వీచిక - 10
"In the city, the sky is held. In this concrete jungle something happen to city dwellers result in callousness.."
~ Jiddu Krishnamurthy.
*********
విశ్వామిత్రః : (ఉపసృత్య) వృద్ధే స్వస్తి! (లేచి, అవ్వా, మంచి జరుగుగాక!)
వృద్ధా: ఇషి, ణమో దే (ఋషీ, నమస్తే)
విశ్వామిత్ర: అపి క్షేమం తవ గృహే? (ఇంకా, మీ ఇంట్లో అందరూ కుశలమేనా?)
వృద్ధా: సబ్బం మహ ఘరమ్మి ఖేమం | మహ పుత్తాణ పిదా పుతబహుం ఆణేదుం అణ్ణం గామం గదో | పుత్తో ఖేతమ్మి సమాహిదాణాం సస్సాణాం రక్ఖం కరేది | పఉత్తా ఘరకమ్మో లగ్గా | ఆఅచ్ఛదు భవం అజ్జ మహ ఘరం పవిత్తం కరీఅదు (విలోక్య) ఏదే కస్స కుమారా రమణీఆ ఏదాణం ఆకిదీ || (మా ఇంట్లో అందరూ కుశలమేను. అబ్బాయి వాళ్ళ నాన్న కోడలిని పిలుచుకురావటం కోసం పక్క గ్రామం వెళ్ళారు. అబ్బాయి చేలకు కాపలా కాస్తున్నాడు. మనమలు ఇంటిపనుల్లో ఉన్నారు. రండి. మా ఇంటికి వచ్చి పావనం చేయండి. (చూచి) వీరిద్దరు ఎవరి పుత్రులు? చాలా చక్కగా ఉన్నారు!)
విశ్వామిత్రః : ఏతౌ మహారాజదశరథస్య పుత్రౌ | (వీళ్ళిద్దరూ మహారాజు దశరథుని పుత్రులు)
వృద్ధా: కిం కిం ఏదాణం ణామాఈ (వీళ్ళ పేర్లేమిటి?)
విశ్వామిత్రః : (నిర్దిశ్య) అయం రామో జ్యేష్ఠః | అయం లక్ష్మణః (చూపెడుతూ, వీడు పెద్దవాడు రాముడు. వీడు లక్ష్మణుడు)
రామః : (ఉపసృత్య) సావిత్రో రామోऽభివాదయే (ప్రణమతి) (లేచి నుంచుని, సూర్యవంశపు రాముడు, అభివాదం చేస్తున్నాడు. నమస్కరించాడు)
లక్ష్మణః : ఆర్యమనుజోऽభివాదయే (ప్రణమతి) : (పూజ్యుని తమ్ముడు అభివాదం చేస్తున్నాడు. నమస్కరించాడు)
వృద్ధా: చిరం జీవహ తుమ్హే (విలోక్య) కిం దోహిం వి తుమ్హేహి ధణుఆ ధారిऽఅదిం ( చిరంజీవులు కండి. మీరిద్దరూ ధనుర్బాణాలు ఉంచుకున్నారే)
విశ్వామిత్రః : సదా క్షత్రా ధనుర్బిభ్రతి ధర్మరక్షాం కర్తుమ్ | ఏతాభ్యాం వనే చ యజ్ఞవిఘ్నకారిణో రాక్షసా హతాః | (ధర్మరక్షణ కోసం క్షత్రియులు ఎప్పుడూ ధనుస్సు ధరిస్తారు, వీరిద్దరూ యజ్ఞానికి అడ్డు తగులుతున్న రాక్షసులను సంహరించారు.)
వృద్ధా: ఏత్థ గామే వణమ్మి అ మిఆ ణ మారిదవ్వా (ఇక్కడ పల్లెలో, తోటల్లో జంతువులను కొట్టరాదు.)
