24, మే 2022, మంగళవారం

శిశుపాలవధమ్ నాలుగవ సర్గ తెలుగు టీక, తాత్పర్యములు - (31 - 40)

 ౩౧.

వ్యోమస్పృశః ప్రథయతా కలధౌతభిత్తిరున్నిద్రపుష్పచణ చంపకపింగభాసః ।

సౌమేరవీమధిగతేన నితంబశోభామేతేన భారతమిలావృతవత్ విభాతి ॥


వ్యోమస్పృశః = అంతరిక్షాన్ని అంటుచున్నది; ఉన్నిద్రపుష్పచణ = వికసించిన సుమసంపదచేత; (తేన విత్త ఇతి చణప్రత్యయః); చంపకపింగభాసః = మొగలిపూల యొక్క సువర్ణవర్ణముతో వెలుగునది అయిన; కలధౌత భిత్తి = పసిడి సానువు; సౌమేరవీం = సుమేరుసంబంధమైన; నితంబశోభాం = శిఖరముల శోభను; అధిగతేన = ప్రాపించెనో (యన్నట్లు); ప్రథయతా = ప్రకటించుచున్నది. ఏతేన = ఈ రైవతకాద్రి చేత; భారతం = భారతమను ఈ భూఖండము; (దీనికే హైమవతమని మరియొక నామము గలదుసర్వంకష) ఇలావృతవత్ = ఇలావృతఖండము వలే; విభాతి = ఒప్పుచున్నది.


ఆకాశమును తాకు ఈ రైవతకము వికశించిన సుమసంపదగల మొగలిపూల రంగుతో మెఱయు పసిడి సానువుల సుమేరు శోభను ప్రాపించెనో యన్నట్లు ప్రకటించుచున్నది. ఈ రైవతకాద్రి ఇచ్చట నుండుట చేత భారతము ఇలావృతఖండము వలే ఒప్పుచున్నది.


సర్వంకష

కలధౌత రౌప్యహేమ్నౌః ఇతి విశ్వః

ఇలావృతవర్షము సుమేరుపర్వతమును ఆవరించియున్న భూభాగము. ఇది దేవభూమి.

మామ్నేదం భారతం వర్షం హిమాద్రేస్తచ్చ దక్షిణే ।

తేన హైమవతం నామ పరేష్వప్యేవమున్నయేత్॥

ఇలావృత సౌమేరవం సుమేరో పరితేవ యత్ ॥। ఇతి వైజయంతీ.

౩౨.

రుచిరచిత్రతనూరుహలోమభిర్విచలితైః పరితః ప్రియకవ్రజైః ।

వివిధరత్నమయైరభిభాత్యసావవయవైరివ జంగమతాం గతైః ॥


అసౌ = ఈ గిరి; రుచిరైరుజ్వలైః = నానావర్ణములతో; తనూరుహలోమభిః = గాత్రమునందు పొడమించిన రోమములు గలదైన; ప్రియక వ్రజైః = ప్రియక మను పేరుగల మృగముల గుంపుతో ;(కంబలయప్రకృతః మృగవిశేషః) పరితః = అంతటను; ప్రచలితైః = వ్యాపించినదై; జంగమతాం = చరించుటను; గతైః =పొందిన; వివిధరత్నమయైః = వివిధరత్నములతో; అవయవైరివ = తన దేహభాగములతో; ప్రతిభాతి = ఒప్పుచున్నది.


ఈ గిరి వివిధములైన రంగులతో, దేహముపైని రోమములతో ఒప్పారు ప్రియకమను పేరుగల మృగసమూహముతో, నిశ్చింతగా చరించు జంగముల వ్యాపారమును పోలి,నానారత్నములను,తన దేహభాగములవలే వహించి ఒప్పారుచున్నది.


సర్వంకష - ప్రియక్ రోమభిర్యుక్తో మృదూచ్చమసృణైర్ఘనైః - ఇతి వైఅయంతి.

ద్రుతవిలంబిత వృత్తము.

౩౩.

