వాఙ్మయచరిత్రలో కొన్ని వ్యాసఘట్టాలు - శ్రీ ఏల్చూరి మురళీధరరావు గారు.

ప్రతి తరం తన తదనంతర తరానికి వారసత్వంగా - తమ తరం నాటి అంతశ్చేతన యొక్క సారాంశాన్ని, విలువలను, ఆలోచనామృతపు మీగడతరకలను ఏదో రూపేణా అందిస్తూ రావడం మానవజాతికి సహజాతంగా వచ్చిన నేర్పు.

ఈ విధమైన వారసత్వపు ప్రదానం సాహిత్యప్రపంచంలో కూడా ప్రతిబింబిస్తున్నది. దీనికి ప్రధానకారణం - ప్రతితరంలో జన్మిస్తున్న పండితులు, సహృదయులు, అద్భుత విమర్శకులు, కవులు ఇత్యాది.

ఈ పరంపరలో ప్రస్తుతం మన కాలానికి చెందిన కవి, సహృదయవిమర్శకులు శ్రీ ఏల్చూరి మురళీధరరావు గారు. 

వీరి సాహిత్య వ్యాససంపుటి "వాఙ్మయచరిత్రలో కొన్ని వ్యాసఘట్టాలు, మరికొన్న విశేషాంశాలు" పేరుతో ఇప్పుడు లభిస్తున్నది. 

ఇటువంటి పుస్తకం, ఇంత నాణ్యతతో, ఒక్క స్ఖాలిత్యము, ముద్రారాక్షసము లేకుండా, చక్కని ప్రింట్ తో వెలువడడం ఒక్కరి వల్లనో, ఇద్దరివల్లనో సాధ్యం అయేది కాదనుకుంటాను.

ఈ కృషి వెనుక ఉన్న ప్రతి ఒక్కరికి అంబ సరస్వతి కరుణాకటాక్షాలు ప్రసాదిస్తుంది. 

శ్రీ ఏల్చూరి వారి ఈ వ్యాససంకలనాన్ని - ఒక పుల్లెల రామచంద్రుడు గారి వ్యాససంకలనం తోనూ, సంస్కృత సాహిత్యం మీద ఆంగ్లంలో అద్భుత విమర్శలు వెలయించిన శ్రీ రాఘవన్ గారి వ్యాసాలతోనూ పోల్చవచ్చు. బహుశా కొన్ని అంశాలలో ఒకట్రెండు మెట్లు పైన కూడా ఉండవచ్చు.

ఇటువంటి అద్భుత విమర్శలు ఇదివరకటి తరం లో షష్ట్యబ్ది సంచికలలోనూ, కొన్ని విశేష సందర్భాలలోనూ మాన్యులు కొందరు, భారతి ఇత్యాది పత్రికల ప్రోద్బలంతో వెలువడినట్లు తెలియవచ్చీని. 

సాహిత్యం, భాష ల మీద ఆదరణ లుప్తమైన ఈరోజుల్లో ఈ సంకలనాన్ని అజోవిభో వారు ముద్రించటం - తెలుగుసరస్వతికి నిరుపమానమైన సేవ.

*******

750 పేజీల అమూల్యమైన ఈ వ్యాససంపుటిలో మొత్తం 64 వ్యాసాలు ఉన్నాయి. 

ఇందులో దాదాపు 34 విమర్శ వ్యాసాలు ప్రాచీనకవిత్వాంశాలకు చెందినవి. 

మిగిలిన 30 ఆధునిక కవులపైని వ్యాసాలు, కొన్ని మ్యూజింగ్స్.

ఈ ఆధునిక వ్యాసాలకు ప్రత్యేక శీర్షిక ఏర్పరచి ఉంటే బావుండేది. 

