రాజశేఖరుని కర్పూరమంజరి



ఈ వ్యాసాన్ని ఎక్కడ మొదలు పెట్టాలి? తెనుగు కవితో మొదలుపెడతాను.

"అటజని కాంచె భూమిసురుడంబరచుంబి..."
"ఎందేడెందము కందళించు రహిచే.."
"ఓ చతురాస్యవంశ కలశోదధి పూర్ణశశాంక!"
"తరుణి ననన్యకాంత నతిదారుణ.."

...

రాయలవారు అల్లసాని పెద్దనకు కర్పూర తాంబూలం అందించి, "శిరీషకుసుమపేశలసుధామయోక్తుల" తో కావ్యం రచించమన్నారు. శిరీషకుసుమపేశల సుధామయ ఉక్తులు = దిరిసెన పువ్వు (కాగితపు పువ్వు) లా సుకుమారమై ఉండి, అమృతాలు చిందే వచనములు; అల్లసాని పెద్దన కవిత్వం అలా ఉంటుంది!

సంస్కృతప్రాకృతాలలో అల్లసాని పెద్దన కు సమాంతరంగా - మధురమైన సుకుమారమైన వాక్కులను కలిగిన "కావ్యకవి" ఎవరున్నారు?

ఆ ప్రశ్నకు సమాధానం రాజశేఖరకవి. జయదేవుడు, దండీ కూడా పదలాలిత్యంలోనూ, శబ్దసౌకుమార్యంలోనూ తీసిపోరు కానీ వారిద్దరిలో దండి - వచన కావ్యకవి, జయదేవుడు - గీతకారుడు, స్తోత్రకవి.


రాజశేఖరుని శైలి లలితమనోహరమైనది. ఈ కవి సూక్తులు అమృతాలను చిందుతాయని కృష్ణశంకరశర్మ అన్న ఒక కవి నిండుసభలో కీర్తించాడట.

పాతుం శ్రోతరసాయనం రచయితుం వాచః సతాం సమ్మతాః
వ్యుత్పత్తిం పరమామవాప్తుమవధిం లబ్ధుం రసశ్రోతసః |
భోక్తుం స్వాదుఫలం చ జీవితతరోర్యద్యస్తి తే కౌతుకం
తత్ "భ్రాతః శృణు రాజశేఖరకవేః సూక్తీః సుధాస్యన్దినీః" ||


శ్రోతరసాయనమును గ్రోలుటకును, సత్పురుషులు మెచ్చిన వాక్కులు రచించుటకును, గొప్ప వ్యుత్పత్తిని సంపాదించుకొనుటకును, రసప్రవాహపరమావధికిని, జీవితమను తరువు యొక్క మధురఫలమును అనుభవించుటకు ఇచ్ఛ ఉన్నదా? "ఓ సోదరా! విను., రాజశేఖరకవి సూక్తులు అమృతములు చిందునట్టివి."

అల్లసాని వారివి సుధామయోక్తులు అయితే రాజశేఖరునివి సుధాస్యందినీ సూక్తులు. ఈ వ్యాసలక్ష్యం ఈ ఇద్దరు కవులను అనుశీలించటం కాకపోయినా, ఒకట్రెండు ఉదాహరణలు చూద్దాం. ఆపై మన కావ్యానికి వస్తాను.

మనుచరిత్రలో కావ్యనాయిక వరూధిని "అడ్రసు" తెలిపే పద్యం ఇది.

కం.
మృగమదసౌరభవిభవ
ద్విగుణిత ఘనసార సాంద్ర వీటీగంధ
స్థగితేతర పరిమళమై
మగువ పొలుపుఁ దెలుపు నొక్క మారుతమొలసెన్.

ఒక పాలు కస్తూరి, దానికి రెండుపాళ్ళు కర్పూరము దట్టించిన తాంబూలపు పరిమళాన్ని కప్పివేస్తూ - అమ్మాయి "అడ్రసు" ఇదీ అని చెప్పే పరిమళం ఒకటి వీచిందట!

అల్లసాని పెద్దనకు దాదాపు 600 యేళ్లకు మునుపటి కాలానికి చెందిన రాజశేఖరకవి యొక్క "వాసంత సమీరాలను" చూద్దాం. కర్పూరమంజరి లో రాణి విభ్రమలేఖ చెప్పిన శ్లోకం ఇది.

లంకాతోరణ మాలిఆ తరలిణీ కుంభుబ్భవస్సాస్సమే
మందందోలిఅ చందణ ద్దుమలదా కప్పూరసంపక్కిణో |
కంకోలీకులకంపిణీ ఫణిలదా ణిప్పట్టణట్టాబఆ
చండం చుంబిద తంబబణ్ణిసలిలా వాఅంతి చిత్తాణిలా ||

ఛాయ:
లంకాతోరణమాలికాతరళినః కుంభోద్భవస్యాశ్రమే
మందాందోళిత చందన ద్రుమలతా కర్పూరసంపర్కిణః |
కంకోలీ కులకంపినః ఫణిలతానిష్పష్టనర్తకాః
చండం చుంబిత తామ్రపర్ణీ సలిలాః వాన్తి చైత్రానిలాః ||

తామ్రపర్ణి నదిపైనుండి అల్లనల్లన వీస్తున్న చైత్రమాసపు పిల్లగాలులు - లంకానగరసింహద్వారపు తోరణాలను కదిలిస్తున్నాయి. అగస్త్యముని ఆశ్రమాన (దక్షిణ దిశాభాగమున) కర్పూరపు తరువులను తాకుతూ, చందన వృక్షాల గాలులపై మెల్లగా పల్లకీలో ఊరేగింపుగా వస్తున్నాయి. మిరియపు తీవెలను, తమలపాకుల తీవెలను బాగా నర్తింపజేస్తున్నాయి.

పెద్దన గారి వరూధిని మైసుగంధానికి, రాజశేఖరుని చైత్రానిలాలకు ఎక్కడో, ఏదో బాదరాయణసంబంధం ఉందని తోచట్లేదూ? :)

పైని శ్లోకంలో ఈ పాదం చూడండి.
"మంద + ఆందోళిత చందనద్రుమలతా కర్పూరసంపర్కిణః"
మంద = మెల్లగా:
ఆందోళిత = పల్లకీలో ఊరేగింపబడిన;
చందనద్రుమలతా = చందనద్రుమపు తీవెలకు;
కర్పూర = కర్పూరము యొక్క;
సంపర్కిణః = స్పర్శ కలిగినవైన
చైత్రానిలాః = వాసంతసమీరములు
అని అన్వయం.

ఎంత మధురంగా ఉందీ భావం? ఆ శబ్దసంచయం కూడా చూడండి. "మందందోలిఅ చందణ ద్దుమలదా కప్పూరసంపక్కిణో" (మందాందోళిత చందన ద్రుమలతా కర్పూరసంపర్కిణః) - ఒక్క మహాప్రాణాక్షరము, పరుషమైన శబ్దమూ లేకుండా, నిజంగానే ఏదో పల్లకీలో చందనపు గాలి అల్లనల్లన తేలుతూ వస్తున్నట్టుగా, శబ్దసంచయం భావాన్ని పల్లకీలో ఊరేగిస్తున్నట్టుగా అపురూపంగా లేదూ? ఏ కవి శబ్దాలయితే భావాన్ని ఉత్కృష్టంగా ప్రకాశింపజేస్తాయో ఆ కవిని "వశ్యవాక్కు" అని, పండితుడని నిస్సంకోచంగా చెప్పుకోవచ్చు.

ఇంకొక ప్రస్తావన. మంద - సాధారణంగా పూర్ణానుస్వరం తర్వాత వచ్చిన సరళాక్షరాలు ( గ జ డ ద బ) పద్యపు సౌకుమార్యాన్ని పెంపు చేస్తాయి. ఇది కవిత్వనిర్మాణంలో ఓ చిన్ని కిటుకు. దీనికి తెలుగు, సంస్కృత కావ్యాలలో ఎన్నో ప్రముఖమైన ఉదాహరణలు ఉన్నాయి.

అందుండున్ ద్వయసద్మపద్మవదనుండు - రాయలు
ఎందుండి ఎందుఁ బోవుచు ఇందలికేతెంచినారలు - పెద్దన
చిందుల పాటల సిరిపొలయాటల అందపు సిరిగుల ఆడెనదే - అన్నమయ్య
వందారు బృందారక మందార - మురారి కవి
మందారమాలాసలిలస్యందంబులందంబులై దొరగన్ - పోతన


ఈ క్రమంలో "మందాందోలిఅ..." పద్యపాదం వినగానే ఈ వ్యాసకర్తకు "ఎందే డెందము కందళించు రహిచే.." అన్న పెద్దన పద్యం గుర్తొచ్చింది. (బాదరాయణ సంబంధం - ii :) అన్నమాట!)

రాజశేఖరకవి మరొక శ్లోకం.

రణంతమణిణేఉరం ఝణఝణంతహారచ్ఛడం
కలక్వణిద కింకిణీ ముహర మేహలాడంబరమ్ |
విలోలబల అవరీజణిర మంజుశింజారవం
ణ కస్స మణమోహణం ససిముహీఅ హిందోళణమ్ ||

ఛాయ:
రణన్మణినూపుర ఝణఝణాయమాన హారచ్ఛటమ్
కలక్వణిత కింకిణీ ముఖర మేఖలాడంబరమ్ |
విలోలవలయావళీ జనిత మంజుశింజారవం
న కస్య మనోమోహనం శశిముఖ్యా హిందోళనమ్ ||


కర్పూరమంజరి ఉయ్యాల ఊగుతోంది. ఆ వన్నెలాడి కాలియందెలు, ధరించిన హారాలు ఝణఝణ సవ్వడి చేస్తున్నాయి. ఇంకా ఆమె వడ్డాణానికి కట్టిన చిన్ని చిన్ని సువర్ణఘంటికలు, కంకణపు మంజు రవాలు మధురంగా ఉన్నాయి. చంద్రముఖి అయిన ఆ చిన్నదాని ఉయ్యాల ఆట ఎవరి మనస్సును దోచుకోదు?

"గీతిసౌందర్యం, అనుప్రాస సౌందర్యం ఒక్కచోట కలవడం చూడాలంటే - ఈ సట్టకంలోనే చూడవచ్చు" నని పుల్లెల రామచంద్రుడు గారు వ్యాఖ్యానిస్తారు పై శ్లోకాన్ని ఉటంకిస్తూ ఒకచోట. ఈ శ్లోకమూ ఆ దృశ్యాన్ని, పద్యభావాన్ని ఉద్యోతిస్తోంది. "విలోలవలయావళీ జనిత మంజుశింజారవమ్" - ఎంత సుకుమారంగా ఉందో గమనించండి.

చలించి, మధురనాదాలు చేసే నూపురపు శబ్దాలకు హంసలు విభ్రమం చెందుతాయని సంస్కృతంలో ఓ కవిసమయం ఉంది. ఈ కవి ఆ కవిసమయాన్ని ఈ శ్లోకంలో ఉపయోగించలేదు. కారణం - ఇది దృశ్యకావ్యం కాబట్టి. ఓ అమ్మాయి ఉయ్యాల ఊగుతుండగా, ఆమె ప్రియుడు దానిని చూచి వర్ణించడం - చాలా మనోహరమైన, సుకుమారమైన శృంగారం.

