26, మే 2022, గురువారం

శిశుపాలవధమ్ నాలుగవ సర్గ తెలుగు టీక, తాత్పర్యములు - (51 - 60)

౫౧.

సవధూకాః సుఖినో౽స్మిన్ననవరతమమందరాగతామరసదృశాః ।

నా సేవేంతే రసవన్న నవరతమమందరాగతామరసదృశాః ॥


అస్మిన్ = ఈ కొండదాపుల; అనవర-తమ-మందర-ఆగత-అమర-సదృశాః; అనవరతమ = శ్రేష్ఠతములైన; మందర-ఆగత = మందరపర్వతమునుండి యేతెంచిన; అమర సదృశాః= దేవతలవంటివారు; ఆమంద-రాగ-తామరస-దృశాః; అమంద = స్నిగ్ధ; రాగ= రక్తవర్ణ; తామరస దృశాః = కమలలోచనులు; సుఖినః = భోగులు; సవధూకాః = ప్రియురాండ్రతో కూడినవారై; (సవధూకాః - తేన సహ ఇతి తుల్యయోగే బహువ్రీహిః(వధువులతో కూడి - బహువ్రీహి సమాసము)); రసవత్ = కూరిమితో; నవరతం =నూత్నశృంగారములను; న సేవంతే = అవలంబింపరు; ఇతి న = అని చెప్పుటకు వీలు లేదు. (ప్రతిషేధము). (నూతన శృంగారములనాచరించుట సామాన్యవిషయమని భావము)


హరి!

ఈ నగమున శ్రేష్ఠతములైన, మందరపర్వతము నుండి ఏతెంచిన దేవతలవంటివారును, ఎఱ్ఱని కనులవారును, భోగులును, ప్రియురాండ్రతో కలిసి కూరిమితో శృంగారసల్లాపముల జేయుట అత్యంత సామాన్యవిషయము.


సర్వంకష - పంకేరుహం తామరసమ్ - ఇత్యమరః

రసవత్ - గుణే రాగే ద్రవే రసః ఇత్యమరః

ఉపమాలంకారము

ఆర్యాగీతి ఛందస్సు.


౫౨.

ఆచ్ఛాద్య పుష్పతటమేష మహాంతమంతరావర్తిభిః గృహకపోతశిరోధరాభైః ।

స్వాంగాని ధూమరుచిరాగురవీం దధానైః ధూపాయతీవ పటలైర్నవనీరదానామ్ ॥


ఏషః = ఈ భూధరము; మహాంతం = సమృద్ధమైన; పుష్పపటం = పుష్పములనే వసనములుగా; ఆచ్ఛాద్య = ధరించి; అన్తః = అందున; ఆవర్తిభిః = కలియదిరుగుచున్న; గృహకపోతశిరోధరాభైః; గృహకపోత = పెంపుడుపావురపు; శిరోధర = కంఠముయొక్క; ఆభైః = కాంతులచేత; అగురవీం = కాలాగురు; ధూమరుచిం = ధూళి యొక్క కాంతులను; దధానైః = తాల్చిన; నవనీరదానాం = వెలిమబ్బుల; పటలైః = సమూహములచేత; స్వ+అంగాని = శరీరభాగములను; ధూపాయతీవ = లేపనము చేయుదానివలె; ఉన్నది;


కమలనాభా!

ఈ అద్రి - అంతటనూ సుమములను ఉడుపులుగా ధరించి, ఇంకనూ తన శరీరాంగములయందు - పావురముల కంఠపు రంగును పోలు కాలాగురు ధూపములకాంతులను తాల్చిన వెలిమబ్బుల సమూహములను శరీరలేపనములుగా తాల్చినయట్లున్నది.


సర్వంకష -

పుష్పాణి ఏవ పటం - పుష్పపటం - రూపకసమాసము

పారావతే కపోతః స్యాత్ - ఇతి విశ్వః

కాలాగుర్వగురుః ఇతి అమరః

ధూమరుచిం దధానైః= నిదర్శనాలంకారము;

ఈ శ్లోకము ఉత్ప్రేక్ష నిదర్శన ఉపమ, నిదర్శనాలంకరముల సంకీర్ణము.

౫౩.

