గొడుగు కలిగి కూడ తడిసినాఁడు.

శంకరాభరణం బ్లాగులో ఈ సమస్య ఆ రోజు ఉదయాన్నే చూశాను. నిజం చెప్పాలంటే కాస్త చప్పగా అనిపించింది. కాలకృత్యాలవీ తీర్చుకుని, రెడీ అయి ఆఫీసుకు బయలుదేరే ముందు పూరణ ముగిద్దాం అన్న ఆలోచన వచ్చింది - సినిమాలలో బృందగానంలో మందతో ఆడుతూ హీరో గొడుగు ఉన్నా తడిచిపోయాడు అని. మొదట సమస్య రాసుకుని, బృంద-మంద అనే ప్రాసతో మొదటిపాదం చేకూర్చాను. చూస్తే, రెండవపాదంగా సమస్య(నాలుగవ పాదాన్ని)నే వాడుకోవచ్చని అనుమానం వచ్చింది. అది ఆలానే ఉంచాను. (కాసిన్ని మార్పులతో) ఇక మూడవపాదం తేలికగానే కుదిరింది. అలా పద్యం తయారయ్యింది.

బృంద నాట్య మందు మంద యాడిరి చేత
గొడుగు కలిగి; కూడ తడిసినాడు
చలన చిత్ర నటుఁడు లలన సరసఁ జేరి.
గొడుగు కలిగి కూడ తడిసినాఁడు.

ఈ సోది అంతా ఎందుకంటే -

ఇలా శ్లోకంలో రెండవపాదం, నాలుగవపాదం ఒకే రకంగా కూర్చిన ప్రయోగం శిశుపాలవధమ్ అన్న సంస్కృత కావ్యంలో, ఆరవ సర్గలో మాఘకవి చేశాడు. 

కాన్తాజనేన రహసి ప్రసభం గృహీతః
కేశే రతే స్మరసహాసవతోషితేన |
ప్రేమ్ణా మనస్సు రజనీష్వపి హైమనీషు
కే, శేరతే స్మ రసహాస వతోషితేన ||

స్మరసహ = మన్మథ వికారం కలిగించు
ఆసవ = మద్యముతో
తోషితేన = సంతసించిన వారలై
రసహాసవతా = హాస్యానురాగ బద్ధులై
ప్రేమ్ణా = ప్రేమతో
మనస్సు = పురుషుల చిత్తములలో
ఉషితేన = నివసించు
కాన్తాజనేన = స్త్రీజనము చేత
ప్రసభం = నిర్బంధముగా
రహసి = రహస్యముగా
గృహీతకేశే = పొందిన కేశములు కలిగిన (జడను పట్టుకుని)
రతే = సురతములో
హైమనీషు = హేమన్త ఋతు సంబంధమైన
రజనీష్వపి = రాత్రులలో కూడా
కే = ఎవరు
శేరతే స్మ = శయనించుదురు?
శీతాకాలపు రాత్రులలో మద్యపానమత్తులై, ప్రియురాండ్రమీద మనసుపడి, ఏ యువకులు రతిసుఖం అనుభవించక, నిదురపోతారు?

స్వోత్కర్ష/సొంతడబ్బా అనుకున్నా, ఆ శ్లోకం లో ప్రయోగం వంటిదే నా స్థాయిలో నేనూ చేశాను. ఆ అనుభూతిలో ఆ రోజు గొడుగు కలిగి కూడ తడిసినాను.

కాకిపిల్ల కాకికి ముద్దు కాబట్టి, నా చిన్ని మట్టిబుర్రలో మొలకెత్తిన - నేను రాసుకున్న ఈ చిన్ని పద్యం నాకు ముద్దు. ఈ అనుభూతి నాకిచ్చిన శంకరయ్య గారికి అనేక వందనాలు.

నాకు తెలియదు కానీ ఇటువంటివి తెనుఁగులోనూ తప్పక ఉండే ఉంటాయి. "భావభవభోగ సత్కళా భావములను" అన్న పద్యం ఓ ఉదాహరణ.

కామెంట్‌లు

  1. రవి గారూ,
    అలాంటి పద్యాలు తెలుగులో లేకపోవడమా? చాలా ఉన్నాయి. ప్రస్తుతం అలాంటి పద్యాల సేకరణలో ఉన్నాను. సేకరించెన పద్యాలను వివరాలతో సహా నా బ్లాగులో "చమత్కార పద్యాలు" శీర్షికలో పెడతాను. నేనిచ్చిన చిన్న సమస్యకు మీ బ్లాగులో ఇంత పెద్ద పోస్ట్ పెట్టి నన్ను ప్రస్తావించినందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  2. మీ పూరణ అద్భుతం అండి ..మీది మట్టి బుర్ర నా ? ఎంటో లే

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Comments ridiculing, abusing, bullying and forcing to agree in any form, if objectionable to the blog owner will be removed.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Disclaimer

అశోకుడెవరు? - 1

ధ్రువనక్షత్రం - శింశుమారుడు