భారతదేశ అస్తవ్యస్త చరిత్ర - మౌలిక ప్రాతిపదికలు - ప్రశ్నలు

ప్రపంచ దేశాల్లో ఏ దేశానికైనా ఓ చరిత్ర ఉంటుంది. అది కాస్తో కూస్తో పదిలంగా, నిర్దుష్టంగా ఓ క్రమరూపాన్ని సంతరించుకుని ఉండటానికి ఆయా దేశ చారిత్రకులు శతాబ్దాలుగా పాటుపడ్డం చరిత్రలో జరిగింది. 

దురదృష్టవశాత్తూ ఆధునిక భారతదేశంలో మాత్రం కనీసం రెండు (రెండున్నర అనవచ్చు) విభిన్నమైన, సమాంతరమైన చరిత్రలు ఏర్పడి ఉన్నాయి. ముఖ్యంగా క్రీస్తు పూర్వం నుంచి క్రీస్తు శకం ఐదవ శతాబ్దం వరకూ ఏర్పడిన చరిత్ర విషయంలో ఈ సమాంతర చరిత్రలు నెలకొని ఉన్నాయి.. 

చిన్న ఉదాహరణగా కాళిదాసు కాలాన్ని పరిశీలిద్దాం. భారతదేశంలో పూర్వం కాళిదాసు అనే కవి ఉండేవాడు. ఆయనది ఖచ్చితంగా ఆరవ శతాబ్దానికి పూర్వం. ఎందుకంటే ఐహోళె (కర్ణాటక) లో బాదామి చాళుక్యుల నాటి శాసనంలో ఆయన పేరు పేర్కొనబడి ఉంది కాబట్టి. ఆ కవికి సంబంధించి భౌతికంగా కనిపించిన ఓ ఖచ్చితమైన ఆధారం అదొక్కటే కాబట్టి. ఈ నేపథ్యంలో  దొరికిన ప్రమాణాలను, తన్మూలంగా నిర్మించుకున్న భిన్న వాదాలను అనుసరించి కాళిదాసు యొక్క కాలాన్ని విభిన్నమైన చరిత్రలుగా వింగడించవచ్చు.

క్రీ.పూర్వం ఒకటవ శతాబ్దానికి చెంది ఉండవచ్చు. - Version 1. 
క్రీ.శ. నాలుగవ శతాబ్దానికి ఈవలి వాడు - Version 2.
(క్రీ.శ. ఒకటి రెండు శతాబ్దాల కాలం నాటి వాడు  ~ Version 2.5.)

ఈ రెండు రకాల చరిత్రలకు రెండు మౌలిక ప్రతిపాదనలు ఉన్నాయి. మొదటి విభాగానికి పురాణాలు, రెండవ విభాగానికి సర్ విలియమ్ జోన్స్ యొక్క ప్రాతిపదికానూ.(ఈ రెండూ వ్యాసంలో ప్రస్తావింపబడతాయి). రెండవ వర్షన్ ప్రాతిపదికలో ఏర్పడిన లోపాలను సవరిస్తూ సవరిస్తూ పోతే రెండున్నర వర్షన్ వచ్చింది. వెరసి కాళిదాసు కవికీ/కవికాలానికి చెందిన మూడు చరిత్రలు ఏర్పడి ఉన్నాయి. ఇదే విధమైన పరిణామం మిగిలిన చరిత్ర లోనూ ప్రతిఫలించి ఉంది. ఫలితంగా మనకు రెండు బలమైన సమాంతర చరిత్రలు వ్యాపించి ఉన్నాయి.

ఈ సమాంతర చరిత్రలు ఎలా ఏర్పడ్డాయి? ఆ విషయం జోలికి పోవడానికి ముందు, అసలు చరిత్ర నిర్వచనం గురించి మాట్లాడుకోవాలి.

భారతదేశంలో ఆంగ్లేయుల ఆక్రమణకు ముందు ఇతిహాసం/చరిత్ర నిర్వచనం ప్రస్తుత చరిత్రకంటే వేరు. భారతీయులకు చరిత్ర ఒక ప్రక్రియ (Process). ఒక ప్రవాహం (Flow). ఒక తరాన్నుంచి మరొక తరానికి ప్రవహించే సాంప్రదాయసంస్కారపు సారమే - చరిత్ర/ఇతిహాసం. వ్యక్తుల చరిత్ర కన్నా వ్యక్తిత్వాల చరిత్రకు భారతదేశంలో ప్రాధాన్యత ఉండేది.  ఉదాహరణకు కాళిదాసు అన్న కవి చెప్పిన ’విషయాలు’, ఆ విషయాలకు మూలకందమైన సాంస్కృతికమైన మౌలికభావాలు ఒక తరం నుంచీ మరొక తరానికి ప్రవహిస్తూ పోవడం - భారతదేశానికి సంబంధించి కాళిదాసు అనే వ్యక్తి తాలూకు ’చరిత్ర’. ఆ ప్రవాహం తన చలనగతిలో భాగంగా విభిన్నమైన రూపాలను, వేగాన్నీ సంతరించుకోవచ్చు గాక. కానీ ప్రవాహమే చరిత్ర. కాళిదాసు కావ్యాలైన కుమారసంభవం, రఘువంశం,మేఘదూతం ఇత్యాది కావ్యాలు, వాటి అనుశీలన ద్వారానే కాళిదాసును స్మరించటం మనకు చరిత్ర.అలాగే భాగవతం ద్వారా మూలకందమైన భక్తిభావాల, ఆధ్యాత్మిక విషయాల వ్యాప్తి ఈ దేశానికి చరిత్ర. ఆ కావ్యంలో కథాభాగానికి అనూచానంగా వ్రాయబడిన అనేక మహారాజుల సమాచారం కేవలం ప్రాస్తావికం మాత్రమే. మనకు మనుచరిత్ర అంటే ఆతని పుట్టుక ఆవశ్యకత, మనువు పుట్టుక ద్వారా ఏర్పడిన పరిణామం,అనూచానపు సాంప్రదాయపు విలువలూ (మంచివి, చెడువీ) కలిపిన ఓ ప్రవాహం. మనువు పుట్టుక తేదీ, అతని ప్రాంతం అన్నవి ఈ నేపథ్యంలో అల్పవిషయాలు. ఇలాగే రాముడు, కృష్ణుడు, విక్రమార్కుడు, శాతకర్ణి, శ్రీకృష్ణదేవరాయలు వగైరా వగైరా. వాళ్ళు ఏం ఒరగబెట్టారో అది చరిత్ర. వారి కేరాఫ్ అడ్రసు చరిత్ర కాదు. చరిత్ర ఇలా నిర్వచింపబడటానికి మరొక కారణం కూడా ఉండేది. ఈ దేశంలో ద్విజులకు గోత్రప్రవర అనే అనూచానమైన సాంప్రదాయం ఉంది. (ప్రస్తుతకాలంలో ఇది బలహీనంగా ఉన్నప్పటికీ మనుగడలో ఉంది). గోత్రం అనేది ఒక ఐడెంటిటీ. వ్యక్తులకు గోత్రం ద్వారా ఐడెంటిటీ ఉండేది కాబట్టి ఆ ఐడెంటిటీ సామాజిక వ్యవహారాలకు ఉపయోగపడేది కాబట్టి, వ్యక్తుల ఐడెంటిటీని (చరిత్ర అనే) శాస్త్ర పరిధికి మార్చుకునే అవసరం భారతదేశంలో ప్రాచీనకాలంలో లేకపోయింది. వెరసి History is a perennial flow of inferences/ideas/philosophies to mentor/motivate the individuals. చరిత్ర నిజాల సంకలనం కాదు, ఆలోచనల సమాహారం. చరిత్ర - న్యాయం కాదు, మీమాంస. It is involute/Evolute (వర్తులం).

ధర్మార్థ కామమోక్షాణాం ఉపదేశ సమన్వితమ్ |
పూర్వవృత్తం కథాయుక్తం ఇతిహాసం ప్రచక్ష్యతే ||

(ధర్మ అర్థ కామ మోక్షాల యొక్క ఉపదేశాలతో కూడుకున్నదియుని, పూర్వవృత్తాంతములు, కథలతో కూడినదియుని అయినది ఇతహాసమనదగును.) 

ఆంగ్లేయులకు సంబంధించి చరిత్ర - ఒక Product/Noun ల సమాహారం. కాళిదాసు పేరు, ప్రాంతం, ఆతని కాలం వారి దృష్టిలో చరిత్ర. అలాగే మనువు ఎవరు? వాడి ఊరు, పేరు, కాలం ఇవి చాలా ముఖ్యం. అవి నిర్దుష్టంగా తేలిన తర్వాత ఆ కాలపు నేపథ్యంలో ఆతని రచనలకు ఉన్న ప్రాధాన్యతను, అవసరాన్ని పరిగణించటం వారి పద్ధతి. దరిమిలా వారికి చరిత్ర ఒక ’ఘనపదార్థం’. పైగా విశ్లేషణకు ఉపకరించటానికి పేరు, కాలం, ప్రాంతం ఇత్యాదిగా ముక్కలు చెక్కలుగా ఖండించి, నిశితంగా పరిశీలించవలసిన ఒక వస్తువే ’చరిత్ర’. ఇదే చరిత్రకు వారిచ్చిన నిర్వచనం. వ్యక్తులే ముఖ్యం. వారు చెప్పిన విషయాలు అ తర్వాత. History is a collection of discrete solid pieces of information for the usage of different persons. వీరికి చరిత్ర ఒక న్యాయం. నిజాల కూటమి. It is linear.  

(Note: "for in History, as in Law, we must not follow streams, when we may investigate fountains, nor admit any secondary proof, when primary evidence is attainable." - From works of William Jones, page 147, 10th Anniversary meeting of Asiatic research society

ప్రస్తావనార్హమైన మరొక విషయం ఉంది. ఏదైనా ఒక నిర్ధారితమైన నిజం ఏర్పడ్డాక, దానికి విరుద్ధంగానో, విభిన్నంగానో మరొక నిజం కనుగొనబడితే, మొదటి నిజాన్ని రెండవ నిజాన్ని సమన్వయించుకోవటం, కనీసం ప్రయత్నించటం, తద్వారా మూడవ, నాలుగవ నిజాలకు త్రోవ ఏర్పడడం భారతదేశంలో ఉన్న ఆలోచనా విధానం. జైనమతం, ఉపనిషత్తుల ఆధారంగా బౌద్ధచింతన వచ్చింది. బౌద్ధచింతన ద్వారా ఏర్పడిన తర్కపద్దతి తర్వాత వివిధ శాస్త్రాలకు ఆకరమయ్యింది. యోగ, విపశ్యన, తంత్ర వంటి పద్ధతులు ఒకదాన్తో ఆగిపోక కొత్తగా ఏర్పడ్డాయి. విభిన్నమైన అనేక మతాలకు భారతదేశం తావిచ్చింది.  సాహిత్యంలో అలంకారశాస్త్రంలోనూ రీతి, రస, ధ్వని, వక్రోక్తి సిద్ధాంతాలు పరస్పర దోహదకారులు. చరిత్రకూ ఈ పద్ధతి వర్తిస్తుంది. అందుకే ఒకే చరిత్రకు ఆధారాలను ఆరు, ఏడు  పురాణాలలో పేర్కొన్నారు. ఈ ఆలోచన వర్తులం. అంటే సున్న - 0. It won't start a point and end at a point. There is no absolute truth. 

కాగా పాశ్చాత్య ఆలోచనా విధానం పైని ఆంగ్ల వాక్యం లో వారు చరిత్రకు ఇచ్చుకున్న నిర్వచనం లోలా  సరళరేఖ. ఒక నిర్ధారిత సత్యం ఏర్పడిన తర్వాత - దానికి అనూచానంగా, ఆధారితంగా ఇతర నిజాలు ఉంటాయి/కనుగొనబడతాయి. మొదటిని త్రోసిరాజని మరొక నిజం నిలబడడం - సాధారణంగా పాశ్చాత్య విధానం కాదు. ఇది Material world లో లాభించే అంశం. అందుచేత పశ్చిమాన సైన్సు, టెక్నాలజీ అభివృద్ధి చెంది ఉండవచ్చు. ఉదా: న్యూటన్ గురుత్వాకర్షణ విలువ (g = 9.8 m/sec square) కనుగొన్నాడు. ఆ విలువను తిరిగి ఇంకొకరు కనుగొనే ఆవశ్యకత లేదు. ఆ పునాదిపై సైన్సు విస్తరిస్తుంది. వీరిది విశ్లేషణ. ఇది సమన్వయానికి వ్యతిరేకం. వీరిది సరళరేఖ - 1. అందుకనే వారికి TRUE = 1 :))

దురదృష్టవశాత్తూ రెండు విభిన్న దృక్పథాల సంఘర్షణలో చరిత్ర అనుశీలన బాగా నలిగిపోయింది. ఆంగ్లేయులు పాలకులై, భారతదేశం దాస్యంలో మగ్గటం మూలాన,  భారతదేశంలో ఆంగ్లేయుల ఆక్రమణ తర్వాత అదివరకటి చదువుల స్వరూపం సమూలంగా మారిపోవటం మూలానా, పాలకుల నిర్వచనమే ప్రధానమై కూర్చున్నది. చరిత్ర అనే విషయానికి దృక్పథమే మారినప్పుడు - అది వరకు ఏర్పడిన చరిత్ర కూడా అసంబద్ధమై పోయింది. పాలకపక్షపు వాదనకు అనుగుణంగా కొత్త చరిత్రను లిఖించవలసిన అవసరం ఏర్పడింది. అంతే కాక అదివరకటి భారతదేశ చరిత్రను, చారిత్రక దృక్పథాన్ని కూడా ఆంగ్లేయుల పద్ధతికి అనుగుణంగా మార్చవలసి వచ్చింది. 

ఈ మార్పే విభిన్నమైన సమాంతర చరిత్రలకు కారణభూతమయింది.