అన్యోన్యవ్యతికరచారుభిర్విచిత్రైః అత్రస్యన్నవమణిజన్మభిర్మయూఖైః ।

విస్మేరాన్ గగనసదఃకరోత్యముష్మిన్నాకాశే రచితమభిత్తిచిత్రకర్మ ॥


అముష్మిన్ = ఈ యగమందు; అన్యోన్యవ్యతికరచారుభిర్విచిత్రైః ; అన్యోన్య = పరస్పర; వ్యతికర = మిశ్రణమున; చారుభిః = సుందరమైన; మరియు, విచిత్రైః = విచిత్రమై; (భిన్నములైన వర్ణమిశ్రమముల వలన మనోహరమై, నానవర్ణయుతమై); అత్రస్యన్ =  భయవర్జితమై; (వా త్రాస ఇత్యాదినా వైకల్పికః శ్యన్ ప్రత్యయః); నవమణిజన్మభిర్మయూఖైః; నూత్నమణులచేత జనించిన కిరణములతో; ఆకాశే = అంబరమున; అభిత్తి = కుడ్యము లేకయే(నిరాధారముగా); రచితం = రచించిన; చిత్రకర్మ = చిత్రరచన; గగనసదః = ఖేచరులను; విస్మేరాన్ కరోతి = అబ్బురపరచుచున్నది.  

 

ఈ నగమునందు, పర్వతపు రాలనుండి ప్రసరించు వివిధమణుల కాంతులమిశ్రమము చేత యంబరమున - కుడ్యము లేకున్ననూ, కుడ్యముపై చిత్రించినట్టుల నానావర్ణవిరాజితమైన రంగులేర్పడియున్నవి. ఇట్టి ఈ విచిత్రచిత్రరచన ఖేచరులను విస్మయమొనర్చుచున్నది.


సర్వంకష -

త్రాసో భీమణిదోశయోః ఇతి విశ్వః;  

మణికిరణములచేత అంబరమున చిత్రరచన భ్రాంతి యను కారణము గోడలేకయే చిత్రించుట అను కార్యమును సంధానించుట చేత ఇది భ్రాంతిమద, విభవనాలంకారముల సంకరము.  (కారణము లేకనే కార్యమొనగూరుట విభావనాలంకారము)

ప్రహర్షిణీ వృత్తము.

౫౪.

సమీరశిశిరః శిరః సు వసతాం సతాం జవనికా నికామసుఖినామ్ ।

బిభర్తి జనయన్నయం ముదమపామపాయధవళా బలాహకతతీః ॥


సమీరశిశిరాః = గాలిచేత చల్లగానైనవి; శిరః సు = శిఖరములపై; వసతాం = నివసించు; నికామ సుఖినాం = గొప్ప సుఖమును యనుభవించు; సతాం = పుణ్యవతులకు; ముదం = ఆనందమును; జనయన్ = పుట్టించుచూ; అయం = ఈ అగము; అపాం = నీటి; అపాయ = కోల్పోవుటచేత; ధవళా = తెల్లనైనవై; బలాహకతతీః = మేఘపంక్తులు అను; జవనికా = తెరను; బిభర్తి = ధరించుచున్నది;


శీతలమలయమారుతముల చేత శిఖరములపై నివసించు భోగులకు ఆనందమును కల్పించుచూ ఈ నగము - నీటినంతయును వర్షించుటచేత తెల్లనైన మేఘపంక్తుల ముసుగును ధరించినది.


సర్వంకష -

పరిణామాలంకరము;

జలోద్ధతగతి - వృత్తము. 'రసైర్జసజసా జలోద్ధతగతిః' - జ - స - జ - స


౫౫.

మైత్ర్యాదిచిత్తపరికర్మవిదో విధాయ

క్లేశప్రహాణమిహ లబ్ధసబీజయోగాః ।

ఖ్యాతిం చ సత్వపురుషాన్యతయాధిగమ్య

వాంఛన్తి తామపి నమాధిభృతో నిరోద్ధుమ్ ॥


ఇహ = ఈ పర్వతమందు; సమాధిభృతః = సమాధిబద్ధులైన; మైత్ర్యాదిచిత్తపరికర్మవిదో= మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష అను నాలుగు చిత్తవృత్తులను ధారణ చేసి; క్లేశప్రహాణం = సంకటముల నాశమును;(కృత్యచః ఇతి ణత్వమ్) విధాయ = అవలంబించిన;  లబ్ధసబీజయోగాః = శుద్ధసత్వయోగులు; సత్వపురుషాన్యతయాధిగమ్య = ప్రకృతిపురుషతత్వముల భిన్నత్వమును ఎఱింగి; ఖ్యాతిం చ = దాని వ్యాప్తిని కూడ; నిరోద్ధుం = అడ్డగించుటను; వాంఛన్తి = ఇచ్ఛగించువారలు; (ప్రకృతిపురుష భిన్నత్వమును అడ్డగించుటయే కాక స్వయంప్రకాశ తత్వమును అన్వేషించు వారలు) తాం అపి = అట్టి వారలను కూడా (గమనింపదగును)


