2, జనవరి 2019, బుధవారం

అశోకుడెవరు? - 2



నేటి ఆఫ్ఘనిస్తాన్ లో కాందహార్ వద్ద బమియాన్ అన్న చోట, చాలాకాలంగా ఎన్నో అడుగులు ఎత్తైన బుద్ధుని విగ్రహం ఉండేది. క్రీ.శ. 2001లో ఈ బుద్ధ విగ్రహాన్ని తాలిబాన్లు అనబడే ముష్కరులు డైనమైట్లు పెట్టి పేల్చేశారు. ప్రపంచమంతా ఈ చర్యను గర్హించింది.

ఇలా విగ్రహాన్ని కూల్చెయ్యటం అనేది చాలా మొరటుపద్ధతి. ఇదే పనిని ఒకవేళ ఆంగ్లేయులు చేయదల్చుకుని ఉంటే? వారు ఆ పనిని నాజూకుగా చేయగలరు. వారు ఆ విగ్రహాన్ని కాకుండా, ఆ విగ్రహనిర్మాణానికి మూలకారణమైన సంస్కృతిని, ఆ చరిత్రను, భాషను, సాంప్రదాయాలను నామరూపాల్లేకుండా చేసి ఉండేవారు. బౌద్ధం పాటించే సమాజంతోనే, ఆ బుద్ధవిగ్రహాన్ని ’తమది కాద’నిపించి ఉండేవారు. అదీ ఆంగ్లేయుల గొప్పదనం. నీకు చెందని దాన్ని - నీది అనిపించాలన్నా, నీకు చెందిన దాన్ని - నీవే తిరస్కరించేట్టు చేయాలన్నా - ఆంగ్లేయులు కల్పించుకుంటే చాలు. వారు ఆ విషయం లో సిద్ధహస్తులు. లోకోత్తరఖ్యాతి గడించిన వారు. భారతదేశాన్ని దోచుకోవడమే పరమావధిగా ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా భారతదేశానికి వచ్చిన ఈ ప్రబుద్ధులు వ్రాసిన భారతదేశ చరిత్ర వెనుక - ’తమ దోపిడీ’ ని సమర్థించుకోవడమే ప్రధానమైన కారణం. అంటే "ఒరే భారతీయుడా! నీ దేశాన్ని తరతరాలుగా ఎవడో ఒకడు దోచుకుంటూనే ఉన్నాడు. నీవు ఎప్పటికీ బానిసవే. ఒకప్పుడు అలెగ్జాండరూ, చెంఘిజ్ ఖాను, ఆపై మొఘలు వాళ్ళు, ఇప్పుడు మేము. మేము ఇంకా మేలు. దోచుకోవడానికి వచ్చినా, నీకు సభ్యత నేర్పాం. నీకు ఎన్నో విషయాలు చెప్పాం. ఒకవేళ మీ దేశంలో పూర్వమేదైనా మంచి అన్నది ఉంటే అది కూడా ఎవడో వచ్చి చేసిందే. మీకంటూ సంస్కృతీ, సాంప్రదాయం అంటూ ఏదీ లేనే లేదు. లేదు గాక లేదు." ఇదీ అక్కడ మెసేజ్.ఇక్కడితో ఆగింది లేదు. దోచుకున్న వాళ్ళను "కల్పించడం" లో కూడా వీరు తలపండిపోయారు. అలా కల్పనతో మొదలయినదే, అంతకు మునుపు ప్రపంచ సాహిత్యంలోనూ, చరిత్రలోనూ ఎక్కడా లేని ఆర్యుల వ్యవహారం.  దీన్ని ఏదో బలవంతంగా కాక, చాలా లోతైన పద్ధతుల్లో చెప్పడం ఆంగ్లేయుల విశిష్ఠత.

’సమ్రాట్ మౌర్య అశోక’ ను గురించి మనం ఈ రోజు వింటున్న విషయాలేవీ క్రీ.శ. 1838 కి ముందు నామమాత్రమైన ప్రచారంతో కూడా భారతదేశంలో లేవు. మరి ఈ రెండు శతాబ్దాల్లో ఈయన గురించి, ఇన్ని విశేషాలు ఎలా ప్రాచుర్యంలోనికి వచ్చేయి? ఆయన చెక్కించిన ’మూడు సింహాల’కు, 24 ఊచల చక్రానికి అంత ప్రాముఖ్యత ఎలా ఏర్పడింది? మననోటనే మనకు చెందని చరిత్ర మనదని ఎలా చెప్పుకునే పరిస్థితి ఎలా ఏర్పడింది? ఇవి తెలియాలంటే, ప్రపంచ సాహిత్యంలో అశోకుని ప్రస్తావనలు తెలియాలి. ఇది మనం ఇది వరకు మాట్లాడుకున్నాం.

