27, మే 2022, శుక్రవారం

శిశుపాలవధమ్ నాలుగవ సర్గ తెలుగు టీక, తాత్పర్యములు - ముగింపు (61 - 68)

౬౧.

త్వక్సారరంధ్రపరిపూరణలబ్ధగీతిః

అస్మిన్నసౌ మృదితపక్ష్మలరల్లకాంగః ।

కస్తూరికామృగవిమర్దసుగంధిరేతి

రాగీవ సక్తిమధికాం విషయేషు వాయుః ॥ 

అస్మిన్ = ఈ పర్వతమందు; త్వక్సారరంధ్రపరిపూరణలబ్ధగీతిః; త్వక్సార = మురళి యొక్క; రంధ్ర = చిల్లులను; పరిపూరణ = నింపుట చేత; లబ్ధగీతిః = పొందిన గానములు; మృదితపక్ష్మల = మర్దించిన ఱెప్పలుగలరల్లకాంగః = కంబల మృగముల; మరియు; కస్తూరికామృగవిమర్దసుగంధిః; కస్తూరికామృగ = పునుగుపిల్లి; విమర్ద = సంస్పర్శ గల; సుగంధిః = పరిమళము; అసౌ = ఈ విధముగా పరిణమించిన; రాగి ఇవ =  మోహమునొందినట్లు; విషయేషు = జనపదములలో; అధికాం సక్తిం = గొప్ప వ్యాప్తితో; ఏతి = వెడలుచున్నది.  


ఈ సానువుల జనపదములందు ఉన్మీలించిన కనులు గల కంబలమృగము; మఱియు పునుగుపిల్లి శరీరమును తాకుటచే అలదుకున్న సుగంధమును వహించిన గాలి మురళి యొక్క రంధ్రములను పూరించిన వాయువు గీతిరూపము వొందినట్లు సరాగముతో అధికముగా వీయుచున్నది. 

సర్వంకష -

వంశే త్వక్సార కర్మాస్త్వచిసార తృణధ్వజాః - ఇత్యమరః

రల్లకః కంబలమృగే కంబలే పరికీర్తితః - ఇతి వైజయంతీ

విషయః స్యాత్ ఇంద్రియార్థే దేశే జనపదే౽పి చ - ఇతి విశ్వః 

౬౨.

ప్రీత్యై యూనాం వ్యవహితతపనాం ప్రౌఢధ్వాంతం దినమిహ జలదాః ।

దోషామన్యం విదధతి సురతక్రీడాయాసశ్రమశమపటవః ॥


ఇహ = ఈ భూధరమునయూనాం = యువతీయువకుల; ప్రీత్యై = ప్రీతి కొరకు; వ్యవహిత తపనాః = తిరోహిత సూర్యకిరణములు గలవి; (అత ఏవ = ఇంకనూ) సురతక్రీడాయాసశ్రమశమపటవః ; సురతక్రీడా = ప్రణయక్రీడల వల్ల నొందిన; ఆయాస = క్లేశము; శ్రమ = బడలికలను; శమ = శాంతింపజేయుటకు; పటవః = సమర్థములైన; జలదాః = మబ్బులు;దినం = పగటినిప్రౌఢధ్వాంతం = గాఢాంధకారమయిన;   దోషామన్యం = రాత్రిని వలే; విదధతి = చేయుచున్నది; 

కమలాక్ష!

ఈ భూధరమున శృంగారాభిలాషులైన యువతీయువకుల ప్రీతికై వెనుకకు మరలిన సూర్యకిరణములు గలవి, ప్రణయక్రీడాయాసముల వల్ల కలిగిన బడలికను చల్లార్చుటకు సమర్థములైనవి అయిన మబ్బులు పగటిని గాఢాంధకారముగా, రాత్రిలా మార్చుచున్నవి.


సర్వంకష -

భ్రమరవిలసిత వృత్తము.  - 'మ్భౌ మ్లౌ గః స్యాత్ భ్రమరవిలసితమ్ - అని లక్షణము.

౬౩.

