21, మే 2022, శనివారం

శిశుపాలవధమ్ నాలుగవ సర్గ తెలుగు టీక, తాత్పర్యములు - (11 - 20)

 

౧౧.

యతః పరార్ఘ్యాని భృతాన్యనూనైః ప్రస్థైర్ముహుర్భూరిభిరుచ్ఛిఖాని ।

ఆఢ్యాదివ ప్రాపణికాదజస్రం జగ్రాహ రత్నాన్యమితాని లోకః ॥

లోకః = జగత్తు (ప్రజలు); యతః = (ఏ) రైవతకము నుండి; పరార్ఘ్యాని = శ్రేష్ఠమైనవి; అనూనైః = అమూల్యమైనవి; ముహుః = ఇంకను; భూరిభిః ప్రస్థైః = పెద్దపెద్ద రాలచేత; భృతాని = కూడినవి; ఉచ్ఛిఖాని = పైకెగసిన కాంతులు గలవి; అయిన; అమితాని రత్నాని = అనేక రత్నాలను; ఆఢ్యాత్= వణిజుల వలన; ప్రాపణికాత్ = ఉపయోగము కొరకు (గ్రాహకులు పొందినట్లు) అజస్రం = మరల మరల; జగ్రాహ = పొందిరి;

రత్నాలు అమ్మే వ్యాపారి వద్ద గ్రాహకులు పొందినట్లు, రైవతక పర్వతము సమీపమున నివసించే జనులు ఆ పర్వతము నుండి శ్రేష్ఠమైన, అమూల్యమైన, ఆ పర్వతపు రాలచేత కూడి, పైకి ఎగసే కాంతులు గల రత్నాలను  మాటిమాటికీ తెచ్చుకుంటూ ఉంటారు.

సర్వంకష -'ప్రభూతం ప్రచురం ప్రాజ్యం భూరి' ఇత్యమరః; 'ప్రస్థః అస్త్రీ సానుమానయః' - ఇత్యమరః; ఇమ్య ఆఢ్యో ధనీ - ఇత్యమరః;పణ్యజీవాః ప్రాపణికాః వైదేహా నైగమాశ్చ తే । వణిజః - ఇతి వైజయంతీ;

పరార్ఘ్యాని - మహార్ఘాణి (ఇంకొక పాఠం)

ఉపమాలంకారము.

౧౨.

అఖిద్యతాసన్నముదగ్రతాపం రవిం దధానే౽ప్యరవిన్దధానే ।

భృంగావలిర్యస్య తటే నిపీతరసా నమత్తామరసా న మత్తా ॥


ఆ రైవతకము - ఆసన్నం = (ఎత్తుగా ఉండుట వల్ల సూర్యుని) సమీపమై; ఉదగ్రతాపం = దుస్సహమైన వేడిమిని;(కలిగిన) రవిం = సూర్యుని; దధానే అపి = వహించిననూ;

(అరవిం - దధానే = సూర్యుని వహింపనే లేదు)  

అరవింద-ధానే = కమలముల వాసములలో;

యస్య తటే = ఆ రైవతకసానువులలో; నిపీతరసా = నిత్యమూ మకరందపానము చేసి; మత్తా = మత్తెక్కి; భృంగావలిః = తేంట్లు; న అఖిద్యత = ఖిన్నము కాలేదు; (మరియు ఆ తేంట్ల వలన) తామరసా = కమలములు; నమతి = (భారముగా) వంగియున్నవి;

రైవతకము చాలా ఎత్తుగా ఉన్న కారణమున రవికి సమీపము అయిననూ రవికి సమీపము కానట్టే. ఏలననగా ఆ పర్వత సానువులలో తుమ్మెదలు తమ నెలవులైన తామరకుసుమములలో మకరందమును నిత్యమూ పానము చేసి మత్తములైనవి గాన వాటిని సూర్యతాపము బాధింపలేదు. అట్టి ఆ తేంట్ల భారము చేత తామరకుసుమములు వంగియున్నవి.  

