సేతుబంధం

సేతుబంధం - ఇది ఒక మహారాష్ట్రీ ప్రాకృత కావ్యం.  సంస్కృతేతర భాషల్లో వాల్మీకి రామాయణం మీద ఆధారితమైన మొట్టమొదటి రచన. ఈ కావ్యాన్ని రచించిన కవి వాకాటక రాజైన రెండవ ప్రవరసేనుడు. దీనికే దశముఖవధమ్ (దహముహవధో) అని పేరు. రామాయణంలో యుద్ధకాండలో రాముడు వానరసేనతో సముద్రతీరానికి చేరి, వారధి నిర్మించడం మొదలు, రావణుని నిర్జించటం వరకూ సాగిన కావ్యం యిది. పదిహేను సర్గల కావ్యం. వాల్మీకి రామాయణం మీద ఆధారపడినప్పటికీ, అద్భుతమైన ప్రాకృతిక వర్ణనలకు, నాయకత్వపు లక్షణాల వివరణకూ, భయాందోళనలు నెలకొన్నప్పుడు జీవుల స్వభావం గురించిన వివరణకూ, అద్భుత పాత్రచిత్రణలకూ, ఇంకా అనేకానేక విషయాలకూ ఈ కావ్యం ప్రసిద్ధి. ఈ కావ్యం గురించిన సమగ్ర అనుశీలనమే ఈ వ్యాసం.  

ఉపోద్ఘాతం:

పొద్దు పొడుస్తోంది. మనోహరమైన నీలాకాశం. దిక్చక్రము వెలుగులతో ప్రకాశిస్తోంది. భావుకుడైన ఒక ప్రాకృతకవి ఉదయాన శుభకరుడూ, సర్వభూతక్షేమంకరుడునూ అయిన శివుని దర్శించి ప్రార్థిస్తూన్నాడు.  

1)
ణమహ అ జస్స ఫుడరవం కణ్ఠచ్ఛాఆ ఘడన్త ణఅణగ్గిసిహమ్ |
ఫురఇ ఫురిఅట్టహాసం ఉద్ధపడిత్తతిమిరం విఅ దిసాఅక్కమ్ ||
సంస్కృతఛాయ:
నమత చ యస్య స్ఫుటరవం కణ్ఠచ్ఛాయాఘటమాన నయనాగ్నిశిఖమ్ |
స్ఫురతి స్ఫురితాట్టహాసమూర్ధప్రదీప్త తిమిరమివ దిక్చక్రమ్ ||

ఎవని నయనాగ్ని శిఖలు, కంఠపు నీలి కాంతి కలిసి ప్రకాశిస్తున్నవో,
ఎవని అట్టహాసముచేత శిరమున దగ్ధమైన చీకటి కలదో,
ఆ అట్టహాసముతో రగిలిన నిప్పు రవ్వలు కలవో,
ఎవని అట్టహాసము దిక్చక్రమును స్ఫురింపజేస్తోందో అట్టి శివునకు జోత.

వినూత్నమైన భావన యిది. ఎదుట కనిపిస్తోన్న ఆకాశాన్ని, దిక్చక్రాన్ని ఒక దేవతామూర్తియొక్క విలాసములతో ఉత్ప్రేక్షిస్తున్నాడు. కానీ, ఆ మూర్తి విలాసాలతో ప్రతీయమానమయ్యే వస్తువు  అనంతంగా, అత్యంత సుందరంగా ఉంది. శివుని కంఠచ్ఛాయ నీలిరంగు. ఆ నీలము దిగంతాలలో (ఆకాశ రూపంలో) వ్యాపించింది. అంటే శివుడు నటరాజమూర్తిగా ఆనందతాండవము చేస్తున్నాడని, (మండల) నృత్యములో వేగముగ భ్రమిస్తున్న కారణాన ఆ మహేశ్వరుని కంఠవర్ణమైన నీలము సర్వదిశావ్యాప్తమై నీలాంబరమైనదనీ స్ఫురింపజేస్తున్నాడు కవి. ఈశ్వరుని తలపై తిమిరము దగ్ధమై - మహేశ్వరుడు భాస్కరుడై భాసించడం మరొక చమత్కారం. 

’శివేతర క్షతము’ - అంటే అమంగళ వినాశము. అందు కొఱకై శివుని ప్రార్థించిన ప్రాకృతకావ్యశ్లోకమిది. (ఎవరైనా ఓ కావ్యాన్ని ఎందుకోసం వ్రాస్తారు? అంటే యశస్సు కోసం, డబ్బు కోసం, శివేతర క్షతం కోసమూ అని మమ్మటభట్టు అనే లక్షణకారుడంటాడు.)        

అనంతమై, అపరిమితమైన వస్తువును మూర్తిమంతమై పరిమితమైన వస్తువుతో ఉత్ప్రేక్షించడం, నిశ్చలమైన, నిర్జీవమైన వస్తువునకు జీవంతమైన వస్తువుతో సమన్వయించడం, ఒక్క శ్లోకంలో ఒక గాథను యిముడ్చడం, సౌందర్యనిధిని పోలిన వస్తువునకు సామాన్యవస్తువుతో నుపమించి ఒప్పించడం, సూక్ష్మమైన వస్తుశకలమును దిగంతరముల వ్యాపించిన  మహోన్నతవస్తువుతో కల్పించడం, గంభీరమైన, నిగూఢమైన భావములు (Abstract ideas), నిశితదృష్టి,  ఆధునికత, స్వతంత్రమైన భావనాబలం, దానికి తగినట్టి పరికల్పన, ఊహను కట్టెదుట నిలుపగల కవనచాతుర్యము, అడుగడుగుననూ రసపరిపోషణ, అనాయాసమైన భాష, సునాయాసమైన  ఛందస్సు - ఇవన్నీ ప్రాకృతకవిత్వలక్షణాలు.

పొద్దు పొడుపు చూశాం కదా; పొద్దు మునగటం ఇలా ఉంది.

2) 
దీసఇ విద్దుమఅంబం సిందూరారుణగడందకుంభచ్ఛాఅం |
మందరధాఉకలంకిఅ వాసుఇమండలణివకలం రవిబింబమ్ ||
ఛాయ:
దృశ్యతే విద్రుమతామ్రం సిన్దూరారుణగజేన్ద్రకుమ్భచ్ఛాయం |
మన్దరధాతుకలఙ్కితవాసుకిమణ్డలవర్తులం రవిబిమ్బమ్ ||

పడమర దిక్కున ఆకాశాన అస్తమిస్తోన్న రవిబింబం పగడము వలె ఎఱ్ఱగా ప్రకాశిస్తోంది. సిందూరము దాల్చిన గజేంద్రుని గండస్థలం లా కనిపిస్తోంది. మందరపర్వతమును రాపాడి, ఆ పర్వతపు ధాతువులవలన ఎర్రబారిన వాసుకి,  వలయముగా చుట్టి ఉందా యన్నట్టు ఆ సూర్యబింబం కనిపిస్తోంది.

రవిబింబము పగడమువలె కనిపించడం - సాధారణంగా సంస్కృతకవుల వర్ణనాసామాగ్రి లోనిదే. పెద్ద విశేషము కాకపోవచ్చు. ఏనుఁగు కుంభమునలంకరించిన నాగసంభవ ద్రవ్యవిశేషమైన సిన్దూరము కూడా విడ్డూరము కాదు. ఉదా: సంస్కృతకవి భారవి కిరాతార్జునీయంలో దేవగజములను "సిన్దూరైః కృతరుచయః..." (కి. 7-8) అని వర్ణించినాడు. అయితే అసలైన విశేషము ఆ తర్వాతి సమాసము ’మన్దరధాఉకలఙ్కిఅవాసుఇమన్డలనిఅక్కలం’ (మన్దరధాతుకలఙ్కితవాసుకిమండలనిశ్చక్రలం) లో ఉంది. 

మన్దరధాతుకలఙ్కితవాసుకిమండలనిశ్చక్రలం - 
మన్దర = మందరపర్వతము యొక్క
ధాతు = మూలికల చేత
కలంకిత = మలినమైన
వాసుకి మండల = వాసుకి అను దేవనాగముచేత వలయముగా
నిశ్చక్రిలం = చుట్టుకొనబడినది.

సర్పరాజు వాసుకిని కవ్వముగా, మందరపర్వతాన్ని ఊతముగా పెట్టి పాలకడలిని చిలికిన పురాణకథ నిచ్చట అన్వయించుకోవాలి. ’నిఅక్కలం’ అన్న ప్రయోగంలో యున్నది ఆసక్తికరమైన, బలీయమైన భావనాబలం మొత్తమున్నూ. పగడము లా ఉన్న రవిబింబాన్ని ఎర్రటిచర్మము గల వాసుకి సర్పం వలయముగా చుట్టుకొందట! వాసుకి చర్మమెందుకు ఎఱ్ఱబారిందీ? - మందరపర్వతానికి కవ్వముగా ’డ్యూటీ’ చేసింది కనుక. ఆ పనిలో భాగంగా గైరికాది ధాతువులను రాచుకుని వాసుకి చర్మము ఎఱ్ఱ బారింది. 

ఏనుగు తిలకపు ఉపమతో రవిబింబాన్ని తీర్చిన కవి, మరొక ఘట్టంలో ఏనుగు పదచిహ్నములో విలీనమైన శశిబింబమును ఎలా ఉత్ప్రేక్షించినాడో గమనిద్దామా?

3)
తావ అ అత్థణిఅమ్వం ణవసలిలాఉణ్ణగఅపఅచ్ఛవికలుసో|
పత్తో అరుణుణ్ణామిఅపాసల్లన్తగఅణోసరన్తో వ్వ ససీ ||
ఛాయ:
తావచ్చాస్తనితమ్బం నవసలిలాపూర్ణగజపదచ్ఛవికలుషః |
ప్రాప్తో అరుణోన్నమిత పార్శ్వాయమానగగనాపసరన్నివ శశీ ||

చంద్రుడు పశ్చిమాద్రిని క్రుంగిపోతున్నాడు. ఒక చిన్న కొత్తనీటి కుంటపై యేనుగు కాలు మోపితే ఏర్పడిన గుండ్రని ముద్రలాగా ఉన్నాడు చంద్రుడు. తూర్పున ఉద్గమించే రవి కిరణపు అరుణరేఖలు చంద్రుణ్ణి దూరంగా పశ్చిమము వైపుకు తళ్ళివేసినై.

అడుసులో ఏర్పడిన ఏనుగుకాలిముద్ర లా చంద్రుడు! ఇది Typical ప్రాకృతకవిత్వ ముద్ర. ఇది విలక్షణము, విచిత్రము, అసాధారణము కూడా. ఈ ముద్ర స్వతంత్రము, ఎక్కడో మూల ఆదికవి వాల్మీకి ప్రేరణ ఉన్నట్టు తోస్తుంది. 

సంధ్యారాగోత్థితైస్తామ్రై రన్తేష్వధికపాణ్డరైః |
స్నిగ్ధైరభ్రపటచ్ఛేదైః బద్ధవ్రణమివాంబరమ్ || (వాల్మీకిరామాయణము, కిష్కింధాకాండ. 28.5)

వర్షము వెలసిన పిదప కొద్దిపాటి జలములతో తెల్లగా ఉన్న మేఘములతో కూడిన యంబరము సంధ్యారాగాంచితమై - శరీరభాగంపై ఏర్పడిన పుండుకు, తెల్లని వస్త్రంతో కట్టిన కట్టులాగా నడుమన నెఱ్ఱగా. చివరల లేతరంగులోనూ ఉన్నది. మేఘము ’పుండు’ లా ఉంది అనడం - ఇక్కడ కనిపించే అసాధారణత్వము, విలక్షణత్వమున్నూ.  

సంస్కృతప్రబంధసాహిత్యంలో యిలాంటివి అరుదు.  తెలుగులో ఆముక్తమాల్యదకారుడి ధోరణి ఇల్లానే ఉంటుంది. నంది తిమ్మనకవి ఓ చోట అస్తమిస్తున్న రజనీధవుని "బాగా యెండకు కాలిన కామధేనువు పేడముక్క" గా ఊహించి, ఆ భావాన్ని సంస్కృతీకరించి "చరమాద్రి దావాగ్ని సంప్లుష్ట సురసౌరభేయీ కరీషైకపిండ" మని పారిజాతాపహరణంలో అందంగా తిట్టాడు.     

సేతుబంధంలో ఇంకొన్ని వర్ణనలు

పై వర్ణనలతో బాటు - అంబరాన్ని ఆర్ణవంగా, అంబరాన చుక్కలను సముద్రగర్బంలో పగిలి పైకి తేలిన ముత్యముల రాశితోనూ కవి ఉత్ప్రేక్షిస్తాడు. ఒక్క ముత్యము ఏర్పడాలంటేనే అపురూపమైన స్వాతిచినుకొక్కటి అవసరమౌతుంది. చుక్కలన్నీ ముత్యాలు కావాలంటే? ఆకాశమనే సముద్రగర్భంలో ఏదో ఒక్క విపరీతఘటన జరిగి, ముత్యపు చిప్పలు విచ్ఛిన్నమయినాయని ఊహించడం అసాధారణమైన,  అసంబద్ధమైన ఊహ. An Absurd/Weird & Wild thought.  

