శిశుపాలవధమ్ నాలుగవ సర్గ తెలుగు టీక, తాత్పర్యములు - (41 - 50)

 ౪౧.

అనతి చిరోజ్ఝితస్య జలదేన చిరస్థితబహుబుద్బుదస్య పయసో౽నుకృతిమ్ ।

విరలవికీర్ణవజ్రశకలా సకలామిహ విదధాతి ధౌతకలధౌతమహీ ॥


ఇహ = ఈ రైవతకమున; విరలవికీర్ణవజ్రశకలాః; విరల = యెడముగా; వికీర్ణ = చిందరవందరైన; వజ్రశకలాః = వజ్రపు రాల చూర్ణము; ధౌతాః = శుభ్రమైనవి; కలధౌతమహీ = రజతభూమి; జలదేన = మబ్బులచేత; అనతి చిరోజ్ఝితస్య = తత్కాలమున విముక్తమైన (నిర్మలమైన)చిరస్థితబహుబుద్బుదస్య; చిరస్థిత = చిరకాలముండు; బహు = పెక్కు; బుద్బుదస్య = బిందువులయొక్క; పయసా = నీటి యొక్క; సకలాం = తీరును; అనుకృతిం = అనుకరించుచు; విదధాతి = శోభించుచున్నది.


ఈ పర్వతమందు యెడనెడ అల్లనల్లన వజ్రముల రజను వలే మెఱయు నేల - మబ్బుల నుండి ముక్తమై భూమిని జారు నిర్మలమైన అనేక జలబిందువులయొక్క తీరును అనుకరించుచూ శోభిల్లుచున్నది.


సర్వంకష

కలధౌతం రూప్య ఇతి హేమ్నోః - ఇతి విశ్వః

కురకీరుతా వృత్తము - "కురకీరుతా నజభజైర్జలయుక్" - అని లక్షణము.

౪౨.

వర్జయంత్యా జనైః సంగమేకాంతతస్తర్కయంత్యా సుఖం సంగమే కాంతతః ।

యోషయైవ స్మరాసన్నతాపాంగయా సేవ్యతే౽నేకయా సన్నతాపాంగయా ॥


ఏకాంతత = అనువైనవేళల (రహస్యవేళల); కాంతతః = ప్రియునితోసంగమే (సతి) = సాంగత్యమునందు; సుఖం = ప్రణయమును; తర్కయంత్యా = కల్పన చేసికొనుచూ; (అత ఏవ = ఇంకనూ) జనైః సంగం = ఇతర జనుల సహవాసమును; వర్జయంత్యా = నిరాకరించుచు; స్మర ఆసన్నతాప అంగయా = విరహతాపముతో జ్వరబాధనొందిన శరీరభాగములతో; సన్నత అపాంగయా = కాంక్షతో నిమీలించిన నేత్రముల చేతఅనేకయా యోషయా = పెక్కురు సుదతులచేత; (జాతౌ ఏకవచనమ్- జాతిని సూచించునప్పుడు ఏకవచనప్రయోగము); ఏషో౽ద్రిః సేవ్యతే = ఏ శైలము సేవింపబడుచున్నది.


అనువైన వేళలయందు ప్రియునితో సంగమమును ఇచ్ఛగించుచూ, ప్రణయమును మనమున భావించుకొనుచూ, ఇతర జనులతో కార్యకలాపములను నిరాకరించుచు, విరహతాపముతో జ్వరబాధనొందిన గాత్రముతో, కాంక్షతో నిమీలించిన నేత్రములతో నున్న పెక్కురు సుదతులచేత ఈ పర్వతము సేవింపబడుచున్నది. (ఈ శైలము ముదితలకు ఇచ్ఛావిహారక్రీడాప్రాంగణమని భావము)


సర్వంకష -

అంగగాత్రకంఠేభ్యశ్చేతి వక్తవ్యమ్ - వృత్తివార్తికమ్.

స్త్రీ యోషిదబలా యోషా నారీ సీమంతినీ వధూః - ఇత్యమరః.