పైని నేపథ్యంలో అదివరకు లేని, భారతీయ సాంప్రదాయ వ్యతిరేకమైన, సరికొత్త చరిత్ర రచనకు తెరతీసిన వ్యక్తి సర్ విలియమ్ జోన్స్. ఈతడు మొదలుపెట్టిన చరిత్ర, దానికి అతడు మొదట ఏర్పరుచుకున్న మౌలిక వ్యూహాలు వంటివి చూడ్డానికి ముందు, అంతకు ముందు భారతదేశ చరిత్ర ఎలా ఉండేదో, దానిని కొత్త తరహాలో (అంటే సాంస్కృతిక వారసత్వపు సంగతుల సమాహారంలా కాక, నిర్దుష్ట సమాచారపు శకలాలుగా) మారిస్తే ఎలా ఉండేదో అని చూడవలసి ఉంది. ఈ విషయాలను - తమ దేశపు వారసత్వంపై మక్కువతో కొనసాగించిన వారు కొందరు ఉన్నారు. వారి పరంపరలో తెలుగు వారిలో ప్రముఖులు - కోట వెంకటాచలం. (కోట వెంకటాచలం వ్రాసిన చారిత్రక పుస్తకాలు జోన్స్ తర్వాత ఇటీవలి కాలంలో వెలువడినప్పటికీ, ఇక్కడ వ్యాసంలో సౌలభ్యం కోసం ముందుగా ప్రస్తావించడమైనది.)

ఈయన భారతదేశ పురాణాలను తైపారువేశాడు. భారతదేశీయులకు (ఆంగ్లేయుల నిర్వచనకు లోబడిన) చారిత్రక దృష్టి ఉందా? లేదా అని సరిచూశాడు. ఆయన పురాణాలను విశదంగా అనుశీలించి ఆంగ్లేయుల పద్ధతికి అనుగుణంగా, అంటే రాజవంశావళి జాబితా ప్రధానంగా భారతదేశ రాజవంశాల చరిత్రను వివిధ పుస్తకాలలో పేర్కొని రచించాడు. ఇక్కడ ’ఆంగ్లేయుల పద్ధతి’ అని అంటున్నది భారతదేశ చారిత్రక దృక్పథానికి విరుద్ధంగా చరిత్రను రచించవలసిన అవసరాన్ని పురస్కరించుకుని. 

***************

హిందూ పురాణాలలో మత్స్య, వాయు, బ్రహ్మాండ, విష్ణు, భాగవత, గరుడ, భవిష్య పురాణాలనే ఏడు పురాణాలలో భారతదేశాన్ని ఏలిన రాజవంశావళి గురించి సమగ్ర వివరణ ఉంది. ఈ పురాణాలు ఎలా ఏర్పడినాయో, ఎవరు రచించారో తెలియదు. భారతీయ సాంప్రదాయం ప్రకారం ఎవరూ అసక్తినీ చూపలేదు. అలా ఎవరు రచించారు? అన్న ప్రశ్న ఆంగ్లేయుల ఆక్రమణ ముందు కాలం వరకూ భారతీయులను బాధించినది లేదు. ’ప్రయోజనమనుద్దిశ్య మందోऽపి న ప్రవర్తతే’ అన్న విధాన, ఎవరు రచించినా, ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశింపక ఆ రచన జరిగి ఉండదు. అన్ని తరాలు నిలద్రొక్కుకొని ఉండదు కూడాను. 

ఈ పేర్కొన్న పురాణాలలో మగధ రాజవంశావళి ప్రముఖమైనది. మగధలో, కలియుగం ఆరంభంతో, భారతదేశ రాజవంశావళి జాబితాను, పురాణాల సహాయంతో కోట వెంకటాచలం తయారు చేశాడు. ఇక్కడ కలియుగం అంటే - మహాభారత యుద్ధం ముగిసిన వెంటనే - అని అర్థం.  నిజానికి మహాభారత యుద్ధం జరిగిన 36 యేళ్ళ తర్వాత, శ్రీకృష్ణుని నిధనం జరిగిన తర్వాత కలియుగం ఆరంభమయిందని నిర్ధారించవలసి వస్తుంది. అయితే పురాణాలు మాత్రం రాజవంశావళిని పేర్కొనే క్రమాన్ని మహాభారతయుద్ధం తర్వాతి వత్సరాన్నే మొదలుపెట్టాయి. 

ఆ జాబితాకు ముందు - కలియుగం ఆరంభం గురించి చూడాలి. కలియుగం ఎప్పుడు మొదలయ్యిందో తెలియాలంటే  అందుకు ముఖ్యమైన సప్తర్షి మండల చలనం గురించి తెలియాలి.

సప్తర్షి మండల చలనం - ధృవ నక్షత్రం
----------------------

రాత్రి పూట ఓ పవర్ ఫుల్ కెమెరాను ఉత్తర దిశగా స్థిరంగా నిలబెట్టి, ఆ కెమెరాలో రాత్రి అంతరిక్షంలో జరిగే వ్యవహారాన్నంతా వీడియో తీసి, వచ్చిన ఆ వీడియో ఫైల్ ను అనేకరెట్లు వేగంతో ’ఫాస్ట్’ గా ప్లే చేస్తే - మనకొక విషయం తెలుస్తుంది. కనిపించే చుక్కలన్నీ ఉత్తరపు కొసలో ఉన్న ఒకానొక (కేంద్ర బిందువు) నక్షత్రం చుట్టూతా విభిన్నమైన వేగాలతో, వృత్త (దీర్ఘవృత్త ?) ఆకారాలలో గిరికీలు కొడుతున్నై. ఆ కేంద్ర బిందువు పేరు ధృవ నక్షత్రం. అంతరిక్షంలో చాలా ప్రముఖమైన నక్షత్రం అది. పూర్వకాలంలో నావికులు ఆ నక్షత్రం ఆధారంతో తాము వెళ్ళే దిశను పోల్చుకునే వారట. భూమి గోళాకారంలో ఉంటుందని, అది తన అక్షాన్ని ఇరుసుగా చేసుకుని, తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుందని మనం చదువుకున్నాం. ఈ అక్షం రెండు కొసలూ ధృవ ప్రాంతాల గుండా దూసుకుని పోతుందని మనకు తెలుసు. ఈ అక్షం కొస - అంతరిక్షంలో సుదూరంగా ఉన్న ధ్రువ నక్షత్రాన్ని సూచిస్తూ ఉంటుంది. (Equinox). అందుకని ధృవ నక్షత్ర స్థానం ఉత్తరం వైపుకు చెక్కు చెదరకుండా నిలిచి ఉంటుందన్నమాట. 

(Note: ఇది చాలా వరకూ నిజమైనా కూడా ప్రాచీన కాలంలో ఈ ధృవ నక్షత్రం కూడా సున్నితంగా కదులుతూ ఉంటుందని కనిపెట్టేరు. దానికి కారణమూ ఊహించారు. అదేమంటే - భూమి తన చుట్టూ తాను తిరుగుతోంది కదా, అలా తిరుగుతున్నప్పుడు, దాని  అక్షం నిఠారుగా ఉండట్లేదు. ఆ అక్షం తాలూకు ఓ కొస కూడా  ఓ చిన్న వ్యాసార్ధంలో తిరుగుతూ ఉంది! అంటే భూమి బొంగరంలా తిరుగుతూంది! బొంగరం తిరుగుతూ ఉండగా  పైని కొస ఓ చిన్న వ్యాసార్ధంలో, ఒకింత వృత్తాకారంలో తిరగటం మనం చూడవచ్చు. 

సరిగ్గా అలాగే ధృవబిందువు కూడా ఓ చిన్న వ్యాసార్ధంలో తిరుగుతూ ఉంది. ఆ వ్యాసార్ధం ఒక్క డిగ్రీ తిరగటానికి దాదాపు 72 యేళ్ళు పడుతూంది. అది 360 డిగ్రీలు తిరగటానికి 25,800 యేళ్ళు పడుతూంది. ఈ లెక్క ప్రాచీన భారతీయులకు తెలుసు. విష్ణుపురాణంలో ధృవునికి విష్ణువు వరం ఇస్తాడు. సప్తర్షులు నీ చుట్టూ ఇరవై యారు వేల యేళ్ళు చుడుతూ, ఆశీర్వదిస్తూ ఉంటారు అని. ఈ విషయాన్ని హిప్పార్చిస్ అనే గ్రీకు శాస్త్రవేత్త క్రీస్తు పూర్వమే కనుగొన్నాడు.) 

ఇప్పుడు సప్తర్షి మండలం విషయానికి వద్దాం. ఆకాశంలో ఉత్తరదిశగా కాలుష్యం లేని రోజు రాత్రి పూట చూస్తే మనకు సప్తర్షి మండలం కనిపిస్తుంది. దీనిని Big Dipper అని అన్నారు పాశ్చాత్యులు. ఈ సప్తర్షులలో నలుగురు మహర్షులు ఓ వరుసలోనూ, ఆ నలుగురిలో ఇటు చివరి ఆయన, మిగిలిన ముగ్గురితో కలిసి ఓ చతురస్ర రూపంలోనూ అమరి ఉన్నారు. 




ఈ సప్తర్షులు కూడానూ ఇతర నక్షత్రాలలానే ధృవుని చుట్టూతా గొలుసు కట్టు రూపంలో తిరుగుతూ ఉన్నారు. అంటే సప్తర్షి మండలం మధ్యన ఉన్న నక్షత్రానికి, ధృవ నక్షత్రానికి కలుపుతూ రేఖ గీసి క్రిందికి పొడిగిస్తే - ఆ రేఖ నక్షత్రమండలంలోని ఏదో ఒక నక్షత్రాన్ని తాకుతోంది. ఈ ఖగోళ శాస్త్ర విషయం ఇటు ప్రాచీన భరతవర్షం వారికీ, గ్రీకు వారికి కూడా తెలుసు. భారతీయులు ఈ విషయాన్ని - సప్తర్షి మండలం ’ఫలానా’ నక్షత్రపు ఇంట్లో కొలువున్నది అన్నట్టుగా చెప్పారు. 

సప్తర్షీణాం తు యౌ పూర్వౌ దృశ్యతే హ్యుదితౌ నిశి
తయోస్తు మధ్యే నక్షత్రం దృశ్యతే యత్సమం దివి || (మత్య్సపురాణం 271.45)

అంతరిక్షంలో తూరుపు వైపున ఉదయిస్తూ, సప్తర్షి నక్షత్రాలలో రెండింటి మధ్య కనిపించే నక్షత్రం అందులో సప్తర్షిమండలం కొలువుంటుంది.  

అయితే సప్తర్షి మండలమూ, ఇతర నక్షత్రాలు ధృవుని చుట్టూ ఒకే వేగంతో తిరగట్లేదు. అందువల్ల సప్తర్షి మండలమధ్యము, ధృవబిందువును కలిపే రేఖ ఎల్ల వేళలా ఒకే నక్షత్రం (లో కొలువు ఉండదు) గుండా వెళ్ళదు. ఆ నక్షత్రం ప్రతి నూరేళ్ళకూ మారుతూంది! అంటే సప్తర్షి మండలం ఉజ్జాయింపుగా ప్రతి 100 సంవత్సరాలకున్నూ, ఒక్కో నక్షత్రంలో ఉంటూ వస్తోంది. 

మనకు మొత్తం పన్నెండు రాశులూ, 27 నక్షత్రాలు ఉన్నై. సప్తర్షులు ఈ 27 నక్షత్రాలలో ఒక్కో నక్షత్రంలోనూ 100 యేళ్ళు ఉంటారు. ఉదాహరణకు సప్తర్షులు - మఖా నక్షత్రంలో ఉన్నారనుకోండి. ఆ సప్తర్షులు తిరిగి మఖా నక్షత్రంలో ప్రవేశించటానికి 27 x 100 = 2700 యేళ్ళు పడుతుంది. మళ్ళీ ఇంకో ఆవృత్తి అయి తిరిగి మఖలోనికి రావటానికి 2700 x 2= 5400 యేళ్ళు పడుతుంది.  ప్రస్తుతం సప్తర్షి మండలం ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో ఉంది(ట).  5100 యేళ్ళకు పూర్వం  అంటే క్రీ.పూ 3102 లో మఖా నక్షత్రంలో సప్తర్షులు ఉండాలి. ఉన్నట్టు పురాణాలు పేర్కొంటున్నాయి. 

సప్తర్షయో మఖాయుక్తాః కాలే పారిక్షితే శతమ్ |
ఆంధ్రాంశే చ చతుర్వింశే భవిష్యంతి మతే మమ ||
(వాయుపురాణం. 99.423)

సప్తర్షయో మఖాయుక్తాః కాలే పారిక్షితే శతమ్ |
బ్రాహ్మణాస్తు చతుర్వింశే భవిష్యంతి శతం సమాః ||
(మత్స్యపురాణం 272.47) 

పరీక్షిత్తుకు పట్టాభిషేకం జరుగు సమయమున సప్తర్షులు మఖా నక్షత్రమున నుండిరి. ఆంధ్ర (శాతవాహన) రాజులు రాజ్య పాలనకు వచ్చు సమయంలో 24 వ శతములో వారున్నారు. 

(Note: ఈ సప్తర్షి చలనం లెక్క ఉజ్జాయింపు లెక్క.అంతరిక్షంలో సాపేక్షచలనాలను అనుసరించి నూరు సంఖ్యకు ఓ correction factor తో గణించి లెక్కలు ఉన్నవి. అంత లోతుగా చర్చించడానికి ఇక్కడ పరిధి సరిపోదు.) 

సప్తర్షి మండలం ఒక్కో నక్షత్రంతో నూరేళ్ళు కాపురం చేస్తుందని చూశాం. ఇలా ఒక్కో నక్షత్రం జరుగుతూ పోతుంది. ఈ జరగటం సవ్య దిశలోనా? అపసవ్య దిశలోనా? అంటే మఖతో మొదలుపెట్టి మఖ->పుబ్బ->ఉత్తర->హస్త->చిత్త ఇలా ఎదరకు జరుగుతూ పోతోందా? లేక మఖ->ఆశ్లేష->పుష్య->పునర్వసు->ఆర్ద్ర ఇలా వెనుక దిశలోనా? అపసవ్యదిశలో లెక్కిస్తే నేటికి లెక్క సరిపోతోంది. ప్రస్తుతం సప్తర్షి మండలం ఉత్తరఫల్గుణిలో ఉంది.  ఇక్కడ ఇంకో విషయం ప్రస్తావనార్హం. చలనం ఏ దిశలో ఉన్నా, మహాభారతకాలానికి, నేటికీ దాదాపుగా రెండు ఆవృత్తాలు గడిచిన విషయం - విస్పష్టంగా ఖగోళ శాస్త్రాధారంగా తెలుస్తూనే ఉంది. అంటే మహాభారతకాలం నేటికి ~5100 వత్సరాలకు ముందు అన్నది నిర్ధారిత సత్యం. 

