మయూఖము - 6

ఇంద్రచాపమనే ఈ బ్లాగును సంధించి చాలా రోజులయ్యింది. అసలు ఈ బ్లాగు, రాత, తాపత్రయమూ వదిలేసి పారేసేంత విరక్తి. కానీ ఎప్పుడో ఒకప్పుడు ఏదో చాపల్యం కుడుతుంది. నాలో లక్ష లోపాలు ఉండవచ్చు గాక. ఓ పది ఎన్నదగిన గుణాలు ఉండొచ్చునేమో కదా. అలా ఉంచితే సంస్కృతం ఎవరికీ కాబట్టని రోజుల్లో ఏదో ఆ భాష గురించి తెలిసినది రాస్తే, అది ఏదో పొద్దు ఎవరికైనా పనికొస్తుందేమో కదా అని.  అప్పుడే ఇలా భూత్ బంగళా గోడలపై బొగ్గుతో గీసిన రాతలాంటి రాత.

ఈ మయూఖాన్ని ప్రసరింపజేసిన కవి ధర్మసూరి.

ధర్మసూరి అన్న కవి వారణాసి వాస్తవ్యుడు. యజుర్వేదీకుడు. కాలం తెలియదు. ఆయన నరకాసురవిజయం అనే వ్యాయోగాన్ని రచించాడు. వ్యాయోగం అనేది దశరూపకాల్లో ఒకానొక రూపకభేదం. వ్యాయోగం - ఏకాంకిక అయి ఉండాలి. నాయకుడు ధీరోద్ధతుడు కావాలి. ధీరోద్ధతుడు అంటే వికత్థనుడు, (వికత్థనుడు అంటే సెల్ఫ్ డబ్బా కొట్టుకునే వాడు) అహంభావి. స్త్రీపాత్రలు తక్కువగా ఉండాలి.

ఈ వ్యాయోగంలో పెద్దగా కథాభాగం ఏదీ లేదు. నాయకుడు శ్రీకృష్ణుడు. ఆయన సత్యభామతో కలిసి నరకాసురునితో పోరడం, అందులో గెలుపొందడం రూపక ఇతివృత్తం. తను చేయబోతున్న యుద్ధం తన సుతునితోనే అని భూదేవి అవతారమైన సత్యాదేవికి పాపం తెలియదు. ఆమెకు చెప్పలేక, అటు నారదున్ని ఆపలేక శ్రీకృష్ణుడు సతమతమవడం కొంత హాస్య స్ఫోరకంగా ఉంటుంది.

రూపకం పేరు నరకాసురవిజయం అని పెట్టటం కొంచెం ఇబ్బందిగా ఉంది. అందుకు సమాధానంగా కవి చెబుతాడు. శ్రీకృష్ణుని విజయం అంటే - ఏ వైరి తో విజయమో తెలియరాదు. ఆ సందిగ్ధతను పరిహరించటానికే ఈ పేరు.

ఈ వ్యాయోగాన్ని తెనుగు చేయబడింది.తెలుగులో ఈ నాటకాన్ని పరివర్తించింది శ్రీ కొక్కొండ వేంకటరత్నం పంతులు గారు. ఆధునిక కాలంలో - అంటే పత్రికలు వచ్చిన తర్వాత తెలుగులో అనువదింపబడిన మొదటి సంస్కృత నాటకం నరకాసురవిజయవ్యాయోగమే. ఇది 18 వ శతాబ్దంలో జరిగింది. అలా ఈ నాటకం తర్వాత అనువదింపబడిన అనేక నాటకాలకు మార్గదర్శకం అయింది.


ఈ నాటకంలో ఓ చిన్న మయూఖం చెప్పుకుందాం. సాధారణంగా సంస్కృతంలో కొన్ని ప్రహేళికలు ఉన్నాయి. ఓ శ్లోకంలో ఓఅక్షరాన్ని తొలగించడమో, జత చేయడమో చేస్తే పూర్తిగా అర్థమే మారిపోతుంది. అలాంటి కావ్యమే ఒకటి ఉన్నది. దాని పేరు "సీతారావణ సంవాద ఝరి". అలా కాక శ్లోకానికి అర్థం శ్లోకంలోనే దాగున్న ప్రహేళికలూ సంస్కృతంలో లేకపోలేదు. అయితే అలా ప్రత్యేకమైన ప్రయోగంలా కాక, నాటకంలో భాగంలా ఓ చమత్కారం ఈ రచనలో ఓ చోట కనిపిస్తుంది.



***

యుద్ధం సాగుతోంది. యుద్ధాన్ని దేవతలు పైన ఆకాశం నుండి "లైవ్" చూస్తున్నారు. శ్రీకృష్ణుడు సత్యభామ నరకాసురునితో పోరుతున్నారు. కృష్ణుని రథసారథి దారుకుడు. అటు నరకాసురుని రథసారథి జీమూతుడు. ఈ రథసారథులిద్దరికీ మధ్య మాటల పోరు మొదలయ్యింది.

జీమూతుడు:"మా స్వామి నరకాసురుడు - నిరుపసర్గ సంగ్రామ సింహము".
దారుకుడు : "అవును. మీ నాయకుడు - నిజంగా నిరుపసర్గ - సంగ్రామ సింహమే".

అందరూ నవ్వుతారు.  ఏమిటి అంతరార్థం?

జీమూతుని ఉద్దేశ్యం లో నిరుపసర్గ-సంగ్రామ-సింహము అంటే అర్థం ఇది.. సర్గ అంటే ఉత్సాహము. నిరుపసర్గ అంటే ఎడతెగని ఉత్సాహంతో, కదనరంగాన విరుచుకుపడే సింహము వంటి వాడు తన నాయకుడు నరకుడు.