స్రగ్విణీ వృత్తము - రైశ్చతుర్భిర్యుతా స్రగ్విణీ సమ్మతా - ఇతి లక్షణాత్.

౪౩.

సంకీర్ణకీచకవనస్ఖలితైకవాలవిచ్ఛేదకాతరధియశ్చలితుం చమర్యః ।

అస్మిన్ మృదుశ్వసనగర్భతదీయరంధ్రనిర్యత్స్వనశ్రుతిముఖాదివ నోత్సహంతే ॥


అస్మిన్ = ఈ పర్వతము కడసంకీర్ణకీచకవనస్ఖలితైకవాలివిచ్ఛేదకాతరధియః; సంకీర్ణ = నిండిన; కీచక వన = (తమలో మురళిని వహించిన) వెదురు తోపుల; స్ఖలిత = నివాస స్థానము మరచిన; ఏకవాల = ఒక రోమము; విచ్ఛేద = తెగుటచేత; కాతర = భీతి గల; ధియః = బుద్ధిచేత; చమర్యః = చమరీ మృగముమృదుశ్వసనగర్భతదీయరంధ్రనిర్యత్స్వనశ్రుతిముఖాదివ; మృదు శ్వసన గర్భ = మందమారుతమును తన యందు శ్వాసించుటచేత; తదీయ  రంధ్రనిర్యత్ = ఆ గాలి వెదురు బోదెలపై గల రంధ్రముల నుండి వెలువడుట చేత; స్వనశ్రుతి సుఖాత్ ఇవ = స్వనము చెవులకింపు అయినదన్నట్లు; చలితుం = అచ్చటి నుండి కదలుటకు; నోత్సహన్తే = ఇచ్ఛగించుట లేదు.


ఈ వనములందు వెదురుతోపులనేకము గలవు. చమరీమృగమొకటి ఆ వెదురుతోపులయందు ప్రవేశించి, కండూతి (దురద) బాపుకొనుటకై వెదురుతోపునకు మేనిని సంఘర్షించుటచేత కాబోలును, రోమము తెగి, ఆ భయము చేత ఈ తోపులయందే తిరుగాడుచున్నది. వెదురుతోపులయందు మందమారుతములు వీచుటచేత ఆ తోపుల నుండి వెలువడు సన్నని మధురమైన నాదమును విని, ఆ నాదము యొక్క మత్తు చేత (భయమును వీడి) ఆ ప్రదేశమునుండి వెడలుటకు ఉత్సాహము చూపకున్నది.  


సర్వంకష

'వేణవః కీచకాస్తే స్యుర్యే స్వనంత నీలోద్ధతాః' ఇత్యమరః

హేతుత్ప్రేక్ష.

విశేషము  - (చమర్యఃచమరీమృగములు అని బహువచనము. కానీ ఈ శ్లోకము చమరీంఋగమునొక్కదానిని లక్షించినట్లు తోచుచున్నది. సర్వంకష వ్యాఖ్యానములోనూ చమర్యః అనియే ఉన్నది. ఇది అర్థమవటం లేదు.

బహుశా ఇది "చమర్యాః" అయి ఉండవలె. అప్పుడు చమరి యొక్క అని షష్టీవిభక్తి పొసగుతుంది. )

కాళిదాసు కుమారసంభవంలో హిమాలయవర్ణనలో ఏనుగును వర్ణిస్తాడు.

కపోలకండూః కరిభి ర్వినేతుం విఘట్టితానాం సరళద్రుమాణామ్
యత్ర స్రుత క్షీరతయా ప్రసూతః సానూని గంధ స్సురభీకరోతి


హిమాలయాల్లో గజములు, చెక్కిళ్ల దురద తీర్చుకోవడానికి దేవదారువృక్షాలకి వాటిని గోకుతున్నాయి. అప్పుడు ఆ వృక్షాలనుండి కారే పాలు, ఏనుగుల మదజలముతో కలిసి హిమాలయపర్వతసానువులని సుగంధభరితం చేస్తోంది.