ఇంకా విలియమ్ జోన్స్ గురించి, ఆపై జేమ్స్ ప్రిన్సెప్ గురించి తెలియాలి. విలియమ్ జోన్స్ గురించి కూడా ఇది వరకు మాట్లాడుకున్నాం. ఆంగ్ల ప్రబుద్ధులు - ఎంత అవకతవకల చరిత్రను సృష్టించారో, బైబిల్ ను అడ్డుపెట్టుకుని క్రీ.పూ. 4000 కు ముందు సృష్టే లేదని, ఆడమ్ అంటే మనువు అని ఎలా నమ్మింపజూశాడో ఆ వివరాలు ఈ మధ్య వెలుగుచూసినవి. ఆ జోన్స్ కు వారసుడు ప్రిన్సెప్. ఇప్పుడు ప్రిన్సెప్ గురించి మాట్లాడుకోవాలి.

జేమ్స్ ప్రిన్సెప్ (20 August 1799 – 22 April 1840)

భారతదేశంలో ఆధునిక కాలంలో మొట్టమొదట అశోకుని ప్రస్తావన జేమ్స్ ప్రిన్సెప్ అనే ఆంగ్ల పండితుడి ద్వారా మొదలయ్యింది. విలియమ్ జోన్స్ అనే అతడు చంద్రగుప్తుని కాలాన్ని క్రీ.పూ. మూడవ శతాబ్దంగా "ఏకపక్షం"గా తీర్మానించేసిన తర్వాత కాలంలో జేమ్స్ ప్రిన్సెప్ - ఆసియాటిక్ సొసైటీ కి అధిపతి అయ్యాడు.  ఈయన సర్ విలియమ్ జోన్స్ లా కాకుండా కొంతమేరకు నిజంగా సబ్జెక్ట్ పైన ఆసక్తితో పనిచేసినాడనాలి. కానీ వ్యక్తులపై వారి సంస్కృతి ప్రభావం బలంగా ఉంటుంది. ఈయనకూ చరిత్ర అంటే - తేదీలని, వ్యక్తులని, తమ పూర్వీకులు చెప్పిన దాన్ని తిరిగి ప్రశ్నించడం కూడదని - ఇటువంటి భావాల నేపథ్యమే ఉంది. అయితే, ఈతడు కొంతమేరకు భావుకుడు, చిత్రకారుడు, పరిశోధకుడు. బ్రాహ్మీ లిపిని చదవడం సాధ్యపడింది ఈతని అభిరుచి వల్లనే. అందుకు ప్రిన్సెప్ కు అభినందనలు చెప్పుకోవలసిందే.

భారతీయులకు సాంప్రదాయపరంగా, వారి మనస్తత్వంలో సాధారణంగా కొన్ని లోపాలు ఉన్నాయి. ఏ రంగంలో అయినా, ఎవరైనా కొంత పరిశ్రమ చేసి, గొప్ప పేరు తెచ్చుకొంటేనో లేక మన్ననలు పొందితేనో ఆ వ్యక్తిని - విపరీతంగా భజన చెయ్యటం, ఆతణ్ణి దైవాంశసంభూతునిగా ఉద్యోతించటం, ఆతని పరిశ్రమను విమర్శనాత్మకంగా చూడక, అందులో మంచిచెడ్డలెంచక అదే తరహాలో పొగుడుతూ నెత్తికెక్కించుకోవటమూ భారతీయుల బలహీనత.

అయితే ఏ రంగంలో అయినా, వ్యక్తులకన్న సబ్జెక్ట్ గొప్పది. ఆ సబ్జెక్ట్ కన్నా భాష గొప్పది. అంతకన్నా సంస్కృతి గొప్పది. అందుచేత ఆయన చేసిన అశోకుని ప్రస్తావన పూర్వాపరాలను తప్పనిసరిగా తరచిచూడాలి. ప్రిన్సెప్ ను మెచ్చుకుంటే పర్లేదు కానీ, ఆతడు చెప్పిన ప్రతి విషయానికీ ఊ కొట్టనక్కర్లేదు.

జేమ్స్ ప్రిన్సెప్ - రాయల్ ఆసియాటిక్ సొసైటీ పత్రికకు సంపాదకుడు. ఈయన మొదటి ఆసక్తి - నాణాల సేకరణ, వాటి స్టడీ. ఈయన ఈ ఆసక్తి ఉంది కాబట్టి, పైగా ఆంగ్లేయుల పరిపాలన సాగుతోంది కాబట్టి, ఎక్కడెక్కడి నుంచో ఈయన స్టడీ అవసరార్థం నాణేలు వచ్చి పడినై.  అదే ఆసక్తిని ఈయన శాసనాలపై కూడా విస్తరింపజేసుకున్నాడు.

ఈ నేపథ్యంలో ఈయనకు ఎదురైన శాసనం అలహాబాద్ స్థంభశాసనం. ఈ స్థంభంపై మూడు శాసనాలు ఉన్నై. ఒకటి మొఘల్ రాజయిన జహంగీరు ది. మరొకటి సముద్రగుప్తునిది. ఇంకొకటి ’దేవానాం పియదస్సి’ అనబడే ఒక రాజుది.

