మయూఖము - 4

సంస్కృతకవులలో దండి, క్షేమేంద్రుడు, ఆనందవర్ధనుడు, జగన్నాథపండితుడు ఇత్యాదులనేకులు కవులే కాక లాక్షణికులు కూడానూ. ఆ మాటకొస్తే కవులందరున్నూ లాక్షణికులేననుకోండి. ఎంతో కొంత లక్షణలక్ష్యాలు తెలిస్తేనే కదా కవిత్వరచన అంటూ కొనసాగేది? 

అయితే ప్రత్యేకంగా లక్షణగ్రంథాల్లో కవిత్వలక్షణాలు చెప్పటం వేరు, కవిత్వలక్షణాలను కావ్యంలో సందర్భానుసారంగా, ప్రాస్తావికంగా చెప్పటం వేరు. అప్పుడప్పుడూ కొందరు కవులు తమ కావ్యాలలో ’కవిత్వం’ గురించి ప్రస్తావించటం కద్దు. అలాంటి సందర్భం మాఘుని శిశుపాలవధమ్ ద్వితీయసర్గలో ఉంది. 

చేదిదేశపు రాజైన శిశుపాలుడు యాదవులపాలిట, సన్మార్గుల పాలిట కంటకంగా అయినాడు. రావణాసురుడే తిరిగి ద్వాపర యుగాన శిశుపాలుడిగా జన్మించాడేమో అన్నంతగా విషమకృత్యాలు చేస్తున్నాడు. శిశుపాలుని ఏ విధంగా ఎదుర్కోవాలని వాసుదేవుడు బలరామునితోనూ, ఉద్దవునితోనూ మంత్రాంగం చేయనెంచినాడు. ఆతడిపై దండెత్తి జయించాలని, ఇదే తగిన సమయమని సారాంశంగా బలరాముడు చెప్పాడు. ఆపై ఉద్దవుని సంభాషణ సాగింది. శత్రువుల బలాబలాలను, సామర్థ్యాన్ని మొదట తెలిసికొమ్మని ఉద్దవుని సారాంశం. ఈ విషయాన్ని చెబుతూ, మధ్యలో ఉద్ధవుని ద్వారా కవి (మాఘుడు) చెప్పిన కొన్ని విషయాలు చూద్దాం.

బహ్వపి స్వేచ్ఛయా కామం ప్రకీర్ణమభిధీయతే |
అనుజ్ఝితార్థ సంబంధః ప్రబంధో దురుదాహరః || (2.73)

స్వీయప్రతిభకు తగినట్టు చిత్తమునకు తగినట్టు దేని గురించి అయినా చెప్పవచ్చును కానీ సందర్భానికి అన్వయించనిది అయిన పదార్థసంగతి చెడ్డ ఉదాహరణమే అవుతుంది.

ఇక్కడ రెండవపాదాన ప్రబంధము అన్న శబ్దానికి ’సందర్భము’ అని అర్థం. (మల్లినాథ సూరి వ్యాఖ్య). అయితే ’అనుజ్ఝితార్థ సంబంధః ప్రబంధో దురుదాహరః’ అన్న విషయం కావ్యానికీ/రచనకూ వర్తిస్తుంది. ప్రబంధమంటే రచన కూడా. (కావ్యప్రస్తావనలో ప్రబంధం అంటే ప్రకృష్టమైన బంధము. అంటే చిక్కగా అల్లిన అల్లిక అని అర్థం. ఇటువంటి ప్రబంధ రచనలో మధ్యలో సందర్భానికి తగని ఏదో, ఏదేదో చెప్పబూనటం మంచిది కాదని పిండితార్థం)

తేజః క్షమా వా నైకాంతః కాలజ్ఞస్య మహీపతేః |
నైక మోజః ప్రసాదో వా రసభావ విదః కవేః || (2.83)

కాలజ్ఞులైన భూపాలునకు, క్షాత్రమే అని, క్షమయేనని నిశ్చితమైన నియమములు ఉండవు. నిజమే. శృంగారాది రసముల యొక్క, నిర్వేదము గ్లాని ఇత్యాది భావముల యొక్క మర్మములను బాగా తెలిసిన కవి, ఓజో గుణాన్నే ఆశ్రయించాలని కానీ, ప్రసాద గుణాన్నే అనుసరించాలని కాని తలపోయడు. ఇది దృష్టాంతాలంకారం.

