సంస్కృతసౌరభాలు - 2
సిలం కిమనలం భవేదనలమౌదరం బాధితుమ్
పయః ప్రసృతి పూరకం కిము న ధారకం సారసమ్ |
అయత్నమలమల్లకం పథి పటచ్చరం కచ్చరమ్
భజన్తి విబుధాః ముధాన్ హ్యహహ కుక్షితః కుక్షితః ||
ఔదరం అనలం = కడుపు లోని నిప్పును,బాధితుమ్ = చల్లార్చడానికి,సిలం = ఏరుకుని వచ్చిన ధాన్యం,కిమ్ అన్ అలం భవేత్? = చాలవా?; ప్రసృతిపూరకం = రెండు చేతులలో నిండుగా నిండిన,పయః = నీరు,సారసం = ద్రప్పిని కిము న ధారకం = తట్టుకోవడానికి సరిపడవా?; అయత్నం = అప్రయత్నంగా,పథి = దారిని (ఉన్న),పటచ్చరం = ప్రాతగుడ్డ,అల్లకం కచ్చరం = ఏర్పడిన గోచిగా,అలం? = చాలును కదా; విబుధాః = పండితులు,ముధాన్ = ముష్కరులను,కుక్షితః కుక్షితః = కేవలం కడుపు కోసం; భజన్తి హి అహహ = భజిస్తున్నారే..హహ!
*********************************************
అది పదుమూడవశతాబ్దం. విద్యారణ్యస్వాములవారి నేతృత్వంలో బుక్కరాయలు విజయనగరసామ్రాజ్యాన్ని నెలకొల్పిన రోజులు. ఆ రోజుల్లో దక్షిణాన శ్రీరంగంపై మాలిక్ కాఫర్ దండెత్తాడు. ఆ సమయంలో ఒకానొక మహానుభావుడు - ఆలయ మూలవిరాట్టు శ్రీరంగనాథుని విగ్రహాన్ని, మరణించిన తన మిత్రుడైన సుదర్శనభట్టు "శ్రుతిప్రకాశిక" వ్యాఖ్యానాన్ని, వారి ఇద్దరు కుమారులను వీపున కట్టుకుని, శవాల క్రింద దాక్కుని, అతిక్లిష్టపరిస్థితుల్లో రాజ్యం దాటారు.
బుక్కరాయలకు విషయం తెలిసింది. తమ దండనాథులు, చంద్రగిరి ప్రభువులు అయిన సాళ్వ గోపన్నను దాడిని తిప్పికొట్టమని పురమాయించాడు. సాళ్వగోపన్న శ్రీరంగానికి వెళ్ళి చాలా యేళ్ళు కాపు కాసి తుదకు మాలిక్ కాఫర్ ను తరిమి శాంతిని నెలకొల్పాడు. ఆ తర్వాత ఆ స్వామి తిరిగి శ్రీరంగానికి వచ్చి ఆగమ శాస్త్ర విధులకనుగుణంగా రంగవిభుణ్ణి పునఃప్రతిష్టించాడు.
ఆ స్వామి పేరు వేదాన్తదేశికులు. శ్రీ విద్యారణ్య మునికి చిన్నప్పుడు కంచిలో సహాధ్యాయి. విశిష్టాద్వైత పరంపరలో ఒక గొప్ప గురువు. శతాధిక గ్రంథకర్త.
*********************************************
శ్రీ మదాదిశంకరుల వారు స్తోత్ర వాఙ్మయం కాకుండా కావ్యవాఙ్మయంవైపు దృష్టి సారించి ఉంటే కాళిదాసు వెలవెలబోయి ఉండే వాడని పండితులు చెబుతారు. అలాంటి ఆదిశంకరుల వారితో తర్కజ్ఞానంలో పోటీపడగలిగిన చారిత్రక వ్యక్తి ఆచార్య నాగార్జునుడైతే, ఆయన పాండిత్యంతో, తర్కజ్ఞానంతో రెంటితో నిలువగలిగిన గొప్పవ్యక్తి వేదాన్తదేశికులవారు. శ్రీ వేదాన్తదేశికుల వారు జీవితాంతం భిక్షుక వృత్తితో జీవించారు.