మాఘుని శ్లోకంలో చమరికిఆ ఏనుగు ప్రేరణా? యేమో!

౪౪

ముక్తం ముక్తాగౌరమిహ క్షీరమివాభ్రైః వాపీష్వంతర్లీన మహానీలదళాసు ।

శస్త్రీశ్యామైరంశుభిరాశు ద్రుతమంభశ్ఛాయామచ్ఛామృచ్ఛతి నీలీసలిలస్య ॥


ఇహ = ఈ పర్వత సానువులందు; అంతర్లీనమహానీలదళాసు; అంతర్లీన = నేల లోపలి భాగములందు; మహానీలదళాసు = ఇంద్రనీలఖండములు గల; వాపీషు = దిగుడుబావులందు; అభ్రైః ముక్తం = మేఘములచే విడువబడిన; ముక్తాగౌరం = ముత్యములవలే స్వచ్ఛమైన;మఱియు; క్షీరమివ = పాలవలె నిలచి యున్న; అంభః = జలములుశస్త్రీశ్యామైరంశుభిరాశుశస్త్రీ = బాకు (ఛురిక) వలె; శ్యామైః అంశుభిః = నల్లని కాంతుల చేత; ద్రుతం = వ్యాపితమై; నీలీసలిలస్య = నీలి అనబడు యొక ఔషధపత్రరసము యొక్క; అచ్ఛాం ఛాయాం = ఆవరించిన కాంతిని; మృచ్ఛతి = అనుసరించినది;  


ఈ పర్వత సానువులలో గల దిగుడుబావుల యంతర్భాగములలో ఇంద్రనీలఖండములు ఆవరించి యుండుట చేత ఆ కూపములలో - మేఘముల నుండి విముక్తమైన స్వచ్ఛమైన, పాలవంటి నీరు, ఛురికతో ఛేదించినట్లు నీలి (నీలి యనబడు ఒక ఔషధపత్రపు రసము యొక్క ప్రకాశమును) వర్ణ కాంతిని పొందినది. 


సర్వంకష

'సింహలస్యాకారోద్భూతా మహానీలస్తు మే మతాః' ఇతి భగవానగస్త్యః 

'స్యాత్ శస్త్రీ చాసిపుత్రీ చ ఛురికా చాసిధేనుకా' ఇత్యమరః

'నీలీ కాలా క్లీతకికా' ఇత్యమరః

నిదర్శనాలంకారము;

బావుల లోపలిభాగములందు ముక్తాగొరము, క్షీరము వలె, శస్త్రశ్యామమైన, అని నిర్దేశించుట చేత పదార్థహేతుకమైన కావ్యలింగాలంకారము.

ఛురిక వలె అనుట తద్గుణాలంకారము.

పై అలంకారముల సంకరము;

క్షీరము వంటి నీరు అనుట చేత ఇంద్రనీలమణుల సౌష్ఠవము సూచితము.

'క్షీరమధ్యే క్షిపేన్నీరం క్షీరం చేన్నీలతాం వ్రజేత్। ఇంద్రనీలమితి ఖ్యాతమ్' అని లక్షణము.

నీలీరస ఉపమానము చేత ఆ ఔషధి వర్ణము సూచితము.

'నీలీరసనిభాః కేచిచ్ఛంభుకంఠనిభాః పరే' అని రత్నశాస్త్రములో పదకొండు వర్ణములు ప్రస్తావింపబడినవి.

మత్తమయూర వృత్తము – వేదే రంధ్రే మ్తౌ యసగా మత్తమయూరమ్ ఇతి లక్షణాత్.

౪౫.

