22, మే 2022, ఆదివారం

శిశుపాలవధమ్ నాలుగవ సర్గ తెలుగు టీక, తాత్పర్యములు - (21 - 30)

 

౨౧.

వహతి యః పరితః కనకస్థలీ సహరితా లసమాననవాంశుకః ।

అచల ఏష భవానివ రాజతే స హరితాల సమాననవాంశుకః ॥

యః అచలః = ఏ నగము; స-హరితాః = గడ్డితో కూడి; కనకస్థలీః = సువర్ణమయమైన నేలను; వహతి = తాల్చినదో; (ఇంకను) లసమాననవాంశుకః; లసమాన = వెలుగులీను; నవ+అంశుకః = నూత్నకిరణములను గల్గినదో; సః = అట్టి ఈ శైలము;హరితాల సమాననవాంశుకః ; హరితాల = కర్చూరముతో; సమాన = తుల్యమైన; నవ = నూత్న; అంశుకః =వస్త్రములను ధరించి; భవాన్ ఇవ = పీతాంబరధారి అయిన ఓ మాధవా! నీవలె; రాజతే = ప్రకాశముగ నున్నది.


ఇంతకు రెండు శ్లోకముల మునుపు నుండి వస్తున్న వర్ణనలను కృష్ణసారథి దారుకుడు కంఠోక్తిగా చెబుతున్నట్టు తెలియవలె;



ఓ పీతాంబరధారి!

ఈ శైలము అంతటా వెలుగులు చిందే హరితవర్ణపు గడ్డి సువర్ణమయమైన నేలను తలపిస్తూ, నూత్న కిరణములను వెదజల్లుతోంది. అలా ఈ నగము కర్చూర(వర్ణ)ముతో సమానమైన కొత్త ఉడుపులను ధరించి పీతాంబరధారి అయిన నీ వలే శోభిల్లుతున్నది.   


సర్వంకష - 'హరితేతి చ దూర్వాయాం హరిద్వర్ణయుతే౽న్యవత్' - ఇతి విశ్వః హరితము/దూర్వము అంటే గ్రాసము/ గరిక/గడ్డి.

హరితాలము - అంటే కర్చూరము అనే ఒక సుగంధద్రవ్యము.

ద్రుతవిలంబిత వృత్తము - ద్రుతవిలంబితమాహ నభౌ భరౌ. (న భ భ ర - గణములు)


ఇతరములు - ఇది ద్విపాదయమకము. రెండవ నాలుగవ పాదములు సమానము.

౨౨.

పాశ్చాత్యభాగమిహ సానుషు సన్నిషణ్ణాః

పశ్యన్తి శాన్తమలసాంద్రతరాంశుజాలమ్ ।

సంపూర్ణలబ్ధలలనాలపనోపమాన

ముత్సంగసంగిహరిణస్య మృగాంకమూర్తేః ॥


ఇహ సానుషు = ఈ రైవతకాద్రి సానువుల యందు; సన్నిషణ్ణాః = నివసించు మనుజులు; సంపూర్ణలబ్ధలలనాలపనోపమానం; సంపూర్ణలబ్ధ = పూర్తిగా గైకొన్న; లలనా = జవ్వనుల; లపన = ముఖమునకు; ఉపమానం = సరిపోలునది మఱియు; శాన్తమలసాంద్రతరాంశుజాలమ్; శాన్త - మల = నిష్కళంకమైన (మచ్చను కోల్పోయిన); సాంద్రతరం = చిక్కనైన; అంశుజాలం = వెన్నెలను; ముత్సంగసంగిహరిణస్య = తన శరీరమునందు దాచికొన్న మృగము గలవాని; మృగాంకమూర్తేః = చందమామ యొక్క;  పాశ్చాత్యభాగమును = వెనుకతట్టు భాగమును; పశ్యన్తి = చూచుచున్నారు.


ఓ గోవిందా!

