ధ్రువనక్షత్రం - శింశుమారుడు

రాత్రి పూట ఆకాశంలో సరిగ్గా ఉత్తరదిక్కున సన్నగా, మిణుకుమిణుకుమంటూ ఓ నక్షత్రం ఉదయిస్తుంది. ఆ నక్షత్రం చుట్టూ మిగిలిన నక్షత్రాలన్నీ వలయంగా తిరుగుతూ ఉంటాయి. ఇది ధ్రువనక్షత్రమని ఇదివరకు వ్యాసంలో ప్రస్తావనగా ఒకచోట చెప్పుకున్నాం. ధ్రువం - అంటే స్థిరము, నిశ్చలము. ఈ ధ్రువనక్షత్రాన్ని Polaris (α-Ursa Minor) అని పిలుస్తారు.

ధ్రువనక్షత్రం ఉదయించినప్పుడే దానికి క్రిందుగా సప్తర్షి మండలం కూడా కనిపిస్తుంది. దీనిని ఆంగ్లంలో "Big Dipper" అన్నారు. ఈ సప్తర్షులు ఏడుగురని మనకు తెలుసు. వీరిలో ముగ్గురు ఒకే సరళరేఖలో, మిగిలిన నలుగురు కలిసి ఒక పెట్టె/గరిటె/శకటం రూపంలో అమరి ఉండటం మనకు తెలుసు.

 మండలం ధ్రువ నక్షత్రం క్రిందుగా ఉదయించి రాత్రి గతించి తెల్లవారు ఝాము వేళకు ఆ ధ్రువుని పైకి చేరుకుంటుంది. అప్పుడు ఆ సప్తర్షి మండలం ఎలా ఉంటుందో - మాఘుడనే కవి శిశుపాలవధ కావ్యంలో వర్ణించాడు.

స్ఫుటతర ముపరిష్టా దల్పమూర్తేః ధ్రువస్య
స్ఫురతి సురమునీనాం మండలం వ్యస్తమేతత్ |
శకటమివ మహీయః శైశవే శార్ఞపాణేః
చపల చరణకాబ్జ ప్రేరణోऽత్తుంగితాగ్రమ్ ||

(శిశుపాలవధమ్ - 11. 3)

బాల్యంలో శ్రీకృష్ణయ్య తన చిట్టిపాదాలలో శకటాసురుణ్ణి తంతే ఆ దెబ్బకు శకటం అమాంతం పైపైకి వెళ్ళిపోయి.. ధ్రువ నక్షత్రం పైకి వెళ్ళి సప్తర్షిమండలం రూపంలో చేరి అమరిందట. ఆ సప్తర్షి మండలం క్రిందనే మిణుకు మిణుకు మని ధ్రువుడు ప్రకాశిస్తున్నాడు. పై వర్ణన ప్రభాతకాలవర్ణనలో భాగంగా చెప్పాడు కవి. అందుకనే సప్తర్షులు ధ్రువుని పైకి చేరారు.

ఈ మాఘ కవిది క్రీ.శ. ఆరవ లేక ఏడవ శతాబ్దం. అంతకు ఎన్నో శతాబ్దాలకు పూర్వమే భాసుడనే కవి కూడా తన "స్వప్నవాసవదత్త" నాటకంలో సప్తర్షి మండలాన్ని ప్రస్తావించాడు.

ఋజ్వాయతాంచ విరలాంచ నతోన్నతాంచ
సప్తర్షివంశకుటిలాంచ నివర్తనేషు |
నిర్ముచ్యమాన భుజగోదర నిర్మలస్య
సీమామివామ్బర తలస్య విభజ్యమానామ్ ||

(మిత్రమా, సరళంగా ఉన్నవి, విడివిడిగా ఉన్నవీ, ఎత్తుపల్లెములు కలిగినవి, మలుపులు తిరిగేప్పుడు సప్తర్షి మండలంలా వంకరగా అయినవి, కుబుసం విడిచిన పాములా స్వచ్ఛంగా ఉన్న గగనతలానికి సరిహద్దురేఖ గీచినట్లుగా ఉన్నవీ అయిన ఆ సారసపంక్తిని చూశాను.)

ఆ మండలంలో రెండవ నక్షత్రం వశిష్టుడు. ఈ వశిష్టుని పక్కనే మరొక చిన్న నక్షత్రం ఉంటుంది. అది "అరుంధతి". పెళ్ళైన జంటకు ఈ నక్షత్రాన్ని, వశిష్టునీ, ఆపై ధ్రువుణ్ణి చూపించటం చాలాకాలం ముందునుంచి భారతదేశంలో ఏర్పడిన సాంప్రదాయం.


ఈ ధ్రువుడు, దానికి సంబంధించిన సప్తర్షిమండలం గురించి భారతదేశంలో స్పష్టంగా తెలుసు.

**********

అయితే తెలియవలసిన సైన్సు వ్యవహారం మరొకటి ఉంది. ధ్రువం - అంటే నిశ్చలం. ధ్రువ నక్షత్రం భూమి అక్షం సూచించే దశలో సుదూరంగా ఉత్తర కొసన నిలిచి ఉంటుంది - అన్నది పాక్షిక సత్యమే. అదెలాగ అంటే విషువచ్చలనం (Precision of equinoxes) గురించి తెలియాలి.


భూమి తన చుట్టూ తాను తిరుగుతోంది. (24 గంటలు ఒక భ్రమణ కాలం). దీని అక్షం సూర్యుని అక్షానికి 23.5 డిగ్రీలు పక్కకు వంగి ఉంటుంది. - ఈ రెండు విషయాలూ మనకు తెలుసు. అయితే భూమి తన చుట్టూ తాను తిరిగేప్పుడు దాని అక్షం కూడా తిరుగుతుంది. ఎలాగంటే - బొంగరం తిరిగేప్పుడు దాని అక్షం కూడా ఒక చిన్న వలయంలో తిరిగినట్టు. (ఇలా ఎందుకు ప్రవర్తిస్తూంది? అంటే భూమి ఖచ్చితంగా గోళాకారంలో లేదు. కాస్త దీర్ఘవృత్తం (Ellipse) ఆకారంలో ఉంది. అంటే మధ్యభాగంలో ఉబ్బెత్తుగాను, కొసల దగ్గర అణక్కొట్టినట్టుగానూ అన్నమాట. అంటే బొంగరంలా. దీర్ఘవృత్తానికి (భూమికి) రెండు Foci ఉండటం మూలాన,  ఆ రెండు Foci ల మధ్య అభికేంద్రబలాన్ని (Centripetal force) నిలుపుకోడానికి ఇలా తంటాలు పడుతోందది.)