లక్ష్మణః : తైస్తు యుష్మాకం సస్యహానిర్భవతి | (వాటివల్ల మీకు పంటనాశనమవుతుంది)
వృద్ధా: తహ వి ణ మారిదవ్వా | అమ్హే దే లోట్ఠేహి ణివారేమో. (అయినా సరే కొట్టడానికి వీల్లేదు. వాటిని రాలతో తరిమేస్తాం)
లక్ష్మణః : అపకారిషు భవత్యాః కథం పక్షపాతః | (మీకపకారం చేస్తున్న వాటిపై మీకు ఎలా పక్షపాతం)
వృద్ధా: మిశా సహవాసేణ అమ్హాణం బంధుఆ జాదా ధావందా సోహేది | (మృగాలు మాతో సావాసం చేసి బంధువులయ్యాయి. అవి పరిగెడుతుంటేనే బావుంటుంది)
విశ్వామిత్రః : (రామం ప్రతి) దృష్టమేషాం గ్రామ్యాణాం దయార్ద్రమనస్తత్వమ్ | అపకారిభ్యోపి న కృధ్యంతి | తేషాం గుణాన్ స్తువంతి | (రాముని ఉద్దేశించి - ఈ పల్లెకారుల జాలిగుండె చూచావా? తమకు హాని చేసే వారిపై కూడా కోపించట్లేదు. పైగా వారి గుణాలను పొగుడుతున్నారు)
రామః: సత్యం దేవతుల్యమనస ఇమే | (నిజంగా దేవతలవంటి మనసు వీరిది)
విశ్వామిత్రః : (వృద్ధాం ప్రతి) ఆర్యే గచ్ఛతు భవతీ | వయమపి సంధ్యాముపాస్య తవ గృహమాగచ్ఛామః | (అవ్వను ఉద్దేశించి - పూజ్యురాలా, నీవు వెళ్ళవచ్చు. మేమున్నూ సంధ్యవార్చి మీ ఇంటికి వస్తాము)
వృద్ధా: (నిష్క్రాంతా)
విశ్వామిత్రః : వత్సౌ| కిమర్థం కృషీవలా మయా వాం దర్శితాః? (అబ్బాయిలూ! ఎందుకని మీకు నేను రైతులను చూపించాను?)
లక్ష్మణః : ఏతేషాం సంతోషోల్పయా సంపదా భవతీతి | (వీరి తృప్తే వీరికి సంపద అని చెప్పటానికి)
రామః : అస్మాకం వ్యవహారజ్ఞానాయ | యతః అదృష్ట్వా తత్వేన ఏతస్సర్వం ఏతేషాం వ్యవహారనిర్ణయః అశక్యః కర్తుమ్| పౌరాస్తు స్వాన్ పక్షాన్ పాటవేన సాధయితుం ప్రభవంతి | ఏతేషాం తు వృత్తం దృష్ట్వా ఏవ వ్యవహారః నిర్ణేతుం శక్యః | (మా లోకజ్ఞానం కోసం. ఒకవేళ వీరిని చూడకపోయి ఉంటే, ఇలాంటి జీవితాల గురించి ఊహించటం అసాధ్యం. ప్రజలు సాధారణంగా తమ అభిప్రాయాలకనుగుణంగా వారిని వారు సమర్థించుకుంటారు. రైతుల జీవితాల గురించి, దగ్గరగా చూస్తే తప్ప వారి గురించి తెలియలేము)
విశ్వామిత్రః : సమ్యగవగతం రామేణ. (రాముడికి సరిగ్గా తెలిసింది.)
*************
అవును కదూ! సంపదలు అల్పమైనా అనల్పమయమైన ఆనందమయమైన రైతుల జీవనాన్ని శ్రీకృష్ణరాయల వంటి సామ్రాజ్యాధీశుడే తలచి తలచి తన్మయం చెందాడు కదా!
పైని ఘట్టం - యజ్ఞఫలం అనే నాటకంలోనిది. ఈ నాటకం రామాయణాధారితమైన నాటకం. నాటక సంవిధానాన్ని బట్టి దీన్ని భాసుడి రచన అంటున్నారు. (స్థాపనా, నాంద్యంతే తతః ప్రవిశతి సూత్రధారః - ఇత్యాది నిర్దేశాల వల్ల). భాసుడు - అపూర్వప్రతిభాశాలి. ఓ విషయాన్ని దృశ్యంగా వేదికపై పాత్రల నటన ద్వారా "చూపటం"లో ఆయన మహానేర్పరి. పైగా ఆయన నాటకాలలో పతాకాస్థానకాలు కూడా ఎక్కువే. (పతాకాస్థానకం అంటే - ఒక పాత్ర తన ఎదురుగా ఉన్న నటునికి చెప్పకుండా ప్రేక్షకులకు తెలిపే విధంగా విషయాన్ని చెప్పే ప్రక్రియ. Dramatic Irony.)
యజ్ఞఫలం నాటకాన్ని - ఆ విధంగా చూస్తే భాసకృతమని అనిపించదు. అలాగని భాసకృతం కాదని చెప్పటానికీ కొన్ని విషయాలు అడ్డుపడతాయి. ఆదికవి వాల్మీకిత్రోవలో నిమ్మళంగా, ఒద్దిగ్గా, తన సొంతశైలిని, ఒరవడిని సంయమనం చేసికొని నడవడంలో భాసకవిది మొదటివరుస. అలాంటి శ్లోకాలు ఈ యజ్ఞఫలంలో ఉన్నై.