ఏతావతా ఇక్కడ మన వ్యాసం కోసం తీసుకున్న Inference ఏమిటంటే - పురాణాల్లో కాలగణనకు ఏర్పరుచుకున్న base point క్రీ.పూ. 3138 అనిన్నీ, అక్కడి నుంచీ మగధ వంశావళి లెక్కపెట్టే పద్ధతిని అవి అనుసరించాయి అని చెప్పటం.  అంతే కాక సూర్యసిద్ధాంతం, భాస్కరాచార్యుని జ్యోతిశ్శాస్త్ర గ్రంథాలు, సుప్రసిద్ధ భారతీయ ఖగోళ శాస్త్రవేత్త ఆర్యభట్టు వ్రాసిన ఆర్యభట్టీయం ప్రకారం, శ్రీకృష్ణుని నిర్వాణతిథి లెక్కలు, మహాభారతంలో కనబడే ప్రమాణాలు - వీటన్నిటినీ బట్టి కలియుగం క్రీ.పూ. 3102 ఫిబ్రవరి 20 వ తేదీన, 2.27.30 రాత్రిన  మొదలయ్యిందని తీర్మానించేరు. సరిగ్గా అంతకు మునుపు 75 యేళ్ళకు ముందు అంటే క్రీ.పూ.3177లో సప్తర్షులు మఖయందు ప్రవేశించారు.  మహాభారతకాలం అంతకు మునుపు 36 యేళ్ళకు ముందు, అంటే క్రీ.పూ. 3138 లో.  దీనిని యుధిష్ఠిరశకం అన్నారు. అక్కడి నుంచి రాజవంశావళి లెక్క మొదలవుతుంది. ఆ రాజవంశావళిలో ప్రముఖమైనది మగధ రాజవంశం.

రాజవంశావళి
--------

మహాభారతయుద్ధానికి ముందే మగధ రాజు జరాసంధుడు మరణించాడు. అతడి పుత్రుడు బృహద్రథుడు. బృహద్రథుని పుత్రుడు సహదేవుడు. వీరిద్దరున్నూ మహాభారతయుద్ధంలో నిహతులైనారు. ఆపై సహదేవుని పుత్రుడు సోమాధి భారతయుద్ధం తర్వాత మగధ రాజ్యపట్టాభిషిక్తుడైనాడు. ఈ వంశాన్ని బార్హద్రథ వంశమని పిలుస్తారు. 

సోమాధితో క్రీ.పూ. 3138 లో మొదలైన  బార్హద్రథ వంశం వేయి వత్సరాలు మగధను పరిపాలించింది. ఈతడు పరీక్షిత్తు సమకాలికుడు. సోమాధితో మొదలైన మగధ రాజ వంశావళిని విశదంగా మత్స్య, వాయు, బ్రహ్మాండ పురాణాల్లో పేర్కొన్నారు. ఇంకా విష్ణు, భాగవత, గరుడ పురాణాల్లో వీరి జాబితా క్లుప్తంగా ఉంది. 

బార్హద్రథ రాజుల పేర్లు, వారు రాజ్యం చేసిన కాలాలు, ఆ వరుస ఇలా ఉంటవి. 

అథ ఊర్ధ్వం ప్రవక్ష్యామి మగధా యే బార్హద్రథాః
జరాసంధస్య యే వంశే సహదేవాన్వయో నృపః || 
అతీత వర్తమానాశ్చ భవిష్యాశ్చ తథా పునః
ప్రాధాన్యతః ప్రవక్ష్యామి గదతో మే నిబోధత ||
సంగ్రామే భారతే వృత్తే సహదేవో నిపతితే
సోమాధిః తస్య దాయాదో రాజాऽభూత్ స గిరివ్రజే
పంచశతం తథాऽష్టౌ చ సమా రాజ్యమకారయత్ |            (58 years - సోమాధి)
శ్రుతశ్రవస్ చతుష్షష్టిమ్ సమాస్ తస్యాన్వయే భవత్           (64 years - శ్రుతశ్రవుడు)
అయుతాయుస్తు షట్ త్రింశత్ రాజ్యం వర్షాన్యకారయత్     (36 years - అయుతాయువు/అప్రతీపుడు)
చత్వారింశత్ సమాస్తస్య నిరామిత్రో దివమ్ గతః             (40 years -నిరామిత్రుడు)
పంచశతం సమాషష్టః సుక్షత్రః ప్రాప్తవాన్ మహీమ్         (58 years -సుక్షత్రుడు)
త్రయోవింశత్ బృహత్కర్మా రాజ్యం వర్షాణ్యకారయత్      (23 years - బృహత్కర్మ)
....
....
ఈ విధంగా -

సోమాధి - 58
శ్రుతశ్రవుడు - 64
అయుతాయువు/
అప్రతీపుడు        36
నిరామిత్రుడు 40
సుక్షత్రుడు 58
బృహత్కర్మ 23
సేనజిత్ -   50
శ్రుతంజయుడు - 40
విభుడు - 35
శుచి - 58
క్షేముడు - 28
సువ్రత - 64
సునేత్ర 35
నిర్వృతి - 58
సువ్రత - 38
ధృఢసేన - 58
మహీనేత్ర(సుమతి) - 33
సుచలుడు 
(సుబలుడు/బాహుబలి) -22
సునేత్ర - 40
సత్యజిత్ - 83
విశ్వజిత్ (వీరజిత్) - 35
రిపుంజయుడు - 50
-------------------
(మొత్తం)         1006
...
ద్వావింశతి నృపాహ్యేతే భవితారో బృహద్రథాః |
పూర్ణం వర్షసహస్రం వై తేషాం రాజ్యం భవిష్యతి ||

వీరు (బార్హద్రథులు) అనే రాజులు 22 మంది అగుదురు. వీరి రాజ్యం వేయేళ్ళు ఉంటుంది. వీరిలో ఒక్కొక్క రాజును, రాజ్యకాలాన్ని లెక్క పెడితే - 1006 యేళ్ళు వస్తుంది. ఇవీ మత్స్య, వాయు పురాణాల్లో ఉన్నాయి. మొదటి రాజు సోమాధి. చివరి వాడు రిపుంజయుడు.

ఆపై బార్హద్రథుని చివరి రాజైన రిపుంజయుని సంహరించి మంత్రికుమారుడు ప్రద్యోతుడు మగధను ఆక్రమించాడు. ఈ ప్రద్యోత వంశంలో ఐదుగురు రాజులు 138 యేళ్ళు మగధను పరిపాలించారు. 

అష్టత్రింశచ్ఛతం భవ్యాః ప్రద్యోతాః పంచ తే నృపాః |

ఈ విధంగా ఒక్కో వంశాన్ని పురాణ ప్రస్తావనలతో లెక్క కట్టి కలివంశ రాజుల చరిత్రను ఇలా తేల్చేరు. ఈ పట్టిక కోట వెంకటాచలం గారిది.  

1. బార్హద్రథులు - 22 మంది -   BC 3138-BC 2132 - 1006 years 
2. ప్రద్యోతులు - 5 మంది - BC 2132 - BC 1994 - 138 years 
3. శిశునాగులు - 10 మంది - BC 1994 - BC 1634 - 360 years 
4. నందులు - 2 మంది - BC 1634 - BC 1534 - 100 years
5. మౌర్యులు - 12 మంది -  BC 1534 -BC 1218 - 316 years
6. శుంగులు - 10 మంది - BC 1218-BC 918 - 300 years
7. కాణ్వులు - 4 గురు - BC 918 -  BC 833 - 85 years
8. శాతవాహనులు - 33 - BC 833 - BC 327 - 506 years
9. గుప్తులు - 7 - BC 327 - BC 82 - 245 years
10. విక్రమార్క, శాలివాహన, 
శాలిహోత్ర + పరమార, 
తోమార, బ్రహ్మక్షత్ర+
అన్యులు)            - -- - BC 82 - AD1193 - 1275 years
ఆపై భిన్న ప్రాంతపు 
భారతీయరాజులు, 
అహమ్మదీయ, 
ఆంగ్లేయులు - 807 years

Total = 5138 years (Till 2000 AD)

*************

పై పట్టికను అనుసరించి కొందరు ప్రముఖ రాజుల కాలం

సోమాధి - 3138 BC - 3080 BC (58 years)
రిపుంజయుడు  - 2182 BC - 2132 BC (50 years) Last king of Barhadratha
ప్రద్యోతుడు - 2132 BC-  2109 BC (23 years)

(Note: ఈ ప్రద్యోతుడు, భాస/హర్ష, ఇతర సంస్కృత నాటకాలలో నాయకుడైన ఉదయనుడు సమకాలికులనుకుంటారు. కానీ కాదు. స్వప్నవాసవదత్తమ్ లోని ప్రద్యోతుడు - ఉజ్జయిని (అవంతి) రాజు. వాసవదత్తకు తండ్రి. ఉదయనుని మామ ప్రద్యోతుడు అవంతి రాజు, మగధ ప్రద్యోతుడూ ఒకరే అని పురాణాలలో పేర్కొన్నట్టుగా లేదు.

ఉదయనుడి రెండవభార్య పద్మావతికి అన్న దర్శకుడు.ఈ దర్శకునిది మగధ. కథాసరిత్సాగరంలోనూ ఉదయనుని ప్రస్తావన ఉంది. అందులో లెక్క ప్రకారం ఉదయనుడు - హస్తిన రాజైన పరీక్షిత్తుకు నాల్గవతరం వాడు. పరీక్షిత్తు -జనమేజయుడు-శతానీకుడు- సహస్రానీకుడు-ఉదయనుడు. కానీ కథాసరిత్సాగరం చరిత్రగణనకు సరైన ఆకరం కానేరదు. మత్స్యపురాణంలో కురురాజవంశావళిలో పరీక్షిత్తుకు 23 వ వారసుడు కూడా ఉదయనుడే. ఆతని తండ్రి పేరు శతానీకుడు. ఇతడు బహుశా మగధప్రద్యోతుడికి సమకాలికుడు కావచ్చును కానీ, ప్రద్యోతుడు అవంతిరాజు అనే భాసనాటకాల్లో ఉన్నది. అందుచేత ఈ ఉదయనుడు-ప్రద్యోతుల వ్యవహారంతోనూ భాసనాటకాలకు సమన్వయం కుదరదు. 

అలా ఉంటే, బౌద్ధ అర్థకథలలో బుద్ధుడికి సమకాలికుడైన ఉదయనుడొకడిని పేర్కొన్నారు. అతడూ వత్సరాజే. ఆతని మొదటి భార్య శ్యామావతి. రెండవ భార్య మాగంధియ. మాగంధియ మగధరాజపుత్రి. ).

నందివర్ధనుడు - BC 2014 - BC 1994 (20 years) - Last one in PradyOtas)
శిశునాగుడు - BC 1994 - BC 1954 (40 years)
బింబిసారుడు - BC 1852 - BC 1816 (38 years). He is contemporary of Buddha 
గౌతమబుద్ధుడు - BC 1887 - BC 1807 (80 years)
అజాతశత్రువు - BC 1816 - BC 1789 (27 years)
మహానంది - BC 1677 - BC 1634 (43 years) - శిశునాగులలో చివరి రాజు
(మహాపద్మ)నందుడు  - BC 1634 - BC 1546 - 88 years 
సుమాల్యుడు (నందసుతుడు) BC 1546 - BC 1548 (2 years only)
చాణక్యుడు (విష్ణుగుప్తుడు) (Contemporary of MahaPadmananda,  Sumalya)
మౌర్య చంద్రగుప్తుడు - BC 1534 - BC 1500 (34 years)
(మౌర్య) బింబిసారుడు - BC 1500 - BC 1472 (28 years)
(ఇతడు బిందుసారుడు. ఇతడే అమిత్రఘాతకుడు. AmitroChats )

అశోకుడు - BC 1472 - BC 1436 (36 years)
బృహద్రథుడు - BC 1305 - BC 1218 (87 years) మౌర్యుల చివరి రాజు
పుష్యమిత్రుడు - BC 1218 - BC 1158 (60 years) మొదటి శుంగవంశపు రాజు.
అగ్నిమిత్రుడు - BC 1158 - BC 1108 (50 years) 
దేవభూతిని/క్షేమభూమి - BC 928 -BC 918 (10 years). శుంగులలో చివరి వాడు.  
వాసుదేవుడు - BC 918 - BC 869 (39 years) కాణ్వరాజులలో మొదటిరాజు.
సుశర్మ - BC 843 -  BC 833 (10 years) చివరి కాణ్వరాజు.
శ్రీముఖ శాతకర్ణి - BC 833 - BC 810 (23 years) 
గౌతమీ పుత్ర శాతకర్ణి BC 433- BC 405 (25 years) (26th king of Satavahana dynasty) 
చంద్రశ్రీ (Xandrames)- BC 331 - BC 333 (3 years.) 
He was a minor and killed by Chandragupta) 

గుప్తచంద్రగుప్తుడు (SandroKottas) - BC 327 - BC 320 (7 years) 
సముద్రగుప్తుడు   (SandroSyptus) - BC 320 - BC 269 (51 years)
మాళవాధిపతియైన విక్రమార్కుడు - BC 82 ~ AD 000 (ఈతని ద్వారా విక్రమ శకం/విక్రమ సంవత్ - క్రీ.పూ 58/57 లో మొదలయ్యింది.)
కాళిదాసు, వరాహమిహిరుడు -  (విక్రమాదిత్యుని ఆస్థాన కవులు)
శాలివాహనుడు, ~ AD 50 - AD 100 (AD 78 is starting of Salivahana Saka)

(Note: ఈ వరుసలో పురాణాల్లో స్వల్పంగా పాఠభేదాలు ఉన్నాయి.ఉదాహరణకు శాతవాహనుల సంఖ్య 19 మంది అని ఒక చోట, 30 మందిగా మరొక చోట, 24 గురు అని ఇంకొక చోట - ఇలా వేర్వేరు పాఠాలు ఉన్నాయి. మౌర్య శుంగ, కాణ్వ వంశాల వివరాలు 19 వ శతాబ్దపు తదనంతర పురాణ ప్రతులలో Tamper కాబడినై. ఈ విషయాన్ని పర్గీటర్ అనే ఆంగ్లేయుడు పేర్కొన్నాడు. 