సరిగ్గా ఇటువంటిది కాకపోయినా, స్వారోచిషమనుసంభవంలో ఓ చోట ఓ అమ్మణి తన అందెలపై విసుక్కోవటం ఉంది. (అంచెలు కట్టి కాలితొడుసై చననీవు గదమ్మ....) అక్కడ అమ్మణి - ఓ అందగాణ్ణి చూడాలన్న తలపుతో అందెలు అడ్డుపడుతున్నాయని విసుక్కుంటుంది. (అది కొంచెం మాఘకవి టేస్టు. :) )

రాజశేఖరుడు కవి, కవిరాజు, పండితుడు., అంతకన్నా ముందువరసలో గొప్ప రసికుడు. మన పెద్దన ’యూత్’ లో రాజశేఖరకవిలా ఉండేవాడేమో! .

ఈ రాజశేఖరుడు బాలరామాయణం, బాలభారతం, విద్ధసాలభంజిక, కర్పూరమంజరి అనే నాలుగు నాటకాలను, కావ్యమీమాంస అనే విలక్షణమైన లక్షణగ్రంథాన్ని రచించాడు. ఇంకా ఏవో గ్రంథాలను రచించాడంటారు కానీ అవి మనకు దొరకలేదు. ఇందులో కర్పూరమంజరి - పరిమాణంలో చిన్నదైనా విశిష్టమైన రచన. సట్టకం అంటారు దీన్ని.

***‌‍*‌‍‌^^^^**** 



సట్టకం అంటే ఏమిటి?


సట్టకం అంటే పూర్తీగా ప్రాకృతభాషలో రచించిన నాటిక వంటిది. నాట్యశాస్త్రం ప్రకారం - సంస్కృతంలో పది రకాలైన నాటకాలు ఉన్నాయి. అందులో నాటకాన్ని, ప్రకరణాన్ని కలిపి చేర్చిన ప్రక్రియను నాటిక అన్నారు. ఆ నాటిక లక్షణాలేమిటో చూద్దాం.
  • నాయకుడు (హీరో) ధీరలలితుడై ఉండాలి. (నిశ్చింతో ధీరలలితః కళాసక్తః సుఖీ మృదుః
  • కథ ఉత్పాద్యమై ఉండాలి. (అంటే అంతకు మునుపు వ్రాసిన కావ్యాల నుండి స్వీకరింపకుండా కొత్తగా ఉండాలి) 
  • నాయిక అంతఃపురకన్య, లేదా గాయని/నాట్యకత్తె అయి ఉండాలి. 
  • శృంగారరసప్రధానమై ఉండాలి. 
  • నాలుగు అంకాలు ఉండాలి. 
  • స్త్రీపాత్రలు ఎక్కువగా ఉండవలె. 
  • అభినయం లలితంగా ఉండవలె (కైశికీ వృత్తి అంటారు దీనిని). 
  • నృత్త గీత పాఠ్య భరితమై ఉండవలె. 
  • అవమర్శ సంధి ఛాయామాత్రంగా ఉండవలె. (చివరి అంకాన మరీ మితిమీరిన మెలోడ్రామా ఉండరాదు) 
  • చివర్న నాటిక అంతంలో నాయకుడికి రతిపురస్సరమైన రాజ్యప్రాప్తి లభించాలి. 
  • పూర్వనాయికకు దంభము, క్రోధము వంటి లక్షణాలుండాలి. 
  • నాయిక - దూతీజన పరివేష్టితంగా ఉండవలె. 

నాట్యశాస్త్రం 18 వ అధ్యాయంలో పేర్కొని ఉన్న ఈ నాటిక లక్షణాలు ప్రక్షిప్తమని ఒక వాదం ఉంది. నాట్యశాస్త్రపు కాలంలో భరతుడు పదిరకాల నాటకభేదాలనే చెప్పాడు. నాట్యశాస్త్రం జనించిన ఎన్నో వందల యేళ్ళ తర్వాత క్రీ.శ. 11 వ శతాబ్దానికి అభినవగుప్తుడు ఆ శాస్త్రానికి వ్యాఖ్యానాన్ని అభినవభారతి అన్న పేరుతో రచించినాడు. ఈ అభినవభారతిలో నాటిక లక్షణాల వ్యాఖ్యానం ఉండటం చేత, అభినవభారతి కాలానికి కొంతకాలం ముందు నాటిక ఏర్పడింది అని కొందరు పేర్కొన్నారు. ఇది పూర్తీనిజం కాదు. బౌద్ధం ప్రాభవంగా ఉన్న కాలంలోనే నాటిక ఉన్నది.

"కర్పూరమంజరి" రచన లో పైన పేర్కొన్న లక్షణాలన్నీ దాదాపుగా ఉన్నాయి. సాధారణంగా నాటికలో ప్రధానంగా (నాయకుడు, ఇతర ప్రధాన పాత్రలు) సంస్కృతంలో మాట్లాడ్డం, నాయిక, విదూషకుడు వంటి అవాంతరపాత్రలు ప్రాకృతంలో మాట్లాడ్డం ఉంది. రాజశేఖరకవి - ఈ అసమానత్వాన్ని పరిహరించి మొత్తం నాటకాన్ని శూరసేనీ ప్రాకృతంలో రచించాడు. దరిమిలా ఇది "సట్టకం".

ప్రాకృతభాష, సంస్కృతభాషల ప్రయోగం అన్న వ్యత్యాసం మాత్రమే కాక సట్టకం/సాటకం అన్నది - నాటికకంటే కొంత భిన్నం. దీనిని రాజశేఖరుడే ఈ కావ్యారంభంలో సూత్రధారుడు (Stage Manager) ద్వారా చెప్పిస్తాడు.

తత్ సాటకమితి భణ్యతే దూరం యో నాటికా అనుహరతి |
కిం పునరత్ర ప్రవేశక విష్కంభకౌ న కేవలం భవతః ||

నాటికను అనుసరించేది, ప్రవేశకము, విష్కంభకమూ అన్న ప్రక్రియలు లేనిదీ సాటకం/సట్టకం.

భావప్రకాశంలో సాటకం/సట్టకం నిర్వచనం కూడా పైని లక్షణాలకు అనుగుణంగానే ఉంది.

"సైవ ప్రవేశకేనాపి విష్కంభకేణ వినా కృతా | అంకస్థానీయవిన్యస్తచతుర్జవనికాన్తరా | ప్రకృష్టప్రాకృతమయీ సట్టకో భవేత్ |"

(నాటకాలలో భోజనం, స్నానం, యుద్ధం వంటి క్రియలను తెరపై చూపరాదని నియమం ఉంది. అలాగే జరిగిపోయిన కథలను చెప్పే అవసరం వస్తుంది. ఇటువంటి వాటిని చెప్పటానికి అర్థోపక్షేపాలు అన్న సంవిధానాలను ఉపయోగిస్తారు. (ఉదా: వేణీ సంహార నాటకంలో దుశ్శాసనుని వధ ప్రావేశకము . అనర్ఘరాఘవంలో శివధనుర్భంగఘట్టం నిష్కంభకము). ప్రవేశకము, నిష్కంభకమూ అన్నవి అర్థోపక్షేపకాలు. )

ఈ రెండు సట్టకంలో ఉండవు. (ఉండకపోవడం వల్ల సూటిగా, సరళంగా నాటిక కొనసాగుతుంది. సంగీత నృత్యాలకు ఎక్కువ ప్రాధాన్యత ఏర్పడుతుందన్నమాట).

***

ఇది ఇలా ఉండగా, మన్ మోహన్ ఘోష్ అనే పండితుడు సట్టకం గురించిన మరొక వివరాన్ని పేర్కొన్నాడు. ప్రఖ్యాతమైన భర్హుత్ (మధ్యప్రదేశ్ లోని ఓ చారిత్రక ప్రాంతం) బౌద్ధ స్థూపం, అక్కడ దొరికిన తామ్రశాసనాలలో, "సాటికా", "సాడికా" అన్న శబ్దాలతో కూడిన నృత్య/నాట్య ప్రక్రియల గురించి ఉన్నది.



ఈ ప్రాకృతశాసనాలలో సట్టకాన్ని పేర్కొన్న దరిమిలా, మరికొన్ని పరిశోధనలు జరిపి, ఈ ప్రక్రియ - నాటికకంటే కాస్త భిన్నమైనదని, సట్టకంలో నృత్య, సంగీతాల ప్రమేయం ఎక్కువగా ఉంటుందని, ఇది ఒక Dance-Drama అని, ఘోష్ పేర్కొన్నాడు. కర్పూరమంజరి నాటకంలో నాలుగవ అంకంలో చర్చరి అన్న నృత్యప్రస్తావన ఉన్నది. బహుశా ఈ నృత్యప్రస్తావన వచ్చినప్పుడు - ప్రాచీనకాలంలో తెరపై నృత్యం కూడా చేసేవారేమో!

***‌‍*‌‍‌^^^^**** 

కథ.


(మొదటి జవనిక)

మహారాజు చంద్రపాలుడు, రాణి విభ్రమలేఖ, రాజు మిత్రుడూ విదూషకుడూ అయిన కపింజలుడూ, రాణి పరిచారిక విచక్షణా కలిసి వసంతోత్సవాల గురించి ముచ్చటించుకుంటున్నారు. ఆ సందర్భంలో రాజూ రాణీ వసంతకాలపు పవనాలపైన కవితలు చెప్పుకున్నారు. కపింజలుడూ విచక్షణ కూడా తమతమ కవితలు చెప్పారు. కపింజలుని కవితలో అతని భోజనప్రియత్వం దాగున్నది. అందుకే ఆ కవితను విచక్షణ విమర్శించింది. "ఈ కవిత నీ ప్రియురాలిని మాత్రమే రంజింపజేస్తుంది" అన్నది. ఆపై విచక్షణ కవితను రాణి, రాజు ఇద్దరూ మెచ్చారు.

కపింజలునికి సహజంగానే కాస్త కోపం వచ్చింది. అతడు శ్లేషతో విచక్షణను తిట్టడం మొదలెట్టాడు. విచక్షణ కూడా ధీటుగా బదులివ్చింది. ఈ మిషతో అక్కడ నుంచి బయటకెళ్ళిన కపింజలుడు, కాసేపటికి భైరవానందుడనే అతీతశక్తులు గల సిద్ధుణ్ణి సభకు తోడుకొని వచ్చాడు.

మహారాజు ఆదేశం మేరకు భైరవానందుడు ఓ అద్భుతాన్ని ఆవిష్కరించాడు. ఆతని మంత్రశక్తితో సభ మధ్యలో పైనుండి ఓ అపూర్వమైన సుందరి జాలువారుతూ వచ్చింది.ఆవిడ విదర్భదేశపు రాకుమారి కర్పూరమంజరి.