భాసుని ప్రతిమానాటకానికి కొంచెం వ్యత్యాసమైన సంవిధానం, విషయాలు ఈ నాటకంలో ఒకచోట కనిపిస్తుంది. కానీ ప్రతిమలోని ఒకానొక బలమైన ఋజువు (వివిధ శాస్త్రాల ప్రస్తావన) ఈ నాటకంలోనూ ఉంది. ఇది భాసుడే వ్రాసి ఉండవచ్చు లేదా, భాసుడిని చాలా సూక్ష్మంగా అనుకరించిన కవి ఎవరో వ్రాసి ఉండవచ్చు.
ఏదయితేనేం! ఎవరు వ్రాస్తేనేం? మనకు ఏమి చెప్పారో కావాలి.
యజ్ఞఫలంలో కొన్ని వాల్మీకి రామాయణానికి భిన్నమైన విషయాలు, కల్పనలు ఉన్నాయి. వీటిని బహుచక్కగా చేర్చాడు కవి. (ఉదాహరణకు : ఈ నాటకంలో రాముడు సీతను స్వయంవరానికి ముందే చూస్తాడు.)
ఈ నాటకానికి మకుటాయమానం - ఐదవ ఆశ్వాసం. రైతుల గురించి, వ్యవసాయం గురించి, పశుసంపద గురించి, గోధూళి గురించి, నగర- గ్రామ జీవనాల తారతమ్యాల గురించి చక్కని సంభాషణలతో, గొప్ప వర్ణనలతో చెబుతాడు నాటకరచయిత. ఓ రైతు, నగరానికి చేరుకుంటే ఏమవుతుంది అన్న విషయాన్ని చెప్పించి, విశ్వామిత్రుని "పరిణామదర్శి"గా చిత్రీకరిస్తాడు. అలా ఈ నాటకం సంస్కృతనాటకాల్లో వ్యవసాయం గురించి మాట్లాడిన అరుదైన నాటకంగా నిలుస్తుంది! జిడ్డు కృష్ణమూర్తి చెప్పిన నగరపౌరుల callousness గురించీ ఈ నాటక రచయిత ప్రస్తావించాడు.
ఆ ఘట్టంలో వర్ణనలు కూడా అందంగా, ఆహ్లాదంగా ఉంటాయి.
ఓ వర్ణన!
రాముడు:
గత్యా పవిత్రం విపినం విధాయ
జగ్ధ్వా ప్రకామం రసమోషధీనామ్ |
వత్సాన్ పయః పాయయితుం దినాన్తే
గావః సమాయాన్తి శనైర్గృహాణి ||
పవిత్రమైన వనములలోకి వెడలి, ఓషధుల రసాన్ని నిండుగా స్వీకరించి, దూడలకు పాలు అందించటానికి ఈ సాయం సమయాన ఆవులు మెల్లగా తమ గూళ్ళకు తిరిగి వస్తున్నాయి.
స్వభావోక్తి అయిన ఈ శ్లోకం - వాల్మీకిని గుర్తు తెప్పిస్తుంది.
మరొకటి!
లక్ష్మణుడు:
ఉత్కంఠితాః సుతవపుః పరిలేఢుమీతాః
ఊధోభరేణ లఘు ధావితుమక్షమాశ్చ |
స్వైరం వ్రజే నిహితదృష్టయ ఆపతంతి
గావః సమున్నత విషాణవిలోకనీయాః ||
తమ పిల్లలైన దూడల ఒంటిని నాకటానికి ఉత్కంఠంగా ఉన్నవీ, పొదుగులు నిండడం చేత కాస్త తొందరపడి పరిగెత్తటం మొదలెట్టినవి, అడ్డదిడ్డంగా మందలో ఒకదాన్ని ఒకటి తోసుకొంటున్నవి, పొడుగైన కొమ్ములున్నవీ అయిన ఈ ఆవులు చూడదగినవిగా ఉన్నవి.
....ఉహూ మరొకటి.
సస్యభారనమితా ఏతే కలమా హేమకాంతయః |
దదతీవోపాయనాని మాత్రే క్షేత్రభువే ముదా ||
ఈ మాగాణిలో పండిన చేలు విరగకాసి పసిడిరంగుకు తిరిగి క్రిందకు వంగి ఉన్నాయి. అమ్మ భూదేవికి సంతోషంతో ఏదో బహుమతిని ఇస్తున్నట్టుగాను!
పైన ఇచ్చిన సంభాషణలో వృద్ధురాలు మాట్లాడింది ఏ భాషండి? ప్రాకృతమా?
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిఅద్భుతమండీ రవి గారు !
శకారుని గురించి ఏదైనా టపా దయచేసి వ్రాయండి
జిలేబి
ప్రాకృతమేనండి.
రిప్లయితొలగించండిశకారుడు: అది ఒక రీసెర్చ్ టాపిక్ అండి. :) చూద్దాం.