మయూఖము - 1


సంస్కృత సాహిత్యంలో ’నాటకం’ అన్న ప్రక్రియను తన ఎడమచేత్తో ఆడించిన కవి భాసకవి. నాటకకళలో ఆయనకు సాటి రాగల ప్రతిభావంతులు నిస్సందేహంగా మరెవ్వరూ లేరని నా భావన. ఆయన తర్వాత శూద్రక కవి. ఈ శూద్రకుడు కూడా తన మృచ్ఛకటిక నాటకానికి మూలంగా భాసుని చారుదత్తాన్ని ఎంచుకోవడం గమనార్హం.

దశరూపకాలలో పలు ప్రక్రియల్లో ఈ భాసకవి తన రచనలను చేశాడు. ఇతివృత్తాన్ని ఎంచుకోవడంలోనూ, దాన్ని "దృశ్య" బద్ధంగా మలచటంలోనూ, పతాకాస్థానకాలను (Dramatic Ironies) అక్కడక్కడా అందంగా పొదగటంలోనూ, ధ్వని మార్గంలో విషయాలను చెప్పటంలోనూ, ఔచిత్యం లోనూ, అన్నిటికన్నా ముఖ్యంగా - అతి సామాన్యులకోసం నాటకప్రక్రియను నిర్వహించటంలోనూ ఈయనది అసమానమైన ప్రతిభ.

మహాభారతంలోని విరాటపర్వం ఆధారంగా భాసుడు రచించిన ఓ రూపకం పంచరాత్రమ్.

పన్నెండేళ్ళ అరణ్యవాసం, ఓ యేడు అజ్ఞాతవాసం పూర్తవుతున్న తరుణం. పాండవులు విరాటరాజు కొలువులో మారువేషాల్లో ఉన్నారు. ఇటు దుర్యోధనుడు ఓ యజ్ఞం తలపెట్టి అందులో భాగంగా బ్రాహ్మలకు దానాలు చేస్తుంటాడు. ఆ బ్రాహ్మలలో ఒకడై ద్రోణుడు రారాజును పాండవులకు వారి అర్ధరాజ్యం ఇచ్చివెయ్యవలసిందని వరం యాచిస్తాడు.  రారాజు శకునితో యోజించి, ఓ షరతు పెడతాడు. ఐదు రాత్రులలో పాండవుల ఉనికి కనుగొంటే, పాండవుల అర్ధ రాజ్యం వారి పరమౌతుంది.

ఇది విని ద్రోణుడు హతాశుడవుతాడు. దాదాపు పదమూడేళ్ళు తెలియని పాండవుల ఉనికి ఇప్పుడెలా తెలుస్తుంది?

అంతలో అక్కడకు మత్స్యదేశం నుండి దూత వచ్చి ఓ వింత చెబుతాడు. ఆ దేశంలో కీచకుణ్ణి, ఆతని నూరు సోదరులను ఎవరో ఆయుధం లేకుండానే వధించారట. అది తప్పక భీముడేనని భీష్ముడంటాడు. ఆ దేశంలో దాగిన పాండవులను బయటకు తెప్పించడానికి విరాటనగరంపై ముట్టడి చేసి ఉత్తరగోగ్రహణం చేస్తారు. యుద్ధానికి వెళ్ళిన ఈ కౌరవ సైన్యంలో అభిమన్యుడు కూడా ఓ యోధుడు.

వీరిని ఉత్తరకుమారుడు, బృహన్నల ఎదుర్కొని, ఆలమందలను మళ్ళిస్తారు. యుద్ధం ముగిసి, కౌరవులు వెనక్కి మరలుతారు. కానీ ఒక్క అభిమన్యుడు మాత్రం వీరోచితంగా పోరాడుతుంటాడు. ఆతణ్ణి వదిలి కౌరవులు వెనక్కి మళ్ళారు.

ఆ తర్వాత - అభిమన్యుణ్ణి "ఎవరో" బందీగా పట్టుకుంటారు. ఆ యోధుణ్ణి బందీగా పట్టుకొన్నది ఎవరు? ఎవరతను?

అభిమన్యుని రథం పరిగెడుతుండగా, ఆ రథం కన్నా వేగంగా ముందుకు పరిగెత్తి, గుర్రాలను నిలువరించి ఆపి, ఆపైన రథంలో అభిమన్యుని పట్టుకొన్న ధీరుడెవ్వడు?

అలా పట్టుకోగలిగింది భీముడేనని - భీష్ముడు చెబుతాడు. ఎందుకంటే అదివరకు ద్రౌపదిని ఎక్కించుకుని జయద్రథుడు రథంలో పారిపోతుంటే, భీముడే నిలువరించినాడు!

భీముని ఈ సమర్థతను ద్రోణుడు కూడా ఒప్పుకుంటాడు. దానికి దృష్టాంతంగా ఓ ఉదంతం చెప్పాడు.

ఆ భీముడు బాలకుడుగా ఉన్నప్పుడు - ఓ ఉదంతం జరిగింది. ద్రోణుడు వాడికి బాణాలెయ్యటం నేర్పుతున్నాడు. ఓ బాణాన్ని చెవివరకూ లాగి, భీముడు వదలబోతున్నాడు. అలా వదిలేప్పుడు భీముని తల కాస్త కదిలింది. అలా కదలరాదని ద్రోణుడు - చెప్పి ముగించేంతలో - ఓ చిత్రం జరిగింది.