సర్వంకష - 'పంకేరుహం తామరసం' ఇత్యమరః;

ధీయతే౽స్మిన్నితి ధానమ్.

'రవిం దధానే అపి అరవిం దధానే' - అని శబ్దశ్లేష మూలమైన విరోధాలంకారము; అయితే 'రవిం దధానే అపి అరవింద ధానే' అని కూడా భావము సాధ్యమగుట చేత విరోధము పరిహార్యమగుచున్నది. అరవింద ధానే - అరవిందముల నిధానములలో;

౧౩.

యత్రాధిరూఢేన మహీరుహోచ్చైరున్నిద్రపుష్పాక్షసహస్రభాజా ।

సురాధిపాధిష్ఠితహస్తిమల్లలీలాం దధౌ రాజతగండశైలః ॥


యత్ర = ఏ రైవతక పర్వతమున; రాజత = (వెండి వలె) ప్రకాశించు; గండశైలః = గండశిల (యొకటి);ఉన్నిద్ర = వికసించిన; పుష్పాక్ష సహస్ర భాజా = వేయి సుమములు లోచనముల వలె నొప్పు;  (పుష్పాణి అక్షీణి ఇవ; తేషాం సహస్రం భజతీతి);  అధిరూఢేన = అధిరోహించిన; ఉచ్చైః = ఉన్నతమైన; మహీరుహా = తరువుచేత;

సురాధిపాధిష్ఠితహస్తిమల్లలీలాం

సురాధిప = దేవేంద్రుడి చేత; అధిష్ఠిత = పైన ఎక్కి కూర్చొనిన; హస్తిమల్ల = ఐరావతము యొక్క; లీలాం = శోభనుదధౌ = వహించినది.   




అచ్చట వెండివలె ప్రకాశించు గండశిల యొక్కటి వికసించిన వేల సుమములు కన్నుల వలె ఒప్పారు గల గొప్ప తరువు శిలపై ఏర్పడుట చేత, దేవేంద్రుడధిరోహించిన ఐరావతము లీలను పొందినది.


సర్వంకష - గండశైలాస్తు చ్యుతాః స్థూలోపలా గిరేః - ఇత్యమరః;

ఉన్నిద్రాణి వికసితాని పుష్పాణి అక్షీణి ఇవ; తేషాం భజతీతి ఉపమితసమాసః;

హస్తిమల్లో౽భ్రమాతంగే హస్తిమల్లో వినాయకే ఇతి విశ్వః;

గండశిలల (లీల) శోభ, ఐరావతపు (లీల) శోభ సాదృశ్యాక్షేపము వలన నిదర్శనాలంకారము;

౧౪.

విభిన్నవర్ణా గరుడాగ్రజేన సూర్యస్య రథ్యాః పరితః స్ఫురన్త్యా ।

రత్నైః పునర్యత్ర రుచా రుచం స్వామానిన్యిరే వంశకరీరనీలైః ॥


గరుడాగ్రజేన = గరుత్మంతుని అన్న అయిన అరుణునిచేత (సూర్యసారథి అరుణుడు గరుత్మంతుని అగ్రజుడని ప్రతీతి);పరితః = అంతటా; స్ఫురన్త్యా = వెలుగులీనుచున్న; రుచా = కాంతిచేత; విభిన్నవర్ణాః = స్వభావసిద్ధమైన వర్ణమునకు విరుద్ధవర్ణమును సంతరించుకున్న; (రక్తవర్ణమును సంతరించుకొన్న); సూర్యస్యరథ్యాః = వెలుగురేని రథముల యొక్క అశ్వములు; యత్ర = ఏ పర్వతమునః వంశకరీరనీలైః = వెదురు అంకురములవలె నీలవర్ణములైన; రత్నైః = రత్నాల చేత; (వాటి కాంతిచేత)  పునః = మరల; స్వాం = తనదైన; రుచం = కాంతిని; ఆనిన్యిరే = సంపాదించుకొనెనో;

మింటిఱేని రథాశ్వములు స్వభావసిద్ధముగా ఆకుపచ్చని రంగువైననూ, సూర్యసారథి, గరుడాగ్రజుడైన అరుణునిశరీరవర్ణకాంతులు ప్రసరించుట చేత రక్తవర్ణయుతములాయెను. అట్టి ఆ హయములు వెలుగుఱేడు రైవతక పర్వతమును దాటు సందర్భమున పర్వతముపైన మరకతములతో సంసర్గమునొంది తిరిగి తమ స్వీయకాంతులను సంపాదించుకొన్నవాయెను.