ఈ పర్వతసానువులలో నివసించు ప్రజలు,  మచ్చయే లేని అందమైన జవ్వనుల ముఖమును పోలిన కలువలఱేని వెన్నెలను చూడగలుగుచున్నారు. ఏలనన, ఈ పర్వతము ఎంతో పొడవైనది కావున, ఈ పర్వతపు యెత్తు నుండి ఇందుబింబపు ఆవలిభాగము (వెనుకభాగము) కనిపించుచున్నది. (ఆ భాగమున మచ్చ లేదు కదా!)


సర్వంకష - ఆననం లపనం ముఖం - ఇత్యమరః

చంద్రుని వెనుకభాగము పర్వతశైలము నుండి కనిపించుచున్నది అనుట పర్వతము యొక్క ఎత్తును వ్యంజింపజేయుట వలన ధ్వని.

వసంతతిలకా వృత్తము

౨౩.

కృత్వా పుంవత్పాతముచ్చైర్భృగుభ్యో మూర్ధ్ని గ్రావ్ణాం జర్జరా నిర్జరౌఘాః ।

కుర్వన్తి ద్యాముత్పతన్తః స్మరార్త స్వర్లోక స్త్రీగాత్ర నిర్వాణమత్ర ॥


అత్ర = ఈ శైలము కడ; నిర్జర ఔఘాః = గిరినదప్రవాహములు; పుంవత్ = పురుషుని వలే; ఉచ్చైః = ఉన్నతమైన; భృగుభ్యో= సమతలముగా నున్న కొండచఱియల;  గ్రావ్ణాం = శిలల; మూర్ధ్ని = పై తలముమీద; పాతం కృత్వా = పడి (పతనమై); జర్జరాః = తుంపరలు (శకలములు); ద్యాం = ఆకాశము; ఉత్పతన్తః = పైకెగసి; స్మరార్త స్వర్లోక స్త్రీగాత్ర నిర్వాణం; స్మరార్త = కామపీడితులైన; స్వర్లోక = స్వర్గలోకవాసులైన; స్త్రీ = అచ్చరల; గాత్ర = దేహమును; నిర్వాణం = సుఖమైనదిగా; కుర్వంతి = చేయుచున్నవి (చేయుచున్నారు).

శౌరీ!

ఈ శైలముకడ గిరినదప్రవాహములు పురుషుని వలే ఉన్నతమైన సమతలములైన కొండచఱియల శిలలపై పడి పతనమై, తునాతునకలుగా తుంపరలై ఆకాశమునకెగసి స్వర్గలోకమున నున్న కామార్తులైన అచ్చరల దేహతాపమును శమింపజేయుచూ సుఖవంతమొనర్చుచున్నవి.


(పురుషుని వలే - అని చెప్పుటకు వివరణ ఈ క్రింద)


వానప్రస్థపాలనలోనూ లేక అత్యంతవిరాగిత్వములోనూ పురుషులు ఎత్తైన ప్రదేశమునుండి సమతలప్రదేశమున దూకి ఆత్మత్యాగము చేయుట కలదు.

అనుష్ఠానసమర్థస్య వానప్రస్థస్య జీర్యతః ।

భృగ్వగ్ని జలపాతైర్మరణం ప్రవిధీయతే ॥

అని ధర్మశాస్త్రకారుల మతము.

అనగా - వానప్రస్థ అనుష్ఠానములో అసమర్థుడైన పురుషుడు ఉన్నతమైన శైలమునుండి దూకుటచేత కానీ, అగ్ని వలన కానీ, జలములో మునుగుట వలన కానీ మరణమునందుట దోషముకాదు. మఱియు నట్టి పురుషుడు స్వర్గమునొందగలడు. (పురాణములలో శుకమహర్షి కైలాసపర్వతము నుండి క్రిందకు దూకి ఆత్మత్యాగమొనరించినట్లు యున్నది.)


పైన శ్లోకము సర్వంకష వ్యాఖ్యానమున ప్రస్తావింపబడినది.


సర్వంకష -

'ప్రవాహో నిర్జ్గరోఝరః' ఇత్యమరః.