కుశేశయైరత్ర జలాశయోషితా ముదా రమన్తే కలభా వికస్వరైః ।

ప్రగీయతే సిద్ధగణైశ్చ యోషితాముదారమంతే కలభావికస్వరైః ॥


అత్ర = ఇచ్చట; జలాశయ = హ్రదములలో; ఉషితా = నివసించు; (గత్యర్థ అకర్మకములలో క్త ప్రత్యయము); కలభాః = ముప్పది ఏండ్ల యేనుగులువికస్వరైః = వికసించిన; కుశేశయైః = శతపత్రముల తామరల చేతముదా = ఆనందముగా ; రమన్తే = క్రీడించుచున్నవి; (కమలములకు, కరివిహారములకు ఈ అద్రి నెలవని తాత్పర్యము) కల = అవ్యక్తమధురముగా; స్వరైః = స్వరములతో; భావికాః = ఆనందాన్వేషకులు అయిన; సిద్ధగణైః = సురసంఘములచేత; యోషితాం = తమ ప్రియతమ స్త్రీల; అంతే = సమీపమున; ఉదారం = కమ్మగా; ప్రగీయతే = గానము చేయబడుచున్నది.


ఇచ్చట జలాశయములలో నివసించు కరిణులు ఆ సరములందు వికసించిన తామరలతో క్రీడించుచున్నవి. అవ్యక్తమధురముగా, చక్కని స్వరముతో దేవగణములిచ్చట తమ ప్రియతమస్త్రీలను కూడి కమ్మగా పాడుచున్నారు.(ఇది భూతలస్వర్గమని భావము).


సర్వంకష

త్రింశద్వర్షస్తు కలభః ఇతి వైజయంతీ.

శతపత్రం కుశేశయం ఇత్యమరః


ఇతరములు - ద్విపాదయమకము.

౩౪.

ఆసాదితస్య తమసా నియతేర్నియోగాదాకాంక్షతః పునరపక్రమణేన కాలమ్ ।

పత్యుస్త్విషామిహ మహౌషధయః కలత్రస్థానం పరైరనభిభూతమమూర్వహన్తి ॥


ఇహ = ఈ నగమున; అమూ మహౌషధయః = ఈ యొక్క వనమూలికలు; నియతే నియోగాత్ = నిర్భాగ్యమున (ఈ సమయమున నిట్లగును అను దైవశాసనముచేత); తమసా = చీకటితో; (వ్యసనముతో);ఆసాదితస్య = క్రమ్ముకొనినట్టి; పునరపక్రమణేన = మరియు, దానినుండి బయటపడుట చేత; కాలం = పునస్సమాగమ సమయమును; ఆకాంక్షతః = అభిలషించుచున్న; త్విషాం పత్యుః = తేజో పతి (రవి)యొక్క; పరైః =అన్యతేజముతోఅనభిభూతం = తిరస్కారము కాని; కలత్రస్థానం = కలత్రస్థానమును; వహన్తి = పొందుచున్నవి. 


విరాట్ స్వరూపుని సంకల్పము చేత రాత్రి సమయమున సూర్యుని - అంధకారము క్రమ్ముకొనినది. తిరిగి యా అంధకారము త్రొలగుట చేత సూర్యుడు ప్రభాపతి అగుటకు నిచ్ఛగించెను. త్విషాపతి సూర్యుని భార్యయే - తేజము. ఆ తేజమును - అంధకారసమయమున ఈ పర్వతమున గల ఓషదులు తమ సంరక్షణమున నుంచుకొన్నవి. ఓ వ్యక్తి వ్యసనగ్రస్తుడై భార్యను వీడియుండు సమయమున, ఆతని పతి మరియొకరి సంరక్షణమున నుండునో అట్లు ఈ ఔషధులు ప్రవర్తించినవి. పునస్సమాగమమును అభిలషించిన పతి తిరిగి వచ్చిన పిదప (ఆ స్త్రీని) తేజస్సును (సంరక్షకుడు) ఓషధులు ఆతనికి ఒప్పగించినవి.


రాత్రియందు ఈ పర్వతమున గల మహౌషధములు సూర్యతేజముతో వెలుగొందుచున్నవని తాత్పర్యము.


