20, మే 2022, శుక్రవారం

శిశుపాలవధమ్ నాలుగవ సర్గ తెలుగు టీక, తాత్పర్యములు - (6 - 10)

 ౬.

ఛాయాం నిజస్త్రీచటులాలసానాం మదేన కించిచ్చటులాలసానామ్ ।

కుర్వాణముత్పింజలజాతపత్రైః విహంగమానాం జలజాతపత్రైః

 

నిజస్త్రీ-చటు-లాలసానాం; నిజస్త్రీ = స్వీయకాంతల; చటు = ప్రియవచనములయందు (కూజితములందు); లాలసానాం = మిక్కిలి అనురక్తులైన; మరియు; కించిత్ = కొంచెము; మదేన = మత్తు చేత; చటుల + అలసానాం = చపలత్వమొందిన, డస్సిన; ఉత్పింజల- జాత - పత్రైః = గూటి బయటకు వెడలిన  రెక్కలుగల; విహంగమానాం = పక్షులకు; జలజ+ఆతపత్రైః = పద్మముల గొడుగుతో ; ఛాయాం = నీడను; కుర్వాణం = ఒనరించు - రైవతక పర్వతమును జలజాతేక్షణుడు వీక్షించెను.

 

ఆ పర్వత సానువుల్లో మగ పక్షులు తమ ప్రియురాళ్ళ ప్రియవచనాలతో (కూజితాలతో) అనురక్తులై ఉన్నాయి. అంతే కాక ప్రియాసంగమం చేత కొంచెం మత్తెక్కి చపలంగానూ, అలసత్వంతోనూ ఉన్నాయి. అలా ఆ పక్షులు ఒళ్ళుపై కానక తమ గూళ్ళనుంచి బయటపడిన రెక్కలతో సేదతీరుతున్నాయి. అలా గూటి నుండి బయట వచ్చిన పక్షులరెక్కలపైభాగాన తామరపూలు గొడుగుల్లా అమరి, ఆ విహంగాలకు చల్లదనాన్ని చేకూరుస్తున్నాయి. పర్వతసానువుల వనాలలో కమలములు సమృద్ధిగా ఉన్నాయని తాత్పర్యం.

సర్వంకష - 'లోలుపో లోలుభో లోలో లంపటో లాలసోపి చ' అని యాదవనిఘంటువు. చటుల+అలసానాం = విశేషణసమాసము;   

నిజస్త్రీచటులాలసానాం - రూపకము;

నిజస్త్రీచటులాలసానాం మదేన కించిత్ చటులాలసానాం - ఇక్కడ యమకము.

యమకము - రూపకముల సంకరము. రెండు సమాసాలు విడివిడిగా ఉన్నాయి కనుక సంకరము. 'తిలాతండులవత్ సంకరః' - ఈ సమాసాలు నువ్వు, బియ్యం వలే కలిసి ఉన్నాయి. కనుక సంకరము.

ఇతరము

ఈ శ్లోకంలో పాదాంతయమకము కనిపిస్తోంది.

౭.

స్కంధాధిరూఢోజ్జ్వనీలకంఠాన్ ఉర్వీరుహః శ్లిష్టతనూనహీంద్రైః

ప్రనర్తితానేకలతాభుజాగ్రాన్ రుద్రాననేకానివ ధారయన్తమ్ ॥

 

స్కంధాధిరూఢోజ్జ్వనీలకంఠాన్; స్కంధ = కాండమును; ('అంసప్రకాణ్డయోః స్కంధః' - విశ్వనిఘంటువు) అధిరూఢ = ఆశ్రయించిన; ఉజ్జ్వల = అందమైన; నీలకంఠాన్ = నెమళ్ళను;

(స్కంధ = భుజములపై; అధిరూఢ = నెలకొన్న; ఉజ్వలచక్కని; నీలకంఠాన్ = నీలి కంఠము గల వారల;)

 అహీంద్రైః = పన్నగముల చేత; శ్లిష్టతనూన్ = (ఆవాసము కొఱకు)చుట్టుకోబడిన (తరువుల కాండముల) గాత్రము గల;   

(అహీంద్రైః = పన్నగముల చేత; శ్లిష్టతనూన్ = (ఆభరణము వలె)చుట్టుకోబడిన గాత్రము గల;  )

ప్రనర్తితానేకలతాభుజాగ్రాన్; ప్రనర్తిత = (గాలికి) మిక్కిలి ఊగిసలాడెడు; అనేక = మిక్కుటమైన; లతాభుజాగ్రాన్ = తీవెల చివరిభాగములను కలిగిన;