మహారాజు ఆ యువతి సౌందర్యాన్ని చూసి అచ్చెరువందినాడు. ఆమెను చూడగానే మహారాణి విభ్రమలేఖ - తనకు ఆమె చెల్లెలి వరస అవుతుందని గుర్తించింది. కర్పూరమంజరి తల్లిదండ్రులు అయిన వల్లభుడు, శశిప్రభా - మహారాణికి - బాబాయి, పిన్ని వరస. వారి పుత్రిక కాబట్టి కర్పూరమంజరి, రాణికి చెల్లెలు.

మహారాజు చంద్రపాలునికి ఆ సుందరిని చూడగానే మనసు చలించింది. విభ్రమలేఖ కర్పూరమంజరిని కొన్నాళ్ళు అతిథిగా ఉంచుకుంటానని సిద్ధుడికి చెప్పి, అభ్యంతరమందిరానికి తీసికెళ్ళింది.

(రెండవ జవనిక)

తన కంటి ముందు జరిగిన అద్భుతాన్ని, ఆ సుందరిని రాజు మరచిపోలేక, విరహంలో పడ్డాడు మహారాజు చంద్రపాలుడు. కర్పూరమంజరిపై కవితలు చెబుతున్నాడు. ఇటు కర్పూరమంజరి పరిస్థితి అలానే ఉంది. బయటకు చెప్పుకోలేక ఈమె - మొగలిరేకులపై రెండు కవితలను వ్రాసి విచక్షణకు ఇచ్చింది. విచక్షణ ఆ కవితలను మహారాజుకు అందించడంతో ఆయన వాటిని చదువుకున్నాడు.

ఇటు మహారాణి, తన చెల్లెలిని రాబోయే హిందోళికా ఉత్సవం కోసం - ఎంతో అందంగా ముస్తాబు చేసి, ఆభరణాలతో అలంకరింపజేసింది.

కపింజలుని సూచన మేరకు మహారాజు, విదూషకుడూ మరకతకుంజం అనే రహస్య ప్రదేశంలో దాగి, అంతఃపురంలో కర్పూరమంజరి ఉయ్యాల ఊగే సంరంభాన్ని చూచారు. రాజు ఆమె సౌందర్యాన్ని చూచి మరింతగా ప్రేమలో పడ్డాడు.

రాజు, కర్పూరమంజరి - ఒకరిపై ఒకరు మరులు గొన్నారని విచక్షణకూ, కపింజలునికీ స్పష్టపడింది. సాయంత్రం అరటితోటకు కర్పూరమంజరిని తోడుకుని "దోహదక్రియ" కై వస్తోంది రాణి. మహారాజు, కపింజలుడూ పొదలలో దాగి, ఈ సారి కర్పూరమంజరిని మరింత దగ్గరగా చూశారు.

దోహద క్రియ పూర్తయింది. వైతాళికులు - సాయం సమయమైనట్టు నినదించారు. అందరూ నిష్క్రమించారు.

(మూడవ జవనిక)

మహారాజు చంద్రపాలుడు,విదూషకుడు కపింజలుడు మాట్లాడుకుంటున్నారు. క్రితం రాత్రి కలలో కర్పూరమంజరి రాజు నిదురపోతున్న తల్పానికి దగ్గరగా వస్తే, రాజు ఆమె చీరె కొంగును పట్టుకోబోయాడు. ఆమె తన చీరె కొంగును విడిపించుకుని అక్కడినుండి మరలిపోయింది. అంతటితో రాజుకు నిద్రాభంగమయింది.

విదూషకుడూ తన కల చెప్పేడు. తను గంగానదీ ప్రవాహంలో స్నానం చేస్తున్నాడు.శరత్కాలపు మహా మేఘం ఒకటి గంగ నీటిని నీటియావిరి రూపంలో పీల్చుకున్నది. అలా తాను మేఘపు మధ్యభాగానికి వెళ్ళాడు. ఆపై మేఘం దక్షిణ దిశగా ప్రయాణించి తామ్రపర్ణీనది సముద్రంలో కలిసే చోట - స్వాతీ నక్షత్రాన తనను వర్షం రూపంలో సముద్రంపై వదిలింది. అలా కపింజలుడు ఓ ముత్యపు చిప్ప లోపలకు వచ్చి పడ్డమే కాక, (స్వాతి) ముత్యం లోపల చిక్కువడి, ముత్యపు చిప్ప పగలటంతో సముద్రతలాన వచ్చాడు. ఈ ముత్యాన్ని ఓ శ్రేష్టి లక్ష బంగారు వరహాలకు కొని, ఓ హారంలో దాన్ని పొదిగి, కన్యాకుబ్జానికి వెళ్ళి, పాంచాల రాజైన వజ్రాయుధుడికి కోటి వరహాలకు అమ్మినాడు. ఆ రాజు తన భార్య మెడలో ఆ హారాన్ని వేసి, ఆమె గాఢంగా కౌగిలించుకున్నాడు. ఆ వత్తిడికి హారంలో ఉన్న తనకు స్వప్నం చెదరి, నిద్రాభంగమయింది.

రాజు ఈ కథ విని నవ్వాపుకోలేకపోయాడు. " నీ అబద్ధపు కల నా నిజం లాంటి కల లోంచి బయటకు తెప్పించింది కదా" అన్నాడు. రాజు, కపింజలుడూ - ప్రేమ, సౌందర్యం, యౌవనం వంటి విషయాలను చర్చించుకొన్నారు.

రాజు, విదూషకుడూ మాట్లాడుకుంటూ నడుస్తుండగా అటు కర్పూరమంజరీ, ఆమె చెలికత్తె కురంగికా కూడా మాట్లాడుతూ ఎదురు రాసాగినారు. వారి మాటలు చెవిన బడిన రాజుకు ఆమె కూడా విరహంలో వున్నట్టు తెలిసింది. కర్పూరమంజరి రాజుకు ఎదురు రాగా, రాజు ఆమె చేయి పట్టుకున్నాడు. అనుకోకుండా ఆమెను కౌగిలించుకున్నాడు కూడా.

ఇంతలో చంద్రోదయమయినట్టు వైతాళికుల పద్యాలు నగారా లో వినిపించినాయి. కురంగిక - చంద్రోదయంపై కర్పూరమంజరి రచించిన కవితను చదివింది. రాజు ఆ కవితను చాలా అద్భుతంగా ఉందని పొగిడాడు. ఇంతలో కలకలం వినిపించింది. కురంగిక అటు వెళ్ళి విషయం తెలుసుకుంది.

మహారాణి విభ్రమలేఖ అటుగా వస్తోంది. కర్పూరమంజరి - తన రక్షాగృహంలో ఉండక రాజును కలవడానికి వెళ్ళినట్లు ఆమెకు తెలిసింది. కర్పూరమంజరి త్వరత్వరగా సొరంగమార్గాన తన రక్షాగృహానికి చేరటానికై మరలి పోయింది.

(నాలుగవ జవనిక)

రాజు, కపింజలుడు గ్రీష్మకాలాన్ని గురించి ముచ్చటించుకుంటున్నారు. కర్పూరమంజరి ఉంటున్న రక్షాగృహం నుండి బయటకు వెళ్ళగలిగే సొరంగ మార్గాన్ని మహారాణి విభ్రమలేఖ మూసి వేయించడమే కాక అన్ని దిశలా సైనికులను కాపలా పెట్టించింది. కర్పూరమంజరిని ఎవరూ చూడటానికి వీలు లేదు.

వటసావిత్రి మహోత్సవ సందర్భంగా కేళీ విమానప్రాసాదంపై నుండి రాజు, విదూషకుడూ దండరాస, చల్లీ వంటి నృత్యాల ప్రదర్శనను తిలకించారు.

ఇంతలో మహారాణి పరిచారిక సారంగిక రాజు మందిరానికి ఓ సందేశంతో వచ్చింది. ఆ రోజు సాయంత్రమే రాజుకు పునర్వివాహం. దీనికి కారణం ఇది.

మహారాణి భైరవానందుని అధ్వర్యాన గౌరీపూజ జరిపించి, గురుదక్షిణ స్వీకరించమని ఆతణ్ణి కోరింది. తనకు ఇవ్వవలసిన దక్షిణ మహారాజుకు ఇవ్వమని భైరవానందుడు మహారాణితో చెప్పాడు. ఆ దక్షిణ ఏమిటంటే - లాట దేశపు రాజు చండసేనుడు. ఆతని కుమార్తె ఘనసారమంజరి. ఆమెను వివాహం చేసుకున్న వరుడు చక్రవర్తి అవుతాడని జ్యోతిష్కులు చెప్పారు. ఆమెను మహారాకు ఇచ్చి వివాహం చెయ్యమని, తద్వారా రాజు చక్రవర్తి కావటమే కాక, తన గురుదక్షిణా తీరుతుందని భైరవానందుడు చెప్పాడు. ఆ విషయాన్ని సారంగిక ద్వారా మహారాజుకు తెలిపింది మహారాణి.

రాజు హతాశుడయ్యాడు. విదూషకుడు నవ్వుతూ చెప్పాడు, " తలపై పాము, అజ్ఞాతంలో వైద్యుడు, ఇప్పుడిక్కడ వివాహం, లాటదేశంలో యువరాణి!".

అయితే రాజుకు భైరవానందుని శక్తి సామర్థ్యాలు తెలుసు. ఆతడు చాముండాయతనం లో దేవి సమక్షాన వివాహపు ఏర్పాట్లు చూస్తున్నాడు. ఆతని వద్దకు బయలుదేరారు చంద్రపాలుడు, కపింజలుడూ.

ఇక్కడ భైరవానందుడు కర్పూరమంజరిని రక్షా గృహం నుండి పిలిపించాడు. రాణి దేయాలయానికి వస్తే, కల్యాణానికి సంబారాలు తోడుకొని రమ్మని పంపేశాడు. కర్పూరమంజరి ముఖాన పూలమాలలు కప్పి కల్యాణవధువును చేశాడు.

రాజు విదూషకుడూ రానే వచ్చారు. విదూషకుడికి - కర్పూరమంజరియే ఘనసారమంజరి అని తెలిసిపోయింది. ఆ విషయాన్ని రాజుకు నర్మగర్భంగా ఓ శ్లోకం ద్వారా చెప్పాడతను. ఆపై కపింజలుడే పురోహితుడై వివాహం జరిపించాడు. కర్పూరమంజరి, చంద్రపాలుల వివాహం రాణి సమక్షంలోనే ఆమెకు విషయం తెలియకుండా జరిగిపోయింది.

శుభం.
***‌‍*‌‍‌^^^^**** 

ప్రేమ అనగానేమి?


విదూషకుడు: రాజా, దేవి గారిపైన ప్రేమాస్పదుడై యుండి కూడా మీరు కర్పూరమంజరిని అలా కళ్ళు విప్పార్చుకుని, చూపులతో త్రాగేస్తున్నట్టు ఎందుకు చూస్తున్నారు? రాణి తన గుణాన్ని కోలుపోయి మీ ప్రేమను నోచుకోకపోయిందా?