ప్రిన్సెప్ - తనకు దొరికిన ఆధారాలతో ఈ ’దేవానామ్ పియదస్సి’ ని శ్రీలంకకు చెందిన ’తిష్యుడని భావించాడు. ఆపైన తను ఆ శాసనాన్ని "తొందరపాటుగా, అరకొరగా" ప్రచురించిన కారణాన్ని చెప్పి, అలా ప్రచురించటం వలన మిగిలిన పండితులు (అంటే కేవలం "ఆంగ్లపండితులు" మాత్రమే) ఈ విషయంపై మరింత స్పష్టంగా చెప్పగలరనీ, ఆ ఉపయోగాన్ని ఆశించే తను అలా అరకొరగా ప్రచురించానని చెప్పాడు. తన ఆశయం నెరవేరిందని ఈ విషయం పై Turnour అనే పండితుడు సమాచారాన్నందించాడని చెప్పుకొచ్చాడు.

ఆ తర్వాత కాలంలో ప్రిన్సెప్ కొలంబో కెళ్ళాడు. లంకలో అనూరాధాపురంలో దొరికిన "మహావంశో" అన్న పుస్తకంలో ఓ చోట "ధర్మ అశోకుణ్ణి" - "ప్రియదస్సి" అని పేర్కొన్నారని ఈయన ఆ ప్రతులను చూశాడు. దరిమిలా ఈయన చెప్పిన కొన్ని పాయింట్స్.

Princep's assumptions to decide the Asoka inscritpions.

***********‌‌^^***********

మహావంశంలో "పియదస్సి" అనే పిలుపు ధర్మ అశోకుడిని ఉద్దేశించి ఉన్నది.

Mah. 5. 21:

Jinanibbanato paccha pura tassabhisekato |
Sattharasam vassasatadvayam evam vijaniyam ||

'After the Nirvana of the Conqueror and before his
(Asoka's) consecration there were 218 years; this should be
known/

దీపవంశంలోనూ అలాంటిది.

The Dip. 6. 1, says:
dve satani ca vassani attharasa vassani ca |
sambuddhe parinibbute abhisitto Piyadassano ||

Meaning: * 218 years after the Sambuddha had passed into Nirvana
Piyadassano (Asoka) was consecrated. 

ప్రాకృతం:
ద్వే సతాని చ వస్సాని అత్తరస వస్సాని చ |
సమ్బుద్ధే పరినిబ్బూతే అభిసిత్తో పియదస్సినో ||

సంస్కృత ఛాయ: (ప్రిన్సెప్ ప్రచురించినదే)
ద్విశతవర్షాః అష్టాదశ వర్షాశ్చ |
సంబుద్ధే పరినిర్వృతే అభిషేకః ప్రియదర్శినః ||

తాత్పర్యం : సంబుద్ధుడు గతించి, నిర్వాణమందిన 218 ఏళ్ళకు తర్వాత ప్రియదర్శి (సింహాసనమును) అధిష్టించెను.

ఆ తర్వాత కొన్ని లైన్ల తర్వాత అదే పుస్తకంలో ఇలా ఉన్నది.

Chadaguttassdyan nattdnatta Bindusdrassa,
atrajo rajaputto tddd asi Ujjdnikaramolino*.

ప్రాకృతం:
చంద్రగుత్తస్స యన్నత్త బిందుసారస్స యత్రజో |
రాజపుత్తో తదా అసి "ఉజ్జేని" కరమోలినో ||

సంస్కృత ఛాయ: (ఇదీ ఆయనదే)
చంద్రగుప్తస్య అయం నప్తునృప్తా బిందుసారస్య అత్రజః |
రాజపుత్ర తదా అసిత ఉజ్జయినోకర మూర్తినః ||

This the grandson of the grandson of Chandragupta, and the own royal
son of Bindusa’ra, was at that time the taker of the revenue of Vjjain.

చంద్రగుప్తుని మనవడు, (నప్తః = మనవడు) బిందుసారుని కొడుకు ఆ కాలంలో ఉజ్జయిని ని తీసుకొనెను.

- ఈ ఉట్టంకింపుల నుండి పియదస్సి - అంటే అశోకుడని, చంద్రగుప్తుని మనవడని, (ఈ చంద్రగుప్తుడు ఎవడు? అదివరకే దైవాంశ సంభూతుడైన విలియమ్ జోన్స్, తన సహచరుల అభ్యంతరాలను ఖాతరు చెయ్యక, ఏకపక్షంగా నిర్ణయించిన  అలెగ్జాండర్/సెల్యూకస్ సమకాలికుడు! - బుద్ధుడు మరణించిన తర్వాత 218 ఏళ్ళకు ఈతని పట్టాభిషేకం జరిగిందని, దరిమిలా బుద్ధుడు అశోకుడికి 218 ఏళ్ళకు ముందువాడని తేల్చాడు.)

సరిగ్గా ఈ అరకొర వాదాలతో చేసిన నిరూపణనే మనం మన పిల్లల పాఠ్యపుస్తకాలలో మొదలుకొని దేశమంతటా నేటికీ చదువుకుంటున్నాం.