(ప్రనర్తిత = ప్రళయకాలమున నర్తించు; అనేక = మిక్కుటమైన; లతాభుజాగ్రాన్ = తీవెల వంటి భుఆగ్రములు కలిగిన;)

అనేకాన్ = అనంతమైన;

రుద్రాన్ ఇవ = భీకరమైనవిగా (గల);

(రుద్రాన్ ఇవ= రుద్రులను వలె;)

ఉర్వీరుహః = వృక్షములను;  ధారయన్తం =  ధరించిన (రైవతకమును వాసుదేవుడు చూచెను);

కాండములపై ఆశ్రయించిన అందమైన మయూరాలతో కూడినవి, కాండములకు చుట్టుకున్న పాముల్లా కనిపిస్తూ, గాలికి అల్లల్లాడే తీవెలను మిక్కుటంగా కలిగినవి అయిన స్థిరమైన తరువులు గల ఆ పర్వతాన్ని వాసుదేవుడు చూచినాడు.

భుజములపైఅమరిన చక్కనినీలి కంఠము గల వారలు; పన్నగముల చేత ఆభరణము వలె చుట్టుకోబడిన గాత్రము కలిగి, ప్రళయకాలమున నర్తించు మిక్కుటమైన తీవెల వంటి భుఆగ్రములు కలిగిన,  అనంతమైన రుద్రుల వలె ఉన్న రువులు గల ఆ పర్వతాన్ని వాసుదేవుడు చూచినాడు.

ఇతర విశేషములు

సమాసోక్తి అలంకారము.

రుద్రాన్ - రుద్రులను అంటున్నాడు కవి. రుద్రులు 11 మంది. ఏకాదశరుద్రులు.

శివోమహేశ్వరః శంభుః శ్రీ కంఠోభవ ఈశ్వరః

మహాదేవః పశుపతిః నీలకంఠో వృషధ్వజః

పరమేశ ఇమే రుద్రా, ఏకాదశ సమీరితాః 


౮.

విలంబనీలోత్పలకర్ణపూరాః కపోలభిత్తీరివ లోధ్రగౌరీః ।

నవోలపాలంకృతసైకతాభాః శుచీరపః శైవలినీర్దధానమ్ ॥


విలంబనీలోత్పలకర్ణపూరాః = చెవికి (ఆభరణంగా) వ్రేలాడు నీలికలువలు; లోధ్రగౌరీః = లొద్దుగుపూవుల పరాగము చేత తెల్లనైన; (డీష్ అను ప్రత్యయము. షిద్ గౌరాదిభ్యశ్చడీష్) కపోలభిత్తీః ఇవ = పర్వతోపరితలముల చెక్కిలి భాగములు అన్నట్లు;  నవోలపాలంకృతసైకతాభాః  ; నవ+ఉలపా = కొత్తగడ్డితోః అలంకృత = అలంకరించబడిన; సైకతాభాః = ఇసుకతిన్నెల కాంతులు; శైవలినీః = నాచును; శుచీః అపః - స్వచ్ఛమైన జలములను; దధానం = కలిగియున్నట్టి; రైవతక పర్వతమును నారాయణుడు చూచెను.

నీలికలువల చెవిపోగులను ధరించినది; లొద్దుగుపూల పరాగముచేత తెల్లనైన చెక్కిళ్ళది; ఇసుకతిన్నెలపై క్రొత్తగడ్డితో మెరుస్తున్నది; నాచును, స్వచ్ఛమైన జలములను కలిగినది అయిన రైవతక పర్వతసానువుల యెదుటి భాగమును నారాయణుడు వీక్షించినాడు.

సర్వంకష - 'ఉలపాః బల్వజాః ప్రోక్తాః' - ఇతి విశ్వః; శుచీరపః శైవలినీః దధానమ్ - స్వచ్ఛమైన నీటిని, నాచును కలిగినది; శుచిత్వ, శైవలత్వముల బింబప్రతిబింబభావములతో ఇక్కడ ఉపమాద్వయమ్.

.

