణం" అన్నాడు. అలా వాతాపి జీర్ణమవడంతో, ఇల్వలుడు భయపడి అక్కడినుండి బిచాణా ఎత్తేసి పారిపోయాడు.

ఆ వాతాపి ఇల్వలులను ద్వారపాలకులుగా పెట్టిన దేవాలయం బాదామికి ఐదారు కి.మీ దగ్గరలో "మహాకూట" అన్న దేవాలయంలో ఉంది. బాదామి ఊరి మధ్యలో అందమైన ఒక చిన్నసరస్సు ఉంటుంది. ఆ సరస్సు "అగస్త్య తీర్థం". ఈ సరస్సుకు నీళ్ళు వర్షాకాలంలో పక్కన ఉన్న కొండలపై నుండి జలపాతంలా క్రిందకు దిగి వచ్చిచేరతాయి.


తొమ్మిదవ శతాబ్దంలో బాదామి - చాళుక్యుల నుంచి రాష్ట్రకూటుల పరమయ్యింది. వారు అక్కడ భూతనాథుని దేవాలయం కట్టించారు. ఆ తర్వాత కాలాన టిప్పు సుల్తాను కూడా ఆ కొండలపై ఒక కోట కట్టించాడు. ఆ కోట ఎంతో యెత్తున మనకు కనబడుతుంది కానీ అక్కడికి చేరుకోవటానికి సదుపాయం లేదు.

బాదామి - ఈ ఊరికి ఈ పేరు రావడానికి కారణం - చుట్టుపక్కల ఉన్న కొండలు అన్నీ "బాదామి" రంగులో ఉండటమని అంటారు. బాదామి - ఈ ఊళ్ళో ఒక్కొక్క రాయి ఒక్కొక్క కథ చెబుతుంది. ఒక్కొక్క శిల్పం ఒక్కొక్క కావ్యాన్ని, లేదా శాస్త్రాన్ని వినిపిస్తుంది. అగస్త్యతీర్థం వెంబడి గాలి ఆర్ద్రంగా ఆహ్వానిస్తుంది. గొల్లపిల్లవాళ్ళు గొర్రెలు కాసుకునే ఆ కొండల మధ్య నిలిచిన రాళ్ళపై నిలిచిన "కప్పె ఆరభటె శాసనం" - చాళుక్యుల ఆత్మస్థైర్యాన్ని, ధీరత్వాన్ని, హర్షవర్ధనుడంత మహారాజును జయించిన చాళుక్యరాజు రెండవపులకేశి వీరత్వాన్ని శిలాక్షరాలతో చెబుతుంది. తలలు లేని స్త్రీ శిల్పాల వెనుక మార్మికత విస్తుపోయేలా చేస్తుంది. శిరస్సు స్థానంలో తామరపువ్వు కలిగిన నగ్నస్త్రీమూర్తి - లజ్జాగౌరి విగ్రహం ఏ వేదకాలానికో చెందిన అదితి దేవినో సూచిస్తుంది.

అన్నీ కలగలిపి బాదామి - ఒక మరపురాని అనుభవం. బాదామి - ఒక భారతీయత. ఒకప్పటి భారతవర్షంలో ప్రముఖమైన నగరాలు ఏడు.

అయోధ్యామధురా మాయా కాశీ కాంచీ అవంతికా| 
పురీద్వారవతీ చైవ సప్తైతే మోక్షదాయికాః||

కాలం కలిసిరాలేదు కానీ, బాదామి బహుశా ఆ నగరాల సరసన చేరవలసింది. 

2.

బాదామి చుట్టుపక్కల అనేక చారిత్రక శకలాలు ఉన్నాయి ముఖ్యంగా చాళుక్యుల కాలం నాటి దేవాలయాలు. చరిత్ర మీద, దేవాలయాల నిర్మాణాల మీద, పాతకాలపు గ్రామ దేవతల మీద, శిల్పాల మీద, శాసనాల మీద ఆసక్తి ఉన్నవారికి ఈ ప్రదేశం చాలా నచ్చుతుంది. ఈ ఆసక్తులు లేకపోయినా కూడా ఇక్కడ ప్రశాంత వాతావరణం చాలా అద్భుతంగా ఉంటుంది.

బదామి చుట్టుపక్క దేవాలయాలు కొన్ని.

౧. బాదామి గుహాలయాలు: ఇవి మొత్తం నాలుగు. మొదటి గుహలో ఈశ్వరుడు, రెండవగుహలో విష్ణువు, మూడవగుహ హనుమంతుడు, నాలుగవ గుహలో మహావీర జినుడు (బాహుబలి) విగ్రహాలను చెక్కారు. గర్భగుడిలో విగ్రహాలు లేవు. రెండవగుహలో ఒక ప్రముఖమైన శాసనం ఉంది.