కోట వెంకటాచలం గారు సాధ్యమైనంత ప్రాచీన ప్రతులను, భవిష్యపురాణాన్ని స్వీకరించి జాబితా కూర్చారు. అంతే కాక ఆయన జాబితాకు గల ప్రతిపాదనలు మరిన్ని ఉన్నవి. పురాణాల్లో మహాపద్మనందుడికి, పరీక్షిత్తుకు మధ్య కాలం 1500 వత్సరాలని పేర్కొన్నారు. అప్పుడు సప్తర్షి మండలం శ్రావణ నక్షత్రంలో ఉంటుంది. అలాగే మరికొన్ని.  జ్యోతిశ్శాస్త్ర ప్రమాణాల ప్రకారం - శాతవాహనుల కాలంలో ఆరుద్ర నక్షత్రంలోనికి  సప్తర్షి మండల ప్రవేశం జరుగుతుంది. అంటే కలియుగం ఆరంభమై 2400 యేళ్ళకు శాతవాహనుల పరిపాలన మొదలు కావాలి. ఇంకా ఆయా కాలాల్లో సప్తర్షి constellation ఏ నక్షత్రంలో ఉన్నదో ఆ వివరాలూ ఉన్నై.  ఇన్ని ప్రమాణాలకు అనువైన పాఠాన్ని కోట వారు స్వీకరించి రాజవంశపట్టికను తయారు చేశారు.)   

ఇది పురాణాల ఆధారంగా వింగడించిన సమగ్ర భారతదేశ రాజవంశావళియే - భారతీయ చరిత్ర Version 1.

To conclude:- 

- కోట గారి పురాణ రాజవంశావళి వలన యుధిష్ఠిర, విక్రమ, శాలివాహశకాలకు స్పష్టంగా సమన్వయం కుదురుతోంది.
- పురాణాల్లో సప్తర్షి మండల చలనాన్ని పేర్కొని ఆయన మగధ రాజవంశాన్ని సమన్వయం చేశారు. ఆధునిక కాలంలో ఈ ఖగోళశాస్త్రవిషయాన్ని, పురాణాలను సమన్వయించే శాస్త్ర ప్రయోగాలు చేయగలిగితే అప్పుడు నిజనిర్ధారణ మరింత ఖచ్చితంగా నిరూపణ అవుతుంది. పురాణచరిత్ర యొక్క వాస్తవాలు బయటపడవచ్చు. అదృష్టవశాత్తూ అలాంటి ప్రయత్నం జరుగుతోంది. ప్రొఫెసర్ నరహరి ఆచార్య గారి గురించి ఈ వ్యాసం చివర్లో. 

***************  

ఇదివరకు చెప్పినట్టు ఇలా రాజుల పేర్లతో పట్టీలు తయారు చేసి చరిత్ర ఇదీ అని నిర్వచించటం భారతీయమైన చరిత్రరచనా సంవిధానం కాదు. అయితే ఆంగ్లేయుల ఆక్రమణ, ప్రభావం బలిసిపోయి దేశంలో చరిత్ర నిర్వచనం మారిపోయిన సందర్భాన పురాణాలను తైపారు వేసి ఈ జాబితాలను ఏర్పాటు చేయడం భారతీయ చారిత్రకులకు తప్పలేదు. అయితే వీరు ఈ పని చేయటానికి ముందే జరగవలసింది జరిగిపోయింది. చరిత్ర తారుమారైపోయింది. 

అది ఎలాగో తెలియాలంటే విలియమ్ జోన్స్ గారి చరిత్ర నిర్మాణాన్ని పరిశీలించాలి.

సర్ విలియమ్ జోన్స్ (1746 AD-1794 AD) అతని ప్రతిపాదనలూ
-------------------------------------------

విలియమ్ జోన్స్ గురించి చెప్పుకోబోయే ముందు ఇంకోసారి భారతదేశంలో చరిత్రరచనా సంవిధానం/సామాజిక మూసల గురించి పునశ్చరణ చేసుకోవాలి.

పైన ఇదివరకే చెప్పినట్టు భారతదేశంలో చరిత్ర - వ్యక్తుల వివరాల సమాహారం కాదు, అది ఆలోచనల ప్రవాహం. ఇలా వేదకాలం నుంచి వస్తున్నదే. వేదాలు అపౌరుషేయాలు - అని భారతదేశంలో ఓ వాక్యం ఉంది. అంటే వేదాలు బ్రహ్మ ముఖం నుంచి వచ్చాయని కానీ, ఆకాశం నుంచి ఊడి పడ్డాయని కానీ అర్థం చేసుకోవడం అనౌచిత్యమవుతుంది. అపౌరుషేయాలు అంటే - ఆ రచనలను చేసిన వ్యక్తులకు ప్రాముఖ్యత లేదని, అందులో వ్రాసిన విషయాలకు మాత్రమే ప్రాముఖ్యత అని అర్థం చేసుకోవడం సబబు. అదే విధంగా గౌతముడు, పాణిని, పతంజలి, అష్టావక్రుడు, గౌతమబుద్ధుడు, విక్రమార్కుడు, గౌతమీపుత్రశాతకర్ణి ఇత్యాది వ్యక్తులు నిజంగా చారిత్రక వ్యక్తులేనా? కాదా? అని భారతదేశంలో ఆంగ్లేయుల ఆక్రమణ ముందు చర్చించడం ఎవరూ చేయలేదు. వారి బోధలు/రచనలు/సిద్ధాంతాలకు/విజయాలకు వారి వైయక్తిక జీవితం కన్నా విలువ.అందుచేతనే భారతదేశంలో చారిత్రక వ్యక్తుల కాలాలపైన కుమ్ములాటలు పుట్టలేదు. (ఇక్కడ కుమ్ములాటలే లేవని కాదు కానీ, అవి సిద్ధాంతపరమైనవి.)

ఇదే పద్ధతి ఇతర శాస్త్రాల విషయంలోనూ, సాహిత్యంలోనూ కూడా ఉండేది. వాల్మీకి, వ్యాసుడు, కాళిదాసు, భారవి, మాఘుడు, భవభూతి - ఇత్యాది సాహిత్యకారుల పేర్లు కూడా సరైనవో కావో భారతదేశంలో తెలియదు, పట్టలేదు, అందువల్ల ఎవరూ ఇబ్బంది పడిందీ లేదు. 

(Note: భారతదేశంలో ఆధ్యాత్మిక, మత వ్యవహారాలు కూడా వ్యక్తుల చుట్టూ ఏర్పడలేదు. హిందూమతంలో ఐకనోగ్రఫీలో ఎన్నెన్నో రూపాలు. అందులో శివుడికి బదులు లింగరూపము, విష్ణువు బదులు మత్స్య, కూర్మ వరాహ, నారసింహాది అవతారాలు, స్త్రీ దేవతలకు అనేక హస్తాలు, అనేక ముఖాలు, గజముఖం ఇత్యాది మానవాతీత రూపాలే ఉన్నై. అదే విధంగా బౌద్ధంలోనూ బుద్ధుని రూపాన్ని పూజించే సాంప్రదాయానికి ముందు బోధివృక్షాన్ని స్మరించే సాంప్రదాయం ఉండేది. స్థూప సాంప్రదాయమూ అలాంటిదే. జైన మతంలో గోమఠేశ్వరుడనే మహావీరుని విగ్రహారాధన ఉన్నా, ఆ నగ్న విగ్రహం వెనుక సిద్ధాంతస్వరూపమే ముఖ్యమైనది. పై భావనలకు కూసింత విరుద్ధంగా భారతదేశంలో సీతారామలక్ష్మణ మానవరూప విగ్రహాల (వ్యక్తి రూప) ఆరాధన వేల సంవత్సరాలకు ఇటీవల అనగా క్రీ.శ. పదకొండవ శతాబ్దం తర్వాత భక్తి ఉద్యమం తర్వాత వచ్చింది. 

అంటే - భారతదేశంలో ఆధ్యాత్మికత, మత సాంప్రదాయాలు కూడా చరిత్ర, సాహిత్యాది విషయాల వలెనే ప్రవాహ (flow) రూపంలో ఉన్నవి. ) 

ఒక పక్క శాస్త్రాల విషయం అలా ఉంటే భారతదేశ సమాజం మాత్రం ఎన్నోరకాలైన భిన్న వర్గాలుగా ఏర్పడి ఉంది.  ఈ వర్గాలు మతం ద్వారా, పనుల విభజన ద్వారా, వర్ణాల ద్వారా, కులాల ద్వారా ఎన్నో విధాలుగా భిన్న శకలాల సమాహారంగా ఉంది.  

ఇందుకు సరిగ్గా వ్యతిరేకమైన సంస్కృతి పాశ్చాత్యులది. అక్కడ చరిత్ర/శాస్త్రం - Discrete pieces of info collection అన్నట్టు ఉంటే సమాజం మాత్రం ఒకే మతం నీడన Uniform గా ఉంది.  ఆంగ్ల సంస్కృతి నుంచి వచ్చి అందుకు అత్యంత విభిన్నమైన సంస్కృతి తాలూకు భారతదేశ చరిత్రను, తనకు తెలిసిన పద్ధతిలో అర్థం చేసుకుని కొత్తగా వ్రాయాలని మొట్టమొదటగా, క్రీ.శ. 1788 లో సంకల్పించిన పాశ్చాత్యుడు సర్ విలియమ్ జోన్స్. ఈయన నాటి కలకత్తాలో Asiatic society అధ్యక్షుడుగా నియమింపబడ్డాడు. భారతదేశ చరిత్రను నిర్మింప తలపెట్టిన ఈ సొసైటీలో ఒక్క భారతదేశీయుని కూడా సభ్యునిగా చేర్చుకోలేదు! Warren Hastings నేతృత్వంలో కుంఫిణీ అధికారం భారతదేశంలో లోతుగా పాతుకుంటున్న రోజులవి. భారతీయులను, భారతీయమైన ప్రతి విషయాన్ని వివక్షతో, ద్వితీయశ్రేణితో పరిగణిస్తున్న కాలం.

జోన్స్ కు సహజంగానే గౌతమబుద్ధుడు, పాణిని, విక్రమార్కుడు, శాతవాహనులు ఇత్యాది వ్యక్తుల గురించి తెలియకుండా, వారి చరిత్రలో ఏమి సారం ఉంటుంది? అలాంటి వ్యవహారాన్ని ఎలా ఆకళింపు చేసుకోవాలి? అన్న విషయం మీద ఏ మాత్రం స్పష్టత లేదు. భారతదేశచరిత్రను నిర్మించటానికై, అదివరకటి చరిత్ర గురించి తెలుసుకోవటానికి ఈయన రాధాకాంత శర్మ అనే పండితుని నియమించుకున్నాడు. అతని ద్వారా పురాణాధారిత రాజవంశావళిని, చరిత్రలను ఈయన చెప్పించుకున్నాడు. 

ఇటు పక్క రాధాకాంత శర్మ కూడా భారతదేశ పండితుడు. ఈయన సంస్కృత వ్యాఖ్యానం, టీక, ప్రతిపదార్థం, ఇంకా అవసరమైనంత మేరా పురాణాలను భారతీయమైన దృష్టితో వ్యాఖ్యానించగలడు. అంతే తప్ప ఒక కొత్త సంస్కృతిలో పెరిగిన వ్యక్తికి పురాణాలను, అందులో కుప్పతెప్పలుగా పేరుకుపోయిన అసమగ్ర/సమగ్ర విషయాలను, వాటి అవసరాన్ని స్పష్టంగా గుర్తించి, తదనుగుణంగా ఎదుటి వ్యక్తి అవసరాలకు తగిన పాఠాన్ని చెప్పగలిగే సామర్థ్యం బహుశా లేదు. 

(Note:ఉదాహరణకు; శివపురాణంలో గౌతమబుద్ధుడిని విష్ణువు అవతారంగా చిత్రించారు. ఈయన త్రిపురాసురుల భార్యల పాతివ్రత్యాన్ని అపహరించడంతో వారి భర్తలకు చేటుకాలం వచ్చింది. ఆపై శివుడు వారిని సంహరించడానికి వీలు ఏర్పడింది.

  
చారిత్రక వ్యక్తి అయిన గౌతమబుద్ధుడు స్పష్టంగా అలాంటి పోకిరీ వ్యక్తి కాడు. మరి పురాణాల్లో ఉన్న చిత్రణ ఇలా ఎందుకు? అంటే బౌద్ధమతాన్ని నిరసించటానికి పురాణకర్త చేసిన ప్రయత్నం అని అనుకోవాలి. లేదా ఆ ఉదంతం ప్రక్షిప్తమైనా కావాలి. ఈ మతపోరాటాల వెనుక ఉద్దేశ్యాల గురించి స్పష్టత లేకపోతే - పైని పురాణకథ పై ఏవగింపు, పురాణాలపై చిన్నచూపు ఏర్పడనే ఏర్పడతాయి. పురాణం అనేక విషయాల సమాహారం. దురదృష్టవశాత్తూ. ఏది ఎంతవరకు ఎలా అన్వయించుకోవాలో తెలిసిన వారే వ్యాఖ్యానించగలిగేట్టు వ్రాయబడ్డ రచనలు అవి. 

తిలే తైలం గవి క్షీరం కాష్టే పావక మన్తతః |
ధియా ధీరో విజానీయాత్ ఉపాయాంచాస్య సిద్ధయే ||

నువ్వులలో నూనె, ఆవులోన పాలు, కట్టె లోపల నిప్పు దాగికొని ఉంటవి. పైకివి కానరావు. పైకి కనిపించకపోతే సత్యం లేక కాదు. వాటిని వెలికి తీయటానికి ఎక్కడ ఏ ఉపాయం అవసరమో అక్కడ అలాంటి ఉపాయాన్ని అనుసరించి ధీరులు సత్యాన్ని గ్రహిస్తారు. నువ్వులను పిండి చమురు తీయాలి. పాలను పితకాలి. నిప్పు పుట్టించి కట్టెను వాడుకోవాలి. పిడుక్కీ బియ్యానికీ ఒకే మంత్రమంటే కుదరదు! )

ఈ నేపథ్యంలో పురాణాల గురించి విన్న జోన్స్ కు భారతదేశ ప్రాచీనచరిత్ర,  శాస్త్రాలు, సంస్కృత కవులపై అయిష్టం కాస్త ఏవగింపుగా మారింది. భారతదేశం అంధకారంలో కూరుకుపోయినదని, అనాగరికమైన సాంప్రదాయాల మయమని ఆయన తలపు.  