రాజు: అలా అనకోయి;

కీఏ వి సంఘడఈ కస్స వి పేమ్మగంఠీ
ఎమెవ్వ తత్థణ ఉ కారణమత్థి రూఅమ్
చంగత్తణం ఉణ మహిజ్జది జం తర్హి పి
తా దిజ్జ ఏ పిసుణలోఅముహేసు ముద్దా ||


ఛాయ:
కయాచిత్ సంఘటతే కస్యాపి ప్రేమగ్రంథిః
ఏవమేవ తత్ర న ఖలు కారణమస్తి రూపమ్ |
చంగత్వం పునర్మృగ్యతే యత్తత్రాపి
తద్దీయతే పిశునలోకముఖేషు ముద్రా ||


ప్రేమబంధం అన్నది ఏదో అనుకోని కారణాన సంభవిస్తుంది. ఇలా ప్రేమ పుట్టడానికి రూపాతిశయమే కారణం అని చెప్పలేం. సౌందర్యాన్వేషణే ప్రేమకు కారణం కావచ్చును, లోకుల నోళ్ళను మూయించడానికి యువతి సౌందర్యాన్ని ఉద్యోతించక తప్పదు.

వి: మరి దీన్ని పొద్దస్తమానం ప్రేమ, ప్రేమ అంటుంటారు. ఎలాంటిది యిది?

రా:
జస్సిం విఅప్పఘడణాఇ కలంకముక్కో
అంతో మణమ్మి సరళత్తణమేఇ భావో |
ఏక్కక్క అస్స పసరంతరసప్పవాహో
సింగారవడ్ఢి అమణోహవదిణ్ణసారో ||

ఛాయ:
యస్మిన్ వికల్పఘటనాది కలంకముక్తః
ఆత్మనః సరళత్వమేతి భావః |
ఏకైకస్య ప్రసరత్ రసప్రవాహః
శృంగారవర్ధితమనోభవదత్తసారః ||


ఎందులో హృదయం విశ్వాసబద్ధమై చెడుతలపులనే ముళ్ళు లేనిదై ఉంటుందో, ఎందులో చిత్తం సరళత్వాన్ని పొందుతుందో, ఎందులోనయితే ఒకరిపై ఒకరికి ఆకర్షణ యొక్క రసప్రవాహం ఉంటుందో, ఏదైతే శృంగారం ద్వారా పెంపు చేయబడుతుందే అది ప్రేమ.

వి: దీన్నెలా గుర్తించాలి?

రా:

జాణం సహావపసరంతసలోలదిట్టీ
పరేంతలుంఠిఅమాణణ పరప్పరేణ |
వడ్డంతమమ్మహ విఇణ్ణరసప్పసారో
తాణం పహాస ఇ లహుం విఅ చిత్తభావో ||

ఛాయ:
యయోః స్వభావ ప్రసరత్ సలోల దృష్టిః
పర్యంతలుంఠితమనసో పరస్పరేణ |
వర్ధమానమన్మథ వితీర్ణరసప్రసారః
తయోః ప్రకాశతే లఘురివ చిత్తభావః ||


ఎవరి చూపులు ఒకరిపై ఒకరికి అవ్యక్తంగా ప్రసరిస్తూ ఉంటాయో, ఒకరిపై ఒకరికి మనస్సు లగ్నమై లాగబడి ఉంటుందో, మన్మథుని శరాలచేత మోహం పెచ్చరిల్లుతూ ఉంటుందో, వారి మధ్య ప్రకాశించి ఉన్నదే ప్రేమ.

వి: అలాంటి ప్రేమ ఉన్నప్పుడు అలంకారాలు గట్రా ఎందుకు?
...
....

ఈ ప్రేమ చర్చ ఇంకా కాస్త ముందుకు వెళుతుంది కానీ మనం ఇక్కడ ఆపుదాం.

****

తిరిగి అల్లసాని వారి వద్దకు రావాలి మనం. పెద్దనకూ, రాజశేఖరునికి మధ్య శైలిలో మాత్రమే కాక, భావాల్లో కూడా కొంత సారూప్యం కనిపిస్తుంది. పెద్దన - కవిత్వంలో శబ్దానికి తగినంత ప్రాముఖ్యత ఉందనే అంటాడు "పూతమెఱుంగులన్ పసిడి.." అన్న మాలికలో. రాజశేఖరుడూ అలాంటి అభిప్రాయాలను ప్రకటిస్తాడు. ఇద్దరూ మాలికలకు అభిమానులు, మాలికారచనలో సిద్ధహస్తులు. :) (కర్పూరమంజరిలో 20 పాదాల ఒక సుదీర్ఘమైన మాలిక వంటి పది శ్లోకాల సమాహారం ఉన్నది. ) వీరి కవిత్వాల ద్వారా చూస్తే, ఇద్దరూ నెమ్మదైన వ్యక్తుల్లా అగుపిస్తారు. కాకపోతే రాజశేఖరుడు కొంత ఉదారవాది, కాస్తో కూస్తో అప్పటికాలానికి ఆధునిక భావాలను కలిగియున్న కవి. పెద్దన ఆ విషయంలో బయటపడలేదు కానీ, శాసనాల ద్వారా మనకు తెలిసిన పెద్దన - గొప్ప దాత.

అంతే కాదు; ఇద్దరికీ ప్రేమంటే ప్రేమే. :)

కర్పూరమంజరిలో ప్రేమను రాజు, విదూషకుడూ చర్చిస్తే, స్వారోచిషమనుసంభవంలో ప్రేమ చర్చ ....చెప్పడమెందుకు?...మనకు తెలిసిందే. మనుచరిత్రకారుడు వరూధిని ద్వారా చెప్పించిన ప్రేమపాఠాల్లో రాజశేఖరుని ప్రేమను పోలినది ఇది.

శా||
ఎందే డెందము కందళించు రహిచే నేకాగ్రతన్‌ నిర్వృతిన్
జెందుం కుంభగత ప్రదీపకళికాశ్రీ దోప నెందెందుఁ
బో కెందే నింద్రియముల్‌ సుఖంబు గను నా యింపే పరబ్రహ్మ, “మా
నందో బ్రహ్మ” యటన్న ప్రాజదువు నంతర్బుద్ధి నూహింపుమా
.

ఏ విషయంలో మనస్సు వికాసము చెంది తన్మయత్వాన్ని పొందుతుందో; ఇంద్రియాలన్నీ లయించి ఏ విషయాన సుఖానుభూతిని పొందుతాయో; అలాంటి విషయం యొక్క ఆనందమే బ్రహ్మానందము. ఆనందము అన్న వేదవాక్యానికి అర్థాన్ని యోచింపుము.

రాజశేఖరుని ఉక్తులు కొంచెం గడుసువి. ఎందుకంటే ఆయన కర్పూరమంజరి - అన్న అమ్మాయి పేరునే కావ్యానికి పెట్టి, అక్కడక్కడా అమ్మాయిని వర్ణించే నెపంతో కావ్యాన్ని, కవిత్వాన్ని గురించి మాట్లాడతాడు. అల్లసాని పెద్దనకు ఇటువంటి యుక్తులు లేవు,

***‌‍*‌‍‌^^^^**** 

కవిత్వలక్షణాలు


"అహో కర్పూరమంజర్యా అభినవార్థదర్శనమ్, రమణీయః శబ్దః, ఉక్తివిచిత్రతా, రసనిష్పందశ్చ"

"ఆహా! కర్పూరమంజరి యొక్క పలుకుల్లో నవనవోన్మేషమైన అర్థము, రమణీయమైన పలుకులు, పలుకుల్లో విభిన్నత, రసబంధురతా.."

ఈ నాటికలో భాగంగా (అంటే అంతర్గతంగా) రాజు చంద్రపాలుడు - కర్పూరమంజరి చెప్పిన కవితకు పరవశించి అలా అంటాడు. బాహ్యంగా వచ్చి చూస్తే - ఇది కవి రాజశేఖరుడు కర్పూరమంజరి అనే కావ్యాన్ని గురించి ప్రకటించుకున్న అభిమతం కూడాను. ఇది రాజశేఖరుని యొక్క "ఉక్తివిచిత్రత" !
రాజు (రాజశేఖరుడు) అంతలా మెచ్చుకున్న ఆ శ్లోకం ఇది. కొంత కాళిదాసు ఛాయ కనిపించే శ్లోకం యిది.

మండలే ససహరస్స గోరఇ దంతపంజరవిలాసచోరఇ |
భాది లాంఛణమిఓ పురన్తఓ కేలికోఇలతులం ధరన్తఓ ||

ఛాయ:
మండలే శశిధరస్య గౌరే దంతపంజరవిలాసచౌరే |
భాతి లాంఛనమృగః స్ఫురన్ కేలి కోకిలతులం ధారయన్ ||


ఏనుగుదంతంతో చేసిన పంజరపు కాంతులను దొంగిలించిన చంద్రుడు తూరుపున పసిడి వర్ణపు వలయాన్ని ధరిస్తూ ఉద్భవిస్తున్నాడు. ఆ చంద్రునిలో మచ్చ రూపాన ఉన్న జింక - కోకిలబొమ్మ లా ఉంది.

పంజరంలోని కోకిల వలె చంద్రునిలో మచ్చ ఉంది అన్నది ఉక్తివిచిత్రత. వాక్యవక్రోక్తి.
చంద్రుడు - దంతపంజరవిలాసచౌరుడు - ఇది అభినవార్థదర్శనం.
శ్లోకమంతానూ రమణీయమైన శబ్దాలే.
పంజరంలా ఉన్న చంద్రునిలో మచ్చ - కోకిల బొమ్మ లా ఉందనడం విస్మయమైన విషయం. అద్భుతరసం యొక్క స్థాయీభావం విస్మయం.

యథావిధిగా, బాదరాయణసంబంధం - iii ప్రతిపాదన చేయుచున్నాను.

అంతటఁ బ్రాచి నిశాపతి
యంతికగతుఁ డౌట విని ముఖాలంబి తమః
కుంతలములు దీర్పఁగఁ గొను
దంతపుదువ్వెన యనంగ ధవళిమ దోచెన్. (మనుచరిత్ర - 3.20)


ఆపైన తూరుపు అనే స్త్రీ - తన చెంతకు రజనీకరుడు చంద్రుడు వస్తున్నాడని, చీకటులు అనే తన ముంగురులను సవరించుకోవడానికి తీసికొన్న దంతపు దువ్వెనలా - తూరుపు దిక్కున వెలుగురేకలు ప్రసరించినవి.

పెద్దన వెలుగురేఖ దంతపు దువ్వెన అయితే రాజశేఖరునిది దంతపంజరవిలాసము. :)


******

కర్పూరమంజరి కావ్యంలో అక్కడక్కడా కవిత్వ చర్చ జరుగుతూ ఉంటుంది. కవిత్వపు చర్చలు సాధారణంగా మూడు విభిన్న తలములలో జరుగడం కద్దు.

౧. కవిత్వం గురించిన తార్కిక చర్చ.
౨. కవిత్వం గురించిన సైద్ధాంతిక చర్చ. (ధ్వని, రసం, రీతి వగైరా)
౩. కవిత్వం లో శబ్దార్థాల యొక్క స్వారస్యపు చర్చ.

