31, జనవరి 2014, శుక్రవారం

సంస్కృతసౌరభాలు - 15

ఇప్పటికి సరిగ్గా ఒక తరం క్రిందటి ప్రజానీకానికి ఆకాశవాణి తమ జీవితంలో ఒక భాగం. ఆకాశవాణి తో అణుమాత్రం పరిచయం ఉన్న వారికి ఎవరికైనా ఈ క్రింది పద్యం తెలిసి తీరుతుంది.

కేయూరాణి న భూషయన్తి పురుషం హారా న చంద్రోజ్జ్వలా
న స్నానం న విలేపనం న కుసుమం నాऽలంకృతా మూర్ధజాః |
వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే
క్షీయన్తేऽఖిలభూషణాని సతతం వాగ్భూషణం భూషణమ్ ||

మనిషికి భుజకీర్తులు, చంద్రునిలా ఉజ్జ్వలంగా మెరిసే ముత్యాలహారాలు, స్నానం, గంధలేపనాలు, పువ్వులు, శిరోజాऽలంకరణలూ శోభనివ్వవు. శాస్త్ర సంస్కారము కలిగిన వాక్కు ఒక్కటే అతడికి శోభ చేకూరుస్తుంది. అన్ని భూషణాలు నశిస్తాయి కానీ వాగ్భూషణం మాత్రమే నిజమైన భూషణంగా నిలిచి ఉంటుంది.

బాల్యంలో ఒక వ్యక్తి చుట్టూ ఉన్న సంఘటనలు, చిన్న చిన్న అంశాలు ఎంత చిన్నవైనా జీవితంలో గొప్ప ప్రభావం చూపిస్తాయి. ఏ ఉత్తమ సంస్కారానికైనా ఎక్కడో ఒక చోట చిన్న బీజం ఉండక తప్పదు. చాలామంది జీవితాలలో ఈ పద్యం అలాంటి ఉత్తమ సంస్కారబీజం అయి ఉంటుంది. వారి సంస్కారానికి కారణం ఈ బీజం అని మరిచిపోయి కూడా ఉండవచ్చు గాక.

పుట్టపర్తి నారాయణాచార్యులు గారు వాల్మీకి రామాయణం గురించి వ్రాసిన ఒక అపూర్వమైన వ్యాఖ్యలో ఒక మాట అన్నారు. వాల్మీకిని ఒక మలయాళీ "అరే వాల్మీకి సంస్కృతం మన మలయాళానికి ఎంత దగ్గరగా ఉంది" అని, అలాగే హిందీ, మరాఠీ, బెంగాలీ, తెలుగు వాళ్ళు ఇలా అందరు ఎవరికి వారు తమ భాషకు దగ్గరగా వాల్మీకి సంస్కృతం ఉన్నట్టు భావిస్తారట. చాలా అనాయాసమైన భాష వాల్మీకి మహాకవిది. శ్రీశ్రీ కూడా ఓ మారు - "సంస్కృతం నాకురాదు కానీ, వాల్మీకి రామాయణం చదివితే అర్థం అయినట్టే ఉంటుంద"ని చెప్పారుట. వాల్మీకి తరువాత ఆ విధమైన "మన" అన్న భావనను కలిగించిన సంస్కృత కవి బహుశా భర్తృహరి కావచ్చు. భర్తృహరి నీతి, శృంగార వైరాగ్యశతకాలు రచించాడు. ఇందులో నీతి శతకం అగ్రగణ్యమైనది. భర్తృహరి నీతి శతకంలో చాలా శ్లోకాలు అనేకులకు తెలిసి ఉంటాయి. అందునా తెలుగు వారికి అనువాదాల ద్వారా ఈ కవి మరింత చేరువ అయి, మహాప్రీతిపాత్రుడైనాడు.

జయన్తి తే సుకృతినో రససిద్ధాః కవీశ్వరాః |
నాస్తి తేషాం యశః కాయే జరామరణజాం భయమ్ ||

పరివర్తిని సంసారే మృతః కో వా న జాయతే్
స జాతో యేన జాతేన యాతి వంశస్సమున్నతిమ్ ||

కుసుమస్తబకస్యేవ ద్వయీవృత్తిర్మనస్వినః
మూర్ధ్ని వా సర్వలోకస్య శీర్యతే వన ఏవ వా ||

యస్యాస్తి విత్తం స నరః కులీనః స పణ్డితః స శ్రుతవాన్ గుణజ్ఞః |
స ఏవ వక్తా స చ దర్శనీయః సర్వే గుణాః కాంచనమాశ్రయన్తి ||

దానం భోగో నాశస్తిశ్రో గతయో భవన్తి విత్తస్య |
యో న దదాతి న భుంక్తే తస్య తృతీయా గతిర్భవతి ||

దుర్జనః పరిహర్తవ్యః విద్యయాऽలంకృతోపి సన్ |
మణినా భూషితస్సర్పః కిమసౌ న భయంకరః? ||

ఇలా ఎన్నో శ్లోకాలు అర్థం కూడా వివరించనవసరం లేకుండానే చాలామందికి తెలుసు. భర్తృహరి నీతి శతకం అనువాదంలోని ఒక పద్యపాదం ఒకానొకప్పుడు దినపత్రికలో న్యూస్ హెడింగ్ గా వచ్చింది. పీ వీ నరసింహారావును పదవీచ్యుతుని చేయడానికి స్వయంగా ఆయన శిష్యుడు సీతారాం కేసరి ప్రయత్నించిన సందర్భమది. ఆ శీర్షిక ఇది - "భాసమానమగు కేసరి జీర్ణతృణంబు మేయునే?"

భర్తృహరి చెప్పిన "మూర్ఖుని" గురించి ఇక వివరించనవసరమే లేదు. నీతిశతక ఆరంభమే మూర్ఖపద్దతితో ఆరంభమవుతుంది. తివిరి ఇసుమున తైలంబు తీసిన వాడిని, సముద్రంలో ఒక చుక్క తేనె కలిపి తీయగా మారుద్దామనుకునే వాణ్ణి, కుందేటికొమ్ము సాధిద్దామనుకునే వాణ్ణి.....ఎవరు గుర్తుంచుకోరు? ఇక ఆరంభింపని నీచమానవుడూ, దైవోపహతుడైన ఖర్వాటుడూ, ఒకచో నేలను పవ్వళించు ప్రయత్న శీలి, పరోపకారార్థమిదం శరీరం అనుకునే పరోపకారి ఇలా ఎందరో మనకు తెలుసు. భర్తృహరిని మనకు తెలియకుండానే మన జీవితంలో భాగమైనాడు. ఈ ఒక్క వ్యక్తి వ్రాసిన ఒక్క శతకాన్ని చదవడం కనీసం వంద పుస్తకాలను చదివిన పెట్టు. ఈ కవి తెలుగు వారికి చాలా దగ్గర అయినాడు. భర్తృహరి నీతిశతకానికి ఎలకూచి బాలసరస్వతి, పుష్పగిరి తిమ్మన, ఏనుగు లక్ష్మణకవి వంటి ప్రముఖులు తెనుగు చేశారు. వారు మన భాషలో, భావంలో, సంస్కారంలో, మన హాస్యంలో, పలుకుబళ్ళలో, అణువణువునా ఇమిడిపోయారు.

సంస్కృతంలో అనేక కవులలానే ఈ కవి గురించి కూడా ఖచ్చితమైన సమాచారం లేదు. కొన్ని కథనాల ప్రకారం ఈయన బౌద్ధం స్వీకరించిన హిందువు. బౌద్ధంలో భిక్షువులసంఘంలో ధ్యానంలో ఆయా వ్యక్తులు సాధించిన పరిణతిని బట్టి వారి పదవి/పిలుచుకునే పేరు ఉంటుంది. శ్రోతాపన్నుడు, సకృదాగామి, అనాగామి, అర్హతుడు ...ఇలా. సంఘంలో చేరినవాళ్ళు ఏదైనా అపరాధం చేసో లేక బౌద్ధం విరమించుకుంటేనో వాళ్ళు సంఘబహిష్కృతులవుతారు. అలా బహిష్కృతులైన వాళ్ళు తిరిగి సంఘంలో చేరవచ్చు. అలా చేరదల్చుకుంటే తిరిగి వారు మొదటి మెట్టు దగ్గర శ్రోతాపన్నుడుగా ఆరంభించవలసి ఉంటుంది. భర్తృహరి బౌద్ధంలో చేరటం, సంఘబహిష్కృతుడవటం, తిరిగి చేరిక, తిరిగి బహిష్కృతుడవటం ...ఇలా ఏడు సార్లు జరిగిందట.

సూక్ష్మంగా పరిశీలిస్తే భర్తృహరి కవిత్వంలో ఒక విషయం గమనించవచ్చు. నీతి సామాన్యంగా రెండు విధాలు. ఒకటి సామాజికం, రెండు వ్యక్తినిష్టం. సామాజికనీతి అంటే పదిమంది దగ్గరా అబద్ధాలు చెప్పకపోవటం, సత్యవాక్పరిపాలన, పితృ వాక్యపరిపాలన, పెద్దలను సేవించటం, భార్యాబిడ్డల పట్ల అనురక్తీ వగైరా వగైరా. అలాకాక ధ్యానతత్పరతకు సంబంధించిన బోధ - బుద్ధబోధ, అష్టావక్రసంహిత...ఈ కావ్యాల నీతి కేవలం ఆధ్యాత్మికమైనది. దీనికి అనుభవప్రమాణమే సాక్షి. ధ్యానం ప్రేరణ.