ఈ పర్వతమందు, సమాధిబద్ధులై, మైత్ర్యాది చిత్తవృత్తులను ధారణ చేసి,సంకటనాశమును అవలంబించిన శుద్ధసత్వయోగులు, ప్రకృతిపురుషభిన్నత్వమును తెలిసికొని దాని వ్యాప్తిని అరికట్టి, ముక్తినిచ్ఛగించువారలైన మహర్షులను కూడా గమనింపవచ్చును. (ఈ పర్వతము కేవలము భోగభూమి కాదని, తపోభూమి కూడా అని తాత్పర్యము)


సర్వంకష

మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష అను నాలుగు చిత్తవృత్తులు. పుణ్యాత్ములయందు మైత్రి, ఆర్తులయందు కరుణ, ఆనందముగా యున్నవారి పట్ల అనుమోదము (అనసూయ), పాపులయందు ఉపేక్ష - ఇవి చిత్తవృత్తులను నిరోధించుటకు ఉపకరణములు.

'అవిద్యాస్మితరాగద్వేషాభినివేశాః పంచ క్లేశాః' అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశమని ఐదు క్లేశములు.

అనిత్యమైన వాటియందు నిత్యత్వాభిమానము అవిద్య. (దేహ ఇంద్రియాదులందు ఆత్మను వెతకు విభ్రమము అవిద్య)

అస్మిత = అహంకారము;

రాగము = ఇష్టవిషములపై తీవ్రమైన కాంక్ష;

ద్వేషము = అనభిమత విషయములందు రోషము;

అభినివేశము = చేయదగినది, చేయకూడనిది తెలిసియు ఆచరించుట;

తేహి పురుషం క్లిశ్యంతీతి క్లేశాః (ఇవి పురుషుని క్లిశ్యము చేయును గనుక క్లేశములనబడును)

'ప్రకృతిపురుషయోః వివేకాగ్రహణాత్ సంసారః। వివేకగ్రహణాన్ముక్తిః । ' అని సాంఖ్యము.


 ఇతరములు

యమ, నియమ, ఆసన,ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధులని ఎనిమిది యోగ అంగములు. అష్టాంగయోగమని దీని పేరు.

౫౬.

మరకతమయమేదినీషు భానోస్తరువిటపాన్తరపాతినో మయూఖాః ।

అవనతశితికంఠకంఠలక్ష్మీమిహ దధతి స్ఫురితాణురేణుజాలాః ॥


ఇహ = ఈ నగములో; మరకతమయమేదినీషు = పచ్చలతో నిండిన భూములయందు; తరువిటప = తరువుల ఆకుల; (విటపః పల్లవే షిడ్గే విస్తారే స్తంభశాఖయోః - ఇతి విశ్వః) అంతః = మధ్యన; అపాతినః = పడునట్టి; స్ఫురిత = ప్రకాశించు; అనురేణుజాలాః = సూక్ష్మమైన ధూళికణములు;  భానోః మయూఖాః = రవికిరణములు; అవనతశితికంఠకంఠలక్ష్మీం; అవనత = క్రిందకు వ్రాలిన; శితికంఠ = మయూరముల; కంఠ = మెడలయొక్క; లక్ష్మీం = భాగ్యమును (శోభను); దధతి = పొందినవి.


శిఖిపింఛమౌళి!

ఈ నగమున పచ్చలతో నిండిన భూములు. ఆ భూములందు తరువులయొక్క పల్లవముల మాటున ప్రకాశించు ధూళికణములతో కూడిన రవికిరణములు; కొంచెముగా వ్రాలిన మయూరముల కంఠముల నీలి రంగు శోభను తాల్చినవి.


సర్వంకష

నిదర్శనాలంకారము

పుష్పితాగ్రా వృత్తము.

౫౭.