భగ్నో నివాసో౽యమిహాస్య పుష్పైః సదానతో యేన విషాణినా౽గః ।

తీవ్రాణి తేనోజ్ఝతి కోపితో౽సౌ సదానతోయేన విషాణి నాగః ॥ 

ఇహ = ఇక్కడ; అస్య = సర్పము యొక్క; నివాసః = ఆవాసము; సదా = ఎప్పుడూ; పుష్పైః = కుసుమముల (భారము) చేత; నతః = వంగిన; అయం అగః = ఈ తరువు; సదానతోయైః = మదోదకముల చేత; యేన విషాణినా = ఏ గజముచేత; భగ్నః = ధ్వంసమయినదో ; తేన = ఆ ఏనుగు చేత; కోపితః = కోపించిన; అసౌ నాగః = ఈ సర్పము; తీవ్రాణి విషాణి = తీవ్రమైన గరళమును; ఉజ్ఝతి = క్రక్కుచున్నది;   


ఈ రైవతకమందు ఏ వృక్షము సర్పము నకు ఆవాసమై, సదా కుసుమమముల భారము చేత వ్రంగి యున్నదో అట్టి వృక్షము - ఏనుగు మదజలస్రావము చేత ధ్వంసమయినది. అట్లు ధ్వంసమైన తమ ఆవాసములను గురించి కుపితమైన సర్పము తీవ్రమైన గరళమును క్రక్కుచు తన క్రోధమును వెలిబుచ్చుచున్నది. 

సర్వంకష

శత్రువుపై ప్రతీకారము సలుపుటకు అసమర్థమైన జీవి తన ఆవాసస్థానమునకే హాని కల్పించునని ఈ శ్లోకము యొక్క భావము. 

ఇతరములు

మరల ఈ శ్లోకము ద్విపాదయమకము.

న గచ్ఛతీతి అగః - పర్వతము. అగజానన పద్మార్కం అనే స్తోత్రంలో అగజః అంటే పర్వతరాజపుత్రి అయిన పార్వతి. 


ఇక్కడ మాఘుడు అగ శబ్దానికి ఉన్న రూఢ్యర్థాన్ని కాక అగః అంటే చెట్టు అన్న అర్థాన్ని ఉపయోగించటం విశేషం. 

౬౪.

ప్రాలేయశీతలమచలేశ్వరమీశ్వరో౽పి

సాంద్రేభచర్మవసనావరణో౽ధిశేతే ।

సర్వర్తునిర్వృతికరే నివసన్నుపైతి

న ద్వంద్వదుఃఖమిహ కిఞ్చిదకిఞ్చనో౽పి ॥


ఈశ్వరః అపి = ఆ శంకరుడు కూడా; (ఇంక ఇతరుల సంగతేల? యని భావము) సాంద్ర-ఇభ-చర్మ-వసన-ఆవరణః = దట్టమైన గజ చర్మ వస్త్రములను చుట్టుకొని; (దిగంబరుడైన పరమశివుడే గజచర్మములను ధరించుట యను సూచన); ప్రాలేయశీతలమచలేశ్వరం; ప్రాలేయ = మంచు చేత (ప్రలయాదాగతం ప్రాలేయం - ప్రలయము నుండి వచ్చినది  ప్రాలేయము. మంచు) శీతలం = చల్లనైన; అచలేశ్వరం = నగరాజు హిమాలయమును; అధిశేతే = నివాసముగా చేసికొనియున్నాడు; సర్వర్తునిర్వృతికరే; సర్వ ఋతు = అన్ని ఋతువులయందు; నిర్వృతికరే = సుఖమును గూర్చు; ఇహ = ఈ రైవతక అద్రియందు; నివసన్ =నివాసమున్న; అకిఞ్చనః అపి = ఏమియునూ లేని దరిద్రుడైనను; ద్వంద్వదుఃఖం = శీతోష్ణదుఃఖములను; కిఞ్చిత్ =కొంచమైననున ఉపైతి = పొందడు. 

ద్వారకేశా!

భగవంతుడైన ఈశ్వరుడున్నూ దళసరి యేనుగు చర్మమును తన ఒంటిపై చుట్టుకొని అతిశీతలమైన హిమాలయముపై నివాసమున్నాడు. అన్ని ఋతువులయందూ సుఖమునొసగుచూ ఈ రైవతకాద్రియందు నివసించు పేదవాడైనను శీతోష్ణదుఃఖములను కొంచమైననూ పొందడు.