సర్వంకష

సమాసోక్తి అలంకారము.

౩౫.

వనస్పతిస్కంధనిషణ్ణబాలప్రబాలహస్తాః ప్రమదా ఇవాత్ర ।

పుష్పేక్షణైర్లంభితలోచకైర్వా మధువ్రతవ్రాతవృతైర్వ్రతత్యః ॥


అత్ర = ఈ శైలమందు; వనస్పతిస్కంధనిషణ్ణబాలప్రబాలహస్తాః; వనస్పతి = తరువుల; (ముంగట నిలబడియున్న భర్త యొక్క) స్కంధ = కొమ్మలలో; (బాహువులపైన); నిషణ్ణ = నెలకొన్న (ఊతముగా గొనిన); బాలప్రవాలహస్తాః = చివురుటాకుల చేతులు; మధువ్రతవ్రాతవృతైః; మధువ్రత = ఝుంకారము సేయు తుమ్మెదలవ్రాత = సమూహపు; వృతైః = స్వనములచేత; (అత ఏవ = మరియు) లంభితలోచకైః వా; లంభిత = ప్రాపించిన; లోచకైః వా = చుక్కలు గలవియును అయిన; (కాటుక కంటి); (వా ప్రయోగము ఉత్ప్రేక్ష కొరకు ఉపయోగింపబడినది); వ్రతత్యః =  తీవెలు; పుష్పేక్షణైః = పుష్పములను వీక్షించుటకై ; ప్రమదా ఇవ = ముదితల వలే; (లక్ష్యంతే = లక్షించుచున్నవి)


ఈ శైలమందు తరువుల విటపములలో నెలకొన్న చివురుటాకుల చేతులవంటివి ఝుంకారము సేయు భ్రమరసమూహముల స్వనములచేతను మరియు ప్రాపించిన తారలు గలవియును అయిన తీవెలు పుష్పములను సందర్శించుటకై ముదితల వలే నున్నవి.


ఈ శైలమందు ముందున్న పతి భుజములను ఊతముగా గొని, చివురుటాకుల చేతులను, ఝుంకారము సేయు తుమ్మెదల సమూహపు స్వనముల వలే కూజించు మరియు కాటుకనలదిన కన్నులకన్నియలు కుసుమములను వీక్షించుటకా యన్నట్లున్నవి.


సర్వంకష

'వనస్పతివృక్షమాత్రే బినాపుష్పఫలద్రుమే' ఇతి విశ్వః

'లోచకో మాంసపిండే స్యాదక్షితారే చ కజ్జలే' ఇతి విశ్వః

౩౬.

విహగాః కదంబసురభావిహ గాః కలయంత్యనుక్షణమనేకలయమ్ ।

భ్రమయన్నుపైతి ముహురభ్రమయం పవనశ్చ ధూతనవనీపవనః ॥


కదంబసురభౌ = కడిమిపూల తావితో పరిమళభరితమైన; ఇహ = ఈ ధరణీధరమున; విహగాః = పక్షులు; అనుక్షణం = ప్రతి క్షణమూ; అనేకలయం = బహువిధములైన వైవిధ్యములైన; గాః = శబ్దములను; కలయంతి = కూయుచున్నవి; అయం = ఈ యొక్క; ధూతనవనీపవనః = కదంబముల వనమును కదిలించిన; పవనః = గాలి; ముహుః = ఇంకాఅభ్రం = మేఘమును; = కూడా; భ్రమయన్ = చలింపజేయుచు; ఉపైతి = సమీపించుచున్నది;

కడిమిపూల తావితో పరిమళభరితమైన ఈ శైలమున పక్షులు అనుక్షణమూ బహువిధములైన వైవిధ్యములతో కూజితములను జేయుచున్నవి. కదంబముల వనమును చలింపజేసిన మారుతము తిరిగి జలదములను కూడ కంపింపజేయుచు మనలను సమీపించుచున్నది.


సర్వంకష - అర్జునీనేత్ర దిగ్బాణ భూ వాక్ వారిషు గౌర్మతా - ఇతి విశ్వః (గాః అనునది వాక్కు విషయమున ఉపయోగించదగు.)

