19, మే 2022, గురువారం

శిశుపాలవధమ్ నాలుగవ సర్గ తెలుగు టీక, తాత్పర్యములు - (1 - 5)

  

శిశుపాలవధమ్

చతుర్థః సర్గః (రైవతక వర్ణనమ్)

 

౧.

నిశ్వాసధూమం సహ రత్నభాభిః భిత్వోత్థితం భూమిమివోరగాణామ్ ।

నీలోపలస్యూతవిచిత్రధాతుం అసౌ గిరిం రైవతకం దదర్శ ॥

 

నీలోపలస్యూతవిచిత్రధాతుం; నీలోపల = ఇంద్రనీలమణుల చేత; స్యూత = అల్లుకొని ఉన్న;(స్యూతే సీవ్యతే కర్మణి క్తః) విచిత్రధాతుం = వింతైన రాలతో కూడిన; రత్నభాభిః = రకరకాల మణుల కాంతులతో ; సహ = కూడి; భూమిం = భూమిని;భిత్వా = చీల్చుకుని; ఉత్థితం = పైకి ఉబికిన; ఉరగాణాం = సర్పముల యొక్క; నిశ్వాసధూమం ఇవ= విషపుటావిరి వలెనున్న; రైవతకం గిరిం = రైవతకపర్వతాన్ని;అసౌ = ఆతడుదదర్శ = చూచెను. (దృశిర్ ప్రేక్షణే ధాతోః సకర్మకాత్ కర్తరి భూతే లిట్ ప్రథమపురుష ఏకవచనాంతః )

 


నీలమేఘశ్యాముడైన శ్రీకృష్ణుడు అంతట తనకెదురైన రైవతక పర్వతాన్ని చూచాడు.  ఆ రైవతక పర్వతం - ఇంద్రనీలమణులు అక్కడక్కడా పొదిగి నీలంగా ఉన్న ధాతువులతో (రాలతో), ఇంకా ఇతర మణుల కాంతులతో కూడి, పాతాళలోకంనుండి భూమిని చీల్చుకుని పైకి ఉబికి వచ్చిన సర్పాల విషపుటావిరి పొగలా నల్లగా మెరుస్తోంది.

ఈ వర్ణనతో ఈ చతుర్థాశ్వాసం ఆరంభమవుతోంది. ఈ రైవతక వర్ణన ఇలా ౯ వ శ్లోకం వరకూ కొనసాగుతుంది. ఇలా వరుసగా వర్ణన సాగించే శ్లోకాల సమూహానికి "కులకం" అని పేరు. ఇకపై వచ్చే ప్రతి పర్వత వర్ణనకూ చివర 'అసౌ గిరిం రైవతకం దదర్శ' అని అనుసంధానించుకోవలె.

సర్వంకష విశేషాలు -

ఇక్కడ గిరి యొక్క విశిష్టతను నాగుల ఫూత్కార భాష్పాలతో (విషపుటావిరులతో) ఉత్ప్రేక్షిస్తున్నాడు కనుక గుణనిమిత్త జాతిస్వరూప ఉత్ప్రేక్ష. సాధారణంగా ఒక సర్గలో దాదాపుగా ఒకే వృత్తాన్ని ఉపయోగిస్తారు కవులు. అయితే ఈ సర్గలో అనేక వృత్తాలను ఉపయోగించాడు కవి. అందులో ౧౮ ఉపజాతి శ్లోకాలు ఉన్నాయని వ్యాఖ్యానసార్వభౌముడు మల్లినాథసూరి పేర్కొంటున్నాడు.

ఇతర విశేషాలు - భాః అంటే కాంతి. కాంతికిరణములను కలిగిన వాడు భాస్కరుడు. రత్నభాభిః అంటే రత్నాల కాంతులతో కూడినది అని అర్థం.  నాగుల నివాసం పాతాళలోకం. భూమికి ఎంతో దిగువన ఉన్నది. ఈ పర్వతం భూమి లోపలనుండి, ఉపరితలాన్ని చీల్చుకొని పైకి వచ్చిన కారణాన, నాగుల నివాసం భగ్నమై, వాటి క్రోధానికి కారణమవుతున్నదని, అందుచేతనే ఆ నాగుల విషపుటావిరిలా పైకి చిమ్ముతున్నదని వర్ణన.