 

సర్వంకష - సూర్యస్య సంబంధినో రథం వహతీతి రథ్యాః - రథాశ్వాః (భానుని సంబంధమైన రథమును వహించును కనుక రథ్యాః అనగా రథాశ్వములు)

వంశాంకురే కరీరో౽స్త్రీ - ఇత్యమరః; వంశకరీరనైలైః - ఇచ్చట వంశ, కరీర - రెండు శబ్దములు ఒకే అర్థమును ప్రతిపాదించిననూ పునరుక్తిదోషమనరాదు. ఏలనన, వంశశబ్దమునకు గల అమ్లానత (స్వచ్ఛత) అన్న హేతువు.

మఱియును,

కార్యపదమప్రయోజ్యమిత్యుక్త్వా కరికలభకర్ణావతంసాదిషు ప్రతిపత్తివిశేషకరేషు న దోషః - ఇతి వామనః.

శబ్దప్రయోగమునకు విశేషప్రతిపత్తి చేకూర్చు సందర్భమున పునరుక్తి దోషము కానేరదని వామనుడు.

 

రథాశ్వములు స్వగుణమైన (మరకత వర్ణమును) త్యజించి శోణవర్ణమునొందుట - తద్గుణాలంకారము. (తద్గుణః స్వగుణత్యాగాదన్య ఉత్కృష్టగుణగ్రహః)

భిన్నగుణమును వర్జించి స్వీయగుణము వొందుట సజాతీయ అలంకారము.

 

సజాతీయ, తద్గుణాలంకారముల సంకరము.

 

భాస్కరుని రథాశ్వములు గిరిపై గల మరకతములను స్పర్శించుట అను కల్పన చేత ఇచ్చట గిరి యొక్క ఉన్నతి (యెత్తు) వ్యంజింపబడినది.

౧౫.

యత్రోజ్ఝితాభిర్ముహురంబువాహైః సమున్నమద్భిర్న సమున్నమద్భిః ।

వనం బబాధే విషపావకోత్థా విపన్నగానామవిపన్నగానామ్ ॥


యత్ర = ఏ పర్వతము చెంగట; సమున్నమద్భిః = ఎత్తుగా నిలిచిన; అంబువాహైః = మేఘముల చేత; ఉజ్ఝితాభిః = విడిచిన నీరుగల;అద్భిః = జలములచేత; ముహుః = ఇంకను;  సమున్నం = ఆర్ద్రమైన/బాగుగా తడిచిన; (ఉందో క్లేదనే ఇతి ధాతోః కర్మణి క్తః; నుదవిద్ ఇత్యాదినా నిష్ఠానత్వమ్); అవిపన్నగానాం = (సానువులలో) సర్పములతో కూడిన ; (విగతసర్పాః న భవంతీతి అవిపన్నగాః; సపన్నగాః)  నగానాం = వృక్షములయొక్క; వనం = అడవులను; విషపావకోత్థా = విషజ్వాలలచేత ఉద్భవించిన అగ్ని యొక్క;  విపత్ = కీడు; న బబాధే = బాధింపలేదు;


ఈ అద్రి సానువులందు ఎత్తుగా అమరిన మేఘములచేత నీరు విడువబడి, ఆ అలముల చేత ఆర్ద్రమైన సర్పమయమైనపాదపములు గల అడవులకు, ఆ సర్పముల విషములచేత ఉద్భవించిన విషాగ్నికీలల బాధ లేదు.