యా బిభర్తి కలవల్లకీగుణ స్వానమానమతికాలిమా౽లయా ।

నామ కాంతముపగీతయా తయా స్వానమా నమతి కా౽లిమాలయా ॥


ఈ శైలమందు; అతికాలిమా = చిక్కని శ్యామవర్ణము గల; అలయా = భ్రమించు; (న విద్యతే లయో లయనం క్వచిదవస్థానం యస్యాః సా; తయా; విరామము, నివాసము లేక ఎన్నడూ చలించునది/కూపెట్టునది, దానిచేత); కల = అవ్యక్తమధురమైన;  వల్లకీగుణ స్వానం = వీణాతంత్రీశబ్దముల నినదపు; మానం = కొలతను (పోలికను); బిభర్తి = పొందినది;(అయిన)  యా ఉపగీతయా = ఏ  గానముతో సమీపించినదో; (తత్పూర్వము అట్టి గానమును వినిపించక, మొదటిసారి సమీపించిన యని భావము. ఆదికర్మణి క్తః కర్తరి చ - తొలికర్మమందు క్త ప్రత్యయము. "గీతయా"); తయా = అట్టి;   అలిమాలయా =  భ్రమర సమూహము చేత;   స్వానమా నామ = సుఖాపేక్ష కలిగిన; (ఈశదృశ్ ఇత్యాదులలో ఖల్ ప్రత్యయము); కా = ఏ రమణి; కాంతం = ప్రియుని; అమానం = సిగ్గు త్యజించి; న నమతి = అంగీకరింపదు?


ఈ శైలమందు చిక్కని శ్యామవర్ణము గల్గి నిరంతరము భ్రమించుచు, కూపెట్టుచూ వీణావాదము వలే నినదించుచూ చెంతకు చేరిన భ్రమరసమూహముచేత కామాసక్తురాలైన ఏ స్త్రీ ప్రియుని యెదుట లజ్జను వీడి రతికై సిద్ధపడదు?


సర్వంకష

వీణాతంత్రీనాదముతో భ్రమరస్వనమును పోల్చుట - ఉపమాలంకారము.

రథోద్ధతా వృత్తము (రో నరావితి రథోద్ధతా లగౌ అని లక్షణము)


ఇతరములు - ద్విపాదయమకము. రెండవ, నాలుగవ పాదములు సదృశములు.

౫౮.

సాయం శశాంకకిరణాహతచంద్రకాన్త

నిష్యందనీరనికరేణ కృతాభిషేకాః ।

అర్కోపలోల్లసితవహ్నిభిరగ్నితప్తాః

తీవ్ర మహావ్రతమివాత్ర చరంతి వప్రాః ॥

 

వప్రాః = సానువులు; సాయం = సంధ్యాకాలమున; శశాంకకిరణాహతచంద్రకాన్తనిష్యందనీరనికరేణ కృతాభిషేకాః; శశాంక = కుందేటితాలుపు - చందమానయొక్క; కిరణ = కిరణములతో; ఆహత = కొట్టబడిన; చంద్రకాంత = చంద్రకాంతశిలాలనుండి; నిష్యంది = వెలువడిన; నీరనికరేణ = జలములతో కృతాభిషేకాః = తడిసినవి; మరియు; అర్కోపలోల్లసితవహ్నిభిరగ్నితప్తాః; అర్క = రవియొక్క; ఉపల = సూర్యకాంతవజ్రపు రాల; ఉల్లసిత = పెల్లుబికిన; వహ్నిభిః= నిప్పు చేత; అగ్నితప్తాః = కాల్చబడినవిగనూ అగుచూ; తీవ్ర మహావ్రతం = గొప్ప తపమును ఒనరించునవి వలే; అత్ర = అచ్చట; చరంతి - చరించుచున్నవి.

 

సూర్యకోటికిరణతేజా ! హరీ!

ఈ పర్వతమున సానువులు సాయం సంధ్యయందు చంద్రకాంతశిలలపైనుండి జాలువారు నీరములచేత తడుపబడుచూ, పగటిపూట సూర్యకాంతశిలలపై పెల్లుబికిన అగ్నిరేఖలచేత దగ్ధమగుచూ, గొప్ప తపస్సునాచరించుచున్నవి వలే చరించుచున్నవి.


సర్వంకష - ఉత్ప్రేక్ష. వప్రో౽స్తీ సానుమానయః ఇత్యమరః.


ఇతరములు - చంద్రకాంతశిలలపై ఇందుకాంతి తాకినప్పుడు ఆ శిలలపై నుండి నీరము జాలువారుననునది కవిసమయము. ఇది లౌకిక వాస్తవము కాదు. కావ్యప్రపంచపు భావన,

౫౯.