భర్తృహరి నీతి లో సామాజికమైన ఉద్బోధ కనిపించదు. అలాగని పూర్తిగా ఆధ్యాత్మికప్రవచనం లా కూడా ఈ నీతి లేదు. ఈ కవి నీతి - మానవుల స్వభావాలలో వివిధ వైరుధ్యాలను సహజసిద్ధంగా దృష్టాంతీకరించడంలో ఉన్నది. బహుశా ఈ కవి అనేక వ్యక్తులను, వ్యక్తిత్వాలను దగ్గరగా చూచి ఉంటాడు. సూక్ష్మంగా పరిశీలించి ఉంటాడు. పూర్తిగా ఆధ్యాత్మికం కాక, సమాజంలోనూ ఇముడలేక వ్యక్తావ్యక్త భావనల మధ్య కొట్టుమిట్టాడుతూ ఈ కావ్యం రచించి ఉంటాడు. ఒకానొక కథ ప్రకారం ఈయన రాజు. రాజ్యం త్యజించి తన తమ్ముడిని పట్టాభిషిక్తుని చేసి అరణ్యాలకు మళ్ళిన వాడు.

ఏమో, భర్తృహరి ఎవరైనా కానీ, ఆయన చరిత్ర ఏదైనా కానీ, ఆయన ఎన్నో తరాలకు తరగని నిధిని అందించి, ఋణభారం మోపి కనుమరుగైన మహర్షి.

24, జనవరి 2014, శుక్రవారం

సంస్కృతసౌరభాలు - 14


రస్యతే, ఆస్వాద్యతే అనేనైవ రసః

రససిద్ధాంతం సంస్కృత లాక్షణిక సిద్ధాంతాలలో ముఖ్యమైనది. రసం అంటే కావ్యం వలన జనించే ఒక లోకోత్తరమైన అనుభూతి. కావ్యానికి సంబంధించి రసం తాలూకు స్థితి ఎక్కడ నిరూపితమై ఉంటుంది అన్న విషయానికై ఉద్భటుడు అనే లాక్షణికుడు ఒక ప్రతిపాదన చేశాడు.

- "వాచి వస్తున్యపి రసస్థితిః"

రచనాసంవిధానం లోనూ, వస్తువు అంటే - ఇతివృత్తంలోనూ రసస్థితి ఉంటుంది. ఇతివృత్తం అంటే - పాత్ర చిత్రణ, సన్నివేశకల్పనల సమాహారం. దృశ్యనాటకాలకు సంబంధించిన సంవిధానాలలో - స్థూలంగా ముఖ్యమైన రెండు ధోరణులు కనిపిస్తాయి. మొదటిది భాస, శూద్రకాదులకు సంబంధించిన వస్తునిర్వహణ ద్వారా రసస్ఫూర్తి కలిగించే ధోరణి, రెండవది రచనా శైలి, శిల్ప చాతుర్యాదుల ద్వారా రసనిష్పందం కలిగించగల భవభూతి కాళిదాసాదుల ధోరణి. అభినేయమైన కృతులు భాసకవివైతే నాటకీయమైన కావ్యాలు భవభూతికాళిదాసాదులవి.

మొదటిది నాట్యకళ, రెండవది కావ్యకళ.

ఈ ధోరణులలో భాసమహాకవి మార్గానికి చెందిన మరొక కవి దిజ్ఞాగుడు లేదా ధీరనాగుడు. ఈ కవి రచించిన అపూర్వమైన నాటకం పేరు కుందమాల. కుందమాల అంటే మల్లెపూదండ అని అర్థం.

**********************

అభినవరచితాని దేవతానాం జలకుసుమైర్బలిమన్తి సైకతాని |
ఇయమపి కురుతే తరంగమధ్యే భుజగవధూలలితాని కుందమాలా ||

**********************

లోకాపవాదభీతికి భయపడి రాముడు సీతను పరిత్యజించాడు. ఆమెను అటవిలో విడిచిరావడం లక్ష్మణుని వంతయ్యింది. ఆపై వాల్మీకి ముని సీతను చూచి ఆమెను తన ఆశ్రమానికి తీసుకెళ్ళి ఆశ్రయం కల్పించాడు. ఆ తర్వాత రాముడు లక్ష్మణుడు కలిసి గోమతీ నదీ తీరంలో వాల్మీకి దర్శనార్థం వెళుతున్నారు. అప్పుడు -

దేవతలకోసం నీటిచేత, పూలచేత బలులు సమర్పించినట్టుగా నవ్యంగా ఉన్న ఇసుకతిన్నెలు. ఆ నది తరంగాల మధ్యలో నాగవధువులా లలితంగా అందాలు చిందుతున్న మల్లెపూదండ తేలుతూ వచ్చింది.

లక్ష్మణుడు రామునితో చెప్పాడు.

"ఆశ్చర్యంగా ఉన్నది! ఈ సముద్రందిశగా తరలి వెళుతున్న ఈ నదీదేవత ఆర్యుల సేవకోసమా అన్నట్టు తరంగాల ద్వారా ఈ పూదండను మీ పాదసన్నిధికి చేర్చింది. ఎంతో ముచ్చటగా అల్లిన, ప్రేక్షణీయమైన ఈ పూదండను చూడు ఆర్యా"

ఏషా కుందమాలా అవహితం ప్రేక్షణీయా విరచనా - తప్పక చూడదగినదైన విశిష్టమైన కూర్పు - అని లక్ష్మణుని ద్వారా సూచిస్తాడు కవి.

ఈ నాటకం ప్రేక్షణీయమైనది. అంటే - సన్నివేశప్రధానమైనది.

**********************

భాస మహాకవి లోని క్లుప్తత, స్వతంత్రత, నాటకీయత, పాత్రల అత్యంతసహజప్రవర్తన - వీటినన్నిటినీ పుణికి పుచ్చుకుని చేసిన అందమైన రచన కుందమాల. ఇది రామాయణాధారితమైన ఆరు అంకాల నాటకం. సీతారాముల వియోగంతో మొదలై, సీత తన తనయులైన లవకుశులతో, రాముని కలుసుకోవడంతో సుఖాంతమవుతుంది. భాసమహాకవి కైకేయిని ప్రతిమానాటకంలో విప్లవాత్మకంగా వాల్మీకి రచనకు విభిన్నంగా కరుణరసాత్మకంగా తీర్చిదిద్దాడు. అదే విధంగా కుందమాల రచయిత విదూషకుని పాత్రను ఉదాత్తంగా తీర్చిదిద్దాడు. దిజ్ఞాగుని విదూషకుడు తిండిపోతు, వెకిలిమాటలవాడు కాదు. రాముని మనసును, సీత మనసునూ కూడా గ్రహించినవాడు, ఒక ముఖ్యపాత్రధారి. కవి తాలూకు నాటకశిల్పంలో ప్రధానమైన పాత్ర.

అంతకంటే గొప్పగా చెప్పుకోవలసిన పాత్ర సీతది. కుందమాల లోని సీత అత్యంత సహజస్త్రీ స్వభావము కలిగినది. గొప్ప అభిమానవంతురాలు.

ఐదవ అంకం -

రాముడు చింతాక్రాంతుడై ఉన్నాడు. ఆతడిని విదూషకుడు మాటలలో పెట్టి దుఃఖాన్ని ఉపశమింపజేస్తున్నాడు. ఇంతలో కుశలవులకు వాల్మీకి మహర్షి అతిథులను గానంతో సంతోషింపజేయమని పంపాడు.

కుశలవులు రాముని వద్దకు వెళుతుంటే - చిన్నవాడైన లవుని అమ్మ చాటుగా పిలిచి - రాజు దగ్గర నెమ్మదిగా నడుచుకొమ్మని దుడుకుగా వ్యవహరించవద్దని చెప్పి పంపుతుంది. ఇద్దరూ రాముని వద్దకు వచ్చారు. రాముడికి విచిత్రమైన భావశబలత కలిగింది. వారిని తొడపై కూర్చుండబెట్టుకుని తనకు కుమారులుంటే వీరి వయసే ఉంటుంది కదా అనుకొన్నాడు. అప్పుడు రాముడు వారిని ప్రశ్నిస్తాడు.

మీ వంశమేది?
సూర్యవంశము.
మా వంశమే.మీ ఇద్దరి వయస్సులలో అంతరమున్నదా?
మేము కవలలము.
పెద్ద ఎవరు?
కుశుడు.
మీ గురువులెవరు?
వాల్మీకి మహర్షి
శరీరప్రదాతయైన తండ్రి యెవ్వరు?
లవుడు:తెలియదు. ఈ తపోవనమున ఎవ్వరూ వారిని పేరుతో పిలువరు.
అహో మహత్మ్యము.
కుశుడు: నాకు తెలుసును.
చెప్పు
"నిరనుక్రోశుడు"
రాముడు: విదూషకునితో - పేరు అపూర్వంగా ఉంది కదూ?
విదూషకుడు: అలా ఎవరు పిలుస్తారు?
అమ్మ
కోపంగా ఉన్నప్పుడా? ఎప్పుడూనా?
మేం మారాం చేసినప్పుడు "నిరనుక్రోశుని కుమారులారా! అల్లరి చేయకండ్రా" అంటుంది.
...
..
నాయనలారా మీ తల్లి పేరేమి?
మా అమ్మకు రెండు పేర్లు. "దేవీ" అని అందరూ, "వధూ" అని మహర్షులవారూ పిలుస్తారు.
..
..

**********************

నిరనుక్రోశుడు - అంటే దయాదాక్షిణ్యాలు లేని వాడు అని అర్థం. ఈ ఘట్టం ద్వారా సీత హృదయం తాలూకు వేదనను (వాచ్యం చేయకుండా వ్యంగ్యంగా) అపూర్వంగా చెబుతాడు కవి. మొదటి అంకంలోనూ ఇదే శబ్దం ఉపయోగిస్తుంది సీత. కుందమాలలోని సీత రాముని ప్రశ్నించడానికి వెరవదు. పరిత్యాగ ఘట్టంలో సీత మాట్లాడిన మాటలు చాలా గొప్పగా ఉంటాయి. నిజానికి ఈ కావ్యంలోని ఉదాత్తత అంతా సీత శోకాన్ని, తనయొక్క సహజమైన స్త్రీ స్వభావాన్ని చిత్రించడంలోనే ఉన్నది. స్వప్నవాసవదత్తం, విక్రమోర్వశీయం, శాకున్తలం, ఉత్తరరామచరితం - ఇలా సంస్కృతంలో ప్రధానమైన నాటకాలన్నిటిలోనూ కావ్యనాయకుని దుఃఖాన్నే ఆయా కవులు ప్రధానంగా చిత్రించారు. వారి విరహవేదనను కరుణరసాత్మకంగా ఉద్యోతించారు. ఈ పరంపరకు వ్యతిరేకంగా దిజ్ఞాగుడు చేసిన సాహసం - అదీ underplay చేస్తూ, సీత మానసికవేదనను, అదే సమయంలో ప్రేమనూ, తనను భర్త త్యజించాడన్న అపరాధభావాన్ని చిత్రించడం అపూర్వం. ఇది తెలియాలంటే ఈ నాటకం ఎవరికి వారు చదువుకోవాలి. లేదా కూలంకషంగా వ్యాసం ద్వారా ఎవరైనా చర్చించవలసి ఉంటుంది.