యా న యయౌ ప్రియమన్యవధూభ్యః సారతరాగమనా యతమానమ్ ।

తేన సహేహ బిభర్తి రహః స్త్రీ సా రతరాగమనాయతమానమ్ ॥


ఇహ = ఈ అద్రియందు; అన్యవధూభ్యః = ఇతరస్త్రీలచేత; సారతరాగమనా = శ్రేష్ఠమైన సంగమము గల;(మానవతి అయిన) యా స్త్రీ = ఏ యువతియతమానం = (శృంగారమునందు లజ్జను తొలగించుటకు) ప్రయత్నము సేయు; ప్రియం = మగని; న యయౌ = సమీపించదో,   సా = అట్టి స్త్రీ; రహః = రహస్యమున; తేన సహ = తన పురుషునితోఅనాయతమానం = స్వల్పమైన అభిమానమును; (వహించియు); రతరాగం = శృంగారాభిలాషయును; బిభర్తి = తాల్చుచున్నది.


ఈ శైలమందు మానవతి, బహులజ్జావతి అయిన స్త్రీ, మగని ప్రయత్నమునకు కూడా లొంగక యుండెనో, అట్టి స్త్రీ కూడను, తన పురుషునికై, అభిమానమును వర్జించి, శృంగారాభిలాష వహించినది. (ఈ పర్వతసానువులు, పరిసరములు శృంగారోద్దీపకములని భావము) 


సర్వంకష

యతీ ప్రయత్నే - శానచ్.

దోధక వృత్తము. (దోధక వృత్తమిదం భభభా మా - ఇతి లక్షణాత్)

౪౬.

భిన్నేషు రత్నకిరణైః కిరణేష్విహేందోరుచ్చావచైరుపగతేషు సహస్రసంఖ్యామ్

దోషాపి నూనమహిమాంశురసౌ కిలేతి వ్యాకోశకోకనదతాం దధతే నలిన్యాః ॥


ఇహ = ఈ రైవతకాద్రియందు; ఇందోః కిరణేషు = చంద్రకిరణముల యందు; సహస్రసంఖ్యాం ఉపగతేషు = వేలసంఖ్యను పొందిన; ఉచ్చావచైః = అనేకవిధములైన; రత్నకిరణైః భిన్నేషు = విభిన్నములైన రత్నకిరణములందునలిన్యాః = తామరలు; అసౌ = ఆ ప్రకాశము; అహిమాంశుః = మింటివేలుపుది; కిల ఇతి = కదా అనుకొని; (సహస్రకిరణములవలే భిన్నములగుటచేత కారణమున సూర్యుడని సంభావించి); దోషాపి = రాత్రి అయిననూ; వ్యాకోశకోకనదతాం = వికసించిన చెంగలువల భావమునుదధతే = స్వీకరించినవి;(అని) నూనం = నిశ్చయమగుచున్నది;  


ఈ రైవతకాద్రియందు వేలసంఖ్యలో రత్నములపై బడి వికిరణము చెందిన చంద్రకిరణములయందు తామరలు - ఈ వెలుగు మింటివేలుపైన దివాకరుని కిరణములు కాబోలునని రాత్రిసమయమున కూడా వికసించిన చెంగలువల స్వభావమును స్వీకరించినవిగా నిశ్చయమగుచున్నది.


సర్వంకష

వ్యాకోశవ్యాకోచ అని పాఠాంతరము.

ఉచ్చావచం నైకభేదమ్ - ఇత్యమరః

నలం పద్మే నలం తృణం - ఇతి శాశ్వతః (శాశ్వతనిఘంటువు)

వార్తాసంభావ్యయో కిల ఇత్యమరః

దివాహ్నీత్యథ దోషా చ నక్తం చ రజనీ - ఇత్యమరః

అథ రక్తసరోరుహం రక్తోత్పలం కోకనదం - ఇత్యమరః

వ్యాకోచ వికచస్ఫుటః – ఇత్యమరః

తామరలుచెంగలువలవలే ప్రవర్తించుట అతిశయో౽క్తి

ఇందుకిరణములు భానుకిరణముల వలే పరివర్తించుట – భ్రాంతిమదము.

(అతిశయో౽క్తి భ్రాంతిమదమును వ్యంజించుట అలంకారధ్వని)

౪౭.