౨.

గుర్వీరజస్రం దృషదః సమన్తాదుపర్యుపర్యంబుముచా వితానైః ।

వింధ్యాయమానం దివసస్య భర్తుః మార్గం పునా రోద్ధుమివోన్నమద్భిః ॥

 

అజస్రం = సతతము; గుర్వీః దృషదః = పెద్ద గండశిలలయొక్క; ఉపరి ఉపరి = పైపైన (లేక సమీపమున); సమన్తాత్ = అంతటా; అంబుముచావితానైః = మేఘముల గుంపులచేత; దివసస్య భర్తుః = దివాకరుని (సూర్యుని) ; మార్గం = త్రోవను;రోద్ధుం = అడ్డగించు; పునా= ఇంకా; వింధ్యాయమానం =వింధ్యపర్వతము వలె ప్రవర్తించు; ఉన్నమద్భిః = ఎత్తుగా కనిపించు ;

రైవతకమును గోవర్ధనగిరిధారి గాంచెను (అని ముందు శ్లోకంతో అన్వయం)

పెద్దపెద్ద గండశిలలను కూడి, వాటి సమీపంలో సంచరించే మేఘాల సమూహాలతో సూర్యదేవుని త్రోవను అడ్డగిస్తూ వింధ్యపర్వతానికి సాటి రాగలది అయిన ఆ రైవతక పర్వతాన్ని గోవర్ధనగిరిధారి దర్శించాడు .


సర్వంకష - దృషదః అంటే శిలాతటమని అర్థం. 'పాషాణప్రస్తరగ్రావోపలాశ్మానః శిలా దృషత్' అని అమరం. ఉపరి అధ్యయధసః సామీప్యే - ఉపరి అంటే సమీపాన అని కానీ, పైన అని కానీ అర్థం. ఇక్కడ నిరంతరాయంగా సంచరించే మేఘమాలను అడ్డగించటంలో వింధ్యకు సాటి రాగలది అని చెప్పుట వలన క్రియానిమిత్త క్రియాస్వరూప ఉత్ప్రేక్ష.

ఇతర విశేషాలు - వింధ్యాయమానం - అనేది కొంత మాఘుని శైలికి చెందినదిగా తోస్తున్నది. శోభాయమానం, ధగద్ధగాయమానం, భాసమానం వంటి శబ్దాలు మనకు తెలుసు, శోభ, ధగద్ధగ, భాస అన్నవి గుణాలు. వింధ్యాయమానంలో వింధ్య గుణం కాదు, సంజ్ఞ (పేరు). వింధ్యాయ - అని వింధ్య సంజ్ఞపై గుణాన్ని ఆరోపించాడు మాఘుడు. 

౩.

క్రాన్తం రుచా కాంచనవప్రభాజా నవప్రభాజాలభృతాం మణీనామ్ ।

శ్రితం శిలాశ్యామలతాభిరామం  లతాభిరామన్త్రిత షట్పదాభిః ॥

 

నవప్రభాజాలభృతాం (నవాని ప్రభాజాలాని బిభ్రతీతి నవప్రభాజాలభృతః; తేషాం - సర్వంకష)

= కొంగ్రొత్త వెలుగులను వహించిన; మణీనాం = రత్నములను (కలిగినది); ఇంకనూ;

కాంచన-వప్ర-భాజా = పసిడిసానువుల; రుచా = కాంతులతో; క్రాన్తం = వ్యాపించినది; ఇంకనూ;

శిలాశ్యామలతా = ఇంద్రనీలమణుల రాలతో; అభిరామం = మనోహరముగా ఒప్పునది;మరియు;

 ఆమన్త్రిత షట్పదాభిః = పిలువబడిన గండుతుమ్మెదల తో (కూడిన); లతాభిః = తీవెల(సౌరభాల)తోశ్రితం = విస్తరించినది;

అయిన రైవతకమును మాధవుడు దర్శించెను.



క్రొత్తగా వెలుగులీనుతున్న రత్నాలతో కూడినది; స్వర్ణ సానువుల కాంతులతో అలరారుతున్నది; ఇంద్రనీలమణులతో మనోహరంగా కానవచ్చేది, మధువు సమృద్ధిగా నిండి యుండడం చేత గండుతుమ్మెదలు చుట్టుముట్టిన పూలతీవెల తావితో ఒప్పారునది అయిన రైవతకాన్ని మాధవుడు చూచినాడు.

