సంస్కృత సౌరభాలు - 5

బ్రహ్మాండచ్ఛత్రదణ్డః శతధృతిభవనాంభోరుహోనాళదణ్డః
క్షోణీనౌకూపదణ్డః క్షరదమరసరిత్పట్టికాకేతుదణ్డః |
జ్యోతిశ్చక్రాక్షదణ్డస్త్రిబువనవిజయస్థమ్భదణ్డోంఘ్రిదణ్డః
శ్రేయస్త్రైవిక్రమస్తే వితరతు విబుధద్వేషిణాం కాలదణ్డః ||

బ్రహ్మాండచ్ఛత్రదణ్డః = బ్రహ్మాండము అను గొడుగుకు మూలమైన కర్ర
శతధృతి భువన అంభోరుహో నాళదణ్డః = బ్రహ్మ పీఠమైన తామరపువ్వు యొక్క నాళము
క్షోణీనౌకూపదణ్డః = భూమి అను నావయొక్క తెరచాప కొయ్య
క్షరదమరసరిత్పట్టికాకేతుదణ్డః
క్షరత్ = జారుచున్న
అమరసరిత్ = అమరవాహిని అయిన గంగ (అనెడి)
పట్టికా = పట్టుచీరకు
కేతుదణ్డః = జెండాకర్ర
జ్యోతిశ్చక్రాక్షదణ్డ = జ్యోతిశ్చక్రమునకు ఇరుసు
విబుధద్వేషిణాం కాలదణ్డః = బుద్ధిమంతులశత్రువులకు (రక్కసులకు) కాలదండమూ ఐనట్టి
త్రైవిక్రమః = త్రివిక్రమావతారుడైన హరి యొక్క
త్రిభువనవిజయస్థమ్భదణ్డోంऽఘ్రిదణ్డః = త్రిభువన విజయసంకేతముగా ఒప్పారిన స్థంభముగా భాసించు పాదము అను ధ్వజము
తే = నీకు
శ్రేయః = అభివృద్ధి
వితరతు = పంచుగాక!

******************************************

ఎనిమిది దండాలతో హరికి దండాలు సమర్పించిన ఆ కవి-ప్రవరుడు దండి. దండినః పదలాలిత్యం అని సూక్తి. అపూర్వమైన శబ్దమాధుర్యం దండికవి ప్రాముఖ్యత.

పాం చా లీ పం చ భ ర్తృ కా
U U U U i U i U
బ్ర హ్మాం డ చ్ఛ త్ర ద ణ్డః

చూచారా, అర్థంతో అవసరం లేకపోయినా శబ్దమాధుర్యం తో పండితపామరులను సైతం కదిలించగల మాటలకు గణాలు ఎలా కుదిరాయో? ఈ వాక్యం ఎందుకంటే - శబ్దంతో పనిలేదని, శబ్దమాధుర్యం దిగువతరగతి కవులకు మాత్రమే పట్టినదని, అర్థమే కవికి ముఖ్యమైన విషయమని, నిగూఢార్థాలు కల్పించే కవులు శబ్దమాధుర్యాన్ని పట్టించుకోరని కొన్ని కృతక వాదాలు, శుష్క వాదనలు వినిపిస్తుంటారు కొందరు. ఇది వట్టి భేషజం. తెలుగులో ఇవి మరీని. శబ్దం అక్కరలేకపోయినా అర్థం కావాలి అనడం - అమ్మాయి కి బట్టల్లేకపోయినా పర్వాలేదు, ఆమె దేహం ఉంటే చాలు అనడం తో సమానమని పుట్తపర్తి నారాయణాచార్యుల వారి విసురు. పచ్చి నిజం కూడా.