అపశంకమంకపరివర్తనోచితాశ్చలితాః పురః పతిముపైతుమాత్మజాః |

అనురోదతీవ కరుణేన పత్రిణాం విరుతేన వత్సలతయైష నిమ్నగాః ||


అపశంకం = జంకులేక; అంకపరివర్తనోచితాః = ఒడిని తిరుగాడెడు; ఆత్మజాః = బిడ్డలు; పురః = ఇప్పుడు; పతిముపైతుం = మగని చేరుటకునై; చలితాః = వెడలినవి (కాగా); కరుణేన = దుఃఖముతో; అనురోదతీ ఇవ = శోకించుచున్నట్టుగా; పత్రిణాం = పక్షుల; విరుతేన = కూజితములతో; ఏష నిమ్నగాః = ఈ శిఖరములు; వత్సలతః = వాత్సల్యముతో (స్థితాః = ఉన్నవి);


ఆపన్నప్రసన్నా! శ్రీధరా!

తన ఒళ్ళో ఆడుకునే చిన్ని పిల్లలైన నదీనదాలు పెరిగి పెద్దవై, మగడయిన సముద్రుని దగ్గరకు వెళ్ళిపోతుంటే, వాటిని చూచి అక్కడి పక్షులు కరుణతో దుఃఖిస్తున్నాయి. అలా దుఃఖిస్తున్న పక్షులను వాత్సల్యంతో రైవతక పర్వత శిఖరాలు చూస్తున్నవి.


సర్వంకష - శ్రీమాన్ స్నిగ్ధస్తు వత్సలః ఇత్యమరః.

ఉత్ప్రేక్ష.


ఇతరములు - మాఘుని శ్లోకానికి తెనుగు వ్యాఖ్యానకారుని పద్యానువాదం.


కం ||

ఒడి నడయాడెడు బిడ్డలు

అడుగులిడి మగడు కడలిని యందగ బోవన్,

వడిపడి విహగము లో యని

సడులిడినట్టుగ నరిమిలి శైలములుండెన్.

౪౮.

మధుకరవిటపానమితాస్తరుపంక్తీర్బిభ్రతో౽స్య విటపానమితాః ।

పరిపాకపిశంగలతారజసా రోధశ్చకాస్తి కపిశం గలతా ॥


విటపాన్ అమితాః = అనేక శాఖలతో విస్తరించిన; తరుపంక్తీః = పాదపముల వరుసలు; బిభ్రతః = కలిగిన; అస్య = ఈ శైలము యొక్క; రోధః = ఈ తటము; మధుకర-విట-పానమితాః = తేంట్లు అనెడు విటుల ద్వారా పానము చేయబడి; గలతా = జారుచున్నపరిపాక-పిశంగలతారజసా; పరిపాక = ఫలించుటచేత; పిశంగలతారజసా = పచ్చబారిన తీవెల (లో గల పుష్పముల) పుప్పొడి చేత; కపిశం = పింగళవర్ణమును; చకాస్తి = వెలువరించుచున్నది.


అనేకశాఖలతో విస్తరించిన పాదపముల వరుసలు కలిగిన ఈ శైలము యొక్క కనిపించు భాగము, తేంట్లు అన్న విటులతో పానము చేయబడినదై, పక్వము చెందిన తీవెల యొక్క కుసుమముల పుప్పొడి నేల జారగా, పసుపు రంగును పులుముకొనినట్లు ప్రకాశించుచున్నది.


సర్వంకష -

విస్తారో విటపో౽స్త్రియామ్ ఇత్యమరః

ఇది ఆర్యాగీతి. మాత్రావృత్తి, ఇష్టగణములతో కూర్చవచ్చును.  'అర్ధే వసుగణ ఆర్యాగీతిః' అని పింగళనాగుడు.

౪౯.