బాదామిలో కొండపైన మూలవిగ్రహం లేని దేవాలయాలున్నాయి. ఇంకా చెరువు పక్కన రాష్ట్రకూటులు నిర్మించిన భూతనాథ దేవాలయాలు అద్భుతమైన నిర్మాణానికి తార్కాణంగా ఉన్నాయి. క్రిందన ఒక మసీదు, కాస్త దూరంగా యల్లమ్మ గుడి ఉన్నాయి. గుహాలయాలు దర్శించడానికి ఐదు రూపాయలు రుసుము. ఈ ఊళ్ళో కోతులు కొండముచ్చులు ఎక్కువ. కాబట్టి తినుబండారాలు తీసుకెళ్ళటం కాస్త ప్రమాదం.

చుట్టుపక్కల ఇంకా కొన్ని దేవాలయాలు.

౧. శాకంబరి (బనశంకరి) గుడి.ఇది బాదామి ఊరికి నాలుగు కి.మీ. దూరం.
౨. హొస, హళే మహాకూట. ఇక్కడకు ప్రత్యేకంగా ఆటోలో లేదా కారులో వెళ్ళాలి.
౩. పట్టదకల్లు (World heritage site). బాదామికి 20 కి.మీ దూరం. ఇక్కడ పది దేవాలయాలు ఒక కూటమిగా ఉనాయి. ఈ కూటమికి దూరంగా మరో రెండు దేవాలయాలు ఉన్నాయ
౪. పట్టదకల్లు చుట్టుపక్క పల్లెలలో చెదురుమదురు దేవాలయాలు. వీటికి మనమే వెళ్ళాలి. బస్సులు ఉండవు.
౫. ఐహోళె. (కాళిదాసు, భారవిల గురించి భారతదేశంలో మొదటి శాసనం ఇక్కడ ఉంది). ఇది పట్టదకల్లు నుండి పది పదిహేను కి.మీ దూరం.
౬. ఇంకా సిద్దనకొల్లె, సంగమేశ, ఇలాంటి దేవాలయాలు ఆ చుట్టుపక్కన ఉన్నవి.

పట్టదకల్లులో, బాదామిలో గైడు దొరకగలడు. (మేము గైడును మాట్లాడుకోలేదు)

దేవాలయం/దేవాయతనం.

ఈ రోజుల్లో దేవాలయం అంటే భక్తి, దేవుని వేడుకోవటం, షోడశోపచారాలు, పూజలు, పునస్కారాలు, కర్మ ఇటువంటి వాటికి దేవాలయాన్ని మూలంగా మనం భావిస్తున్నాము కానీ, భక్తి ఉద్యమానికి (10 వ శతాబ్దం) ముందు దేవాలయాలు, భావుకతకు, విద్యాలయాలకు, ధ్యానానికి నెలవులు.

కొన్ని ప్రాచీన దేవాలయాలలో ప్రాకారం, దేవాలయపు బయట శిల్పాలు, ముఖమంటపం, రంగ/సభా మంటపం, అంతరాళం దాటి గర్భగుడి, అక్కడ వెలుతురు తక్కువగా ఉన్న మూర్తి, ఆ మూర్తి ముందు వెలుగుతున్న దివ్వెను చూస్తే మనసులో అలజడి, బుర్రలో మెదిలే అనేక ఆలోచనలు చేత్తో తీసివేసినట్టు కలిగే ఓ అనుభూతిని మనం సూక్ష్మంగా గమనిస్తే తెలుసుకోవచ్చు. ఈ అనుభూతిని కల్పించటానికి దేవాలయాలలో కొన్ని భౌతిక కారణాలు ఉన్నవని నా అనుకోలు. ఈ కారణాలు (ఇవి నా ఊహలే తప్ప ప్రామాణికమైన రుజువులు కావు).

౧. దేవాలయ నిర్మాణ సౌష్టవం (Symmetry)
౨. Spaciousness (space కాదు, ఉన్న జాగాను ఎలా విశాలంగా తీర్చడం అన్నది spaceousness).
౩. వెలుతురు నియంత్రణ
౪. గాలి నియంత్రణ.
౫. విగ్రహం/మూర్తి యొక్క అవ్యక్త సౌందర్యం.

మొదటి రెండూ నిలువుకక్ష్య (Z axis) లో కూడా వర్తిస్తాయి. శృంగేరి చంద్రమౌళీశ్వర స్వామి దేవాలయం అద్భుతమైన సౌష్టవానికి ఒక ఉదాహరణ. ఈ నిర్మాణం యొక్క Plan, Elevation (Top view, Front view) చూడగలిగితే ఇది తెలుస్తుంది.

ఉన్నంతలో జాగాను (Spaciousness ను) ఎక్కువచేయటానికి పిరమిడ్ వంటి స్థూపాకార నిర్మాణం అనువైనదని నాటినుండి నేటివరకు శాస్త్రవేత్తలు చెబుతున్నదే. బహుశా అందుకనే యేమో పాతకాలపు దేవాలయాలు మొదలుకుని ఇళ్ళు, గుడిసెలు కూడా  త్రిభుజాకార స్థూపం రూపంలో కట్టుకున్నారు కాబోలు.