భూ అక్షం - ఒక్క డిగ్రీ పక్కకు జరగటానికి 72 యేళ్ళు పడుతుంది. ఇంత నింపాదిగా, పెళ్ళికూతురి నడకలాగా ఈ చలనం ఉండటం మూలాన మనకు కంటిద్వారా ధ్రువనక్షత్రం మారటాన్ని కనిపెట్టటం కష్టం అవుతోంది. భూ అక్షం ఓ వలయం పూర్తిగా తిరగటానికి 360 x 72 = 25920  అంటే ~26000 యేళ్ళు పడుతుంది.

అక్షం - వలయంగా తిరుగుతోంది కాబట్టి, ఆ అక్షం కొసను సూచించే ధ్రువం (ధ్రువ నక్షత్రం) కూడా మారుతుంది. ప్రస్తుతం ఉన్న నక్షత్రం Polaris (α-Ursa Minor).  దీని క్రిందుగా సప్తర్షిమండలం ఉంది. సుదూర భవిష్యత్తులో ఈ నక్షత్రం స్థానే Vega అనే నక్షత్రం వస్తుంది. (క్రీ.శ. 14000). ఇంకొక్క 200 యేళ్ళ తర్వాత కూడా సప్తర్షి మండలం, ధ్రువనక్షత్రం దూరంగా జరుగుతాయి. ఇలా ధ్రువనక్షత్రము మారుతూ ఉంటుందని, భూమి అక్షం వలయంలో తిరుగుతూ ఉంటుందనీ క్రీ.పూ. మూడవ శతాబ్దంలో హిప్పార్చిస్ అనే గ్రీకు శాస్త్రవేత్త నిరూపించాడు. అంటే క్రీ.పూ. మూడవశతాబ్దం వరకూ భూమి ఉత్తరదిశన ధ్రువ నక్షత్రం స్థిరంగా ఉంటుందని పాశ్చాత్యులు నమ్మేవారు.

భవిష్యత్తులో ధ్రువ నక్షత్రం మారుతుంది. అలాగే చాలాకాలం మునుపు అనగా క్రీ.పూ. 3000 యేళ్ళనాడు కూడ ప్రస్తుతం ఉన్న ధ్రువ నక్షత్రం (Polaris), దాని క్రింద ఉన్న సప్తర్షి మండలమూ ఉండేవి కావు. అప్పట్లో ఉన్న నక్షత్రం పేరు α Draconis/Thuban. దాని క్రింద సప్తర్షి మండలం ఉండేది కాదు, మరో నక్షత్రమండలం ఉండేది. (Draco constellation) ఈజిప్షియనులకు అది పాములా కనబడ్డది. అ మండలంలో (Constellation) మొత్తం 14 నక్షత్రాలు.


**********

ఇప్పటి దాకా ఈ వ్యాసంలో చెప్పింది ప్రస్తావన మాత్రమే. ఇప్పుడు ఈ వ్యాసం ఉద్దేశ్యం, భారతదేశ చరిత్ర రచన వెనక పాశ్చాత్యుల కుటిలత్వమూ చెప్పుకుందాం.

రాజు గారి గది


క్రీ.పూ. 3000 నాడు ఆకాశంలో ఉత్తర దిక్కున ఉన్న నక్షత్రం ప్రస్తుత ధ్రువ నక్షత్రం కాదు. దాని పేరు α-డ్రాకోనిస్ అన్నాం. పాశ్చాత్యులకు ఈ విషయం తెలుసు. దీనికో ఋజువు ఉంది.

ఈజిప్టులో గిజా అనేచోట ఉన్న ఖుఫూ పిరమిడ్ మధ్యన అప్పటి రాజు గారు ఓ గదిని కట్టించుకున్నారు. (బొమ్మలో పిరమిడ్ మధ్యన ఉన్న పోస్ట్ ఆఫీస్ లా కనిపిస్తున్నది అదే). ఆ గదిని చేరుకుని అక్కడ నుండి, సరిగ్గా ఉత్తర దిక్కుకు తవ్విన కంత గుండా చూస్తే తుబన్ అనే నాటి ధ్రువనక్షత్రం కనిపిస్తుంది.  లేదా, "To Orions belt" అన్న చోట కన్ను ఉంచి కంత గుండా పిరమిడ్ లోపలకు చూస్తే, పాత ధ్రువనక్షత్రం (తుబన్) రాజుగారి గదిలో నేలపై అమర్చిన నీటి తొట్టెలో ప్రతిఫలించి - ఆ ప్రతిబింబం కనబడేది.   అలా కంతలో నుంచి తుబన్ ను చూడటం ఈజిప్షియనులకు ’పుణ్యం’ లాంటిది. సాంప్రదాయానికి సంబంధించిన వ్యవహారం అది.


ఖుపూ ఒక్కటే కాదు. ఇతర పిరమిడ్ లలోనూ కొన్ని పిరమిడ్ ల నిర్మాణం - అలా రాత్రిపూట "తూబన్" అనే ఉత్తర దిక్కున ఉన్న నక్షత్రం కనిపించేట్టుగా నిర్మించారు. అంతే కాదు. ఈ తూబన్ అనేది పదునాలుగు నక్షత్రాల నక్షత్రమండలం చివర్న ఉంటుంది. ఆ పదునాలుగు నక్షత్రాలను  కలిపి పాము ఆకారాన్ని వారు ఊహించారు. ఆ సర్పం పేరు డ్రాకో.


పైని విషయాలు పాశ్చాత్యులకు తెలుసు. "పాశ్చాత్యులకు మాత్రమే " తెలుసు. భారతీయులకు వీటి గురించి, ధ్రువనక్షత్రం యొక్క చలనం గురించిన్నీ ఏ మాత్రం తెలియదని పాశ్చాత్యులు నమ్మారు. అసలు పాశ్చాత్యులు ఈ విషయం ఎందుకు లేవదీశారు. భారతీయులకు ధ్రువ నక్షత్రం గురించి తెలిసినా, తెలీకపోయినా వారికేం నష్టం?