సర్వంకష - ద్వంద్వయుగ్మహిమ ఉష్ణాది మిథునం కలహో రహః - ఇతి వైజయంతీ.

ఇక్కడ ఉపమానము = హిమవత్పర్వతము. ఉపమేయము - రైవతకాద్రి. ఉపమేయముకంటే ఉపమానం ఉన్నతమైనందున వ్యతిరేకాలంకారము.

ఇతరములు

ఈశ్వర శబ్దము సాభిప్రాయం. ఈశ్వరఃఈశ్వరుడంటే గొప్ప ఐశ్వర్యానికి సూచన. అట్టి ఈశ్వరుడు కూడా హిమాలయాల్లో కష్టపడ్డాడు. ఈ రైవతకంలో నిరుపేద కూడా వాతావరణప్రభావం వల్ల కష్టపడడు అని తాత్పర్యం.

౬౫.

నవనగవనలేఖాశ్యామమధ్యాభిరాభిః

స్ఫటికకటకభూభిర్నాటయత్యేష శైలః ।

అహిపరికరభాజో భాస్మనైరంగరాగైః

అధిగతధవలిమ్నః శూలపాణేరభిఖ్యామ్ ॥


ఏష శైలః = ఈ నగము; నవనగవనలేఖాశ్యామమధ్యాభిరాభిః ; నవ = నూత్నమైన; నగవనలేఖా = తరువనపంక్తులచేత; శ్యామమధ్యాభిః = నల్లని మధ్యభాగము (నడుము) యొక్క; ఆభిః = శోభలచేత; స్ఫటికకటకభూభిః = స్ఫటికంపు రాల ప్రదేశముతో; అహిపరికరభాజః = సర్పములే గాత్రబంధములుగా గలదై; భాస్మనైః = భస్మమయమైన; అంగరాగైః = మైపూతల చేత; అధిగతధవలిమ్నః = చేకూరిన శ్వేతవర్ణము గల; శూలపాణేః = త్రిశూలపాణియైన పరమేశ్వరుని; అభిఖ్యాం = సొబగును; నాటయతి = వ్యక్తీకరించుచున్నది; 

రుక్మిణీధవా!

ఈ నగము నూత్న తరుపంక్తులచేత నల్లని మధ్యభాగముతో శోభలీనుచూ, స్ఫటికంపురాల ప్రదేశముతో పన్నగభూషణమై, భస్మంపు మైపూతలచేత వెల్లనై, త్రిశూలపాణి పరమేశ్వరుని సొబగును నటించుచున్నది.


ఈ శ్లోకము తో రైవతక పర్వతవర్ణనము ముగిసినది.


సర్వంకష =

'భవేత్ పరికరో వ్రాతే పర్యంకపరివారయోః । ప్రగాఢే గాత్రికాబంధే వివేకారంభయోరపి॥" ఇతి విశ్వః

అభిఖ్యానామ శోభయోః - ఇత్యమరః

నిదర్శనాలంకారము. మాలినీ వృత్తము. 


౬౬.

దదద్భిరభితస్తటౌ వికచవారిజాంబూనదైః

వినోదితదినక్లమాః కృతరుచశ్చ జాంబూనదైః ।

నిషేవ్య మధుమాధవాః సరసమత్ర కాదంబరం

హరంతి రతయే రహః ప్రియతమాంగకాదంబరమ్ ॥


అత్ర = ఈ సానువులలోవికచవారిజాంబూనదైః; వికచ = వికసించిన; వారిజ = కమలముల; అంబూ = జలములను; అభితః తటౌ= ఇరుపక్కనున్న ఒడ్డులలో; దదద్భిః = కలిగిన నదైః = నదులయందు; వినోదితదినక్లమాః = పగటి యెండను డస్సి విహరించువారలు; అపి చ = మఱియు; జాంబూనదైః = పసిడియాభరణములతో; కృతరుచాః = అలంకరించుకున్నవారలు అయిన; మాధవాః = యాదవులుకాదంబరం = చెఱకు రసముతో చేసిన ; మధు = కల్లును; నిషేవ్య = గ్రోలి; సరసం = మత్తుతో; రతయే = సురతక్రీడయందు; రహః = రహస్యమునప్రియతమాంగకాదంబరమ్; ప్రియతమ అంగకాత్ = ప్రేయసుల గాత్రమునుండి; అంబరం = వస్త్రమును; హరంతి = అపహరించుచున్నారు. 