రాజీవరాజీవశలోలభృంగ ముష్ణంతముష్ణం తతిభిస్తరూణామ్ ।

కాన్తాలకాన్తా లలనాః సురాణాం రక్షోభిరక్షోభితముద్వహన్తమ్ ॥


రాజీవరాజీవశలోలభృంగ; రాజీవ = తామరపూల; రాజీ = బారు (మకరందానికి) కు; వశ = ఆకర్షింపబడిన; లోల = మత్తెక్కిన; భృంగ = తేంట్లను (కలిగినది); (పునః = మరియు;)  ముష్ణంతముష్ణం; ఉష్ణం = వేడిమిని; ముష్ణంతం = నిగ్రహించెడు; తరూణాం = పాదపముల; తతిభిః = సమూహముల చేత; (ఒప్పునది)  రక్షోభిః = రాక్షసుల చేత; అక్షోభిత = ఇక్కట్లు పొందని; కాన్తాలకాన్తా ; కాన్తా = రమ్యమైన; అలక+అన్తా = ముంగురులు గల; సురాణాం లలనాః = అప్సరోభామలు;ఉద్వహన్తమ్ = బాగుగా కలిగినట్టిది అయిన రైవతకమును రాధామనోహరుడు తిలకించినాడు.

తామరపూలబారులపై మకరందం కోసం చేరిన తేంట్లు; వేడిమిని పోగొట్టే వృక్ష సమూహాలు; రాక్షసుల బాధలేక స్వేచ్ఛగా విహరిస్తూ, గాలికి చెదిరిన ముంగురుల అప్సరోభామలు; ఈ సమూహాలతో ఒప్పారే రైవతకపర్వత సానువులను రాధామనోహరుడు తిలకించినాడు.

సర్వంకష - 'అలకాశ్చూర్ణకుంతలాః' - అని అమరం.

 ఇతరవిశేషాలు -

ఈ శ్లోకం మాఘకవి పదలాలిత్యానికి చక్కని ఉదాహరణగా నిలుస్తుంది. రాజీవరాజీ; ముష్ణంతముష్ణం;కాన్తాలకాన్తా, రక్షోభిరక్షోభిత; ఇవి వర్ణవిన్యాసవక్రోక్తులు. ఈ ప్రయోగాలతో శ్లోకానికి ఒక కమనీయమైన శ్రవణసుభగత్వాన్ని మాఘకవి కల్పిస్తున్నాడు ఇక్కడ.

మొదటి శ్లోకము మొదలు ఈ శ్లోకము వరకు శ్రీకృష్ణపరమాత్ముని రైవతక దర్శనము (కులకము) ముగిసినది.

౧౦.

ముదే మురారేరమరైః సుమేరోరానీయ యస్యోపచితస్య శృంగైః ।

భవన్తి నోద్దామగిరాం కవీనాముచ్ఛ్రాయసౌందర్యగుణా మృషోద్యాః ॥

మురారేః = మురారియొక్క; ముదే = ఆనందము కొరకు; అమరైః = దేవతలచేత; సుమేరోః = సుమేరు పర్వతమును; ఆనీయ = తెచ్చి; యస్య = ఏ మేరువు యొక్క; శృంగైః = శిఖరముల చేత; ఉపచితస్య = తీర్చి ప్రోగు చేయబడిన దాని (రైవతక పర్వతము) యొక్క; ఉచ్ఛ్రాయసౌందర్యగుణాః = ఉన్నతి (పెంపు), అందము అన్న లక్షణములు; కవీనాం = కవుల; ఉద్దామగిరాం = అతిశయమైన వాక్కుల; మృషోద్యాః = పెల్లుబికిన మిథ్యాలాపములు; న భవన్తి = కావు.

మురారి ఆనందం కోసం దేవతలు సుమేరు పర్వతాన్ని తెచ్చి, ఆ మేరువు శిఖరాలతో ప్రోగు చేసినట్టున రైవతకపర్వతము యొక్క ఉన్నతి, సౌందర్యాది గుణములు - కవులతిశయంగా చెప్పే మిథ్యావాక్కులు కానేరవు.

సర్వంకష

ఉత్కృష్టః శ్రాయ ఉచ్ఛ్రాయ ఇతి ఘంజంతేన ఉపసర్గస్య సమాసః; న తు ఉపసృష్టాద్ ఘంఙ్ ప్రత్యయః.

;శ్రేణీభువో అనుపసర్గే ఇతి నియమాత్.

మేరువు శిఖరాలతో రైవతక శిఖరాన్ని పోల్చటం అతిశయోక్తి అలంకారం. ఈ శ్లోకం మొదలు వచ్చే ౭ శ్లోకాల వరకు ఈ శ్లోకంలోని "యస్య" - ఏ రైవతకము యొక్క అన్న శబ్దంతో అన్వయం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Comments ridiculing, abusing, bullying and forcing to agree in any form, if objectionable to the blog owner will be removed.