మిన్ను - ఓ పెద్ద తామరపువ్వులా వలె ఉందని మరొక శ్లోకంలో ఊహిస్తాడు కవి. ఇంకో శ్లోకంలో - దినమణి అయిన సూర్యుని కిరణాలతో వెలిగిపోతూ, శరత్కాలంలో యేర్పడిన ఇంద్రధనువు -  ఘనలక్ష్మి నడుము నుంచి జారిపడిన వడ్డాణంలా ఉందంటాడు! ఆకాశమనే  మందారపువ్వు తాలూకు పుప్పొడి లా ఇంద్రచాపం ఉందంటాడు! 

వర్షాకాలం దాటిపోయింది. రాచకార్యాల వాళ్ళు, రాజుల దండయాత్రలలో పాల్గొనే జనసామాన్యము శీతకాలం ఆరంభంలో ప్రయాణం మొదలువెట్టటం ఆనవాయితీ. యుద్ధాలకు బయలుదేరే సైనికుల భార్యలకు విరహం. ఈ సందర్భంలో ఇంద్రచాపాన్ని శృంగారచిహ్నంగా మార్చి, ’దిశాకన్య పయోధరాలపైన యంతరిక్షము చిత్రించిన గోటినొక్కు లా హరివిల్లు’ న్నదని కవి వర్ణిస్తాడు. 

అదే శరత్కాలంలోనే - 
4)
ధుఅమేహమహుఅరాఓ ఘణసమఆఅడ్డిఓ ణ అవిముక్కాఓ |
ణ హపాఅవసాహాఓ ణి అఅట్టాణాం వ పడితాఆఓ దిసాఓ ||
ఛాయ:
ధుతమేఘమధుకరాః ఘనసమయాకృష్టావనతముక్తాః |
నభః పాదపశాఖాః నిజకస్థానమివ ప్రతిగతా దిశః ||

ఆకాశమొక చెట్టు. ఆ చెట్టు కొమ్మలు - దిశలు. వర్షాకాలము అన్న కాలపురుషుడు ఆ కొమ్మలను వంచినాడు. అప్పుడు తుమ్మెదలు అనే మేఘాలు ఒక్కచోటున చేరినై. (చేరి భూమ్మీద వర్షం కురిపించినై. ఆపై వర్షాకాలం తీరి శీతాకాలం రాగానే) కాలపురుషుడి పట్టు వీడింది. మేఘాలు ఎగిరిపోయి, తిరిగి యథాస్థానములను పొందినై. 

ఈ శ్లోకంలో కవి చెప్పింది కొంత. ఊహించుకోవలసింది బోల్డంత. ధవళమేఘతతి తుమ్మెదలబారు. వర్షాకాలమునకు ముందు తుమ్మెదలు దిశలు అనే కొమ్మలపైన అనేకమైన తేనెపట్టులను పెట్టినై. ఆ తేనెపట్టులే నల్లనిమేఘాలు. ఆ తేనెపట్టులను కాలపురుషుడు భూమికి సమాంతరంగా క్రిందకు వంచి, విదల్చి ప్రాణికోటి కోసం (మకరంద) వర్షమును కురిపించినాడు. ఆపై ఆతడు శరత్కాలంలో కొమ్మను వదిలివేయగానే తుమ్మెదలు తమ నిజస్థానములకు చేరినాయి. ఇదంతా పాఠకుడు తనకు తాను ఊహించువాల్సి ఉంది. ఇక్కడ పాఠకుణ్ణి కూడా కవిగా మార్చాడు కవి!

మనం ఎలా ఉన్నామంటే, ఆఫీసులలో ఊడిగం చేసుకుంటూ, ఆకాశంలో చుక్కలనూ, చంద్రుణ్ణీ, ఇంద్రధనుస్సునూ చూసే అవసరం లేకుండా, వాటికోసం కూడా ఏ "ఆండ్రాయిడు ఆప్స్" లాంటివో పెట్టుకుని కూర్చుని ఉన్నాము. ఆకాశంలో చుక్కలు కాదు కదా,  కాలుష్యంతోటి చంద్రుడే కనబడ్డం పెద్ద సంగతిగా మారింది.ఇట్లాంటి కాలంలో అమోఘమైన కవిత్వంలో భావనాశక్తిని చదివి, భావించి, ఊహించి, అన్వయించుకుని, అందుకుని, ఆస్వాదించి అనుభూతించడానికి  పరిశ్రమించే స్థితికి వచ్చి ఉన్నాము. 

పైని శ్లోకంలో మరో విశిష్టత ఉంది.ఓ వర్ణన లానే కాక ఈ శ్లోకము ఒక ప్రత్యేకమైన ’కథ’ను చెబుతోంది. ప్రాకృత కవనలక్షణమిది. దీనికి గాథాసప్తశతి అంతా ఉదాహరణే. ఈ లక్షణము వలననే ఆలంకారికులు ప్రాకృతగాథలను చాలా సందర్భాలలో ఆలంకారిక గ్రంథాల్లో ఉదాహరణంగా స్వీకరించినారు. కాళిదాసాది సంస్కృతకవులు ఈ గాథలను అనుసరించటం ఉంది.

వివరమైన గాథకే కాక, నిశితమైన పరిశీలనా ప్రాకృతంలో కద్దు. శరచ్చంద్రోద్భవ వర్ణనను వివరంగా చూద్దామా?

5)
పజ్జత్తసలిలదోఏ దూరాలోక్కన్తణిమ్మలే గఅణఅలే |
అచ్చాసణ్ణం వ ఠిఅం విముక్కపరభాఅపాఅడం ససిబిమ్బమ్ ||
ఛాయ:
పర్యాప్తసలిలధోతే దూరాలోక్యమాననిర్మలే గగనతలే |
అత్యాసన్నమివ స్థితం విముక్తపరభాగప్రకటం శశిబింబమ్ ||

వర్షాకాలము నింగిని పూర్తిగా కడిగివేసి, నిర్మలంగా మార్చింది. ఆపైని సుదూరపర్యంతము గగనాన, విస్పష్టముగ గోచరమయ్యే శరచ్చంద్రబింబము - గగనతలము నుండి ముందుకు వచ్చి, కనులకు దగ్గరగా కన్పట్టుచున్నది. (Projection effect)

ముదురునీలపు రంగు ’శీతలవర్ణ’జాలానికి చెందిన రంగు. (Cool Color). లోతైన ఆలోచనలకూ, భావజాలానికి ముదురునీలపు రంగు ప్రతీక. ముదురు నీలి/నీలి/నలుపు వర్ణపు తలముపై తెలుపు రంగుతో కూర్చిన అక్షరజాలాన్ని/బొమ్మను జాగ్రత్తగా గమనిస్తే, ఆ అక్షరములు/బొమ్మ కలిగిన ధవళతలము ముందుకు వచ్చినట్టు, అంటే వెనుకటి నీలి తలంపై నుండి "ప్రొజెక్ట్" చేసినట్టు అనిపిస్తుంది. ఈ రంగులసమన్వయము (Combination)  కంటికి అనాయాసాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తోంది. ఈ నిశితపరిశీలనల అధ్యయనఫలితములను నేడు ’వర్చ్యువల్ రియాలిటీ సిమ్యులేటర్’ లలోనూ, ’వెండింగ్ మిషన్’, ఇతర ’టచ్ స్క్రీన్ ఇంటర్ఫేసెస్’ ల తెరల రూపకల్పనలోనూ ఉపయోగిస్తున్నారు. 

ప్రత్యక్ష ఉదాహరణలు:

సిటీ బేంక్, HDFC, తదితర బేంకుల ATM తెరలు.
గూగుల్ సెర్చ్ తెరపై పైని ఎడమవైపు మూలన Signin చిహ్నము,
Facebook తెరపై అనేక బొత్తాములు,
Microsoft తెరపట్టులు వగైరా.  

ఏ శాస్త్రమైనా ఏదో ఒక సునిశితమైన పరిశీలన మూలకంగా ఆరంభవుతుంది. ఈ నేపథ్యంలో వేలయేళ్ళక్రితం నాటి ఆ సునిశితకల్పన ’లోతు’ను సహృదయులు గుర్తించగలరు.    

దృష్టిని దిగంతాలకు సారించే అనూహ్యమైన కల్పనలనే కాక ప్రాకృతకవి సూక్ష్మమైన పరిశీలనలను కూడా చూపుతాడు.

6)
మఅరన్దగరుఅవఖ్కం పాసోఅల్లంత వణలఆవిచ్ఛూఢమ్ |
ణ ముఅఇ కుసుమగ్గోచ్ఛం ఆసాఇఅమహురసం పి మహుఅరమిహుణమ్ ||
ఛాయ:
మకరన్దగురుకపక్షం పార్శ్వాయమానవనలతావిక్షిప్తమ్ |
న ముఙ్చతి కుసుమగుచ్ఛమాస్వాదిత మధురసమపి మధుకరమిథునమ్ ||

కపిసేన సేతువు నిర్మాణము కొఱకు పర్వతములను పెళ్ళగిస్తున్నారు. కొండరాళ్ళు, చెట్లూ అల్లల్లాడిపోతున్నై. ఆ కొండల మధ్యన ఒక పూలగుచ్ఛం ఉందట. ఆ పూలపైని మకరందం కోసం ఓ తుమ్మెదజంట వచ్చి వ్రాలింది. ఆ జంట తనివితీరా మధువును గ్రోలినది. ఆ సమయంలో సరిగ్గా కొండ పెకలింపబడింది. దానితోబాటు పూలగుబురూ కూడా. దానితోబాటు ఆ పైని అడవి తీవె. అంత కోలాహలము జరుగుతున్నా, భ్రమరమిథునం పూలపై జారిన దట్టమైన మకరందానికి రెక్కలు అంటుకున్న కారణమున అచ్చోటి నుండి కదలలేక పోయింది!

ఉత్కంఠగా కథను నిర్వహిస్తూ, కాస్త యెడంగా వచ్చి చేసిన కల్పన ఇది. కథాక్రమాన్ని చెరుపకుండా, కథలో అంతర్భాగంగా కథకు చెందని విషయాన్ని చెప్పడం అన్న మాట. మకరందానికి రెక్కలు అంటుకుని ఎగురలేకపోయిన మధుకరమిథునము కళ్ళల్లో మెదలటమే కాక, కొండరాళ్ళు పెకలిస్తున్న నేపథ్యంలో భ్రమరముల జంట పాఠకుని మదిలో ఒక చిత్రమైన, సున్నితమైన ’అనుకంప’ను రేకెత్తిస్తోంది. 

కావ్యపరిచయము

ప్రవరసేనుడు కాళిదాసుకాలమునకు దగ్గరివాడని కొందరు చారిత్రకుల ఊహ. కొందరు కాళిదేసే ప్రవరసేనుడంటారు. అది విపరీతమైన ఊహ. ఈ కవులిద్దరి శైలిలో భేదమే ఇందుకు ఋజువు. ప్రవరసేనుడు రచించిన గాథలు కొన్ని గాథాసప్తశతిలో ఉన్నై. 

కావ్యమంటే కేవలము వర్ణనలేనా? కాదు. కావ్యము అంటే ఇతివృత్తనిర్వహణము, ఔచిత్యవంతమైన పాత్రలకూర్పు. రసప్రవిష్టమైన సన్నివేశముల తీర్పు. ఈ విషయపోషకములైన గుణములను, ఇతర అలంకారములను, శైలిని, శయ్యను, నిర్వహించడం. వీటన్నిటి సమాహారం కావ్యం. ఇంతమాత్రమే కాదు. ఈ నిర్వహణ కావ్యము మొత్తమంతటా కనిపించాలి. ఇది ఎంతటి కవికైననూ దుష్కరం. ఈ విషయమునే సేతుబంధకవి కావ్యారంభమున సవినయముగ మనవి చేసి కావ్యము నారంభించినాడు.

బంధము - అనగా కూర్పు. సేతుబంధమనగా, సేతువు నిర్మాణము, లేదా సేతువు కూర్పు. మరియొక విధమున ’సేతువు’ అనే కావ్యపు కూర్పు. కావ్యపరిభాషలో ’బంధము’ అంటే  మరో అర్థమున్నది. కుంతకుడను ఆలంకారికుని నిర్వచనమిట్లా ఉంది.

వాచ్యవాచక సౌభాగ్య లావణ్య పరిపోషకః |
వ్యాపారశాలీ వాక్యస్య విన్యాసో బన్ధ ఉచ్యతే ||(వక్రోక్తి జీవితము - 1.22)

శబ్దార్థముల సౌభాగ్య, లావణ్యములను పుష్టినొందించు వాక్యము యొక్క విన్యాసము "బంధ"మని చెప్పబడుచున్నది. 

శబ్దము, అర్థము - ఈ రెంటిని అలంకారములతో, రమణీయముగ నిర్వహించి వాక్యమును కూర్చటాన్ని బంధము అంటారు. ఈ ’బంధ’ నిర్వహణమును నవనవోన్మేషముగా నిర్వహించటాన్ని ’బంధచ్ఛాయ’ అంటారు. అది యెంత దుష్కరమో కవి చెబుతాడు. 