పురాణాధారిత భారతదేశ చరిత్రకు కేంద్రబిందువు - మహాభారతయుద్ధానంతరం, పరీక్షిత్తు కాలం అంటే క్రీ.పూ. 3138 BC అని అతనికి స్పష్టంగా తెలుసు. ఆయన రాధాకాంత శర్మ వద్ద సేకరించిన మగధరాజుల జాబితాను పరిశీలించాడు. మగధ రాజుల చరిత్ర, మహాభారతయుద్ధం తర్వాత అంటే క్రీ.పూ. 3138 లో బార్హద్రథుడైన సోమాధితో మొదలైనది. కానీ జోన్స్ ఎందుచేతనో ఆ జాబితాను క్రీ.పూ 3102 నుండి గణించడం మొదలెట్టాడు. బార్హద్రథులు, ప్రద్యోతులు, శిశునాగులు,నందులు,మౌర్యులు,శుంగులు, కాణ్వులు, ఆపై ఆంధ్రశాతవాహనులు - వీరి జాబితాను సరిచూశాడు. శాతవాహనులలో చివరి రాజు చంద్రబీజుడు (చంద్రశ్రీ/జాండ్రేమ్సు) అని కూడా ఈయన ఒప్పుకున్నాడు. చంద్రశ్రీ కాలం క్రీ.పూ నాలుగవ శతాబ్దానికి అని కూడా అన్నాడు. ఆ తర్వాత గుప్తులను మిగిలిన రాజులను ఈయన అంతగా పట్టించుకోలేదు.

(Note: బార్హద్రథులు మొత్తం 22 మంది అనీ, వారు పూర్ణ సహస్ర వర్షాలు అంటే వెయ్యేళ్ళు మగధను ఏలారని ఐదారు పురాణాల్లో ఒకేవిధమైన లెక్క ఉంది. ఆ వంశంలో ఒక్కో రాజు - రాజ్యం ఏలిన కాలాన్ని మొత్తం చేసి కూడినా వెయ్యేళ్ళ లెక్క సరిపోతుంది. అయితే జోన్స్ మాత్రం ఆ మొత్తం వంశం 700 ఏళ్ళే అని ’ఊహించి’ నిర్ణయించేశాడు. జోన్స్ తర్వాతి కాలంలో మత్స్యపురాణ ప్రతులు కొన్నింటిలో ఈ 700 ఏళ్ళ లెక్కకోసమే అన్నట్టుగా ప్రక్షిప్తం గా ఓ పద్యపాదం ఏర్పడ్డం కేవలం ’యాదృచ్ఛికం’. ఈ ప్రక్షిప్తపు వాక్యాన్ని తదనంతరకాలంలో పర్గీటర్ అనే ఆంగ్లేయుడు సంపాదించాడు).

On the whole, we may safely close the most authentic system of Hindu chronology, that I have yet been able to procure, with the death of CHANDRABIJA. - Page 309, Works of William Jones Vol 1.

మొదట ఇలా చెప్పినా, చాలా విచిత్రంగా ఆయన, తనకు తోచిన కారణాలు చెబుతూ క్రీ.పూ 3138 తో మొదలైన చరిత్రను - క్రీ.పూ. 2000 కు కుదించేశాడు. భారతదేశ చరిత్ర అంత ప్రాచీనమైనది ’అయి ఉండదని’ ఆయన ఊహ. అందుకు ఆయన అంతకంటే ఆశ్చర్యంగా బ్రాహ్మణులపై కారణం మోపాడు. వారికి బౌద్ధులతోనూ, బుద్ధుడితోనూ కలహం ఉందట. అందుకని బుద్ధుని కాలాన్ని లెక్కకు తీసుకోలేదట! (స్పష్టంగా ఆతనిలో సమన్వయలోపం కనిపిస్తూనే ఉంది.)

ఒక పక్క పురాణ రాజవంశావళి జాబితాను సేకరించి, ఆ రాజుల చరిత్ర సమగ్రంగా ఉన్నప్పటికీ పట్టించుకోక, ఆ జాబితా మూలాధారమైన కలియుగారంభమనే కేంద్రబిందువును గుర్తించకుండా, దానికి తగిన ప్రమాణాలు ఉన్నవో లేవో తెలుసుకోకుండా - ఆయన ఏకపక్షంగా చేసిన నిర్ణయం యిది.  ఇందుకు ఆయన - Joseph De Guignes - ద్వారా సేకరించిన బుద్ధుని కాలాన్ని ప్రమాణం అని పేర్కొన్నాడు. (ఆ పుస్తకంలో ఆనవాళ్ళను సమగ్రంగా చర్చించడం కూడా జోన్స్ చేయలేదు. ఆ De Guignes ఒక ఐరోపా జాతీయుడు. ఆతను సేకరించిన వివరాలను బట్టి బుద్ధుడు కాశ్మీరంలో క్రీ.పూ. 1027 లో పుట్టాడు. )

ఇలా ఆయన తుదకు ఇచ్చిన తీర్పు ఇది.

We may arrange the corrected Hindu Chronology according to the following table, supplying the word about or nearly (since perfect accuracy cannot be attained and ought not be required), before every date.

పట్టిక...(క్రింది చిత్రంలో చూడండి)



చరిత్ర నిర్ణయంలో ఆధారాలు దొరక్కపోతే, లేదా అంగీకారం కుదరక పోతే - ఈ కాలం అనుమానాస్పదం అని, సందేహం వ్యక్తం చేసి, తెలిసిన ప్రమాణాలను తెలిపి, ఆ తర్వాతి చారిత్రక పరిశోధకులకు మార్గాన్ని సుబోధకం చేయడం  ఒక చారిత్రకుడు చేయవలసిన నిజాయితీ అయిన చర్య అవుతుంది. ఒకపక్క జాత్యహంకారం, మరొకపక్క అవగాహనాలోపం తో ఓ దేశచరిత్ర విషయంలో తనకు తోచిన తేదీలను ఊహించి, చరిత్రలో రాజులపై అంటగట్టి ప్రచురించటం అనే అసమర్థమైన, హేయమైన చర్యను జోన్స్ చేశాడు. 

పురాణాలన్నీ తప్పని, కేవలం తన ఊహలే ప్రామాణికమని చరిత్రను శాసించిన జోన్స్, కొంత ఆగి తిరిగి ఇంకో పద్ధతిలో భారతదేశ చరిత్రను అర్థం చేసుకోవడానికి ఉద్యుక్తుడయాడు. ఈ సారి అతను చైనా, లంక, గ్రీకు,  చరిత్రలను తెప్పించుకున్నాడు. పురాణాలకు ఎలాగైతే కలియుగం ఆధారమో అలా చైనా, లంక చరిత్రలకు గౌతమబుద్ధుడి జన్మ ఆధారం. అయితే బుద్ధుడు పుట్టింది భారతదేశాన. ఆయా దేశాల్లో బౌద్ధం విస్తరించిన తరువాత వారికి తగిన ప్రమాణాలతో చైనా, లంకేయులు బుద్ధుని జన్మ దినాన్ని ఏర్పరుచుకున్నారు. జోన్స్ వారి చరిత్రలలో బుద్ధుడి కాలాన్ని చూశాడు. ఆయన దృష్టికి చైనీయుల చరిత్ర, లంక తాలూకు బౌద్ధ చరిత్ర సరిపడలేదు. ఇక మిగిలింది గ్రీకు చారిత్రకుల చరిత్ర.దీనిని ఆయన భారతదేశ చరిత్రతో సరిపోల్చాడు. తద్వారా ఆయన  క్రీ.శ. 1793 లో, Asiatic society - 10 వ మీటింగులో అదివరకు తను రచించిన (పైని పేర్కొన్న భారత రాజవంశావళి) చరిత్రకే విరుద్ధంగా మరో కొత్తప్రతిపాదనను తెచ్చాడు. 




అదేమంటే - "మెగస్తనీస్ అనే గ్రీకు రచయిత, తన పుస్తకంలో ఇండికాలో గంగా, Erannaboas నదుల సంగమాన ఉన్న పాలిబోత్ర అన్న రాజధానిని, సాండ్రోకొట్టసు అన్న రాజు పేరును ప్రస్తావించాడు.(Erannaboas అంటే సోనా నది అని జోన్స్ భావన.)  ఆ రాజు ఎవరో కాదు, చంద్రగుప్తమౌర్యుడు. ఈతడే సెల్యూకస్ నికేటర్ తో సంధి జరుపుకున్నాడు. పైగా ఈ విషయం ఓ సంస్కృతనాటకంలో ఉంది. అందుచేత చంద్రగుప్తమౌర్యుడు-సెల్యూకసూ సమకాలికులు. అనగా క్రీ.పూ. 327 లో చంద్రగుప్తమౌర్యుడు రాజ్యం చేసిన కాలం." ఇది జోన్స్ నూత్న ప్రతిపాదన. 

జోన్స్ ప్రతిపాదనలో అసంగతాలు.

-  ప్రాచీన గ్రీకు/పర్షియా రచయిత మెగస్తనీస్(350 BC – 290 BC) అనే ఆతని ఇండికా గ్రంథం చరిత్రలో ఖిలమై, నశించిపోయింది. అయితే మెగస్తనీస్ ఇండికా ను ప్రాచీనగ్రీకు రచయితలైన Arrian, Strabo, Diodorus వంటి వారు చదివి, తమ తమ రచనల్లో ఇండికాలోని ఘట్టాలను అక్కడక్కడా ఉట్టంకించారు. వారు పేర్కొన్న ఇండికాలోని తునకలను Dr. Schwanbeck అనే జర్మన్ రచయిత సంకలనం చేశాడు. దానికి ఆంగ్ల అనువాదాన్ని JW McGrnidle అనే ఆంగ్లేయుడు రచించాడు. జోన్స్ రచనకు ఆధారం - ఆ తునకలతో కూడిన పుస్తకం. (Ancient India as described by Megastenese and Arrien - JW. McGrindle)  భారతదేశం అనే ప్రాచీన దేశపు చరిత్రను నిర్మించడానికి ఆ అర-కొర వివరాలున్న పుస్తకాన్ని స్వీకరించాడు జోన్స్. ఈ పుస్తకం భారతీయ పురాణాలకంటే అసమర్థమైనదీ, చవకబారుదీ కూడా. అదే జోన్స్ కు ప్రమాణమయింది.  

- ఏ స్ట్రాబో ఉటంకింపులనైతే జర్మన్ రచయిత సంకలనం చేశాడో, ఆ స్ట్రాబో కు మెగస్తనీస్ మీద సదభిప్రాయం లేదు. ’మెగస్తనీస్ ఒక అబద్ధాల కోరు’ అని స్ట్రాబో మరొక పుస్తకంలో పేర్కొన్నాడు. 

- మెగస్తనీస్ రచన ఇండికా అనువాదాన్ని చదివి భాగవత్ దత్తా అనే బెంగాలీ చారిత్రకుడు  మరొక అర్థాన్ని సమన్వయించాడు. ఇండికాలో ఎక్కడా కూడా ’మగధ’ అన్న ఉటంకింపు లేదు. ’ప్రాచీ’ అన్న రాజ్యం పేరు తప్ప. యమునా నది ఒడ్డున పారిభద్ర అనే నగరం ఉండేది. అది ప్రాచీ రాజ్యానికి రాజధాని. ఈ పారిభద్ర (పాలిబోత్ర) ప్రయాగ కు మథుర కు మధ్యన ఉంది. ఈ రాజులను పారిభద్రకులని అంటారు. మధ్యయుగంలో ఆ రాజ్యానికి చంద్రకేతువు అన్న రాజు పరిపాలించాడు.  

- Erannaboas నదిని జోన్స్ - Sone (శోణ) నదియే అని తీర్మానించాడు. కానీ శోణ నదిని అదే పుస్తకంలో Sonos అని రచయిత పేర్కొనడం జరిగింది. ఒకే శోణ ను గ్రీకు రచయిత పొరబాటుగా ఒకచోట శోణ అనిన్నీ, మరొకచోట Erannaboas అనిన్నీ పేర్కొన్నాడని జోన్స్ తీర్మానం. అలా ఎలా పేర్కొంటాడో తెలీదు. రెండూ వేర్వేరు నదులెందుకు కారాదు? (ఆధారంగా తీసుకున్న గ్రంథంలోనే పొరబాట్లు ఉంటే - దాన్నే పట్టుకుని చరిత్రను నిర్మించటానికి చేసే ప్రయత్నం సబబెలా అవుతుందో తెలీదు.) 


- Erannaboas నది భారతదేశంలో మూడవ అతిపెద్ద నది అని ఆ పుస్తకంలో ఉంది. మెగస్తనీస్ చూసిన భారతదేశం భౌగోళికత ఎలాంటిదో మనకు తెలియకపోయినా, కొంచెం ఊహిస్తే - సింధు, గంగ నదుల తర్వాత కాస్త ప్రాముఖ్యమైన నది యమున అని తెలియవచ్చు. యమునకు పుష్కరాలు కూడా ఉన్నవి. ఈ పుష్కర సాంప్రదాయం ప్రాచీనమైనది. ఒకవేళ ఈ సాంప్రదాయాన్ని తిరస్కరించినా, సింధు, గంగల తర్వాత మెగస్తనీస్ చూసిన నదులలో యముననే పెద్దనది అయి ఉంటుందని ఊహించడంలో పొరబాటు లేదు. అంటే Erannaboas - యమున. జోన్స్ ఆ వివరాన్ని కప్పిపుచ్చి/మరచి దానిని సోన నదిగా ప్రస్తావించాడు. 

Page 68: The Ganges being greatest of all rivers, and Erannaboas being perhaps the third largest of Indian rivers though greater than the greatest rivers elsewhere; but smaller than Ganges where it falls in to it.  