గాలి నియంత్రణ కు అద్భుతమైన ఉదాహరణ శ్రీకాళహస్తి. ప్రధాన మూర్తి గర్భగుడిలో శివలింగానికి ఒక వైపు దీపం నిశ్చలంగా, మరొక వైపున దీపం తీవ్రంగా చలించటం ఉన్నది. ఇది వాయులింగమనే పేరు అందుకే వచ్చిందట.

ప్రాచీన భారతదేశంలో దేవాలయ నిర్మాణాలు స్థూలంగా రెండు విధాలు. మొదటిది ౧. ద్రవిడ విమాన పద్ధతి, ౨. రేఖానగర నిర్మాణం (North Indian).

పట్టదకల్లును దేవాలయాల నిర్మాణానికి ప్రయోగశాలగా వర్ణిస్తారు. బొమ్మలో కుడివైపున రేఖానగరనిర్మాణం. ఎడమన ద్రవిడ విమాన పద్ధతి.


గర్భగుడి, పైన హారం, పైన తలం, ఆపైన శిఖరం, శిఖరంపై కలశం. ఇది ద్రవిడవిమానం. శిఖరం గోళాకారంలో కానీ, చతురస్ర ఘనాకారంలో కానీ ఉండవచ్చునట. రేఖానగర నిర్మాణంలో శిఖరం పై నిర్మాణం మొత్తం ఒక సూచి వద్దకు తీసుకు వచ్చి, ఆ సూచిపై ఆమలకం (ఉసిరికాయ) రూపంలో ఒక ఆకారాన్ని నిక్షేపించటం గమనించదగినది. (పూరీ, భువనేశ్వర్ లలో ఉన్న దేవాలయాలన్నీ రేఖానగర నిర్మాణాలే)

సభామంటపంలో స్థంభాలు కూడా Equidistant లో సౌష్టవంగా అమర్చడం, వాటిపై అందమైన శిల్పనిర్మాణం కూడా గమనించవచ్చు. బయట కుడ్యాలను చూసి, అటుపై, నెమ్మదిగా సభామంటపం దాటి గర్భగుడి వైపుకు వెళుతున్న మార్గంలో Activity తక్కువగా అవుతూ, మనసును శూన్యం, శాంతివైపికు ప్రసరింపజేస్తున్నట్టుగా దేవాలయనిర్మాణాలు చేశారేమోనని అనిపిస్తుంది.

బాదామిలో ప్రధానమైనవి గుహాలయాలు.అదివరకే ఏర్పడిన గుహలలో స్థంభాలు ఏర్పరిచి, లేదా గుహలను ఒలిచి, వాటికి స్థంభాలు నిలిపిన కట్టడాలు యివి. ఇక్కడ దేవాలయనిర్మాణ క్రమ పద్ధతికి అవకాశం లేదు. దేవాలయానికి వచ్చిన ప్రేక్షకులను క్రమంగా శూన్యం వైపుకు తీసుకు వెళ్ళగలిగే plan కు ఆస్కారం లేదు. బహుశా అందుకేనేమో ఈ గుహాలయాల్లో గుహలకు ఇరుపక్కలా మూర్తులను చాలా విశాలంగా మిరుమిట్లు గొలిపేటట్లు చెక్కారు. ఆ అద్భుతం నుండి తేరుకుని ముందుకు సాగితే గర్భగుడి, గర్భగుడి మధ్యలో మూర్తి.

ఈ బాదామి గుహాలయ శిల్పాలలో అద్భుతమైన మార్మికత ప్రత్యేకం. ఈశ్వరుని ఈ శిల్పంలో శివతాండవంలోని 92 భంగిమలు/ముద్రలు నిక్షిప్తమై ఉన్నాయట. నాట్యశాస్త్రమూ, నృత్యం గురించి బాగా తెలిసిన ఆచార్యులు ఈ శిల్పం దగ్గర కూర్చుని వారి శిష్యులకు నృత్యనాట్యాలు నేర్పేవారేమో! రెండవ గుహలో దాదాపు ఎనిమిది అడుగుల ఎత్తు శ్రీహరి విగ్రహం కళ్ళను కాసేపు చూస్తే, ఆ విగ్రహం తిరిగి మనకళ్ళలో చూస్తున్నట్టు అనిపిస్తుంది. నాలుగవ గుహలో జిన విగ్రహం యొక్క చిరునవ్వు కూడా మతిపోగొట్టే అందంతో ఉంటుంది.

















3.