నీపప్రియకదంబాస్తు హలిప్రియః - ఇతి అమరః

ప్రమితాక్షర వృత్తము - స జ స స - అని గణములు/ 'ప్రమితాక్షరా సజససైరుదితా'

౩౭.

విద్వద్భిరాగమపరైర్వివృతం కథంచిచ్ఛృత్వాపిదుర్గ్రహమనిశ్చితధీభిరన్యైః ।

శ్రేయాన్ ద్విజాతిరివ హంతుమఘాని దక్షం గూఢార్థమేష నిధిమంత్రగణం బిభర్తి ॥


అన్వయము - విద్వద్భిః, ఆగమపరైః, వివృతం, కథంచిత్, శృత్వా అపి, దుర్గ్రహం, అనిశ్చితధీభిః, అన్యైః, శ్రేయాన్, ద్విజాతిరివ, హంతుం, అఘాని, దక్షం, గూఢార్థం, ఏష, నిధిమంత్రగణం, బిభర్తి.


ఏషః = ఈ పర్వతము; శ్రేయాన్ = శ్రేష్ఠుడు; ద్విజాతిరివ = బ్రాహ్మణుని వలే; ఆగమపరైః = భూగర్భవిద్యలో (మంత్రశాస్త్రమున); విద్వద్భిః = పండితులైన వారలచేకథంచిత్ = ఏదో విధముగా; వివృతః అపి= మార్పునొందియుఅనిశ్చితధీభిః = శాస్త్రనిపుణులు కానివారలైన; అన్యైః =అన్యులచేతను; శృత్వా అపి = వినియున్నను; (ఇచ్చట నిధి గలదు, ఈ మంత్రమునకు ఈ సిద్ధి గలదని ఆగమవేత్తలచే నెఱింగియు), దుర్గ్రహమ్ = దుస్సాధ్యము;

అఘాని = దుఃఖములను (పాపములను); హన్తుం = పోగొట్టుటకు; దక్షమ్ = సమర్థమైనది.

గూఢం = ఆవరించిన, అర్థం = ధనమును (ప్రయోజనమును); నిధిమంత్రగణం = ధనరాశుల చయమును (నిధుల వంటి మంత్రములను) బిభర్తి = ధరించినది.


ఈ పర్వతశ్రేష్ఠము ద్విజులకు సమానమైనది. భూగర్భవిద్యావేత్తలచేత యెట్లో (అతి కష్టతరముగ పరిశోధింపబడి) చెప్పబడినను, అర్థము చేసుకొనజాలని చంచల, అనిశ్చితబుద్ధి గల పురుషులకు దుర్లభమైనది. అట్లే ఈ పర్వతము దారిద్ర్య దుఃఖమును బాపు గూఢమైన ధనరాశులను తనయందు కలిగియున్నది.

ఈ పర్వతశ్రేష్ఠము ద్విజులకు సమానమైనది. మంత్రశాస్త్రవేత్తలచేత యెట్లో (అతి కష్టతరముగ పరిశోధింపబడి) వివరింపబడినను,అర్థము చేసుకొనజాలని చంచల, అనిశ్చితబుద్ధి గల పురుషులకు దుర్లభమైనది.అట్లే ఈ పర్వతము పాపములను నశింపజేయు గూఢమైన మంత్రచయమును తనయందు కలిగియున్నది.


సర్వంకష

దుఃఖైర్నోవ్యసనేష్వఘమ్ ఇతి వైజయంతీ

౩౮.