7)
ఇచ్ఛాఇ వ ధణరిద్ధీ జోవ్వణలద్ధ వ్వ ఆహిఆఈఅ సిరీ |
దుక్ఖం సంభావిజ్జఇ బంధచ్చాఆఇ అఇణవా అత్థగఈ ||
ఛాయ:
ఇచ్ఛయేవ ధనవృద్ధిః యౌవనలబ్ధేవాభిజాత్యా శ్రీః |
దుఃఖం సంభావ్యతే అభినవార్థచ్ఛాయార్థగతిః ||

ఇచ్ఛచేత ఏర్పడిన ధనము వలే, యౌవనమున ఒకనికి తలయొగ్గక, అభిజాత్యము చెడక సంపాదించిన ధనము లాగా, "బంధచ్ఛాయ" యందు అభినవమైన అర్థమును సాధించుట దుష్కరము.

విచిత్రమేమంటే, ఇంత అద్భుతముగా, ఇంత ఆర్ద్రముగా, ఇంత ఆధునికముగా, ఇంత నవనవోన్మేషముగా, "బంధచ్ఛాయ" దుష్కరత్వమును అభినవముగా నిర్వచించిన కవి మనకు కానరాడు. అంతే కాకుండా, ఇంత దుష్కర కార్యమైన అభినవార్థసహితబంధచ్ఛాయను సేతుబంధకవి ఈ శ్లోకము లోనే గాక దాదాపు కావ్యమంతటా సుకరముగానే నిర్వహించినాడు. కావ్యారంభమున వినయమును, స్వాతిశయమును, సమర్థతను, ప్రకటించిన కవులు గలరు.  ప్రవరసేనకవి పైని శ్లోకముచేత వినయమును, విస్మయమును, విచికిత్సను ఏకకాలమున ప్రకటించినాడు. ఈ భావము దక్షిణసముద్రపు కొసన నిల్చి సముద్రతరణమునకై యేమి చేయవలెనని మథనపడు కపిసేన మానసిక యవస్థను ఛాయామాత్రముగ చూపుట ఒక చమత్కారము. 

సేతుబంధము కావ్యభాష మహారాష్ట్రి ప్రాకృతము అని దండి ఆచార్యుడు పేర్కొన్నాడు.

మహారాష్ట్రాశ్రయం భాషాం ప్రకృష్టం ప్రాకృతం విదుః |
సాగరః సూక్తిరత్నానాం సేతుబన్ధాది యన్మయమ్ || (కావ్యాదర్శము - 1.34)

ఏ ప్రాకృత భాషలో రచించిన సూక్తిరత్నములకు సాగరములైన సేతుబన్ధాది కావ్యములు కలవో, అట్టి ప్రాకృతమును ఉత్తమమైన మహారాష్ట్ర ప్రాకృతమని చెప్పుదురు.
  
ఆచార్యుడు చెప్పినట్టు - సేతుబంధము సూక్తిరత్నములకు సాగరము. ఈ కావ్యమున సూక్తులు పనిగట్టుకుని చెప్పిన సూక్తులుగా కాక, సందర్భవశమున చెప్పినట్టు, కథాంతర్భాగములుగా తెలియటం విశేషము. 

కావ్యఘట్టములు

కపిసైన్యము దక్షిణసముద్రమును చేరింది. అచ్చట బడబానలమును గర్భమున ధరించి, కల్లోలతరంగిత క్షుభితమై, మహావిశాలమైన సముద్రమును జూచి కపిసేన తల్లడిల్లిపోయింది. ఇది వాల్మీకి రామాయణము యుద్ధకాండలో లేదు, కానీ వాల్మీకి కిష్కింధాకాండమందు ఈ ఘట్టపు ఛాయలు ఉన్నాయి. ఆ సారాన్ని గ్రహించి సేతుబంధకావ్యమున సుగ్రీవుని పాత్ర ఉదాత్తతను, ఔచిత్యమును చిత్రించిన తీరు యిది. సుగ్రీవుడు వానరసేనలను కార్యోన్ముఖులను చేయటానికి వారినుద్దేశించి ప్రసంగిస్తాడు. 

8)
తే విరలా సప్పురిసా జే అభణన్తా ఘడేన్తి కజ్జాలావే |
తోఅ జిఅ తేవి దుమా జే అముణిఅకుసుమణిగ్గమా దేన్తి ఫలమ్ ||
ఛాయ:
తే విరలాః సత్పురుషాః యేऽభణ్యమానా ఘటయన్తి కార్యాలాపన్ |
స్తోకా ఏవ తేऽపి ద్రుమాః యేऽజ్ఞాతకుసుమనిర్గమా దదతి ఫలమ్ ||

విరిసీ విరియని కుసుమోద్గమముతో ఫలములనిచ్చు వృక్షము అరుదు. అదే విధమున యజమాని చెప్పకయే, మౌనముగా కార్యములను పూరించు సత్పురుషులు ఘనులు. 

ఈ కావ్యమెప్పటిది?వేల యేళ్ళ నాటిది. మౌనంగా, సందడి చేయకండా కార్యములను పూర్తి చేయుట యొక్క విలువ నేటి తరమునకు కొత్తగా వివరించే అవసరము లేదు. ఈ శ్లోకమున సుగ్రీవుడు అన్యాపదేశముగ తడవింది కపిశ్రేష్టుడైన హనుమంతుని గుణగణాలనే. ఈ శ్లోకమున సత్పురుషుడు హనుమంతుడే. ఈ విషయమును ప్రత్యక్షంగా హనుమంతుని చూపి, సీతాన్వేషణ ఘట్టమును దృష్టాంతీకరించి జెప్పవచ్చును కదా? అట్లా చెప్పటానికి వీల్లేదు. ఎందుకంటే, మహాసత్వుడైన హనుమంతుడు మెరమెచ్చులను సహింపని అవికత్థనుడు. అంతే కాక ఇతరులు ఊహించి తెలుసుకొనదగిన విషయముల ప్రస్తావించునప్పుడు గాంభీర్యము చక్కని పద్ధతి. పరాక్రమాతిశయమును ’గురించి’ వర్ణించినప్పుడు గాంభీర్యము, పరాక్రమాతిశయమును ’చిత్రించు’నప్పుడు ఉపమా/ఉత్ప్రేక్షలు ఉత్తమ కవిత్వలక్షణాలుగా సాధారణంగా కనిపిస్తవి. 
శివధనుర్భంగము ఘట్టంలో - ఆదికవి వాల్మీకి రామచంద్రుని పరాక్రమాతిశయమును గురించి కొన్ని శ్లోకములలో చెప్పి పక్కకు తళ్ళివేసినాడు. అదే కవి వాల్మీకి యుద్ధకాండంలో రామచంద్రుడు దక్షిణసముద్రమును చేరి, అనశనవ్రతమును పూని, మూడు దినములు సాగరుని ప్రార్థించి, ఆపై సంద్రముపై బ్రహ్మాస్త్రమును యెక్కుపెట్టు ఘట్టమున అనేక ఉత్ప్రేక్షలు గుప్పించి వర్ణిస్తాడు.
  
తస్మిన్వికృష్టే సహసా రాఘవేణ శరాసనే |
రోదసీ సమ్పఫాలేవ పర్వతాశ్చ చకమ్పిరే ||
తమశ్చలోకమావవ్రే దిశశ్చ న చకాశిరే |
పరిచుక్షుభిరే చాశు సరాంసి సరితస్తథా ||
...
...
(వాల్మీకి రామాయణము యుద్ధకాండము - 22.6 ~ 22.15)
అట్లు రాఘవుడు శరమును సంధింపగానే, పుడమి, యంబరము పగిలినట్లుగా అయింది. పర్వతములు చలించినై. లోకంలో చీకట్లు పొడమినై. దిక్కులు కాంతిహీనంబులయినై. సరస్సులు, నదులు కదిలిపోయినై. 

ప్రవరసేనుని లోనూ ఈ శైలి కానవస్తుంది.సుగ్రీవుడు ప్రసంగించే ఈ ఘట్టంలో మరొక విషయము గమనించాలి. కపిసైన్యమున అంగద, సుషేణ,నల, నీల, జాంబవంత, గవయ,గవాక్ష, మైన్ద, ద్వివిదాది వానరయూధముఖ్యులు మహాసత్వులే. వారి శౌర్యమునకు వచ్చిన లోటేమీ లేదు. అనంతసాగరమును చూసి కొంచెం కళవళపడిన వారిని కార్యోన్ముఖులను జేయటం మాత్రమే నాయకుని వంతు. ఆపై కాగల కార్యము సేనయే చేయవలసినది. ఆ ’మేనేజిమెంటు’ పాఠమునే సుగ్రీవుడు అర్థాంతరన్యాసమున చెబుతాడు.

9)
తుమ్హ చ్చిఅ ఎస భరో అణామేత్తప్పలో పహుత్తణసదో |
అరుణో ఛాఆవహణో విసహం విఅసంతి అప్పణా కమలసరా||
ఛాయ:
యుష్మాకమేవైష భర ఆజ్ఞామాత్రఫల ప్రభుత్వశబ్దః|
అరుణశ్చాయావహనో విశదం వికసన్త్యాత్మనా కమలసరాంసి||

"ప్రయత్నమంతయునూ మీది. ఆజ్ఞాపించుటయే ప్రభువునకు మిగిలిన కార్యము. ఉదయించుట మాత్రమే భానుని వృత్తి. ఆపైన కమలములు తమంతట తామే వికసించును". 

సుగ్రీవుని ప్రసంగము ముగిసిన పిదప జాంబవంతుడు కార్యాకార్యవిచక్షణ గురించి ప్రస్తావిస్తాడు. కాగల కార్యమును గురించి చక్కగా వివేచించి, సంభాషణా రూపమున కార్యాకార్యవిచక్షణ చేసే పద్ధతిని ప్రవరసేన తదనంతర కవులైన భారవి, మాఘుడు తమతమ కావ్యములలో అనుసరించటం స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యముగా భారవి ఈ విభాగమును చక్కగా మనసునకు పట్టించుకొన్నాడు. ధర్మరాజు చేత కిరాతార్జునీయమున "సహసా విదధీత నక్రియామ్.." అన్న ప్రముఖ శ్లోకమును చెప్పించి, కావ్యంలో అడుగడుగునా ఆ శ్లోక వ్యాఖ్యానమునకు తగినట్టు ముఖ్యపాత్ర (ధర్మరాజు) స్వభావమును ఆ కవి తీర్చిదిద్దినాడు. 

వాల్మీకి మహర్షి. సేతుబంధకారుడు కవి. ప్రాకృతకవి ఆదికవిని యంతరంగమున నిలుపుకొని, స్వీయ ప్రతిభను రంగరించి, అద్భుతకావ్యమునకు ప్రాణము పోసినాడు. సేతుబంధమునకు మూలము వాల్మీకి రామాయణ యుద్ధకాండమంటిమి. కావ్యమున ముఖ్యరసము వీరము. వీరరసమునకు స్థాయీభావముత్సాహము. అద్భుతము పోషకరసము. ఒక్క ఘట్టమున రావణరాజ్యమందలి దనుజులకూ, వారల స్త్రీలోకమునకు మధ్య యించుక శృంగారమును, మిగిలిన తావుల భయానకమును, భీభత్సమును, రౌద్రమును కవి నిలిపినాడు. అద్భుతమును కవి చాలాచోట్ల అసమానముగ పోషించెను. 

సేతుబంధకవి ప్రధానముగ ’నుత్ప్రేక్ష’కు పెద్ద పీట వేసినాడు. వర్ణనలకు విలక్షణమైన, విభిన్నమైన వస్తువుల నెంచుకొనుట ఈతని యలవాటు. దీనికి ఇదివరకే దృష్టాంతములను చూచినాము (ఉదా 2,3 ). వాల్మీకి ’రామాయణ’మున సేతునిర్మాణము సులభముగా ఆరంభమవుతుంది. అది ’రామాయణము’ కనుక. ’సేతుబంధ’ మున కవి కావ్యావసరమున ఈ ఘట్టమును పెంచటమే కాక, ఔచిత్యవంతంగా, రసపరిపుష్టంగా తీర్చినాడు. వాల్మీకములో రాముడు సముద్రునిపై బ్రహ్మాస్త్రమును కేవల మెక్కుపెట్టుతాడు. సేతుబంధమున రాముడు సముద్రునిపై శరములను సంధిస్తాడు. ఫలితముగా అల్లకల్లోలమైన సముద్రమును మనోహరముగా, అద్భుతముగా ప్రాకృతకవి వర్ణించినాడు.

సుగ్రీవుని ప్రసంగము, ఆపై జాంబవంతుని పర్యాలోచనమూ అయిన పిమ్మట రాముని శరసంధానము, ఆపై గంగతో కూడిన సముద్రుడు రామచంద్రుని శరణు వేడుట, సేతునిర్మాణ సూచన చేయుట విపులముగా కవి వర్ణించినాడు. సేతునిర్మాణమునకు తీర్మానమయినది. ఎట్టకేలకు సేతునిర్మాణం చేయటానికి కపిసైన్యము పూనుకొన్నది. కానీ ఒక క్రమపద్ధతిని కార్యము సాగుట లేదు. కపులు పెకలించుకుని వచ్చు పర్వతములను, శిలలను సముద్రజంతుజాలము మ్రింగివేస్తున్నై.