ప్రిన్సెప్ పరిశోధన

పై వాదంలో లొసుగులు ఏమిటి?

౧.  పియదస్సి - అన్నపేరు - అశోకుడి గుత్తసొమ్ము కాదు. ఇది భారతదేశంలో అనేకులకు ఉన్నది. ప్రియదర్శి - అంటే అందమైన వాడు. లేదా చక్కగా కనిపించువాడు. ఇది ఓ మోస్తరుగా ప్రాచీనభారతదేశంలో కనిపించే విశేషణం.
- ముద్రారాక్షసంలో చంద్రగుప్తుడు ప్రియదర్శి.
- గౌతమీపుత్రశాతకర్ణి - నాసిక్ శాసనంలో పియదస్సి గా పేర్కొనబడ్డాడు.  లంకెలోని బొమ్మలో నాలుగవ శ్లోకం ఆరంభం.
- సాక్షాత్తూ ప్రిన్సెప్ - దేవానాం ప్రియదర్శిని - మొదట సిలోన్ రాజయిన "తిష్యుడు" అనుకొన్నాడు.
- హర్షవర్ధనుడు ప్రియదర్శి. ఈయన రచించిన ఒకానొక నాటకం పేరు కూడానూ ప్రియదర్శికా.
- కావ్యాలలో అక్కడక్కడా ప్రియదర్శి శబ్దం ఉంది.
- కుమారగుప్తుడు కూడా ప్రియదర్శి. (ఈ పక్షాన - చంద్రగుప్తుడు - గుప్తచంద్రగుప్తుడు అని పురాణాధారం కరెక్టుగా సరిపోలుతుంది)
- అంతెందుకు? వాల్మీకి రామాయణం బాలకాండ ఆదిలోనే "ప్రియదర్శి" శబ్దం అనేకమార్లు ఉంది.

चारित्रेण च को युक्तः सर्वभूतेषु को हितः |
विद्वान् कः कः समर्थश्च कश्चैकप्रियदर्शनः || १-१-३
(कश्चैकप्रियदर्शनः = who is also uniquely pleasant to look at)

सर्वदाभिगतः सद्भिः समुद्र इव सिन्धुभिः |
आर्यः सर्वसमश्चैव सदैव प्रियदर्शनः || १-१-१६

विष्णुना सदृशो वीर्ये सोमवत्प्रियदर्शनः |
कालाग्निसदृशः क्रोधे क्षमया पृथिवीसमः || १-१-१८

(అలాగే దేవానాం ప్రియ కూడా అశోకుడికి మాత్రమే అని చెప్పేందుకు వీలు లేదు. అజాతశత్రువు "దేవానాం ప్రియుడు" అని "అనుపపతిక సూత్ర" అనే ఒకానొక బౌద్ధగ్రంథంలో ఉంది. ఇంకా ఈ దేవానాం ప్రియ కు వివిధ ఆధారాలు కలవు)

దరిమిలా - కేవలం పియదస్సి - మహావంశో/దీపవంశో లో కనిపించిందన్న ఒక్క నిదర్శనంతో శాసనపు వ్యక్తిని అశోకుడిగా తీర్మానించటం కుదరదు. ఇది ప్రిన్సెప్ అత్యుత్సాహమూ, భారతదేశసంస్కృతి తెలియమి కూడా.

౨. ప్రిన్సెప్ చేసిన వాదంలో "ఉత్సాహం" ఎక్కువగా ఉన్నది కానీ అనేక వాదాలను సమన్వయించే దృక్పథం లేదు.ఆ దృక్పథం ఆంగ్లేయుల ఆలోచనలోనే లేదు. ఒక్క పియదస్సి అన్న శబ్దం, ఆ శాసనంలో కనిపించే బౌద్ధపు ఛాయలను బట్టి ఆయన అత్యుత్సాహంతో అశోకుడి శాసనంగా తీర్మానించడమే కనిపిస్తున్నది.

౩. బౌద్ధశకం - అన్నది చారిత్రకంగా ఎక్కడా లేదు. భారతదేశంలో యుధిష్ఠిరశకం, కలిశకం ఉన్నవి కానీ, బుద్ధుని పుట్టుకతో శకారంభాన్ని చేసిన ఆధారాలు మృగ్యం. 

౪. బుద్ధుడి తర్వాత 218 ఏళ్ళకు అని అని ఉండవచ్చు గాక. కానీ బుద్ధుడి కాలం ఏది? దానికి ఖచ్చితమైన ఆధారాలెవ్వి? పౌరాణిక బుద్ధుడు క్రీ.పూ. 1800 నాటి వాడు. పురాణాల్లో ఇక్ష్వాకు వంశ పరంపర విస్పష్టంగా ఉంది. అంత విస్పష్టంగా ఉండగా ఆ ఆధారాన్ని ఎందుకు పరిగణించరాదు? - ఎందుకంటే, తన సీనియర్ విలియమ్ జోన్స్ అదివరకే బుద్ధుడు, చంద్రగుప్తుల కాలాన్ని ఊహించి నిర్దేశించేశాడు కనుక, ప్రిన్సెప్ వాటిని కావాలనే పట్టించుకోలేదు.

