చిత్రభారతీ పంచకము - 3

మూడవ బంధము స్వరకల్పిత డిండిమము. డిండిమము అంటే ఢమరుక.స్వరాల కల్పవల్లి అంబకు డిండిమ స్వరాల నీరాజనం. స్వర కల్పిత డిండిమము కం|| రాజిత రజనీకరసువి రాజిత రంజిత సరోజ రాజ సుహాసీ! రాజిత సార సుర, జలజ రాజి తనూలత సుగంధి రహి సారతరా! రాజిత = ప్రకాశించు రజనీకర = చంద్రుని వలె సువిరాజిత = అందముగను, మిక్కిలి ప్రకాశముగను, రంజిత = రంజింపజేయు, సరోజ రాజ = శతదళపద్మము వంటి సుహాసీ = అందమైన చిరునగవు కలిగిన దానా. రాజిత సార సుర = అమృతముల సారము వలె శ్రేష్టమైనదానా. (స్వరముల సారముతో రాజిల్లునది) జలజ రాజి తనూలత సుగంధి = పద్మముల రాశిచే (పూజించబడిన/నొప్పుచు) తనూలతచే సుగంధము చిందుచు రహి సారతరా = శ్రేష్టమైన ఆనందములకు నెలవైనదానా. ఈ బంధంలో పద్యము మొదటి అక్షరం, చివరి అక్షరం ఒకటిగా ఉండవలెను. రెండవ, నాలుగవ పాదముల మొదటి అక్షరములునూ ఆవృత్తి కావలెను. ఈ పద్యము నిరోష్ట్యము కూడా. అంటే పెదవులు కలువనవసరం లేకనే ఉచ్ఛరింపబడునది.

కామెంట్‌లు

  1. నాగమురళిగారి బ్లాగ్ మీద సమీక్ష వ్రాసినప్పుడే అనుకున్నాను - మీరెవరో సామన్యులు కాదని.
    అమ్మవారి దయావిశేషం. కొనసాగించండి, మాకు కూడా కాస్త పుణ్యం.

    రిప్లయితొలగించండి
  2. రవి గారూ,
    బాగుంది. చాలా బాగుంది.

    రిప్లయితొలగించండి
  3. రవి గారూ! మీ బంధాలు చాలా బాగున్నాయి. మీ పద్యాల్లో నాకు నచ్చే విషయం 'పద సొంపు ' ఇంపుగా ఉంటుంది. ఊ.దం. గారి మాటే నా మాట. మీరు సామాన్యులు కారండొఇ ... నాకైతె మీరు 'జూనియర్ చింతావారు ' అనిపిస్తున్నరు (కొత్త విసయాలు తెలియజేస్తున్నారు కాబట్టి).

    ఇంతకీ రంజిత లో పెదాలు కలవవా? కలవకూడదా?? రన్జిత అన్నట్టు పలకాలా? రమ్జిత అన్నట్టు పలకాలా? (తెలియక అడిగాను సుమీ)

    రిప్లయితొలగించండి
  4. @వూకదంపుడు గారు, @సనత్ శ్రీపతి గారు: ఈ మధ్య ఆఫీసులో పని నిండుకుండడంతో, బ్రౌణ్య గ్రంథాన్ని మథించి, గంటల కొద్దీ శ్రమ పడి, పదాలు అతికించుకుని ముక్కలు రాస్తే, ఇలా ఆడిపోసుకోవడం మీకు న్యాయంగా లేదు. :-) సనత్ గారు, మీరు చింతా వారిని అవమానిస్తున్నారు. ఇది మరింత దారుణం.

    నాగమురళి గారి బ్లాగును సమీక్షించమని శిరీష్ కుమార్ (చదువరి) గారి ఆదేశం మాత్రమేనండి. నాకంత సీను లేదని నాకు తెలుసు.:-)

    సనత్ గారు: ఈ డవుటు నాకూ వచ్చింది. అయితే దశకుమార చరితమ్ (దండి) కావ్యంలో ఏడవ ఆశ్వాసం మంత్రగుప్తుని కథ మొత్తం నిరోష్ట్యం. కవే చెబుతాడు ఆ మాట. కానీ అందులో పూర్ణానుస్వరాలు ఉన్నాయి. అందుకనే నేనూ ఈ పద్యం నిరోష్ట్యమని ఫిక్స్ అయాను. ఎవరైనా లాక్షణికులు వివరిస్తే బావుంటుంది.

    రిప్లయితొలగించండి
  5. రంజిత ను సంస్కృతంలో रञ्जित అని రాస్తారు.’రన్జిత’ అని పలకాలనుకుంటాను.

    రిప్లయితొలగించండి
  6. ఎప్పుడైనా నాగయ్యగారి ఉచ్చారణ శ్రద్ధ పెట్టి వినండి. నేను తప్పయ్యుండొచ్చు కానీ, ఈ టైపు (రన్జిత, మమ్గళ) పదాలు ఆయనలాగే పలకాలి అని అనిపిస్తుంది. సముద్రాల వారు వ్రాసి పలికిస్తే అందులో తప్పు పట్టుకోవటం ఆ సరస్వతీ దేవికి కూడా సాధ్యం కాదేమో మరి!

    PS: నాగయ్యగారి పాత పాటలు, ఉచ్చారణ వినాలంటే యూట్యూబులో "intvak21" అని సెర్చి కొట్టి వినుకోండి

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Comments ridiculing, abusing, bullying and forcing to agree in any form, if objectionable to the blog owner will be removed.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Disclaimer

అశోకుడెవరు? - 1

ధ్రువనక్షత్రం - శింశుమారుడు