ఓ మారు విద్యారణ్యుల వారికీ (అద్వితం), అక్షోభ్య తీర్థుల వారికి (ద్వైతమతాచార్యులు) మధ్య "తత్త్వమసి" అన్న ఉపనిషద్వాక్యంపైన సంవాదం వచ్చిందట. ఆ సందర్భంలో వారిద్దరి వాదాలను పరిశీలించి తీర్పు చెప్పడానికి మధ్యవర్తిగా శ్రీ వేదాన్తదేశికుల వారిని పిలిపించారు.
ఇద్దరి వాదాలను విన్న దేశికుల వారు అక్షోభ్యతీర్థుల వాదం సరైనదని తీర్పు చెప్పారు. అందుకనే ద్వైతులు అక్షోభ్యతీర్థుని గురించి - "అసినా తత్త్వమసినా పరజీవప్రభేదినా విద్యారణ్యమహారణ్యమక్షోభ్యమునిరచ్ఛిరత్" (జీవ పరమాత్మలకు భేదాన్ని నిరూపించే తత్వమసి అనే ఖడ్గం ద్వారా, విద్యారణ్యులనబడే ఒక గొప్ప అడవిని ఛేదించారు) అని చెప్పుకుంటారని ఒక గాథ.
దేశికులవారి పాండిత్యాన్ని పరిశీలించడానికి మరొక వైష్ణవాచార్యుల వారికి, ఈయనకు మధ్య పోటీ పెట్టారు. అప్పుడు దేశికులవారు ఒక్క రాత్రిలో "పాదుకాసహస్రం" అన్న స్తోత్రకావ్యాన్ని రచించారు. కానీ తీరా స్పర్ధ మొదలైనప్పుడు ఒక్క మాట అన్నారుట.
సూతే సూకరయువతీ శతసుతమత్యన్తదుర్భగం ఝటితి |
కరిణీ చిరాయ సూతే సకలమహీపాల లాలితం కలభమ్ ||
పంది దుర్భరంగా ఉన్న వందమంది పిల్లలను ఒక్క కాన్పులో పెట్టవచ్చు. కానీ ఆడు యేనుగు ఎప్పుడో అయినా రాజులందరి చేత లాలించబడే ఒకే ఒక యేనుగును కంటుంది.మేము వేగంగా వేయి శ్లోకాలు రచించి ఉండవచ్చు గాక, అది అల్పమైనది. మీ కావ్యం మాత్రం మహా పాండిత్యంతో ప్రకాశిస్తుంది. మీ ముందు నేను, నా పాండిత్యం నిలువదు కదా - ఇది శ్రీ దేశికుల వారి వినయం. విశిష్టాద్వైతంలోని "ఆకించన్యం" - అంటే నేను ఒక శూన్యుణ్ణి అనే ఒక భావనకు ఈయన ప్రత్యక్షరూపం. దీన్నే శ్రీవైష్ణవులు "భృత్యస్య భృత్య పరిచారికా భృత్యస్య భృత్యభృత్యః" అన్న సూత్రంతో చెప్పుకుంటారు.
మరో కథ. శ్రీ దేశికుల వారు వస్తుంటే ఆయనను పరాభవించాలని ఒక తమిళ భక్తుడు వారు వెళ్ళే దారిని చెప్పులు వేలాడగట్టారట. దేశికుల వారు ఆ చెప్పులను తలపై దాల్చి వినయంగా అన్నారుట -
కేచిత్ కర్మావలంబినః కేచిత్ జ్ఞానావలంబినః |
వయం తు హరిదాసానాం పాదరక్షావలంబినః ||
"కొందరిది కర్మమార్గం, కొందరిది జ్ఞానమార్గం. మా వంటి హరిదాసులది భక్తుల పాదుకలను కూడా శిరముపై దాల్చే (భక్తి) మార్గం."
పాదుకాసహస్రం ఒక మహత్తరమైన పారాయణగ్రంథం. వీరు ఇంకా యాదవాభ్యుదయం, శతదూషణి, గరుడపంచశతి, ఇత్యాది అనేక తమిళ, సంస్కృత గ్రంథాలు వెలయించారు. ఈయనను వేంకటరమణుని ఘంటావతారంగా భక్తులు భావిస్తారు.