 

సర్వంకష - ఇది యమకభేదం. యమకలక్షణం దండి ఇలా చెప్పాడు.

"అవ్యపేతవ్యపేతాత్మా యా వృత్తిర్వర్ణసంహతేః

యమకం తచ్చ పాదానామాదిమధ్యాన్తగోచరమ్ ॥

ఏక ద్వి త్రి చతుష్పాదయమకానాం ప్రకల్పనా

ఆదిమధ్యాన్త మధ్యాన్త మధ్యాద్యాద్యన్త సర్వతః ॥

అత్యంతం బహవస్తేషాం భేదాః సంభేదయోనయః

సుకరా దుష్కరాశ్చైవ దృశ్యన్తే తత్ర కేచన ॥" (కావ్యాదర్శం)

 

యమకమంటే అఉ/హల్లు/లేదా రెంటి సంయోగంతో ఏర్పడే శబ్దాలను పక్కపక్కనే కానీ, లేదా మధ్యన కొంత వ్యవధి ఇచ్చి కానీ ఆవృత్తి (Repeat) చెయ్యటం. శ్లోకంలో అర్ధపాదాన్ని, పూర్తి పాదాన్ని, పూర్తి శ్లోకాన్ని కూడా ఆవృత్తి చెయ్యచ్చు. అలా చేయడమూ యమకమే. యమకము ఒకేపాదంలో ఉండవచ్చు. రెండుపాదాల్లో ఉండవచ్చు. (అంటే శ్లోకంలో ఒకపాదం, ఇంకొకపాదం ఒకే విధంగా ఉండటం. ఇవి 1-2;1-3;1-4;2-3;2-4;3-4ఇలా ఏ పాదాలలో సంయోగంలో అయినా ఉండవచ్చును. అలాగే తృతీయ, చతుష్పాద. ఇవి కాక, ఆదియమక, మధ్యయమక, అంతయమక, ఆదిమధ్య...ఇలా ఎన్నో రీతుల్లో ఉండవచ్చు. యమకభేదాలు ఇలా ఎన్నో రీతుల్లో ఉండవచ్చు.


చతుష్పాదయమకానికి తెలుగులో ఒక చక్కని ఉదాహరణ ఉంది.

సీ॥

రాజనందన రాజ రాజాత్మజులు సాటి

తలప నల్లయ వేమ ధరణి పతికి

 రాజనందన రాజ రాజాత్మజుల సాటి

 తలప నల్లయ వేమ ధరణి పతికి

 రాజనందన రాజ రాజాత్మజుల సాటి

 తలప నల్లయ వేమ ధరణి పతికి

 రాజనందన రాజ రాజాత్మజుల సాటి

 తలప నల్లయ వేమ ధరణి పతికి

గీ:

భావభవ భోగ సత్కళా భావములను

భావభవ భోగ సత్కళా భావములను

భావభవ భోగ సత్కళా భావములను

భావభవ భోగ సత్కళా భావములను.

 

***

 

ఇతర విశేషాలు - ఈ శ్లోకం రెండవ, నాలుగవ పాదాలలో ముక్తపదగ్రస్తం కూడానూ.

 

క్రాన్తం రుచా కాంచనవప్రభాజా

నవప్రభాజాలభృతాం మణీనామ్ ।

శ్రితం శిలాశ్యామలతాభిరామం 

లతాభిరామన్త్రిత షట్పదాభిః ॥

 

అదివరకు పాదం ముగింపు శబ్దంతో తర్వాత పాదం మొదలవడం ముక్తపదగ్రస్తం. నవప్రభాజా = నవప్రభాజా; లతాభిరామం - లతాభిరామం;

౪.