**********************

తనను రాముడు పరిత్యజించాడని లక్ష్మణుడు చెప్పగా సీత చెప్పిన సమాధానం ఇది.

"అగ్నిశుద్ధిసంకీర్తనేన ప్రతిబోధితాऽస్మి. రావణభవనోదన్తః పునర్ప్యుద్బాధయతి. సీతాయా అపి నామ ఏవం సంభావ్యత ఇతి సర్వథాऽలం మహిళాత్వేన. ఏవం పరిత్యక్తా. నను పరిత్యక్తాऽస్మి. కిన్న ఖలు యుక్తం మమార్యపుత్రపరిత్యక్తమాత్మానం పరిత్యక్తుమ్? కిన్న ఖలు తస్యైవ నిరనుక్రోశస్య సమాన ఏవ ప్రసవః ప్రేక్షితవ్య ఇతి వచనీయకణ్ఠకోపహితం జీవితం పరిరక్షామి."

"అగ్నిచేత పరిశుద్ధురాలనైనానని కీర్తి బడసితిని. ఇప్పుడు రావణనివాసంలో జరిగిన అగ్నిప్రవేశఘట్టం తిరిగి గుర్తుకు వచ్చి బాధిస్తున్నది. సీతకే ఈ విధమైన గౌరవం దక్కితే - స్త్రీత్వమే ఇక చాలు. పరిత్యక్తనైనాను. నిజంగానే పరిత్యక్తనైనాను. ఆర్యపుత్రుడే విడిచివేయగా ఇక నన్ను నేను త్యజించడం యుక్తమా? కాదేమో? ఆ నిష్టురాత్మునితో సమానమైన ఈ గర్భాన్ని నిలుపుకోవాలి కాబట్టి ఆ కారణం చేత ఈ బ్రతుకును ఎలానో వెళ్ళదీస్తాను."

ఒక స్త్రీపాత్రతో ఆ నాడు ఇంత సాహసోపేతమైన మాట అనిపించిన కవి బహుశా దిజ్ఞాగుడు ఒకడేనేమో!

**********************

అడవిలో సీతను చూచి జంతువులు పక్షులూ కూడా దుఃఖించాయని కాళిదాసు చెబుతాడు.

నృత్తం మయూరాః కుసుమాని వృక్షాః దర్భానుపాతాన్ విజుహుర్హరిణ్యః
తస్యాః ప్రపన్నం సమదుఃఖభావం అత్యన్తమాసీత్ రుదితం వనేపి || (రఘువంశం ౧౪ వసర్గ, ౬౯ వశ్లోకం)

నెమళ్ళు నృత్యాన్ని, చెట్లు పూలనూ, జింకలు గడ్డినీ వదిలాయి.
వాటికి సీత మనసులో ఉన్న దుఃఖానికి సమంగా దుఃఖం కలిగి ఏడుస్తున్నవి.

కుందమాలాకారుడూ వ్రాశాడు.

ఏతే రుదన్తి హరిణా హరితం విముచ్య
హంసాశ్చ శోకవిధురాః కరుణం రుదన్తి
నృత్తం త్యజన్తి శిఖినోऽపి విలోక్య దేవీం
తిర్యగ్గతా వరమమీ న పరం మనుష్యాః

జింకలు గడ్డిని వదలి దుఃఖిస్తున్నాయి. హంసలు శోకంతో కుమిలి కరుణకలిగేలా ఏడుస్తున్నాయి. నెమళ్ళు కూడా సీతను చూచి నృత్యం మానివేశాయి. ఇవన్నీ అనుకున్నాయి - "మేమే అనుకున్నాము, మనుష్యులు కూడా తిర్యక్కులే"

(తిర్యక్కులు - అంటే పునరుత్పత్తి స్థానం భూమివైపుగా తిరిగి ఉన్న పశుపక్ష్యాదులు. మనుషుల బుద్ధి కూడా తిరగబడి ఉందే అని పైన శ్లోకంలో శ్లేష)

**********************

కుందమాల మూడవ అంకం - భాసుని స్వప్నవాసవదత్తం నాటకం నాలుగవ అంకాన్ని పోలి ఉంటుంది.  రామలక్ష్మణులిద్దరూ గోమతీ తీరంలో వెళుతుంటే - రాముని దుఃఖం నుండి దృష్టి మరల్చడానికి లక్ష్మణుడు గోమతీనదిని వర్ణిస్తాడు.

మరకత హరితానామంభసా ఏకయోనిః
మదకల కలహంసీ గీతరమ్యోపకంఠా |
నళినవనవికాసైః వాసయన్తీ దిగన్తాన్
నరవర పురతస్తే దృశ్యతే గోమతీయమ్ ||

మరకత మణిలా మెరుస్తున్న నీటితో ఉన్నది, మదంతో కలరవం చేస్తున్న కలహంసలగీతాలతోనూ, వికసించిన తామరపూల సువాసనలతోనూ దిక్కులను నింపుతున్న మన ముందున్న ఈ గోమతీ నదిని చూడు.

రాముడు:

ముక్తాహారాః మలయమరుతశ్చందనం చంద్రపాదాః
సీతాత్యాగాత్ ప్రభృతి నితరాం తాపమేవా వహన్తి |
అద్యాకస్మాద్రమయతి మనోగోమతీతీరవాయుః
నూనం తస్యాం దిశి నివసతి ప్రోషితా సా వరాకీ ||

ముత్యాలహారాలు, మందమారుతం, చందనం, వెన్నెలా సీతను కోల్పోయిన తర్వాత తాపాన్ని పెంచాయి. ఇప్పుడేమో హఠాత్తుగా ఈ గోమతీనదీ తీరవాయువులు సీత ఇక్కడే ఎక్కడో ఉన్నట్టుగా ఎందుకనో మనసును తీవ్రంగా రంజింపజేస్తున్నాయి.

పై పద్యం మందాక్రాంతం. మందాక్రాంత వృత్తాన్ని ప్రధానంగా విరహాన్ని ఉద్యోతించడానికి ఉపయోగిస్తారు (కాళిదాసు మేఘదూతం).

లక్ష్మణుని శ్లోకంలో వర్ణన - రాముని భావనలో విరహం. అంతలో కుందమాల కనిపిస్తుంది. ఇదీ సన్నివేశం.

**********************

కుందమాల గురించి చెప్పాలంటే - ఒక్క అనన్వయాలంకారంలోనే చెప్పగలమని నా అభిప్రాయం. కుందమాల - నిజంగా కుందమాలయే.

ఈ నాటకం గురించి ఎంతో వ్రాయవచ్చు. ఎన్నో వ్యాసాలూ వచ్చినట్లు భారతి, ఆంధ్రపత్రిక ఇత్యాది పాత సంచికలలో కనిపిస్తుంది. అయితే కూలంకషంగా ఈ నాటక శిల్పాన్ని, సంధి సంధ్యంగాలను, పాత్రోచితిని, ఉదాత్తతను, అంగ్యంగ రసావిష్కరణనూ విమర్శించిన వారెవరో తెలియదు.

అన్నట్టు ఈ కావ్యాన్ని వెలికితీసి ప్రచురించనవారిలో ప్రథముడు - మానవల్లి రామకృష్ణకవి. ఈయన తెలుగువాడు కావడం గర్వకారణం.

ఈ రచయిత బౌద్ధుడా? హిందువా? భవభూతి ఈయనను కాపీ కొట్టాడా లేక ఈయనే భవభూతిని అనుసరించాడా? భవభూతి ఎలా ఈయనకంటే గొప్పవాడు? ఆచార్య దిజ్ఞాగుడు, ధీరనాగుడు ఒకరా వేరా? ఈయన కాలం ఎప్పటిది? - ఇలా అనవసర విషయాలను ఎందుకనో చాలా మంది తీవ్రంగా చర్చించారు. ఆంగ్లేయులు అంటించిన జాడ్యం ఇది.

మల్లెతోటలో ఉల్లికోసం వెతికే వెంగళప్పలకు మల్లెల సౌరభం ఎలా తెలుస్తుంది?

**********************

15, జనవరి 2014, బుధవారం

సంస్కృతసౌరభాలు - 13



రజోజుషి జన్మని సత్త్వవృత్తయే స్థితౌ ప్రజానాం ప్రలయే తమఃస్పృశే |
అజాయ సర్గస్థితినాశహేతవే త్రయీమయాయ త్రిగుణాత్మనే నమః ||

రజోజుషి జన్మని = సృష్టి జరిగే సమయంలో రజోగుణం వహించి
స్థితౌ సత్త్వవృత్తయే = స్థితి (రక్షణ) సమయంలో సత్వవృత్తిని కూడి
ప్రజానాం ప్రలయే తమఃస్పృశే = లయ సమయంలో తమస్సును చేబట్టిన
అజాయ = జన్మరహితుడైన వానికి (న జన్మః యస్యాస్తీతి అజః = జన్మము లేని వాడు అజుడు)
సర్గస్థితినాశహేతవే = పుట్టుక, రక్షణ, నాశములకు హేతువైన వానికి
త్రయీమయాయ = త్రిమూర్తి స్వరూపునకు
త్రిగుణాత్మనే = త్రిగుణాత్మునకు
నమః = వందనము.