నిర్ఝర ఔఘాః - ఇక్కడ నిర్ఝరమన్నా ఔఘమన్నా ప్రవాహమే. అయితే చూతవృక్షం వంటి ప్రయోగాలలో వలే సామాన్యవిశేషభావముల కలయిక వలన ఇది పునరుక్తి దోషము కానేరదు.

ప్రపాతస్త్వత్తటో భృగుః - ఇత్యమరః

శాలినీ వృత్తము - శాలిన్యుక్తా మ్తౌ తగౌ గో౽బ్ధిలోకైః - ఇతి.

౨౪.

స్థగతయంత్యమూః శమితచాతకార్తస్వరా

జలదాస్తడిత్తులితకాన్తకార్తస్వరాః ।

జగతీరిహ స్ఫురితచారుచామీకరాః

సవితుః క్వచిత్ కపిశయన్తి చామీ కరాః ॥


ఇహ = ఈ కొండపై; శమితచాతకార్తస్వరా; శమిత = ఉపశమించిన; చాతక = చాతకపక్షుల; ఆర్తస్వరాః = దీనాలాపములు ; తడిత్తులితకాంతకార్తస్వరాః; తడిత్ = మెఱుపును; తులిత్ = పోలిన; కార్తస్వరాః కాంతాః = పసిడికాంతులను తాల్చిన; జలదాః = మేఘములు;  అమూ జగతిః = ఈ యొక్క నేల; క్వచిత్ = అంతటా; స్థగతయన్తి = ఆచ్ఛాదనము చేయుచున్నవి; (అపి) చ = మఱియు;

(క్వచిత్తు = ఇంకొన్ని యెడములందు); స్ఫురితచారుచామీకరాః = స్ఫురిత = వెల్లడి యగుచున్న; చారు = మనోహరమైన; అమీ = ఆ కనిపించు; సవితుః = భానుని; కరాః = కిరణములు; కపిశయన్తి = సువర్ణమయముగా చేయుచున్నవి.


ఓ మాధవా! ఈ పర్వతప్రాంతపు నేలను - కొన్ని యెడములందు చాతకపక్షుల దాహార్తిని తీర్చునవి, పసిడికాంతుల మెఱపులను తాల్చినవి అయిన మబ్బులు కప్పేస్తున్నవి; ఇంకొన్ని యెడముల భానుని లేత పసిడికిరణములు వెల్లడి యగుచున్నవి. ఇట్లు ఏకసమయమున సూర్యకిరణములు, వర్షముల సంగమమున ఈ నేల ఎంతో భాసమానముగ నున్నది.


సర్వంకష - జగతీ భువనే భూమిః - ఇతి విశ్వః

స్థగ ఆచ్ఛాదనే ఇతి చౌరాదికః

ఈ శ్లోకము యొక్క ఛందస్సు - పథ్యావృత్తము - సజసా యలౌ చ సహ గేన పథ్యా మతా - ఇతి.


ఇతరములు - కార్తస్వరము, చామీకరము అనగా సువర్ణము. కార్తస్వరము - ఇది అపురూపమైన శబ్దం. కృతాః స్వరాః - కార్తస్వరాః తస్మై దేయమిదమ్ ఇతి - వేదమంత్రపాఠములను సస్వరముగా పలుకు వేదపండితులకు ఒసగునది.

౨౫.

ఉత్క్షిప్తముచ్ఛ్రితసితాంశుకరావలంబైరుత్తంభితోడుభిరతీవతరాం శిరోభిః ।

శ్రద్ధేయనిర్ఝరజలవ్యపదేశమస్య విష్వక్ తటేషు పతతిస్ఫుటమంతరీక్షమ్ ॥


ఉచ్ఛ్రితసితాంశుకరావలంబైరుత్తంభితోడుభిః; ఉచ్ఛ్రిత = ఎంతో ఎత్తుకు లేచియుండి;  సితాంశు = చంద్రుని; కర = చేతులకు; అవలంబైః =వ్రేలాడినవి; ఉత్తంభిత - నిలువబడిన; ఉడుభిః = నక్షత్రములు కలిగినవి;శిరోభిః = శిఖరములతో; అతీవతరాం = మిక్కిలి;  ఉత్-క్షిప్తం = బలముగా నిలుపబడి;  అంతరీక్షం = అంతరిక్షము; శ్రద్ధేయః = విశ్వాసనీయముగా; నిర్ఝరజల = ఎత్తుననుండి క్రిందకు దూకెడు అలముల; వ్యపదేశం = నిరూపణను ;  అస్య తటేషు = ఈ పర్వతపు సానువులలో; (పొంది); విష్వక్ = నలువైపులా; స్ఫుటం = నిశ్చయముగా; పతతి = పడుచున్నది.  