మహాకవులు వశ్యవాక్కులు. వారి ధార దండి గారి మాటల్లో - క్షరదమరసరిత్ (ఉధృతంగా ప్రవహిస్తున్న అమరవాహిని). దండి కవి కవిత్వపు జీవలక్షణం శబ్దమాధుర్యం. ఇది కృతకంగా పాఠకుడిని మభ్యపెట్టడానికో, మెప్పించడానికో చేసిన ఇంద్రజాలం కాదు. సంస్కృతభాష ఎంత అందమైనదో తెలియాలంటే దండి కవి దశకుమారచరితమ్ చదివితే చాలు. ఈ దశకుమారచరితమ్ అమరవాణి గీర్వాణికి మహాకవి పట్టిన కర్పూరనీరాజనం.

******************************************

పద్యానికి వద్దాం. ఈ పద్యం దశకుమారచరితమ్ అన్న గద్యకావ్యానికి ఆది. ఇందులో ఇదివరకు చెప్పినట్టు ఎనిమిది దణ్డ శబ్దాలున్నాయి. ఈ ఎనిమిది దణ్డ శబ్దాలు అష్టసిద్ధులను, వాటికి మూలాధారమైన శ్రీహరిని సూచిస్తున్నాయా? (ఇది పూర్తిగా నా ఆలోచనే. ఇందులో తప్పొప్పులకు నేనే బాధ్యుణ్ణి :)) అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశత్వము, వశిత్వము అనేవి అష్టసిద్ధులు.

బ్రహ్మాండచ్ఛత్రదణ్డః = మహిమ
శతధృతిభవనాంభోరుహోనాళదణ్డః = లఘిమ (సన్నని తామరతూడు)
క్షోణీనౌకూపదణ్డః = అణిమ (మహాసముద్రంలో పిపీలికం వంటి నావ)
క్షరదమరసరిత్పట్టికాకేతుదణ్డః = గరిమ (పొడవైన ఆకాశగంగ అనే పట్టుచీర)
జ్యోతిశ్చక్రాక్షదణ్డః = ప్రాకామ్యము
త్రిబువనవిజయస్థమ్భదణ్డః = వశిత్వము
అంఘ్రిదణ్డః = ఈశత్వము
విబుధద్వేషిణాం కాలదణ్డః = ప్రాప్తి

మరొక ఊహ.

Universe is finite or infinite?

గోచరాగోచరమైన ప్రపంచం - అంటే భూమి, సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, ఉపగ్రహాలు, నక్శత్రాలు, పాలపుంతలు, ఇతరత్రా ఖగోళరాశి అంతా కలిపి బ్రహ్మాండమైతే దానికి పరిమితి ఉన్నదా లేదా? అంటే - కొన్ని వేల కాంతిసంవత్సరాల వేగంతో వెళ్ళే ఒక విమానం ఎక్కి ప్రయాణం చేస్తే ఏదో ఒక రోజున ఒక అడ్డుగోడ తగులుతుందా లేదా?

అడ్డుగోడ ఉంది, పరిమితి ఉన్నది అనుకుంటే - ఆ గోడకవతల ఏమున్నదని ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్నలో పరిమితి లేదు అన్న సూచనా దాగిఉంది.

పరిమితి లేదు అంటే - అది అండాకారవస్తువెలా అయ్యిందని ప్రశ్న.

నండూరి రామమోహనరావుగారి విశ్వరూపం అనే పుస్తకంలో ఈ విషయానికి సంబంధించిన ఐన్ స్టీన్ సిద్ధాంతాన్ని గురించి చెప్పారు. "Universe is ever expanding" అని. అలా పెరుగుతూ పోతూ ఉన్న అంతరిక్షపు ఆకారం ఎలా ఉందని ఊహించాలి?

లీలగా ఒక గొడుగు స్ఫురించదూ?  ఆ గొడుగుకు మూలధ్వజం శ్రీహరి అట! (ఇందాక అన్నట్టు ఇది నా ఊహ. దండి అలా ఊహించకపోయినా వచ్చిన నష్టం ఏవీ లేదు.)