భట్టబాణకవి కాదంబరి కావ్యారంభంలో మంగళాచరణం ప్రథమ శ్లోకం ఇది. సాధారణంగా దృశ్యకావ్యాలలో మంగళాచరణశ్లోకంలో అంతర్లీనంగా కథను సూచించడం ఒక సాంప్రదాయం. కాదంబరి ప్రధానంగా గద్యకావ్యం. ఈ మంగళాచరణశ్లోకంలో కాదంబరి కథను సూచించినట్లుగా వ్యాఖ్యాతలు వ్రాయలేదు. అయితే కాదంబరి కావ్యకథలో మూడు జన్మల వృత్తాంతం, మూలసూత్రమైన ప్రేమైకస్వరూపాన్ని కవి పైని శ్లోకంలో నిక్షేపించాడా అని ఎదో మూల అనుమానం కలుగుతుంది.

కాదంబరి కథను తూగుటుయ్యాల మీద అర్థనిమీలిత నేత్రాలతో విని "కాదంబరీః కాదమ్బరి" అని కాళిదాసు అన్నాడని ఒక కథ. కాదమ్బరి అంతే సుర. లలితాసహస్రనామాలలో 74 వ శ్లోకం లో "కాదమ్బరిప్రియా"  అన్న నామం ఉంది. కాళిదాసు ఈ మాట అన్నాడని శిష్యుడు చెబితే భట్టబాణుడు ఖేదపడి కాదమ్బరి ఒక అల్పకావ్యమని అగ్నికి అర్పణం చేశాడనీ, తిరిగి ఏకసంథాగ్రాహి ఐన కాళిదాసు తన మాటకు అర్థం కాదమ్బరి అమృతప్రవాహంలా ఉందని తన ఉద్దేశ్యమని వివరించి, తను విన్న కావ్యాన్ని యథాతథంగా ఒప్పజెపితే శిష్యుడు తిరిగి వ్రాసుకున్నాడని ఆ కథ. ఈ కథ కట్టుకథ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఒక్క విషయం సత్యం. కాదంబరి కావ్యం అంత మత్తు గొలిపే అద్భుత కావ్యం సంస్కృతంలోనే కాదు బహుశా ప్రపంచసాహిత్యంలోనే ఉండదు.

******************************************

చంద్రాపీడుడు: "దేవీ! జానామి కామరతిం నిమిత్తీకృత్య ప్రవృత్తోऽయం అవిచలసంతాపతంత్రో వ్యాధిః. సుతను! సత్యం న తథా త్వామేష వ్యథయతి యథాస్మాన్. ఇచ్ఛామి దేహదానేనాపి స్వస్థామత్ర భవతీం కర్తుమ్"
దేవీ! (నీ) అవ్యక్తమైన భావపు కామరతి (కాం - అరతి = ఏదీ సహించకపోవుట/ కామరతి = శృంగారేచ్ఛ) అనే వ్యాధిని నేను తెలుసుకున్నాను. అందమైన తనువు గల అమ్మాయీ! సత్యంగా నేనూ నీలానే వ్యథననుభవిస్తున్నాను. నా దేహదానంతోనైనా నిన్ను ఆరోగ్యవంతురాలిగా చేయగలను.

అమ్మాయి కాదంబరి చిరునవ్వు సమాధానం కాగా, ఆమె చెలికత్తె మదలేఖ సమాధానం చెప్పింది.

కుమార! కిం కథయామి? కుమారభావోపేతాయాః కిమవాస్యాయన్న సంతాపాయ?
రాకుమారా! ఏం చెప్పను? కుమారభావం (యవ్వనం/రాకుమారుడైన నీపై మనస్సు) కలిగిన ఈమెకు ఏది సంతాపం కాదు?

ఇది ప్రేమికులైన ఇద్దరి మధ్య ఒక చిన్న ఘటన. ఇద్దరికీ ఒకరిపై ఒకరికి మనసు. బయటకు చెప్పుకోలేరు. ఈ వ్యక్తావ్యక్తమైన మధురభావానికి అక్షరరూపం ఈ మధురసంభాషణ. ఈ మాధుర్యమే మూడు జన్మాలలో విస్తరించిన అందమైన కథ రూపంలో విస్తృతమైతే అది కాదంబరి.

మహాశ్వేత - పుండరీకుడు,
మహాశ్వేత - వైశంపాయనుడు, కాదమ్బరి - చంద్రాపీడుడు.
మహాశ్వేత - చిలుక, కాదమ్బరి - శూద్రకుడు

ఇవీ కాదంబరి కావ్యంలోని జంటలు.

అద్భుతమైన సంవిధానంతో ఈ కథ మొదలవుతుంది. బాణుని గద్య సుదీర్ఘసమాసాలతోనూ, వర్ణనలతోనూ కూడుకుని ఉంటుంది. ఒక్కొక్క వర్ణనా పేజీలతరబడి సాగుతుంది.  శూద్రకుడనే మహారాజు విదిశా నగరాన్ని పరిపాలిస్తున్నాడు. ఒక రోజు ఆ మహారాజు కొలువుతీరి ఉంటే ఒక ఛాండాలకన్య ఒక చిలుకను వెంటబెట్టుకుని సభకు వచ్చింది. అస్పృశ్య అయిన ఆమె తను వస్తున్నట్టు ఒక కర్రను చప్పుడు అయేట్టు తాటిస్తుంది. రాజు ప్రతీహారితో ఆమెను సభలో ప్రవేశపెట్టమంటాడు. ఆమె తీసుకువచ్చిన చిలుక మానవభాషలో మాట్లాడగలదు. ఆ అమ్మాయి చిలుకను రాజుకు బహుమతిగా ఇస్తుంది. రాజు చిలుకను ఆ రోజుకు విశ్రాంతి తీసుకొమ్మంటాడు. తర్వాత రోజు కుశలప్రశ్నలు వేస్తూ - చిలుకా! నీకు చక్కని విరామం, మంచి భోజనం దొరికిందా అని అడుగుతాడు. అప్పుడు చిలుక చెప్పిన సమాధానం బాణుని రీతిలో ఈ విధంగా ఉంటుంది.

దేవ! కిం వా నాస్వాదితమ్?
ఆమత్త-కోకిల-లోచనచ్ఛవి-ర్నీలపాటలః- కషాయమధురః- ప్రకామమాపీతో జమ్బూఫలరసః
హరినఖరభిన్న-మత్తమాతంగకుంభముక్తరక్తార్ద్ర-ముక్తాఫలత్వీషి-ఖణ్డితాని-దాడిమీబీజాని
నలినీదళహరిన్తి-ద్రాక్షాఫలస్వాదూని చ దలితాని
స్వేచ్ఛయా ప్రాచీనామలికీఫలాని
కిం వా ప్రలపితేన బహునా, సర్వమేవ దేవీభిః స్వయం కరతలోపనీయమానమమృతాయతే -

మహాప్రభూ! ఏది ఆస్వాదించలేదు?
మత్తకోకిలల కళ్ళవలె ఎరుపు, నలుపుల మిశ్రమవర్ణమై మధురంగా ఉన్న నేరెడు పళ్ళరసాన్ని తృప్తి తీరా త్రాగాను.
సింహంగోళ్ళచేత భేదించబడిన మదగజకుంభాలలో రక్తంతో తడిచిన ముత్యాలవలె ఉన్న దానిమ్మగింజలనూ
చూర్ణం చేసిన నల్లకలువ రంగులో ఉన్న ద్రాక్షాఫలాలను
చిత్తం వచ్చినట్టుగా ఉసిరికాయలనూ
ఒకటేమిటి? దేవి గారే స్వయంగా అమృతహస్తాలతో తినిపించిన అన్నిటినీ ఆస్వాదించాను.

ఆ పిమ్మట రాజుకు ఆ చిలుక తన కథ చెప్పింది. ఆ చిలుక వింధ్యాటవి ప్రాంతంలో పుట్టింది. ఇక్కడ వింధ్యాటవీ వర్ణన సుదీర్ఘంగా సాగుతుంది. ఆపై అగస్త్యాశ్రమవర్ణన, దగ్గరి పంపాసరోవరవర్ణన. ఆ వింధ్యాటవిలో ఒక బూరుగు చెట్టు. (శాల్మలీవృక్షవర్ణన - ఈ వర్ణన బాణుని సూక్ష్మపరిశీలనకు చిహ్నం). ఆ చెట్టులో చిలుక పుట్టింది. ఓ రోజు కిరాతులు అటవిలో దండయాత్ర చేశారు (కిరాతసేన వర్ణన), ఆ శబరసేనానాయకుడు (ఆతని వర్ణన) చిలుక తల్లిదండ్రులను చంపాడు. చిలుకను హారీతుడనే మునిబాలకుడు రక్షించి తన గురువైన జాబాలి మహర్షి వద్దకు తీసుకువెళ్ళాడు. మహర్షి చిలుక తాలూకు పూర్వజన్మపు కథ చెప్పాడు. ఆ చిలుక పూర్వజన్మలో వైశంపాయనుడు.

*******************************

ఇక్కడ ఆగుదాం.

బాణభట్టు కథను చదివేప్పుడు ప్రాచీనకవిసమయాలు, సామాజికవిషయాలు, సూక్ష్మపరిశీలనలూ, పురాణకథలప్రస్తావనలూ, జంతుపక్ష్యాదుల ప్రవర్తనలూ, అద్భుతమైన ఉపమాన, ఉత్ప్రేక్షాదులతో కూడిన వర్ణనలూ, ఇలా సమస్తమూ కనిపిస్తాయి. అందుకే "బాణోచ్ఛిష్టం జగత్సర్వం" అని ఒక అభాణకం. ఆ వాక్యానికి అర్థం - ఈ జగత్తంతా బాణుడు ఎంగిలి చేసి వదిలేసినదేనని.