బనశంకరి (శాకంబరీదేవి)

బాదామి - ఊరికి కాస్త దూరంగా బనశంకరి దేవాలయం ఉంది. కాశీలో అన్నపూర్ణేశ్వరిలాగా, దక్షిణభారతంలో పంటలు, ఆహారప్రదాతగా శాకంబరీదేవిని గ్రామీణులు పూజించేవారు. ఈ తల్లి భూదేవి అవతారం. తన శరీరాన్నే భూమిగా మార్చి పంటలు పండించి, మనుషులకు, దేవతలకూ కూడా కడుపు నింపుతుందని గ్రామీణుల విశ్వాసం. క్షామం వచ్చినప్పుడు కూడా ఈ అమ్మవారికి పూజలు చేస్తారు. రేణుకాదేవి, యల్లమ్మ (ఎల్లరకూ అమ్మ - భూదేవి), శాకంబరి - ఇవన్నీ అమ్మవారి వివిధ రూపాలు.

ఈ దేవాలయంలో నిత్యసేవలు, పూజలు ఇప్పుటికీ కొనసాగుతున్నాయి.

ఆలయం ఎదురుగా చాలా పెద్ద కోనేరు ఒకటి ఉంది. ఇది చాళుక్యుల కాలం నాటిది. కోనేరు నాలుగువైపులా స్థంభాలతో విశాలమైన మంటపాలు నిర్మించారు. కోనేటికి ముఖద్వారం ప్రాచీననిర్మాణపద్ధతిలో ఉంది. ఈ దేవాలయానికి దగ్గరలో ఒక కోటముఖద్వారం ఉన్నది. బహుశా ఇది బాదామి నగరద్వారమేమో. దేవాలయం పక్కన కూడా ఒక పాతకాలపు రంగమంటపం ఉన్నది.



కోనేరు దగ్గర ముచ్చటైన రైతుదంపతులు పళ్ళెంలో మల్లెపూలమాల, మందారపూలు, అరటిపళ్ళు తీసుకొచ్చి నీళ్ళలో వదలడం సామాన్యంగా కనిపించే దృశ్యం.

శాకంబరీదేవి దేవాలయం ముఖద్వారానికి ఇరువైపులా ముచ్చటగా, విచిత్రాకృతిలో రాతి దీపస్థంభాలు ఉన్నాయి. ఈ దీపస్థంభాల ఆకారం మొక్కజొన్న/ధాన్యపు గింజ ఆకారంలో ఉండటం గమనించవచ్చు. ఈ విధమైన దీపస్థంభాలు దక్షిణభారతీయ శిల్పకళలో కనిపించవు. ఇటువంటి రాతి దీపస్థంభాలను మహారాష్ట్ర ప్రాచీన దేవాలయాల్లో మనం కనుగొనవచ్చు.

శాకంబరీదేవి దేవాలయం బయట చిన్న చిన్న ముంతల్లో ఏవో తిండిపదార్థాలు అమ్ముతున్నారు. అమోఘమైన రుచి!

4.

ముందు రోజు మధ్యరాత్రి హోటల్లో దిగిన మిత్రబృందం అలసి నిద్రపోతున్నారు. అయితే ఊరు మేల్కొంది. అది ఆదివారం. ఉదయం ఐదున్నరగంటలు. నేను కాలకృత్యాలు తీర్చుకొని బయటకు వచ్చి, ఓ చక్కటి టీ సేవించాను. పల్లె నిదురలేచింది.  చిన్న చిన్న వీథులు. చిన్న చిన్న ఇళ్ళు, ఒక చోట గృహిణులు వీథికొళాయిలో నీళ్ళు పట్టుకుంటున్నారు. ఒక బుడతడు నిక్కరు వేసుకోకుండా అమ్మ వెనుక తప్పటడుగులు వేస్తూ, తనూ ఓ చెంబులో నీళ్ళు మోస్తూ నడుస్తున్నాడు. ఓ ముసలాయన గొంతుక్కూర్చుని "కన్నడప్రభ" పేపరు చదువుకుంటున్నాడు. ఒక తల్లి ఎవరో ఇంటి ముందు కళ్ళాపి జల్లి ముగ్గు వేస్తూంది. అలా వెళుతుంటే దూరంగా ఒక చిన్న గేటు  గేటు ముందు కళ్ళాపి చల్లి ఉంది. అందమైన ముగ్గు కూడా. ఆ ద్వారం లోంచి వెళితే కొండపైకి మెట్లు.  ఆ కొండపైన ఓ చిన్న దేవాలయం. అందమైన శిల్పాలు. బహుశా జైన దేవాలయమేమో. తెలిమంచులో పవిత్రంగా.....




ధ్యానం - అంటే పనిగట్టుకుని కళ్ళుమూసుకోవడం కాదు. తనంతట తానే ఆహ్వానం లేకుండా మనస్సును కమ్ముకునే ఒక నిశ్శబ్దపరిమళం. దీనిని అనుభూతించగలం కానీ, నిర్వచించలేం. ఆ ధ్యానం అనేదేమిటో బాదామిలో ఉన్న అనేక ప్రాచీన దేవాలయ ప్రాంగణాలలో ఏ ఒక్కచోటైనా ఓ అరగంట గడిపితే ఎవరికైనా తెలుస్తుందని నా బలమైన విశ్వాసం.

5.