సహస్రసంఖ్యైః గగనం శిరోభిః పాదైర్భువం వ్యాప్య వితిష్ఠమానమ్ |

విలోచనస్థానగతోష్ణరశ్మిః నిశాకరం సాధు హిరణ్యగర్భమ్ ||

 (విలోచనస్థానగతోష్ణరశ్మినిశాకరం)

సహస్రసంఖ్యైః శిరోభిః = వేల శిఖరాలచేత (వేల తలల చేత); గగనం = ఆకాశమును; (సహస్రసంఖ్యైః) పాదైః = వేల పాదాలచేత; భువం = భూమిని; వ్యాప్య = ఆక్రమించి; వితిష్ఠమానం = విశేషంగా నిలిచిఉన్న; విలోచనస్థానగతం = యోగ్యమైన ప్రదేశంలో (నేత్రముల స్థానమున); ఉష్ణరశ్మిర్నిశాకరం (ఉష్ణరశ్మినిశాకరం) = సూర్యుణ్ణి, చంద్రుణ్ణి కలిగి; సాధు = ఒప్పారు; హిరణ్యగర్భం = సువర్ణమయమైన (బ్రహ్మను)(లేదా హిరణ్యగర్భం = నిధులను నిక్షేపించుకున్న పర్వతమును) (సః దదర్శ = కృష్ణపరమాత్మ గాంచెను అని మొదటి శ్లోకంతో అన్వయం).

ఈ శ్లోకానికి రెండు తాత్పర్యాలు. (సమాసోక్తి)




మొదటి తాత్పర్యం: వేయి శిఖరాలతో ఆకాశాన్ని, వేయిపాదాలతో భూమిని ఆక్రమించి, అటు, ఇటు తమ తమ యోగ్యస్థానాలలో (ఉదయ అస్తమయ కాలాల) చంద్రుణ్ణి,సూర్యుణ్ణి నిలుపుకున్న సువర్ణమయమైన పర్వతాన్ని శ్రీకృష్ణపరమాత్మ చూచాడు.

రెండవ తాత్పర్యం: వేయి తలలతో ఆకాశాన్ని, వేయి పాదాలతో భూమిని ఆక్రమించి, కళ్ళుగా సూర్యచంద్రులను నిలుపుకున్న హిరణ్యగర్భుని (బ్రహ్మను లేదా విష్ణుమూర్తిని) శ్రీకృష్ణపరమాత్మ చూచాడు.

మొదటి తాత్పర్యం - ఒక పర్వతవర్ణన. పర్వతం ఆ విధంగా ఉంది. అయితే రెండవ తాత్పర్యం మాత్రం అనితరసాధ్యం,

హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూధనః’ - విష్ణుసహస్రనామాలలో హిరణ్యగర్భుడంటే సాక్షాత్తూ విష్ణుపరమాత్మయే. ఇక్కడ ఈ సందర్భంలో - సాక్షాత్తూ శ్రీకృష్ణపరమాత్మ, తన స్వరూపాన్నే (లేదా తన పుత్రుడైన బ్రహ్మ స్వరూపాన్ని) తన కళ్ళెదుట రైవతకపర్వతంగా చూస్తున్నాడన్నమాట!

 

సర్వంకష -'సహస్రశీర్షా' రితి శ్రుతేః భావః.

శ్రుతివాక్యం ఈ శ్లోకానికి అన్వయించుకోవాలి.

 

సహస్రశీర్షాః పురుషః సహస్రాక్షః సహస్రపాత్ |

స భూమిం విశ్వతో వృత్త్వా అద్యతిష్టద్దశాంగులమ్ ||

(విరాట్)పురుషుడు - అంటే బ్రహ్మస్వరూపుడైన పరమాత్మ, వేయితలలతో, వేయి కన్నులతో, వేయి పాదాలతో భూమినంతటిని ఆవరించి ఆపై పది అంగుళాలు అదనంగా వ్యాపించెను.

హిరణ్యగర్భో నిధిగర్భశ్చ.  హిరణ్యగర్భః అంటే బ్రహ్మ అని మాత్రమే కాక - నిధులను నిక్షేపించుకున్నది అని కూడా అర్థం.

౫.

