వాల్మీకి చూపిన శరత్తు


మా పెరట్లో బాదాం చెట్టు కుప్పలు కుప్పలుగా ఆకులు రాలుస్తూ యెండిపోతూ వచ్చింది కొన్నాళ్ళక్రితం. (రోజూ ఎండి రాలిపోయిన ఆకులు ఊడ్చుకోవడం పెద్దప్రయాస). ఇలా కొన్నాళ్ళు గడిచిన పిదప మొత్తం చెట్టంతా బోసిగా తయారయింది. చెట్టంతా కొమ్మలే. ఎక్కడో ఒకచోట ఒకట్రెండు ఆకులు. 

రెండు రోజుల తర్వాత.

మొత్తం చెట్టు ఆకుపచ్చ రంగుతో, తలిరుటాకులతో నిండిపోయింది. అదో గమ్మత్తు. చూడాలే కానీ, అధ్యయనం చెయ్యాలే కానీ ప్రకృతికన్నా గొప్ప కవిత్వం ఎక్కడ ఉంటుంది?

******

కిష్కింధకాండ చదువుతున్నాను. దీన్ని పారాయణం అనవచ్చో కూడదో నాకు తెలియదు. 

పారాయణాలు, వ్రతాలు, దీక్షలు, పూజలు, ఉపవాసాలు - ఇవి నా ఒంటికి సరిపడవు. ఆ నెపంతో చదువుకోవచ్చు ఏదో కొంత.

 ప్రతి రోజూ ఉదయం...అలా ఆరంభించినా...అప్పుడప్పుడూ కొన్ని చమక్కులు తప్ప పెద్దగా స్పందనల్లేవు.

మొత్తం గా పరిస్థితి ఓ రోజు మారిపోయింది. ఆ ఒక్క శ్లోకం ఇదీ.

విపక్వ శాలిప్రసవాని భుక్త్వా 
ప్రహర్షితా సారసచారుపంక్తిః |
నభస్సమాక్రామతి శీఘ్రవేగాః
వాతావధూతా గ్రథితేవ మాలా||

నేలపై రాలిన బియ్యపు గింజలను ఆరగించి ఆనందంగా ఆకసానికి యెగిరిన కొంగలబారు...గాలికి బలంగా విసిరేసిన పూలదండలా ఉంది!

ఆ శ్లోకంలో చివరిపాదం వర్ణనాతీతం. ఎంతో తన్మయత్వం ఉంటే తప్ప అంత ఆహ్లాదకరమైన భావం రాదు. 

సరిగ్గా ఇలాంటి ఒక దృశ్యాన్ని - పచ్చటి చేల మధ్య నీలి ఆకాశంలో తెల్లని కొంగల బారును చూచి ఒక బాబు తన్మయత్వంతో విరుచుకుపడిపోయేడని ఎప్పుడో చదివి ఉన్నాను. తర్వాత కాలంలో ఆ బాబు పరమహంసగా యెదగడానికి ఆ ఘటన బీజం అంటారు. ఆయన రామకృష్ణులు.

ప్రకృతి కానీ ప్రకృతి వర్ణన కానీ ఏ కొంత భావుకత్వం ఉన్న సామాన్యుడినైనా కదిలించే తీరు మాటల్లో చెప్పలేము. అదొక అవస్థ.

ఆ శ్లోకం వాల్మీకి రచించిన శర్త్కాల వర్ణనలో కొన్ని శ్లోకాల తర్వాత వస్తుంది. వెనక్కెళ్ళి చూస్తే - ఆరంభశ్లోకమే ఒక ఆణిముత్యం.

శాఖాసు సప్తచ్ఛదపాదపానాం
ప్రభాసు తారార్కనిశాకరాణాం
లీలాసు చైవోత్తమ వారణానాం
శ్రియం విభజ్యాద్య శరత్ ప్రవృత్తా

ఏడాకుల అరటిచెట్ల కొమ్మల్లోనూ, సూరీడు, చందమామ, చుక్కల ప్రభల్లోనూ, మదపుటేనుగుల హొయల్లోనూ సౌభాగ్యాన్ని విభజించుకుని శరత్తు వచ్చిందట.

వర్ణము, కాంతి, విలాసము - ఇవే కదా ప్రకృతికాంత సౌందర్యానికి ఆనవాళ్ళు! 

సచక్రవాకాని సశైవలాని
కాశైర్దుకూలైరివ సంవృతాని
సపత్త్రలేఖాని సరోచనాని
వధూముఖానీవ నదీముఖాని.

చక్రవాకాలతోనూ, పాచితోనూ, రెల్లుగడ్డితోనూ - నదుల రేవులు అమ్మాయిల చెక్కిళ్ళపై అలంకరించుకున్న (మకరికా) పత్రరేఖల్లా ఉన్నాయి.

అమ్మాయిలు - కస్తూరి, జవ్వాజి వంటి సుగంధపరిమళద్రవ్యాలతో చెక్కిళ్ళపై అందమైన బొమ్మలు (మొసలి ఆకారంలో చేప ఆకారంలో..ఇలా) దిద్దుకోవడం భారతదేశంలో ఒకప్పుడు ఉన్న సాంప్రదాయం.

ఆ రేఖల్లా నదుల రేవులు ఉన్నాయట!

******

ఇవి వాల్మీకి దర్శింప జేసిన శరత్తులో మూడు ఆనవాళ్ళు.

పారాయణంతో నాకు పుణ్యం దక్కిందో లేదో తెలియదు. దక్కితే ఆ పుణ్యం ప్రపంచానికి చెందనీ. ఈ కొన్ని మనోహరమైన భావనలు మటుకు చాలు వీటి ద్వారా జీవితంలో యెండి కొడగట్టిన మనోంతఃకుహరంలో కొన్ని చివురుటాకులు పుడితే - అవి చాలు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Disclaimer

అశోకుడెవరు? - 1

ధ్రువనక్షత్రం - శింశుమారుడు