బాదామి గురించి వెతకగానే జాలంలో కనిపించే ప్రధాన దేవాలయాలు భూతనాథ దేవాలయాలు. బాదామిని చాళుక్యుల తర్వాత రాష్ట్రకూటులు పరిపాలించారు. వారు కట్టించిన అందమైన దేవాలయాలివి. అగస్త్య తీర్థం గట్టుపైన ఉన్నాయివి.



ఆ దేవాలయం వెనుక వైపు దారి ఉంది. అక్కడ చిన్న చిన్న గుహలలోపల విగ్రహాలు చెక్కారు. ఆ గుడి ప్రాంగణంలో, ప్రధానమందిరానికి వెనుక ఉన్న మందిరం గర్భగుడిలో, నగ్న స్త్రీమూర్తి తాలూకు మార్మిక విగ్రహం కనిపిస్తుంది.



భూతనాథుని రెండవ దేవాలయం బాదామి మ్యూజియమ్ కు దగ్గరగా ఉంది. ఆ దేవాలయం శిల్పప్రాభవానికి, అందమైన పైకప్పుకూ నిదర్శనం. ఈ గుడిలో కొన్ని శిల్పాలు విరగగొట్టి పడవేశారు.చూస్తే, కాస్త కలుక్కుమంటుంది.





బాదామిలో తప్పక చూడదగించి మ్యూజియమ్. చిన్నదే అయినా చాలా చక్కగా ఉంది. ప్రవేశరుసుము ఐదు రూపాయలు. మ్యూజియమ్ పక్కగా కొండపైకి మెట్లదారి ఉంది. అది ఎక్కడం కూడా మర్చిపోరాదు.

బాదామి గుహాలయాలకు బయట ఒక మసీదు ఉంది. మా మిత్రబృందం గుహాలయాలు అన్నిటిని చూసి దిగిన తర్వాత, దూరంగా కనిపించే భూతనాథుని గుడికి వెళ్ళాలనుకున్నాము. కనిపిస్తున్న సరస్సు చుట్టూ నడుచుకుంటూ వెళదామని తీర్మానించుకుని కిందకు దిగాము. క్రింద ఒక పురాతన మసీదు ఉంది. ఆ మసీదు ఎదురుగా కోటగోడ వారన ఒక రాతిమార్గం ఉంటే అందులోకి వెళ్ళాము. ఆ దారి చెరువు దగ్గరికి దారి తీసింది. ఒక కన్నడ స్థానికుడు పలుకరించేడు. ముందు దారి ఉందా? అని అడిగితే అతను "ఆది మానవ" అన్నాడు. అతడన్నది మాకు అర్థం కాలేదు. ఆ ముందు దారి లేదని మేమే నిర్ధారించుకున్నాము.


చాలా సేపు తర్వాత అంటే నడిచి నడిచి భూతనాథ దేవాలయం చేరిన తర్వాత ఎదురుగా చెరువుకావల చూస్తే కొన్ని శిల్పాలు కనిపించినాయి. అక్కడ తుప్పలు, ముళ్ళపొదల మధ్య ఒక చిన్న Folk village లాంటిది ఉన్నది. అక్కడ ఆదిమమానవుల జీవనవిధానాలను బొమ్మలుగా కూర్చి పెట్టారు. అయితే వెళ్ళటానికి మార్గం మాత్రం లేదు. అంటే ఆ రూట్ లో అంతా ముళ్ళపొదలు పెరిగి దారి మూసుకుపోయింది. ఆ పల్లెయువకుడు ’ఆదిమానవ’ అని చెప్పింది దానిగురించేనని అర్థమయింది.బహుశా అక్కడ నుండి గుహాలయాలపైకి అంటే టిప్పు సుల్తాను కోటకు కూడా దారి ఉండవచ్చు.

బాదామి లో అగస్త్యతీర్థానికి ఒడ్డున ఓ ముచ్చటైన మ్యూజియం ఉంది.మ్యూజియం దాటిన తర్వాత ఎడమకు ఓ తొవ కొండపైకి దారితీస్తోంది. ఆ మార్గంలో ఓ కొండరాయిపైన "కప్పె ఆరభట్టీయ" శాసనాన్ని  చాళుక్యరాజులు  కన్నడ, సంస్కృతాలలో, నాటి కన్నడలిపిలో చెక్కించారు. ఈ లంకెలో ఆ శాసనం గురించి చదువుకోవచ్చు.

ఆ శాసనం చూసిన తర్వాత అదే దారిన ముందుకు వెళితే కొండపైకి దారితీసింది. అక్కడ అనే ఒక కుర్రాడు మేకలను కాసుకుంటున్నాడు. వాడి పేరు "రవి". ఎనిమిదవ తరగతి అట. వాడు మాకు కొండపైకి ఒక ఇరుకు దారి చూపించి తనూ దారితీశాడు. మేము ఆపసోపాలు పడుతూ ఎక్కేం. వాడు మాత్రం చలాకీగా పైకెక్కేశాడు. అదో అద్భుతం. కనుచూపు మేరా ఆకాశం,అందమైన పైరుపచ్చ. అక్కడక్కడా వర్షపు నీటి చెలమలు. అద్భుతమైన నిశ్శబ్దపరిమళం. నేలంతటా పరుచుకున్న గడ్డి, చిన్న చిన్న పూలు.