రంగస్థలంపై ప్రదర్శించే నాటిక కనుక ఈ కావ్యంలో కవిత చర్చ ప్రధానంగా శబ్దార్థాలపై ఉంటుంది. (ఇతర చర్చలు సామాన్య ప్రేక్షకునికి విసుగు తెప్పించగలవు కనుక). అటువంటి సందర్భాలు మరికొన్ని పరిశీలిద్దాం.

******

సాధారణంగా ఏ కవికైనా ’కవిత్వ వస్తువు’ పట్ల తనదైన విశిష్టమైన, విలక్షణమైన దృష్టి ఉండనే ఉంటుంది. అయితే తన ప్రాపంచిక ఇష్టాऽయిష్టాలను, అభిరుచులను కవిత్వంలో జొనపడం కవి అన్నవాడు చేయదగని పని. ఈ విషయాన్ని రాజశేఖరకవి అన్యాపదేశంగా సూచిస్తాడు.

మొదటిజవనికాంతరంలో విదూషకుడు, విచక్షణా కవితలు చెప్పారు.

విదూషకుని కవితలో భావం : ఈ సిందువార సుమపు మొగ్గలు అన్నం మెతుకుల్లా తెల్లగా ఉన్నాయి. నాకోసమై వికసించి ఉన్నాయి. ఈ మల్లెమొగ్గలు - గేదెపెరుగులా ధవళకాంతిలో ప్రకాశిస్తున్నాయి.

- ఈ కవితను విన్న విచక్షణ "ఈ కవితలో వస్తువు నీ యొక్క ఇష్టానికి సంబంధించినది. ఇది నీ ప్రియతమురాలైన భార్యకు నచ్చుతుంది. శబ్దసంచయం బావున్నా, భావంలో నూతనత్వం లేని కవిత - లావుగా ఉన్న నడుముకు వడ్డాణం చుట్టినట్టుగా శోభించదు" అంటుంది.

ఆపై విచక్షణ - తన కవిత చెబుతుంది.

జే లంకాగిరిమేహలాసు ఖలిఅ సంభోగఖిణ్ణోరఈ
ఫారుప్ఫుల్లఫణావళీకవలణే పత్తా దరిద్దత్తణమ్ |
తే ఏహ్ణం మల ఆనిలా విరహిణీణీసాసంపక్కిణో
జాదా ఝత్తి సిసుత్తణేవి బహలా తారుణ్ణపుణ్ణ విఅ ||

ఛాయ:
యే లంకాగిరి మేఖలాసు స్ఖలితాః సంభోగఖిన్నోరగీ
స్ఫారోత్ఫుల్లఫణావళీ కవలనే ప్రాప్తా దరిద్రత్వమ్ |
త ఇదానీం మలయానిలా విరహిణీనిఃశ్వాససంపర్కిణో
జాతా ఝటితి శిశుత్వేऽపి బహళాస్తారుణ్యపూర్ణా ఇవ |
|

ఇది వసంతవర్ణన. ఏ గాలులు లంకలోని సువేల పర్వతసానువులలో తత్తరపడినవో; ఏ గాలులు సంభోగంలో అలసిన ఆడుపాముల విశాలమైన పడగలపంక్తులచేత క్షీణింపబడినాయో;ఆ మలయపర్వత చందనసుగంధాలు విరహిణుల నిట్టూర్పులతో - శిశుత్వములోనూ (మెల్లగా మొదలైన సమయంలోనూ) యౌవనంలో లాగా (తీవ్రంగా వీయుచున్నట్లు) అయినవి.


(నిఃశ్వాసాన్ని అందుకున్న వాయువులు యౌవనాన్ని సంతరించుకున్నట్టు చెప్పడం ద్వారా కామినుల కాంక్ష అన్న వస్తువు వ్యంగ్యం అయింది. దీన్ని కవి - కావ్యంలోని పాత్రద్వారా చెప్పించటం మరింత చమత్కారాన్ని కలిగిస్తోంది. కర్పూరమంజరిలో విచక్షణ చెప్పిన ఈ శ్లోకాన్ని - కావ్యంలో రాజు రాణి మెచ్చుకున్నారు. అయితే కావ్యం బయట కూడా ఈ శ్లోకాన్ని మమ్మటుడనే ఆలంకారికుడు "కవినిబద్ధవక్తృప్రౌఢోక్తిసిద్ధమైన వస్తుధ్వని" కి ఉదాహరణగా పేర్కొన్నాడు.)

కర్పూరమంజరి, చంద్రపాలుడు ప్రేమలో పడ్డారు.
"ఇది సత్యమేనా?" అని అడుగుతాడు విదూషకుడు.
"సత్యతరమ్" - అంటుంది విచక్షణ.
"పరిహాసం కాదు కదా?"
"ఆర్య! మైవం భణ; అన్యో కావ్య విచారకాలః, అన్యః కార్యవిచారకాలః" - "ఆర్యా! అలా అనకు, కావ్యవిచారం వేరు, కార్యవిచారం వేరు" అంటుంది విచక్షణ.

దరిమిలా - సాధారణమైన సంభాషణలో వక్రోక్తులు, వ్యంగ్యాలు శోభించవు. సహజోక్తులే శోభిస్తాయి. అయితే కవిత్వంలో మాత్రం సహజోక్తుల కన్నా వక్రోక్తులు, వ్యంగ్యాలే శోభిస్తాయని రాజశేఖరుని మరొక అన్యాపదేశం. మరొకచోట నాటకకర్త - రాజు పాత్రతో ఇలా చెప్పిస్తాడు.

"నిసర్గసుందరస్యాపి మానుషస్య శోభా సమున్మీలతి భూషణైః"

"స్వభావసిద్ధంగా సుందరంగా ఉన్న మనిషికి ఆభరణాలు శోభిస్తాయి."

ఇది కవిత్వానికి వర్తించే విధంగా చెబుతాడు కవి.

ఇటువంటివి అక్కడక్కడా ఈ కావ్యంలో వస్తుంటాయి. రాజశేఖరుడు కవి, గొప్ప పండితుడు, అంతకన్నా గొప్ప హృదయవాది. ఈ కవి తన కావ్యమీమాంసలో ఔత్సాహిక కవులకు గొప్పవి, సూక్ష్మమైనవి అయిన ఎన్నో సూచనలు చెప్పాడు. ఆఖరుకు - కవులకు కవిత్వ రచనకు తగిన వాతావరణం ఏర్పరుచుకోవడాన్ని గురించి కూడా ఈయన సూక్ష్మంగా వివేచించి ఉపదేశిస్తాడు. చాలా అమూల్యమైన విషయాలు యివి. (రాజశేఖరుడు కవులకు చెప్పిన హితవు లను సంకలనం చేసి తిరుమల రామచంద్ర గారు తెలుగులో ఒక వ్యాసం వ్రాశారు.)

రాజశేఖరుడు - అంటే రాజు (చంద్రుని) శిఖరమున వహించిన వాడు.

ఈ కవిరాజశేఖరుడు, కవి-రాజశేఖరుడు, రాజు అయిన చంద్రుని గురించిన శిఖరాయమానమైన వర్ణన యిది. ఈ శ్లోకం "శశివదన" అనే వృత్తంలో ఉందట! దీనిని చెప్పుకోకుండా ఆయన కవిత్వం పూర్తి కాదు.

దిసవహుతంసో ణహసరహంసో |
ణిహుఅణకందో పసరఇ చందో ||

ఛాయ:

దిగ్వధూత్తంసో నభః సరోహంసః |
నిధువనకందః ప్రసరతి చంద్రః ||


దిక్కు అన్న వధువుకు చెవిపోగు, అంతరిక్షమనే సరస్సులో విహరించే హంస, ప్రేమ అన్న తోటకు బంతి అయిన చంద్రుడు వెలుగొందుతున్నాడు.

కర్పూరమంజరికి ఆంగ్ల వ్యాఖ్యా త కోనో - ఎందుచేతనో ఏమో, ఈ ఒక్క శ్లోకాన్ని కవితగా అనువదించాడు..

White swan of heaven's pool;
Of Siva's crest, the jewel;
A bulb of love;
S the moon is above.

***‌‍*‌‍‌^^^^****

భైరవానందుడు


సభకు భైరవానందుడు మద్యం మత్తులో కొద్దిగా తూలుతూ వచ్చాడు. అతడెలాంటి వాడో చెప్పాడు.

మంతో ణ తంతో ణ అ కిం పి జాణం
ఝాణం చ ణో కిం పి గురుప్పసాదా |
మజ్జం పిఆమో మహిలం రమామో
మోక్ఖం చ జామో కులమగ్గలగ్గా ||

ఛాయ:
మంత్రో న తంత్రం న చ కిమపి జానం
ధ్యానం చ నో కిమపి గురుప్రసాదాత్ |
మద్యం పిబామో మహిళాం రమయామో
మోక్షం న యామః కులమార్గలగ్నాః ||


మంత్రతంత్రా లేమాత్రం ఎఱుగము. గురువు అనుగ్రహం వలన ధ్యానము అలవడలేదు. మద్యం సేవిస్తాము, మహిళలను రమిస్తాము. మోక్షాన్ని కోరుకొనము. మేము కౌలం అవలంబించేవాళ్ళము.

అంతేకాదు;

రండా చండా దిక్ఖిదా ధర్మదారా
మజ్జం మంసం పిజ్జ ఏ ఖజ్జ ఏ అ |
భిక్కా భోజ్జం చమ్మఖండం చ సేజ్జా
కోలో ధమ్మో కస్స ణో ఖాది రమ్మో ||

ఛాయ:
రణ్డా చణ్డా దీక్షితా ధర్మదారా
మద్యం మాంసం పీయతే ఖాద్యతే చ |
భిక్షా భోజ్యం చర్మఖండం చ శయ్యా
కౌలో ధర్మః కస్య నో భాతి రమ్యః ||


ఏ కౌలాచారంలో తీక్ష్ణస్వభావం గల వేశ్యకు ధర్మదారగా దీక్ష లభిస్తుందో., ఏ ధర్మం లో మద్య మాంస, భిక్షాణ్ణాలు భుజిస్తారో, ఎందులో చర్మం మీద నిద్రిస్తారో, ఆ కౌలధర్మం ఎవరికి రమ్యంగా అనిపించదు?

....
....

మన కావ్యాల్లో, కొన్ని నాటకాల్లో సిద్ధుల ప్రస్తావన ఉన్నది. మూలదేవుడనే ఒకానొక సిద్ధుడు/ధూర్తుడి ప్రస్తావన అనేక సంస్కృత ప్రాకృత సాహిత్యాలలో ఎడనెడ కనిపిస్తుంది. కర్పూరమంజరిలో కూడా సిద్ధునిపాత్ర ఉంది. ఇతని పేరు, ప్రవర్తనా అది. అయితే, రాణి ఈ సిద్ధుణ్ణి గురువుగా భావించింది. రాజు అతని కౌలాచారాన్ని గురించి పట్టించుకోకుండా, ఆతని ప్రతిభను గుర్తిస్తాడు.