ఈ సానువులలో వికసించిన కమలముల సంస్పర్శ కలిగిన జలములు అటునిటు గల ఒడ్డులలో కలిగిన నదులయందు; పగటి యెండకు డస్సి, తమ స్త్రీలతో విహరించువారలు, పసిడి యాభరణములు తాల్చిన వారలు నగు యాదవులు, చెఱకురసమునుండి తీసిన సురను గ్రోలి మత్తులై, తమ రమణుల శరీరాంగమునుండి వసనములను అపహరించుచు సురతక్రీడానురక్తులై ఉన్నారు.


సర్వంకష -

రసో గంధే రసే స్వాదే ఇతి విశ్వః

కాదంబ కలహంసేక్ష్వోః ఇతి విశ్వః

పానసం ద్రాక్షమాధూకం ఖార్జురం తాలమైక్షవమ్ - అని నుడి.

మధు, కాదంబరి శబ్దములలో సామాన్యవిశేషపరమైన అర్థప్రతీతి వలన పునరుక్తిదోషమంటదు.

పృథ్వీ వృత్తము. - జసౌ జసలయా వసుగ్రహమతిశ్చ పృథ్వీ గురుః - ఇతి లక్షణాత్

౬౭.

దర్పణనిర్మలాసు పతితే ఘనతిమిరముషి

జ్యోతిషి రౌప్యభిత్తిషు పురః ప్రతిఫలతి ముహుః ।

వ్రీడమసమ్ముఖో౽పి రమణైరపహృతవసనాః

కాంచనకందరాసు తరుణీరిహ నయతి రవిః ॥


ఇహ = ఈశైలమునందు; రవిః = తపనుడు; దర్పణనిర్మలాసు = అద్దము వలే స్వచ్ఛమైనపురః = యెదుటనున్నరౌప్యభిత్తిషు = రజతమయమైన గోడలయందు; ఘనతిమిరముషి = సాంద్రమైన అంధకారమును హరించి; (తస్మిన్ = ఆ గోడలందు) జ్యోతిషి = తన తేజమును; కాంచనకందరాసు = సువర్ణము వలే భాసించు గుహలలో; ముహుః = మరలమరల; ప్రతిఫలతి = ప్రతిఫలించుచున్న యెడ; రమణైరపహృతవసనాః = ప్రియులచేత వస్త్రములు తొలగింపబడి; తరుణీః = ముదితలు; అసమ్ముఖో౽పి = అసమ్ముఖులు అయినను; వ్రీడం = సిగ్గును; (రవిః = తపనుడు;) నయతి = తెచ్చుచున్నాడు.


పర్వతమందు గుహలలో శృంగారక్రీడలకై పగటిపూట రమణీరమణులు  యేతెంచుచున్నారు.  అద్దమువలే స్వచ్ఛముగానున్న గుహల గోడలపై, తపనుని కాంతి యెదుట నున్న సానువులపై బడి వికిరణము చెంది ప్రతిఫలించుచున్నందువలన, ముదితల వస్త్రములను ప్రియులు తొలగించినను, వారలు (అద్ద్ములవంటి గోడలలో తమ రూపమును గాంచి) సిగ్గునందుచున్నారు. ఈ విధముగా తపనుడు ముదితలకు తన కాంతిచేత,ఆ యెడనున్న అంధకారమును అపహరించి లజ్జను చేకూర్చుచున్నాడు.


సర్వంకష -

మందాక్షం హ్రీః త్రపా వ్రీడా - ఇత్యమరః

అతిశయోక్తి అలంకారము;

వంశపత్రపతితం అను వృత్తము - దిఙ్ముని వంశపత్రపతితం మరభభనలగైః - ఇతి లక్షణాత్.


౬౮.