10)
స అలమహివేఢ విఅడో సిహరసహస్స పడిరుద్ధరఇరహమగ్గో |
ఇఅ తుఙ్గో వి మహిహరోతిమిఙ్గలస్స వఅణో తణం వ పణట్టో||
ఛాయ:
సకలమహీవేష్టవికటః శిఖరసహస్రప్రతిరుద్ధరవిరథమార్గః |
ఇతి తుఙ్గోऽపి మహీధరతిమిఙ్గిలస్య వదనే తృణమివ ప్రనష్టః ||

’పుడమియంత విశాలమై, వేలశిఖరాలతో కూడి, గగనతలంలో భాస్కరుని మార్గమునడ్డగించు ఉన్నతములైన పర్వతములు కూడా, సముద్రములో పడవైచినప్పుడు తిమిఙ్గలములనోట బడిన గడ్డిపరకల వలే నశించుచున్నవి.’

ఈ కల్పన వాల్మీకి రామాయణములో లేదు. వాల్మీకి రామాయణమున రాముడు విశ్వకర్మ ఔరసపుత్రుడైన నలునకు సేతువు నిర్మించుటకాదేశమివ్వడమూ, ఆపై సేతువు నిర్మాణమునూ క్లుప్తముగానే ఉన్నది. సేతుబంధకారుడు ఈ ఘట్టమును పెంచి, సేతుబంధసమయమున సాగరమున జరుగు కల్లోలమును విధవిధములుగా వర్ణిస్తాడు. ఆపై సేతునిర్మాణము క్రమపద్ధతిని జరుగకపోతే సుగ్రీవుడు నలుని నేత నియమిస్తాడు. యజమాని అయిన సుగ్రీవుడు స్వయముగా నలుని కాదేశమివ్వడం ఔచిత్యవంతం. సముద్రపు తీరును వర్ణించుట రసపోషకము. 

కావ్యవిస్తృతి

ఇండోనేసియాలోని జావాద్వీపంలో ’యోగ్యకార్త’ అనేచోట తొమ్మిదవ శతాబ్దమునకు పూర్వము నిర్మించిన ’పరంబనన్’ యను హిందూదేవాలయమున్నది. అచ్చటి విష్ణుమందిరముననున్న ఈ శిల్పాన్ని చూడండి.




కోతులు శిలలను మ్రోసి తేవడం, సముద్రమందు పడవేయడం, ఆ శిలలను జలచరములు మ్రింగటం, ఈ శిల్పంలో చెక్కారు. జావా, కంబోడియా ఇత్యాది దేశాలలో ప్రాకిన రామాయణ సంస్కృతి భారతసంస్కృతి అయినా, అది వాల్మీకేతరము, సంస్కృత, ప్రాకృత ప్రబంధకావ్యసంబంధమైన సంస్కృతి అది. ఆ శిల్పమునకు మూలము సేతుబంధమునందలి కల్పన అయ్యే అవకాశం ఉంది లేదా సేతుబంధమును అనుసరించిన యితర కవుల రచన యేదో ఈ శిల్పరచనకు మూలము కావచ్చు. తెలుగున మహాకవయిత్రి మొల్ల రామాయణమందు "సముద్రమునఁ బర్వతములను మ్రింగివేయు మహా మత్స్యముల" గురించిన ప్రస్తావన యున్నది.  

మలయా రామాయణమైన 'హికాయత్ సెరి రామ’ యందును, ఆ రామాయణమును అనుసరించుచు సాగిన శిల్ప, చిత్ర, నృత్యాదులందును సేతుబంధఘట్టమున మహామత్స్యములు చేకూర్చిన విఘ్నము గురించి ప్రస్తావన ఉంది. థాయి దేశమందున్న Emerald Buddha (Wat Phra Kaeo Temple) దేవాలయమందున్న పద్దెనిమిదవ శతాబ్దమున ఉద్దరించిన చిత్రములివి.




శిలను మింగుచున్న జలచరములను హనుమ సంహరించుట.


క్రీ.శ. తొమ్మిదవ శతాబ్దమున కాంభోజదేశ (Cambodia) ప్రభువైన యశోవర్మ, అక్కడ ప్రముఖ (Angkor Wat) దేవాలయమునకు పూర్వదిశలో ఒక సుదీర్ఘమైన కృత్రిమ తటాకము ను దీర్ఘచతురస్రాకారమున నిర్మించి ఆ తటాక మధ్యమున సుమేరు పర్వతపు దేవాలయమును (East Mebon) ప్రతిష్టించినాడు. క్రీ.శ. ఇరువదవ శతాబ్దమున శిథిలమైన ఆ తటాకపు నలుమూలల యందు రాతిఫలకలయందు సంస్కృత శాసనములు దొరికినాయి. ఆ శాసనములలో నొక శ్లోకంలో సేతుబంధకావ్య ప్రస్తావన ఉన్నది.

(Eastern Baray stele inscription of Yasho-Varman - 34)

యేన ప్రవరసేనేన ధర్మసేతుం వివృణ్వతా |
పరః ప్రవరసేనోపి జితః ప్రాకృతసేతుకృత్ ||

మొదటి ప్రవరసేనుడు (కాశ్మీరప్రభువు) ధర్మసేతువును నిర్మింపగా, అన్య ప్రవరసేనుడు సామాన్య సేతువు (లేదా సేతువను ప్రాకృత కావ్యమును) నిర్మించెను.  

ప్రవరసేనుని కీర్తి, సేతుబంధకావ్యము విస్తృతముగా దేశవిదేశాలలో ప్రచారమైనట్టు ఆ శాసనం వల్ల తెలుస్తోంది.

ప్రధానఘట్టము

దక్షిణ సముద్రానికి ఇటువైపునున్న మలయపర్వతానికి, లంకయందున్న సువేలపర్వతానికి మధ్య గిరిసేతుబంధము నలుని అధ్వర్యంలో పూర్తి అయింది.వాల్మీకి రామాయణ సేతువులో వృక్షములు, శిలలు, పర్వతములు ఉపయోగిస్తే, ప్రాకృతకావ్యమున సేతునిర్మాణము శిలలతో జరిగింది. ఆ సేతువును ప్రాకృతకవి హృదయంగముగను, ఒక్కొక్కపరి భీతావహముగనూ వర్ణించినాడు.

11)
మలఅసువేలాలగ్గో పడిట్ఠిఓ ణహణిహమ్మి సాగరసలిలే |
ఉఅ అత్థమణణిరాఓ రవిరహమగ్గో వ్వ పాఅడో సేఉవహో ||
ఛాయ:
మలయసువేలాలగ్నః పరిస్థితో నభోనిభే సాగరసలిలే |
ఉదయాస్తమననిరాయతః రవిరథమార్గః ఇవ సేతుపథః ||

మలయ, సువేల పర్వతములను కలుపుచూ అంతరిక్షము వలే శోభిల్లు సాగరము మధ్య చక్కగ నిలబడిన సేతువు, ఉదయాస్తమముల మధ్య తిరుగు ఆదిత్యుని రథమార్గము వలే ప్రకాశిస్తోంది.     

12)
అహ థోరతుఙ్గవిఅడో ణేఉం ణిఅణం సవన్ధవం దహవఅణమ్|
దోహాఇ అసలిలణిహీ కఅన్తహత్థో వ్వ పసరిఓ సోఉవహో ||
ఛాయ:
అథ స్థూలతుఙ్గవికటో నేతుం నిధనం సబాన్ధవం దశవదనమ్ |
ద్విధాయితసలిలనిధిః కృతాన్తహస్త ఇవ ప్రసృతః సేతుపథః||

లంకకు కట్టిన సేతువు, సాగరమును రెండుగా విడగొట్టుచూ, యముని హస్తమువలె పొడవుగనూ, భయంకరముగను, రావణుని, అతని బంధువర్గమును మరణమునకు కొనిపోయేటట్టు ఉన్నది. 

నిర్మాణమునకు సారథి సూర్యుని అంశ అయిన సుగ్రీవుడు. కార్యము రవికులజుడైన రామునిది. వారి అధ్వర్యమున నిర్మితమైన సేతువు రవిపుత్రుడైన యముని హస్తం లాగా సముద్రమధ్యమందున్నది. ఇచ్చట నున్నది కేవలమొక ఉత్ప్రేక్ష కాదు, ఒక నిర్జీవమైన సేతువు అన్న వస్తువునకు, జీవంతమైన యముని చేయి అనే పోలిక. ఇది యెంత భీతావహంగా ఉందో సహృదయులూహింపగలరు. 

కపి సేన వారధిని గట్టి లంకలోని సువేలపర్వతమును చేరినది. కవి సువేలమును వర్ణించుచున్నాడు. సువేలపర్వతవర్ణన విషయమున ప్రాకృతకవి నిజముగా "ప్రాకృత" కవి అనిపిస్తాడు.ఈ ఘట్టంలో మాఘ ప్రవరసేనులను పరిశీలించాలి.

మాఘుడు vs ప్రవరసేనుడు

ప్రవరసేనకవి తర్వాత మహాకావ్యకర్తలలో భారవి ప్రథముడు. భారవి కిరాతార్జునీయాన్ని అనుసరించినా, ఆ అనుసరణలో స్వాతంత్ర్యమును నిలుపుకోవటమే కాక, సంస్కృతకావ్యాన్ని మరొక స్థాయికి చేర్చిన కవి మాఘుడు. ఈ కవిని గురించి మల్లినాథసూరి అంతటి పండితుడు "మాఘే మేఘే గతం వయః" అని ఉటంకించాడు. మాఘుని అనుశీలించడంలో మల్లినాథసూరికి అర్ధజీవితము చెల్లిపోయినదట. 

మాఘుడు మహాకవి, మహాపండితుడు, అనేక శాస్త్రములలో దిట్ట . సరస్వతి ఆయన జిహ్వాగ్రనర్తకి. ఆయన భాష హస్తామలకము. చిత్రకవిత్వాదులలో మహాధీమణి. ఒక మహాపర్వతమును జూచి నిశ్చేష్టితుడై విస్మయపడు వ్యక్తి ఒకడైతే, ఆ పర్వతము యొక్క అంతు చూడాలని, శిఖరాగ్రమునకెక్కి చేతులు సాచి ఆనందపడవలెనని కోరెడు వాడు మరొకడు. మాఘుడు ఈ రెండవ కోవకు చెందుతాడు. "నియతికృత నియమ రహిత" మైన కవిత్వమది. అయిననూ ఆయన కవిత్వమందు భావుకత్వపు పాలు కంటే పాండిత్యపు రుచి ఎక్కువ.  భావుకత్వము లేకపోలేదు కానీ, ఆయన ఆ భావుకత్వమున మునుగుట లేదు, దానిని యధిగమించి ముందుకు సాగటం ఆ కవికి ప్రియమైన విషయం.  

శిశుపాలవధమ్ నాలుగవ సర్గలో రైవతక పర్వతవర్ణన యున్నది. ఈ వర్ణన కావ్యములో ముఖ్యమైన ఘట్టము. ఈ సర్గ అంతటా, కవి ఏకఛందస్సును కాక పలు ఛందస్సులనుపయోగించినాడు. పర్వతమును విభిన్న రీతులలో వర్ణించుటకు ఇది కవి ఏర్పరచుకొన్న శిల్పము. వర్ణన మొదలు పెట్టిన నాలుగవ శ్లోకముననే కవి పర్వతమును హిరణ్యగర్భునితో పోల్చి ఉత్ప్రేక్షించినాడు.

సహస్రసంఖ్యైర్గగనం శిరోభిః పాదైర్భువం వ్యాప్య వితిష్టమానమ్ |
విలోచనస్థానగతోష్ణరశ్మిర్నిశాకరం సాధు హిరణ్యగర్భమ్ ||
(శిశుపాలవధమ్ -4.4)

వేల శిఖరములతో ఆకసమును, వేల పాదములతో భూమిని వ్యాపించి, తన కన్నులుగా సూర్యచంద్రులను నిలుపుకొన్న ఈ పర్వతము హిరణ్యగర్భుని (బ్రహ్మను) స్ఫురింపచేస్తోందొ. దానిని శ్రీకృష్ణుడు చూచెను.     

పాండిత్యము, ఘనమైన ఉత్ప్రేక్ష, శ్లేష, అక్షరవిన్యాసము అన్నియును ఒక్కచోట అమరిన శ్లోకమిది. కవియే భగవంతుడైన శ్రీకృష్ణుని కన్నులతో పర్వతాన్ని చూస్తున్నట్లుంది.  

