చిత్రభారతీ పంచకము - 1

నమస్కారం. భారతీ కృపతో, పెద్దలు, గురువర్యుల ఆశీస్సులతో, మిత్రుల ప్రోత్సాహంతో, బంధకవిత్వం మీద ఆసక్తితో నేను ప్రయత్నించిన పద్యాలివి. దోషములున్న మన్నించదగును. మొట్టమొదటిగా, భారతీదేవిని చిన్న పద్యంతో సింహాసనారూఢను చేసికవనముతో నుతిచేద్దాము. సింహాసన బంధము కం || కలువల చెలువమునఁ గనులు వెలుగఁగ ముత్తియపుకాంతి వెలితో దంతం బులతతి యలరుచు, నుతిచే పిలువఁగ పలికెడి సుదతిని పేర్మి భజింతున్. చెలువము = విధము, అందము పద్యానికి పాటించిన నియమములు. 1. పద్యము కందమనే ఛందస్సులో వ్రాయబడినది. 2. మొదటి పద్య నియమావళిననుసరింపబడినది. ( నియమములిక్కడ) 3. సింహాసన బంధములో మధ్య వరుస అక్షరములు కలిపి చదివిన అర్థవంతమైన వాక్యము రావలెను. పద్యమునకవనముతో నుతిఅన్న వాక్యం వస్తుంది. బొమ్మలో గమనించండి. 4. సింహాసనమున ప్రతి వరుసలోనూ మధ్య అక్షరానికి అటూ ఇటూ సమముగా అక్షరములుండవలెను. అయితే ఇది ఖచ్చితమైన లక్షణముగ పేర్కొనబడి ఉండుట చూడలేదు. బాగుగా చూడటానికి బొమ్మపై నొక్కండి.

కామెంట్‌లు

  1. నా రవికి నుతులు.( సింహాసన బంధము )

    నా వరదుఁడ! మన వి వినన్
    నీ వర కిది యోగ్యము కద!నీ;నుత నామం
    బే వీడ ధ్యాన గ తులను.
    రావయ కరి వరద మేలువ్రాయగ నుదుటన్

    నా
    వరదుఁ
    నీ నన్.వి వినమ.డ!
    వరకిదియో
    బేమం;నాతనునీ.ద!కముగ్య
    వీడధ్యానగతులను.రావ
    టన్.దునుగయవ్రాలుమే దరవ రిక య!

    రిప్లయితొలగించండి
  2. రవి గారూ,
    సింహాసన బంధం నాకు కొత్తది. ఏ లక్షణగ్రంథంలోను చూచినట్లు జ్ఞాపకం లేదు. అయినా బాగుంది. కాని మీ పద్యంలో రెండు పాదాల్లోనూ యతిదోషం ఉంది. మీ స్ఫూర్తితో నేనూ ఒక సింహాసన బంధాన్ని వ్రాసాను. నా దగ్గర స్కానర్ లేదు. అందులోను ఆదివారం. అందువల్ల నా పద్యాన్ని రేపు నా బ్లాగులో "చమత్కార పద్యాలు" శీర్షికలో పెడతాను. ప్రస్తుతానికి ఆ పద్యం .....

    కంసాది రాక్షసాంతక!
    శంసిత పద! గరుడ గమన! కరుణాంబునిధీ!
    సంసార నిరత కలుష
    ధ్వంసక! నెయ్యమున నన్ను దయఁ గనుము సదా!

    కం
    సాదిరా
    దపతసిశంకతసాంక్ష
    గరుడగమనకరుణాంబునిధీ
    షలుకతరనిరసాసం
    ధ్వంసకనెయ్యముననన్ను
    దాసమునుగయద.

    ఇందులో మధ్య అక్షరాలను చదివితే "కంది శంకరయ్యను" అని వస్తుంది.

    రిప్లయితొలగించండి
  3. కంది శంకరయ్య గారు,

    ప,ఫ,బ,భ,మ,వ లకు యతి కుదురుతుందని ఇక్కడ ఉన్నది. నేను ఆ వ్యాసప్రకారం నడుచుకుంటున్నాను. రెండవ పాదంలోని ’వె’ కు, ’మి’ కు, నాలుగవ పాదంలోని ’బి’ కు, ’మీ’ కు యతి కుదరదంటారా? వివరించగలరా?

    రిప్లయితొలగించండి
  4. కలువల చెలువమునఁ గనులు
    వెలుగఁగ ముత్తియపుకాంతి వెలితో దంతం
    బులతతి యలరుచు, నుతిచే
    పిలువఁగ పలికెడి సుదతిని పేర్మి భజింతున్.

    పై మార్పు వలన దోషం తొలగిపోతుందా? చెప్పగలరు.

    రిప్లయితొలగించండి
  5. రవి గారూ,
    పద్యం.నెట్ లోని ఆ వ్యాసాన్ని చూసాను. అదేదో లేఖన దోషం. అంతటి మంచి వ్యాసం వ్రాసిన వ్యక్తి అలాంటి తప్పు చేయడు. కేవలం ప-ఫ-బ-భ-వ లకే యతిమైత్రి చెల్లుతుంది. అయితే పు-ఫు-బు-భు-ము లకు యతి చెల్లుతుంది. ఉ-ఊ-ఒ-ఓ లు తప్ప మిగతా అచ్చులతో కూడిన ప-ఫ-బ-భ లకు మ వర్ణానికి యతిమైత్రి చెల్లదు. గమనించగలరు. మీరు చింతా రామకృష్ణారావు గారిని కాని, డా. ఆచార్య ఫణీంద్ర గారిని కాని అడిగి సందేహనివృత్తి చేసికోవచ్చు.
    మీరు చేసిన సవరణ వల్ల దోషం తొలగి పోయింది. సంతోషం.
    భవదీయిడు,
    కంది శంకరయ్య.

    రిప్లయితొలగించండి
  6. అవునండి. ఈ మధ్యనే కొన్న సులక్షణ సారము చూశాను. మీరు చెప్పిన విధంగానే ఉన్నది. సవరించిన పద్యం ప్రచురించాను. అనేకానేక నమస్సులు మీకు.

    చింతా వారు, ఆచార్య ఫణీంద్ర గారే కాదు, మీరు కూడా పెద్దలే. మీరూ నా వంటి పిన్నల సందేహ నివృత్తి చేయవచ్చు.

    రిప్లయితొలగించండి
  7. రవి గారు, ఈ బంధములు కూడా చతుఃషష్టి ఉన్నాయా?

    రిప్లయితొలగించండి
  8. @వూకదంపుడు గారు: అలా ఖచ్చితంగా ఇన్నని లేవండి. సాధారణంగా ప్రాచుర్యంలో ఉన్న చిత్రాలనే కాక, కొత్తకొత్త చిత్రాలతో కూడా ప్రయోగాలు చేస్తున్నారు. భవిష్యత్తులో ఎవరైనా సెల్ ఫోన్ బంధాలు, టీవీ బంధాలు కూడా చేస్తారేమో!

    అలానే ఈ ప్రక్రియ, తమిళ, కన్నడ, హిందీల్లో కూడా ఉన్నది.

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Comments ridiculing, abusing, bullying and forcing to agree in any form, if objectionable to the blog owner will be removed.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వాఙ్మయచరిత్రలో కొన్ని వ్యాసఘట్టాలు - శ్రీ ఏల్చూరి మురళీధరరావు గారు.

అశోకుడెవరు? - 1

ముకుందవిలాసః - కుంటిమద్ది శేషశర్మ.