వీచిక - 2


దోహదక్రియ.


హైటెక్ సిటీ రహేజా వారి కాంపస్ లో ప్రధానద్వారానికి కుడి వైపు బాట పక్కన చక్కని పూలచెట్లు కూర్చారు.పొద్దున లేయెండలో రోడ్డుపై హడావుడి పడుతున్న వాహనాల ప్రక్కన అనాయాసంగా చెట్టు నుండి రాలిన ఒక తెల్లటి పూవును తీసుకోవడం, జేబులో పెట్టుకోవడమో లేక ఎవరూ తొక్కకుండా పక్కన చెట్టు దగ్గర విడిచిపెట్టడమో చేయటం ఎంత ఆనందకరమైన పని!

నిన్నటి వరకూ ఆ తెల్లని పూవు పేరు తెలియదు. అది అశోక పుష్పజాతికి చెందినదట. అశోకపుష్పాలు సాధారణంగా ఆరంజ్ రంగులో ఉంటాయని గూగులు. దీన్నే రక్తాశోకమంటారుట. రామాయణంలో రావణుడు సీతమ్మను ఎత్తుకొచ్చి పెట్టిన చోటు అశోక వనం - ఈ ఆరంజ్ రంగు పూలతో నిండిన చెట్లదేనట. అయితే నేను రోజూ చూస్తున్న తెల్లటి పూల చెట్టు అశోక జాతిదని ఒక పాతభారతి సంచిక తిరగేస్తుంటే కనిపించింది.

నిజానికి అశోకచెట్టు అంటే క్రిస్మస్ చెట్టు లా పొడుగ్గా పెరిగిన చెట్టని చిన్నప్పటి నుంచి వింటూ వస్తున్న విషయం. బడిలో సంస్కృతం చదువుకుంటున్న రోజుల్లో అయ్యవారు కూడా ఓ మారు అశోకచెట్టును చూపి ఒక ఆశ్చర్యమైన విషయం చెప్పినట్టు చూచాయగా తెలుసు. ఆయన చూపిన అశోకచెట్టు (Polyalthia longifolia) తప్పు. అయితే అయ్యవారు చెప్పిన ఉదంతం తాలూకు శ్లోకం ఇది.

పాదాహతః ప్రమదయా వికసత్యశోకః
శోకం జహాతి వకుళో ముఖసీధుసిక్తః |
ఆలోకితః కురవకః కురుతే వికాసం
ఆలోడితస్తిలక ఉత్కలికో విభాతి ||

అశోకచెట్టు పూలు బాగా పూయాలంటే ఒక తరుణయువతి గోరింటాకు/పారాణి పెట్టుకున్న తన పాదాన్ని ఆ చెట్టును తాకించాలి. అలాగే పొగడపూవు - అమ్మాయి చెబుతున్న ఊసులు వింటే తన శోకాన్ని విడిచి వికసిస్తుంది. కురవకమేమో రోజూ అమ్మాయి తనను చూస్తే చాలు, పొంగిపోతుంది. కుంకుమపూవును కావిలించుకుంటే పులకిస్తుంది!

పై వరుసలో మా అయ్యవారు స్కూల్లో చెప్పింది ఒక్క అశోకాన్ని గురించే. అదీనూ అర్థం మాత్రమే గుర్తుంది. పూలు పూయటానికి అమ్మాయి చేసే చర్యలను దోహదక్రియ అంటారు. (దోహదమంటే ఎరువు). కర్పూరమంజరి అనే ప్రాకృతనాటకంలో నాయిక ఈ దోహదక్రియలను జరుపుతుంది. తరుణదశలో ఉన్న పూల కొమ్మ అమ్మాయి గాఢంగా కౌగిలింపగానే పూలతో నిండి, మదనశరంలా వికసించిందని ఉత్ప్రేక్షిస్తాడు ప్రాకృత కవి.


బాలోऽపి కురబకస్తరుస్తరుణ్యా గాఢముపగూఢః |
సహసేతి పుష్పనికరం మదనశరమివ సముద్గిరతి || (కర్పూరమంజరి - రెండవ జవనికాంతరమ్)

బాల అయినా, ఆ కురవక తరువు, అమ్మాయి చేత గాఢంగా కౌగిలింపబడినదై, వేల పూలు విప్పారి, మదనశరంలా తీక్షణమైనది.

***************************************************

కాళిదాసు రఘువంశంలో ఒక శ్లోకం ఇదీ.

స్మరతేవ సశబ్దనూపురం చరణానుగ్రహమస్య దుర్లభమ్ |
అమునా కుసుమాశ్రువర్షిణా త్వమశోకేన సుగాత్రి శోచ్యసే ||

అజమహారాజు భార్య ఇందుమతీదేవి మరణించినప్పుడు ఆతని మనోవేదన ఇది. - "ఓ సుతను! నీ అందెలరవళులతో కూడిన పాదాల అనుగ్రహం ఇక దొరకదు అని చింతిస్తూ అశోకపుష్పాలు నీ మృతదేహంపై పూలవర్షాన్ని తమ కన్నీరులా కురిపిస్తున్నాయి."

ఘుప్పుమని తాకుతోంది కదూ ఈ భావం! బహుశా కాళిదాసు ఒక్కడే ఇంత చక్కని శబ్దాలతో, ఇంత అందమైన భావాన్ని ఇంత క్లుప్తంగా వ్రాయగలడేమో! అమ్మాయిలకీ, పూలతీవెలకూ మధ్య కెమిస్ట్రీ కూడా కాళిదాసుకు బాగా తెలుసేమో. అందుకనే విక్రమోర్వశీయంలో ఊర్వశిని తీవెలా అయిపోమని, తిరిగి పురూరవసుడు కావిలించుకుంటే అమ్మాయి కమ్మని తీయని శాపాన్ని సృష్టించాడు!

అశోకం అని పేరెట్టుకున్న ఈ పూవు శోకసందర్భాల్లోనే ఎక్కువగా కనబడ్డం ఓ విచిత్రం!

*********************************

మన ధవళ అశోకానికి వద్దాం.

ఈ పూలు మా ఆఫీసు దగ్గర, వచ్చే దారిలోనూ చాలా ఉన్నాయి. పూలపైనా, ప్రకృతిపైనా చూపే లేని ఈ రోజుల్లో, దారిన పోయే అందమైన అమ్మాయిల్లో యే అమ్మాయీ ఈ అశోకాన్ని పట్టించుకునేట్టు లేదు. మనం చాలా ఆధునికులం. చెట్టుకు ఆహారం సూర్యరశ్మి, నీరు అని, వాటిని కలగలిపి కిరణజన్యసంయోగక్రియ ద్వారా పత్రహరితం తయారు చేసుకుంటాయని అని తార్కికంగా ఆలోచించి యే టీవీ షో లోనో చెప్పగలం.

కానీ అమ్మాయి పాదం తాకితేనో, చూపు చూస్తేనో, పలకరిస్తేనో, చిర్నవ్వితేనో పూలు వికసించడమంటే ఒప్పుకోవడమూ, నమ్మడమూనా ! షిట్!

*********************************

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వాఙ్మయచరిత్రలో కొన్ని వ్యాసఘట్టాలు - శ్రీ ఏల్చూరి మురళీధరరావు గారు.

అశోకుడెవరు? - 1

ముకుందవిలాసః - కుంటిమద్ది శేషశర్మ.