అక్కడ ఆ అబ్బాయి ఒక మధ్వుల ఆంజనేయస్వామి దేవాలయాన్ని (ఇది ఈ కాలం నాటిది) చూపించాడు.

ఆ చిన్న దారిలో అలాగే పైకెక్కితే, మూలవిగ్రహం లేని ఓ పాతకాలపు దేవాలయం (ఇది లజ్జాగౌరి గుడి అని తర్వాత తెలిసింది), రెండు బురుజులూ, మరో చిన్న దేవళం కనిపించింది. అది ఆ కొండలకన్నింటా ఎత్తైన point. ఆ దారి మళ్ళీ వచ్చి కొండ క్రింద ఒక మ్యూజియం వద్దకు దారితీసింది. తలవని తలంపుగా కనిపించిన ఆ గైడు మాకు ఆ రోజు అద్భుతమైన అనుభూతిని మిగిల్చేడు.









6.

పట్టదకల్లు.

"ಎಲ್ಲಿಗೆ ರೀ? ದೇವಸ್ಥಾನಗಳು ನೋಡಕ್ಕೇ ಬಂದಿದ್ದಿರಾ?"
"ಹವುದು ರೀ".

ఓ పెద్దావిడ బస్సులో మాటలు కలిపింది. చాలా ఆకర్షణీయమైన ముఖం. పావలా కాసంత నుదుటి బొట్టు. బాగల్ కోట అందమైన కన్నడయాస. అక్కడ పల్లెల్లో పేదరికం తాండవిస్తూంది. అయినా జీవితం తీరుబడిగా సాగిపోతుందని చెప్పుకొచ్చింది ఆవిడ. అదే పదివేలు!

ఇలా ఎక్కడో బస్సులో తారసపడే సామాన్యులు, నిర్మానుష్యంగా ఉన్న చోట పొలాల్లో కలిసి చల్ది/ముద్ద పంచుకుంటున్న రైతులను చూస్తే, పిడికిలి లోంచి ఇసుకలా జారిపోయే నగరజీవితం తాలూకు వికృతి కనిపిస్తుంది. సెల్ఫోన్లు, టీవీలూ, 4G లు, ఆధునికమైన అన్ని సదుపాయాలు అన్నీ ఉన్నాయి. లేనిది జీవితం ఒక్కటే. పిజ్జాలున్నా ఆకలి లేని జీవితాలివి! 

బస్సు గతుకు దారుల్లో పల్లెపట్టుల్లో ప్రయాణిస్తూ ఓ చిన్ని పల్లెటూరికి వచ్చింది. దిగి, కాస్త ముందుకు వెళ్ళి ఓ దేవాలయప్రాంగణం లోకి అడుగుపెట్టాము. అంతే! ఇదేనా పట్టదకల్లు? సరిగ్గా యే యేడవశతాబ్దం తాలూకు చాళుక్యుల కాలానికో అడుగుపెట్టినట్టుంది. ఈ మాట అక్షరాలా పొల్లు కానే కాదు. బెట్!


బాదామికి 20 కి. మీ దూరంలో మలప్రభ నది ఒడ్డున ఉన్న ఒక దేవాలయ సముదాయం, World heritage site పట్టదకల్లు. ఈ ప్రాంగణంలో పది దేవాలయాలు ఉన్నాయి. ఇవి విభిన్నకాలాలలో కట్టించినవి. విభిన్న శైలులలో నిర్మించినవి. దాదాపు అన్నీ ఈశ్వరుని దేవాలయాలే. చాళుక్యుల కాలం క్రీ.శ ఆరవశతాబ్దం మొదలుకుని తొమ్మిదవ శతాబ్దం వరకూ సాగింది. మధ్యలో కొంతకాలం పల్లవులు బాదామిని జయించి రాజ్యం చేశారు. ఆపై చాళుక్యరాజు రెండవ విక్రమాదిత్యవర్మ పల్లవులను ఓడించి తిరిగి బాదామిలో చాళుక్యుల రాజ్యాన్ని నెలకొల్పాడు. ఆ విజయస్థంభం, ఆనాటి విజయానికి చిహ్నం విరూపాక్షదేవాలయం దగ్గర ఉంది. అంతే కాదు, విక్రమాదిత్యవర్మ భార్యలయిన లోకమహాదేవి, త్రైలోక్యమహాదేవి పేరిట విరూపాక్ష, మల్లికార్జున దేవాలయాలు నిర్మించినట్టు ఆ విజయ స్థంభంపై శాసనం చెబుతుంది.