(గజేంద్రజీమూతవరాహశంఖమ్త్స్యాహిశుక్త్యుద్భవవేణుజాని |
ముక్తాఫలాని ప్రతిథాని లోకే తేషాం తు శుక్త్యుద్భవమేవ భూరి ||

ఏనుగులు, మేఘం, అడవిపంది, శంఖం, చేపలు, పాము, ముత్యపు చిప్ప, వెదురు - ముత్యాలు వీటినుండి పుడతాయని, ముత్యపు చిప్పల్లో ఎక్కువగా దొరుకుతాయని ఒక ప్రసిద్దశ్లోకం. పైన ఏనుగుకుంభస్థలపు ముత్యం ఎలా వచ్చిందంటే ఈ విషయం తెలియాలి.)

బాణభట్టు వచనం ఎలా ఉంటుందో అని ఒక కవి వర్ణించాడు -

శ్లేషే కేచన శబ్దగుంఫవిషయే కేచిద్రసే చాపరేऽ
లంకారే కతిచిత్సదర్థవిషయే చాన్యే కథావర్ణనే
ఆసర్వత్ర గభీరధీరకవితావింధ్యాటవీచాతురీ
సంచారో కవికుంభికుంభభిదురో బాణస్తు పంచాననః

కొందరు శ్లేషగా చెప్పడంలో నేర్పరులు, పదగుంఫనం కొందరికి హస్తగతం. కొందరు రస పోషణలో సమర్థులు, మరికొందరు అలంకారాలు కూర్చగలరు. కొందరు అర్థవిషయంలో ప్రతిభ చూపిస్తే, కొందరు కథావర్ణనలో నేర్పు చూపిస్తారు. భట్టబాణుడు మాత్రం ఇదీ అదీ అన్న భేదం లేక గంభీరధీరకవితావింధ్యాటవిలో స్వేచ్ఛగా సంచరిస్తూ, కవిదిగ్గజాల కుంభాలను భేదించే సింహం వంటి వాడు.

బాణుని సుదీర్ఘవర్ణనలను తెనుగు చేస్తే ఎలా ఉంటుందో , కొన్నిటిని ఈ క్రింది ఛాయాచిత్రాలలో చదువుకోగలరు. (నా అనువాదం నోట్సులో కొక్కిరి గీతల సౌందర్యం, అనువాదంలో తప్పులు  క్షంతవ్యాలు). ఇవి సుదీర్ఘవర్ణనలు కాబట్టి కాస్త సహనాన్ని పరీక్షించవచ్చు.

*******************************

వైశంపాయనుడు పూర్వజన్మలో అవంతీరాకుమారుడైన చంద్రాపీడుని మిత్రుడు. చంద్రాపీడుడు క్షత్రియోచిత విద్యలను నేర్చి, యువకుడై, మృగయావినోదంలో పాల్గొని, ఒక కిన్నెరజంటను చూచి వెంబడిస్తాడు. అలా ఎంతో దూరం వెళ్ళి హిమాలయాలకు ఆవల ఉన్న అచ్ఛోద సరస్సును చేరుకుంటాడు. అక్కడ ఒక మందిరంలో చతుర్ముఖేశ్వరుడైన ఈశ్వరుని అర్చిస్తూ ఒక గానం వినబడుతుంది. ఆ గానం చేసిన అమ్మాయి మహాశ్వేత. ఆమె కైలాసశిఖరపు తునకలా ధవళవర్ణంతో మెరిసిపోతున్నది. అచ్చోదసరస్సుల వర్ణన బైఖాల్ (వాలఖిల్య) సరస్సును, మహాశ్వేత వర్ణన శ్వేతజాతీయులను (Russian girl) స్ఫురింపజేస్తుంది. ఆమె చంద్రాపీడుణ్ణి పలుకరించి అతిథిమర్యాదలు చేసింది. ఆపై తన కథ చెప్పింది.

ఆమె పుండరీకుడనే మునికుమారుణ్ణి ప్రేమించింది. ఆ మునికుమారుడు మరణించాడు. బాధతో తనూ ప్రాణత్యాగం చేయబోతే - చంద్రమండలం నుంచి ఒక ధవళమూర్తి వచ్చి ఆమెను ఊరడించి ప్రియాసమాగమం జరుగుతుందని చెప్పి వెళ్ళాడు. అందుకై ఎదురు చూస్తూ ఆమె జీవించి ఉంది.

ఆ తర్వాతి రోజు మహాశ్వేత తన మిత్రురాలైన కాదంబరిని చంద్రాపీడునికి పరిచయం చేస్తుంది. చంద్రాపీడుడూ, కాదంబరీ పరస్పరం ప్రేమించుకుంటారు. చంద్రాపీడుని మిత్రుడైన వైశంపాయనుడే పూర్వజన్మలో పుండరీకుడు. మహాశ్వేత - వైశంపాయనుల సమాగమం జరిగిందా? వైశంపాయనుడు చిలుక జన్మ ఎలా ఎత్తాడు? చంద్రాపీడుడు మరణించి ఎలా శూద్రకుడుగా జన్మించాడు. ఇదంతా తదనంతరం వచ్చే రమ్యమైన కథ.

కాదంబరి కావ్యం పూర్తిగా భట్టబాణవిరచితం కాదు. కాదంబరి, చంద్రాపీడులను ఏకం చేయకనే కవి పరమపదించాడు. భట్టబాణుని కుమారుడైన భూషణభట్టబాణుడు మిగిలిన కథను పూర్తిచేశాడు. భూషణకవి తండ్రిని మించిన తనయుడు.

*******************************

ఈ రోజు చతుర్దశి. నిండు చందురుని వర్ణన ఎలా ఝల్లుమనేలా ఉందో గమనించండి.(ఆపై బయటకు వెళ్ళి వెన్నెలను ఆస్వాదించడం మరువకండి. :))

క్రమేణ చ
సకలజీవ లోకానందకేన
కామినీజనవల్లభేన
కించిదున్ముక్తబాలభావేన
మకరధ్వజబంధుభూతేన
సముపారూఢరాగేణ
సురతోత్సవ ఉపభోగైక యోగ్యేన
అమృతమయేన
యౌవనేనేవ ఆరోహతా
శశినా రమణీయతాం అనీయత యామినీ.

క్రమముగా
సకలలోకానందకారకుడూ,
కామినీజనవల్లభుడూ
అప్పుడప్పుడే బాల్యాన్ని వదిలి యవ్వనాన్ని సంతరించుకున్నవాడు
మకరధ్వజుని (మన్మథుని) బంధువు
రాగమయుడూ,
శృంగారోత్సవానికి తగిన అమృతాన్ని నింపుకున్నవాడూ,
అయిన చంద్రుడు తన యవ్వనంతో ఆక్రమించుకుంటే - యామిని రమణీయత్వాన్ని సంతరించుకున్నది.

*******************************

కాదంబరి గురించిన ఛాయామాత్రమైన పరిచయం ఇది. ఈ పుస్తకానికి తెలుగు అనువాదాలు అనేకం ఉన్నట్టున్నాయి. రెంటాల గోపాలకృష్ణ గారి అనువాదం, విద్వాన్ విశ్వం గారి సరళానువాదం ఆంధ్రప్రభలో ధారావాహికగా వచ్చింది. చంద్రాపీడచరితమ్ (కాదంబరి - సుదీర్ఘవర్ణనలు మినహాయించి) ను సంస్కృతపండితులు, అవధాని అనిల్ మాడుగుల గారు హృద్యంగా తెనిగించారు. భట్టబాణుని కావ్యప్రశంస మీద కూడా చక్కని పుస్తకాలు వచ్చినవి. సంస్కృతం మీద ఏ కొంచమైనా అభిమానం, ఆసక్తి ఉన్నవాళ్ళు కాదంబరి కావ్యాన్ని విస్మరించలేరు. ఈ కావ్యం చవిచూడకపోతే సంస్కృతాభినివేశం, ఆసక్తీ అసంపూర్ణం అని చెప్పడానికి సందేహం అనవసరం.

గంగాదేవి అన్న ఒక రచయిత్రి ఇలా అందిట.

వాణీపాణి పరామృష్ట వీణా నిక్వణ హారిణీమ్ |
భావయన్తి కథం వాన్యే భట్టబాణస్య భారతీమ్ ||

"వాణి వీణను మీటితే వచ్చే ధ్వనిని పోలిన బాణుని వాణి ఎవరి ఊహకైనా సాధ్యమా?"

*******************************






8, జనవరి 2014, బుధవారం

సంస్కృతసౌరభాలు - 12


అస్త్యుత్తరస్యాం దిశి దేవతాత్మా హిమాలయో నామ నగాధిరాజః |
పూర్వాపరౌ వారినిధీ విగాహ్య స్థిత పృథివ్యా ఇవ మానదండః ||

ఉత్తరదిశలో హిమాలయం అనే కొండలఱేడు దేవతలకు ఆత్మ వలే ఉన్నాడు. ఇటు తూరుపు సముద్రం మొదలుకుని అటు పడమటి సముద్రం వరకున్నూ ఆ హిమాలయం చొచ్చుకుని నేలకు కొలమానం (స్కేలు) లా ఉన్నాడు.

- ఆగండాగండి. ఈ వారం ప్రస్తుతాంశం కుమారసంభవం కాదు. శ్రవణసుభగత్వం అనే అంశం పై కాసిన్ని సరదా కబుర్లు ఈ వారం.

మనలో ఒక చిన్న బలహీనత ఉంది. మనకు నచ్చిన కవి ఎవరైనా ఉంటే ఆయన ద్వారానే మనం ప్రపంచాన్ని చూడాలనుకుంటాం. ఆ కవికి తెలిసిన ప్రపంచాన్నే మనం మనదిగా చేసుకోవాలని తపన పడతాం. అతనికి తెలియని లేదా, ఆ కవి దృక్కోణానికి బాహ్యంగా ఉన్న అంశం ఎంత ఉదాత్తమైనా, ఆ అంశంలో లవలేశమైన అధ్యయనాంశం తొంగిచూసినా మనం గ్రహించటానికి విముఖులవుతాం.

