చిత్రభారతీ పంచకము - 2
అంబను గోమూత్రికా బంధముతో కూర్చిన పద్యముతో నుతి చేద్దాము. ఈ బంధము గురించి ఆంధ్రామృతం బ్లాగులో వివరించబడి ఉన్నది.
గోమూత్రికా బంధము
౧.
స్వరచణ శతధృతినారీ!
స్ఫురితాధరసుమసురాగశోణా వాణీ!
స్వరగుణజిత మతితారీ!
బిరికీధర,సుధసు రాగవీణాపాణీ!
స్వ ర చ ణ శ త ధృ తి నా రీ! స్ఫు రి తా ధ ర సు మ సు రా గ శో ణా వా ణీ!
స్వ ర గు ణ జి త మ తి తా రీ ! బి రి కీ ధ ర , సు ధ సు రా గ వీ ణా పా ణీ!
స్వరచణ = స్వర జ్ఞానము కలిగినది
శతధృతి నారీ = శతధృతి అంటే బ్రహ్మ. శతధృతినారీ = బ్రహ్మ యొక్క నారి.
స్ఫురితాధరసుమసురాగశోణా =
స్ఫురిత = మెరయు, తళుకులీను
అధరసుమ = అధరమనే పూవు
సురాగ = రాగమంటే ఎఱుపు, కోపము, సిగ్గు, ప్రేమ, రంగు ఇలా నానార్థాలు. సురాగమంటే, చిక్కటి రంగు
శోణా = ఎఱుపు
(కుంకుమ రాగశోణే అని కాళిదాసు ప్రయోగం)
వాణీ = సరస్వతీ
స్వరగుణజిత = స్వరగుణములను జయించినది
మతితారీ = తారీ అంటే నేర్పరి, సూత్రధారి. మతితారీ = బుద్ధులకు సూత్రధారి
బిరికీధర = చెవిపోగు ధరించినది
సుధసురాగవీణాపాణీ = సుధలు చిందు, మంచి రాగాలనొలికించే వీణను హస్తమున ధరించినది.
౨.
సురగణనుత సితనారీ!
స్ఫురితాధరసుమపరాగశోణా వాణీ!
స్వరగుణజిత,హితకారీ!
బిరికీధర,సురప రాగవీణాపాణీ!
సు ర గ ణ ను త సి త నా రీ! స్ఫు రి తా ధ ర సు మ ప రా గ శో ణా వా ణీ!
స్వ ర గు ణ జి త హి త కా రీ ! బి రి కీ ధ ర , సు ర ప రా గ వీ ణా పా ణీ!
(ప్రతి రెండవ అక్షరమూ ఒకటిగా ఉండును. ఆకుపచ్చ రంగు అక్షరములతో సూచింపబడినది)
సురగణనుత = దేవతాగణముచే కొలువబడినది
సితనారీ = సర్వశుక్ల అయిన యువతి (యా కుంద ఇందు తుషార హార ధవళా)
స్ఫురితాధరసుమపరాగశోణా
స్ఫురిత = తళుకులీను
అధర = పెదవి
సుమపరాగ శోణా = పుష్పముల పుప్పొడి వలె ఎఱ్ఱనైనది
వాణీ = సరస్వతీ
స్వరగుణజిత = స్వరముల యొక్క స్వభావములను జయించినది
హితకారీ = హితము గూర్చునది
బిరికీధర = చెవిపోగు ధరించినది
సురప రాగవీణాపాణీ
సురప = సురులకుపతి సురపుడు అంటే ఇంద్రుడు. ఇంద్రుడు అంటే శ్రేష్టుడు, శ్రేష్టము అని అన్వయం
లేదా సుర అంటే అమృతము. సురప అంటే అమృతపు అని అన్వయం
రాగవీణా = రాగములను పలికించు వీణను
పాణీ = చే ధరించినది.
గోమూత్రికా బంధములో రకరకములు ఉన్నవి. అక్షరములతో మాత్రమే కాక పదములతో గోమూత్రిక చేకూర్చడమూ ఒక పద్ధతి అట.
పద్యమూ..దాని అర్ధమూ చాలా బాగున్నాయండీ. అంతవరకే నాకున్న జ్ఞానము.
రిప్లయితొలగించండి