మయూఖము - 2

అంగదుడు రావణుని వద్దకు సీతను అప్పగించమని రాయబారానికి వచ్చాడు. అంగదుడే ఎందుకు? ఎందుకంటే ఫ్లాష్ బ్యాక్ లో వాలి రావణుని బంధించి ముప్పుతిప్పలు పెట్టి మూడు సముద్రాలలోముంచాడు. అంతే కాదు ఆ రావణుని తలను తన బాహుమూలల్లో ఇరికించుకుని, తొట్టెలో ఆడుకుంటున్న తన శిశువు అంగదుడికి ఆటబొమ్మలా చూపించాడు. ఆ సందర్భాన ఆ శిశువు ఆ ఆటబొమ్మ (రావణుని తలను) తన చిట్టిపాదాలతో తన్ని ఉన్నాడు. (ఆ శిశువు ఇంకేదైనా చేశాడేమో కూడా. అది తెలీదు.)

చిన్నసైజు సీమ ఫాక్షనిజం కథలాంటి ఫ్లాష్ బ్యాక్. ఇంత ఉంది కాబట్టి అంగదుడు వచ్చాడు రాయబారానికి. ఆ సందర్భంలో శ్లోకం.

"రే రే రావణః! రావణాః కతి బహూనేతాన్వయం శుశ్రుమః
ప్రాగేకం కిల కార్తవీర్యనృపతేర్దోర్దండపిండీకృతమ్ |
ఏకం నర్తనదాపితాన్నకవలం దైత్యేంద్రదాసీజనైః
ఏకం వక్తుమపి త్రపామహ ఇతి త్వం తేషు కోऽన్యోऽథవా ||"

రే రే రావణః;
రావణాః = రావణులు;
కతి = ఎంతమంది?
వయం = మేము;
బహూన్ = అనేక పేర్లను
శుశ్రుమః = విన్నాను;

కార్తవీర్యనృపతేః = కార్తవీర్యుడనే ఓ రాజు చేత;
దోర్దండ = బాహువుల చేత;
పిండీకృతమ్ = చూర్ణం చేయబడినది;
ప్రాక్ ఏకం కిల = మునుపు ఒకటి (ఒక పేరు) అట;

ఏకం = మరొకటి;
దైత్యేంద్రదాసీజనైః = దానవరాజు బలి ఇంట్లో ఆయా ల చేత :) ;
నర్తనదాపితాత్ న కబలం = నృత్యం చెయ్యనకపోతే ముద్ద కూడా తినిపించబడనిది;

ఏకం = ఇంకొకటి;
వక్తుమపి = చెప్పటానికి కూడా సిగ్గుపడుతున్నాను; (అంగదుని ఫ్లాష్ బ్యాక్)
త్వం = నీవు;
తేషు = వాటిలో;
కః = ఎవడవు ?;
అథవా = అలా కాకుండా;
అన్యః (వా) = వేరొకడివా ఏమి?

"రే రే రావణ! నీ పేరు ఇంతకుముందు చాలా విన్నాను. ఒకటి - కార్తవీర్యుడనే రాజు చేతిలో పిండి ముద్దగా అయిన పేరు. మరొకటి - దైత్యరాజు బలి నిన్ను బంధిస్తే అతని ఇంట్లో ఆయాలు డాన్స్ చేస్తే తప్ప అన్నం పెట్టం అని "ర్యాగింగు" చేశారే ఆ పేరు. ఇంకోకటి - చెప్పడానికి నాకే సిగ్గు అనిపిస్తున్నది. అందులో నువ్వెవడు? ఇది కాకుండా ఇలాంటి ఎక్స్ పీరియన్సులు ఇంకా ఉన్నాయా ఆ పేరు మీద?"

(రావణుడు బలితో తన్నులు తిన్న వ్యవహారం బహుశా మండోదరి వెనక పడినప్పటిది కావచ్చు. )

సంస్కృతం లో "మాస్" సాహిత్యం కనబడినప్పుడు వచ్చే ఆనందం అనుభవైకవేద్యం. ఈ మాస్ వ్యవహారం రామాయణాధారిత నాటకంలో ( పైన పేర్కొన్న శ్లోకం) ఎంత హాయిగా ఉంది?

ఇది దూతాంగదమనే ప్రాచీన నాటకం. కవి పేరు సౌభటుడు. నేటికి కొంచెమే లభిస్తోంది ఈ నాటకం.

ఇంకో మాస్ మసాలా శార్దూలవిక్రీడితం. ఇది రావణుడికి అంగదునికి మధ్య సంభాషణ.