ఈ సర్గయందు స్థూలంగా ఇదే రీతి కానవస్తుంది. ఒక్కొక్కపరి లలితమైన శబ్దముల కూర్పు (రాజీవరాజీవశలోలభృంగం...4.9) కద్దు. సూర్యచంద్రులను పర్వతమునకు రెండువైపుల వ్రేలాడు ఘంటలుగ నుత్ప్రేక్షించి ’ఘంటామాఘుడు’ గా కీర్తి గడించిన శ్లోకమీ ఘట్టములోనే సిద్ధము. పాండిత్యాన్ని రంగరించిన మాఘుని విస్మయము ఈ క్రింది పద్యంలో చూడండి.

దృష్టోऽపి శైలః స ముహుర్మురారేరపూర్వవత్ విస్మయమాతతాన |
క్షణే క్షణే యన్నవతాముపైతి తదేవ రూపం రమణీయతాయాః ||
(శిశుపాలవధమ్ -4.17)

చూచుటకు పర్వతము. కానీ శ్రీకృష్టునకు తిరిగి చూడగా అపూర్వమైన విస్మయము పొడమినది. క్షణక్షణమునకు నవ్యత్వమును పొందుటయే గదా రామణీయత!

ఇక్కడ ’విస్మయము’ అన్నదాన్ని వాచ్యంగా చెప్పినా అద్భుతమైన పద్యపాదాన్ని దృష్టాంతంగా చెప్పి, శ్లోకాన్ని మరువలేని విధముగా తీర్చినాడు. రమణీయమైన యే పదార్థాన్ని చూసినా ఈ శ్లోకము తట్టే అవకాశం ఉంది. ఇది ఒక RC. (Reference Context). 

మాఘుని వర్ణనలను ఇంకా వర్ణింపడానికి ఇక్కడ చోటు చాలదు. ఆయన రీతిని స్థూలముగా చెప్పుకోవటానికి ఇంతటి ప్రయాస. 

మాఘకవితో పోల్చి చూస్తే, మన ప్రాకృతకవి ముఖ్యంగా భావుకుడు. సువిశాలమైన ప్రకృతి ఈయనకు కవిత్వరంగస్థలము. అంబరమును గానీ, ఆర్ణవమును కానీ,ఒక గొప్ప పర్వతమును లేదా మనసు పడినట్టి యే వస్తువందైనా, ఈయనకు మైమరపు హెచ్చు. కవిత్వము/కవిత్వశిల్పము/కవిత్వనిర్మాణవైచిత్రి ద్వారా వస్తువును అధిగమించి, ఆక్రమించాలనే ఆశ కన్నా, ఒడలు మరచి విస్మయపడుట ఈయన వంతు. ఈయన వర్ణన చదివిన పాఠకునకు కవి చూపిన భావమే నిలుస్తుంది కానీ, కవి చెప్పిన శ్లోకము గుర్తు రాదు. దృశ్యకావ్యములలో భాసునిది ఈ పద్ధతి.  కవిత్వమందు భావుకత్వమే ప్రధానము. ఛందస్సు, పదలాలిత్యము, శిల్పము వంటివి పక్క వాయిద్యములే తప్ప ప్రధానములు గావు. 

ప్రవరసేనుని సువేలపర్వతము ఇలా ఉంది.

13)
పాఆలభరిఅమూలం వజ్జముహాఓడణట్ఠవిఅణికమ్పమ్ |
ఆలాణక్ఖంభం మివ సురహత్థిక్ఖంధణిహసమసిణిఅపాసమ్ ||
ఛాయ:
పాతాళభృతమూలం వజ్రముఖాకోలనస్థాపితనిష్కంపమ్ |
ఆలానస్తంభమివ సురహస్తిస్కంధనిఘర్షమసృణితపార్శ్వమ్ ||

సువేలపర్వతమూలములు పాతాళలోకమునకు వ్యాపించినై. పిడుగుతో భూమిలోనికి దిట్టముగా సీల దిగగొట్టబడినట్టు ఈ పర్వతము నిశ్చలంగా ఉంది. దిగ్గజాలను గొలుసులతో కట్టటానికి ఏర్పరిచిన గుంజెలాగా ఉంది. ఆ దిగ్గజముల ఒంటి రాపిడిచేత నునుపు తేలియున్నది.

మాఘునకు పర్వతాగ్రము మీద గురి ఐతే, సేతుబంధకారుడు ఆ పర్వతమునొక్క గుంజెవలె గాంచి విస్మయపడినాడు. పర్వత వర్ణన కొంత అయిన తర్వాత ఆ పర్వతపు సానువులందు జీవించు అరణ్యమృగాలపైనా, వాటి సహజ జీవనముపైనా కవి దృష్టి సారించినాడు. మాఘుని దృష్టి పర్వతముపైని విద్యాధరులపైనా, రత్నరాశులు ఇత్యాది వస్తువులపైన అమరినది.  

మాఘుని ’ఘంట’ ను, అందులో ఏనుగును చూశాం. ప్రవరసేనుని ఏనుగు వెన్నెల రాత్రుల్లో వర్ణన ఇది.

వెన్నెల రాత్రిలో సువేలపర్వతము ఐరావతము లా ఉంది. ఆ ఐరావతము బురదలో క్రీడించి, ఒంటిపై బురదను చల్లుకున్నట్టు అక్కడక్కడా, పర్వత సానువులను ఆనుకుని, మేఘపు శకలాలు కనిపిస్తున్నై. నాళము తెగిన తామరపువ్వుని యెత్తిపట్టుకున్న విధంగా ఆ పర్వతం పైన చంద్రబింబము కనిపిస్తోంది. 

ఇచ్చట బురదలో క్రీడించు యేనుగు ప్రవృత్తిని, చంద్రుని పంకజముతో పోలికను, స్థిరత్వాన్ని అన్నిటిని ఒక్కపట్టున జూపి చకితుని చేస్తున్నాడు కవి. వెన్నెలలో ఓ యేనుగు - తామరపువ్వునెత్తి పట్టి నిలబడటం - అనుభవైకవేద్యమైన చిత్రము ఆ  కొండ అలా ఉందట!  

ప్రవరసేనుని కవిత్వము హ్లాదైకమయమైననూ, నియతి యున్నది. ముఖ్యంగా పానగోష్టి, శృంగారాది వర్ణనల్లో, సుగ్రీవుని మాటల్లో అది కానవస్తుంది. భావుకత్వమును దాటిన పాండిత్యము కానరాదు. మేధోవర్తిత్వముకన్నా హృదయవర్తిత్వము హెచ్చు. అనేకపట్టులలో  సేతుబంధమున కావ్యనాయకుడైన రాముడు మానవుఁడు కాడు. హరి అవతారము కూడా కాడు. సాక్షాత్తూ హరియే.

ఒక్క మాటలో చెప్పాలంటే - ప్రవరసేనుడు ఆంధ్రభోజుడు శ్రీకృష్ణరాయలకు పెట్టు. విచిత్రమేమంటే, రాచకవులైన రాయలు, ప్రవరసేనులకు ప్రాకృతికదృష్టి ఎక్కువ, కవివతంసులైన మాఘకవి బోంట్లకు పాండిత్యముపైనా, వస్తువుకన్న కవిత్వనిర్మాణముపైనా రుచి. ఇది గొప్ప వింత. 

విచిత్రచమత్కృతులతో, శబ్దార్థవైభవముతో మెరిసే మాఘుని కవిత్వం సరస్వతిమాత గళాభరణము. మాఘునితో పోలిస్తే, ప్రవరుని కవిత చక్కగా పాదుతీర్చిన పూలతీవె. మాఘుని కవిత్వము రత్నఖచితసువర్ణమయసోపానపంక్తి. ప్రవరసేనుని కవిత్వము సాగరముపై నిర్మించిన విస్మయావిష్ట జనకమైన సేతుబంధము.     

సువేలపర్వతమును వర్ణించిన పిదప ప్రవరసేనుడు అక్కడి అరణ్యజీవనాన్ని రోచకంగా వివరిస్తాడు. విస్తరభీతిచేత ఒక్క శ్లోకం చూద్దాం. ఆ పర్వతసానువులందలి యరణ్యంలో కరి-కేసరి పోరాటమీ విధంగా ఉన్నది.

14)
కుమ్భోవగ్గణణివడి అకరిహత్థుక్ఖుడిఅసీహకేసరభారమ్|
సహఅరివిరుఆఅణ్ణణవలన్తభమరపరివత్తిఅలఆకుసుమమ్ ||
ఛాయ:
కుమ్భావక్రమణ నిపతిత కరిహస్తఖండిత కేసరభారమ్|
సహచరీ విరుతాకర్ణన వలద్భ్రమర పరివర్తిత లతాకుసుమమ్||

సింహం యేనుగు కుంభముపైకి లంఘించి, దానిని పడగొట్టింది. అంతలోనే హస్తి తన తొండంతో సింహమునందుకుని, దాని కేసరములను పట్టి చీల్చి, విదిలించి పారేసింది. అలా పారేయగా క్రిందపడిన సింహపు పసుపుపచ్చని జూలు - సహచరి పిలుపు విన్న ఒక తుమ్మెదను -  తన చుట్టూ తిప్పుకుంటున్న లతాకుసుమములా ఉన్నదట.  

రెండు సుదీర్ఘసమాసాలతో, సందర్భమును బట్టి కూర్చిన ఓజోగుణభరితమైన వర్ణన ఇది. ఈ భావము యెంత స్వతంత్రంగా ఉందో గమనించండి! సహచరిని తనచుట్టు తిప్పుకొను లతాకుసుమమట! ఏనుగుతో పోట్లాటఫలితమున కేసరములను యనగా అందమును కోల్పోయిన కేసరి సౌందర్యహీనతను గురించిన ధ్వని ఎంత నవ్యంగా ఉందో చూడండి!

రావణుని మానసిక అవస్థ

సేతుబంధము పదకొండవ ఆశ్వాసంలో, సీతకు రావణుడు రామచంద్రుని మాయాశిరమును చూపటాన్ని, ఆ శిరాన్ని చూసి సీత భయోద్వేగంతో మూర్ఛపోయి, అటుపై అనేకవిధాలుగా విలపించటాన్ని, త్రిజట యను రక్కసి సీతను ఊరడించి, ధైర్యము చెప్పటాన్ని చిత్రించాడు కవి. సీతవిలాపం - సంస్కృత, ప్రాకృతకావ్యాలలో శిఖరాయమానమైనది. ఈ ఆశ్వాసంలో మొదటి ముప్పై అయిదు శ్లోకములలో రావణుని తీవ్ర ఉన్మత్తావస్థను కవి మహానైపుణ్యముతో చిత్రించినాడు. రాముడు కపిసేనతో కూడి యుద్ధమునకై లంకకు ఏతెంచిన వార్త విని రాక్షసరాజుకు నిద్రపట్టటం లేదు. సీతమీది మోహము వేధిస్తోంది.
  
15)
తం పులఇఅమ్మి పేచ్ఛఇ ఉల్లవన్తో అ తీఅ గేహ్ణఇ గోత్తమ్ |
ఠాఇ అ తస్స సమఅణే అణ్ణమ్మి వి చిన్తిఅమ్మి స చ్చిఅ హిఅఎ ||
ఛాయ:
తాం ప్రలోకితే పశ్యత్యుల్లపంశ్చ తస్యా గృహ్ణాతి గోత్రమ్ |
తిష్టతి చ తస్య సమదనేऽన్యస్మిన్నపి చిన్తితే సైవ హృదయే ||

చూచిన ప్రతిచోటనూ సీతముఖమే కనిపించుచున్నది. మాటాడిన ప్రతి మాటయందునూ ఆమె పేరే దొర్లుతున్నది. ఆమెను మరచుటకు ప్రయత్నము చేసే కొద్దీ, ఆమెయే హృదయమందు నిలుచుచున్నది. 

ఈ ఘట్టములో దశకంఠుని అవస్థ - మయసభలో పరాభవమందిన కురురాజు దుర్యోధనుని మనఃస్థితిలా ఉంటుంది. ఆ అవస్థను నివారించుటకు దశవదనుని పత్నులు విఫలప్రయత్నము చేస్తారు. ఈ దురవస్థను అతను సైపలేక చివరకు ఈ విధముగా చింతించినాడు. "జనులు తమ ఆశలు శిథిలమయినప్పుడు, తమకు రక్షణ కరవైనపుడు, మిత్రులు దొరకనపుడు భయము చేత లజ్జను విడనాడి తమ నియమముల నతిక్రమింతురు." 

ఈ విధముగా క్రూరముగా చింతించి, రాక్షసరాజు భటులకు రాముని యొక్క ఖండిత మాయాశిరమును తయారు చేయమని ఆదేశిస్తాడు. ఆ తలను చూపి భీతావహురాలైన సీతను స్వాధీనము చేసుకోవచ్చు అన్న కర్కశమైన కాంక్ష అతనిది. దశవదనములతో దనుజరాజు భటులకు యాజ్ఞనిచ్చునప్పుడు రావణుని (అవస్థ) వర్ణన ఇది. ఉన్మత్తతకు పరాకాష్ట!