కర్పూరమంజరి నాటకాన్ని గురించి వ్యాఖ్యానిస్తూ, కొందరు వ్యాఖ్యాతలు - భైరవానందుని మాట తీరు ఎబ్బెట్టుగా ఉన్నా, అతడు గొప్ప సిద్ధుడని, ఆ పాత్ర ఉదాత్తమైనదని ప్త్రతిపాదించారు. అయితే, భైరవానందుని పాత్ర - అదే నామధేయంతో, మరొక ప్రాకృతకావ్యమైన "జసహరచరిఉ" (యశోధరచరిత్ర) లో ఉన్నది. జసహరచరిఉ లో భైరవానందుని లక్షణాలున్నూ కర్పూరమంజరి భైరవానందుని పాత్రను చాలావరకూ పోలుతున్నాయి. దరిమిలా నాటి సమాజంలో కౌలాచారతత్పరులై, మద్యమాంసాశనులైన సిద్ధులు ఉండేవారని, అటువంటి ఆచారాలు ఉండేవని, వారినే కవి తన కావ్యంలో స్వీకరించాడని మరి కొందరు వ్యాఖ్యాతలు చెప్పారు.

(మనుచరిత్రలోనూ సిద్ధుడు ఉన్నాడండోయ్. ఆతని రూపురేఖలను తెనుగుకవి ఓ సీసపద్యంలో వర్ణించాడు. అయితే ఈతను ఔషధసిద్ధుడు. సాఫ్ట్ కేరక్టర్. కర్పూరమంజరిలోలా కౌలాచారసిద్ధుడు కాదితడు. )

****^^^^****

సంగీతనృత్య ప్రస్తావనలు


కర్పూరమంజరిలో నాలుగవ జవనికాంతరంలోని ఘట్టం. వటసావిత్రి మహోత్సవం జరుగుతూంది. విదూషకుడు, మహారాజు చంద్రపాలుడు - కేళీవిమానప్రాసాదం పై నుండీ నగరంలో వేడుకలను తిలకిస్తున్నారు. చర్చరీ గాయనీమణులు/నర్తకీమణులు వచ్చారు. ఈ సందర్భాన విదూషకుడు చెప్పిన తొమ్మిది శ్లోకాలు - కవి కాలం నాటి వివిధ దేశీ నృత్యరీతులను వర్ణిస్తాయి. ఇవి ఈ నాటకంలో చారిత్రకంగా సుప్రసిద్ధమైనవి. ఇందులో మూడు శ్లోకాలు ఇవి. ఇవి ఉపజాతి వృత్తంలో ఉన్నాయి.

పరిబ్భమాన్తీఅ విచిత్తబంధం ఇమాఇ దోసోలహ ణంచణీఓ |
ఖేలంతి తాలాణుగదప్పదాఓ తుహంగణే దీసఇ దండరాసో ||
సమం ససీసా సమబాహు హత్థా రేహా-విసుద్ధ అవరాఉ దేంతి |
పంతీహి దోహి ల అ తాల బంధ పరోప్పర సాహిముహీఉ "చల్లీ" ||

కావి వాఇఅ కరాల హుడుక్కా రమ్మ మద్దల రవేణ మ అచ్ఛీ |
దోల్ల ఆహిం పరివాడి చలాహి చల్లి కమ్మ కరణమ్మి ప అట్టా ||

ఛాయలు:
పరిభ్రమంత్యో విచిత్రబంధం ఇమా ద్విషోడశ నర్తక్యః |
ఖేలంతి తాలానుగుణతపదాస్తవాంగణే దృశ్యతే దండరాసః ||
సమాం సశీర్షాః సమబాహుహస్తాః రేఖావిశుద్ధా అపరాశ్చ దదతి |
పంక్తిభ్యాం ద్వాభ్యాం లయతాళబంధం పరస్పరం సాభిముఖా "చల్లీ" ||

.....
.....


కాపి వాదితకరాలహుడుక్కా రమ్యమర్దలరవేణ మృగాక్షీ |
భ్రూలతాభ్యాం పరిపాటీచలాభ్యాం "చల్లి" కర్మకరణే ప్రవృత్తా |
|

ముంగిలిలో 32 మంది నర్తకీమణులు విచిత్రమైన బంధంతో, చుట్టూ తిరుగుతూ, తాలనికి అనుగుణంగా పాదాలు కదుపుతూ దండరాసం అనే నృత్యం చేస్తున్నారు.

ఇంకా కొందరు నర్తకీమణులు రెండు వరుసలలో సాభిముఖంగా నుంచున్నారు. వారు తమ తలలను ఒకే వరుసలో చేర్చి, సరళరేఖలో భుజాలపై భుజాలను చేర్చుకుని, తాళానికనుగుణంగా లయబద్ధంగా "చల్లీ" అనే నృత్యాన్ని చేస్తున్నారు.

ఆ చల్లీ నృత్యం కోసం మరొకావిడ చేతిలో ఉన్న ఢమరుకాన్ని రమ్యంగా మ్రోగిస్తూ, తన నుదుటి రేఖలను విచిత్రంగా కదిలిస్తూ నృత్యంలో తానూ భాగంగా పాల్గొంటున్నది.

దండలాస్యం, చల్లీ, చర్చరీ. ఈ మూడు నృత్యసంగీత రీతుల గురించి కొంత చర్చించుకుందాం.

1. దండరాసకము / దండలాస్యము:

నాట్యశాస్త్రాన్ననుసరించి - నాట్యం అంటే అవస్థానుకరణం. అంటే మానవుల సంవేదనలకు రూపు కల్పించి జవనికపై ప్రదర్శించటమే నాట్యం. (The theater art). ఇది రసాశ్రితం., సాత్వికాభినయప్రధానమూ.

నృత్తం అంటే గాత్రవిక్షేపం. (నృత్త - గాత్రవిక్షేపే అని ధాతువు) ఇది తాళలయాశ్రితం. తాళలయాదులకు అనుగుణంగా, ప్రదర్శించే ఆంగికాభినయం నృత్తం. ఈ నృత్తాన్ని తాండవమని, లాస్యమని వింగడించారు. తాండవమంటే - ఉద్ధృతమైన నృత్తం. లాస్యం - అంటే లలితమైన నృత్తం.

దండలాస్యం - అంటే నర్తకులు ఓ కర్రను పట్టుకుని, ఆ కర్రను ఇతర నర్తకుల కర్రలతో తాటిస్తూ చేసే సమూహనృత్తం. దేశీ భాషలో ఇది "కోలాటం" అయింది. కోల + ఆటము. కోల అంటే దండము. ఈ దండలాస్యాన్ని, ఆ దండము ఎలా ఉండాలి అన్న విషయాన్ని జాయపసేనాని నృత్తరత్నావళి అన్న కావ్యంలో ఇలా నిర్ధారించేడు.

పాత్రాణ్యష్టౌ సమారభ్య వర్ధంతే దండరాసకే
క్రమాత్ చత్వారి చత్వారి నాయకేచ్ఛానుసరతః |
చతుష్షష్టిర్భవేద్యావత్ యావత్సా ద్విగుణాపరైః
ఆరత్ని సమ్మితౌ దైర్ఘ్యాత్ అంగుష్టపరిణాహి నౌ |

దండౌ కనకబద్ధాంతౌ మదనాది ద్రుమోద్భవౌ

.....

దండరాసకంలో ఎనిమిదితో మొదలుపెట్టి క్రమంగా నలుగురు నలుగురు నర్తకుల పెంపుతో 64 నర్తకుల వరకూ ఉండవచ్చును. వారు రెండుజట్లుగా ఏర్పడవలె. కోలలు మూర+చిటికెనవ్రేలు పరిమాణమున ఉండదగును. కోల బొటన వ్రేలి లావున ఉండదగును. పొగడమ్రానితో చేయబడి సువర్ణపు తొడుగు కలిగి ఉండవచ్చును. రెండు చేతుల యందూ కోలలు ధరింపవలెను.

ఈ కోలాటం చాలా ప్రముఖమైన దేశీ నృత్తం. ఇది దాండియారాస్ పేరిట గుజరాత్ లో ఉంది. ఆంధ్రదేశంలో ఇది చాలా మిక్కుటంగా ఉండేది. ప్రాచీన దేవాలయ శిల్పాల్లో ఈ కోలాటం తాలూకు శిల్పాలు మిక్కుటంగా కనిపిస్తాయి.




లేపాక్షి వీరభద్రస్వామి దేవాలయపు ద్వారతోరణంలో కోలాటం.

హంపి హజారరామస్వామి దేవాలయ ప్రాకారం.


హంపి మహర్నవమి దిబ్బ


హంపి విరూపాక్షస్వామి దేవాయలపు పైకప్పు 



మరో ప్రాచీన దేవాలయం.

తెలుగువారి సాంప్రదాయ కళల ప్రస్తావన వచ్చిన తర్వాత విడిచిపెట్టదగని అన్నమయ్యను చెప్పుకోకుండా ఎలా ఉండగలం? అన్నమయ్య కీర్తనల్లో ఒకానొక కోలాటం (దండలాస్యం) యిది.

వేడుక వసంతము వేళ నిదే
వాడలవాడలవెంట వనిత లాడేరు

కేలుఁగేలుజుట్టిపట్టి కెందామర మోములెత్తి
కోలఁగోలఁ దాఁకఁజేసి గుంపువాయక
చాలుకొని యిద్దరేసి జంటలై సతులు గూడి
వోలి వేరొకతెకోల నొడ్డుతా నాడేరు ||వేడుక||

పాలిండ్లు గడలఁగ బరువైనతురుముల
చీలుచు సోలుచుఁ గొంతవెనకకును
మేలిమిపిఱుఁదులతో మెరయుచు మురియుచు
కోలలఁబెడమరలి కోలాటమాడేరు ||వేడుక||

కది శొండురుమోములు కన్నులఁదేలించి చూచి
పదతాళగతులకు పడఁతులెల్లా
అదివో శ్రీ వేంకటేశుఁ డల మేలుమంగతోడ
ముదమంది చూడఁగాను ముందట నాడేడు ||వేడుక||


ఇంకా శ్రీనాథుడు, పాల్కురికి సోమనాథుడు ఇత్యాది అనేక తెలుగు కవులు కావ్యాల్లో ఈ కోలాటాన్ని పేర్కొన్నారు. నాచన సోమనాథుడు ఉత్తరహరివంశంలో - శౌరి పాంచజన్యం పూరించినపుడు - "ఉర్రూతలాడెడు నుదయాస్తగిరులతో ఆకాశలక్ష్మి కోలాటమాడె" నని కల్పన చేశాడు (ఉత్తరహరివంశం 4.216)

ఆధునిక కవి పుట్టపర్తి నారాయణాచార్యుడు శ్రీనివాసప్రబంధంలో - హిరణ్యకశిపుని తపస్సు భంగం చేయడానికి అచ్చరలు దేశీనృత్యం చేశారని కల్పించాడు. (అప్సరసలు కోలాటం ఆడుతుంటే పట్టించుకోక, తపస్సులో నిమగ్నమైన గొప్ప అరసికుడు - హిరణ్యకశిపుడు అన్నమాట! :) )

దేశీనృత్యరీతులలో ఒకప్పుడు తెనుగువారి పాత్ర చాలా గణనీయమైనది, గర్వకారణమైనది. అయితే ఈ సాంస్కృతిక వారసత్వాన్ని కొనసాగింపలేక, పోగొట్టుకోవడం నేటి కాలపు తెనుగువారి అసమర్థత అని చెప్పుకోక తప్పదు.