కర్ణాయతే తేన శరే విముక్తే వికంపితం తస్య శిరో మయోక్తమ్ |
గత్వా తదా తేన చ బాణతుల్యమప్రాపలక్ష్యః స శరో గృహీతః ||

ద్రోణుడు చెప్పేంతలో భీముడు ముందుకు పరిగెత్తాడు. తీవ్రమైన వేగంతో పరిగెత్తి ఆ శరం తన లక్ష్యాన్ని చేరుకోకముందే దానిని పట్టేసుకున్నాడు!

**********

ఇక్కడ ఆగి కాస్త చర్చించుకుందాం. "ఓ బాణాన్ని ఆకర్ణాంతం లాగి వేగంగా వదిలి, ఆ శరం తన లక్ష్యాన్ని చేరుకోక ముందే ఈ వదిలిన వాడే దానిని పట్టుకొన్నాడు". - ఇటువంటి ఉత్ప్రేక్షలు కావ్యాలలో అక్కడక్కడా కనిపించడం లో వింతేమీ లేదు. కావ్యజ్ఞులకు ఈ శ్లోకంలో చక్కని విశేషాలు కనిపిస్తాయి.

- భీముడు వాయుపుత్రుడని ఆ శ్లోకం ద్వారా ధ్వని. అందుకని వాయువేగంతో వెళ్ళగలడు.

- భీముడు బాణప్రయోగం చేసేప్పుడు ఒకింత పొరబాటు చేశాడు. దరిమిలా ఈతడికి అస్త్రవిద్యలో "రుచి" లేదని ఓ తాత్పర్యం.

- ఇక ఈ శ్లోకం - ఓ శబ్ద చిత్రం అని ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు.

*

సరే, ఇవన్నీ కావ్యజ్ఞులకు తెలుస్తాయి. కానీ నాటకం అంటే ఏంటి? అది "దుఃఖార్తులకు, శ్రమార్తులకు, తాపార్తులకు" కదా ఉద్దేశించబడింది? అంటే నేలటికెట్ ప్రేక్షకుడికి కదా నాటకం చెందవలసింది? వాడికి (ఇంకా ఈ వ్యాసకర్త వంటి దుర్మార్గులకు) ఈ శ్లోకంలో అసంబద్ధత కనిపించదూ?

సరిగ్గా అక్కడే భాసుడు ఓ రెండాకులు ఎక్కువ చదివాడు.

**********

ద్రోణుడలా అనగానే దానికి శకుని ఇలా బదులిచ్చాడు.

శకునిః : అహో, హాస్యమభిధానమ్ |

నాస్త్యన్యో బలవల్లోకే సర్వమిష్టేషు కథ్యతే |
జగత్ వ్యాప్తాన్ భవన్తః కిం సర్వే పశ్యంతి పాండవాన్ ||

"ద్రోణుడుగారు; అబ్బో, బానే జోకులేస్తున్నారే!

ఈ లోకంలో ఇక అంతకంటే బలవంతుల్లేరన్నట్టు! మీకు ఇష్టమైన వాళ్ళు కాబట్టి వారికి మీరు గొప్పతనాలు ఆపాదిస్తున్నారు. పాండవులే జగత్తునంతా వ్యాపించినట్టు మీరు చూస్తున్నారా ఏమిటి?"

**********

పైన, శకుని ఆక్షేపణ - అన్న ఒక్క దెబ్బతో భాసకవి సాధారణ ప్రేక్షకుల స్థాయికి దృశ్యకావ్యాన్ని తీసుకు వస్తాడు. ఓ సామాజికుడు - ఓ కావ్యంలో ఎదురైన ఉత్ప్రేక్ష/అతిశయోక్తిని ఎలా గుర్తిస్తాడు? గుర్తించిన అతడికి ఏ ప్రశ్న తడుతుందో - దానిని (దృశ్య) కావ్యకర్తయే వేసుకుని (శకుని) పాత్ర చేత ఆక్షేపణ పూర్వకంగా చెప్పించాడన్న మాట!

సామాజికుడికి వచ్చే సందేహాన్ని కావ్యకర్తే ఊహించి, ఆ సందేహానికి తన కావ్యంలో పాత్ర ద్వారానే సమాధానం చెప్పించటం - ఈ పని మరే కవి అయినా చేశాడా? (శూద్రకుడిని విచారించాలి ఓ మారు)

అలాంటిది చెయ్యాలంటే కవి, తనకంటే కూడా పాఠకుడికి ప్రాధాన్యత ఇవ్వాలి. చూడాలే కానీ కావ్యం యొక్క పరమావధి కనిపిస్తుంది ఈ దృక్పథంలో. అందుకే భాసుడు భాసమానుడు.

*

శకుని చేసిన ఈ వాదం - ఇదివరకటి భీముని పరాక్రమాన్ని "డైల్యూట్" చేస్తూంది. కానీ దీనిని అలానే ఉంచనివ్వకుండా శకుని కి భీష్ముని ద్వారా సమాధానం చెప్పిస్తాడు కవి. అలా ఆ వాగ్వాదం కొనసాగుతుంది. సామాజికుడు తిరిగి తన రసాస్వాదనలో తాను మునిగిపోతాడు.

**********

ఓ చిన్న ఘట్టంలో కేవలం రెండు శ్లోకాల వ్యవధిలో భాసుడు చూపెట్టిన భాసమానమైన  నేర్పు ఇది.  

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Comments ridiculing, abusing, bullying and forcing to agree in any form, if objectionable to the blog owner will be removed.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వాఙ్మయచరిత్రలో కొన్ని వ్యాసఘట్టాలు - శ్రీ ఏల్చూరి మురళీధరరావు గారు.

అశోకుడెవరు? - 1

ముకుందవిలాసః - కుంటిమద్ది శేషశర్మ.