16)
అణ్ణేణ సమారద్ధం వఅణం
అణ్ణేణ హరిసగహి అప్ఫిడిఅమ్ |
అణ్ణేణ అద్ధభణిఅం ముహేణ
అణ్ణేణ సే కఇ వి ణిమ్మవిఅమ్ || 
ఛాయ:
అన్యేన సమారబ్ధం వచనం
అన్యేన హర్షగృహీతస్ఫేటితమ్ |
అన్యేనార్ధభణితం ముఖేన
అన్యేనాస్య కథమపి నిర్మాపితమ్ ||

మొదటి ముఖము మాటలు మొదలు పెట్టింది. ఇంకొక ముఖము రాక్షసానందముతో ఆ మాటలనందుకొన్నది. ఆపై మాటలు రాక మరొక ముఖము మాటలాడెను. చివరన యెటులో మరొక ముఖముతో ఆజ్ఞను ముగించెను.

రావణాసురుని మనమునందున్న తీవ్రమైన అరిషడ్వర్గవిన్యాసము ముప్పది ఐదు శ్లోకములలో చిత్రింపబడి, పై శ్లోకమందు శిఖరాగ్రము నందుకొన్నాది.

సేతుబంధకారుని సీతాదేవి అసహాయ. అయినప్పటికీ ధీర. పరమ ముగ్ధ కాదు. ఆమె మాటలలో రాచకన్య యొక్క ధీరత్వము, ప్రతీకారేచ్ఛ కానవస్తుంది. సీతయందు ప్రవరసేనుడు నిలిపిన ధీరత్వపు ఛాయ ’కుందమాల’ అనే నాటకంలో కానవస్తుంది. జానకిని ఊరడించుట త్రిజట వంతైనది. సేతుబంధకవి రాముడు సాక్షాత్తు నారాయణుడు. ఈ విషయమును త్రిజట ముఖమున కవి చెప్పించినాడు. చివరకు వానరుల యుద్ధసంరంభమును, భేరీ నినాదములను విని సీత ఊరడిల్లుతుంది.

ఈ ఆశ్వాసములో సేతుబంధకారుడు సీతయొక్క పాత్రచిత్రణనూ, రావణుని ఉన్మత్త మానసిక అవస్థను అపూర్వముగా చిత్రించినాడు. పూర్వఘట్టములందు సుగ్రీవుని పాత్రచిత్రణమును, నాయకత్వప్రతిభను గురించిన ప్రస్తావన ఇదివరకు ఉటంకింపబడినది.

యుద్ధము మొదలైనది. వానరయోధుని బలమును, పరాక్రమమును కవి చిత్రించుచున్నాడు. 

17)
కఇవచ్ఛత్థలపరిణఅణిఅఅముహత్థమిఅదన్తిదన్తప్ఫలిహమ్ |
ణిహఅ భడ మహిఅ ణివడిఅ సురవహుచల వలఅ ముహలపవ అవఇవగమ్ ||
ఛాయ:
కపివక్షఃస్థలపరిణత నిజముఖాస్తమిత దన్తిదన్తపరిఘమ్ | 
నిహత భట మహిత నిపతిత సురవధూచల వలయ ముఖరప్లవగ గతిపథమ్ ||

అసురసైన్యం తాలూకు యుద్ధగజమొక్కటి ఒకానొక వానరయోధుని పాషాణసదృశమైన వక్షఃస్థలమును తన కొమ్ములతో కుమ్మింది. ఆ అదటుకు వానరశ్రేష్టునికి యేమీ నొప్పి కలుగలేదు కానీ, గజము యొక్క దంతము మాత్రము వెనుకకు వంగి దానిముఖమునందే చొచ్చినది. ఇచ్చట వానరయూధుల దేహదారుఢ్యము వ్యంగ్యము. 

రౌద్రభీభత్సములు - కవిహృదయము - అనుశీలనము

యుద్ధరంగాన్ని గురించి వర్ణించటం, వివరించటం సంస్కృత సాహిత్యాలలో మహాభారతకాలం నుంచీ ఉంది. దృశ్యకావ్యాల్లో యుద్ధాలు, వధ ప్రత్యక్షముగా చూచించరాదని నాట్యశాస్త్రనియమమున్నది కానీ శ్రవ్యకావ్యములలో అట్లాంటి నిబంధన ఏదీ లేదు. అందు చేత యుద్ధమును భీభత్స, వీర, రౌద్ర రస పరిపోషకంగా కవులు తీర్చియున్నారు. రణరంగంలో లూనశీర్షము - అనగా ’తెగిన తల’ గల మొండెమును వర్ణించుట ఒక ఆనవాయితీగా సంస్కృత, ప్రాకృతకావ్యములలో నిలచింది. కదనరంగమున సహస్రపూరణము అన్నది ప్రసిద్ధమైన విషయము. అనగా, యుద్ధమున వేయి తలలు త్రెగితే, మరణించిన కళేబరాలనుండి ఒక్క తలలేని మొండెము (కబంధము) లేచి నర్తనమాడుతుందట. తలలేని మొండెమునకు కబంధమని పేరు. ఇది ఒక కవిసమయం. వివిధ కవులు తమ కావ్యములలో ఈ కవిసమయాన్ని ఉపయోగించినారు. అలాంటి వర్ణనలను పరిశీలించి చూద్దాం. 

కాళిదాసు: 
కశ్చిద్ద్విషత్ఖడ్గ హృతోత్తమాఙ్గః సద్యః విమానప్రభుతాముపేత్య |
వామాఙ్గసంసక్తసురాఙ్గనః స్వం నృత్యత్కబంధం సమరే దదర్శ ||
(రఘు. 7.51)

సమరాంగణములో ఒక యోధుడు శత్రువుతో పోరాడగా, శత్రువాతని శిరమును ఖండించినాడు. వెంటనే యోధుడు అసువులు బాసి, స్వర్గమునుండి తనకై వచ్చిన విమానమధిరోహించి, ఆ విమానమున పక్కనున్న అప్సరను కౌగిలించి, (సహస్రపూరణమగుట చేత) నృత్యము చేస్తున్న తన మొండెమును చూచినాడు.

ఇచ్చట కశ్చిద్ద్విషత్ఖడ్గ హృతోత్తమాఙ్గః = ఒకానొక శత్రువు చేత ఖండింపబడిన బడిన శిరముగల వీరుడు - అన్నచోట భీభత్సప్రతీతి. వామాఙ్గసంసక్తసురాఙ్గనః = ఎడమవైపు కౌగిలించిన అప్సర (గలవాడు) - ఇది శృంగార అభివ్యక్తి. ఈ రెండు సమాసములకు మూలమైన రణోత్సాహము వీరరసము. అంటే, భీభత్స వీర శృంగారములు ఒక్కచోట కలిసినై. భీభత్స శృంగారములు వైరిరసాలు.  వీటినొక్కచోట కలుపుట రసవిరోధహేతువవుతుంది కాబట్టి, ఒక్కపట్టున ఉపయోగించడం కూడదని ఆలంకారికులంటారు. అయితే, కాళిదాసు శ్లోకంలో - రసవిరోధం లేదు, రసవిరోధాన్ని పరిహరించటానికి రెండు రసముల మధ్య యెడముగా వీరరసమున్నది. కనుక ఇది అనౌచిత్యము కాదు. అదేవిధంగా భీభత్సమునకు కబంధము, శృంగారమునకు వీరుని దివ్యశరీరము ఆలంబనమగుట వలన రసవిరోధము లేదు. ధ్వన్యాలోకమున, కావ్యప్రకాశమున రసవిరోధప్రకరణమున ఇదే విధమైన ఉదాహరణము చెప్పారు. (భూరేణుదిగ్ధాన్నల - ధ్వన్యాలోకము 3.102,103,104, కావ్యప్రకాశము - 7.334,335)

కుమారదాసు:
వధాయ ధావన్నభిశత్రువిద్విషః శరేణ కృత్త్యచ్యుతమస్తకోऽపరః |
హృతాయురప్యాదికృతేన కానిచిత్పదాని వేగేన జగామ రాక్షసః || (జానకీహరణము -5.40)

ఒక రాక్షసయోధుడు తన శత్రువైన రాముని వధించవలెనని అభిముఖంగా వేగముగా పరిగెత్తుతూ రాగా, అతని శిరస్సును రాముని శరము ఖండించింది. ఆయువు కోల్పోయినప్పటికీ వేగమును నిలుపుకోలేక రాక్షసుని కబంధము కొన్ని అడుగులపాటు ముందుకు నడిచినది (కళ్ళకు కట్టించే దృశ్యం యిది).

ప్రవరసేనుడు:
18)
బన్ధువహబద్ధవేరం సహస్సపూరణకబన్ధజణి ఆమోఅమ్ |
వడ్ఢఇ భడదిణ్ణరసం భుజపవ్వలపహుఅవీరపడణం జుజ్ఝమ్ ||
సంస్కృతఛాయ:
బంధువధబద్ధవైరం సహస్రపూరణకబంధజనితామోదమ్ |
వర్ధతే భటదత్తరసం భుజప్రబలప్రభూతపరిపతనం యుద్ధమ్ ||
(సేతుబంధము - 13.64)

బంధువధ కారణంగా పెరుగుచున్న వైరంతో, వేయిశూరులపతనముతో కలిగిన సంతోషంతో (కబంధ నృత్యమునకు హేతువై), భటుల సమరోత్సాహముతో, యోధుల భుజబలము పెచ్చరిల్లగా సంభవించిన శత్రువుల పతనముతో యుద్ధముత్కర్షముగ సాగుతోంది. ఇక్కడ రౌద్రరసప్రతీతి. స్థాయీభావం క్రోధము. శత్రువులు ఆలంబన విభావము. బంధువుల మధ్య వైరము, భుజబలము ఉద్దీపనము. భటుల మోదము అనుభావము. శత్రువుల తలలు తెంచుట యను ఉగ్రత్వము వ్యభిచరీభావము. 

వ్యాసుడు:
కబంధాని సముత్థస్థుః సుబహూని సమన్తతః |
తస్మిన్ విమర్దే యోధానాం సంఖ్యావృత్తికరాణి చ||
హరివంశము (2.36.9)

ఆ ఘోరయుద్ధమున వెంట వెంటనే యనేక శిరములేని మొండెములు లేచి ఆడుతున్నాయి. అది పోరాడి నశించిన యోధుల సంఖ్య ఆవృత్తి అవుతున్నట్లున్నది.

వేయి కళేబరములకొక్క తలలేని మొండెం లేచి నృత్యమాడుతుంది, ఈ శ్లోకంలో అలాంటి కబంధనృత్యము వెంటవెంటనే అనేకమార్లు జరుగుతోంది. అంటే వేల సంఖ్యలో యోధులు నిముషం పాటులో నశిస్తున్నారు. ఇది భయంకత్రమైన రణాన్ని, యుద్ధతీవ్రతనూ  వ్యంజింపజేస్తోంది.  

మాఘుడు: 
సహస్రపూరణః కశ్చిల్లూనమూర్ధాऽసినా ద్విషః |
తథోర్ధ్వ ఏవ కబన్ధీమభజన్నర్తనక్రియామ్ ||
శిశుపాలవధమ్ (19.51) 
యుద్ధరంగమున సహస్రవీరులను మూర్కొనగల శక్తి గల ఒక భటుడు శత్రువుచేత ఖండించబడిన శిరముతో వేయి సంఖ్య పూర్తి అయిన మొండెము వలే నిలబడి నర్తించుచున్నాడు.

భట్టి
సంబభూవుః కబంధాని ప్రోహుః శోణితతోయగాః |
తేరుర్భటాస్యపద్మాని ధ్వజైః ఫేనైరివాబభే ||
(రావణవధ -14.27)

కబంధములు పుడుతున్నై. (వేల మంది యోధులు హతమగుచున్నారు). రక్తపుటేరులు ప్రవహిస్తున్నై. రథములు, భటుల ముఖపద్మములు, ధ్వజములతో కూడి నురగలగుచున్నవి. 

కబంధనృత్యము గురించి ఇంకా పెక్కు కావ్యాలలో ఉటంకింపులు ఉన్నాయి. హర్షచరితములో, బౌద్ధగ్రంథము, పాళీ ప్రాకృతరచన అయిన మిళిందపన్హలో  ’సహస్రపూరణము’ గాక కొంత లెక్క మార్పుతో కబంధ నృత్యప్రస్తావన ఉంది.