సర్వంకష

సమున్నం - సమ్యక్ ఉన్నం క్లిన్నమ్. సిక్తమిత్యర్థః;

ఇతరములు

ఈ శ్లోకమందుసమున్నమద్భిఃన సమున్నమద్భిః’; ‘విపన్నగానాం అవిపన్నగానాంఈ శబ్దములు ఒండొరులు విరోధప్రతీతి గలవి,అయితే ఈ విరోధము భావము చేత నశింపబడుచున్నది కనుక ఇది విరోధాలంకారము.

నగఃన గచ్ఛతీతి నగఃఈ శబ్దము పర్వతమునకు రూఢమై స్థిరపడియున్నది. అయితే మాఘకవి ఇక్కడ వృక్షం అన్న అర్థానికి ఈ శబ్దాన్ని అన్వయిస్తున్నాడు.

౧౬.

ఫలద్భిరుష్ణాంశుకరాభిమర్శాత్ కార్శానవం ధామ పతంగకాంతైః ।

శశంస యః పాత్రగుణాత్ గుణానాం సంక్రాంతిమాక్రాంతగుణాతిరేకామ్


యః = ఏ శైలము; ఉష్ణాంశు కర అభిమర్శాత్ = ఆదిత్యుని కిరణముల స్పర్శచేత; కార్శానవం = అగ్నిసంబంధమైన; ధామ = ప్రకాశపు; ఫలద్భిః = సార్థకత చేత; పతంగకాంతైః = అర్కకాంతులతో; గుణానాం = గుణములయొక్క; సంక్రాంతిం = సంక్రమణమును; ఆక్రాంతి = పొందినది; (ఇట్లు) పాత్రగుణాత్ = ఆధారమైన గుణసహకారము చేత; గుణాతిరేకాం =  గుణముల ఉత్కర్షను; శశంస = ప్రతిపాదించినది; 

రైవతక పర్వతము సూర్యకాంతమణులచే సమృద్ధమై యున్నది. ఈ సూర్యకాంతమణిపరివేష్ఠితమైన ఆ నగము సూర్యుని కిరణముల యొక్క తాకిడి చేత అగ్ని సంబంధమైన జ్వాలల సార్థకత చేత జ్వలించుచూ "గుణముల యొక్క అభివృద్ధి - ఇంకనూ మంచి గుణముల సంపర్కము చేతనే జరుగును" అన్న నియమమును ప్రతిపాదించుచున్నది.


సర్వంకష - సహకారశక్తివిరహిణీ సహజశక్తిరనుపకారిణీ ఇతి భావః - సహకారము లేని సామర్థ్యము సహజశక్తికి మేలు సేయదు అని ఈ శ్లోకము భావము.

వృత్త్యనుప్రాస అలంకారము.

౧౭.

దృష్టోపి శైలః స ముహుర్మురారేః అపూర్వవద్విస్మయమాతతాన |

క్షణే క్షణే యన్నవతాముపైతి తదేవ రూపం రమణీయతాయాః ||


సః శైలః = ఆ రైవతక గిరి; దృష్టోపి = చూడబడినది అయినను; ముహుః = మరల;అపూర్వవత్ = అంతకు మునుపు చూడనిది వలె; మురారేః = శ్రీహరి యొక్క; విస్మయం = అబ్బురపాటును; ఆతతాన = పొందినది. (యథా) యత్ = ఏ; (రూపం = రూపము;) క్షణే క్షణే = క్షణక్షణమునకు; నవతాం ఉపైతి = కొత్తదనమును సంతరించుకొనునో; తత్ ఏవ = అదియే ; రమణీయతాయాః = రమణీయత యొక్క; రూపం = ఆకారవిశేషము;


ఆ పర్వతరాజము - మొదటి మారు చూచినప్పటికంటే తిరిగి చూచినప్పుడు మరింత అందంగా కనబడుతూ మురారిని విస్మయపర్చింది. ఇలా క్షణక్షణానికి కొత్తదనం సంతరించుకునే రూపమే కదా రమణీయత అంటే !