సంస్కృతంలో అలా ’మనవాడు’ అని అనేకులు భావించిన కవి కాళిదాసు. సంస్కృతమంటేనే కాళిదాసని రూఢి అభిప్రాయాలు అనేకులకు. అటువంటి కాళిదాసు తాలూకు పై శ్లోకాన్ని క్షేమేంద్రుడు శ్రవణకటుత్వానికి ఉదాహరణగా చూపాడు. క్షేమేంద్రుడి ఉక్తి ఇది.

సూత్రస్యేవాత్ర తీక్ష్ణాగ్రం శ్లోకస్య లఘునా ముఖమ్ |
కర్ణం విశతి నిర్విఘ్నం సరళత్వం చ నోజ్ఝతి ||
గుర్వక్షరేణ సంరుద్ధం గ్రన్థి యుక్తమివాగ్రతః |
కరోతి ప్రథమం స్థూలం కించిత్ కర్ణ కదర్థనామ్ ||

శ్లోకారంభం లఘువుచేత సన్నని (చూపైన) అగ్రము కలదై,దారపు కొసలాగా కర్ణాన్ని (సూది బెజ్జమని మరొక అర్థం) అనాయాసంగా ప్రవేశిస్తుంది. సరళత్వాన్ని వీడదు. గురువుతో మొదలైన శ్లోకముఖం కొసన ముడివడిన దారంలా కర్ణానికి కించిత్ బాధ కలిగిస్తుంది.

పై సూక్తికి ఉదాహరణగా ఆయన "అస్త్యుత్తరస్యాం" అనే ఉపజాతి వృత్తానికి చెందిన పై శ్లోకం లో శ్లోకముఖశబ్దం తాలూకు మొదటి వర్ణం గురువవటం వినసొంపుగా లేదన్నాడు. ఇది ఆయన కాలానికి గొప్ప సాహసమే.

ఏది శ్రవణ కటువు? ఏది శ్రవణమనోహరం అని తేల్చి చెప్పడానికి నిర్దుష్టమైన ప్రమాణాలు సర్వత్రా ఉండకపోవచ్చును కానీ సూక్ష్మంగా వివేచించగలిగిన వారికి, భాష తాలూకు మూల స్వభావాన్ని సూక్ష్మస్థాయిలో వివేచించగలిగే వారికి శబ్దంలో, సమాసంలో, పద్యంలో ఈ విషయం అలవోకగా తట్టకపోదు. అయితే లక్షణమంటూ చెప్పాలి కాబట్టి రస విషయంలో ముఖ్యంగా శృంగారరసప్రధానమైన ఘట్టాలలో ఏ విధమైన శబ్దాలు వర్జనీయాలు అని కొందరు లాక్షణికులు చెప్పారు. అందులో ఆనందవర్ధనుని అభిప్రాయం గురించి ఇదివరకటి సంస్కృతసౌరభాలలో ఒక చోట ప్రస్తావించాం.

**************************************
సరే, ఈ శ్రవణ కటుత్వం గురించి ఒక పిట్టకథ.
తాలకుడు అని ఒకానొక బ్రహ్మర్షి, బ్రహ్మలోకంలో ఉండేవాడు. ఓ నాడు బ్రహ్మ కొలువు తీరాడు. ఆ సభలో తాలకుడు బ్రహ్మను నుతిస్తూ ఈ క్రింది శ్లోకం చెప్పాడు.
బ్రహ్మాస్త్వం స్తౌమి తం యస్య పుష్పలిఙ్భిః ప్రలక్షితమ్ |
పాణ్డ్వాభాం వల్గు సుష్ట్వబ్జం జన్మధిష్ణ్యం చ విష్టరమ్ ||
ఓ బ్రహ్మదేవా! తుమ్మెదలు చుట్టుముట్టి వెలికాంతులు చిమ్మే అందమైన పుండరీకాన్ని ధరించిన నిన్ను స్తుతిస్తున్నాను. నీ పీఠమైన పుండరీకమే నీ జన్మస్థానం కూడా కదా!
ఈ శ్లోకాన్ని బ్రహ్మసభలో అందరూ మెచ్చుకున్నారు. ఆ సభనుండి తాలకుడు అంబ సరస్వతి తల్లి నిర్వహించే సదస్సుకు వెళ్ళాడు. ఈ సభలో భట్టబాణుడు, కాళిదాసు వంటి కవులూ, విక్రమాదిత్యుడు, ముంజభోజుడు, శ్రీ హర్షుడు వంటి రాజకవులూ,సామంతులైన వాక్పతిరాజు, మాయురాజు, విశాఖదేవుడు కొలువుతీరి కవితారీతుల గురించి చర్చించుకుంటున్నారు. ఆ సభలో తాలకుడు పై శ్లోకాన్ని సదస్యులకు వినిపించాడు. సదస్యులందరూ విని మెచ్చుకున్నారు. ఒక్క భట్టబాణుడు తప్ప.
భట్టబాణుడు ఆ శ్లోకంలోని అశ్రావ్యపదాలైన పుష్పలిఙ్భిః, పాణ్డ్వాభాం, సుష్ట్వబ్జమ్ శబ్దాలను ఎత్తిచూపి శ్లోకానికి మెరుగుపెట్టవలసి ఉందన్నాడు. అందుకు ఆగ్రహోదగ్రుడైన బ్రహ్మర్షి తాలకుడు భట్టబాణుని ఈ విధంగా శపించాడు. " నా శ్లోకం పట్ల మూకీభావం వహించిన నీవు సరస్వతీ అమ్మవారి దేవాలయంలో నిశ్చలుడై ఒక స్థంభంగా మారిపోదువు గాక!". తన భక్తుడైన భట్టబాణుని శపించిన తాలకమహర్షికి అమ్మవారు అదే శాపాన్నిచ్చింది. "నీవూ అదే దేవాలయంలో భట్టబాణునికి శాపవిమోచనం జరిగే వరకూ నిశ్చలంగా పడి ఉందువుగాక!"

తాలకమహర్షి అటుపిమ్మట పశ్చాత్తాపం చెంది భట్టబాణునికి శాపవిమోచనం చెప్పాడు. ఒకానొక కవి తన అందమైన చంపూ కావ్యాన్ని సరస్వతి మందిరంలో చదువుతాడు. ఆ కావ్యమాధుర్యానికి శిలలు ద్రవించి భట్టబాణునికి నిజరూపం కలుగుతుంది. భట్టబాణునికి నిజరూపం రావడం తరువాయి, తాలక మహర్షికీ నిజరూపం ఎలానూ కలుగుతుంది.

ఆ కవి వచ్చాడు. కావ్యపఠనం చేశాడు. కవికీ, మహర్షికీ శాపవిమోచనం కలిగించాడు. ఇద్దరూ నిజరూపంతో ప్రత్యక్షమై, ఆ కావ్యంలో రస, రీతి, గుణ, శయ్యాది కావ్యపోషకవిషయాలు చక్కగా అమరాయని, తనకు రాజాశ్రయం లభిస్తుందని, తన కవిత్వాన్ని కేవలం సహృదయులకు మాత్రమే వినిపించమని చెప్పి ఆశీర్వదించి బ్రహ్మలోకాన్ని తిరిగి చేరుకున్నారు.

చూశారుగా. అశ్రావ్యశబ్దచయం ఎంతపని చేసిందో.

ఆ కవి పేరు శోడ్ఢలుడు. ఆ కావ్యం పేరు ఉదయసుందరి కథ. భట్టబాణుని కాదంబరి కావ్యాన్ని అనుసరించినప్పటికీ చాలా అందమైన, అమోఘమైన చంపూకావ్యం.
**************************************
ఒక చిన్న వర్ణనతో ముగింపు.
చలువరాలతో నిర్మింపబడి, ధవళకాంతులతో మెరిసిపోయే ఒకానొక బౌద్ధచైత్రం. ఉన్నట్టుంది ఆ చైత్రం రంగు ఆకుపచ్చరంగు సంతరించుకుంది. అలవోకగా ఆ చైత్రం ముఖం నుండి ఓ శ్లోకం వినిపించింది.
అహో వైచిత్ర్యమేతస్య సంసారస్య కిముచ్యతే |
గుణోऽపి క్లేశహేతుఃస్యాద్విశ్రాన్తః క్వాపి దేహిని ||
అహో, ఈ ప్రపంచం ఎంత విచిత్రమైనది? విశిష్టమైన గుణం కూడా ఆ గుణం ఉన్న ప్రాణికి దుఃఖహేతువవుతున్నది కదా!

ఆ శ్లోకంతో బాటు ఒక రామచిలుక ఆ చైత్యం నుండి బయటకు ఎగురుతూ వచ్చింది. ఆ చిలుక తలపైన అందమైన పొడుగాటి వంకీల జుత్తు ఉన్నది. ఆ గుణం గురించే అది శ్లోకంలో చెప్పింది. ఇది ఉదయసుందరి కథాముఖానికి ఆరంభం.
**************************************

1, జనవరి 2014, బుధవారం

సంస్కృతసౌరభాలు - 11


కొన్ని శ్లోకాలకు శ్లోకం తాలూకు ఉదాత్తత వల్లనే కాక, మరికొన్ని అన్య కారణాల వల్ల కూడా విశేష ప్రాచుర్యం కలుగుతూ ఉంటుంది. అలాంటిది ఒకశ్లోకం మృచ్ఛకటికం లో ఉన్నది.

లిమ్పతీవ తమోऽఙ్గాని వర్షతీऽవ అఞ్జనం నభః |
అసత్పురుషసేవేవ దృష్టిర్విఫలతాం గతా ||

తమః = చీకటి
అఙ్గాని = శరీరములను
లిమ్పతీవ = పూయుచున్నట్లుగా (ఉంది)
నభః = ఆకాశము
అఞ్జనం = కాటుకను
వర్షతి ఇవ = కురుస్తున్నట్లుగా (ఉంది)
అసత్పురుష సేవా ఇవ = దుర్జనునికి చేసే ఉపకారంలాగా
దృష్టిః = చూపు
విఫలతాం గతా = విఫలత్వాన్ని పొందుతున్నది.