వివిధ కవుల సమాంతర యుద్ధవర్ణనలను చూస్తే, కొన్ని విషయము లగుపడుతున్నాయి. సాధారణముగా కాళిదాసు కవి రీతి వైదర్భి. శబ్దప్రయోగములు పరమలలితములు. ఇవి శృఙ్గారరసమునకు ప్రధానముగా సహకరించేవి. ఓజోగుణప్రవిష్టమైన రౌద్ర, భీభత్సములు కాళిదాసు కవిత్వమున అంతగా కనబడవు. అంతే కాక కాళిదాసు శైలి సాధారణంగా సుకుమారమైనది. ఎక్కడో తప్ప, పరుషమైన అక్షరాలను, సంయుక్తాక్షరాలను, దీర్ఘసమాసాలను కావ్యములలో ఆయన కూర్చటానికి విముఖుడు. జానకీహరణకావ్య కర్త అయిన కుమారదాసుడు కాళిదాసునకు పరమ అభిమాని, భక్తుడు. ఈతని శబ్దసౌష్టవము కాళిదాసు కవిత వంటిదే. పై ఉదాహరణంలో పదచిత్రము చక్కగా ఉన్నది. కానీ ప్రత్యేకముగా చెప్పుకొనుటకు ఏమీ లేదు.    ప్రవరసేనుడు ప్రాకృతకవి. ప్రాకృత భాష అనాయాసమైననూ, ఈతని రచనలలో దీర్ఘపదబంధములు, సంయుక్తాక్షరములూ ఎడనెడ కనిపిస్తాయి. సేతుబంధమున శ్లోకము మొత్తమును కేవలము రెండు సుదీర్ఘపదబంధములతో ముగించుట అనేకమార్లు (కావ్యమంతటనూ కలిపి అరువదిమార్లకు పైగా) గమనించవచ్చు. ఈ కావ్యంలోనే కాదు,  గాథాసప్తశతి యందునూ, సుదీర్ఘసమాసము లనేకములు కలవు. భాష ప్రాకృతము కాబట్టి, అట్టి దీర్ఘసమాసములు సంస్కృతములో వలే ఆయాసము కలిగింపవు. సేతుబంధకావ్యము వీరరసప్రధానము కాబట్టి, శైలిలో సరళతకన్నా, బిగువెక్కువ. ఇది కావ్యఘట్టమును బట్టి మారుతుంటుంది. కాళిదాసు వలె, సుకుమారత, మృదుత్వముల వంటి పట్టింపులు ప్రవరసేనకవిలో కనిపించవు. ఈ కవి ప్రధానముగా విభిన్నమైన విలక్షణ భావములను కూర్చుటకు ముచ్చటపడు కవి. యుద్ధవాతావరణమున యుద్ధమును మిక్కిలి నుద్యోతించుచూ, తత్సంబంధిత విషయ విలక్షణతకు ప్రాధాన్యత చూపుతూ, అందుకు తగిన శైలిని ఎంచుకొనునట్టు కనపడును. 

ఇక వ్యాసమహర్షిని గురించి చర్చించటం అవివేకము. మాఘకవి గురించి చెప్పుటకేముంది? "మాఘే సన్తి త్రయో గుణాః". భట్టి కావ్యము యొక్క ఉద్దేశ్యము వ్యాకరణపాఠము చెప్పటం కనుక, ఆ కవిత్వానుశీలనము అనవసరము.

ప్రవరసేనకవి కవిత్వము గురించిన సాధారణ లక్షణాలు ఇలా వింగడించవచ్చు.
  • ఈ కవి భావనాబలమందు, భావనాస్వాతంత్ర్యమునందు, సునిశితమైన పరిశీలనలందు, విలక్షణమైన కల్పనలయందు అసమానుడు. 
  • ఈ కవి కవిత్వము ద్వారా పాఠకుల ఊహకు పరిశ్రమనిస్తాడు. పాఠకుడు కొంత కష్టపడాలి. అరుదైన విశిష్టత యిది. స్వతంత్రమైన భావాలు, కల్పనలు ఈ కవి సొమ్ములు, నిగూఢంగా చెప్పటం ఉన్నది కానీ కృతకత్వము లేదు. వస్తువులు ప్రాకృతికములే. కవిత్వమున వస్తువులు విలక్షణములే కానీ అపలక్షణములు, వికృతములూ కావు.  
  • శైలి భావమునకు తగినట్టుండును. వైదర్భీ, గౌడీ, పాంచాలి యన్న పట్టింపు లేదు. భాష మహరాష్ట్రీ ప్రాకృతము గాన ఏ రీతియైననూ పాఠకునకు బాధకము కాదు, సాధకమే.
  • రసపోషణాన్ని చక్కగా నిర్వహిస్తాడు.
  • శబ్దాలంకారములైన అనుప్రాస యమకాదులకు ఈ కవి క్వాచిత్కముగా తక్క గొప్ప ప్రాధాన్యతనిచ్చుట లేదు.సేతుబంధమున ఒకే ఒక్క చోట శృంఖలాబద్ధం అనబడే శబ్దచిత్రం ఉన్నది. దీన్నే ముక్తపదగ్రస్తమని అంటారు. అద్భుతభావనాపరిపుష్టమైన ఈ కవిరచనకు శబ్దాలంకారముల అవశ్యకతయునూ కన్పించదు. 
  • అర్థాలంకారములు సేతుబంధమున మిక్కుటములు. ఆలంకారికుడైన భోజుడు తన ’సరస్వతీకంఠాభరణము’ న అనేకసందర్భాలలో అర్థాంతరన్యాస, పరికర, ఉత్ప్రేక్షాది అలంకారములకై సేతుబంధకారుని శ్లోకములను ఉదహరించి యున్నాడు.
  • ఉత్ప్రేక్షాలంకారమున కవి సిద్ధహస్తుడు.
  • యుద్ధఘట్టమున, గంభీరమైన విషయవర్ణనమున సుదీర్ఘసమాసములను, సంయుక్తాక్షరములను కవి ఉపయోగించుట స్పష్టము. ఈ గుణమును అంతకంతకు పెంచి తదనంతరకాలంలో భారవి, కుమారదాస, మాఘకవులు తమ కావ్యములందు యుద్ధవర్ణనములలో చిత్ర, బంధ కవిత్వములను ఉపయోగించుట ఆచారముగా మార్చినారేమో  అనిపిస్తుంది.

యుద్ధము

యుద్ధము తీవ్రమయింది. మేఘనాదుడు యుద్ధానికొచ్చినాడు. ఆతడు రామలక్ష్మణులపై నాగాస్త్రాన్ని సంధించాడు.

19)
ణిద్ధోఆఅసణీలా ణిన్తి విసాణలఫులింగపజ్జలిఅముహా |
ధణుసంధాణవిముక్కా అఉవ్వణారాఅవివ్భమా భుఅఇన్దా ||
సంస్కృతఛాయ:
నిర్ధౌతాయాసనీలా నిర్యాన్తి విషానలస్ఫులింగప్రజ్జ్వలితముఖాః |
ధనుఃసంధానవిముక్తా అపూర్వనారాచవిభ్రమా భుజగేంద్రాః ||

ఇంద్రజిత్తు ధనుస్సును ఎక్కుపెట్టి శరములను సంధింపగా ఆ శరముఖముల నుండి సర్పములు వెడలినై. కొలిమిలో బాగుగా వేడిచేసిన ఇనుమును నీటిలో ముంచి తేల్చినయట్టు (To Temper) ఆ సర్పములు నీలిరంగులో ఉన్నాయట. వాటి ముఖాలనుండి నిప్పుకణాలలాగా విషం చిమ్ముతోంది. 

ప్రాచీన కావ్యాలలో ఏదో ఒక చోట తెలిసో/తెలియకనో కవి కాలమునకు సంబంధించిన చరిత్ర/ఇతర శాస్త్రముల విషయములు కనిపించడం కద్దు. కాళిదాసు రఘువంశము ఆరవసర్గలో "అయస్కాంతేన లోహవత్" - అన్న పద్యపాదములో అయస్కాంతాన్ని ప్రస్తావించినాడు. (అయస్కాంతం ఆ కాలానికి ఉందన్నమాట!) తెలుగున రాయలవారు ఇంద్రనీలమణి తృణగ్రాహకత్వమును ఒకచోట చెప్పినాడు. సేతుబంధకవి శ్లోకము ద్వారా ఉక్కును కొలిమిలో బాగుగా కాల్చి, నీటిలో పెళుసుగా చేసి వాటి ముఖములను వాడిగా చేసి, పక్షి రెక్కలను గట్టుటతో బాణము తయారయ్యే పద్ధతిని పరోక్షంగా చెప్పాడు.

ఇంద్రజిత్తు ప్రయోగించిన నాగాస్త్రము రామలక్ష్మణులను బంధించింది. వారిద్దరునూ నిర్వీర్యులయినారు. అంతట సుగ్రీవుడు కుపితుడైనాడు. రామలక్ష్మణులను కిష్కింధకు కొనిపొమ్మని, తానొక్కడనే రావణునితో యుద్ధము కొనసాగించి ఆతనిని హతమారుస్తానని ఆవేశపడతాడు. రామలక్ష్మణులను బంధించినది నాగాస్త్రమని విభీషణుడు తెలిపిన తర్వాత రాముడు గరుత్మంతుని తలచినాడు. గరుత్మంతుడు నాకము నుండి వచ్చి రామలక్ష్మణుల నాగాస్త్రబంధనమునుండి విముక్తులఁ జేసినాడు.   

భట్టికావ్యకర్త తన "రావణవధ" కావ్యమందు ఈ ఘట్టమును యథాతథముగా సేతుబంధమునుండి స్వీకరించినాడు. భట్టి కావ్యము - కొన్ని తెనుగు రామాయణాధారిత కావ్యములకు, కకావిన్ (జావా ద్వీపపు) రామాయణమునకు మూలముగా కనిపించుచున్నది. 

రావణకుంభకర్ణులు

యుద్ధము తిరిగి యథాతథముగా సాగినది.ధూమ్రాక్షుడు, ప్రహస్తుడు మున్నగు యోధులు యుద్ధమందు నశించినారు. చివరకు రాక్షసరాజు కుంభకర్ణుని యుద్ధమునకు రావించినాడు. ఆ కుంభకర్ణుడిట్లున్నాడు.

20)
ఓచ్ఛణ్ణరఇరహవహో జాఓ దేహస్య సే కణఅపాఆరో |
ఓరుపఏసాలగ్గో దరఖలిఓ వ్వ తవణిజ్జరాఅపరిఅరో ||
ఛాయ:
ఆక్రాంత రవిరథపథో జాతో దేహస్యాస్య కనకప్రాకారః |
ఊరుప్రదేశాలగ్నో దరస్ఖలిత ఇవ తపనీయరాగపరికరః ||

లంకాపట్టణపు సువర్ణప్రాకారము రవిమార్గమును అడ్డుకొనేంత ఎత్తైనది. అంతటి ప్రాకారమే కుంభకర్ణుని ఊరువులను తాకుతోంది. వలయాకృతిలో ఉన్న లంక సువర్ణప్రాకారము, ఆతని కటి ఆభరణము జారినదా అన్నట్లున్నది. రమణీయమైన ఉత్ప్రేక్ష ఇది. కటిబంధము జారుట - అప్పుడే నిద్రనుంచి లేచి వచ్చినాడు అనడానికి వ్యంగ్యము. 

కుంభకర్ణుడూ యుద్ధమున హతుడైనాడు. యుద్ధమున తెగి, సముద్రమున పడిన ఆతని హస్తము రెండవ సేతువులా ఉందని కవి ఉత్ప్రేక్ష. కుంభకర్ణుని అనంతరము మేఘనాదుడు యుద్ధమునకు తిరిగి ఏతెంచినాడు.ఈ సారి అతనిని లక్ష్మణుడు మట్టుపెట్టినాడు.

చివరికి రావణుడే రణరంగానికి వచ్చాడు. వాల్మీకి రాముని బ్రహ్మాస్త్రము దురాత్ముడైన రావణుని హృదయము చీలిస్తే, సేతుబంధకారుని అస్త్రము దశముఖుని దశశిరములను ఒక్క వ్రేటున ఖండించింది.

21)  
ణవరి అ సో రహువఇణా వారం వారేణ చన్దహాసచ్ఛిణ్ణో |
ఎక్కేణ సరేణ లుఓ ఎక్కముహో దహముహస్స ముహసంఘాఓ ||
ఛాయ:
అనన్తరం చ రఘుపతినా వారం వారం చన్ద్రహాసచ్ఛిన్నః |
ఏకేన శరేణ లూన ఏకముఖో దశముఖస్య ముఖసంఘాతః ||

అటుపై చంద్రహాసఖడ్గముతో పూర్వము రావణుడు పరమేశ్వరుని ప్రీత్యర్థము మరల మరల స్వయముగా ఖండించుకున్న శిరములు, రాముని యొక్క శరము వ్రేటునకు అన్ని కలిపి ఒక్కటిగా తెగిపడినై. 

పరమేశ్వరుని మెప్పించుటకు రావణాసురుడు తన శిరములను ఒక్కొక్కటిగా తన చంద్రహాసఖడ్గముతో ఖండించుకొన్నాడని పురాణకథ. రామశరము చంద్రహాసఖడ్గమునకు పదింతలు పదునైనదని ’ధ్వని’.




(చంద్రహాస ఖడ్గధారి రావణుడు - హళేబీడు శిల్పము) 


రావణుని శిరములను రామబాణం ఖండించటం - ఇది వాల్మీకి రామాయణంలో లేదు కానీ, కాళిదాసు రఘువంశంలో ఉంది.