ఎంతో యెత్తునకెదిగి, చంద్రుని కరములకు వ్రేలాడుచుండి, సమీపముననే నక్షత్రములను తాల్చిన ఈ పర్వత శిఖరములకు దిగువన నిలుపబడిన యంతరీక్షము, నిర్ఝరజలముల ధోరణిని యందిపుచ్చుకుని, శిఖరముల నలువైపుల పడుచున్నది.


సర్వంకష

అంతరిక్షమును నిర్ఝరజలములతో ఉద్యోతించుట - ఉత్ప్రేక్షాలంకారము.

౨౬.

ఏకత్ర స్ఫటికతటాంశుభిన్ననీరా నీలాశ్మద్యుతిభిర్భిదురాంభసో౽పరత్ర ।

కాలిందీజలజనితశ్రియః శ్రయన్తే వైదగ్ధీమిహ సరితః సురాపగాయాః ॥


ఏకత్ర = ఒకచోట; స్ఫటికతటాంశుభిన్ననీరా = స్ఫటికపు రాల వెలుగులు ద్యోతకమగునట్లున్న స్వచ్ఛమైన జలములు; అపరత్ర = మరికొన్ని యెడములందు; నీలాశ్మద్యుతిభిః = ఇంద్రనీలమణుల కాంతుల; భిదుర అంభసాః = విభిన్నమైన జలములు; ఇహ = ఈ శైలమునందు; సరితః = ప్రవాహములు; కాలిందీజలజనితశ్రియః; కాలిందీ = యమునానది యొక్క; జల = నీటిచేత; జనితశ్రియః = జనించిన కాంతులను; సురాపగాయాః  = గంగానదియొక్క; వైదగ్ధీం = శోభను; శ్రయన్తే = భజించుచున్నవి.


ఓ జనార్దనా!

ఈ పర్వతములందు ఒకచో నీటియడుగున గల స్ఫటికముల కాంతులు స్వచ్ఛముగా కన్పట్టు శుభ్రజలములు, తద్భిన్నముగా మరియొకచో ఇంద్రనీలమణికాంతుల వ్యక్తపఱచు జలములు; యమునానదికాంతులను, గంగ శోభను భజించుచున్నవి.


సర్వంకష - కలిందస్య అద్రేః అపత్యం స్త్రీ - కాలిందీ యమునా; కలిందుడను నగము యొక్క కూతురు కాలింది. యమునా నది.

'కాలిందీ సూర్యతనయా యమునా యమనస్వసా' ఇత్యమరః.

నిదర్శనాలంకారము;

ప్రహర్షిణీ వృత్తము.

౨౭.

ఇతస్తతో౽స్మిన్ విలసన్తి మేరోః సమానవప్రే మణిసానురాగాః ।

స్త్రియశ్చ పత్యౌ సురసుందరీభిః సమా నవప్రేమణిసానురాగాః ॥


మేరోః = సుమేరుపర్వతము యొక్క; సమానవప్రే = సమమైన కొండచరియలు గల; అస్మిన్ అద్రే = ఈ యచలమందు; ఇతస్తతః = అక్కడక్కడా; మణిసానురాగాః = వివిధకాంతుల మణులు/ఎర్రని కెంపులు; విలసన్తి = మెరుస్తున్నవి;

సురసుందరీభిః సమాః = అప్సరసల బోలు; స్త్రియః చ = ఈ జనపదముల జవ్వనులునూ; పత్యౌ = పతులయెడ; నవప్రేమణి - నూత్నప్రణయభావములలో; సానురాగాః = అనురాగవతులై ; విలసన్తి = క్రీడించుచున్నారు;


ఓ గిరిధరా!