ఈ "బ్రహ్మాండ"మైన పద్యం ఈ కథలో దశకుమారుల విజయానికి సంకేతం. నాటకాలలో మొదటగా వచ్చే నాంది శ్లోకం - ఆ కావ్యాన్ని (కావ్యస్ఫూర్తిని) స్థూలంగా వివరించాలని ఒక నియమం ఉన్నది. ఆ నియమాన్ని గద్యకావ్యానికి అన్వయింపజేసిన పద్యం ఇది.

******************************************

ఇంకా కొన్ని ముచ్చట్లు. దండి పదలాలిత్యానికి మారుపేరు కదా. ఆయన వర్ణన ఎంత మధురంగా ఉంటుందో చూద్దాం.

అనగనగా మగధదేశంలో పుష్పపురమన్న నగరం ఉంది. ఆ నగరానికి - "ఘనదర్ప కందర్ప సౌందర్య సోదర్య హృద్య నిరవద్య రూపుడైన భూపతి" రాజహంసుడు పరిపాలిస్తున్నాడు. (బాగా పొగరెక్కిన మన్మథునికి సౌందర్యానికి సోదర సమానుడై, నిర్మలమైన హృద్యమైన రూపం కలిగిన రాజు)

ఆతనికొక రాణి.

తస్య వసుమతీనామ సుమతిర్లీలావతీ కులశేఖరమణీ రమణీ బభూవ. రోషరూక్షేణ నిటలాక్షేణ భస్మీకృతచేతనే మకరకేతనే తదాభయేన అనవద్యా ఇతి మత్వా తస్యాః
- రోలమ్బావళీ కేశజాలం
- ప్రేమాకరో రజనీకరో విజితారవిందం వదనం
- జయధ్వజాయమానో మీనో జాయాయుతౌ అక్షియుగళమ్
- సకలసైనికాగ్రవీరః మలయసమీరః నిశ్వాసః
- పథికహృత్ దళన కరవాలః ప్రవాలః చ అధరబింబమ్
- విజయశంఖో లావణ్యధురాబంధురా కంధరా
...
...
- ఈషదుద్ఫుల్ల లీలావతంస కల్హారకోరక గంగావర్తన సనాభిర్నాభిః
- దూరీకృత యోగిమనోరథశ్చైత్ర రథః అతిఘనం జఘనమ్
- ఆతపత్ర సహస్రపత్రమ్ పాదద్వయమ్
...
...

అతనికి వసుమతి అన్న సుమతి, లీలావతి ఇత్యాది పతివ్రతల జాతికి సంబంధించిన మణి వంటి రమణి ఉన్నది. అదివరకు మన్మథుని ఆశ్రయించిన వివిధములైన చరాచరములు మన్మథుణ్ణి ఈశ్వరుడు దగ్ధం చేయడంతో ఈమె రూపం నిర్మలమని ఈమెను ఆశ్రయించాయి.

తుమ్మెదలబారు కేశపాశము
ప్రేమాకరుడైన చంద్రుని జయించిన (మన్మథుని ఒకానొక బాణం) అయిన అరవిందం ఆమె ముఖం. (అరవిందం చంద్రునికి శత్రువు, ఎందుకంటే పొద్దున సూర్యుని చూచి వికసిస్తుంది కాబట్టి. ఇక్కడ అది విజేత).
మన్మథుని జయధ్వజంపై ఉన్న మీనము తన ప్రియురాలితో కలిసి ఈమె నేత్రములు.
సకలసైనికాగ్రవీరుడైన మలయసమీరము ఈమె నిశ్వాసము
పథికుల హృదయాలను ఛిద్రం చేసే కరవాలం ఈమె కెమ్మోవి
విజయశంఖమై, లావణ్యధురమైన శంఖము ఆమె మెడ
...
...
ఇంచుక వికసించిన ఎర్రకలువ, నల్లకలువలను తలపిస్తూ గంగలో సుడిగండం వలె సుడులు తిరిగిన నాభి
యోగిజనుల మనోరథములను దూరం చేసే చైత్రరథం ఆమె ఘనమైన జఘనము
మన్మథుని గొడుగైన పద్మము ఆమె పాదద్వయము
...
...