ఈయనకు "సర్వతంత్ర స్వతంత్రు"లని బిరుదు. ఈ బిరుదాన్ని ఎద్దేవా చేస్తే ఈయన ఎలా ఎదుర్కొన్నారని కొన్ని కథలు ఉన్నాయి.ఈ మహానుభావుణ్ణి శ్రీ విద్యారణ్యుల వారు తమ రాజ్యానికి వేంచేసి ఆస్థాన విద్వాంసునిగా పదవినలంకరించవలసిందని మనవి చేస్తే ఆయన ప్రత్యుత్తరంగా ఐదు శ్లోకాలను విద్యారణ్యస్వామికి పంపారుట. ఆ ఐదుశ్లోకాలకు వైరాగ్య పంచకమని పేరు. అందులో రెండవశ్లోకం పైన పేర్కొన్నది. విద్యారణ్యుల వారు చేసేది లేక బుక్కరాయలను తమ సమక్షంలో తీసుకొని వస్తాను ఆశీర్వదించమని అడిగారుట. దానికీ శ్రీ వేదాన్తదేశికులు ఒప్పలేదు.
********************************************
ఆ వైరాగ్యపంచకములో మిగిలిన నాలుగు శ్లోకాలివి.
క్షోణీకోణశతాంశపాలనకళాదుర్వారగర్వానల
క్షుభ్యత్ క్షుద్రనరేంద్రచాటురచనాధన్యాన్నమన్యామహే
దేవం సేవితుమేవ నిశ్చినుమహే యోऽసౌ దయాళుః పురా
ధానాముష్టిముచే కుచేలుమునయే దత్తేऽస్మ విత్తేశతమ్
(భూమి తాలూకు ఒక ముక్కను పాలిస్తూ గర్వంతో మిడిసిపడే క్షుద్రరాజన్యులను కీర్తిస్తూ మురిసే తత్వం కాదు మాది. ఒక పిడికిలి మాత్రం అటుకులను తీసుకుని సర్వసంపదలూ అనుగ్రహించిన అనంతుడైన దేవదేవుని సేవించడమే మా నిశ్చయమైన ప్రవృత్తి)
జ్వలతు జలధిక్రోడ క్రీడత్ కృపీడ భావప్రభా
ప్రతిభాత పటుజ్వాలామాలాకులో జఠరానలః
తృణమపి వయమ్ సాయం సంఫుల్ల మల్లిమతల్లికా
మరిమళముచా వచా యాచామహే న మహీశ్వరాన్
(సముద్రం లోపల అగ్ని ప్రజ్వరిల్లినట్టు మా ఉదరంలో ఆకలి తీవ్రంగా బాధపెట్టినప్పటికీ ఒక్క గడ్డిపోచను కూడా మహారాజులవద్ద యాచించము. వికసితమైన మల్లికా పరిమళాదులసదృశంగా మా జీవితం ఉండగలదు)
దురీశ్వర ద్వార బహిర్వితర్దికా
దురాసికాయై రచితోయమంజలి: |
యదంజనాభం నిరపాయమస్తి మే
ధనంజయ స్యందన భూషణం ధనం ||
అహంకారులైన రాజుల ద్వారాం దగ్గర కాచుకుని ఉండే ఆలోచనకు నమస్కారం. కాటుకవంటివాని, అర్జునుని రథానికి అలంకారభూషితుడైన వాని రంగువలే నల్లని శాశ్వతమైన ధనం మా వద్ద లేదా?
శరీరపతనావధి ప్రభునిషేవణాపాదనాత్
అబింధనధనంజయప్రశమదం ధనం దంధనం |
ధనంజయవివర్ధనం ధనముదూఢ గోవర్ధనం
సుసాధనమబాధనం సుమనసాం సమారాధనం ||
ఈ దేహం శిథిలమయే వరకూ క్షుధానలం నశించేవరకూ తమనాశ్రయించమని రాజులు హింసించనీ. మాకొద్దు. మా ధనమంతా - అర్జునుని తీర్చిదిద్దినట్టిది, గోవర్ధనగిరిని ఎత్తినట్టిది, ఎన్నడూ చెడుకార్యాన్ని చేయించనిది, దేవతలందరి అవసరాలను తీర్చునది. అదే మాకు నిధనం.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Comments ridiculing, abusing, bullying and forcing to agree in any form, if objectionable to the blog owner will be removed.