౫. మహావంశో లో "ఉజ్జయిని" ప్రస్తావన గమనార్హం. శాసనాల అశోకుడు మగధ/పాటలీపుత్రం వాడని ప్రిన్సెప్ అన్నారు. మరి ఉజ్జయిని కి చెందిన రాజు మగధ రాజెలా అవుతాడు? అలా ఉంటే, అసలు పాటలీపుత్రమే మౌర్యుల కాలంలో ప్రాభవానికి రాలేదు. ఆ కాలంలో మగధ రాజధాని రాజగృహం. ఈ విషయం పురాణాల్లో స్పష్టంగా పేర్కొనబడి ఉంది. రాజగృహం - పాటలీపుత్రానికి వచ్చి - ఉజ్జయిని కి చేరింది!

***********‌‌^^***********

శాసనాల బుద్ధుడికి వాఙ్మయ బుద్ధుడికి తేడాలు:

అలా మొదటి శాసనం తాలూకు తీర్మానాలే అవకతవకగా మొదలయినాయి. ఆ పై ప్రిన్సెప్ ఇంకొన్ని శాసనాలు కనుగొన్నాడు. (ఈ క్రమంలో కొన్ని శాసనాలు విరిగిపోయాయి. (విరుగగొట్టబడినాయి?)). ఇవి మొత్తం 14 బృహత్ శాసనాలు. ఈ శాసనాల జాబితా నెట్ లో వెతికితే దొరుకుతుంది. ఈ శాసనాలకూ, పాళీ బౌద్ధ సాహిత్యంలో అశోకుని ప్రస్తావనలకూ అనేకమైన భేదాలు ఉన్నాయి. నిజానికి శాసనాల అశోకుడికి, సాహిత్య అశోకుడికి మధ్య భేదాలు ఎక్కువ సామ్యాలు తక్కువ. ఈ సామ్యాలు కూడా వెతికి వెతికి బలవంతంగా కూర్చినవి మల్లేనే అనిపిస్తాయి.

ఆ తేడాలు ఏవో చూద్దాం.

౧. దొరికిన శాసనాలలో ఎక్కడా ’నేను ఫలానా "మౌర్య"అశోకుణ్ణి ఈ శాసనాలు వేయిస్తున్నాను’ అని వ్రాయలేదు.

౨. ఈ శాసనాలు/శాసనం - కలిశకం/యుధిష్టిరశకం - ఫలానా సంవత్సరంలో వేయించబడినట్టు ఏ ఒక్క శాసనంలోనూ లేదు. (దరిమిలా ఇవి క్రీ.పూ. మూడవ శతాబ్దానికి చెందినట్టు ప్రత్యక్షసాక్ష్యం లేదు.)

౩. శాసనాలన్నిటిలోనూ ’దేవానాం ప్రియ/దేవానాం ప్రియదర్శి’ అని ఉంది. ఇది బిరుదనామం. ఈ బిరుదనామం - ఒక్క అశోకుడికి మాత్రమే ఉన్నట్టు గా నిర్ధారించటం సాధ్యపడదు. ఇది Concrete evidence కాజాలదు. (పైన చూశాం)

౪. ఈ శాసనాల్లో ఒకానొక శాసనంలో అశోకుడు కళింగ యుద్ధం చేసి, ఆ యుద్ధంలో క్షతగాత్రులనూ, శవాల గుట్టలనూ చూచి మనోవేదనతో కుమిలిపోయినట్టుగా ఉంది.
- అశోకుని గురించిన థేరవాద గాథల్లో, శ్రీలంకకు చెందిన పుస్తకాల్లో ఈ కథ లేనేలేదు.
- అశోకునికి తన తాత చంద్రగుప్తుని ద్వారా కళింగ పారంపరిక రాజ్యంగా సంక్రమించింది. కళింగపై ఆతడు యుద్ధం చేయవలసిన అవసరం లేదు.
- ఈ ఉదంతానికంటే ముందే అశోకుడు బౌద్ధాన్ని స్వీకరించినట్టు ఆధారాలున్నై.

౫. ఈ శాసనాల్లో ఎక్కడా అశోకుడి వారసుడైన మహేంద్రుడు, కుమార్తె అయిన సంఘమిత్ర లు శ్రీలంకకు బౌద్ధాన్ని వ్యాపింపజేసినట్టుగా దాఖలాలు లేవు. అశోకుని ఒకానొక శాసనంలో భార్యపేరు కార్వాకి అని ఉన్నది.

౬. పైన పేర్కొన్న పదునాలుగు శాసనాలు కాక చిన్న శాసనాలు కూడా తర్వాతి కాలంలో కనుగొన్నారు.