తేన మంత్రప్రయుక్తేన నిమేషార్ధాతపాతయత్ |
స రావణశిరః పంక్తిమజ్ఞాతవ్రణవేదనామ్ ||
బాలార్కప్రతిమేవాప్సు వీచిభిన్నా పతిష్యతః |
రరాజ రక్షః కాయస్య కంఠచ్ఛేదపరంపరా ||
(రఘు. 12.99, 12.100)

అటుపై అర్ధనిముషపర్యంతముననే రాముడు మంత్రప్రయుక్తమైన బ్రహాస్త్రముతో రావణుని తలల వరుసలను, నొప్పి తెలియకయే పడగొట్టెను.తరుణ సూర్యబింబము సెలయేటి అలలలో అనేక బింబములుగా కన్పడినట్టు, రాక్షసరాజు రావణుని శిరముల పంక్తి ప్రకాశించెను.

ఒక్కవ్రేటున దశశిరములు ఖండింపబడటాన్ని - మురారి కవి కూడా అనర్ఘరాఘవములో అపూర్వముగా ఉత్ప్రేక్షించినాడు. 

దివ్యాస్త్రైర్భూర్భువ స్త్రితయడమరణోడ్డామరైరోధయిత్వా
లూనోత్క్షిప్తైః శిరోభిర్దశభిరభినభో దర్శితైకాదశార్కః |
కాకుత్స్థేనావకీర్ణో నిజవిశిఖశిఖాయోగ పీఠోపహూత
బ్రహ్మాస్త్రేణాధిశేతే రజనిచరపతేర్వీరశయ్యాం కబన్ధః ||
(అనర్ఘ - 6.77)
ముల్లోకములను కల్లోలపర్చగల దివ్యాస్త్రములను నిరోధించి, చివరకు రాముడు ప్రయోగించిన బ్రహ్మాస్త్రముచేత దశశిరములు ఖండింపబడి అంతరిక్షమున పదకొండు సూర్యబింబములవలె ప్రకాశిస్తున్నాయి. ఆతని కళేబరము రణరంగమును అలంకరించింది. 

ఆ సమయమున విభీషణుడు హృదయము ద్రవించునట్లు విలపించినాడు.
22)
జో చ్చిఅ జేఊణా జమం దిట్ఠో ఇచ్ఛాసుహం తుమే జమలోఓ |
దీసిహిసి కహ ణు పత్థివ ఇణిహ తం చేఅ సేసజణసామణ్ణమ్ ||
ఛాయ:
య ఏవ జిత్వా యమం దృష్టః ఇచ్ఛాసుఖం త్వయా యమలోకః|
ద్రక్ష్యసి కథం ను పార్థివ ఇదానీం తమేవ శేషజనసామాన్యమ్ ||

ఏ యముని జయించి ఆతని యింటిని స్వేచ్ఛగా చూచినావో, ఓ నృప! ఆ లోకమునిప్పుడు జనసామాన్యముతో కలసి ఏ విధంగా చూడగలవు? 

పురుషుడైన విభీషణుని విలాపము వాల్మీకి రామాయణమున మండోదరి విలాపమునకు  సామ్యముగా ఉన్నా, ఔచిత్యవంతంగా ఉందో ఊహింపగలరు.

ఇంద్రియాణి పురా జిత్వా జితం త్రిభువనం త్వయా |
స్మరద్భిరివ తద్వైరమింద్రియైరేవ నిర్జితః ||
(వాల్మీకి రామాయణము - యుద్ధకాండ - 111.18)

పూర్వము ఇంద్రియములను, త్రిభువనములనూ జయించి, స్మరునిచే వైరము పొడమి,  ఇంద్రియములచేత నిర్జింపబడితివి.

ఉపసంహారము

ప్రవరసేనకవి ’అనురాగ’ పదలాంఛనుడు. ప్రతి ఆశ్వాసములో, ఆశ్వాసాంతశ్లోకాన "అనురాగ"మను శబ్దమును ఈ కవి ప్రయోగించినాడు. ’అనురాగము’ అన్న శబ్దమును భక్తి, ఇష్టము, ప్రేమ, స్నేహము, ఎఱుపురంగు ఇత్యాది భిన్నార్థములలో ఈ కవి ప్రయోగించాడు. ప్రాకృతకావ్యమున సర్గకు ఆశ్వాసమని పేరు. పదునైదవ  ఆశ్వాసపు కొసన, మరియు కావ్యాంతమున శ్లోకమిది.

23)
ఎత్థ సమప్పఇ ఏఅం సీఆలమ్భేణ జణిఅరామవ్భుఅఅమ్ |
రావణవహ త్తి కవ్వం అణురాఅఙ్కం సమత్థజణణివ్వేసమ్ ||
ఛాయ:
అత్ర సమాప్యతే ఏతత్సీతాలమ్భేన జనితరామాభ్యుదయమ్ |
రావణవధ ఇతి కావ్యమనురాగాఙ్కం సమస్తజననిర్ద్వేషమ్ ||

ఈ విధముగా సీత విరహము వలన జనించిన రామాభ్యుదయమునూ, ’అనురాగము’ యను పదము (ఆశ్వాసాంతమున) చిహ్నముగా కలిగినదియునూ (లేక రామునికి సీతపై గల ప్రేమకు చిహ్నముగా నిర్మించిన సేతుబంధమను చిహ్నము గలదియునూ), సమస్త జనములకు ద్వేషహరణమైనట్టిదియునూ అయిన "రావణవధ" యను కావ్యము ఇచ్చట సమాప్తమగుచున్నది. 

ఆశ్వాసాంతమున ప్రీతికరమైన శబ్దమును శ్లోకమున నిముడ్చు పద్ధతి పాటించిన ప్రాచీనకవులలో ప్రవరసేనుడొకడు. ఆతనికంటే ముందు సర్వసేనుడను ప్రాకృతకవి "హరివిజయ"మను కావ్యంలో, ఆశ్వాసాంతములలో "ఉత్సాహ"మను శబ్దముపయోగించినాడు. ప్రాకృతకవుల పద్ధతిని పాటించి మహాకవి భారవి "లక్ష్మీ" పదలాంచనుడైతే, మాఘుడు "శ్రీ" పదలాంఛనుడయ్యాడు. అటుపై కొందరు తెలుగు కవులు ఆ సాంప్రదాయము ననుసరించారు.  కృష్ణకవి దుష్యంతుని పుత్రుడైన భరతుని చరిత్రమును సంస్కృతములో కావ్యముగా రచించినాడు. ఆ కవి సేతుబంధము యొక్క లక్షణములను ఈ విధముగా తెలిపినాడు.   

జడా(లా)శయస్యాంత రగాధమార్గ మలబ్ధరన్ధ్రం గిరి చౌర్యవృత్త్యా |
లోకేష్వలఙ్కాన్త మపూర్వసేతుం బబంధ కీర్త్యా సహ కుంతలేశః. ||

(భరత చరితము - 1.4)

కుంతలరాజ్యప్రభువు (ప్రవరసేనుడు) జలాశయముపై నిర్మింపనిది, గిరుల నుపయోగింపనిది అయిన అపూర్వ సేతువు (అను కావ్యము)ను నిర్మించి కీర్తి గడించినాడు. ఈ శ్లోకమందు మరొక శ్లేషయున్నది. ’లడయోరభేదః’ కావున - కుంతలరాజ్యప్రభువు (ప్రవరసేనుడు) మందబుద్ధులకు అర్థము కాక గాఢమైనది, ఇతరుల కావ్యముల నుండి సంగ్రహింపనిదియును అయిన అపూర్వ సేతుబంధము అను కావ్యమును నిర్మించి కీర్తి గడించినాడు. ఇచ్చట మందబుద్ధులనగా అపండితులని కాదు, రసహీనులని లక్ష్యార్థం.

సేతుబంధమును గూర్చి వివరముగా చెప్పాలంటే ఆ కావ్యం మొత్తాన్ని అనుశీలించటం తక్క మరొక గతి లేదు. అది ఇప్పటికి అసాధ్యం. ఈ చిన్ని పరిశీలన కొండను అద్ద మందు చూపటానికి చేసిన ప్రయత్నం.

ఫలశ్రుతి

24)
పరివడ్డఇ విణ్ణాణం సంభావిజ్జఇ జసో విడప్పన్తి గుణా |
సువ్వఇ సుఉరిసుచరిఅం కిం తం జేణ ణ హరన్తి కవ్వాలావా||
ఛాయ:
పరివర్ధతే విజ్ఞానం సంభావ్యతే యశః ఊర్జ్యన్తే గుణాః |
శ్రూయతే సుపురుషచరితం కిం తత్ యేన హరన్తి కావ్యాలాపః ||

విశిష్టమైన జ్ఞానము వర్ధిల్లును, కీర్తి దక్కును, గుణములు హెచ్చగును. సుపురుష చరితములైన కావ్యాలాపములు వినుట వలన జరుగనిదేమి? 

Bibliography

సేతుబంధము - రామదాసవ్యాఖ్యానము - కావ్యమాలా సిరీస్ 47
ప్రాకృతవ్యాసమంజరి - సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్య
గాథాసప్తశతి - కావ్యమాల21
వాల్మీకిరామాయణము - కిష్కింధకాండ, యుద్ధకాండ - వావిళ్ళ వారి ప్రతులు
పద్యకవితాపరిచయం - బేతవోలురామబ్రహ్మం గారు
వక్రోక్తి జీవితము -బాలనందిని వ్యాఖ్య - పుల్లెల రామచంద్రుడు 
ధ్వన్యాలోకము - లోచన సహితము - బాలనందిని వ్యాఖ్య - పుల్లెల రామచంద్రుడు
కావ్యప్రకాశము - బాలనందిని వ్యాఖ్య - పుల్లెల రామచంద్రుడు
కావ్యాదర్శము - బాలనందిని వ్యాఖ్య - పుల్లెల రామచంద్రుడు
http://www.valmikiramayan.net/
http://www.sanskritdocuments.org/sites/giirvaani/
http://www.andhrabharati.com/ (మొల్ల రామాయణము)
సరస్వతీకంఠాభరణము - కావ్యమాల94
కిరాతార్జునీయము - మల్లినాథసూరి ఘంటాపథవ్యాఖ్యానసహితము - KpParab
కిరాతార్జునీయము - తెనుగు టీక, తాత్పర్యము - ఎమెస్కో
శిశుపాలవధమ్ - మల్లినాథ సూరి సర్వంకష వ్యాఖ్యానము - చౌఖాంబా ప్రకాశన్
Kakawin Ramayana - 3 Volumes
Carite carite dalam Ramayana.
Inscriptions-of-kambuja-R C Majumdar
History of SouthEast Asia - DGE Hall.
http://www.learnnc.org/lp/multimedia/2557 (prambanan sculptures)
http://web.archive.org/web/20080617213034/http://orias.berkeley.edu/SEARama/imagelibrary.htm (Images of Wat Phra Kaeo temple)
మనుచరిత్రము - శేషాద్రి రమణకవుల వ్యాఖ్యానము - వావిళ్ళ వారి ప్రతి
కుందమాల - నీలమణి దహెల్
Bhattikavya - Jibananda Sagar
Janaki Haranam - I-V - Narayan Vasudev Nagudkar
Janaki Haranam of Kumaradasa - CR Swaminathan
Questions of King Milinda - Rhys Davids
Literary and Historical studies in Indology - VV Mirashi
అనర్ఘరాఘవము - బేతవోలురామబ్రహ్మం గారు
Bharata Charitam - Krishakavi - Trivendrum Sanskrit Series
ప్రతాపరుద్రీయము - విద్యానాథుడు
daSaroopaka - Chowkhamba
ఆంధ్ర దశరూపకము - మల్లాది సూర్యనారాయణశాస్త్రి గారు
Few more websites like national geographics, Google maps etc.  

కామెంట్‌లు

  1. మీ ఈ పోస్టుని ఇంకోసారి తీరిగ్గా చదవడానికి మళ్ళీ మీ బ్లాగ్ వైపు వస్తాను. కానీ ఈలోగా ఈ ఒక్కమాట చెప్పాలనిపించింది - అద్భుతంగా వుందండి సేతుబంధం కావ్యం గురించి మీ పరిచయం. ధన్యవాదాలు !

    రిప్లయితొలగించండి
  2. ఎంతో సంతృప్తి కలిగింది. తెలుగుబ్లాగుల తీరుతెన్నులపై విరక్తి కలుగుతున్న రోజుల్లో ఈతువంటి మంచిటపాలు కంటబడటం ఎంతో సంతోషం కలిగించింది. ఒకసారి శ్రథ్థగా చదివాను. మరల ఒకటి రెండు పర్యాయాలు చదువులకుంటే గాని సరిపోదు. ఇంతమంచి వ్యాసాన్ని ఏ ఈమాటవంటి సాహిత్యపత్రికకో పంపక బ్లాగులో ప్రచురించటం ఆశ్చర్యం కలిగిసస్తున్నది.

    రిప్లయితొలగించండి
  3. భాష పై మీకున్న పట్టు అమోఘం.కావ్యం గురించి మీ వివరణాత్మక వ్యాసాంగం బావుంది.

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Comments ridiculing, abusing, bullying and forcing to agree in any form, if objectionable to the blog owner will be removed.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వాఙ్మయచరిత్రలో కొన్ని వ్యాసఘట్టాలు - శ్రీ ఏల్చూరి మురళీధరరావు గారు.

అశోకుడెవరు? - 1

ముకుందవిలాసః - కుంటిమద్ది శేషశర్మ.