ఈ పుస్తకంలో  అద్భుతమైన విమర్శలు. ఇందులో నిశితపరిశీలనలు, విస్తృతమైన ఆలంకారిక విషయాలు, సూక్ష్మంగా అర్థం చేసుకోవలసిన సంగతులు, బహుముఖీనమైన పాండిత్యం, హృద్యమైన వివరణలు ఇలా ఎన్నో నిండారి ఉన్నాయి.

ఇంతటి విస్తృతమైన విమర్శ వ్యాససంపుటిని - పునర్విమర్శించటం మతిలేని పని. నిజానికి నేటి కాలంలో ఈ విమర్శలను ఆ స్థాయికి తగినట్లు చదివి, కనీసం 40 % వరకూ అయినా ఆ వ్యాసాల స్వసామర్థ్యంతో అర్థం చేసుకోవడం సాహిత్యాన్ని కూలంకషంగా అధ్యయనం చేస్తూ ఉన్న సాహిత్య విద్యార్థులకు, మాన్యులకు కూడా సులభం కావు. 

అలా అని ఈ వ్యాససంపుటిలో విషయాలు అత్యంత గహనమైనవి, తలబొప్పి కట్టించే సైద్ధాంతిక నేపథ్యం గలవీ కాదు.

ఈ వ్యాసాల ద్వారా తెలుగు ప్రాచీన కవుల శైలి, శిల్పనైపుణ్యం, ఇతివృత్తనిర్వహణ, గ్రంథగ్రంథులు, వాటి పరిష్కరణ, వాటి పరిష్కరణ, తెనుగు కవిశేఖరుల విభిన్న ప్రయోగాలు - ఇలా అనేకవిషయాలపై విస్తృత అవగాహన సాధ్యపడుతుంది.

విమర్శ - పద్ధతి.

ఒక చక్కని కవిత్వానికి, అది ఆధునిక వచనశైలిలో నిర్మించినదైనా, ఛందో బద్ధమైన పద్యరూపంలో ఉన్నా, క్లుప్తత అన్నది రీతి, శయ్య, ధ్వని, వక్రోక్తి ఇత్యాది హంగులతో బాటూ ఒక మౌలిక అవసరం. "అల్పాక్షర అనల్పార్థ రచన" గా కాళిదాసాది కవుల కవిత్వానికి పేరు. 

కవిత్వంలో ఒక్క వ్యర్థపదం కనిపించినా ఆలంకారికులు, కొన్ని సందర్భాల్లో పండితప్రకాండులు చీల్చి చెండాడి కానీ వదలలేదు. 

ఒక "చ" కారం మీద సంస్కృత పండితులు తీవ్రంగా చర్చించుకున్న ఉదంతం భారతీయ వాఙ్మయంలో ఉంది.

క్లుప్తత, వ్యర్థశబ్ద పరిహరణ కవిత్వానికి మౌలికమైన అవసరాలు.

విమర్శకు విస్తృతి అవసరం. అయితే ఈ విస్తృతి కేవలం విస్తృతి కోసమని ఉండరాదు. విస్తృతి వస్తునిష్టమై ఉండాలి. 

అట్లే విమర్శలో - వస్తువుకు చెందని వ్యర్థవిషయాల ప్రస్తావన, ఉండరాదు. 

పరిధి, విస్తృతి ఈ రెంటి నిర్వహణ - విమర్శలో స్పష్టంగా ఉండాలి. 

ఏల్చూరి వారి వ్యాసాలు పుస్తకరూపం పొందక మునుపు వివిధ పత్రికలలో వ్యాసరూపంలో వచ్చినవి. అప్పుడు ఆ వ్యాసాలను అధ్యయనం చేసి, ఒక సామాన్యుడు (నేను) నేర్చుకున్న అంశాలే ఆ రెండున్నూ.

ఉత్తమ విమర్శ పాఠకుడిని ఒక పరిశీలకుడిగా, ఆలోచనాపరుడిగా, జిజ్ఞాసువుగా మారుస్తుంది. 