ఏతస్మిన్నధికపయః శ్రియం వహంత్యః సంక్షోభం పవనభువా జవేన నీతాః ।

వాల్మీకేరరహితరామలక్ష్మణానాం సా ధర్మ్య దధతి గిరాం మహాసారస్యః ॥


ఏతస్మిన్ = ఇచ్చట గల ఈ రైవతకాద్రిలో;

అధిక-పయః శ్రియం = జలసమృధ్ధి ని;  వహంత్యః = కలిగిన;

(అధి కపయః = పెక్కురు సుగ్రీవాది వానరులు; శ్రియం = గుణాధిక్యమును/లక్ష్మీస్వరూపిణి అయిన సీతను; వహంత్యః = వహించిన)

పవనభువా = గాలివలన జనించిన (పవనాత్ భవతీతి పవనభూః తేన పవనభువా); జవేన = వడిచే; సంక్షోభం = తీవ్ర చలనమును; నీతాః = తీసుకొని రాబడినవి అయిన;

(పవనభువా = హనుమంతుని; జవేన = వేగముచేత; సంక్షోభం = అతిశయమును; నీతాః = తీసుకురాబడినవి అయిన; హనుమంతుని వేగవర్ణనచేత ప్రాగల్భ్యమును పొందినవని సూచన)

మహాసారస్యః = గొప్ప సరస్సులు;

అరహిత రామః = ప్రియులతో కూడిన; లక్ష్మణానాం = ఆడు హంసల చేత;

లేదా

అరహిత రామః = ప్రియురాండ్రతో కూడిన; లక్ష్మణానాం = బెగ్గురుపక్షులచేత;

(అరహిత రామలక్ష్మణానాం = రామలక్ష్మణుల చేత కూడిన; )


వాల్మీకేః = వాల్మీకి యొక్క; గిరాం = వాక్కుల; సాధర్మ్యం = పోలికను; దధతి = ధరించినది.


ఈ పర్వతమందు గల గొప్ప జలసమృద్ధిని కలిగిన జలాశయములు ఝంఝామారుతముచేత ఏర్పడిన గొప్ప తరంగములతో కూడి ప్రియులతో కూడిన హంసలచేత వాల్మీకి వాక్కులతో సమానధర్మమును పొందినవి.

పక్షాంతరమున

ఈ పర్వతమందు గల గొప్ప జలాశయములు పెక్కురు సుగ్రీవాది వానరులు, లక్ష్మీస్వరూపిణి అయిన సీతాదేవిని, గుణవంతుడైన హనుమంతుడు, అతని వేగము చేత అతిశయించిన సౌందర్యము, రామలక్ష్మణులు వీరి ప్రస్తావనచేత చేత 

వాల్మీకి వాక్కులతో సమానధర్మమును పొందినవి.


సర్వంకష -

జవో జవిని వేగే స్యాత్ - ఇతి విశ్వః

హంసస్య యోశిద్వరటా సారసస్య తు లక్ష్మణా; ఇత్యమరః

లక్ష్మణౌషధి సారస్యోః ఇతి విశ్వః

ఉభయశ్లేష, ఉపమా అంగములతో సంకరము.


౬౦.

ఇహ ముహుర్ముదితైః కలభైః రవః ప్రతిదిశం క్రియతే కలభైరవః ।

స్ఫురతి చానువనం చమరీచయః కనకరత్నభువాం చ మరీచయః ॥


ఇహ = ఇక్కడ పర్వతముల లోయలందు; ముదితైః = స్వేచ్ఛావిహారములవలన సంప్రీతి చెందిన; కలభైః = గున్న యేనుగుల చేత; ప్రతిదిశం = ఎల్లెడలా; కలభైరవః = మధురమైన భీషణనాదము;ముహుః = మరల; రవః = ఘీంకారము; క్రియతే = చేయబడుచున్నది; అపి చ = మరియు; అనువనం = ప్రతివనమందు; చమరీచయః = చామరమృగముల గుంపు; స్ఫురతి = తోచుచున్నది;  కనకరత్నభువాం = రత్నమయమైన భూమియొక్క; మరీచయః చ = కాంతులున్నూ; స్ఫురతి = ద్యోతకమగుచున్నది.


పుండరీకాక్షా!

ఈ పర్వతలోయలందు స్వేచ్ఛగా విహరించు గున్నయేనుగుల గుంపుల ఎలుగెత్తిన లేనినాదములు, ఘీంకారములు ఎల్లెడలా వినవచ్చుచున్నవి.  వనములందు చమరీమృగములగుంపు, రత్నమయమైన భువి కాంతులున్నూ ద్యోతకమగుచున్నవి.


సర్వంకష - ప్రతిదిశం - దిశిదిశి - అవ్యయీభావసమాసము.

కలభం కరిశాబకః - ఇత్యమరః

ఉదాత్త, యమకముల సముచ్చయము.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Comments ridiculing, abusing, bullying and forcing to agree in any form, if objectionable to the blog owner will be removed.