'రామః కిం కురుతే?' 'న కించిత్ 'అపి చ ప్రాప్తః పయోధేస్తటం
కస్మాత్సాంప్రతం?' 'ఏవమేవ హి ' ' తతో బద్ధః కిమంభోనిధిః'|
'క్రీడాభిః' ' కిమసౌ వేత్తి పురతో లంకేశ్వరో వర్తతే'
'జానాత్యేవ విభీషణోऽస్య నికటే లంకాపదే స్థాపితః' ||

'రాముడు ఏం చేస్తున్నాడీ మధ్య?'
'ఏం చెయ్యట్లా'
'మరి సముద్రం ఒడ్డున విడిదీ..'
'ఊరికే'
'సేతువెందుకు కట్టినట్టో?'
'ఆట కోసం'
'ఇక్కడ ముందర లంకేశ్వరుడున్నాడని తెలీదా?'
'తెలుసు. ఇదుగో, త్వరలోనే ఈ లంకా సింహాసనాన్ని విభీషణుడు ఎక్కబోతున్నాడు.'

రెండు శ్లోకాల్లోనూ చివ్వరి పంచ్ లలో ధ్వనిపుష్టి ఎలా ఉందో చూడండి. మొదటి శ్లోకంలో 'అన్యః అథవా?' - అంటే, నీకు నేను చెప్పిన పేర్లు కాక ఇంకా నీచమైన పేర్లున్నాయా అనిన్నీ, రెండవ శ్లోకం చివర్న " నీకు మూడింది" అనిన్నీ వ్యంగ్యార్థాలు.

ఓ పెద్ద విజిల్ తోటి ఈ పోస్టు ముగింపు.

"కయ్య్య్య్య్"


కామెంట్‌లు

  1. ఈ వ్యాఖ్యను ప్రచురించకండి. చదివి సవరణలు చేయండి అవసరమనుకున్న చోట:

    ఒకటి రెండు చిన్న తప్పులు శ్లోకంలో. నాకు కనబడిన పాఠం ఇక్కడ -

    రే రే రావణ రావణాః కతి, బహూనేతాన్ వయం శుశ్రుమ
    ప్రాగేకం కిల కార్తవీర్య-నృపతేర్దోర్దణ్డ-పిణ్డీకృతమ్।
    ఏకం నర్తనదాపితాన్నకవలం దైత్యేన్ద్ర దాసోజనై-
    రేకం వక్తుమపత్నపామహ ఇతి త్వం తేషు కోఽన్యోఽథవా॥

    అర్థవివరణలో -

    రే రే రావణ, రావణాః కతి (ఎందరు రావణులున్నారు రా రావణా)
    బహూన్ ఏతాన్ వయం శుశ్రుమ = మేము ఈ అనేకులను (చాలా పేర్లను) (గురించి) విన్నాము.
    వయమపి త్రపామహే = మేము కూడా సిగ్గు పడుతున్నాము

    ఈ నాటకం పూర్తిగానే ఉన్నదనుకుంటాను ఇక్కడ - ఒకసారి చూడండి -

    https://ia600109.us.archive.org/4/items/DutangadamWithSanskritHindiCommentariesAnantaramaSastriVetala1950_201802/Dutangadam%20with%20Sanskrit%20%26%20Hindi%20Commentaries%20-%20Anantarama%20Sastri%20Vetala%201950.pdf




    రిప్లయితొలగించండి

  2. దూతాంగదము ( తెలిగింపు) - బులుసు వేంకట రమణయ్య + దోమా వేంకట స్వామి గుప్త (1934).


    మత్తేభము :

    అరరే ! రావణ ! రావణుల్ పలువు రంచాలింతు, మా కార్తవీ
    ర్యరసాధీడ్దృఢ బాహు దండ కృత పిండాకారగుండొక్కడొ
    క్కరు డా దైత్యపదాసికా పటల నృత్యోత్సాహ దత్తాన్ను డిం
    కొరునిందుం దెలుపంగ సిగ్గిలుదు - నీవొక్కండవో యందునన్ ?

    లింకు -

    http://sathyakam.com/pdfImageBook.php?bId=12944#page/14

    జిలేబి

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Comments ridiculing, abusing, bullying and forcing to agree in any form, if objectionable to the blog owner will be removed.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వాఙ్మయచరిత్రలో కొన్ని వ్యాసఘట్టాలు - శ్రీ ఏల్చూరి మురళీధరరావు గారు.

అశోకుడెవరు? - 1

ముకుందవిలాసః - కుంటిమద్ది శేషశర్మ.