ఆ నష్టం ఏమిటంటే - భారతదేశాన్ని ఆంగ్లేయులు లోబరుచుకున్న తర్వాత వారు ఈ భారతదేశాన్ని గురించి తెలుసుకోనారంభించారు. వారికి ఈ దేశం అర్థం కాలేదు. ఇక్కడి ఆచారాలు, సాంప్రదాయాలు అన్నీ అనాగరికం, ఏహ్యమైనవనీ వారికి అనిపించింది, భారతదేశంలో ఉన్న "మంచి" ఏదైనా సరే పాశ్చాత్యులు ఏదో కాలంలో ఈ దేశానికి వలసగా వచ్చి వారికి తెలిసిన నాగరకతను, ఈ అనాగరికులకు బోధించటం ద్వారా మాత్రమే ఏర్పడిందని వీరి నిశ్చయమైన తలంపు. భారతదేశచరిత్రను కూడా వారు "అంత" పురాతనమైనదిగా వారు అంగీకరించలేకపోయారు. అందులో భాగంగా విలియమ్ జోన్స్ అనేవాడు భారతదేశ చరిత్రలో - భారతీయుల ప్రమేయం లేకుండా, ఒక్క ముక్క సంస్కృతం రాకుండా, అసలు భారతీయ ఐతిహాసిక లక్షణాల మీద అవగాహన లేకుండా భారతదేశచారిత్రక ప్రతిపాదికను నిర్మించాడో మనం ఇదివరకు వ్యాసంలో చూశాం. ఆ ప్రాతిపదిక ప్రకారం - క్రీ.పూ. మూడవ శతాబ్దంలో ఉన్నది చంద్రగుప్తమౌర్యుడని అతడు, తనకు తోచినట్టుగా నిర్ణయించేశాడు.  తర్వాత అదొక నిర్ధారిత సత్యంగా ఎంచేసి ఆ విధంగా ఇతర పాశ్చాత్య ఇండాలజిస్టులు తమ పరిశోధనలు కొనసాగించారు. అందులో మాక్స్ ముల్లర్ అనేవాడు మరింత ముందుకెళ్ళి అసలు భారతదేశానికి ఈ విజ్ఞానం అందించినదే ఐరోపా ఖండమనే ప్రతిపాదన మొదలెట్టాడు. అలా ఊహల్లోంచి ఊడిపడిన పుట్టిన సిద్ధాంతమే - Aryan Invasion theory. ఈ సిద్ధాంతం ప్రకారం స్థూలంగా క్రీ.పూ. 1500 నుండి క్రీ.పూ. 1200 మధ్య ప్రాంతంలో పాశ్చాత్యులు భారతదేశానికి వచ్చి ఇక్కడికి విజ్ఞానాన్ని అందించారు. ఇలా ఆ తర్వాతే భారతదేశ చరిత్ర మొదలయ్యింది.  అంటే భారతీయమైన వ్యాకరణ, జ్యోతిష్య, ఖగోళ, వైద్య ఇత్యాది శాస్త్రాల విజ్ఞానమేదైనా అది గ్రీకు/ఈజిప్టు/ఐరోపా ప్రాంతం నుంచి భారతదేశానికి ముష్టిగా వచ్చిందే అన్నమాట.

ఇలా క్రీ.పూ. 1500 తర్వాత భారతదేశంలో విజ్ఞానం మొదలయ్యింది కాబట్టి -  క్రీ.పూ 3000 నాటి ఈజిప్టు/గ్రీకు విజ్ఞానంలో భాగమైన "తూబన్" నక్షత్రమూ, దాని వెనుక ఉన్న α డ్రాకోనిస్ నక్షత్ర మండలమూ భారతదేశీయులకు తెలియవని వారి నమ్మకం.

పై వాదాన్ని బాలగంగాధరతిలక్ ఖండించాడు. అందులో ఒకానొక్క భాగంగా అయన హిందూ వివాహాలలో అరుంధతి నక్షత్రదర్శనం అనే సాంప్రదాయవిధిని ఉటంకించాడు. హిందూ వివాహ సాంప్రదాయ వివాహంలో భాగంగా వధూవరులకు ధ్రువుని, సప్తర్షి మండలంలో వశిష్టుని పక్కనే ఉన్న అరుంధతి నక్షత్రాన్ని చూపుతారు. ధ్రువుడు స్థిరంగా ఉంటాడని భావించే రోజుల్లో (క్రీ.పూ 3000 ప్రాంతాలలో) ఆ సాంప్రదాయం పుట్టిందని తిలక్ నిర్దేశించాడు.  స్థిరమైన ధ్రువుణ్ణి, అరుంధతిని వధూవరులకు చూపిస్తున్నారు కాబట్టి ఈ సాంప్రదాయం క్రీ.పూ. 3000 నాటిదని, అప్పటి నుండి పరంపరగా వస్తుందని తిలక్ చెప్పాడు. అంటే వేదకాలంనాటిదే ఈ సాంప్రదాయం. ఆ ప్రకారంగా ఆర్యుల నుంచి అరువు తెచ్చుకున్నదేదీ లేదు! ఈ వాదనను జాకోబీ అనే జర్మన్ పండితుడు ఆదరించాడు.

పై వాదాన్ని విట్నీ, కీథ్ వంటి వారు ఖండించారు. ఎద్దేవా కూడా చేశారు.   కీథ్ - క్రీ.పూ. 3000 నాటి α డ్రకోనిస్ గురించి భారతీయులకు తెలియదని, ధ్రువుని వివరం ఇటీవలి కాలపు అశ్వలాయన గృహ్యసూత్రాల కాలంలో మాత్రమే కనిపిస్తుందనేశాడు. భారతీయులకు α డ్రాకోనిస్ గురించి తెలీదు కాబట్టే వేదాల్లో ఎక్కడా దాని ప్రస్తావన లేదని ఆతని తీర్పు.

It is really impossible to attach serious value to such an assertion, made in a passage which consists of foolish reasons for preferring one or other of the Naksatras ; we are in the same region of popular belief as when in the Sutra literature the existence of Dhruva, a fixed polar star, is alleged. (The Religion and Philosophy of the Veda and Upanishads_Vol 1_Keith, Page 22).

అంతే కాదు. ఈ ధ్రువ నక్షత్రం గురించిన సమాచారం ఇటీవలి సూత్రకాలం నాటి "అశ్వలాయన గృహ్యసూత్రాలలో" మాత్రమే కనిపిస్తుంది. మరెక్కడా ఈ విషయం గురించి లేనే లేదని ఆతను తీర్మానించాడు.

If they were so well known as to be understood in such references, why are they never mentioned distinctly? The pole star,Dhruva, appears in the Grhya Sutras only. (Page 79 foot note)

విట్నీ అనే వాడు మరింత ముందుకు పోయి భారతదేశ ఆచారమైన అరుంధతీనక్షత్రదర్శనాన్ని గురించి బూతులు లంకించుకున్నాడు.

“….any star not too distant from the pole would have satisfied both the newly wedded woman and the exhibitor; there is no need of assuming that the custom is one handed down from the remote period when α-Draconis was really very close to the pole, across an interval of two or three thousand years during which there is no mention of pole-star, either in Veda or in Brâhman.a.”

(ఉత్తర ధ్రువాన ఉన్న ఏదో ఒక నక్షత్రం నూతన వధువునూ, ఆ పూజారిని "తృప్తి పరుస్తుంది". అదేదో తరతరాలుగా వస్తున్న α డ్రాకోనిస్ కాలం (పిరమిడ్ లను నిర్మించిన కాలం) నాటిదని చెప్పడానికి వీల్లేదు. అంత ప్రాచీనమైన సాంప్రదాయమే అయితే అది వేదాలలో బ్రాహ్మణాలలో ఎందుకు లేదు?)

వెబర్ అనే మరొకతను - అసలు భారతీయులకు చాంద్రమాన,సౌరమాన సంవత్సరాల గురించి కూడా తెలియవని ఎద్దేవా చేశాడు.