తెలుగు అర్థం తెలుసుకోవడంకంటే సంస్కృతంలోని ఆ గద్యం చదివితే వచ్చే ఆనందమే వేరు.

దశకుమారచరితమ్ ఏడవ ఉచ్ఛ్వాసం ఒక అద్భుతం. దశకుమారులలో ఒకడైన మంత్రగుప్తుడు తన కథ చెబుతాడు. అందులో విశేషం ఏవిటంటే - ఆ ఉచ్ఛ్వాసం అంతా నిరోష్ట్యం - అంటే ఆ కథలో ప,ఫ, బ,భ, మ లు లేవు. ఆ కథను చెప్పే కుమారుడిపేరులోనే మంత్రగు"ప్తు"డని "ప"కారం ఉంది. అతని పేరు కూడా ప్రస్తావించకుండా అతని కథను కవి చెప్పడం నేర్పు. అలాగని ఆయాసపడినట్టుగా, శబ్దాలను వెతికి కూర్చినట్టుగా అనిపించక, సునాయాసమైన, లలితమైన శబ్దాలతో కథ నడపటం దండికవి మహాప్రతిభ.

నిజానికి దండి పూర్వులైన సుబంధుడు బాణభట్టు గద్యాన్ని సమాసభూయిష్టంగా, ఓజోగుణ ప్రవృద్ధకంగా తీర్చారు. బాణభట్టి ఒక్కొక్కసమాసాన్ని తెలుగులో "డీకోడ్" చేస్తే - చేంతాడంత అవుతుంది. ఆయన వర్ణనలకు విషయవివరణకూ ప్రాధాన్యతనిస్తే, దండి కథ చెప్పడానికి, నవ్యత్వానికి, శబ్ద సౌకుమార్యానికి, ప్రాధాన్యతనిస్తాడు. బాణభట్టు కాదంబరి కావ్యంలో కిరాతుని (శబరసేనాపతి) వర్ణన ఉంది. దశకుమారచరితమ్ లోనూ కిరాతుడున్నాడు. బాణభట్టు కిరాతుని వర్ణన మహా ప్రౌఢం. అలాగే చాలా తీవ్రమైన భావావేశాన్ని కలిగిస్తుంది. దండి కిరాతుడు కాస్త స్పెషల్. జందెం వేసుకుని ఉంటాడు. ఎందుకా జందెం అంటే దానికొక ఫ్లాష్ బాక్ కథ జొప్పించి అబ్బురపరుస్తాడు దండి. కిరాతుని వర్ణిస్తూ కూర్చోడీయన. వర్ణనను వాడుకుంటాడు. అలాగే మృచ్ఛకటికపు దొంగ శర్విలకుణ్ణి, దశకుమారపు దొంగనూ సరిచూడడం ఒక చక్కని అనుభూతి.

******************************************

ఓ చిన్న అభాణకం. సరస్వతి ఓ మారు అందిట -

"కవిర్దండీ కవిర్దండీ కవిర్దండీ భవభూతిస్తు పండితః" - (కవి అంటే దండి మాత్రమే అని ముమ్మారు. పండితుడంటే భవభూతి మాత్రమే అని ఒకమారు)
"కోహం మూఢే? త్వమేవాహం త్వమేవాహం న సంశయః" - (అయితే నేనెవరే మూఢురాలా? అని కాళిదాసు అడిగితే నీవే నేను అని అమ్మ సమాధానం)

కాళిదాసు అమ్మతో అడిగి చెప్పించుకున్నాడు. అడక్కపోయినా ముమ్మారు కవివి నీవే అని అనిపించుకున్న దండికవి మహాకవి. సరస్వతి మూడుసార్లు కాదు ముప్పైసార్లు అన్నా ఆశ్చర్యం లేదు.

******************************************

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వాఙ్మయచరిత్రలో కొన్ని వ్యాసఘట్టాలు - శ్రీ ఏల్చూరి మురళీధరరావు గారు.

అశోకుడెవరు? - 1

ముకుందవిలాసః - కుంటిమద్ది శేషశర్మ.