2. చల్లీ:

ఆ ఘట్టంలోని రెండవ శ్లోకంలో "చల్లీ" అనే ఓ దేశీనృత్యాన్ని ప్రస్తావించాడు కవి.

కొందరు నర్తకీమణులు రెండు వరుసలలో సాభిముఖంగా నుంచున్నారు. వారు తమ తలలను ఒకే వరుసలో చేర్చి, సరళరేఖలో భుజాలపై భుజాలను చేర్చుకుని, తాళానికనుగుణంగా లయబద్ధంగా "చల్లీ" అనే నృత్యాన్ని చేస్తున్నారు.

శ్లోకాల్లో వివరణ చూస్తే, మనకు - అరకు లోయలో గ్రామీణులు చేసే "ధింసా" డాన్సు గుర్తుకు వస్తుంది. అయితే ధింసా నృత్యంలో రెండు వరుసలు లేవు. భుజాలపై భుజాలు వేసుకోవడం, తలలన్నీ ఒకే వరుసలో ఉండడం ఉన్నది.

ఈ చల్లీ నృత్యం గురించి అభినవభారతిలో (నాట్యశాస్త్రానికి అభినవగుప్తుని వ్యాఖ్యానం) అభినవగుప్తుడు పేర్కొన్నాడు. డోంబిక అన్నది ఉపరూపకం. ఈ ఉపరూపకంలో భాగంగా "చల్లీ" అనబడే నృత్యాన్ని హుడుక్కా (ఢక్కా) మ్రోగిస్తూ నర్తిస్తారు.

"క్వచిన్ నృత్తప్రాధాన్య యథా డోంబికాప్రయోగానంతరం హుడుక్కావాద్యావసరః అత ఏవ తత్ర లోకభాషయా చల్లి (చిల్లి) మార్గ ఇతి ప్రసిద్ధిః"- అభినవభారతి.

చిల్లి లేదా చల్లి అనేది ఒక నృత్తం. ఇందులో ఒక నర్తకి డక్కా ను రమ్యంగా మ్రోగిస్తూ ఉంటే నర్తకీమణులు నర్తిస్తూ ఉంటారు. సంగీతరత్నాకరంలో, జాయపసేనాని రచించిన నృత్తరత్నావళిలో కూడా "చాలి", లేదా "చలివాదం" అన్న నృత్తాన్ని లాస్యనృత్తంలో భాగంగా ఒకానొక దేశీ - జానపద నృత్తమని పేర్కొన్నారు. లాస్యం అంటే - శృంగారరసప్రధానమైన నృత్తం. చాలి/చాలివాదం అన్నది లాస్యాంగమట. అపభ్రంశసాహిత్యంలోనూ అక్కడక్కడా చల్లి/చలి అన్న దేశీనృత్యం యొక్క ప్రస్తావన ఉంది.

అబ్దుల్ రహమాను అన్న మహమ్మదీయుడు రచించిన 12 వ శతాబ్దపు అపభ్రంశపు సాహిత్యంలో చల్లి ప్రస్తావన ఉంది.

కే ఆయిన్నిహి వంసవీణకాహలమురఉ
కహ పయవణ్ణణిబద్ధఉ సుమ్మఇ గీయరఉ |
ఆయణ్ణహి సుసమత్థ పీణ ఉణ్ణయథణియ
చల్లహి చల్ల కరంతియ కత్థ వి ణట్టణియ ||

ఛాయ:
కేऽపి వంశవీణకాహలమురజ శబ్దానాకర్ణయన్తి
కుత్రాపి ప్రాకృతవర్ణైర్వివద్దో గీతరవాః శ్రూయతే |
కుత్రాప్యాకర్షణే సమర్థాః పీనోన్నతస్థన్యః
చల్లహి చల్ల శబ్దేన భ్రమణం కుర్వన్తః || (సందేసరాసకమ్ - 45
)

కవి సామోరా (సాంబపురం) అనే నగరాన్ని వర్ణిస్తూ అందులో భాగంగా చెపుతున్నాడు. నగరంలో కొందరు వీణ, వేణువు, మద్దెల, ఢక్కా వాయిద్యాలతో సంగీతాన్ని వినిపిస్తున్నారు. కొందరు ప్రాకృతగీతాలాపన చేస్తున్నారు. కొందరు ఉన్నతమైన కుచములు కల్గిన స్త్రీలు "చల్ల హి చల్ల" అన్న శబ్దం తో వలయాలు చుడుతూ నర్తిస్తున్నారు.

క్రీ.శ 11-13 వ శతాబ్దాల మధ్య ఈ చల్లి అనే దేశవాళీ నృత్యం భారతదేశంలో ప్రముఖంగా ఉండేదని పండితుల ఉవాచ.

౩. చర్చరి:

కర్పూరమంజరిలో ఈ చల్లి నృత్యప్రస్తావనకు ముందు చర్చరీగాయనులు వచ్చారు అని చెబుతాడు విదూషకుడు కపింజలుడు. చర్చరీ అంటే గీతి అని, ఓ విధమైన దేశీ నృత్యమని, చప్పట్లు అని, ఒకానొక ఛందస్సు అని అర్థభేదాలు ఉన్నాయి. చర్చరి గురించిన ప్రస్తావనలు కువలయమాల ఇత్యాది ప్రాకృత, అపభ్రంశ సాహిత్యంలో విపులంగానే ఉన్నాయి. కాళిదాసు విక్రమోర్వశీయంలో చర్చరి గురించి వేలాంకర్ అనే పండితుడు విపులంగా వ్రాశాడు.

నృత్తరత్నావళి ప్రకారం చర్చరి అంటే -

చర్చరీ మేతదేవాహుః వర్ణతాలాంచితేన చేత్
వాద్యేన ప్రవిశేయుః తాః గాయంత్యః చర్చరీం కలమ్,
ద్విపదీం వాథ శృంగార వీరాభ్యాం ఋతువర్ణనైః
నాయకస్య గుణఖ్యాతి ప్రఖ్యాపన పదోత్తరైః
మండలేన ప్రనృత్యంతి కాంతా వాసంతికోత్సవే
.

రాసకమనే నృత్యమునందే, నాయికలు వర్ణతాళములతో కూడిన వాద్యముతో, మధురముగా చర్చరిని కాని, ద్విపదిని కానీ పాడుచూ రంగమున ప్రవేశించి, శృంగారవీరరసములతో, నాయకుని గుణములను కీర్తిని వెలువరచు పదములు కలిగిన ఋతువర్ణనములతో మండలాకారమున వసంతోత్సవమునందు నర్తించుట చర్చరి అనబడును.

చర్చరి - తెలుగున జాజర అయింది. జాజర - కాకతీయులకాలంనుండి తెలుగునాట ఉంది. రైతులు పాడుకునే పాటల్లో జాజిరి పాట ఉందని "ఆంధ్రుల సాంఘిక చరిత్ర" లో పేర్కొన్నారు. బ్రతుకమ్మ పాటకు కూడా మూలం జాజర అని అంటారాయన.

వీణాగానము వెన్నెలతేట
రాణ మీఱగా రమణుల పాట
ప్రాణమైన పిన బ్రాహ్మణ వీట
జాణలు మెత్తురు జాజఱపాట
.

ఇది ఒక చాటువు. నాచనసోమన రచనలోనిదని తదజ్ఞులు ఉదాహరించారు. అన్నమయ్య ప్రముఖ కీర్తన - "జగడపు చనవుల జాజర, సగినల మంచపు జాజర..." మనకు తెలుసు.

శ్రీనాథుని భీమేశ్వర పురాణంలో జాజర/జాదర అని అచ్చరలు చర్చరీగీతాలు పాడారని అంటాడు.

జాదర, జాద రంచు మృదుచర్చరిగీతులు వారుణీ రసా
స్వాద మదాతిరేకమునఁ జంద్రిక కాయఁగ దక్షవాటికన్
వేదుల మీదటం గనక వీణలు మీఁటుచుఁ బాడి రప్సరల్
మోద మెలర్పఁగా భువనమోహనవిగ్రహు భీమనాథునిన్. - 5.103



****^^^^****

రాజశేఖరుని వ్యక్తిత్వం


రాజశేఖరునిది క్రీ.శ. 9 వ శతాబ్దపు కాలం. ఈతడిది "యాయవార" అనే వంశం. ఈతని దండ్రి దుర్దుకుడు. పితామహుడు - అకాలజలదుడనే కవి. బ్రాహ్మణుడైన రాజశేఖరుడు - చౌహాన క్షత్రియ యువరాణి అయిన అవంతిసుందరిని పరిణయమాడాడు. అది అనులోమ వివాహం. నాటికాలానికి అది ఒక గొప్పచర్య. అవంతిసుందరి కూడా గొప్ప కవయిత్రి. 

ప్రాచీనకవులలో రాజశేఖరునిలో కొట్టొచ్చినట్టు కనబడేది కవిత్వం ద్వారా కనబడే ఆయన వ్యక్తిత్వం. ఇదే ఆయన వ్యక్తిగతజీవితానికి అన్వయిస్తుంది. ప్రాచీనకాలంలో ప్రాకృత/అపభ్రంశ వాఞ్మయాలను సాహిత్యాలుగా, మొదట భాషలుగా గుర్తించడమే గగనంగా ఉన్నప్పుడు వాటిని గుర్తించినది దండి కవి. రాజశేఖరుడు ప్రాకృతాన్ని గుర్తించడమే కాక, అందులో సట్టకాన్నే రచించాడు. సట్టకం అన్నది - కొంత బౌద్ధంచేత ప్రభావితమైనదని పైన చూచి ఉన్నాం. అటువంటి సట్టకాన్ని రాజశేఖరుడు స్వీకరించి ఆ ప్రక్రియలో రచన చేయడం - ఆయన కాలానికి గొప్ప విషయం. ప్రాకృతంలో ఎందుకు రచించాలి? అంటే అందుకు రాజశేఖరుడు కర్పూరమంజరి నాటకారంభంలో చెబుతాడు.

పరుసా సంక్కిఅబన్ధా పాఉదబంధో వి హోఇ సుఉమారో |
పురుస మహిలాణాం జేత్తిఅ మిహంతరం తేత్తిఅ మిమాణం ||

ఛాయ:
పురుషాః సంస్కృతగుంఫాః ప్రాకృతగుంఫోऽపి భవతి సుకుమారః |
పురుషమహిళానాం యావదిహంతరం తేషు తావత్ |
|

పురుష సౌందర్యం కర్కశమైనది. స్త్రీసౌందర్యం సుకుమారమైనది. సంస్కృతప్రాకృతాల మధ్య వ్యత్యాసమూ ఇటువంటిదే. ప్రాకృతం స్త్రీసౌందర్యంలో సుకుమారమనోహరమైనది. అంతే కాదు; "ఉక్తివిశేషః కావ్యం భాషా యా భవతి సా భవతు|" (కావ్యమంటే ఉక్తివిశేషం భాష ఏది అన్న మీమాంస వద్దు) అంటాడు.