సర్వంకష - విస్మయానికి హేతువుగా రమణీయత (నిర్వచనము) ను ప్రతిపాదించుట వలన వాక్యార్థహేతుక కావ్యలింగాలంకారము;


ఇతర విశేషాలు - "క్షణే క్షణే యన్నవతాముపైతి తదేవ రూపం రమణీయతాయాః" - ఇది ఈ శ్లోకంలో కవి చెప్పే పర్వతానికే కాక, శిశుపాలవధమ్ కావ్యానికంతానూ వర్తిస్తుంది.

౧౮.

ఉచ్చారణజ్ఞో౽థ గిరాం దధానం ఉచ్చారణత్పక్షిగణాస్తటీస్తమ్ ।

ఉత్కంధరం ద్రష్టుమవేక్ష్య శౌరిముత్కంధరం దారుక ఇత్యువాచ ॥


అథ = హరి విస్మయము గొన్న పిదప; గిరాం = వాక్యమును;ఉచ్చారణజ్ఞః = పలుకుటలో నేర్పరియైన; దారుకః = శ్రీకృష్ణుని రథసారథి అయిన దారుకుడు; ఉచ్చా = గొప్ప శబ్దముతో; రణత్ = కలకలము సేయు; పక్షిగణాస్తటీ = విహంగములకు నెలవును; దధానం = కలిగిన; ధరం = పర్వతమును; (ధరతీతి ధరం పచాద్యచ్) ద్రష్టుం = చూచుటలో ; ఉత్కం = ఉత్సుకుడైన; (మరియు) ఉత్+కంధరం = (విస్మయముతో) శిరస్సును పైకెత్తిన; శౌరిం = శౌరిని; అవేక్ష్య = కాంచి; ఇత్యువాచ = ఈ రకముగా చెప్పెను;   


అటుపై, వాక్యార్థనిపుణుడు, శ్రీకృష్ణసారథి అయిన దారుకుడు, పెద్దగా కూతలు పెడుతూన్న పక్షులకు కొలువైన ఆ  గిరిని చూచుటలో నిమగ్నమై, తన కంఠమును పైకెత్తి గిరిని విస్మయముతో చూస్తున్న హరిని గాంచి యిట్లనెను.


సర్వంకష - ఆహార్యధరపర్వతాః - ఇత్యమరః;

౧౯.

ఆచ్ఛాదితాయతదిగంబరముచ్చకైర్గామ్

ఆక్రమ్య సంస్థితముదగ్రవిశాలశృంగమ్ ।

మూర్ధ్నిం స్ఖలత్తుహినదీధితికోటిమేనమ్

ఉద్వీక్ష్య కో భువి న విస్మయతే నగేశమ్


ఆచ్ఛాదితాయతదిగంబరం;

ఆచ్ఛాదిత = విస్తరించిన; ఆయత = పొడవైన; దిక్ + అంబరం = దిశలును మరియు ఆకాశమును గలది అయిన;

(ఆచ్ఛాదిత = చుట్టుకొనిన; ఆయత = పొడవైన; దిగంబరం = దిక్కులను వస్త్రములు గలవానిని);

ఉచ్చకైః = ఉన్నతమై; గాం = భువిని; ఆక్రమ్య = ఆవరించి; సంస్థితం = స్థిరముగా వెలసిన దానిని; ఉదగ్ర = పొడవైన; విశాల = విశాలమైన; శృంగమ్ = శిఖరములు గలదానిని;

(ఉదగ్ర = భీకరమైన; విశాల = నిడుపాటి; శృంగమ్ = కొమ్ములు గల; ఉచ్చకైః =  పెద్దదైన; గాం = వృషభమును; ఆక్రమ్య = అధిరోహించి; సంస్థితం = కొలువైన వానిని)

మూర్ధ్నిం = శిఖరముపై;  స్ఖలత్ = కరుగు; తుహిన = మంచు యొక్క; దీధితి = ప్రకాశముల; కోటిం = పరంపరను కలిగిన; ఏనమ్ = ఆ యొక్క; నగేశం = పర్వతమును;

(మూర్ధ్నిం = తలపై;  స్ఖలత్ = క్షయించు; తుహినదీధితికోటిం = నెలవంకను ; వహించిన; ఏనమ్ = ఆ యొక్క; నగేశం = కైలాసపర్వతవిభుని; )

ఉద్వీక్ష్య = బాగుగా అవలోకించి; భువి = భువిపై; కః = ఎవడు; న విస్మయతే? = అబ్బురపాటు నొందడు?