సుమేరు పర్వతసమానసానువుల ఈ రైవతకాచలమున అక్కడక్కడా కెంపుల సొబగులు ద్యోతకమగుచున్నవి. అచ్చరలబోలు ఈ జనపదభామినులు పతులయెడ సానురాగముతో క్రీడించుచున్నారు.


విశేషము - ఇది ద్విపాదయమకము. రెండవ, నాలుగవ పాదములు సమానము.

౨౮.

ఉచ్చైర్మహారజతరాజివిరాజితాసౌ దుర్వర్ణభిత్తిరిహ సాంద్రసుధాసవర్ణా ।

అభ్యైతి భస్మపరిపాణ్డురితస్మరారేరుద్వహ్నిలోచనలలామలలాటలీలామ్ ॥


ఇహ = ఈ అద్రియందు; సాంద్రసుధాసవర్ణా = దట్టమైన సున్నపు పూతతో సమానమైన రంగు గల; (లేపభేదే౽మృతే సుధా ఇతి వైజయంతీ); (మరియు) మహారజతరాజివిరాజితా = కాంచనరేఖాశోభితమైన;(మహారజతము అనగా బంగారు) అసౌ = యెదుటగల; ఉచ్చైః = ఉన్నతమైన; దుర్వర్ణభిత్తిః = రజతమయమైన సానువు; ("దుర్వర్ణం రజతం రూప్యం" అని అమరకోశము);  భస్మపరిపాణ్డురిత-స్మరారేః-ఉద్వహ్నిలోచనలలామలలాటలీలామ్; భస్మ = విభూది చేత; పరిపాణ్డురిత = దట్టముగా ధవళవర్ణమును సంతరించుకొన్న; స్మరారేః = ముక్కంటి యొక్క; ఉద్వహ్ని = పెల్లుబికిన (తెరచిన) అగ్ని వంటి ; లోచన = నేత్రము అనెడు; లలామ = ఆభరణము గల;(లలామం పుచ్ఛపుణ్డ్రాశ్వభూషాప్రధాన్యకేతుషు – ఇత్యమరః)  లలాట = నొసటి భాగము యొక్క; లీలాం = విలాసమును; అభ్యేతి = భజించుచున్నది. 




కేశవా!

ఈ శైలమునందు తెల్లని రంగుతోనూ, పసిడిరేకల కాంతులతోనూ యెదుటన కనిపించు ఉన్నతమైన పర్వతపు సానువు, విభూదిని మైనలదుకొని దట్టముగా ధవళవర్ణమును పొంది, తెఱచిన మూడవకంటి జ్వాల యను భూషణము గల  ముక్కంటి యొక్క నొసటి భాగపు శోభను తలపించుచున్నది.


సర్వంకష

మహారజతకాంచనే -ఇతి

నిదర్శనాలంకారము.

విశేషము:

లలామ అంటే అందమైనది, సౌందర్యముతో కూడినది అని అర్థాలు. యువతి అని రూఢి అర్థం. కానీ ఆభరణం అన్న నైఘంటిక అర్థాన్ని మాఘుడు ఉపయోగించటం విశేషం.

౨౯.

అయమతిజరఠాః ప్రకామగుర్వీరలఘువిలంబిపయోధరోపరుద్ధాః ।

సతతమసుమతామగమ్యరూపాః పరిణతదిక్కరికాస్తటీర్బిభర్తి ॥


అయం = ఈ గిరి;

అతిజరఠాః = బహు కఠినమైన (అతి జీర్ణములైన);

ప్రకామ గుర్వీః = ఉన్నతములైన; (స్థూలములైన)

అలఘువిలంబిపయోధరోపరుద్ధాః; అలఘు = ఎత్తున; (పెద్దవిగా) విలంబి = వ్రేలాడు; పయోధర = మేఘములతో(స్తనములతో); ఉపర్దుద్ధాః = నిబద్ధమైన;

సతతం = సదా;

అసుమతాం = ప్రాణులకు;

అగమ్యరూపాః = చేరుటకు వీలుకానివి (వృద్ధాప్యము చేత సంభోగ సమయమున చేరుటకు అయోగ్యమైనవి);

పరిణతదిక్కారికాః = దిగ్గజముల  కొమ్ముల చేత చేత మోదబడినవి; (నఖ, దంతక్షతముల చేత పండినవి)

అయిన

తటీః = ప్రదేశములను; బిభర్తి = కలిగియున్నది. 