దుష్టుడైన రాజు గారి బామ్మర్ది శకారుడనే వాడు తన మిత్రుడు విటుడితో కలిసి వసంతసేన వెనుక బడి వేధిస్తూ ఉన్నాడు. చీకట్లు ముసురుకున్నాయి. ఆమె ఎక్కడో మాయమయింది. ఈ విటుడికి శకారుడంటే ఇష్టం లేదు, కానీ బలవంతం మీద శకారుడికి తోడుగా వచ్చాడు. పై శ్లోకం విటుడు చెప్పింది. అందుకనే "అసత్పురుషసేవేన" అన్న ప్రయోగం. ఈ ఎత్తిపొడుపును గ్రహించేంత తెలివితేటలు శకారుడికి లేవు. వాడి ధ్యాస వేరే.

ఇది నాటకసందర్భం.

ఆంగ్లేయులు మన సాహిత్యం మీద పడ్డాక మన సాహిత్యానుశీలనపద్ధతులు మారినై. కవి వ్రాసిన దానికన్నా, ఆ సందర్భంలో చమత్కారంకన్నా, రసనిష్పందంకన్నా, కవి ఎవడు? ఏ కాలం వాడు? ఈ తాపత్రయం ఎక్కువయింది. ఆ తాపత్రయంలో భాగంగా ఈ శ్లోకానికి ప్రాముఖ్యత వచ్చింది.

మృచ్ఛకటిక నాటక కర్త శూద్రకుడు. ఈ శూద్రకుడు ఎవ్వరో, ఈయన కథాకమామీషు ఏమిటో, ఏ కాలం వాడో తెలియదు. ఈయన కాలాన్ని అంచనా వేయడానికి పూనుకున్న వాళ్ళకు పై శ్లోకం దండి మహాకవి కావ్యాదర్శంలో కూడా కనిపించి ఇబ్బంది పెట్టింది. దండి కావ్యాదర్శంలో ఈ శ్లోకం ఉంది కాబట్టి శూద్రకుడు దండి కంటే ముందే ఉండి ఉంటాడని అంచనా కట్టారు.

ఈ లోపు గణపతి శాస్త్రి గారనే ఆయన భాసనాటకచక్రాన్ని వెలికి తీసి 1909 లో ప్రకటించడంతో మరో సారి తలనొప్పి మొదలయ్యింది. భాసనాటకచక్రంలోని దరిద్రచారుదత్తం అనే నాటకంలోనూ ఇదే శ్లోకం ఉంది!

నిజానికి దరిద్రచారుదత్త కథకు మృచ్ఛకటికం పెంపు. బహుశా ఆధారం కూడా. (దీనిపై చాలా వాదోపవాదాలున్నాయి). కాబట్టి దండి భాసుని నాటకం నుండి ఆ శ్లోకాన్ని స్వీకరించి ఉపయోగించుకున్నాడేమో? శూద్రకుడు ఎవరో ఖచ్చితంగా తెలియట్లేదు కాబట్టి పిషెల్ అనే ఒకాయన మృచ్ఛకటికాన్ని భాసుడు వ్రాశాడని, ఆ తర్వాత - కాదు కాదు దండి వ్రాసి ఉంటాడని ఊహించాడు. భారతదేశ చరిత్రకు సంబంధించి - కనిపించే అంతర్గత ఆధారాలకన్నా అన్యదేశీయుల "ఊహ"లు చరిత్రకు ప్రమాణం కావటం భారతీయుల దౌర్భాగ్యం. అది అటుంచండి.

ఈ శ్లోకానికి మరొక ప్రాధాన్యత ఉంది.

"లిమ్పతీవ తమోऽఙ్గాని" - ఇది ఉపమాలంకారమా? ఉత్ప్రేక్షాలంకారమా? అని ప్రశ్న.

ఉపమాలంకారం అంటే - ఉపమానం, ఉపమేయం, సమానధర్మం, ఉపమావాచకం - ఈ నాలుగింటిలో కనీసం రెండు ఉండాలి. "ఆమె ముఖము చంద్రుని వలే సుందరము" - ఇక్కడ -

చంద్రుడు = ఉపమానం (దేనితో పోల్చాడో అది)
ముఖము = ఉపమేయం (ఎవరిని పోలుస్తాడో ఆ వస్తువు)
సమానధర్మం = సౌందర్యం (రెంటిలో ఉన్నది. ఇది జాతి, గుణం, క్రియ ఏదైనా కావచ్చు)
వలే = ఇది ఉపమావాచకం.

"ఆమె ముఖము చంద్రుని వలె నున్నది" - ఇది కూడా ఉపమాలంకారమే. ఇది లుప్త ఉపమాలంకారం (సౌందర్యం అనే సాధర్మ్యం లోపించినది కాబట్టి). మొదటిది పూర్ణోపమ. ఉపమకు కావ్యాదర్శ కారుడు 23 భేదాలు ప్రతిపాదించాడు, చిత్రమీమాంసకారుడు అప్పయ్యదీక్షితుడు "ఉపమైకా శైలూషిః" అని ఉపమాలంకారం ద్వారానే మిగిలిన అలంకారాలన్నీ పుట్టాయని ప్రతిపాదించి చాలా రోచకంగా వివరించాడు. ఉపమలో సాధర్మ్యంతో బాటు చమత్కారమూ ప్రతీయమానం కావాలని కావ్యాదర్శకారుడు దండి.

ఉపమాలంకారానికి ఒక గుడ్డి గుర్తు "ఇవ, యథా, తుల్యః, వత్, సమః.." వంటి ఉపమావాచకాలు. తెలుగులో "ఇవార్థాలు అంటారు వీటిని. "కరణి, భంగి, వలే, మాదిరి, మాడ్కి, పొల్కి..."ఇలాంటివి. ఇవి తెలుగులో దాదాపుగా పాతిక వరకూ ఉన్నాయనుకుంటాను. వీటిని అన్నిటినీ ఒకే సీసపద్యంలో ప్రయోగించి బహుశా చేమకూరి వేంకటకవీ, ఒకట్రెండు తప్ప దాదాపుగా అన్నిటినీ ఒకే సీసంలో గుదిగుచ్చి ఉపయోగించి తెనాలి రామకృష్ణుడూ వినూత్న ప్రయోగాలు చేశారు.

ఉత్ప్రేక్ష - ఉత్ప్రేక్ష, ఉపమా దాదాపుగా ఒకటే. భేదం ఎక్కడంటే - సాధర్మ్యం వ్యంగ్యంగా, అనుమానప్రమాణం ద్వారా తెలియగలిగితే ఉంటే అది ఉత్ప్రేక్ష. ఇందులో సమానధర్మం సాదృశ్యానికి అంతర్గతంగా ఉంటుంది.

ఈ నేపథ్యంలో - "తమోऽఙ్గాని లిమ్పతీవ" - "చీకటి అంగములను లేపనం చేస్తున్న భంగి" - ఇక్కడ "ఇవ" వచ్చింది కాబట్టి ఇది ఉపమా అనాలి. కానీ ఇది ఉపమ కాదు ఉత్ప్రేక్ష అని కావ్యాదర్శకారుడు దండి విశదీకరించాడు. దానికి ఆయన రెండు కారణాలను చూపాడు.

మొదటి కారణం: లిమ్పతి - ఇది ధాతువు, అంటే క్రియాపదం. (తిజన్తములంటారు వీటిని) "నవై తిజన్తేన ఉపమానమస్తి" - అని వ్యాకరణభాష్యకారులు. పైని వాక్యంలో చీకటి అంగములపై లేపనాన్ని అధ్యారోపం చేస్తున్నదనీ, ఇది సాధ్యమే తప్ప సిద్ధము కాదని, అందువలన "ఇవ" అని ఉన్నప్పటికీ దీనిని ఉపమాలంకారంగా అంగీకరింపరాదని దండి మహాకవి వివరణ.

రెండవకారణం: "చీకటి అంగములను లేపనం చేస్తున్న భంగి" - ఇక్కడ సమానధర్మం లేదని దండి చెబుతాడు. లిమ్పతి అన్న క్రియ - సాధర్మ్యం అవడానికి అవకాశం లేదని, అలా అయిన పక్షంలో ధర్మాన్ని ఆశ్రయించిన ధర్మి లేదని చర్చించాడు.

"వర్షతీవ అఙ్జనం నభః" - ఇక్కడా ఉత్ప్రేక్షయే. అయితే రెండవపాదంలో "అసత్పురుష సేవా ఇవ దృష్టిః విఫలతాం గతా" - ఇది మాత్రం వాక్యగతశ్రౌత్యుపమాలంకారం.

అదంతా చక్కటి శాస్త్రచర్చ. ఇంకా వివరాలు కావాలంటే దండి కావ్యాదర్శం పుస్తకానికి తెలుగులో పుల్లెల రామచంద్రుడు గారి వ్యాఖ్యానం దొరుకుతున్నది. అందులో చదువుకోవచ్చు.

*******************************************************

ఈ రోజు అమావాస్య. శకారుడు కూడా ఇలాంటి రాత్రే వసంతసేన వెంటబడ్డాడు. ఈ రోజూ చీకట్లు ఇప్పుడిప్పుడే ముసురుకుంటున్నాయి. అందరికీ మరోసారి శుభాకాంక్షలతో, మరొక శ్లోకంతో ముక్తాయింపు.

పినష్టీవ తరఙ్హాగ్రైః ఉదధిః ఫేనచందనమ్ |
తదాదాయ కరైరిన్దుః లిమ్పతీవ దిగఙ్గనాః ||

సముద్రుడు తరంగాగ్రములచేత నురగ అనే చందనాన్ని తీస్తున్నట్లుగా ఉన్నాడు. ఆ చందనాన్ని తన కిరణాలతో తీసుకుని చంద్రుడు దిక్కులనే అంగనామణులకు పూస్తున్నట్టుగా ఉంది.