(శాసనాల అశోకుడికి, గ్రంథాల్లో కనబడే అశోకుడికి మధ్య భేదాలను Anand Guruge అనే ఒకానొక రచయిత  కూలంకషంగా పరిశీలించి ఒక పట్టిక తయారు చేశాడు. ఆ పట్టిక ఇది)




శాసనాలలో అశోకుడి గురించి మరింత బలమైన ప్రతిపాదనలు:

౧. ఈ పదనాలుగు పెద్ద శాసనాలు కాక చిన్న శాసనాల్లోని ’మస్కి శాసనం’ లో, "మొట్టమొదటి లైనులో" అశోకుని పేరు ఉంది. మస్కి - కర్ణాటక రాష్ట్రం, రాయచూరు జిల్లాలో, సింధనూరు మండలంలో ఉన్నది. ఈ శాసనం ఓ చెట్టుక్రింద బండపై, పాళీ భాషలో వ్రాయించబడి ఊరికి దూరంగా ఉంది.  ఈ శాసనంలో అశోకుడి పేరున్నది కాబట్టి, ఇతర శాసనాల గాటన ఈ శాసనాన్ని కట్టి, అన్ని శాసనాలూ అశోకుడివని తీర్మానించారు. (ఈ శాసనంలో "అశోకుడ"న్న పేరు ఉన్నా, ఆతడు మౌర్య అశోకుడని చెప్పలేం. "అశోక" - ఈ శబ్దం కూడా భారతదేశంలో ప్రముఖమైనదే. అందుచేత ఇది ఖచ్చితంగా మౌర్యాశోకుడి శాసనమని, మిగిలిన శాసనాలు ఈ శాసనకర్తవేనని ఖచ్చితంగా తీర్మానించడం సాధ్యపడదు. ఈ శాసనం మొట్టమొదటి లైనులోనే అశోకుడు అని వ్రాసి ఉండటమూ అనుమానాలకు తావిచ్చేదే. ఆంగ్లేయులు భారతదేశపు పురాణాలను చాలా అసహ్యంగా వక్రీకరించినట్లు స్పష్టమైన ఆధారాలు కలవు. కొన్ని శాసనాలపై కూడా వీరి కైవాడం ఉంది. పైగా ఈ శాసనం పెద్దశాసనాలు వెలువడిన ఎంతో కాలానికి కనుగొనబడినది. దీన్ని Tamper చేసి ఉండకూడదని రూలేమీ లేదు.)

౨. ఈ శాసనాలపరంపరలో పదమూదవ శాసనం ఆంగ్లేయులకు బహుప్రియమైనది. అశోకుని పదమూడవ శిలా శాసనంలో ఐదు విచిత్రమైన పేర్లు ఉన్నై. ఈ పేర్లు సమకాలీన గ్రీకు రాజులవని ప్రిన్సెప్ తేల్చాడు. నిజానికి ఈ శాసనాన్ని చూసి ప్రిన్సెప్ ఎగిరి గంతేసి ఉంటాడు. తనకు దైవసమానుడైన సర్ విలియమ్ జోన్స్ "ఊహించి" చేసిన అశోకుని కాల-నిర్ధారణకు, తన పరిశోధన అక్కరకొచ్చిందని ప్రిన్సెప్ ఆనందం పట్టలేకపోయి ఉండవచ్చు. (ఆ శాసనంలో అశోకుడి పేరు లేదు, కాలం లేదు. ఒకవేళ ఆ ఐదు గ్రీకు పేర్లు ఉన్నా, ఆ శాసన కర్త "మౌర్య"అశోకుడని నిరూపించటం కుదరదు. ఆ గ్రీకు రాజులకు - శాసనం వేయించినతను సమకాలికుడని మాత్రమే చెప్పగలం.) ఈ పేర్లు కొంచెం అటూ ఇటూగా గ్రీకు రాజుల పేర్లతో పోలుతున్నాయని, ఆ రాజుల పేర్లు చెప్పాడు కనుక, అశోకుడు ఆ రాజులకు సమకాలికుడని, దరిమిలా అశోకుడు క్రీ.పూ. మూడవ శతాబ్దపు వాడని తేల్చి పారేశాడు ప్రిన్సెప్.

ఆ వాదనకు ప్రతివాదనలు ఉన్నాయి.

- ఈ పేర్లు రాజుల పేర్లు అని తీర్మానించడానికి ఖచ్చితంగా వీల్లేదు. ఇది ప్రదేశాలపేర్లూ అయి ఉండటానికి అవకాశం ఉందని కొందరు పరిశోధకులు చెప్పారు. ఇవీ ఖచ్చితంగానే ఉన్నాయి. దీని గురించి కోట వేంకటాచలం గారు వ్రాశారు. ఈ మధ్య బెంగాలీ స్కాలర్స్ కొంతమంది ఈ విషయాన్ని వివరించారు.

(ఈ శాసనం గురించి మరింతగా నిదానంగా మళ్ళీ మాట్లాడుకుందాం).

- ఒకవేళ ఈ పేర్లు గ్రీకురాజుల పేర్లయినా, ఈ శాసనం వేయించిన వాడు "మౌర్య అశోకుడే" అని చెప్పడానికి ప్రమాణాలు సరిపడవు.