- Erannaboas నది జమునా నది కావచ్చుననే అవకాశాన్ని జోన్స్ పరిశీలించలేదు. అలా పరిశీలిస్తే, గంగా యమునల సంగమాన ’పాలిబోత్ర’ నగరం ఉన్న సంభావ్యత కలుగుతుంది. ఆ పక్షంలో -- పాలిబోత్ర అనేది ప్రాతిష్ఠానపురమ్ కూడా అవవచ్చు. ప్రాతిష్ఠానపురం గంగా యమునల సంగమంలో ఉంది. ఇదే మాట కాళిదాసు విక్రమోర్వశీయమ్ లో ఉంది. 

(చిత్రలేఖా: ఏతద్భగవత్యా భాగీరథ్యా యమునాసంగమవిశేషపావనేషు సలిలేషు అలోకయత ఇవ ఆత్మానం ప్రతిష్ఠానస్య శిఖాభరణభూతం రాజర్షేః భవనముపస్థితే స్వః - విక్రమోర్వశీయమ్ ప్రథమాంకం

ఈ దేవత యగు గంగ, యమునతో కలియుట చేత పవిత్రములైన నదీసంగమమున్నది. ఈ నీటియందు తనను తాను చూచుకొనుచున్న ప్రతిష్ఠాన నగరమున, రాజర్షి విడిది చేసిన ఎత్తైన భవన ప్రాంతపు పైభాగమునకు చేరితిమి.) 


ఈ నగరం కొయ్యతో నిర్మించబడి వెయ్యేళ్ళ క్రితం దగ్ధమై పోయింది. ఈ ప్రాంతాన్ని ’ఝుసి’ అనే ప్రాంతంగా గుర్తించారు. ఝుసి అంటే బూడిద! మెగస్తనీస్ కూడా ఆ నగరాన్ని కొయ్యతో నిర్మించారని పేర్కొన్నాడట. అక్కడ ఓ స్థంభశాసనాన్ని గుప్తరాజైన ’సముద్రగుప్తుని’ శాసనంగా గుర్తించి అలహాబాదు కోటకు తరలించారు. ఆ స్థంభంపైన మొఘల్ రాజు జహంగీరు కూడా తన శాసనాన్ని చెక్కించుకున్నాడు.  

(Note: ఈ పేర్కొన్న స్థంభాన్ని అశోక స్థంభం అంటారు. ఇది దేవానాం ప్రియదర్శి అనబడే అశోకుడిదని, ఆ స్థంభంపైనే తర్వాతి కాలంలో సముద్రగుప్తుడు తన శాసనాన్ని వేయించుకున్నాడని ఒక వాదం. 

అంతే కాదు - దేవానాం ప్రియుడి ఒకానొక శాసనంలో ఐదు గ్రీకు పేర్లు ఉన్నాయని ప్రిన్సెప్ పండితుడు గుర్తించాడు. Rock Edict X111.  ఆ పేళ్ళు - అంతియోక, (Antiochus),  తురమాయ (PTolemy),  అంతికిని (Antigonus), మక (Magas), అలికసంద్ర (Alexander). దేవానాం ప్రియుడి కాలపు శాసనంలో గ్రీకు పేర్లున్నై కాబట్టి అశోకుడు - గ్రీకులకు సమకాలికుడని ప్రిన్సెప్ పండితుడు తీర్మానించాడు. 

దీనిని వివరించడానికి కోట వెంకటాచలం ప్రయత్నించారు. ఆయన అనడం ప్రకారం సముద్రగుప్తుడే అశోకాదిత్యుడు. పై పేళ్ళు రాజులవి కావనీ, స్థలాల పేళ్ళని ఒకరిద్దరు వివరించారు. అయితే మరింత శ్రద్ధగా చూసి, ఆ శాసనాన్ని వివరించిన వారు ఇలా అన్నారు. గ్రీకు పేర్లున్న శాసనంలో అశోకుని పేరు లేదు. (దేవానాం) ప్రియదర్శి - ఇది బిరుదనామం. ఇది గౌతమీపుత్ర శాతకర్ణికి, చంద్రగుప్తమౌర్యునికి, గుప్తరాజు కుమారగుప్తుడికి, హర్షునికి ఇంకా కొత మంది రాజులకూ ఉంది.  గుప్తరాజు స్కంధగుప్తుని కాలానికి ఈ శాసనం సరిగ్గా సరిపోతుంది. బౌద్ధ చరిత్ర (మంజుశ్రీమూలకల్ప, స్కంధగుప్తుని గురించిన వివరణలు) ప్రకారమూ ఈ శాసనానికి వివరణ సరిపోతుంది. ఆ శాసనం అశోకునికన్నా స్కంధగుప్తునికి స్పష్టంగా వర్తించగలదు. అలా ఉంచితే అటు అశోకునికీ, గుప్తులకూ మధ్య వందల సంవత్సరాల తేడా ఉన్నది. అన్ని వందల యేళ్ళలో భాష/లిపి స్వరూపం మారనే మారి ఉంటుంది. ఆ లిపి స్వరూపభేదాలతో ఆ శాసనాన్ని ఎవరైనా అనుశీలించారా? అన్న విషయం ప్రశ్నార్థకం.

ఏతావతా దేవానాం ప్రియదర్శి శాసనాలున్నూ - పురాణ రాజవంశావళి ఆధారిత చరిత్రకు ఖచ్చితంగా వ్యతిరేకమైనవని తీర్మానించటం సాధ్యపడదు. ఈ విషయమై మరెప్పుడైనా)

పాలిబోత్ర అంటే ప్రాతిష్టానపురం/పారిభద్రం అనే రెండు సమాధానాలు సాధ్యపడుతున్నవి. జోన్స్ చెప్పినదాన్నీ సరిగ్గా గమనిస్తే -  Erannaboas నది ప్రస్తావన అతను "ఏదో రెండువేల యేళ్ళనాటి పుస్తకంలో" చూశాడట! అతను చూసిన ఆ ’ఏదో’ పుస్తకం - అమరకోశం. (తను రెఫర్ చేసిన పుస్తకం పేరును కూడా చెప్పలేని అసమర్థుడు అతను!) అమరకోశంలో శోణా నది, "హిరణ్యవాహ" నది ఒక్కటే అని ఉంది. అది పాటలీపుత్రం సమీపంలోనే గంగలో కలుస్తూంది. ఒకవేళ పాటలీపుత్రమే పాలిబోత్ర అయినా భారతదేశంలో పురాణాల ప్రకారం (కనీసం మౌర్యుల కాలం వరకూ) మగధ రాజధాని గిరివ్రజపురమ్. పాటలిపుత్రం అన్నది మగధరాజధానిగా మౌర్యుల కాలానికి ప్రశస్తంగా లేదు. గుప్తుల కాలానికి ఆ నగరం ప్రాశస్త్యాన్ని పొందింది.

ఇంకా - 

- మెగస్తనీస్ సాండ్రొకొట్టసు ను ప్రాచీ రాజ్య రాజుగా చెప్పాడు.అతని పూర్వీకుడు జాండ్రేమ్సు. సాండ్రొకొట్టసు తరువాతి వాడు సాండ్రొ సిప్టసు. సాండ్రొకొట్టసునే చంద్రగుప్తమౌర్యుడు అనుకుంటే, ఆతని ముందు వాడు మహాపద్మనందుడు జాండ్రేమ్స్ అవాలి. ఆ పేర్లకు సామ్యం కుదరట్లేదు. అలాగే చంద్రగుప్తుని తర్వాతివాడైన బిందుసారుడు - సాండ్రో సిప్టస్ అవాలి. ఈ పేరుకూ సామ్యం కుదరట్లేదు. జాండ్రేమ్స్, సాండ్రోకొట్టసు, సాండ్రోసిప్టసు ఈ మూడు పేర్లూ, చంద్రశ్రీ, చంద్రగుప్తుడు, సముద్రగుప్తుడు - వీటితో పోలుతున్నాయి. 

- మెగస్తనీస్ ఎక్కడా చాణక్యుడు/విష్ణుగుప్తుడు/కౌటిల్యుడు - వీరి పేర్లు చెప్పలేదు. చాణక్యుని ప్రస్తావన లేక చంద్రగుప్తమౌర్యుని కథయే లేదు. అంటే మెగస్తనీస్ చెప్పిన సాండ్రోకొట్టసు మౌర్యుడు కాకపోవచ్చు.

- చంద్రగుప్త మౌర్యుని కాలంలో బౌద్ధం విస్తరిస్తూంది. శ్రమణ సాంప్రదాయం మిక్కుటంగా ఉంది. మెగస్తనీస్ ఎక్కడా ఈ విషయాలను పేర్కొనలేదు.

- చంద్రగుప్తమౌర్యుని మగధ అధిపతిగానే భారతదేశంలో గుర్తించారు. ప్రాచీ అన్న పేరు తో ముడిపెట్టటం ఎక్కడా లేదు. 

- మెగస్తనీస్ తాను చూసిన భారతదేశాన్ని, గ్రామ,నగర వ్యవస్థను వర్ణించాడు. ఇతనిది చంద్రగుప్తమౌర్యుని కాలమే అయితే, ఆ వివరాలు కౌటిల్యుని అర్థశాస్త్రంతో పోలి ఉండాలి. కానీ కౌటిల్యుని అర్థశాస్త్ర వివరాలలో గ్రామ, నగర వ్యవస్థ మెగస్తనీస్ వర్ణనలకు విరుద్ధంగా ఉంది. మెగస్తనీస్ చెప్పిన ప్రకారం తను చూచిన భారతదేశంలో బానిసవ్యవస్థ కానీ, బానిసలు కానీ లేనే లేరు.కౌటిల్యుని అర్థశాస్త్రంలో బానిసల గురించి, దాసకల్పం అని ప్రత్యేకంగా చర్చించాడు. అంతే కాదు, బుద్ధుని కాలంలోనూ ఈ వ్యవస్థ ఉండేది. ఆ వ్యవస్థను రూపుమాపాలని గౌతముడు ప్రయత్నించినట్టు బౌద్ధ గ్రంథాలలో ప్రస్తావనలు ఉన్నై. మెగస్తనీస్ ప్రకారం సాండ్రోకొట్టసు ఆరులక్షల పదాతిదళాన్ని నడిపించాడు. ఇది గుప్తుడికే ఎక్కువగా వర్తిస్తుంది. చంద్రగుప్తమౌర్యుడు - చాణక్యుడికి లోబడే ఉన్నాడు. శత్రువులను మాయోపాయంతోనే జయించాడు. అంత భారీయుద్ధానికి తెగబడలేదు. సెల్యూకస్ తన కూతురిని సాండ్రోసిప్టసుకు ఇచ్చాడని మెగస్తనీసు. అలహాబాదు శాసనం ప్రకారం ఓ శకరాజు కూతురిని సముద్రగుప్తుడు స్వీకరించాడు.  ఈ వివరాల సాయంతోనూ మెగస్తనీస్ గుప్తులకాలంలో ఉన్నాడని ఊహించవచ్చు.
   
ఈ కారణాలే కాక, పురాణ మగధ వంశావళితో పోలిస్తే వచ్చే తేడాల వల్లా, ఇతర కారణాల వల్ల విలియమ్ జోన్స్ ప్రతిపాదనలో ఖచ్చితత్వం లేదు. ఆతని ప్రతిపాదనను తోటి ఆంగ్లేయులైన Troyer, Colebrook అన్న పాశ్చాత్యులే ఖండించారు. Ambiguity - అన్న ఏ కారణంతో నైతే జోన్స్ పురాణాలను ఈసడించి త్రోసిపుచ్చాడో, అలాంటి కారణాలు మెగస్తనీస్ ఇండికా ప్రతిపాదనలో  ఇంకా మిక్కుటంగా ఉన్నాయి. అంతే కాదు, జోన్స్ తన ఉద్యోగి వద్ద చెప్పించుకున్నది భాగవతామృతం అనే ఒక్క పురాణంలో వంశావళిని మాత్రమే. ఆయన మరికొంత శ్రమపడి కనీసం మత్స్య, వాయు, భవిష్య పురాణాలను తైపారు వేసి ఉంటే - మగధరాజవంశావళి ఎంత స్పష్టంగా ఉందో తెలిసి ఉండేది. ఇన్ని అవకతవకలతో కూడిన జోన్స్ ప్రతిపాదనను, తదనంతర కాలంలో సమర్థించిన వాడు మాక్స్ ముల్లర్. 

జోన్స్ ప్రతిపాదనను, అందుకు మాక్స్ ముల్లర్ సమర్థననూ Troyer తను రచించిన కాశ్మీరరాజతరంగిణి పీఠికలో ప్రశ్నించాడు. ఆయన మాక్స్ ముల్లర్ కు ఈ విషయమై లేఖ కూడా వ్రాశాడు. ముల్లర్ అందుకు సమర్థంగా సమాధానం చెప్పలేకపోగా - ’అతనికంటే ఘనుడు అచంట మల్లన్న’ అన్నట్టు జోన్స్ ఊహలపై తన ఊహలు నింపాడు. జాండ్రేమ్స్ కూ మహాపద్మనందుడికి శబ్దసామ్యం లేదు కదా అంటే - ఆ జాండ్రేమ్స్ ఆ కాలంలో ఎవడో ప్రాచీ రాజు అయి ఉంటాడు అని ఈయన తీర్పు. 

ఫలితాంశం ఏమంటే - అలెగ్జాండరు, మౌర్యచంద్రగుప్తుడూ సమకాలికులు అన్న విషయం విలియమ్ జోన్స్ ’ఊహ’, అస్తవ్యస్త ఆలోచనల ద్వారానే మొట్టమొదటిసారి భారతదేశంలో నెలకొని వ్యాప్తి చెందింది. అంతకు మునుపు భారతదేశంలో ఆ భావన లేదు. విలియమ్ జోన్స్ గారి సదరు ఊహకు శాసనాధారాలు కానీ, ఇతరత్రా ఖచ్చితమైన ఆధారాలు కానీ లేవు. ఈ ఊహ - తదనంతరం పాఠ్యపుస్తకాలలో ప్రవేశపెట్టబడింది. నేడు మౌర్యచంద్రగుప్తుడు అనగానే క్రీ.శ. మూడవ శతాబ్దం అని సామాన్యులందరూ భావించటానికి ’మూలం’ - ఒక ఆంగ్లేయుని ఊహ, అసమగ్రమైన అవగాహన ! ఇది విచిత్రమైన నిజం!