క్వచిజ్జలాపాయ విపాండురాణి ధౌతోత్తరీయప్రతిమచ్ఛవీని ।

అభ్రాణి విభ్రాణముమాంగ సంగ విభక్తభస్మానమివ స్మరారిమ్ ॥

 

క్వచిత్ = కొన్ని చోట్ల; జలాపాయ = జలములను విడచిపుచ్చిన పిదప; ధౌతోత్తరీయప్రతిమచ్ఛవీని; ధౌత = ఉతికిన; ఉత్తరీయ = అంగవస్త్రము అను; ప్రతిమత్ = నిశ్చలమైన; ఛవీని = కాంతులు గల; విపాండురాణి = విశేషముగా తెల్లనివి అయిన; అభ్రాణి = మేఘములను; విభ్రాణం = కలిగినట్టిది యును; ఉమాంగసంగవిభక్తభస్మానం; ఉమా = పార్వతీదేవి యొక్క; అంగ = దేహము చేత; సంగ = కూడి; విభక్త = విభజింపబడిన; భస్మానం = భస్మపు పూతలు కలిగినట్టిది అయిన; స్మరారిమ్ =  శంకరుని వలె; ప్రకాశించు రైవతక పర్వతాన్ని శ్రీధరుడు దర్శించెను. 

ఆ రైవతకం పర్వత సానువుల నేపథ్యంతో ఆకాశాన అక్కడక్కడా తెల్లని వెలిమేఘాలు కనిపిస్తున్నాయి. ఆ మేఘాలు వర్షాన్ని భువికి ధారవోసిన తర్వాత తెల్లనివై, శుభ్రంగా ఉతికిన ఉత్తరీయాల్లా అగుపిస్తున్నాయి.  ఆ మేఘాల అచ్చాదనం కాకుండా ఉన్న మిగిలిన భాగాలు గల పర్వతం స్నిగ్ధంగా ఉంది. ఇలా ఆ పర్వతం - ఉమాదేవి కౌగిలించి, ఆ కౌగిలి నుండి విడివడిన పరమేశ్వరుని శరీరంలా ఉంది.

ఉమాదేవి ఈశ్వరుని కౌగిలించుకున్నప్పుడు, పరమశివుని శరీరంపై పూర్తిగా అలదుకుని ఉన్న భస్మం, ఆమె స్పర్శతో అక్కడక్కడా తొలగిపోయింది. శంకరుని గాత్రంపై ఉమాదేవి సంస్పర్శ కలుగని కొన్ని చోట్ల మాత్రం భస్మం అలానే ఉంది. భస్మసహితమైన ముక్కంటి గాత్ర భాగాలకు మేఘాలపోలిక. భస్మవిహితమైన గాత్రభాగాలకు మేఘాచ్ఛాదనం లేని పర్వతభాగాల పోలిక. ఇలా రైవతకం ఉమాదేవి కౌగిలిని పొంది, విభజింపబడిన భస్మపు పూత గల స్మరారి దేహంలా ఉందని భావం.

సర్వంకష -  స్మరహరుని గాత్రంతో పర్వతపు పోలిక ఉపమాలంకారం.   

ఇతర విశేషాలు -  ఉతికిన అంగవస్త్రపు నిశ్చలకాంతితో మేఘశకలాల పోలిక కూడా ఉపమ. ఈ పోలిక కూడా వినూత్నం. ఇదివరకు శ్లోకంలో విరాట్పురుషుడైన విశ్వరూపునితో పర్వతాన్ని పోల్చిన కవి ఇప్పుడు ఉమాదేవిగాత్రసంగవిభక్తభస్మానుడైన పురహరుని గాత్రంతో రైవతకాన్ని పోలుస్తున్నాడు.

'ఉపమా కాళిదాసస్య భారవేరర్థగౌరవమ్ ।

దండినః పదలాలిత్యం మాఘే సన్తి త్రయోగుణాః ॥'

అని ఒక చాటూక్తి. ఉపమాలంకారానికి కాళిదాసు; పదలాలిత్యానికి దండికవి; గంభీరమైన అర్థానికి భారవి - ప్రసిద్ధులు. అయితే ఆ మూడుగుణాలను తన కవితలో నిక్షిప్తం చేసికొన్నవాడు మాఘుడట!

ఈ శ్లోకం ఉపమకాళిదాసకవి ఉపమకు సాటి రాగలదు. అట్లే ఈ వరుసలో ౯ వ శ్లోకం పదలాలిత్యానికి నిదర్శనంగా నిలుస్తుంది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Comments ridiculing, abusing, bullying and forcing to agree in any form, if objectionable to the blog owner will be removed.