ఓ కేశవా!

ఎల్లెడలా విస్తరించి, పొడవైన దశలను ఆకాశపర్యంతము కలిగి. భూమిని ఆవరించి, ఉన్నతములైన, విశాలమైన శిఖరములు గలదియు; ఆ శిఖరములలపై కరుగుచున్న మంచు ప్రవాహముల ప్రకాశము గలదియు అయిన ఈ రైవతకపర్వతమును గాంచి భువిని ఎవడు విస్మయమందడు?

పక్షాంతరమున - దిక్కులే వస్త్రములుగా గలిగినవాడును; భీకరమైన కొమ్ములు గలిగిన మహావృషభమును అధిరోహించినవాడును, తలపై - అనేక కళలుగల హిమకిరణుడైన చంద్రుని వహించిన ఆ కైలాసేశ్వరుని గాంచి భువిని ఎవడు ఆశ్చర్య చకితుడు కాడు? (అనుగ్రహింపబడితిని గదా యనుకొనడు?)


సర్వంకష - శృంగం విషాణే ఇతి విశ్వః. (శృంగమన - శిఖరము, కొమ్ము)


'గౌః స్వర్గే వృషభే రశ్మీ వజ్రే చంద్రమసి స్మృతః ।

అర్జునీనేత్రదిగ్బాణభూవాగ్వారిషు గౌర్మతా ॥' ఇతి చ విశ్వః


గౌ = ఆవు, స్వర్గము, వృషభము; కిరణము, వజ్రము, చంద్రుడును, అర్జున కుసుమము, నేత్రము, దిక్కు, బాణము, భూమి, వాక్కు, నీరు అని విశ్వనిఘంటువు;


ఇది

- తుల్యయోగిత అలంకారము కాదు; ఏలనన ప్రకృత అప్రకృత విషయములలో సామ్యత లేదు;

- సమాసోక్తియును కాదు. ఏలనన విశేషణములలో సామ్యముల వలన;

- శ్లేషయును కాదు. ఉభయశ్లేషయోగము వలన (శబ్దార్థముల రెంటికి నానార్థములు గలవు గాన)

- ప్రాకరణికార్థపర్యవసితమైన అభిధావ్యాపారమైనప్పటికినీ ఇది శబ్దము చేత అర్థాంతరము స్ఫురించు ధ్వనిగా గ్రహించవలెను. కావ్యప్రకాశము ఇట్లు పేర్కొనెను.


'అనేకార్థస్య శబ్దస్య వాచకత్వే నియంత్రితే ।

సంయోగాద్యైః అవాచ్యార్థ ధీకృత్యాపృతి రంజనమ్ ॥'


శబ్దాల యొక్క వివిధార్థములను వాచ్యముగా ఉపయోగించినను; ఆ అర్థముల కలయిక వలన అవాచ్యము అయిన కొత్త భావము ద్యోతకమగుట ఉండవచ్చును. 

ఇది వసంతతిలక వృత్తము - త బ జ జ గ గ అని గణములు. (తభజాజగౌగః)


విశేషము - ఈ శ్లోకాన్ని ధ్వనివాద సమర్థకులైన ఆలంకారికులు/ఆలంకారిక గ్రంథ వ్యాఖ్యానకారులు కానీ శిశుపాలవధమ్ కావ్య వ్యాఖ్యాతలు కానీ యెవరో ఉటంకించి మల్లినాథసూరి వలెనే ఇది ధ్వనికి ఉదాహరణమని చెప్పినట్టున్నది. బహుశా సూరి పండితుడు ఆ వాదన చూచియే పైన పేర్కొన్న ధ్వని ఉదాహరణను పేర్కొని యుండవచ్చు.