పైని ఆంగ్లపండితులు గొప్పవారే. వారి వారి రంగాలలో శ్రద్ధగా పనిచేసినవారే. అయితే జాత్యహంకారం అన్నది ఉగ్గుపాలతో వచ్చిన అలవాటు అయినందున వారికి భారతీయులపై చిన్నచూపు ఏర్పడింది. అంతే కాక ఇదివరకటి వ్యాసంలో చెప్పుకున్నట్టు - వారి చరిత్ర దృక్పథం సరళరేఖ. జోన్స్ అనేవాడు ఒక తీర్మానం చేసిన తర్వాత, అతణ్ణి ప్రశ్నించడం వారు చెయ్యలేదు.

కొత్తకోడలు


కీత్, విట్నీ వంటి పాశ్చాత్యులు తమ వాదం నెగ్గించుకోవడం కోసం లేదా వివరాలు తెలీక తొండి వాదం చేశారే తప్ప - నిజానికి వేదవాఙ్మయంలో ధ్రువుని ప్రస్తావన ఉంది. అది సాంప్రదాయానుసారంగా నేటికీ వస్తోంది. ఆ ఉదంతం యిదీ.

అది కొత్తకోడలు అత్తవారింట అడుగుపెడుతున్న తరుణం.

కొత్తపెళ్ళికూతురా రారా
నీ కుడికాలు ముందు మోపి రారా
కులసతీ గుణవతీ రారా
నీవు కోరుకున్న కోవెలకూ రారా...

ముత్తైదువలు మంగళహారతులతో ఆహ్వానం పలికారు. అయ్యవారు వేదమంత్రాలు చదివారు.

సుమంగళీరియం వధూరిమాన్ సమేత పశ్యత |
సౌభాగ్యమస్యై దత్వాయథాస్తం విపరేతన ||

వ్యాఖ్యానం : ఉదితేషు నక్షత్రేషు ప్రాచీముదీచీం వా దిశాముపనిష్క్రమ్య ఉత్తరాభ్యాం యథాలింగం ధృవమరుంధతీం చ దర్శయతి |

ధ్రువక్షితిః ధ్రువయోనిః ధ్రువమసి ధృవతః స్థితమ్|
త్వం నక్షత్రాణాం మేథ్యసి స మా పాహి పృతన్యతః ||

సప్తఋషయం ప్రథమాం కృత్తికానామరుంధతీమ్ .......

(ఈ సుమంగళి అయిన వధువును సమీపంగా చూడుము. ఆమెకు సౌభాగ్యాన్ని ఇవ్వుము. ఆపైని ఆమెను మీ ఇంట స్వేచ్ఛగా నడయాడ నిమ్ము.   అటుపై వరుడు - వధువును తూర్పు, ఉత్తరదిశల వైపునకు తీసుకెళ్ళి, ఉత్తరదిక్కున ఉదయిస్తున్న నక్షత్రాలలో పురుషుడైన ధృవుని, అరుంధతిని చూపుతున్నాడు. చూపిస్తూ చెబుతున్నాడు

ఇదుగో అది ధృవ నివాసము, ధృవుని ఉత్పత్తి, ఇతరత్రా చుక్కలకు ధృవ నక్షత్రం ఏ లాగునో (అంటే, ఇతర నక్షత్రాలు ఆకాశంలో ధృవుని చుట్టూ ఏ లాగున తిరుగుతాయో ఆ విధంగా) నీవు మాకు ఆలాగున. అదెలా అంటే - ఆ ధృవుడు కానుగెద్దును త్రిప్పే గుంజలా మధ్యలో ఉండి ఇతర నక్షత్రాలను తిప్పుకొనును. నువ్వు కూడా మా ఇంట మాకు అన్నింటా ఆధారమై, మమ్ము అనుగ్రహింపుము.  మేథి - అంటే గుంజ. )

ఈ మంత్రాలు కృష్ణయజుర్వేదం-తైత్తిరీయ ఆరణ్యకంలోని ఏకాగ్నికాండ విభాగం లోనివి. ఈ భాగానికి హరదత్తుడనే ఆయన వ్యాఖ్యానం రచించాడు. నూతన వధువును ఇంటికి ఆహ్వానిస్తున్న ఆ శ్లోకాలను రచించిన మహర్షి ఎవరో కానీ గొప్ప ఔచిత్యాన్ని, Sense of humor ను ప్రదర్శించాడు. :) నిజాలనూ చెప్పాడు. :)   ఈ ఏకాగ్ని కాండ కీత్, విట్నీ వారు ప్రస్తావించిన గృహ్యసూత్రాలకంటే కూడా పాతది. అందులో ధ్రువనక్షత్ర ప్రస్తావన "ఉంది".  గమనార్హమైన విషయమేమంటే - ధ్రువుడు నిశ్చలంగా ఉండి, తన చుట్టూ నక్షత్రాలను గానుగెద్దుల్లా తిప్పుకుంటున్నాడు. అనగా ధ్రువుని నిశ్చలత్వం గురించి భారతీయులకు తెలుసు. మనకు బాగా తెలిసిన మరో కథ -

ధ్రువుని పురాణకథ


మన పురాణాల్లో (భారత,భాగవత, మత్స్య,విష్ణు పురాణాల్లో), మహాభారతంలో ధ్రువుని కథ ఉంది. ఉత్తానపాదుడనే రాజుకు సునీతి, సురుచి అనే ఇద్దరు భార్యలున్నారు. అందులో సురుచి అంటే రాజుకు ముద్దు. ఉత్తానపాదుడు ఓ నాడు సురుచి కుమారుణ్ణి తొడపై కూర్చోబెట్టుకున్నాడు. ఆ సమయంలో సునీతి కొడుకయిన ధ్రువుడు వచ్చి రాజు తొడపై కూర్చోబోయాడు. అప్పుడు సురుచి ఆ బాలుణ్ణి అహంకారంతో ఈసడిస్తూ అంది - "నువ్వు నాన్న తొడపై కూర్చోవాలంటే నా కడుపున పుట్టి ఉండాలి. సునీతి కడుపున ఎందుకు పుట్టేవు?" - ఈ మాటకు బాబు నొచ్చుకున్నాడు. అతనికి నారదుడు ధర్మోపదేశం చేయడంతో - ఇల్లు వదిలి విష్ణువు గురించి అనేక వత్సరాలు తపస్సు చేశాడు. విష్ణువు ప్రత్యక్షమై అతడికి "ఆకాశంలో అత్యున్నత స్థానంలో ఉంటావని, అతని చుట్టూ సప్తర్షులు 26000 వత్సరాలు తిరుగుతూ ఉంటారనీ" వరమిచ్చాడు.  ఇంకా మిగిలిన వివరాలు ఈ బ్లాగులో వ్రాశారు. చదువుకోవచ్చు.

