ముకుందవిలాసః - కుంటిమద్ది శేషశర్మ.
ముకుందవిలాసః అని ఒక శతకం. మొత్తం అంతా సంస్కృతంలో ఉంది. ముందుమాట - కప్పగంతుల లక్ష్మణశాస్త్రి గారు వ్రాశారు. అదీ సంస్కృతంలోనే ఉంది.(ఇక్కడి తాత్పర్యాలు నావి)
ఇది ముకుందుని లీలలను స్తుతిస్తూన్న స్తుతి కావ్యం. స్తుతికావ్యం కనుక గొప్ప వర్ణనలు, అనూహ్యమైన ఉపమలు, జిగేలుమనే పోకడలు లేవు.
అయితే ఆశ్చర్యం గొలిపేదేమంటే - ఇంత సులభంగా, అనాయాసంగా సంస్కృతం వ్రాయవచ్చా అని ప్రతిశ్లోకమూ స్ఫురింపజేస్తుంది.
పుస్తకంలో 7 విధాల విలాసాలు ఉన్నాయి. బాల, ప్రౌఢ,దూత, ఆచార్య, సారథి, లీలాలోల, శరణ్యమని వివిధ ముకుందవిలాసాలు.
శ్రీవత్సచిహ్న! అన్న నిర్దేశంతో మంగళకరంగా ఈ శతకం ఆరంభం అవుతుంది.
బాలముకుందవిలాసం లో రెండవశ్లోకం చూడండి.
కారాగృహం స్వతనుకోమలకాంతిపూరై
రాపూరయంత మరవిందదళాయతాక్షమ్
ఆనందఖేదజనకం సకృదేవమాతుః
గోపాలబాలకముకుందమహం నమామి.
కోమలమైనకాంతులతో కూడిన తన గాత్రపు కాంతితో చెరసాలను నింపుతున్న, తామరపూరేకులవంటి వెడదకన్నులవాడు, పుడుతూనే అమ్మకు దుఃఖాన్ని, ఆనందాన్ని పంచిన - గోపాలబాలకుడైన ముకుందుని నమస్కరిస్తున్నాను.
వసంతతిలకం ఇది. (శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం - అన్న వేంకటేశ్వరసుప్రభాతపు కోవ).
ఈ బాలముకుందవిలాసంలో వసంతతిలకంలోనే మిగిలిన పద్యాలు ఉన్నాయి.
కాదంబినీ రుచిర మోహనదేహకాంతిం
కాదంబపాండు మధురస్మితభాసమానం
ఫుల్లత్కదంబ సుమహార విరాజమానం
గోపాలబాలకముకుందమహం నమామి.
దట్టమైన మేఘపు కాంతివాడు, హంసవంటి తెల్లని చిరునగవు వాడు, వికసించిన కడిమిపూల హారాన్ని తాల్చి ప్రకాశించున్ వాడు అయిన - గోపాలబాలకుడైన ముకుందుని నమస్కరిస్తున్నాను.
జగన్నాథపండితరాయలు మాధుర్యగుణాన్ని గురించి చెబుతూ, అపరుషవర్ణఘటితత్వం, అల్పసమాసయుక్తం - అంటాడు. అంటే కఠినమైన పదాలు, ద్విత్వములు (వత్తులు) విరివిగా ఉండకపోవడం, సమాసాలు అనాయాసంగా ఉంటే ఆ కూర్పు మాధుర్యగుణాన్ని సూచిస్తుందట.
శేషశర్మ గారి కృతిలో ఉన్న ప్రధాన లక్షణం ఇది. ఈయన శైలి కూడా జగన్నాథ పండితుని శైలిని పోలి ఉండడం విశేషం.
అయితే జగన్నాథుని శైలిని బాగా తరచి చూస్తే కొన్ని శబ్దాలు (ముఖ్యంగా క్వాపి, కాచన ఇత్యాది) ఆవృత్తిగా కనిపిస్తాయి. అది లోపం అని చెప్పదగ్గది కాదు కానీ ఒక్క పిసరు భిన్నంగా కనిపించేది. ఆ లక్షణం తక్క మిగిలినవి శేషశర్మ గారి బాలముకుందవిలాసంలో శైలిలో కనిపిస్తాయి.
ప్రౌఢ ముకుందవిలాసం మరొకనవ్యసీమలో అడుగుపెట్టినట్లు ఉంది.
సురముని వరవాణీ సూచికాభిః ప్రభిన్నాం
ప్రణయ కలహరుష్యద్భామినీం సత్యభామాం
చరణతల హతస్సన్ దక్షిణోయోనునిన్యే
దిశతు సతు ముకుందో భవ్యమవ్యాహృతం నః.
దేవర్షి నారదుని ఉచితమైన సూచనకు వ్యతిరేకమంగా నడుచుకుని, ప్రణయ కలహంతో రోషాన్ని పొందిన సత్యభామను, ఆమె కాలితాపుతో తన్నినా మంచిమనసుతో అనునయించిన ముకుందుడు మనకు అనంతమైన భవ్యములను చూపుగాక!
ఈ పద్యంలో దక్షిణః అన్నది చక్కని శబ్దం. దక్షిణుడు అంటే చక్కని మన్స్సు కలిగినవాడని సాధారణార్థం. అనేకపత్నులు ఉన్నా అందర్నీ సమంగా చూచుకునే నాయకుడని (నాట్య) శాస్త్రార్థం.
సారథిముకుందవిలాసం ఇంకా అందంగా ఉంది. ఇది జలపాతపు ధార!
అక్షౌహీణ్యస్స వనపశవ స్సైనికానాం, కవోష్ణం
రక్తం సర్పి స్సమరసవనే ధర్మరాజస్తు యష్టా,
దుష్టా2ధర్మ ప్రశమఫలే యజ్ఞభోక్తాతు యోసౌ
పాయాదస్మాన్నిజపదయుగీ న్యస్తభారాన్ముకుందః.
అక్షౌహిణులకొద్దీ ఉన్నా పశువులవంటి సైనికుల రక్తం స్రవిస్తుండగా, దుష్టుల అధర్మాన్ని నశింపజేసే ఫలాన్ని పొందే విధంగా సమరమనే యాగాన్ని ధర్మరాజుతో జరిపించి, యజ్ఞభోక్తగా ఉన్న వాడైన ముకుందుడు, అతని పాదములు మమ్ము భారములనుంచి తప్పించి కావుము గాక!
తర్వాతి అధ్యాయం చిన్న వాగులాంటి ధార!
దరకర చరణాబ్జ దాసశేష
గ్రథితమిదం మురభిత్ విలాసరమ్యం
హరిపదయుగళీ సువర్ణపుష్పం
భవతు ముకుంద విలాసనామ కావ్యం.
ఇది చివరి పద్యం.
ఇది హరిపదాలకు సమర్పించిన కుసుమమే కాదు, గీర్వాణవాణికి సమర్పించిన కుసుమం కూడా.
******
ఎ కృతి తాలూకు పీడీఎఫ్ ను ఈ క్రింది లంకె నుంచి దింపుకోవచ్చు.
https://archive.org/details/mukunda-vilasah
******
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Comments ridiculing, abusing, bullying and forcing to agree in any form, if objectionable to the blog owner will be removed.