జోన్స్ అవగాహనను స్వీకరించి ఆతని వాదాన్ని నిలబెట్టడానికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఇతర చారిత్రకులు పూనుకున్నారు. వీరిలో భారతీయులూ ఉన్నారు.అవన్నీ చర్చించడం ఈ చిన్ని వ్యాసంలో సాధ్యం కాదు. ఈ వ్యాసపరిధి Sheet Anchor/base ను చర్చించే వరకే.

ముద్రారాక్షస నాటక ప్రమాణం - సమస్యలు
---------------------------

అలెక్జాండరుకు సమకాలికుడే సాండ్రోకొట్టసు అనబడే మౌర్యచంద్రగుప్తుడు అని విలియమ్ జోన్స్ Asiatic research 10 వ స్నాతకోత్సవంలో ఎంతో ఆనందంగా ప్రకటించి, తన తదుపరి పరిశోధనలో మరిన్ని ఆధారాలు చూపుతానని చెప్పాడు. అయితే ఆ తర్వాతి సంవత్సరం జోన్స్ మరణించడంతో ఆతని బాధ్యతను లెఫ్టినెంట్ విల్ ఫోర్డ్ అనే ఆయన స్వీకరించాడు.

విల్ ఫోర్డ్ ముద్రారాక్షసాన్ని, అందుకు మూలమైన సోమదేవ సూరి కథాసరిత్సాగరం లోని చంద్రగుప్తుని పట్టాభిషేకం తాలూకు ఓ శ్లోకాన్ని పేర్కొని, ముద్రారాక్షస నాటకంలో నాయకుడు మౌర్యచంద్రగుప్తుడని, ఈ నాటకాన్ని స్ట్రాబో అనే గ్రీకు చారిత్రకుడు వ్రాసిన రాతలతో ముడిపెట్టాడు. విల్ ఫోర్డ్ ఈ వివరాలను Asiatic research ఐదవ సంపుటంలో పేర్కొన్నాడు.

స్ట్రాబో పేర్కొన్న వివరం యిది.

“The Indus runs in a parallel course along the breadth of these regions. The Indians possess partly some of the countries lying along Indus, but these belonged formerly to the Persians. Alexander took them away from the Arianoi and established in them colonies of his own. Seleukos Nikator gave them to Sandrokottus in concluding a marriage alliance, and received in exchange 500 elephants.”

సెల్యూకస్ - సాండ్రోకొట్టసు అనబడే మౌర్యచంద్రగుప్తుడు సమకాలికులని ఆతని భావం. ముద్రారాక్షస నాటకం చంద్రగుప్తుని పట్టాభిషేకంతో మొదలవుతుంది. పైగా ఈ నాటకంలో చంద్రగుప్తుడు పాటలీపుత్రానికి రాజు. ఇదే పాలిబోత్ర (అనబడే పాటలీపుత్రనగరము) ను  మెగస్తనీస్ కూడా పేర్కొన్నాడు. అందుచేత మౌర్యచంద్రగుప్తుడు, అలెక్జాండర్ సమకాలికులని విల్ ఫోర్డ్ భావన.

అయితే తదనంతర కాలంలో ముద్రారాక్షస సంస్కృతనాటకం పై గొప్ప వివరాలు, చక్కటి సమన్వయాలు సాహిత్యకారులు చేశారు. అదృష్టవశాత్తూ ఈ వివరాలు తెలుగులో కూడా లభిస్తున్నాయి. మాన్యులు నెలటూరి శ్రీనివాసయ్యంగారు ముద్రారాక్షసానికి ’రసాస్వాదిని’ పేరిట మహా అద్భుతమైన వ్యాఖ్యానాన్ని వ్రాశారు. ఆ గ్రంథానికి మున్నుడిలో ఎన్నో వివరాలను కూలంకషంగా చర్చించారు. 

- ఈ నాటకానికి రచయిత విశాఖదత్తుడు. ఈ విశాఖదత్తుడిది గుప్తచంద్రగుప్తుని కాలం. విశాఖదత్తుడు ’దేవీచంద్రగుప్తమ్’ అన్న మరొక నాటకాన్నీ వ్రాశాడు. అందులో కథ యిది. 

రామగుప్తుడూ, చంద్రగుప్తుడు అన్నతమ్ములు. రామగుప్తుడు ఒక యుద్ధంలో శకరాజుతో పరాజయం పాలయ్యాడు. యుద్ధ ఒడంబడికలో భాగంగా తన భార్య "ధృవస్వామిని" ని శకరాజుకు అప్పగించ పూనుకున్నాడు. ఈ చర్యను తమ్ముడు చంద్రగుప్తుడు నిరోధించి ధృవస్వామిని వేషంలో తనే శకరాజు మందిరానికి వెళ్ళి ఆతణ్ణి హతమారుస్తాడు. ఆపై ఇతడే రాజ్యాన్ని ఏలతాడు. 

ఈ ధృవస్వామిని కథ ఓ తామ్రశాసనంలోనూ, ఆమె పేరు గుప్తుల నాణాల లోనూ ఉంది. ఈ మూలాలవల్ల రచయిత విశాఖదత్తుడు గుప్తుల కాలపు కవి.  కథలో చంద్రగుప్తుడు - గుప్తచంద్రగుప్తుడు.

- ముద్రారాక్షసానికి మూలం బృహత్కథ. ఈ విషయాన్ని దశరూపకం అనే గ్రంథానికి వ్యాఖ్యానం వ్రాసిన ధనికుడు పేర్కొన్నాడు. 

తత్ర బృహత్కథా మూలం ముద్రారాక్షసమ్ -

చాణక్యనామ్నా తేనాయ శకటాలగృహే రహః
కృత్యాం విధాయ సహసా సపుత్రో నిహతో నృపః |
యోగానంద యశః శేషే పునర్నందసుతస్తతః 
చంద్రగుప్తః కృతో రాజా చాణక్యేన మహౌజసా ||

ఇతి బృహత్కథాయాం సూచితమ్ |

(దశరూపకం - ప్రథమ ఉచ్ఛ్వాసం చివరి శ్లోకం)

(ముద్రారాక్షసానికి మూలం బృహత్కథ. చాణక్యుడనే వ్యక్తి శకటాలుని ఇంట, ప్రతిమను చేసి మహాపద్మనందుని తన సుతులతో సహా వధింపజేశాడు. ఆపై యోగానందుడు కీర్తిశేషుడైనాడు. నందసుతుడైన చంద్రగుప్తుడిని చాణక్యుడు సింహాసనంపై నిలిపాడు. )

- బృహత్కథ మూలం ద్వారా రచించిన కథా సరిత్సాగరంలో పై శ్లోక వివరాలున్న చాణక్యుని కథ ఉంది. (Page 34, కథాసరిత్సాగరము, వేదము వేంకటరాయశాస్త్రి). అంతే కాదు, ఈ కథ విష్ణు పురాణంలోనూ, భాగవతంలోనూ కూడా ఉంది. 

- అయితే పురాణాల్లో, కథా సరిత్సాగర కథల్లో చాణక్యుడు చంద్రగుప్తుని పట్టాభిషిక్తుని చేసిన కథ వరకే ఉంది. రాక్షసమంత్రి ప్రస్తావన వాటిలో లేనే లేదు.

- ముద్రారాక్షసంలో నాయకుడు మౌర్యచంద్రగుప్తుడే. తనకు వందల సంవత్సరాల పూర్వీకుడైన మౌర్యుని కథ ఆధారాన్నే విశాఖదత్తుడు స్వీకరించాడు. 

- ముద్రారాక్షసం కథారంభమే చంద్రగుప్తుని పట్టాభిషేకంతో మొదలై, చాణక్యరాక్షసీయం గా ఈ ఇద్దరి ఎత్తులకు పై ఎత్తులతో సాగుతుంది. ఈ రాక్షసమంత్రి కథ అటు కథాసరిత్సాగరంలోనూ, విష్ణుపురాణంలోనూ, మరెక్కడా లేదు. అంతే కాదు - ఈ ముద్రరాక్షసం నాటకం చివర చాణక్యుడు వానప్రస్థాశ్రమం స్వీకరిస్తాడు. కానీ బౌద్ధుల సాంప్రదాయ చరిత్ర ప్రకారం (ఆర్య మంజుశ్రీమూలకల్ప III 455.6) చాణక్యుడు చంద్రగుప్తునికీ, బిందుసారునికీ, ఆపై అశోకుడికి కూడా మంత్రిత్వం నెరపినాడు. ఇలాంటి తేడాల కారణాన ఇది విశాఖదత్తుని స్వీయ కల్పిత రచన. It is clearly a fiction.

- ముద్రారాక్షసంలో ఎక్కడా సెల్యూకస్ ప్రస్తావన లేదు. మౌర్యచంద్రగుప్తుడు గ్రీకు రాజులతో తలపడిన ప్రస్తావన లేదు. ఇది కేవలం ’రాక్షస’ మంత్రికి, చాణక్యుడికి మధ్య జరిగిన ఎత్తుకు పై ఎత్తులను చిత్రించిన రచన మాత్రమే.

- ముద్రారాక్షసంలో ’శక’,’యవనుల’ ప్రస్తావన ఉంది. పర్వతేశ్వరుడనే ఒకానొక రాజుతో చాణక్యుడు ఒక ఒప్పందం చేసుకుంటాడు. యుద్ధం వస్తే సాయపడమనీ, చంద్రగుప్తుడు రాజైతే సగం రాజ్యం అతనికి ఇప్పిస్తానని. అవసరం తీరిన తర్వాత పర్వతేశ్వరుని చాణక్యుడు తెలివిగా మట్టుపెడతాడు. ఈ పర్వతేశ్వరుడు ’యవనుడు’. ఈ శకులు యవనులు గ్రీకులు కారా? - కారు. ఇది సమాధానం. ఎందుకంటే మహాభారతకాలంలోనే ఈ శక, యవన శబ్దాలు భారతదేశ సాహిత్యంలో ఉన్నాయి. (ఉదా: మాహాభారతంలో కాలయవనుని వృత్తాంతం. ) ఆపై సాహిత్యంలో ఇబ్బడి ముబ్బడిగా ప్రయోగింపబడినాయి. వారు మ్లేచ్ఛులు. భారతదేశం వాయవ్య ప్రాంతపు రాజులు. వీరు సాంప్రదాయ భారతధర్మాన్ని వీడిన కారణంగా వీరిని ధర్మహీనులుగా ఆర్యావర్తంలోని రాజులు వెలివేశారు. దీనికీ ఋజువులున్నై.

ఏతావతా - ముద్రారాక్షసం అనే కల్పిత నాటకం ద్వారా మౌర్యుడు, సెల్యూకసు సమకాలికులని, మెగస్తనీస్ పేర్కొన్న సాండ్రొకొట్టసే మౌర్యచంద్రగుప్తుడనీ తేల్చడం ఎంతమాత్రమూ కుదరదు. ఒకే ఒక బలహీనమైన లంకె - పాటలీపుత్రం.(మెగస్తనీస్ పాలిబోత్ర - పాటలీపుత్రం అవదని, పారిభద్ర/ప్రాతిష్టానం అవుతుందని, పారిభద్రం - మెగస్తనీస్ పేర్కొన్న ప్రాచీ రాజ్యంతో సరిపోలుతుందని, ఆ వాదనా డొల్ల అని ఇదివరకే చూశాం).  ఈ ఒక్క నగరం పేరునూ పట్టుకుని చరిత్రకు Sheet anchor గా నిర్ణయించటం అసమంజసం, అర్థరహితం. 

ఇక్కద కొంత బౌద్ధ వాఙ్మయాన్ని కూడా చూడాలి. గౌతమబుద్ధుని కాలంలో పాటలీపుత్రం లేదు. గౌతమబుద్ధుడు దీఘనికాయంలో ఓ చోట ఆనందునితో చెబుతాడు. "ఆనందా, భవిష్యత్తులో గంగానది ఒడ్డున గల ఈ ప్రాంతంలో గొప్ప నగరం వెలుస్తుంది. అది వైభవోపేతమై నిలుస్తుంది". ఆ నగరమే పాటలీపుత్రం. గౌతమబుద్ధుని తర్వాత మూడు శతాబ్దాల తర్వాత మౌర్యచంద్రగుప్తుడు జన్మించాడు. ఆ మూడు శతాబ్దాలలోనే అక్కడ నగరం వెలిసి, ప్రాభవాన్ని పొంది మగధ రాజ్య ముఖ్యపట్టణం, అభేద్యమైన గిరివ్రజ పుర దుర్గాన్ని వదిలి మౌర్యచంద్రగుప్తుడు పాటలీపుత్రానికి చేరుకుని స్థిరంగా రాజ్యపాలన చేయటం అసంబద్ధం. పైగా భారతదేశ పురాణాలలో మగధను, మౌర్యులను గిరివ్రజంతోనే పిలుచుకున్నారు. తదనంతర కాలంలోనే పాటలీపుత్రం ప్రాముఖ్యతను సంతరించుకుంది. శాతవాహన కాలం నాటి గుణాఢ్యుని బృహత్కథలో ఈ నగరం ప్రాభవంగా వర్ధిల్లిన ప్రస్తావన కనిపిస్తుంది. మరి, విశాఖదత్తుడు తన ముద్రారాక్షస రచనలో పాటలీపుత్రాన్ని ఎందుకు ఎంచుకున్నాడు? - కేవలం తనకు తెలిసిన వాతావరణం ఆ నగరంలో ప్రతిఫలించిన మూలాన.

(Note: చాణక్యుని కథ కథాసరిత్సాగరంలో ఉందని చెప్పుకున్నాం. అందులోనూ ఆ కథ నడిచింది వత్సరాజ్యం కౌశాంబీలో తప్ప పాటలీపుత్రం లో కాదు. అయితే చాణక్యుని యొక్క ఆ కథకు కొంత ముందు కథాసరిత్సాగరంలో పాటలీపుత్రక కథ ఉంది. పాటలీ-పుత్రకులు  కొత్తదంపతులు. వారు ఆకాశమార్గాన - గంగానది ఒడ్డుకు వచ్చారు. అక్కడ పుత్రకుడు కోట బొమ్మను ఇసుకపై చిత్రించి,తనకున్న అతీతశక్తులతో ఆ కోట తనంతట అదే నిర్మితమయ్యేట్టు చేశాడు. అదే విధంగా తనకున్న అలౌకిక శక్తులతో నగరాన్ని నిర్మించాడు. అలా వారిపేరుతో ఏర్పడిందే పాటలీపుత్రకం/పాటలీపుత్రమ్.) 