బ్లాగులో వివరించినట్లు గానుగెద్దు (మేధి) ప్రస్తావనను ధ్రువునితో పోల్చటం ఆ ధ్రువుని కథలోనూ ఉంది.

ధ్రువుని నిశ్చలత్వమే కాదు చలనం (Precision of equinoxes) గురించీ భారతీయులకు బాగా తెలుసు అన్నదానికి పైని ధ్రువుని కథ ఆధారం. ఎందుకంటే అందులో ధ్రువపదం 26000 యేళ్ళు అన్న ప్రస్తావన ఉంది కాబట్టి. ఈ 26000 యేళ్ళు అన్నది ఏదో - యాదృచ్ఛికంగా వ్రాశారని కొట్టిపారెయ్యడానికి వీల్లేదు.

ధ్రువుని నిశ్చలత్వం కంటే ముందు అల్ఫా డ్రాకోనిస్ కు భరతదేశ రూపమైన శిశు (శింశు) మారుని గురించి కూడా భారతీయులకు తెలుసు అనడానికి ఋజువులున్నాయి. α డ్రాకోనిస్ అన్న పాశ్చాత్యపేరు గల శిశుమారుడే ఈ వ్యాసశీర్షికలోని రెండవ హీరో.

 శి(శిం)శుమారుడు


పాండవులు బ్రాహ్మణ వేషాలలో ఏకచక్రపురానికి చేరుకున్నారు. అక్కడ లక్క ఇంటి నుంచి తప్పించుకున్నారు. అటుపై వారికి ద్రౌపదీ స్వయంవర వృత్తాంతం తెలిసింది. పాంచాల రాజైన ద్రుపదుడు తన కుమార్తె కృష్ణ (ద్రౌపది) కు స్వయంవరం నిర్ణయించాడు. ’శిశుమార’పురం అనే ఒకానొక నగరంలో మత్స్యయంత్రాన్ని నిర్మించి దానిని భేదించిన వారికి తన కుమార్తెను ఇస్తానని ప్రకటించాడు.

ఆ స్వయంవరానికి తండోపతండాలుగా జనం చేరుకున్నారు.

ततः पौरजनाः सर्वे सागरॊद्धूत निःस्वनाः |
शिशुमार पुरं प्राप्य नयविशंस ते च पार्थिवाः (1.176.15)

తతః పౌరజనాః సర్వే సాగరూద్ధూత నిఃస్వనాః |
శిశుమార పురం ప్రాప్య నయవింశస తే చ పార్థివాః ||

ఆపై పురజనులందరున్నూ సముద్రం పొంగేట్టుగా ఊపిరి విడుస్తూ "శిశుమార"పురాన్ని చేరుకుని, అక్కడ రాజులను చూశారు. మహాభారతంలో తర్వాత జరిగిందేమిటో మనకు తెలుసు. అర్జునుడు "మత్స్యయంత్రా"న్ని భేదించి ద్రౌపదిని చేపట్టాడు. తదనంతరం ఆమె పాండవులకు భార్య అయింది. ఇక్కడ "శిశుమార" పురం అన్నదే మన ప్రస్తావన. ఈ పేరు ఎలా ఊడిపడింది ఇక్కడికీ?


శిశుమారః - అంటే మొసలి, లేదా జలచరం. "శిశుమారోద్ర శఙ్కవో మకరాదయః" - అని అమరం. జలచరం అన్న ప్రస్తావనలో భాగంగా మహాభారతంలో  మత్స్యయంత్రాన్ని చెప్పటం గమనార్హం. శిశుమారః అని విష్ణువును కీర్తించటం అక్కడక్కడా ఉంది. (శిశుపాలుణ్ణి వధించినకారణం శ్రీకృష్ణుని, తద్వారా విష్ణువును శిశుమారః అంటారని కొన్ని వ్యాఖ్యానాలు ఉన్నాయి. ఈ వ్యాఖ్యానం అంత సబబు కాదు.) ఆ శబ్దం వేదకాలంలో, అనూచానంగా పురాణాదులలో ప్రబలంగా వాడుకలో ఉండి, మహాభారతంలో ఉటంకించబడింది.

( భారతీయులు - ఉరామరికగా శిశుమారుణ్ణి పైని బొమ్మలో లాగా పురాణకాలంలో ఊహించినట్టు అనిపిస్తుంది. ఈ వ్యాసం చదువుతూ మధ్యలో ఈ బొమ్మను రెఫర్ చేయండి. ధ్రువుడు/శిశుమారుడు పైని నక్షత్రమని తెలుస్తూనే ఉంది. మధ్యలో లేత ఆకుపచ్చ రంగులో ఉన్నది శిశుమార నక్షత్రమండలం)

***********

అదే మహాభారతంలో భీష్మపర్వంలో విష్ణుసహస్రనామ సంకీర్తన ఉన్నది. అందులో 60 వ శ్లోకం ఇలా ఉంటుంది.

అనిర్విణ్ణ స్స్థవిష్టోऽభూర్ధర్మయూపో మహామఖః |
నక్షత్రనేమిర్నక్షత్రీ క్షమః క్షామః సమీహనః || 

విష్ణుసహస్రనామాలకు శంకరభగవత్పాదులు అద్వితీయమైన వ్యాఖ్య రచించారు. (దీనిని తెలుగులో వావిళ్ళ వారు ముద్రించారు. భగవత్పాదుల వ్యాఖ్యకు కొంతవరకూ తెనుగు సేత కూడా ఈ పుఅస్తకంలో లభ్యం.)

ఆ వ్యాఖ్యానంలో నక్షత్రనేమి - అన్న శబ్దానికి ఆదిశంకరుల వారి వ్యాఖ్యానం ఇలా ఉంది.

నక్షత్ర తారకైస్సార్థం చన్ద్రసూర్యాదయో గ్రహాః, వాయుపాశమయైర్బంధైః నిబద్ధా ధ్రువవ సంజ్ఞితే | స జ్యోతిషాం చక్రం భ్రామయన్ తారామయస్య శింశుమారస్య పుచ్ఛదేశే వ్యవస్థితో ధ్రువః | తస్య శింశుమారస్య హృదయే జ్యోతిశ్చక్రస్య నేమివత్ ప్రవర్తకః స్థితో విష్ణురితి నక్షత్రనేమిః | శింశుమార వర్ణనే ’విషుర్హృదయమ్’ ఇతి స్వాధ్యాయ బ్రాహ్మణే శ్రూయతే |

సూర్యచంద్రాది గ్రహములు నక్షత్రతారకలతోడ ధ్రువుండను స్థానంబున వాయుపాశములనెడు తాళ్ళతో కట్టబడియున్నవి. ఆ ధ్రువుడు జ్యోతిశ్చక్రమును త్రిప్పుచు నక్షత్రమయమయిన శింశుమారము యొక్క పుచ్ఛమునందున్నాడు. అట్టి శింశుమారకచక్రము నేమి (ఇరుసు) యనబడును. దాని హృదయమునందు నేమివలే ప్రవర్తకుడై విష్ణువున్నాడు. అందువలన నక్షత్రనేమి. శింశుమార వర్ణనమందు విష్ణువు యొక్క హృదయము అని వేదములను వల్లించు బ్రాహ్మణుల వలన ఎఱుంగినది.