ఎందుకంటే - సరిగ్గా ఇదే శ్లోకాన్ని ధ్వనివాద విమర్శకుడైన మహిమభట్టు - తన ఆలంకారికగ్రంథమైన వ్యక్తివివేకం లో పేర్కొని ఈ శ్లోకంలో ధ్వని యన్నది పాఠకపరామర్శాపేక్షితం కాదని ఖండించినాడు. మహిమభట్టు మల్లినాథుని కంటే పూర్వకాలము వాడు. అందుచేత ఆయన మల్లినాథుని వ్యాఖ్య చూచి ఉండే అవకాశం లేదు. కాబట్టి ఈ శ్లోకంలో పేర్కొన్న ధ్వనిపై సూరిపండితునకంటే ముందుకాలంలోనే యెక్కడో ప్రస్తావన జరిగింది.

౨౦.

ఉదయతి వితతోర్ధ్వరశ్మిరజ్జావహిమరుచౌ హిమధామ్ని యాతి చాస్తమ్ |

వహతి గిరిరయం విలంబిఘంటాద్వయపరివారితవారణేంద్రలీలామ్ ||


వితత = విస్తరమైన;  ఊర్ధ్వరశ్మిః = పైకి ప్రసరించు కిరణములను; రజ్జౌ = త్రాళ్ళుగా గలిగి; అహిమరుచౌ = సూర్యునియందు; ఉదయతి = ఉదయించుటను; (అపి) చ = ఇంకను; హిమధామ్ని = హిమకరుడైన చంద్రుని యందు;  అంతమ్ = అస్తమయమును; యాతి = పొందుటను; కలిగిన అయం గిరిః =ఆ పర్వతము; విలంబిత = వ్రేలాడుచున్న; ఘంటాద్వయ= రెండు ఘంటలను; పరివారిత = ఇరువైపుల (అటునిటు) వహించిన; వారణేంద్ర = గజరాజు; లీలాం = శోభను; వహతి = తాల్చినది; 

ఓ నారాయణా!

దివాకరుడు ఉదయిస్తున్నాడు. ఆయన కిరణాలు (పర్వతం క్రింద నుండి) పైకి ప్రసరిస్తున్నాయి. అలానే పర్వతానికి ఇటువైపు రజనీకరుడు అస్తమిస్తున్నాడు. పర్వతానికి అటు సూర్యుడు, ఇటు చంద్రుడు, వాటి మధ్యగల పర్వతం. ఒక పట్టపుటేనుగు కు అటునిటు రెండు ఘంటలు త్రాళ్ళతో వేలాడగట్టినట్టుగా శోభిస్తోంది.

 

సర్వంకష - 

ఒకదాని లీలను మరొకటి వహిస్తుంది అని ప్రత్యక్షంగా ఉపమించటం లేదు. పర్వతము - మదపుటేనుగు "శోభ వంటి శోభను" అని ఆక్షేపించుకోవాలి. ఇట్టి సాదృశ్యాక్షేపము వలన నిదర్శనాలంకారము.

సూర్యచంద్రులిరువురు ఆ పర్వతము యొక్క ఉదరపు కక్షలో ప్రకాశించుచున్నట్టు కల్పన గొప్ప ఔన్నత్యవంతమైనది.


పుష్పితాగ్రా వృత్తము. 

ఇతరములు - రాజు గారి పట్టపుటేనుగును అలంకరించేప్పుడు ఆ ఏనుగుపై పట్టు వస్త్రము తొడిగి,  అటునిటు త్రాళ్ళతో ఘంటలను అమర్చటం ఆనవాయితీలా కనబడుతూంది. పర్వతమును  పట్టపుటేనుగు వలెను, సూర్యచంద్రులను - వ్రేలాడుతున్న ఘంటలుగానూ ఉద్యోతించిన ఈ అపూర్వ శ్లోకం వల్ల మాఘ కవికి "ఘంటామాఘు"డన్న బిరుదనామం ఏర్పడింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Comments ridiculing, abusing, bullying and forcing to agree in any form, if objectionable to the blog owner will be removed.