దారుకుడు అర్థంలో నిరుపసర్గ- సంగ్రామ-సింహము అంటే ఇది. ఉపసర్గ అంటే ధాతువుకు ముందుభాగాన ఉన్నది. (Prefix). నిర్, అభి, అప, ఉప, మహా, సం - ఇటువంటివి ఉపసర్గలు. నిరుపసర్గ - సంగ్రామ-సింహము అంటే సంగ్రామ అన్న శబ్దంలో ఉపసర్గ "సం" ను తొలగిస్తే గ్రామ అవుతుంది. సంగ్రామ సింహము - ఇందులో ఉపసర్గ తీసివేస్తే గ్రామసింహము అవుతుంది. అంటే కుక్క. "అవునోయ్ మీ యజమాని కుక్కే" అని దారుకుని కౌంటర్.

జీమూతునికి ముఖం మాడిపోయింది. అయితే ఆతడు తగ్గలేదు. తన స్వామి నరకుని వీరత్వాన్ని పొగుడుతూ ఇలా శ్లోకం చెప్పాడతను.

త్యక్తప్రభంజనాధమాక్రాంత పురందరాలయం వీరమ్ |
శ్లాఘన్తే కింపురుషాః చర్విత బర్హిర్ముఖం మృథేష్వేనమ్ ||

త్యక్త ప్రభంజనాధమం = విడిచిన వాయుదేవుడనే అధముని కలిగిన వానిని (యుద్ధంలో వాయుదేవుని జయించి ప్రాణాలతో వదిలిన వాడిని), ఆక్రాంత పురందరాలయం = ఆక్రమించిన, ఇంద్రుని ఇల్లైన స్వర్గము కలవాడిని (స్వర్గాన్ని జయించినవాడును), మృథేషు = యుద్ధములలో, చర్విత = నమిలి వేయబడిన; బర్హిర్ముఖం = దేవతల ముఖములు కలవానిని (దేవతల ముఖాలను నమిలి వేసిన వాడు అంటే దేవతలను దుమ్ము దుమ్ముగా ఓడించిన వాడు) అయిన ఏనం వీరం = ఈ వీరుడిని (నరకాసురుని), కింపురుషాః = కింపురుషులనే స్వర్గలోకవాసులు, శ్లాఘన్తే = కీర్తిస్తున్నారు.

తాత్పర్యం ఇది: మా రాజు వాయుదేవుడిని జయించి, అధముడని చెప్పి అలా వదిలేశాడు. ఇంద్రుని రాజ్యాన్ని జయించాడు. యుద్ధంలో ఇతర దేవతల ముఖాలను నమిలివేశాడు.  అలాంటి వీరుడైన ఈ నరకాసురుణ్ణి కింపురుషులు కీర్తిస్తున్నారోయ్!

***

జీమూతుడు చెప్పిన ఆ శ్లోకానికి దారుకుడు ఏ మాత్రం చలించక, నవ్వుతూ అన్నాడు : "ఓయీ జీమూతా, ఇందాకటి "నిరుపసర్గ సంగ్రామసింహమనే మాట లాగా నీ శ్లోకానికి నీ శ్లోకమే సమాధానమోయ్"

జీమూతుడి ముఖం మరోసారి మాడిపోయింది.

ఎలా?

పై శ్లోకానికి వేరే అర్థం ఎలా?

ఇలా.

త్యక్తప్రభం = కోలుపోయిన కాంతి కలిగిన; జనాధనం = మనుష్యులలో అధముని, ఆక్రాన్తపురం = ఆక్రమింపబడిన ఇల్లు కలవాడిని (ఇంటిని కూడా రక్షించుకోలేని వాడిని) దరాలయం = భయానికి నెలవైన వాణ్ణి, వీరం = త్రాగుబోతును; (వీరః అంటే త్రాగుబోతని మరొక అర్థం) మథేషు = యుద్ధాలలో, చర్విత = నమిలిన, బర్హిర్ముఖం = నోట గడ్డిన కరచిన వానిని, (బర్హి అంటే దేవుడని ఒక అర్థం, గడ్డి అని మరొక అర్థం), ఏనం = వీడిని, పురుషాః = మనుష్యులు, శ్లాఘన్తే కిమ్? = మెచ్చుకుంటారా ఏమి?

తాత్పర్యం : ఒరే, మీ రాజుకు కళాకాంతుల్లేవు.మనుష్యులలో అధముడు. వాడి ఇంటిని శత్రువులు కొల్లగొట్టారు. యుద్ధంలో గడ్డికరిచిన వాడు. అలాంటి వాణ్ణి ఎవరైనా మెచ్చుకుంటారా?

***

ఆపై జరిగింది తెలిసింది. నరకాసురుడు యుద్ధంలో జీమూతుడు మాటలయుద్ధంలో ఓడారు.

***

నరకాసురవిజయవ్యాయోగాన్ని అద్భుతంగా తెనిగించిన కొక్కొండ వేంకటరత్నం పంతులు గారు ఈ శ్లోకాన్ని మాత్రం తెనుగు చేయక, ఔచిత్యాన్ని పరిహరించక యథాతథంగా ఉంచేశారు.

ఇది సంస్కృత సాహిత్యంలో ఓ చిన్న చమత్కారం.



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వాఙ్మయచరిత్రలో కొన్ని వ్యాసఘట్టాలు - శ్రీ ఏల్చూరి మురళీధరరావు గారు.

అశోకుడెవరు? - 1

ముకుందవిలాసః - కుంటిమద్ది శేషశర్మ.