ఇక్కడ శంకరాచార్యుల వారి వ్యాఖ్యానంలో "స్వాధ్యాయం చేయు బ్రాహ్మణుల ద్వారా విన్నది" అనటం గమనార్హం. అంటే ఈ శింశుమారుడు అప్పటికే వేదమంత్రాలలో ప్రస్తావింపబడియున్నాడన్నమాట. ఈ శింశుమారుడే α డ్రాకోనిస్.

(తెలుగులో ’నక్షత్రములు’ అన్న పుస్తకం వ్రాసిన గొబ్బూరి వెంకటానంద రాఘవరావు గారు - α డ్రాకోనిస్ ను ’ప్రాగ్జోతిషపురం’ అని ఊహించారు. ఇది పొరబాటు కావచ్చు. α డ్రాకోనిస్ అంటే శింశుమారుడని పరిశోధకులు నిర్ణయించారు)

***********

మహాభారతకాలానికి శిశుమారుని ప్రస్తావన ఇతిహాసంలోనికి, ప్రజా మధ్యమంలోనికి వచ్చి ఉంటే, అంతకు ముందు ఎంతో కాలం నుండి శిశుమారుని గురించి తత్పూర్వులకు తెలిసి ఉండాలి. తెలుసు కూడాను. పైన కృష్ణయజుర్వేదం -తైత్తిరీయ ఆరణ్యకం - ఏకాగ్ని కాండలో ధ్రువపద ప్రస్తావన మనం చూశాం. ఆ ఏకాగ్నికాండకంటే ప్రాచీనమైన రెండవ ప్రపాఠకంలో, పంతొమ్మిదవ అనువాకంలో శిశుమారుని ప్రస్తావన ఈ క్రింది విధంగా ఉంది.

2.19 अनुवाक १९
भूः प्रपद्ये भुवः प्रपद्ये स्वः प्रपद्ये भूर्भुवः स्वः प्रपद्ये ब्रह्म प्रपद्ये ब्रह्मकोशं प्रपद्येऽमृतं प्रपद्येऽमृतकोशं प्रपद्ये चतुर्जालं ब्रह्मक्रोशं यं मृत्युर्नावपश्यति तं प्रपद्ये देवान्प्रपद्ये देवपुरं प्रपद्ये परीवृतो वरीवृतो ब्रह्मणा वर्मणाऽहं तेजसा कश्यपस्य,-इति । यस्मै नमस्तच्छिरो धर्मो मूर्धानं ब्रह्मोत्तरा हनुर्यज्ञोऽधरा विष्णुर्हृदय संवत्सरः प्रजननमश्विनौ पूर्वपादावत्रिर्मध्यं मित्रावरुणावपरपादावग्निः पुच्छस्य प्रथमं काण्डं तत इन्द्रस्ततः प्रजापतिरभयं चतुर्थं-, इति । स वा एष दिव्यः शाक्वरः शिशुमारस्तः-इति । य एवं वेदाप पुनर्मृत्युं जयति जयति स्वर्गं लोकं नाध्वनि प्रमीयते नाग्नौ प्रमीयते नाप्सु प्रमीयते नानपत्यः प्रमीयते लघ्वान्नो भवति,-इति । ध्रुवस्त्वमसि ध्रुवस्य क्षितमसि त्वं भूतानामधिपतिरसि त्वं भूतानां श्रेष्ठोऽसि त्वां भूतान्युपपर्यावर्तन्ते नमस्ते नमः सर्वं ते नो नमः शिशुकुमाराय नमः (१), इति ।। इति कृष्णयजुर्वेदीयतैत्तिरीयारण्यके द्वितीयप्रपाठक एकोनविंशोऽनुवाकः ।। १९ ।।

"...
౧. ధర్మము శిరస్సు
౨. బ్రహ్మ పై దవడ
౩. యజ్ఞము క్రింది దవడ
౪. విష్ణువు హృదయము
౫. సంవత్సరము ప్రజననములు
౬,౭. అశ్వినీదేవతలిద్దరు రెండుపై పాదములు
౮. అత్రి నడుము
౯,౧౦. మిత్రావరుణులు అపరపాదములు
౧౧ అగ్ని - తోక ముందుభాగము
౧౨. ఇంద్రుడు - తర్వాతి భాగము
౧౩. ప్రజాపతి - ఆపై భాగము
౧౪. అభయము - నాలుగవ భాగము

ఇదే ఆకాశంలో దివ్యంగా ప్రకాశించే శిశుమారము. ఇది మృత్యువును జయించినది. ఇది అగ్నియందు, నీటియందు, ఇలా దేనియందూ నశింపనిది. అట్టి స్థిర పదమందు భూతములకు అధిపతిగా, భూతములలో శ్రేష్టునిగా ఉన్నావు. నీ దగ్గర ఉన్న వారు నీ చుట్టునూ తిరుగుచు నుందురు. అట్టి ’శిశుకుమారుని’కి వందనము."

ఇక్కడ వేదఋషి శిశుమారుణ్ణి ఖగోళవస్తువుగానూ, శిశుమారమండలంలోని పదునాలుగు నక్షత్రాలను, పుచ్ఛము (తోక) చివర "అభయము" అన్న పేరు మీద ఉన్న నక్షత్రాన్ని ప్రత్యేకంగా పేర్కొని, ఆ నక్షత్రం వద్ద ఉన్న పదాన్ని "ధ్రువ" పదంగా, అంటే స్థిరమైన పదంగా కీర్తించాడం గమనార్హం. వేదకాలపు మంత్రాలలో పరిసరజ్ఞానము, మతము, సంస్కృతి, సాంప్రదాయాలు, గణితము, జ్యోతిశ్శాస్త్రం, ఖగోళపరిశీలనలు ఇత్యాది అనేక విషయాలు అనేకం ఇబ్బడిముబ్బడిగా కలిసిపోయి ఉండటం కద్దు. అందుచేత యిది ప్రత్యేకంగా గమనిస్తే తప్ప ఖగోళవిషయ ప్రస్తావనగా కనిపించదు. వేదకాలానంతరం వచ్చిన పురాణవాఙ్మయంలో కూడా ఇదే విధంగా అనేక విషయాలు ఇబ్బడిముబ్బడిగా కలగలిసిపోయి ఉన్నాయి. పురాణాదులలో మన ప్రాచీనులు ఎన్నో విషయాలను కాలక్రమేణా చేరుస్తూ పోయారు. తద్వారా వేదకాలంనాటి శింశుమారపుచ్ఛంలో ఉన్న (అభయమ్ - Draconis/Thuban అనే) స్థిర ధ్రువపదము, తారలకూ, చంద్రసూర్యాదుల చలనానికి మూలమైనది అన్న ధ్రువపదము (UrsaMinor), దాని చలనం (Precision of equinoxes) అన్ని కలగలిసి పోయి ఉన్నాయి. ఆ పురాణాలలో అన్నిటికన్నా ప్రాచీనమైనది - బ్రహ్మాండపురాణం. ఇందులో ఆ పరిస్థితి కనిపిస్తుంది

బ్రహ్మాండపురాణంలో మొదటి ప్రపాఠకంలో శింశుమారుని తోక వద్ద ధ్రువపదం ఉందని, అది పరమపదమని పేర్కొంటాడు - ఆ వివరాలను చెప్పే సూతుడనే మహర్షి.