ఆ ప్రాంగణంలో సంగమేశ్వరుడు, గలగనాథుడు, కాడసిద్దేశ్వరుడు, మల్లికార్జునుడు, విరూపాక్షుడు, పాపనాథుడు ఇలా రకరకాల దేవాలయాలు. ఒక్క జిన దేవాలయం కూడా ఉంది. (జినదేవాలయాల్లో స్థంభాలపై శిల్పాలు ఉండవు. అంతే కాక బయట కూడా శిల్పప్రాభవం ఉండదు. అది కాక ముఖమంటపం, గర్భగుడి వగైరాలు దాదాపు హిందూ దేవాలయాల లానే ఉంటాయి.)

ఈ పట్టదకల్లు చాళుక్యుల కాలానికి ఎంతో ముందే ప్రసిద్ధిపొందిన పట్టణం. క్రీ.శ. రెండవ శతాబ్దంలో ప్టాలెమీ అనే గ్రీకు వాఁడు భౌగోళిక శాస్త్రం వ్రాశాడట. వాడి పుస్తకంలో పట్టదకల్లు గురించిన ప్రస్తావన ఉందట. ఈ మధ్య అంటే 2005 లో పాత రాతియుగం నాటి పనిముట్లు, క్రీ.పూ 300 నాటి వస్తువులూ అక్కడ బయటపడ్డాయి. దగ్గరలో ఉన్న బి. ఎన్. జాలిహాల్ అన్న కుగ్రామంలో నాటి ఇల్లొకటి, రెండవ విక్రమాదిత్యుని మరణానికి సంబంధించిన చిహ్నమూ, తాంత్రిక దేవత ఆలయమూ కూడా కనిపించాయట. ప్రాచీన కాలంలో ఏ రాజ్యంలో అయినా మహారాజుకు పట్టాభిషేకం చేయబోయే తరుణంలో ఈ స్థలానికి వచ్చి అర్చనలు చేసి తర్వాత తమ రాజ్యానికి వెళ్ళి వేడుకలు చేసుకొనే వారట. అందుకనే పట్టద-కల్లు అన్న పేరు.

ఇక్కడి దేవాలయప్రాంగణంలో ఒక్క విరూపాక్షస్వామి ఆలయంలో మాత్రం నిత్యపూజలు ఈ నాటికీ జరుగుతున్నాయి. మిగిలినవన్నీ చారిత్రక అవశేషాలుగా ఉన్నాయి. ఓ విచిత్రమైన విషయం ఏమంటే - హంపిలోనూ, పట్టదకల్లు లోనూ కేవలం విరూపాక్షుని దేవాలయాలు మాత్రమే ముష్కరుల దాడికి గురి కాలేదు. మిగిలిన దేవాలయాలు దాడికి గురికావడమో, కాలప్రభావానికి లోనై శిథిలం కావడమో జరిగాయి. 

ఈ విరూపాక్షస్వామి ఆలయం ముందు నందిమంటపం, జీవం తొణికిసలాడే నందివిగ్రహం, ముఖమంటపం, (Portico) పైకప్పులో అద్భుతమైన సూర్యవిగ్రహం, ద్వారానికి రెండువైపులా దంపతి విగ్రహాలు, లోపల సభామంటపంలో స్థంభాలపై దంపతి విగ్రహాలు, అంతరాళం, ప్రదక్షిణమార్గం, గర్భగుడి విరూపాక్షస్వామి లింగం, పక్కన మహిషాసురమర్దని ఆలయం ఉన్నాయి.

దేవాలయం ద్రవిడవిమాన శైలి. దేవాలయం బయట అనేక శిల్పాలు చెక్కారు. కన్నడ రాజ్యరస్తసారిగె (KSRTC) చిహ్నమైన గండభేరుండం ఈ గుడి పైని శిల్పం నుండే స్వీకరించారు. దానిపక్కన మయూరాల జంట కూడా ఆసక్తికరమైనది. గైడు చెప్పిన కథ ఇది. (మేము గైడును మాట్లాడుకోలేదు కానీ ఇంకొకరి గైడు చెప్పిన దాన్ని విన్నాము)

మగనెమలి వర్షాకాలంలో పురివిప్పి నాట్యం చేసి, ఆడునెమలిని ఆకర్షిస్తుందట. ఆపై మగనెమలి గ్లానితో, అలసటతో ఒక కన్నీటి చుక్కను విడిస్తే, ఆ చుక్కను ఆడునెమలి మింగి, గుడ్డు పెడుతుందట. ఇదంతా ఓ శిల్పంలో పొదిగి, symmetrical గా మలచాడు నాటి శిల్పి. బొమ్మలో ఎడమవైపున ఉన్నది మగనెమలి. దాని శిఖి చాలా హొయలొలుకుతూ ఉంది కాబట్టి.