సంస్కృత సౌరభాలు - 10



ఈ వారం సంస్కృతం గురించి ఏం వ్రాయాలో సరిగ్గా తోచక పెనుగులాడుతూ ఇంటికి నడిచి వస్తున్నాను. తోడుగా వెనుకలే నాతో బాటు నడిచి వస్తున్నాడాయన. ఇంకెవరు? చందమామ. ఆయనపైని ఒక శ్లోకం, నెలవంక నింగిని పొడిచిన ఓ నిశి రాత్రి ఏం జరిగిందో ఆ ముచ్చట.

అసౌ హి దత్వా తిమిరావకాశమస్తంవ్రజత్యున్నతకోటిరిందుః |
జలావగాఢస్య వనద్విపస్య తీక్ష్ణం విషాణాగ్రమివావశిష్టమ్ ||
జలావగాఢస్య = నీటిలో మునిగిన
వనద్విపస్య = అడవియేనుగుయొక్క
తీక్ష్ణం = వాడి అయిన
విషాణాగ్రం అవశిష్టమ్ ఇవ = కొమ్ము చివర వలే
తిమిరావకాశం= చీకటికి అవకాశం
దత్వా = ఇచ్చి
అసౌ ఇందుః = ఈ చందమామ
ఉన్నతకోటిః = పొడవైన కొసకలిగినవాడై
అస్తం వ్రజతి = అస్తమిస్తున్నాడు.

ఓ బహుళాష్టమి నాడు. కారుచీకట్లు వ్యాపించడానికి అవకాశం ఇస్తున్న నెలవంక నీటిలో పూర్తిగా మునిగిన ఏనుగు తాలూకు కొమ్ము పైకి తేలితే ఎలా ఉందో అలా ఉంది!

**************************************

సరిగ్గా అదే రోజు రాత్రి ఒకానొక ఇంట ఒక దొంగ కన్నం వేయదల్చుకున్నాడు. అతడిలా అనుకుంటున్నాడు.

కృత్వా శరీరపరిణాహసుఖప్రవేశం శిక్షాబలేన చ బలేన చ కర్మమార్గమ్ |
గచ్ఛామి భూమి పరిసర్పణ ఘృష్టపార్శ్వో నిర్ముచ్యమాన ఇవ జీర్ణతనుర్భుజంగః ||

చోరవిద్య తాలూకు మేధాశక్తితో, నా భుజబలంతో నా శరీరం సుఖంగా ప్రవేశించడానికి అనుగుణంగా నా వృత్తికి తగినట్టు కన్నం వేస్తాను. ఈ కన్నం ద్వారా ముసలిపాము తన కుబుసం నుండీ ఎలా బయటకు వస్తుందో అలా నేనూ నా పక్కభాగాలు రాచుకొని పోయేట్టు కన్నం అవతలికి వెళతాను.

ఇలా సంకల్పించుకున్నాడు. ఆ రేయి నల్లగా, చల్లగా అతణ్ణి రాజభటులనుండి కాపాడుతున్నది.అందుకా రేయికి మంగిడీలు చెప్పాడా దొంగ.

అంతలో అంతర్మథనం! ఈ వృత్తి నీచం అని అందరంటారు కదా. నిద్రిస్తున్న వారి ఇళ్ళల్లో కన్నం వేయడం తప్పు కదూ? కాదు, కానే కాదు. ఇతరుల క్రింద పనిచేయడం కంటే ఇది ఉన్నతమైన వృత్తే. ఒకవేళ దొరికినా చేసిన తప్పుకు దండన అనుభవిస్తాను కాబట్టి తప్పేమీ లేదు. అయినా నాడు అశ్వత్థామయే సౌప్తికవధకోసం దొంగపని చేశాడు. నాకేమిటి?

ఇంతకూ కన్నం ఎక్కడ వేద్దాం? ఆడవాళ్ళు నిద్రించే శయనగృహం పనికి రాదు. కాస్త చప్పుడైతే లేస్తారు కాబట్టి. ఇనప్పెట్టె లేని గదుల్లో కన్నం వేసి ప్రయోజనం లేదు. కాస్త గోడ కూడా వదులుగా ఉండి సహకరించాలి మరెక్కడ? ఇదుగో ఇంటి యజమాని సంధ్యావందనం చేసి నీరు విడిచీ విడిచీ ఈ కొస కాస్త వదులుగా ఉంది. ఇక్కడ కన్నం వేస్తా.

అన్నట్టు -

పద్మవ్యాకోశం భాస్కరం బాలచంద్రం వ్యాపీ విస్తీర్ణం స్వస్తికం పూర్ణకుంభమ్ |
తత్ కస్మిన్ దేశే దర్శయామాత్మశిల్పం దృష్ట్వా శ్వ అయం యద్విస్మయం యాన్తి పౌరాః ||

పద్మ,వ్యాకోశం, భాస్కరం, బాలచంద్రం, వ్యాపీవిస్తీర్ణం, స్వస్తికం పూర్ణకుంభమ్ - ఇలా ఏడు రకాల కన్నాలున్నాయిగా? ఏ విధంగా కనబడే కన్నం వేద్దాం? ఈ కన్నాన్ని చూచి రేపు ఉజ్జయినీనగర పౌరుల దిమ్మతిరిగిపోవాలి.

ఈ పండుఇటుకల గోడలో పూర్ణకుంభాకారంలో కనబడే కన్నం సబబు.

ఇదుగో యోగరోచనమనే లేపనాన్ని వళ్ళంతా పూసుకుంటానిక. దీనితో రక్షకభటులకు కనిపించను. దీనివల్ల శరీరానికి గాయాలూ అవవు. ఇదుగో చోరుల దైవం కార్తికేయునికి వందనాలు.
ఇంతకూ నా చుట్టుకొలత కోసం ప్రమాణసూత్రం ఏదీ? అయ్యో! మర్చిపోయానే!
అబ్బే! పర్లేదు. జందెం ఉందిగా.

ఏతేన మాపయతి భిత్తిషు కర్మమార్గేన ఏతేన మోచయతి భూషణసంప్రయోగాన్ |
ఉద్ఘాటకో భవతి యంత్రధృఢే కపాటే దష్టస్యకీటభుజగైః పరివేష్టనం చ ||

కన్నం చుట్టుకొలతను జందెంతో కొలవచ్చు. దీనితో నిత్యకర్మ చేయవచ్చు. కొక్కేలూడదీయవచ్చు. గడియలు తీసుకోవచ్చు. తేళ్ళేవైనా కుడితే బిగించి కట్టుకోవచ్చు. అన్నివిధాలుగా ఈ జందెం మా దొంగలకు ఉపకరిస్తుంది.

ఇలా ఆలోచించి కన్నం వేశాడు. చివరి ఇటుక మిగిలింది. దాన్ని తొలగిస్తుంటే - ఆ దొంగ వ్రేలిపై పాము కాటువేసింది. పాముకుట్టినదొంగ జందేన్ని వ్రేలికి బిగించికట్టేడు. అక్కడ గదిలో ఒక దివ్వె నిశ్చలంగా వెలుగుతోంది.

శిఖాప్రదీపస్య సువర్ణపింజరా మహీతలే సంధిముఖేన నిర్గతా |
విభాతి పర్యంత తమస్సమావృతా సువర్ణరేఖేన కషే నివేశితా ||

గదిలో వెలుగురేఖ కన్నం ద్వారా ఇవతల నేలపైకి ప్రసరించింది. చుట్టూ కారునలుపు. మధ్యన కాంతిరేఖ. ఇది నల్లని గీటురాయి మీద పెట్టిన బంగరు గీటులా ఉంది!

( కాళిదాసుది సంచారిణీదీపశిఖ అయితే పైది నిశ్చలదీపశిఖ.
సంచారిణీ దీపశిఖేవరాత్రౌ యం యం వ్యతీయాయ పతింవరా సా
నరేన్ద్రమార్గాట్ట ఇవ ప్రపేదే వివర్ణభావం సస భూమిపాలః ||
 
రాకుమారి వరమాల పట్టుకుని రాజకుమారులను దాటుకుని వస్తూంది. కదులుతున్న దీపశిఖలా. ఆమె ఎదరకు వస్తుంటే రాకుమారుల ముఖాలు వెలిగిపోతున్నాయి. వెనుకాతల ఆమె దాటి వచ్చిన రాకుమారులముఖాలు చీకటి లా అయిపోతున్నాయి.- ఇది కాళిదాసు వర్ణన. ఈ వర్ణన ద్వారా ఆయనకు దీపశిఖాకాళిదాసు అన్న పేరు వచ్చిందని ఐతిహ్యం.)

దొంగ కన్నంలోనికి ఒక దిష్టి బొమ్మను జొనిపాడు. ఎవరైనా"దొంగ దొంగ" అని కేకలు వేస్తే తప్పించుకొందుకు ఆ ఏర్పాటు. ఎలాగైతేనేం చివరికి గదిలోనికి వచ్చాడు. అక్కడ ఇద్దరు వ్యక్తులు నిద్దరోతున్నారు. వారి ఉచ్ఛ్వాసనిశ్వాసలను, కనుపాపలను, శరీరభంగిమలను గమనించాడు.అది దీర్ఘనిద్ర అని నిర్ధారించుకున్నాడు. తన గుప్పిట్లో ఉన్న దీపపు పురుగును వదిలేడు. అది వెళ్ళి దీపంలో పడి దానిని ఆర్పివేసింది.

అలా చీకట్లో దొంగతనం చేసుకు వెళ్ళిపోయేడు.

*******************************************

ఆ దొంగ పేరు శర్విలకుడు. ఆ నాటకం మృచ్ఛకటికమ్. ప్రపంచంలో అద్భుతాలు అప్పుడప్పుడూ జరుగుతాయి. సంస్కృతసాహిత్యరంగంలో అలాంటి ఒకానొక అద్భుతం ఈ నాటకం.

*******************************************