సూర్యాదీనాం స్యందనానాం ధ్రువాదేవ ప్రవర్తనమ్ |
కీర్త్యతే శిశుమారస్య యస్య పుచ్ఛే ధ్రువః స్థితః ||

సూర్యాది అంతరిక్ష గ్రహములకూ, వారి రథములకూ (వాటి చలనమునకూ) ధ్రువుని చుట్టూ తిరుగుట కలదు. ఆ ధ్రువుడు శిశుమారుని తోక వద్ద కలడని కీర్తింపబడుచున్నాడు.

బ్రహ్మాండపురాణంలోనే పూర్వభాగంలో 21వ అధ్యాయం పేరు - ఆదిత్యవ్యూహకీర్తనం. ఈ అధ్యాయంలో దిక్కులు, దిక్పాలకులు, ఉత్తరదిక్కు, అక్కడ ఉన్న మేరుపర్వతం (భూమి అక్షం), దాని కొసను సూచించే ధ్రువపదం, సూర్యుని గతులు, విషువత్తులు, ధ్రువుని చుట్టూ ఖగోళవస్తువుల చలనాలు, ఇత్యాదులన్నీ వివరంగా 176 శ్లోకాలలో అత్యద్భుతంగా వివరింపబడి ఉన్నాయి. మేరువు కొసనే ధ్రువునినివాసమని, ఆ ధ్రువుని చుట్టూ ఖగోళరాశులు చుట్టుతూ ఉంటాయని ఉంది.

బ్రహ్మాండపురాణం ఆరంభంలో స్థిరుడైన శింశుమారుని ప్రస్తావింపబడినాడు. ఆదిత్యవ్యూహకీర్తనంలో ధ్రువుని చుట్టూ ఇతర నక్షత్రరాశుల చలనాన్ని ప్రస్తావించాడు. ధ్రువపదమే విష్ణుపదమని, ఆ పదాన్ని నక్షత్రరూపులైన మహర్షులు చేరగలరని, తద్వారా ధ్రువుడు అనే నక్షత్రం మారుతూ ఉండగలదనీ కూడా సూచన ఉంది.

ఏతద్విష్ణుపదం దివ్యం తృతీయం వ్యోమ్ని భాస్వరమ్|
యత్ర గత్వా న శోచంతి తద్విష్ణోః పరమం పదమ్ ||
ధర్మధ్రువాద్యాః తిష్టంతి యత్ర తే లోకసాధకాః |  - 21.176

బ్రహ్మాండపురాణంలో 23 వ అధ్యాయం పేరు ధ్రువచర్యాకీర్తనం. ఈ అధ్యాయంలో 92 నుంచి 108 వరకూ ఉన్న శ్లోకాల్లో శింశుమారుని (ధ్రువుని) వర్ణన స్పష్టంగా ఉంది. అందులో భాగంగా శింశుమారుడు, అతని ఆకారం, అ Constellation లో ఉన్న నక్షత్రాలు సవివరంగా ఉన్నాయి. ఈ వర్ణన పైన యజుర్వేదం, తైత్తిరీయారణ్యకం లోని వివరణకు దగ్గరగా ఉంది. (102 నుంచి 105 వరకు)

అలాత చక్రవద్యాన్తి వాతచక్రేరితాని తు || 
యతో జ్యోతీంషి వహతి ప్రవహః తేన స స్మృతః || ౯౮
ఏవం ధ్రువనిబద్ధోऽసౌ సర్పన్తం జ్యోతిషాం గణాః || 
సైష తారామయో జ్ఙేయః శిశుమారో ధ్రువో దివి || ౯౯
యదహ్నా కురుతే పాపం దృష్ట్వా తన్నిశి సూచిత ||

అలాత చక్రము (Oil mill ?) ఎలా ఇతర చక్రాలను తిప్పుతుందో అలా ధ్రువుడు తన జ్యోతిః ప్రవాహంతో ఇతరులను తనచుట్టూ త్రిప్పుచున్నాడు. (ఈ శ్లోకం సరిగ్గా అర్థమవటం లేదు)
ఇలా తారాగణములను (Constellation) శిశుమారుడని, దానిని త్రిప్పువానిని ధ్రువుడని ఎఱుగుము. ఈ ధ్రువుని రాత్రి చూచిన - పగలు చేసిన పాపములు నశించును.  

ఔత్తానపాదస్తస్యాథ విజ్ఞేయో హ్యుత్తరో హనుః ||
యజ్ఞో పురస్తు విజ్ఞేయో ధర్మో మృద్ధానమాశ్రితః || ౧౦౨
హృది నారాయణ స్సాధ్యో హ్యశ్వినౌ పూర్వపాదయోః ||
వరుణశ్చర్యమా చైవ పశ్చిమో తస్య శక్థినీ ||౧౦౩
శిశ్నం సంవత్సరస్య మిత్రోऽపనం సమాశ్రితః ||
పుచ్ఛేऽగ్నిశ్చ మహేంద్రశ్చ మరీచః కశ్యపో ధ్రువః || ౧౦౪
తారకాః శిశుమారస్య నాస్తం యాతి చతుష్టయమ్ ||
అగ్నీంద్ర కౌయపానాం తొ చరమోऽసౌ ధ్రువః స్మృతః ||౧౦౫  
(నక్షత్రచంద్రసూర్యాశ్చ గ్రహాస్తారాగణైః సహ) || ౧౦౫
ఉన్ముఖాః విముఖాః భూత్వా వక్రీభూతాః శ్రితాం దివి ||
ధ్రువేణాధిష్టితాశ్చైవ ధ్రువమేవ ప్రదక్షిణమ్ || ౧౦౬
పరీయాంతీశ్వశ్రేష్ఠం మేఢీభూతం ధ్రువం దివి ||
అగ్నీంద్రకశ్యపానాం తు చరమోऽసౌ ధ్రువః స్మృతః || ౧౦౭
ఏక ఏవ భ్రమన్త్యేష మేరుపర్వతమూర్ధని ||
జ్యోతిషాం చక్రమేతద్ధి సదా కర్షన్నవాఙ్ముఖః ||
మేరుమలోకయత్యేష పర్యతే హి ప్రదక్షిణమ్ || ౧౦౮