బింబోష్ఠం బహు మనుతే తురంగవక్త్రశ్చుంబనం ముఖమిహ కిన్నరం ప్రియాయాః ।

శ్లిష్యంత ముహురితరో౽పి తం నిజస్త్రీముత్తుంగస్తనభరభంగభీరుమధ్యామ్ ॥


ఇహ అద్రౌ = ఈ గిరి కడ; తురంగవక్త్రః = అశ్వము యొక్క ముఖము వంటి ముఖము గల (దేవజాతి పురుషుడు); బింబోష్ఠం = పండిన దొండపండువంటి పెదవిగల; ప్రియాయాః = ప్రియురాలి ;ముఖం = ముఖమును; చుంబంతం = ముద్దాడు; కిన్నరం = మనుషముఖము, అశ్వశరీరము గల కిన్నెరుని; బహు = గొప్పగా; మనుతే = భావింతురు; ఇతరః అపి = అన్యులు;(అశ్వశరీరము,మనుషముఖము గల వారు) ఉత్తుంగస్తనభరభంగభీరుమధ్యాం = ఘనమైన పయోధరముల భారముచేత (ఈ కుచములను మోయుటెట్లు యని) భయముతో కృశించిన నడుముగల; నిజస్త్రీం = తన ప్రియురాలిని; ముహుః = తిరిగి; శ్లిష్యంతం = కౌగిలించుకొను; తం = అశ్వముఖము, మానుషశరీరము గల కిన్నెరుని;   బహు మనుతే = శ్రేష్ఠుడని తలంతురు.  


ఈ గిరి కడ అశ్వము యొక్క ముఖము వంటి ముఖము గల (దేవజాతి పురుషుడు) పండిన దొండపండువంటి పెదవిగల ప్రియురాలి మోమును ముద్దాడు మనుషముఖము, అశ్వశరీరము గల కిన్నెరుని గొప్పగా భావింతురుఅన్యులు(అశ్వశరీరము,మనుషముఖము గల వారు) ఘనమైన పయోధరముల భారముచేత కృశించిన నడుముగల ఇష్టసఖిని కౌగిలించుకొను అశ్వముఖము, మానుషశరీరము గల కిన్నెరుని శ్రేష్ఠుడని యెంచుదురు.  


గంధర్వులు రెండు రకాలు. మొదటి రకం - తురగదేహం + మనిషి మోము. రెండవ రకం - మనుజదేహం + తురగవదనం. మొదటి రకపు గంధర్వులకు సుదతి ని చుంబించటంలో, రెండవ రకపు గంధర్వులకు రమణి కౌగిలిలోనూ వెసులుబాటు బావుంటుంది కనుక, వారిని వీరు, వీరిని వారు శ్రేష్ఠులని భావిస్తారు.


సర్వంకష

తురంగవక్త్రః - బహువ్రీహిసమాసము

బింబోష్ఠము - ఉపమాలంకారము

బింబోష్ఠం - ఇక్కడ బింబౌష్ఠం అని మరొకపాఠం. బింబోష్ఠం - ఇక్కడ ఓ కారం ఎందుకంటే - ఓత్వ ఓష్ఠయోః  సమాసే వా పరరూపం వక్తవ్యమ్ (వార్తికమ్)

ఉత్తుంగస్తనభరభంగభీరుమధ్యాం - భంగము (శిథిలము) కాకున్నను భంగము అయినట్లు కల్పించుటచేత అతిశయోక్తి తో కూడిన ఉపమ.

ప్రహర్షిణీవృత్తము

౩౯.

తదేతదస్యానుతటం విభాతి వనం తతానేకతమాలతాలమ్ ।

న పుష్పితాత్ర స్థగితార్కరశ్మావనంతతానే కతమా లతాలమ్ ॥


అస్య = ఇచ్చట; అనుతటం = ఎల్లెడలా; తతానేకతమాలతాలం; తత + అనేక + తమాల +తాలం = పెక్కు తమాల, తాడి చెట్ల వరుసలను; తదేతత్ = పురోవర్తిగా; వనం = అడవి; విభాతి = సోయగములీనుచున్నది; స్థగిత అర్క రశ్మౌ = చల్లారిన యెండగల; అనంతతానే = అపారమైన విస్తారము గల; అత్ర =  ఈ వనమున; కతమా లతా = ఏ విధముగా తీవెలు; అలం న పుష్పితా? = వికసింపవు? మిక్కిలిగా వికసించునని భావము.