ప్రాగ్భాగతః పతదిహేదముపత్యకాసు శృంగారితాయతమహేభకరాభమంభః ।

సంలక్ష్యతే వివిధరత్నకరానువిద్ధమూర్ధ్వప్రసారితసురాధిపచాపచారు ॥


ఇహ = ఈ నగముయందు ; ప్రాగ్భాగతః = శిఖరములపై నుండి; ఉపత్యకాసు = లోయలలో; పతత్ = పడిన; శృంగారిత = అలంకరింపబడిన; ఆయత = పొడవైన;మహా ఇభ = పట్టపుటేనుగు; కర = తొండముల; ఆభ = కాంతివంటి కాంతిచేత; వివిధరత్నకరానువిద్ధం = పలురత్నముల కాంతులచేత సోయగములందిన; ఇదం అంభః = ఈ జలములు; ఊర్ధ్వప్రసారిత సురాధిప చాపచారు = పైకి ప్రసరించిన హరివిల్లును; సంలక్ష్యతే = లక్ష్యముగా చేసికొనుచున్నది. 


ఓ హరి!

వివిధరత్నముల రాల చేత నిండిన ఈ నగమునందు ఉన్నతశిఖరముల నుండి లోయలపై ప్రసరింపబడిన కాంతి - (సిందూరముచేత)అలంకరింపబడిన పట్టపుటేనుగు తొండముల నుండి ప్రసరించిన కాంతి వలే, వివిధరత్నకాంతుల చేత సోయగములీనుచు దిగువన ప్రవహించు నీరములను కాంతిమయము చేయుచున్నది. ఇట్లు ఈ నీటి కాంతి ఆకాశమున ప్రతిఫలించి హరివిల్లును చేరికొనుచున్నది.


ఉపత్యకాద్రేరాసన్నా ఇత్యమరః

శృంగారే సురతే నాట్యే రసే దిగ్గజమండనే ఇతి విశ్వః

క్రిందనున్న నదీజలముల కాంతి పైకి ప్రసరించి ఇంద్రధనువును లక్షించుట - అతిశయోక్తి అలంకారము. అభూత ఉపమ అని కొందరందురు.

౫౦.

దధతి చ వికసద్విచిత్రకల్పద్రుమకుసుమైరభిగుంఫితానివైతాః ।

క్షణమలఘువిలంబిపిచ్ఛదామ్నః శిఖరిశిఖాః శిఖిశేఖరానుముష్య ॥


(కిం) చ = ఇంకనూ;అముష్య = ఈ అద్రియొక్క; ఏతాః శిఖరి శిఖాః = ఈ పర్వతపు శిఖరాగ్రభాగములువికసద్విచిత్రకల్పద్రుమకుసుమైరభిగుంఫితాన్; వికసత్ = వికసించిన; విచిత్రకల్పద్రుమకుసుమైః = నానావర్ణయుతమైన కల్పతరువుల కుసుమములచేత; అభిగుంఫితాన్ = సంధానముచేయబడిన; అలఘువిలంబిపిచ్ఛదామ్నః; అలఘు = పొడవుగ; విలంబి = వ్రేలాడు; పిచ్ఛదామ్నః = నెమలిపింఛపు మాలల యొక్క; శిఖిశేఖరాన్ = నెమళ్ళను; క్షణం = లిప్తపాటు; దధతి  ఇవ = ధరించు వలే; (యున్నది)


ఇంకనూ,ఈ శైలము యొక్క పర్వతశిఖరముల కొసలు, నానావర్ణయుతమై వికసించిన కల్పతరువుల సుమములచేత సంధానించిన మరియు, పొడవుగా వ్రేలాడు నెమలిపింఛముల మాలల నెమళ్ళను ధరించునట్లు లిప్తపాటున యగుపించుచున్నది.


సర్వంకష

శృంగాణి ఏవ శిఖాః కేశపాశ్యాః, శిఖా చూడా కేశపాశ్యాః ఇత్యమరః

శిఖావలః శిఖీ కేకీ; శిఖాస్వాపీడశేఖరాః ఇత్యమరః

రూపకోత్ప్రేక్షల సంకరము.

పుష్పితాగ్రా వృత్తము.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వాఙ్మయచరిత్రలో కొన్ని వ్యాసఘట్టాలు - శ్రీ ఏల్చూరి మురళీధరరావు గారు.

అశోకుడెవరు? - 1

ముకుందవిలాసః - కుంటిమద్ది శేషశర్మ.