(౧. ఔత్తానపాదుడు పై దవడ
౨. యజ్ఞము క్రింది దవడ
౩. ధర్మము శిరస్సు
౪. నారాయణుడు హృదయము
౫. సంవత్సరము గుహ్యము
౬,౭. అశ్వినీదేవతలిద్దరు రెండుపై పాదములు
౮. మిత్ర - అపానము
౯,౧౦. వరుణుడు అర్యముడు తొడలు
౧౧ అగ్ని
౧౨. మహేంద్ర
౧౩. మరీచ-కశ్యప
౧౪. ధ్రువుడు  -

ఈ చివరి నలుగురు తోకలు. ఈ నలుగురు రాత్రి అస్తమించరు. ఆ నలుగురిలో చివరి వాడు ధ్రువుడు. పై నక్షత్రములన్నీ రాత్రి వేళ ధ్రువుని చుట్టూ ఉన్ముఖంగా కొన్ని, విముఖంగా కొన్ని ప్రదక్షిణము చేయును. మేరు పర్వతము కొసన స్థిరంగా ఉండి, ఆ ధ్రువుడు నక్షత్రములను త్రిప్పుచుండును.

శిశుమార Constellation చివరన ఉన్న ధ్రువుని చూస్తే పాపములు నశిస్తాయని బ్రహ్మాండపురాణం సూచించటం కూడా ఇక్కడ విశేషం. సరిగ్గా ఈ భావన ఈజిప్షియనులకూ ఉండేది. అందుకే పిరమిడ్ లో అలా డ్రాకోనిస్ కంత గుండా కనబడేట్టు కట్టించుకున్నారు వారు.

ధ్రువపదం - స్థిరమైనదని, ధ్రువపదానికి పూర్వం అభయమ్ అనే నక్షత్రం ధ్రువస్థానంలో, శింశుమారపుచ్ఛంలో ఉందని యజుర్వేదకాలానికి తెలిసినట్టు చూశాం. తదనంతర కాలంలో ఆ ధ్రువపదం స్థిరం కాదని, అది కదులుతూ ఉందని విష్ణుపురాణంలో ధ్రువుని కథ వలన అర్థమవుతోంది. ఒక్క విష్ణుపురాణమే కాదు, మైత్రాయణ్యుపనిషత్/మైత్ర్యుపనిషత్ అనే ఉపనిషత్తు ఆరంభంలోనే ధ్రువుని చలనం గురించిన ప్రస్తావన వస్తుంది. బృహద్రథుడనే రాజు వానప్రస్థాశ్రమంలో తన పెద్ద కుమారుని రాజును చేసి అడవులకు చేరుకుని వైరాగ్యంతో శాంక్యాయనుడనే మహర్షిని ఆశ్రయించి ప్రశ్నించాడు. "మహాత్మా! అస్థిచర్మమజ్జమాంసశుక్రశోణితశ్లేష్మ..దుర్గంధభరితమైన శరీరం జీవులకు ఎందుకు? .....అరిషడ్వర్గాలెందుకు? కామోపభోగాలెందుకు? ......మహారణ్యాలు బీళ్ళు మారటమేల? సముద్రాలలో కొండలు విరిగి ఎందుకు పడుతున్నవి? "ధ్రువుని స్థానం ఎందుకు మారుతూ ఉంది?....." ఈ అన్నిటి వెనుక గల రహస్యమేమిటి?"

ధ్రువుని స్థానం చలిస్తూ ఉంది అని ఓ పరిశీలన వైరాగ్యసంబంధమైన పురాణంలో కనిపించటం ఇక్కడ గమనార్హం. అంటే పురాణకాలానికి ఈ చలనం - సామాన్యంగా తెలిసిపోయిన విషయం కావాలి.

********

ముగింపుకు ముందు క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్పుకోవాలి.

1.
ధ్రువుడు అంటే α-Draconis/Thuban. అతడు శి(శిం)శుమారుడు నిశ్చలుడు (3000 BC)
ధ్రువుడు చలిస్తున్నాడు (Precision of Equinoxes, BC 300),
ధ్రువుడు అంటే α-Ursa Minor aka Polaris (AD). ఇతడు సప్తర్షి మండలానికి సమరేఖలో ఉన్నాడు.

పై మూడు విషయాలు భారతవాఙ్మయంలో విశదంగా ఉన్నాయి.

2. ధ్రువపదం మీద పరిశోధనలు చేసిన RN Iyengar అనే బెంగళూరు ప్రొఫెసర్ గారు ఓ మాటంటారు. "ఈ నాడు ఆధునికులమని భావించే మనకు ఖగోళంపై ఎంత పరిజ్ఞానం ఉందో ప్రాచీనులకూ అంతే ఉంది. వారి తీర్మాలు తప్పయి ఉండవచ్చునేమో కానీ, వారి పరిశీలనా సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేయటానికి వీల్లేదు."

3. ఆర్యుల వలస సిద్ధాంతమనో మరొకటనో కారణంతో క్రీ.పూ. 1500 కు ఈవలే వేదవాఙ్మయం, పురాణాలు, ఉపనిషత్తులు తదితర విజ్ఞాన సర్వస్వం అంతా మొదలయ్యిందని ఊహలతో పాశ్చాత్యుల తీర్మానం ఒకప్పుడు జరిగింది. దీన్ని మనం గుడ్డిగా నమ్మడానికి వీల్లేదు.

ఈ ధ్రువపదం గురించి, ఖగోళశాస్త్ర విషయాల గురించి RN Iyengar గారు ప్రసంగించిన వీడియోలు యూట్యూబ్ లో ఉన్నాయి. ఔత్సాహికులు వెతికి చూడవచ్చు.  ఈ వ్యాసం నాకోసం వ్రాసుకున్నది. ఇది కేవలం Tip of iceberg మాత్రమే.  

కామెంట్‌లు

  1. చక్కటి విషయాలను గుదిగుచ్చి అందించారు... కృతజ్ఞతలు...

    రిప్లయితొలగించండి
  2. చదివిన మేరకి బాగుంది. పెద్దది కావడం వల్ల అంత ఒక్క సరి చదవలేకపోయాను. మల్ల వస్తాను.

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Comments ridiculing, abusing, bullying and forcing to agree in any form, if objectionable to the blog owner will be removed.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వాఙ్మయచరిత్రలో కొన్ని వ్యాసఘట్టాలు - శ్రీ ఏల్చూరి మురళీధరరావు గారు.

అశోకుడెవరు? - 1

ముకుందవిలాసః - కుంటిమద్ది శేషశర్మ.