సాధారణంగా ఆలంకారికులు చిత్తద్రుతి కారకాలైన కరుణ,శృంగార, శాంత రసాలను పోషించే సందర్భంలో ప్రసాద, మాధుర్యాది గుణాలను (అంటే అలతి అలతి పదాలతో, సమాసాలు లేకుండగా), బీభత్స భయానక రౌద్రాది రసాలను ఉద్యోతించే క్రమంలో, చిత్తదీప్తి కారకాలలో, అంటే భీషణ యుద్ధసందర్భాలలో ఓజోగుణభరితంగా, అంటే సుదీర్ఘమైన, కఠినమైన సమాసాలతో రచన ఉండాలని సూచించారు. రసభావ విదులైన కవులు వీటిని ఖచ్చితంగా పాటింపనవసరం లేదు అని మాఘుని తీర్పు. చాలా అద్భుతమైన స్వతంత్రమైన సూచన యిది.  

శృంగారంలో సుదీర్ఘమైన సమాసాలను కూర్చిన అమరుకుడు, యుద్ధఘట్టంలో ప్రసాదగుణభరితంగా రచించిన మాఘుడు కూడా ఇందుకు ఉదాహరణలు. గమనార్హమైన విషయం ఏమంటే - మాఘుని శిశుపాలవధమ్ కావ్యం ఆలంకారిక సిద్ధాంతాలు, సాంప్రదాయాలు, వాదోపవాదాలు ఇంకా తీవ్రస్థితి దాల్చడానికి ముందు కాలం నాటిది. (క్రీ.శ. ఏడవ శతాబ్దానికి పూర్వం). అప్పుడే కవి ఈ సూక్ష్మమైన ప్రతిపాదన చేశాడు.

నాలంబతే దైష్టికతాం న నిషీదతి పౌరుషే |
శబ్దార్థౌ సత్కవి రివ ద్వయం విద్వానపేక్షతే || (2.86)

విద్వాంసుడు కేవలం అదృష్టాన్ని కానీ, కేవలం పౌరుషాన్ని కానీ నమ్ముకోడు. రెంటిని తగిన విధంగా ఆపేక్షిస్తాడు. ఎలా అంటే సత్కవి - శబ్దార్థాలను రెంటినీ తగు విధంగా పోషించిన యట్లు.

కావ్యంలో శబ్దమూ, అర్థమూ రెండున్నూ శోభస్కరంగా ఉండవలసిందే. ’గంభీరమైన భావం చెప్పాను, శబ్దములేరుటకు నా వద్ద సమయము లేదు’ వంటివి సత్కవులకు శోభించవు. ఈ సందర్భంలో మల్లినాథసూరి వామనుడనే ఆలంకారికుని మాటను ప్రస్తావిస్తూ వ్యాఖ్యానిస్తాడు. ’అదోషౌ సగుణౌ సాలంకారౌ శబ్దార్థౌ కావ్యమ్’. దాదాపు ఇటువంటి నిర్వచనాన్నే ప్రాచీనులైన ఆలంకారికులు చెప్పటం గమనార్హం. ’తదదోషౌ, శబ్దార్థసహితౌ, గుణావనాలంకారౌ క్వాపి’ ఇత్యాది.

స్థాయినోऽర్థే ప్రవర్థంతే భావాస్సంచారిణో యథా |
రసస్యైకస్య భూయాంస స్తథా జేతుర్మహీభృతః ||  (2.87)

రససిద్ధి కోసం స్థాయీభావం. స్థాయీభావపు ప్రయోజనం కోసం అనేకములైన విభావానుభావవ్యభిచరీభాలు  ఎలా ప్రవర్తిస్తాయో అలాగే ఒక్క రాజు కోసం అనేక(మిత్రసామంత) రాజులు తోడ్పడగలరు. (మరొక అర్థం ప్రకారం - స్థిరమైన రసము సిద్ధించుట అన్న ప్రయోజనం కొఱకు ప్రసంగ వసాన వచ్చిన ఇతర (రసములు) ఎలా ప్రవర్తించునో అలా ఒక్క రాజు కోసం మిత్రసామంతులు తోడు కాగలరు. అలా మిత్రులను, సామంతులను కూడగట్టుకొమ్మని ఉద్ధవుని సూచన.

’కవయః క్రాంతదర్శినః’. కవి ఉద్ధవుడి నోట ఇంతగా చెప్పించిన తర్వాత శ్రీకృష్ణుడు ఏమి చేస్తాడో తెలిసిందే కదా. :)  

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Disclaimer

అశోకుడెవరు? - 1

ధ్రువనక్షత్రం - శింశుమారుడు