ఇది రెండురకాలుగా జరుగుతుంది అని వ్యక్తిగతంగా నా (ఈ వ్యాసకర్త) వివేచన.

1. మొదటిది. విమర్శకుడు విషయప్రతిపాదన చేస్తూ, పలు రెఫరెన్స్ లను, ఆలంకారిక అంశాలను స్పృశిస్తాడు. కొన్ని సార్లు వివరిస్తాడు.  విమర్శకుడు చూపిన రెఫరెన్సులను పాఠకుడు తనంతట తానుగా కొంతమేరకు అధ్యయనం చేస్తే, పాఠకుడికి తనదైన పరిశీలన ఒకటి ఏర్పడే అవకాశం ఉంది. అట్లే విషయం సమర్థవంతంగా అర్థమూ అవుతుంది. కొత్త కోణాలు స్ఫురించే అవకాశం ఉంది. 

ఇందుకు కేస్ స్టడీ గా ఒక ఉదాహరణ తీసుకొందాం.

పదకవితాపితామహుడు అన్నమాచార్యుని శృంగారమంజరి కావ్యాన్ని గురించి ఏల్చూరి వారు "అన్నమయ్య భక్తి శృంగారమంజరి" అన్న మకుటంతో వ్యాసం వ్రాశారు.

అందులో ఈ శృంగారమంజరి కావ్యం - ఆశువు, మధురము, చిత్రము, విస్తరము - అన్న నాలుగు కవితాపద్ధతులలో మధురకవితాశాఖకు చెందినదని వింగడిస్తూ ఈ క్రింది వాక్యాన్ని వ్రాశారు.

"ఈ మాధుర్యం సోమేశ్వరుడు అభిలషితార్థచింతామణిలో లలితైరక్షరైర్యుక్తం శృంగారరసరంజితమ్, శ్రవ్యం నాదసమోపేతం మధురం ప్రమదాప్రియమ్" అని వివరించినట్లు ఒక కావ్యగుణం."

మాధుర్య గుణానికి ఇతర ఆలంకారికుల నిర్వచనాలు చూద్దాం.

"ఆహ్లాదకత్వం మాధుర్యం శృంగారే ద్రుతికారణం" (ఆహ్లాదకత్వమైన మాధుర్యగుణం, శృంగారాదులలో చిత్తద్రుతికి కారణమైనది) - కావ్యప్రకాశం.

కావ్యాదర్శకారుడు దండి "రసానుగుణమైన శబ్దార్థాల కూర్పు" మాధుర్యం అని చెప్పాడు. (వాచి వస్తున్యపి రసస్థితిః, మాధుర్యం రసవత్)

జయదేవుడు చంద్రాలోకంలో మాధుర్యాన్ని ఉక్తివైచిత్రి గానూ, అందమైన శబ్దాలను కలిగినది గానూ వింగడించాడు ( మధుర్యే పునరుక్తి వైచిత్ర్యం, చారుతావహమ్)

పండితజగన్నాథుడు కూడా మాధుర్యాన్ని, శబ్దగుణంగానూ అర్థగుణంగానూ వింగడించి, శబ్దగుణాలలో అలతి అలతి పదాలను కలిగి ఉండటాన్ని, సుదీర్ఘసమాసభరితం కాని సంవిధానాన్ని మాధుర్యం అంటాడు. అర్థగుణంగా చంద్రాలోకకారుడి నిర్వచనాన్నే ఉపయోగించుకొన్నాడు.

ఆలంకారిక గ్రంథాలలో ఏ ఒక్క గ్రంథమో, ఏ ఒక్క సిద్ధాంతమో కవిత్వపు తీరును చెప్పదు. అయితే ఏ గ్రంథమూ తోసివేయతగిందీ కాదు.