- అశోకుడు అనే రాజు మూడవశతాబ్దపు వాడని ఖచ్చితంగా తేలితే, దానికి సెకండరీ ఎవిడెన్స్ గా ఈ గ్రీకు రాజుల పేర్లు గల శాసనం పనికి వస్తుందేమో కానీ, ఈ అవకతవక పేర్లని అడ్డుపెట్టుకుని, గ్రీకు పేర్ల సాయంతో మౌర్యాశోకుణ్ణి నిర్ధారించటం - Force fitting అవుతుంది.)

౫. అశోకుడు దేశమంతటా ’84000’ ధర్మరాజికలను ప్రతిష్టించాడని బౌద్ధ కల్పన కథల్లో ఉంది. అందులో పోయినన్ని పోగా, మిగిలినవి ఈ పదనాలుగు శాసనాలు అని ప్రిన్సెప్ తీర్పు.

(ధర్మరాజికలు అంటే శాసనాలు అని అర్థం కాదు. ఫాహియాన్ యాత్రల ప్రకారం - ఈ ధర్మరాజికలకు అర్థం పగోడాలు. లేదా చిన్న సైజు స్థూపాలు. పైగా ఇవి పాటలీపుత్రానికి పరిమితం.)

మహావంశ/దీపవంశము

ఇలా ఉంటే బౌద్ధకావ్యాల కథలలో అశోకుడి దారుణ హింసాకాండ, మూర్ఖపు చర్యలూ, దారుణ మారణహోమాలు ఇవన్నీ ప్రక్షిప్తాలనీ, లేదా అతిశయోక్తులనీ ఆంగ్ల చారిత్రకులు అన్నారు. అందులో "ధర్మాశోకుడు’ గా మారటం, ధర్మరాజికలను ప్రతిష్టించటం మాత్రం నిజమట! మిగతావన్నీ అబద్ధాలట! అలా ఎందుకు? అందులో కొంతయినా నిజం ఎందుకు ఉండరాదు?

సరే - అదలా ఉంచితే, ఈ అశోకుడి కథను పట్టుకుని, ధర్మాశోకుడు, ధర్మరాజికలు (ఈ రాజికలు రంజికలు అని చదివి, ఆపై నాలుక కొరుక్కుని, రాజికలుగా మార్చినది కూడా ప్రిన్సెప్ గారే) వంటి ఉదంతాలను మాత్రమే స్వీకరించి, అశోకుని కథను, దేవానాం ప్రియుని శాసనాల ద్వారా, (అశోకుడుగా పిలువబడుతున్నతని కథలను) సమన్వయపర్చారు ఆంగ్లేయులు.

ఇక్కడ గమనార్హమైన మరొక విషయమేమంటే శ్రీలంక చరిత్రలలో బుద్ధుడి కాలం క్రీ.పూ. 2000.  చీనా దేశం నుంచి శ్రీలంకకు ప్రయాణం కట్టి, పాటలీపుత్రంలోనూ, శ్రీలంకలోనూ బౌద్ధ గ్రంథాలను సేకరించిన ఫాహియాన్ కూడా తన యాత్రలలో క్రీ.పూ. 2000 బుద్ధుని కాలంగా పేర్కొంటాడు. భారతదేశంలోని పురాణాలు మరింత విస్పష్టంగా కాలాన్నే కాక వంశపరంపరను కూడా చెప్పాయి. అదీనూ ఒక్కపురాణం కాదు, మత్స్య, వాయు, భాగవత, బ్రహ్మాండాది పురాణాలు. వీటిప్రకారం బుద్ధుడి కాలం క్రీ.పూ. 1880 నుండి క్రీ.పూ 1800 మధ్యన.  స్పష్టంగా ఇవన్నీ చెప్పే విషయం - బుద్ధుడు క్రీ.పూ. 2000 నాటి వాడని. అయితే ఈ అంశాన్ని మాత్రం ఆంగ్లేయులు స్వీకరించరట, అశోకుని బౌద్ధకథలను మాత్రమే, అందులో తమకు అవసరపడే అంశాలను మాత్రమే స్వీకరించి చరిత్రను నిర్మిస్తారట! ఎంత నిజాయితీ!

You've right for your opinion. But you've no right for your own fact. 

అని ఒక సూక్తి. ప్రిన్సెప్ - శాసనాలను కనుగొని ఉండవచ్చు. పాళీ భాషను అక్షరమాలను నిర్మించి ఉండవచ్చు. కానీ ఆ ప్రాకృతభాషాభేదాన్ని చదువగలిగినది, సంస్కృతంలో సరిగ్గా పరివర్తించగలిగినది, దానికి సమర్థంగా భావం చెప్పగలిగినదీ భారతీయులే. కానీ ఈ శాసనాల వ్యవహారంలో భారతదేశీయుల కైవాడం తక్కువ. ఆంగ్లేయుల interpretations  ఎక్కువ. పైగా ఎక్కడికక్కడ అనుమానాలు, అవకతవకలూ కనిపిస్తూనే ఉన్నా, వాటికి ఏవేవో కుంటిసాకులతో మభ్యపెట్టి నిర్మించి, నిరూపించినదే ఎక్కువ.