భారతదేశంలో శిల్పకళకు పరాకాష్ట అనదగినవి - హొయసళుల బేలూరు, హళేబీడు దేవాలయాలు. శిల్పాలలో జీవచైతన్యం, space management, సౌందర్యం, సౌష్టవం, perfection, శిల్పాలపైని అలంకరణా, దుస్తులూ, నాటి కాలపు సామాజిక పరిస్థితుల చిత్రణా ఇలాంటి అనేక విషయాలలో హొయసళ శిల్పం pinnacle అనవచ్చునేమో.

పట్టదకల్లు శిల్పాలు హొయసళుల కాలానికంటే చాలా పూర్వపు కాలానివి. ఇక్కడ శిల్పాలలో perfection, అలంకరణా, హొయసళుల శిల్పం స్థాయికి లేకపోవచ్చు. బహుశా ఈ శిల్పాలు Sandstone లో చెక్కడం కూడా ఒక కారణం కావచ్చు. గ్రానైటు రాయి - పదునైన రాయి కావడం మూలాన ఎక్కువ కాలం మన్నగలదు. ఇసుకరాయికి వర్షానికి, వాతావరణ మార్పులకూ త్వరగా లోనవడం మూలాన అరుగుదల యెక్కువ. బహుశా అందుకనే కాబోలు ప్రాచీన దేవాలయాలలో మూలవిగ్రహాలు తప్పనిసరిగా నల్ల గ్రానైట్ రాయితో చెక్కడం మనం గమనించవచ్చు.

పట్టదకల్లు దేవాలయాలను శిల్పశాస్త్రప్రయోగాలుగా పేర్కొంటారు. ఒక్కొక్క గుడి ఒక్కొక్క విధంగా కనిపిస్తూ ఆ విషయం నిజమేననిపిస్తుంది. నందివిగ్రహం మాత్రం నల్లని రాయిలో అత్యద్భుతంగా చెక్కారు. నందిమంటపమూ అపూర్వంగా ఉంది. ఆ మంటపంలో పాతకాలపు కన్నడలో ఏదో రాసుంది.

పైన ఓ చోట చెప్పుకున్నట్టు - మందిరంలోపల వెలుతురు కూడా ఆధ్యాత్మికతకు ఒక కారణం. దీనికి ఋజువు  విరూపాక్షస్వామి దేవాలయంలోని మహిషాసురమర్దిని మందిరంలో స్పష్టంగా కనిపిస్తుంది.     

ముఖమంటపై ఎడమవైపు రాచదంపతులు, కుడివైపు గ్రామీణ దంపతులు ఆసక్తికరమైన అంశం. పక్కన కన్నడ శాసనం ఒకటి కనిపిస్తుంది. ద్వారబంధానికి ఇరువైపులా దంపతులు, అప్సరలు, పూలతీవెలూ లేదా ద్వారపాలకులూ చెక్కడం అనవాయితీ అట. అనంతపురం లేపాక్షిలో అప్సరలూ వారి తలపై వలయంగా తీవెలూ చెక్కారు. ఇది విజయనగరశైలి. ఇదే శైలి విజయనగర కాలం నాటి ఇతర దేవాలయాలలో (తాడిపత్రి, హంపి, యాగంటి వగైరా) కనిపిస్తుంది.



9 వ శతాబ్దపు నోలంబ రాజుల శిల్ప శైలి విభిన్నమైనది. వీరి రాజధాని హైమావతి. (అనంతపురం జిల్లా, అమరాపురం తాలూకా). ఈ నోలంబుల శిల్పకళలో ముఖద్వారాన దంపతులు కనిపిస్తారు కానీ, పరిమాణం దృష్ట్యా చాళుక్యుల శిల్పాల కంటే వీరి శిల్పాలు చిన్నవి.

విరూపాక్షస్వామి ద్వారపు పైకప్పు మీద సూర్యవిగ్రహం అద్భుతమైన space management కు నిదర్శనం. సూర్యభగవానుడు, ఆయన భార్యలయిన ఉష, సంధ్యలు బాణాలెక్కుపెట్టి తిమిరాలను పోగొడుతున్నట్టు, సారథి అరుణుడు, గుర్రాలు, సూర్యభగవానునికి స్వాగతం చెబుతున్న ప్రజలూ, స్వర్గలోకవాసులూ....ఇదంతా ఒక్క చోట స్వారస్యం చెడకుండా, సౌష్టవంగా, అందంగా చెక్కాడు శిల్పి.



ఈ ప్రాంగణం పక్కన ఘటప్రభ నది ప్రవహిస్తుంది.మేము వెళ్ళిన సమయాన నది ఎండిపోయి ఉంది. ఆ నది గర్భంలో ఆదిమమానవుల పనిముట్లు దొరికాయట.ప్రాంగణానికి దూరంగా, నదీతీరానికి ఆవల మరొక శిథిల దేవాలయం ఉంది. అక్కడికి చేరుకోవటం కాస్త కష్టం.

పట్టదకల్లు దేవాలయాల ప్రాంగణం నుంచి బయటపడ్డం ఓ పట్టాన సాధ్యపడదు. కష్టం పైన వదిలి రావాలి.

******