15, మే 2019, బుధవారం

టిబెటన్ స్థూపం.



బౌద్ధంలో హీనయాన మహాయానాల తరువాత వచ్చిన మతసిద్ధాంతం వజ్రయానం. వజ్రయానంలో బుద్ధుణ్ణి ఒక చారిత్రక వ్యక్తిగా కాక, ఒక అలౌకిక శక్తిగా భావించటం ఉంటుంది. దరిమిలా బుద్ధుని చుట్టూ అనేక బోధిసత్వ అవతారాలు, ఆ అవతారాలకు కొన్ని చిహ్నాలు, ఆ చిహ్నాల చుట్టూ అల్లుకున్న మార్మికత, మండలాలు అనబడే చిత్రాలు, ఆ చిత్రాలకనుగుణంగా ధ్యానపద్ధతులు - ఇలా విలక్షణంగా అల్లుకున్న ప్రత్యేకమైన, ధార్మిక విశ్వాసయుతమైన మతం వజ్రయానం. ఈ విశ్వాసాలకు అనుగుణంగా అవలోకితేశ్వర, మైత్రేయ, వైరోచన, అమితాభ, మహాకాల, అమోఘసిద్ధి, పద్మసంభవ, మంజుశ్రీ ఇత్యాది అద్భుతమైన మూర్తులు, చిక్కని రంగులతో దట్టంగా చిత్రించిన బుద్ధుని అవతారాల బొమ్మలు, ఇంకొన్ని చిహ్నాలు వజ్రయానం లో చోటుచేసుకొని ఇది శాఖోపశాఖలుగా ఎదిగింది.

వజ్రయాన మార్మిక బౌద్ధ మూర్తులలో హిందూ దేవతల, దేవుళ్ళు కూడానూ హెచ్చుగానే కనిపిస్తారు. అలాగే బౌద్ధం లో గల కొందరు చారిత్రకవ్యక్తులను బోధిసత్వుని అవతారాలుగా చిత్రించటం ఉంది. ఉదాహరణకు పద్మసంభవుడు ఒక చారిత్రక వ్యక్తి. ఆయన బోధిసత్వుడి అవతారం. లామా కూడా బోధిసత్వుడి అవతారమే. టిబెటన్ బౌద్ధపు ఛాయలు ఇవి.

ఈ టిబెటన్ బౌద్ధంలో ఓ చిహ్నం గురించి ఈ వ్యాసంలో తెలుసుకుందాం.

అథాతో స్థూపజిజ్ఞాసా.

లడఖ్ ముఖ్యపట్టణమైన లేహ్ లో అడుగుపెట్టగానె అడుగడుగునా కొన్ని కట్టడాలు కనిపిస్తాయి. బౌద్ధ దేవాలయాల ముందు, కూడళ్ళలో, పేలస్ ల ముందు, బౌద్ధారామాలలో ఇలా ప్రత్యేకస్థలాల్లో మాత్రమే కాక, కొత్తగా కట్టే ఇంటి కాంపొండ్ ల చుట్టూ కూడా స్థూపాలు కానవస్తాయి. ఈ టిబెటన్ స్థూపం పేరు చోర్టెన్. མཆོད་རྟེན་དཀར་པོ. సాధారణంగా భారతదేశంలో బుద్ధుని శరీర ధాతువులనునిక్షిప్తం చేయడానికి ఉపకరించిన ప్రాచీన కట్టడాలను స్థూపాలు అన్నాం. సాంచి, సారనాథ్ వంటివి సుప్రసిద్ధాలు. ఇటువంటి స్థూపాలు మన అమరావతి, ధూళికట్ట వంటి ప్రదేశాల్లో కూడా ఉండేవి.

అయితే టిబెటన్ స్థూపం అన్నది, ధాతువులకోసం కాదు. ఇది ఓ ధ్యాన చిహ్నం. ఈ చిహ్నం ఐదుగురు ధ్యానబుద్ధులకు సంకేతం.

1. అమితాభుడు (అపరిమిత ప్రకాశం గలవాడు.)


2. అక్షోభ్యుడు (Immovable)


3. వైరోచనుడు (Epitome of Emptyness)



4. అమోఘసిద్ధి (Embodyment of all sidhi's)



5. రత్నసంభవుడు.



(ఈ పేర్లు వరుస మారటం ఉంది).

ఈ ఐదుగురు ధ్యానబుద్ధులు స్థూపంలో ఒక్కొక్కభాగానికి సంకేతం.

ఈ క్రింది బొమ్మ చూడండి.




*******

అంతే కాదు ఈ చోర్టెన్ లు ఎనిమిది రకాలు. థిక్సే బౌద్ధారామం లోనూ, షేయ్ అన్న ఒక రాజసౌధం వద్దా కనిపించే ఈ స్థూపాల వరుస చూడండి.



పక్కపక్కన ఉన్న ఇవన్నీ ఒకేలా కనిపించినా జాగ్రత్తగా చూస్తే, మెట్లవరుసలోనూ, గుండ్రటి ఆకారపు ముఖంలోనూ కొన్ని తేడాలు కనీస్తాయి. ఈ ఎనిమిది Chortens  శాక్యముని బుద్ధుని జీవితంలో ఎనిమిది ఘట్టాలకు ప్రతీక. జననం, జ్ఞానోదయం, ధర్మచక్రప్రవర్తనం, సిద్ధి, తుషితస్వర్గావగమనం, సంఘప్రవర్తనం, అభయప్రదానం, మహాపరినిర్వాణం. ఈ ఘట్టాలకు తగినట్లు ఆ స్థూపాల ఆకారంలో మార్పు ఉంటుంది.

ఇదీ టిబెటన్ స్థూపం గురించిన స్థూల వివరణ. లడఖ్ లో అడుగడుగున పల్లెల్లో, మైదానాల్లో నదీనదాల ఒడ్డున కనిపించే ఈ చోర్టెన్ ల వెనుక టిబెటన్ బౌద్ధుల విశ్వాసం, ఆ విశ్వాసం అలవోకగా అల్లుకున్న ఈ చిహ్నం చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది.