చిత్రభారతీ పంచకము - 5
స్వరములకు రాణి, వాణికి శంఖబంధపు నుతి. శంఖ బంధము కం|| ఖరకరచర సితనారీ! స్ఫురతాధరసుమపరాగశోణా భూరీ! స్వరధురధర హితకారీ! బెరయున్ ధర,సురప రాగవీణాధారీ! ఖరకరచర = ఖరకరుడు - సూర్యుడు, ఖరకరచర - సూర్యునివలె చరించు, సితనారీ = సర్వశుక్ల యగు వనితా (సరస్వతి) స్ఫురతాధర = తళతళమను మెఱయు అధరము(స్ఫురదధర శీధవే అని జయదేవుడు. స్ఫురతాధర తప్పుకాదనుకుంటున్నాను) స్వరధురధర = స్వరములభారము మోయునది బెరయున్ ధర = ఇలను సర్వాంతర్యామిగ వ్యాపించినయట్టి శంఖ బంధములో ప్రతిపాదపు చివరి అక్షరం ఆవృత్తి కావాలి. అదే శంఖపు కన్ను. ఈ పద్యము శంఖబంధమే కాక ఛురికా బంధము కూడా. అలాగే ఈ పద్యము గోమూత్రికాబంధము కూడా. ఖ ర ఖ ర చ ర సి త నా రీ ! స్ఫు రి తా ధ ర సు మ ప రా గ శో ణా భూ రీ! స్వ ర ధు ర ధ ర హి త కా రీ ! బె ర యున్ ధ ర , సు ర ప రా గ వీ ణా ధా రీ! మూడు చిత్రములు కలిగినది కావున, ఇది త్రిచిత్ర పద్యమనబడును.