పైకి చాలా శాస్త్రీయమైన ఆధారాలుగా "శాసనాలను" తీసుకువచ్చి, శాస్త్రీయమైన పద్ధతి అదీ అని కాలనిర్ధారణ చేసినా, నిజానికి ఈ వ్యవహారం వెనుక ఆంగ్లేయుల నిజాయితీ ఏ మాత్రమూ లేదు. పైగా ఇంత వ్యవహారమూ ఎందుకూ అంటే, అది వరకు జోన్స్ గారు  "ఊహించి" చెప్పిన చరిత్రను ప్రూవ్ చెయ్యడానికే తప్ప కొత్తగా వీరు చరిత్రకు ఇచ్చిన మూల్యాంకనలు లేవు. అలెగ్జాండరుకు సమకాలికుడు గుప్తచంద్రగుప్తుడుగా పరిగణనకు తీసుకున్న పరిశీలనలు లేవు. పైగా అనేక ప్రశ్నలు అటు జోన్స్ కాలంలోనే కాక, ప్రిన్సెప్ కాలంలోనూ వినబడుతుండగా, పౌరాణిక ఆధారాలు విరుద్ధంగా కనబడుతుండగా, అశోకుడనే వాడి పేరు చరిత్రలో నామమాత్రంగా ఉంటుండగా, వాటినన్నిటినీ కాలదన్ని ఏకపక్షంగా ముందుకు వెళ్ళడం ఆంగ్లేయుల బుద్ధిని సూచిస్తుందే కానీ నిజాయితీని సూచించదు.

ప్రిన్సెప్ ఈ విధంగా అశోకుని కాలాన్ని జోన్స్ చెప్పిన కాలానికి తగినట్టు నిరూపించిన పిదప - భారతీయులే ఈ కాలాన్ని అన్నిచోట్ల ప్రామాణికంగా వ్యాప్తి చేశారు. నిజానికి చాలామంది భారతీయచారిత్రకులకు అనుమానాలు ఉన్నాయి. కానీ ఆ అనుమానాలను వ్యక్తీకరించడానికి, బానిస బ్రతుకులో తగిన ఆస్కారమూ, అవకాశమూ లేదు. పైగా తమ వాదన - అవహేళన కు గురవుతుందన్న భయం ఒకటి. అదే కాక ఇతర చారిత్రకుల నిర్ధారణ అయింది కాబట్టి తన వాదంలో తప్పులు ఉండవచ్చునన్న శంక వేరే. శాసనాల ద్వారా చరిత్ర వ్రాయడం, చరిత్రను కేవలం - తేదీలతో నింపటం - ఇటువంటి వ్యర్థమైన శాస్త్రం భారతదేశంలో ఆంగ్లేయులకాలానికి ముందు లేదు. ఇవన్నీ కొత్తపద్ధతులు కావడం వల్ల భారతీయులకు వీటిని ఆక్షేపించే అవకాశమూ, సమయమూ లేకుండా పోయింది. దరిమిలా అశోకుడు క్రీ.పూ మూడవశతాబ్దం అన్న విషయం వేళ్ళూనుకుని చరిత్రలో తిష్ట వేసింది.

పరమహీనుడు, నీచుడు, స్త్రీలను, తమ్ముళ్ళను, ప్రేమికులను, ఆఖరుకు శ్రమణులను దారుణంగా హింసించి, రోకళ్ళలో దంచి, అగ్నిలో కాల్పించి, తలలు నరికించి చంపిన నరరూపరాక్షసుణ్ణి చారిత్రకపురుషుడిగా మనం చదువుకుంటున్నాం. మనకు చెందిన విక్రమాదిత్యుని, శాలివాహనుణ్ణి మనమే కాలదన్నుకున్నాం.

మన కంటిని మన వ్రేలితో పొడిపించటం ఇదే కదూ!

(ఇంకా చాలా ఉంది. శాసనాల అశోకుడు - మౌర్య అశోకుడు అని నిర్ధారించడానికి ఇన్ని లొసుగులు అవసరమయ్యాయి. అతడు కాకపోతే ఆ శాసనాల వాడు మరెవ్వరు? దీనికి కొన్ని సమాధానాలు సాధ్యం కాగలవు. అవి మళ్ళెప్పుడైనా.)

******


   

1 కామెంట్‌:

  1. సార్!! చాలా కాలం తరువాత మళ్ళీ మీరు మీ బ్లాగువైపు చూసారు. ధన్యవాదములు సార్. మీ వ్యాసాలు చాలా బాగుంటాయండి. ముఖ్యంగా!! బారతీయ చరిత్ర గురించి, దాని రచనాశైలి గురించి మీరు వ్రాసిన వ్యాసాలు అద్భుతంగా ఉన్నయండి. చాలా విషయాలను తెలుసుకున్నానండి.

    రిప్లయితొలగించండి

Comments ridiculing, abusing, bullying and forcing to agree in any form, if objectionable to the blog owner will be removed.