ఈ గిరి బహుకఠినమైనవి, ఉన్నతమైనవి, భారముగా విలంబించు మేఘములతో కూడినవి, ప్రాణులు అధిరోహించుటకు సాధ్యము కానివి, దిగ్గజముల కొమ్ముల చేత ప్రహారము చేయబడినవి అయిన కొండశిలల గట్టులను కలిగియున్నది.

(ఈ గిరి వయోభారమునందిన, భారమైన, విలంబించు స్తనములతో కూడి సదా పురుషులకు సంభోగమున చేరుటకు సాధ్యముకాని వృద్ధస్త్రీల వంటి శిలలను కలిగియున్నది)


సర్వంకష

జరఠః కఠినః జీర్ణే ఇతి వైజయంతీ

గురుస్తు గీష్పతౌ శ్రేష్ఠే గురౌ పితరి దుర్భరే ఇతి శబ్దార్ణవః

స్త్రీస్తనాబ్దౌ ఇత్యమరః

తిర్యగ్దంతప్రహారస్తు గజః పరిణతో మతః ఇతి హలాయుధః

దిగ్దష్టే వర్తులాకారే కారికా నఖరేకికా ఇతి వైజయంతీ

ప్రకృతమైన సానువు వర్ణనతో అప్రకృతమైన వృద్ధాంగనను ఉద్యోతించుట చేత సమాసోక్తి.

పుష్పితాగ్రా వృత్తము.

౩౦.

ధూమాకారం దధతి పురః సౌవర్ణే వర్ణేనాగ్నేః సదృశి తటే పశ్యామీ ।

శ్యామీభూతాః కుసుమసమూహే౽లీనాం లీనామాలీమిహ తరవో బిభ్రాణాః ॥


ఇహ = ఈ పర్వతమందు; పురః = యెదుటన కనిపించు; వర్ణేనాగ్నేః సదృశి = అగ్ని వర్ణమును పోలిన; సౌవర్ణే తటే = సువర్ణమయమైన పరిసరములలో; కుసుమసమూహే లీనాం = పువ్వులయందు నిమగ్నమైన; అలీనాం = తుమ్మెదల; ఆలీం = ఆవళిని; బిభ్రాణాః = తమయందు తాల్చి; (మరియు) శ్యామీభూతాః = దట్టమైన నలుపురంగు నందిన; అమీ తరవః = పాదపములు; ధూమాకారం = భస్మము వంటి ఆకారమును;  దధతి = ధరించుచున్నవి; పశ్య = వీక్షించుము.


నీలమేఘశ్యామా! ఈ పర్వతమందు యెదుట కనిపించు అగ్నివర్ణమును పోలిన సువర్ణమయమైన పరిసరములలో -కుసుమములలో నిమగ్నమైన తుమ్మెదలబారును కలిగి, ఇంకను శ్యామవర్ణమును పొందిన ఈ తరువులు భస్మాకారమును తాల్చినవి చూడుము కృష్ణా!


సర్వంకష

సువర్ణమయమైన ప్రదేశము అగ్నిలా మెఱయుచున్నది అనుట,

నల్లని తరువులు భస్మాకారమును పొందినవి అనుట -  ఉపమాలంకారములు.

జలధరమాలా వృత్తమ్ - అబ్ధ్యంగైః స్యాత్ జలధరమాలా మ్భౌ స్మౌ - అని లక్షణము.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Comments ridiculing, abusing, bullying and forcing to agree in any form, if objectionable to the blog owner will be removed.