సాధారణంగా పండితకవులకు కొంత అహంకారం ఉంటుంది. కొందరు కవులకు వినయమే భూషణంగా ఉంటుంది. రాజశేఖరుడు ఈ విషయంలోనూ విలక్షణమైన వ్యక్తి. ఈయన మనస్తత్వం ఆ రెండు రకాల మనస్తత్వాలకు మధ్యన ఉంటుంది.

ఈయన తనను తాను వాల్మీకి అవతారంగా చెప్పుకున్నాడు.

బభూవ వల్మీకభవః కవిః పురా తతః ప్రపేదే భువి భర్తృమేణ్ఠతామ్ |
స్థితః పునర్యో భవభూతి రేఖయా స వర్తతే సంప్రతి రాజశేఖరః ||


ఆదికవి వాల్మీకి తదనంతరం భర్తృమేంఠుడుగానూ, ఆపై భవభూతిగానూ జన్మించినాడు. ఆపై ఇప్పుడు రాజశేఖరుడైనాడు.

పైకి ఇది కొంచెం స్వోత్కర్షలా కనిపిస్తుంది. మరో కోణంలో ఇది కవి - తనపై తాను చెప్పిన హాస్యస్ఫోరకమైన ఉక్తిగా కూడా అనిపిస్తుంది. లేదా ఆత్మవిశ్వాసప్రకటన కూడా కావచ్చును. రాజశేఖరుడు సరళ హృదయుడుగానే ఆయన కవిత్వం ద్వారా కపిస్తాడు. ఆయన తన అహంకారంతో ఇతర కవులను దూషించినట్లు, ఆక్షేపించినట్లు కనబడదు. (కావ్యమీమాంసలో అటువంటివి కనిపింపవు).

రాజశేఖరకవిలో కనబడే మరొక గొప్ప విశేషం - స్త్రీలను, అబ్రాహ్మణులను కవులుగా గుర్తించిన లాక్షణికులలో ఈయన ప్రముఖుడు. కవిత్వం - భాష, లింగం, జాతి విషయాలపై ఆధారపడి ఉండదని చెప్పిన ప్రముఖుడీ కవి. ఇది ఆయన కాలానికి గొప్ప సాహసమే.

సరస్వతీ పవిత్రాణాం జాతిస్తత్ర న దేహినాం |
వ్యాసస్పర్థీ కులాలోభూత్ యద్ద్రోణో భారతే కవిః |
|

సరస్వతిచే పవిత్రమైన కవులకు జాతి అనునది లేదు. కుమ్మరి అయిన ద్రోణకవి భారతరచన విషయమున వ్యాసునితో పోటీపడెను.

రాజశేఖరకవిని ఆయన తదనంతర కాలపు కవులు ఎన్నో సందర్భాలలో గుర్తుచేసుకున్నారు. ఆలంకారికులు అనేకసందర్భాలలో ఈయన కవిత్వాన్ని ఉటంకించారు. ఈయన తనను తాను ’కవిరాజు’ గా అభివర్ణించుకున్నాడు. కావ్యమీమాంసలో ’కవిరాజు’ - రకరకాల కవులలో ఒకానొక విధమైన కవి.

ఈ కవి గురించి సమగ్రంగా చెప్పటం ఇక్కడ వీలుపడదు. కొంతమేరకు ఇలా. కర్పూరమంజరి కావ్యాన్ని ఈయన తన భార్య - అవంతిసుందరి ప్రోద్బలంపై రచించానని చెప్పుకున్నాడు.



****^^^^****



ముగింపు


కర్పూరమంజరి - ఇది ఒక నాటిక. అంటే లఘునాటకం.ఈ నాటిక కథ, నాటక సంవిధానాల పరంగానూ, పరిమాణంలోనూ మృచ్ఛకటికమ్, ముద్రారాక్షసం వంటి నాటకాలలాగా విస్తృతమైనది కాకపోవచ్చు కానీ, సంగీతనృత్యప్రధానమైనది. మనం నేడు సంస్కృతనాటకాల గురించి చదువుకుని తెలుసుకుంటున్నాం.ఒకప్పుడు ఇవి రంగస్థలంపై ప్రయోగింపబడేవి. సట్టకంలో సంగీతము, నృత్యము - ప్రధానమైనవి కాబట్టి - సట్టకాన్ని తెరపై చూచినప్పుడు కలిగే అనుభూతి, చదివినప్పుడు కలుగదు. ఆ కారణం చేత మనకు ఈ నాటిక యొక్క సమగ్రమైన విలువ తెలియదు. అయితే దాదాపు 1200 యేళ్ళ క్రితం మన పూర్వీకుల యొక్క ఆలోచనలు, ఆనందాలు, కళలు ఇతరత్రా అనేకమైన విషయాలను ఈ నాటిక ద్వారా కొంత వరకూ తెలుసుకోవచ్చు. 


ఈ నాటికలో గుణాలే కాదు దోషాలను కొంత ప్రస్తావించుకోవాలి.

కావ్యప్రకాశంలో మమ్మటభట్టారకుడు కర్పూరమంజరిలోని ఈ క్రింది శ్లోకాన్ని గురించి వ్యాఖ్యానించాడు.

చిత్తే చిహుట్ఠఇ ణ ఖుట్ఠఇ సా గుణేసుం
సేజ్జాసు లోట్ఠఇ విసప్పఇ దిమ్ముహేసుం |
బోలమ్మి బట్టఇ పవట్టఇ కవ్వబంధే
జాణేణ తుట్ఠది చిరం తరుణీ చలాక్ఖీ ||

ఛాయ:
చిత్తే తిష్ఠతి న క్షీయతే సా గుణేషు
శయ్యాయాం లుఠతి విసర్పతి దిగ్ ముఖేషు |
వచనే వర్తతే ప్రవర్తతే కావ్యబంధే
ధ్యానేన త్ర్యుట్యతి చిరం తరుణీ చలాక్షీ |
|

బాగా చలాకీగా ఉన్న ఆ అమ్మాయి (కర్పూరమంజరి) పదేపదే గుర్తుకొస్తున్నది. గుణవంతురాలైన ఆ యువతి నన్ను నిదురపోనివ్వటం లేదు. అన్ని దిక్కులలో ఆమెయే కనిపిస్తున్నది. నా మాటల్లోను, కవిత్వంలోనూ కూడా ఆ స్త్రీయే చోటు చేసుకుంటున్నది. విరహబాధ పెడుతున్నది.

ఈ శ్లోకంలో విరహశృంగారం చక్కగా పోషించినా ట్ట కారం పలుమార్లు ప్రయోగించినందున రసవిరోధి అయింది అని, శబ్దం, శబ్ద స్వారస్యం విప్రలంభ శృంగారానికి అనుకూలంగా లేదని అంటాడు మమ్మటుడు.

అది అలంకారపరంగా, కవిత్వవిమర్శ. ఈ నాటికలో ప్రేక్షకుని పరంగా కూడా ఒకటి రెండు దోషాలు కనిపిస్తాయి. ఉదాహరణకు: భైరవానందుడు విదర్భయువరాణి కర్పూరమంజరిని సభలోకి ఆకాశం నుండి జాలువారేలా చేస్తాడు.ఆ సమయంలో - కవి ఆమెను ఏకవస్త్రగా, స్నానం చేస్తున్న సందర్భాన ఉన్న పళాన ఆమె అంతఃపురం నుంచి అదృశ్యం చేసి తీసుకువచ్చినట్టు కల్పించాడు. ఇది కొంచెం ఎబ్బెట్టుగా ఉంది. ఇందులో శృంగారం సున్నితంగా లేదనిపిస్తుంది.

భైరవానందుని పాత్ర కూడా కథలో లీనమైనట్టు కనబడదు.ఆతను కొన్ని ఘట్టాలలో వచ్చి, తన పాత్ర పరిధిమేరకు కార్యాలు చేసి పోతున్నట్టు అనిపిస్తుంది. 

ఏది ఏమైనా, ఈ సట్టకం 1200 యేళ్ళ క్రిందటిదని మనం గుర్తుపెట్టుకోవాలి. వేల యేళ్ళ క్రితం మన పూర్వీకుల అనుభూతులకు, ఆనందాలకు, ఆలోచనలకు, కళాభివ్యక్తికి - ఈ నాటిక ఓ చిన్న నిదర్శనం.ఆనాటి తరం సంస్కారాన్ని నేడు మనం చదువుకోవడంలో ఆనందం ప్రత్యేకమైనది కాదూ?

****^^^^****

References:


కర్పూరమంజరి - మకరంద వ్యాఖ్య - రామకుమార్ ఆచార్య - చౌఖాంబాప్రకాశన్

కర్పూరమంజరి - కావ్యమాలా సిరీస్ - Commentary by Vasudeva

కర్పూరమంజరి - Sten Konow

కర్పూరమంజరి - Dr. Manmohan Ghosh (Foreword)

కావ్యప్రకాశం - బాలానందినీ వ్యాఖ్య - పుల్లెల రామచంద్రుడు

కావ్యమీమాంసా - బాలానందినీ వ్యాఖ్య - పుల్లెల రామచంద్రుడు

ప్రాకృతభాషావాఙ్మయచరిత్ర - పుల్లెల రామచంద్రుడు

పుల్లెల వారి వ్యాసమంజరి - పుల్లెల రామచంద్రుడు

Indological studies : HC Bhayani

నాట్యశాస్త్రం - పోణంగి రామ అప్పారావు

అభినవభారతి - మానవల్లి రామకృష్ణకవి

ఆంధ్రదశరూపకం - మల్లాది సూర్యనారాయణశాస్త్రి

దశరూపకం - చౌఖాంబా ప్రకాశన్

ఆంధ్రుల సాంఘిక చరిత్ర - సురవరం ప్రతాపరెడ్డి.

sandesa Rasaka - sindhi Jain Series. (Abdul Rahman )

జాయపసేనాని నృత్తరత్నావళి - రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ

Sanskrit Drama its Aesthetics and Production - Raghavan V.

Bhoja SrngaraPrakaSa - Foreword by Raghavan V.

Kalidasa - Raghavan V

స్వారోచిషమనుసంభవమ్ - అల్లసానిపెద్దన - వావిళ్ళవారి ప్రతి. శేషాద్రి రమణకవుల వ్యాఖ్యానం.

ఉత్తర హరివంశం నాచనసోమనాథుడు - వావిళ్ళ వారి ప్రతి.

శివతాండవము - పుట్టపర్తి నారాయణాచార్యులు.

శ్రీనివాసప్రబంధం - పుట్టపర్తి నారాయణాచార్యులు.

బృహదారణ్యకమ్ వ్యాసావళి - తిరుమల రామచంద్ర

విక్రమోర్వశీయమ్ - HD వేలంకర్.

****^^^^****



శుభమ్.




కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Comments ridiculing, abusing, bullying and forcing to agree in any form, if objectionable to the blog owner will be removed.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వాఙ్మయచరిత్రలో కొన్ని వ్యాసఘట్టాలు - శ్రీ ఏల్చూరి మురళీధరరావు గారు.

Disclaimer

అశోకుడెవరు? - 1