ఈ అద్రియందు గల ప్రదేశములలో అనేకమైన, చీకటి మ్రాను, తాడి వృక్షముల వరుసలను ఎదుటగా కన్పట్టు అడవి సోయగములీనుచున్నది.  చల్లారిన సూర్యతాపము గల, విస్తారమైన ఈ పట్టుల ఏ విధముగా తీవెలయందు సుమములు మిక్కిలిగా వికసింపవు?

౪౦.

దంతోజ్జ్వలాసు విమలోపలమేఖలాంతాః

సద్రత్నచిత్రకటకాసు బృహన్నితంబాః ।

అస్మిన్ భజంతి ఘనకోమలగండశైలాః

నార్యో౽నురూపమధివాసమధిత్యకాసు ॥


అస్మిన్ = ఈ భూధరమునందు;

ఉజ్జ్వలాసు దంతాసు = కాంతివంతమైన పొదరిళ్ళలో; (దంతో నికుంజో దశనే - ఇతి విశ్వః)

(ఉజ్జ్వలాసు దంతాసు = కాంతివంతమైన దంతములలో)

సద్రత్నచిత్రకటకాసు = నాణ్యమైన రత్నములను కలిగిన సానువులలో (పర్వతమధ్యభాములలో)

(సద్రత్నచిత్రకటకాసు = చక్కని రత్నములతో కూడిన కంకణములలో)

అధిత్యకాసు = ఊర్ధ్వభూములయందు;

విమలోపల = నిర్మలమైన శిలల;

(విమలోపల = నిర్మలమైన రాలతో కూడిన)

మేఖలాంతాః = రమ్యమైన కొండచరియల;

(మేఖలాంతాః = రమణీయమైన మొలనూలు గల)

బృహత్ నితంబాః = విశాలమైన శిఖరముల;

(బృహత్ నితంబాః = ఘనమైన జఘనములు గల)

ఘనకోమలగండశైలాః = గొప్పవి, నునుపువి అయిన గండశిలలతో కూడిన ప్రాంతములను;

(ఘనకోమలగండశైలాః = చక్కని కోమలమైన చెక్కిలి భాగములు గల)

నార్యః = జవ్వనస్త్రీలు;

అనురూపం = తమ ఇచ్ఛకు తగినట్టులు

(అనురూపం = తమ రూపమునకు అనుగుణమైన/ఆత్మసదృశమైన)

అధివాసం = నివాసముగా చేసికొని;

భజంతి = సేవించుచున్నారు.


గోపికావల్లభా!

ఈ భూధరమునందు కాంతిమయమైన పొదరిండ్లలోనూ, చక్కని రత్నములు గల్గిన సానువులయందును, ఊర్ధ్వభూములయందు నిర్మలమైన శిలలు గల రమ్యమైన కొండచరియలను, విశాలమైన శిఖరములను; నున్నని గండశిలలతో కూడిన ప్రాంతములను కాంతలు తమ ఇచ్ఛకు తగినట్టులు నివాసముగా చేసికొని సేవించుచున్నారు.


ఈ ధరణీధరమందు రుచిరమైన దశనములలో, చక్కని రత్నములు తాపిన కంకణములలో; నిర్మలమైన రాలతో కూడిన మొలనూళ్ళు గల ఘనజఘనములతోనూ, చక్కని కోమలమైన చెక్కిలిభాగములు గల ఇంతులు తమ రూపమునకు అనుగుణముగా ఇచ్చటి నివాసమును సేవించుచున్నారు.

సర్వంకష -

కటకం వలయే సానౌ ఇతి విశ్వః

భూమిరూర్ధ్వమధిత్యకా ఇత్యమరః

మేఖలా ఖడ్గబంధే స్యాత్ కాంచీరత్ననితంబయోః ఇతి విశ్వః

నితంబో రోధసి స్కంధే శిఖరే౽పి కటేరధః ఇతి విశ్వః

ఇచ్చట స్త్రీలు, ఊర్ధ్వప్రాంతములయందు కూడా ప్రకృతత్వమున కేవలప్రకృతగోచరమైన శ్లేషోపస్థాపిత తుల్యయోగిత.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Comments ridiculing, abusing, bullying and forcing to agree in any form, if objectionable to the blog owner will be removed.