ఒక కావ్యాన్ని స్పష్టంగా వివేచించి,  అర్థం చేసుకుందుకు తదనుగుణ్యమైన ఆలంకారిక గ్రంథాన్ని, ఆ ఆలంకారికుని గ్రంథం నుండి తగిన నిర్వచనాన్ని గుర్తుకు తెచ్చుకోవలసి ఉంది.

ఏల్చూరి వారు - అభిలషితార్థ చింతామణి లో వింగడించిన మాధుర్యపు నిర్వచనాన్ని అన్నమయ్య కావ్యానికి అన్వయిస్తూ చెప్పడం వెనుక ఒక విస్తృత గ్రంథ పరిచయం, పండితులకే సాధ్యమైన సద్యఃస్ఫురణ, నిశితమైన దృష్టి ఉన్నాయి. 

ఆ మాధుర్యనిర్వచనం ఏదో ఒక నిర్వచనం ఎంచుకోవాలి కనుక ఎంచుకొన్నది కాదు. అభిలషితార్థ చింతామణి గ్రంథం యొక్క నిర్వచనమే ఇక్కడ అన్నమయ్య కావ్యాన్ని స్పష్టంగా నిర్వచిస్తుంది. అందుకే సరిగ్గా ఆ కావ్యంలో మాధుర్యపు ప్రస్తావన!

పండితులకు తాము చెప్పబోయే విషయానికి తగిన పనిమిట్లు అలా అలవోకగా లభిస్తాయి.

గ్రంథకర్తతో బాటు ఒక పాఠకుడు వ్యాసంలో ప్రతిపాదించబదే వస్తువుకు, ఆ వస్తువును ఉద్యోతించడానికి కవి ఏర్పరచుకున్న రెఫరెన్స్ లను చూచి  పరిశీలనకు పూనుకొన్నప్పుడు, అది ఆసక్తిని రేకెత్తించడంతో బాటు, పలు విషయాలను నేర్పుతుంది.

2.

ఉత్తమవిమర్శ సాధారణ పాఠకుడిని కూడా, ఒక జిజ్ఞాసువుగా మారుస్తుంది. ఇందుకు పైన చెప్పిన ఆలంకారిక శాస్త్ర ప్రస్తావనలు కాక, సందర్భోచితంగా చెప్పే కొన్ని వ్యాఖ్యలూ దోహదం చేస్తాయి.

ఏల్చూరి వారు ఒక వ్యాసంలో కన్నడ కవి నేమిచంద్రుని గురించి ప్రాస్తావికంగా చెబుతూ, ఆయన కావ్యాల నుంచి తెనుగు కవులు వర్ణనలను స్వీకరించినట్లు తెలిపారు. 

సాధారణంగా కన్నడభాష ప్రాచీన కావ్యాలలో వర్ణనలు కొంచెం తక్కువ. వర్ణనలు ఎప్పుడూ వస్తువుకు అనుగుణంగా మాత్రమే నిర్మించడం కన్నడ కావ్యాల తీరు. ఆ వర్ణనలు కూడా మరీ గాఢమైనవి, గహనమైనవి, మిరుమిట్లు గొలిపే స్థాయిలో ఉండవు.

దరిమిలా వాసిలోనూ, రాశిలోనూ తెలుగు కావ్యాలలోనే వర్ణనలు హెచ్చు. తెనుగు కవులకే భాషాపరంగా, భావపరంగా విస్తృతి ఉంది. 

ఇలా ఆలోచించినప్పుడు ఒక కన్నడ కవి నేమిచంద్రుడు తెనుగు కవులను ప్రభావితం చెయ్యడం ఆసక్తికరమైన విషయం.

శ్రీ ఏల్చూరి వారి పరిశీలన సహాయంతో నేమిచంద్రుని కావ్యం అర్థనేమి పురాణం పరిశీలిస్తున్నప్పుడు, కేవలం ఔత్సాహికుడైన నాకు అందులో త్రివిక్రముని వర్ణన కనిపించింది. 