అనుకృతశిఖరౌఘశ్రీభిరభ్యాగతే౽సౌ

త్వయి సరభసమభ్యుత్తిష్ఠతీవాన్నిరుచ్చైః ।

ద్రుతమరుదుపనున్నైరున్నమద్భిః సహేలం

హలధరపరిధానశ్యామలైరంబువాహైః ॥


అసౌ ఉచ్చైః = ఆ సమున్నతమైన రైవతకపర్వతశ్రేష్ఠము; త్వయి అభ్యాగతే (సతి) = నీయందు అభ్యాగతుడను భావము వలన; అనుకృతశిఖరౌఘశ్రీభిః = అనుకూలత గల్గిన శిఖరసమూహముల శోభలతో; (శిఖరముల సమూహముల వృత్తాకారమున భ్రమించుట చేత); ద్రుతమరుతా = వేగముగా చలించు గాలుల చేత; ఉపనున్నైః = కదల్చబడిన; మరియు; సహేలం = విలాసముగా; ఉన్నమద్భిః = చరియలకు ఎంతో యెత్తున; హలధరపరిధానశ్యామలైః = బలరాముడు ధరించిన వస్త్రములవలే నల్లనివి యగు; అంబువాహైః = మేఘముల చేత; సరభసం = తత్తరపాటున; అభ్యుత్తష్ఠతి ఇవ = నీ సమక్షమున నుంచున్నట్లుగా; స్ఫురించుచున్నది.


జగన్నాథా! గొప్పదైన ఈ రైవతక పర్వతము నీవు అతిథిగా వచ్చుట చేత అనుకూలమైన శిఖరసమూహముల శోభలతో (శిఖరములన్నియూ నిన్ను చూచుటకునై వృత్తమున పరిభ్రమించినట్లు)ఝంఝామారుతములచేత కదలుచున్నవి, కొండచరియలకు ఎంతో యెత్తున ఉన్నవి, బలభద్రుని వస్త్రములవలే నల్లనివి అయిన మేఘములతో, నీ రాకకు తత్తరపాటుతో, నీకు అభిముఖమై నిలుచున్నట్లుగా స్ఫురించుచున్నది.


సర్వంకష -


అనుకృతశిఖరౌఘశ్రీభిః - అనుకూలత గల్గిన శిఖరసమూహముల శోభలతో;

భగవంతుని రాక చేత ఆ పర్వతము తన శిఖరములను ఆయనను చూచుటకు అనుకూలముగా ఏర్పరచుకున్న శోభలచేత (శ్రీల చేత)

శ్రీ శబ్దము - మంగళకరమును, శోభను, లక్ష్మీదేవిని కూడా సూచించును. ఇచ్చట లక్ష్మీదేవిని అన్న అర్థము నిదర్శనాలంకారము. పర్వతము భ్రమించుట అను అర్థాంతరప్రతీతి చేత భ్రాంతిమద అలంకారము వ్యంగ్యమగుచున్నది..


శిఖరములు తత్తరపాటున లేచి అభివాదము చేయుట - ఇచ్చట క్రియాస్వరూప ఉత్ప్రేక్ష. మేఘముల ఉన్నమన క్రియచేత నిదర్శనాలంకార అనుప్రాణితము కూడా. వెరసి ఉత్ప్రేక్ష, నిదర్శనముల సంకరము.

అక్షరముల ఆవృత్తి చేత వృత్త్యనుప్రాస.


మాలినీ వృత్తము- ననమయయుతేయం మాలినీ భోగిలోకైః అని లక్షణము. (న న మ య య అని గణములు)


ఇతర విశేషములుః మాఘకవి శ్రీపద లాంఛనుడు. అనగా ప్రతి సర్గ చివరి శ్లోకమున కవి "శ్రీ" శబ్దమును ప్రయోగించినాడు.

ఆశ్వాసము చివర మాలినీ వృత్తముతో ముగించుట ఒక సాంప్రదాయము.


(ఇది భారతి అన్వర్థాభిధానుండైన వాధూలసగోత్రీకుడు, రాజ్యలక్ష్మీనారాయణుల తనయుడు భవదీయుడు - మాఘకావ్యము నాలుగవ సర్గకు కూర్చిన 'విహార' నామక టీకాతాత్పర్యసహిత సంక్షిప్తవ్యాఖ్యానము సమాప్తము.)



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Comments ridiculing, abusing, bullying and forcing to agree in any form, if objectionable to the blog owner will be removed.