(తెనుగు త్రివిక్రమ వర్ణనను కూడా ఏల్చూరి వారు పోతన కవితాశిల్పం వ్యాసంలో రోచకంగా వివరించారు).

ప్రాస్తావికంగా ఒక విమర్శ వ్యాసంలో చెప్పిన అంశం, అధ్యయనానికి పాఠకుడికొక కొత్త విషయం తెలుసుకోవడానికి ఉపయోగపడింది - అని చెప్పటానికి ఈ సంగతి.

ఈ గుణం పుట్టపర్తి వారి విమర్శలో మెండుగా ఉంది. ఏల్చూరి వారి విమర్శల్లోనూ ఇది ఉంది. 

ఇవి రెండు అంశాలు.

అలా ఉంచితే ఈ గ్రంథంలో ప్రాచీనసాహిత్యంపై వ్రాసిన ప్రతీ వ్యాసం ఒక నిధి. కొన్ని అంశాలు, మరింతగా అధ్యయనం చేయవలసినవి, పరిశోధించదగినవి ఉన్నాయి. ఒకట్రెండు చోట్ల విభేదం కూడా ఉండవచ్చు. కానీ అది విషయపరిశీలన విషయంలోనే కానీ, గ్రంథకర్త విషయంలో కాదు.

ఒక్కొక్క వ్యాసం గురించి వివరంగా విస్తృతంగా మథించి ఇంకా బాగా వ్రాయవలసి ఉంది. ఈ పనిని కొంతమేరకు శ్రీనివాస్ న్యాయపతి గారు, మాన్యులు, చక్కని కవులు అయిన చంద్రశేఖర్ చీర్ల గారు చేశారు. ఎంత చేసినా తక్కువే.

********

ముగింపు.

ఇందాకే చెప్పినట్లు ఈ వ్యాసాల గురించి మరింత విస్తృతంగా, వివరంగా వ్రాయవలసి ఉంది. అంతకు ముందు అధ్యయనం చెయ్యవలసి ఉంది. 

ఈ వ్యాసం ఆ పుస్తకాన్ని గురించి చెప్పటానికి ఏ విధంగా కూడా తగదు.

కానీ అవసరంగా ఈ వ్యాసం వ్రాయటానికి కారణం ఉంది.

పుస్తకాల ప్రదర్శనలు జరుగుతున్న ఈ రోజుల్లో ఈ పుస్తకం గురించి చెప్పాలని ఆశ.

సరస్వతీ స్వరూపమైన కొన్ని గ్రంథాలను మనం ఇంట పెట్టుకోవాలి. పోతన మహాభాగవతాన్ని క్రితం తరం వరకూ తెలుగుజాతి మందసాల్లో పెట్టుకొని పూజించింది. ఆ మహనీయుని పుస్తకం ఇంట ఉండడమే తెనుగునాట ఎందర్నో సంస్కారవంతులుగా తీర్చిదిద్దింది.

మరీ మందసాలలో పెట్టుకోకపోయినా, తెలుగు నేర్చిన ప్రతివారు, తెలుగును అభిమానించే వారందరూ "వాఙ్మయచరిత్రలో కొన్ని వ్యాసఘట్టాలు" గ్రంథాన్ని ఇంటిలో పెట్టుకొని తీరాలి.

ఇది ఒక పండితునికి, తెనుగుసరస్వతికి,ఎంతో ముగ్ధమైన , అందమైన , అద్భుతమైన తెనుగు భాషకు, తెనుగు వారసత్వానికి మనం ఇచ్చే గౌరవం, బాధ్యత కూడా.

ఆపై - 

కాలోహ్యయం నిరవధిః విపులా చ పృథ్వీ. 


అంతే!


కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Comments ridiculing, abusing, bullying and forcing to agree in any form, if objectionable to the blog owner will be removed.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అశోకుడెవరు? - 1

ముకుందవిలాసః - కుంటిమద్ది శేషశర్మ.