ఒక పక్క జాండ్రేమ్స్, సాండ్రోకొట్టసు పేర్ల సామ్యాలు చంద్రశ్రీ, గుప్తచంద్రగుప్తుడు - వీరితో కుదురుతుండగా -
క్రీ.పూ 327 లో చివరి ఆంధ్రశాతవాహనుడు చంద్రశ్రీ కాలం కుదురుతుండగా -
పురాణ రాజవంశావళి సమన్వయం సరిపోతుండగా - 
సప్తర్షి మండల చలనం వంటి ఖగోళశాస్త్ర విషయాల ఋజువులు సరిపోతుండగా -
ముద్రారాక్షసం ఒక కల్పన అని తెలుస్తుండగా -
ఇంకెన్నో విషయాల సమన్వయం కుదురుతుండగా -

జోన్స్, విల్ ఫోర్డ్ గారలు ముద్రారాక్షసాన్ని ప్రధాన చారిత్రక ఆధారంగా స్వీకరించి, పాలిబోత్ర అనే బలహీనమైన లంకె సాయంతో భారతదేశ చరిత్రను రచించడానికి ఒక ప్రధానమైన ప్రాతిపదికను ఎందుకు ఏర్పరుచుకున్నారు? ముద్రారాక్షసం ఆనవాలు దొరకగానే శ్రీ జోన్స్ గారు అదివరకు తాను వ్రాసిన చరిత్రనే తప్పుగా నిర్ణయించి కొత్తరచనా పర్వానికి అంత ఉత్సాహం ఎందుకు చూపారు?- అంతుబట్టని విషయాలు ఇవి. ఆపై మాక్స్ ముల్లర్, వింటర్ నిడ్జ్, స్మిత్ ఇత్యాది పాశ్చాత్య చారిత్రకారులందరున్నూ గుడ్డెద్దు చేలో పడ్డట్టు అదే వరసలో ప్రయాణించడం జరిగింది. ఆంగ్లేయుల ఏలుబడి జరుగుతున్న కాలం కాబట్టి వారిని ఎగబడి ప్రశ్నించిన వారు అప్పట్లో లేరు. పైగా భారతీయులకు చరిత్ర అంటే - రాజుల పేర్లూ, ప్రాంతాలు కావు. అందుకని ఆంగ్లేయుల అవగాహనతో రచించబడిన చరిత్ర, వారి ఏలికలో భారతదేశంలో చెల్లుబాటు అవడం జరిగింది.

స్ట్రాబో వ్రాసిన సెల్యూకస్ ఉదంతం కూడా కొంతలో కొంత ’ధృవస్వామిని’ దృష్టాంతంతో బలహీనంగా అయినా సరిపోలుతుంది. ఆ వివరాన్ని పరిగణించినా సెల్యూకసు గుప్తచంద్రగుప్తుని సమకాలికుడే అవాలి.       

 ************

ఇలా విలియమ్ జోన్స్ ఏకపక్షప్రాతిపదికపై క్రీ.పూ. 327 ను ఆధారం చేసుకుని, అంతకు ముందు చరిత్రను, ఆ బిందువుకు ఈవల రచించిన చరిత్ర - భారతీయ చరిత్ర Version 2.

ఈ పద్ధతి వల్ల - పురాణాల్లో క్రీ. పూ. 1534 నాటి చంద్రగుప్త మౌర్యుడు క్రీ.పూ 327 కు జరుపబడ్డాడు. ఫలితంగా (1534 - 327 = ~1200 years) 1200 యేళ్ళ పురాణాలలో నిలిపిన జాబితా ఎగిరిపోయింది. ఈ 1200 యేళ్ళకు సరిపడా లెక్కలు చూపాలి కాబట్టి ఆ మధ్య కాలం నాటి శుంగులు, కాణ్వులు, శాతవాహనులు కుదించుకు పోయారు. (ఈ కుదింపును సమర్థించడానికి పురాణాలకు వక్రభాష్యం చెప్పడం, ప్రక్షిప్తాలు ఏర్పరచడం, పురాణ పాఠాలను Tamper చేయడం బాగా విస్తరించింది. విభిన్నమైన పాఠాలకు మంచి గిరాకీ ఏర్పడింది.) గుప్తులు క్రీస్తు శకం ఈవలకు ఈడ్వబడ్డారు. పురాణాల ప్రకారం క్రీస్తు పూర్వం ఒకటవ శతాబ్దపు కాలం నాటి కాళిదాసు, క్రీస్తు శకానికి వచ్చి పడ్డాడు.  కాణ్వులు, శుంగులు లెక్కలేకుండా ఎగిరిపొయేరు. విక్రమాదిత్యుడు, శాలివాహనుడు - అసలు అడ్రసు లేకుందా పోయారు. 

ఇలా చరిత్ర - పౌరాణిక చరిత్రతో పోలిస్తే అస్తవ్యస్తమై పోయింది. అయితే సర్ విలియమ్ జోన్స్, మాక్స్ ముల్లర్ ఇత్యాదులు తెలివైన వారు. ఇటువంటి సమస్యలను పరిష్కరించడంలో ఆంగ్లేయుల తెలివి అమోఘమైనది. If you can't solve a problem, confuse it!  ఇది అధికారపక్షానికి ఉపయోగపడే ఉపయుక్తమైన సిద్ధాంతం.

అనేకవిధాలుగా వారు - తము వ్రాసిన అవకతవక ’ఊహ’ లకు సమాధానం చెప్పకుండా, పురాణచరిత్రను అవకతవకలని నిర్ధారించారు. 

************

జోన్స్ చరిత్రను ప్రామాణికంగా మార్చి, ఆయన ప్రాతిపదికలో ఏర్పడిన అవకతవకలకు సమాధానం వెతుకుతూ పోయే ప్రయత్నంలో తయారైనది భారతీయ చరిత్ర - 2.5. 

ఉదాహరణకు ఇదివరకటి కాళిదాసు. ఈ కాళిదాసు స్పష్టంగా విక్రమాదిత్యుడనే చక్రవర్తి ఆస్థానంలో ఉన్న కవి అని పురాణాలు పేర్కొన్నాయి. ఆయన కాలం - క్రీ.పూ. మొదటి శతాబ్దం. అయితే విలియమ్ జోన్స్ లెక్కల ప్రకారం ఆ కాలానికి శాతవాహనుల సమయమే కుదరదు. అందుచేత - కాళిదాసు క్రీ.శ రెండవ శతాబ్దానికి ఈడ్వబడ్డాడు. ఇప్పుడు రెండవ శతాబ్దంలో కాళిదాసు ఉన్నట్టు చెప్పటానికి అనువైన ప్రమాణాల కోసం వెతికితే దొరికిన ఇతర ఆధారాలు దొరికాయి. అదేమంటే - వాకాటక ప్రవరసేనుని సేతుబంధానికి ఒకానొక వ్యాఖ్యానంలో ఆ కావ్యం వ్రాసింది కాళిదాసు అని ఉంది! ఈ లెక్కను సరించి, ఇంకొన్ని కథలను ఆకరం చేసుకుని కాళిదాసు, ప్రవరసేనుడు సమకాలికులుగా తేల్చి, కాళిదాసును క్రీ.శ. 4 వశతాబ్దానికి లాగారు.      

ఇలా మూడు సమాంతర చరిత్రలు భారతీయులకు ఏర్పడ్డాయి.  

తదనంతర కాలంలో ఎందరెందరో చారిత్రకులు, సామాన్యులు, మాన్యులు - తెలిసో తెలియకనో జోన్స్ గారి ప్రాతిపదిక ను పాఠ్యపుస్తకాలలో చదువుకుని, అదే ప్రామాణికంగా భావించి మౌర్యచంద్రగుప్తుడు క్రీ.పూ 327 కాలంనాటి వాడని స్థిరమైన నిర్ణయానికి వచ్చేశారు. ఇందువల్ల ఎన్నో అనుమానాలు వచ్చినప్పటికీ ఆ అనుమానాలకు తోచిన సమాధానాలు వెతుక్కోవడమే చేశారు తప్ప మూల ప్రాతిపదికను ప్రశ్నించి నిగ్గు తేల్చుకున్నవారు చాలా అరుదు. ఇప్పుడు జోన్స్ ప్రాతిపదిక నిర్ధారిత సత్యమై భారతీయుల నోళ్లలో నానుతోంది. మనం ఇప్పుడు చదువుకున్నదీ, చదువుకుంటున్నదీ, సమర్థిస్తున్నదీ కూడా భారతదేశ చరిత్ర Version 2.

 పర్గీటర్
------

ఓ పక్క - క్రీ.పూ 3138 లో మొదలైన భారతదేశ చరిత్ర
మరో ప్రక్క - క్రీ.పూ. 327 లో మెగస్తనీస్, మౌర్యచంద్రగుప్తులు సమకాలీనులు అన్న భావనతో కూర్చిన భారత చరిత్ర

రెంటికీ పొంతనే లేదు. ఈ రెండు విరుద్ధమైన అంశాలను బలవంతంగా తెచ్చి ఒకే కాడికి కట్టి చరిత్రను దున్నటానికి ప్రయత్నించిన వ్యక్తి F.E. PARGITER. ఈయన 1913 లో జోన్స్ ఊహను, పురాణాలను సమన్వయింప తలపెట్టాడు. ఇది సమన్వయం కాదు. బలవంతంగా పురాణాలను తనకు ఆదర్శప్రాయుడైన విలియమ్ జోన్స్ ఊహకు తగినట్టుగా అమర్చటం అన్నమాట.  

అందులో భాగంగా ఒక్కొక్క రాజవంశాన్ని తగ్గించటం మొదలెట్టాడీయన. మొదటగా బార్హద్రథులు. వీరి వంశావళికి సంబంధించిన పురాణకథనాన్ని ప్రచురిస్తూ ఈయన ఈ పనులు చేశాడు.

- ఎక్కడ సంస్కృతపాఠంలో త్రింశత్ (30) అని ఉందో అక్కడల్లా ఆయన ’వింశత్’ (20) అన్న పాఠాన్ని స్వీకరించాడు. పదేళ్ళ ’టాక్స్ విధింపు’ అన్నమాట! 

ఉదా: 
అయుతాయుస్తు షడ్వింశద్(షట్ త్రింశత్) రాజ్యం వర్షాన్యకారయత్ 
అష్టవింశతి (త్రింశతి) వర్షాణి మహిం ప్రాప్స్యతి వై విభుః 

ఇలా పది వత్సరాలు, అక్కడా ఇక్కడా కోతపెట్టి మల్లగుల్లాలు పడినా పూర్తిగా బార్హద్రథుల వంశావళి లెక్క కూడితే వెయ్యేళ్ళకు దగ్గరగానే వస్తూంది. ఇక కుదరక ఆయన మరో చిత్రమైన పాఠాన్ని చెప్పాడు.

- బార్హద్రథులు మొత్తం 22 మంది. (ద్వావింశత్). అయితే వీరు 32 (ద్వా త్రింశత్) అట. మరి ఆ రాజుల లెక్కల పేర్లు సరిపోవట్లేదేంటి? అని ప్రశ్నిస్తే - వారిలో సగం పదునారుగురు కలికి ముందు ఉన్నవారట. మిగిలిన లిస్టు కలి తర్వాతి వాళ్లదట. అలాగైనా సరే మొత్తం 32 మంది ఏరీ? అంటే పదిమంది ఎలానూ కలికి ముందున్నారు కదా అని పురాణాల్లో ప్రచురించలేదట! 

- ఇంకో భాష్యం చెప్పాడీయన. ఈ ముప్పై మంది బార్హద్రథులు కలిసి 700 యేళ్ళే రాజ్యం చేశారట. (త్రయో వింశాధికం తేషాం రాజ్యం శతసప్తకమ్). ఆ పాఠం క్రిందనే "పూర్ణం వర్షసహస్రం వై తేషాం రాజ్యం భవిష్యతి" - అన్న పాఠమూ ఉంది.పైగా ఈ పాఠం ఆరు పురాణాల్లో ఒకే విధంగా ఉంది, కానీ ఆతనికి మొదటిపాఠమే స్వీకార్యమట! ఈ 700 అనే నెంబరును అంతకు ముందు ~20 యేళ్ళ క్రితమే- విలియమ్ జోన్స్ "ఊహించి" చెప్పేశాడు. విలియమ్ జోన్స్, ఏ ఆధారమూ లేక, కేవలం గాలి ఊహతో బార్హద్రథుల మొత్తం కాలం 700 సంవత్సరాలు అని ఊహించగానే అందుకు తగినట్టు పురాణాల్లో పద్యపాదం కూర్పు తనంతట జరిగిపోయింది! ఇది ప్రపంచంలో అత్యద్భుతమైన వింత! అంతకన్నా వింత ఏమంటే - కాస్తో కూస్తో సంస్కృతం తెలిసిన ప్రాజ్ఞులు, పండితులైన భారతీయులు ఈ 700 ఏళ్ళ లెక్కను సరైన ప్రాతిపదిక లేకనే ఆమోదిస్తున్నారు! బార్హద్రథులలో ఒక్కొక్క రాజు రాజ్యం ఏలిన కాలాన్ని విడివిడిగా కూడుకున్నా ’పూర్ణవర్షసహస్రం’ ఏర్పడుతుంది.

- ఇలాంటి విషయాలు పర్గీటర్ రచనలో మరిన్ని ఉన్నాయి. ఇలా ఎందుకు జరుగుతోంది? ముప్పై నంబరు వచ్చినప్పుడల్లా ఇరవై లతో సరిపెట్టుకునే దురవస్థ ఎందుకు?  అంటే ఈయన దానికి రోమాంచకమైన కారణం చెప్పాడు. పురాణాలన్నీ మొదట ప్రాకృతభాషలో రచించబడినవట. వాటిని సంస్కృతంలో మార్చే ప్రయత్నంలో ఛందోభంగాలు, శబ్ద స్ఖాలిత్యాలు, అపశబ్దాలు ఏర్పడ్డాయనేశాడతను. పాపం వ్యాసుడు!

- మౌర్యులను ఈ పర్గీటర్ మరింత దారుణంగా ఊచకోత కోశాడు. మౌర్యరాజులు మొత్తం 12 మంది అని భవిష్యపురాణం, మత్స్య వాయుపురాణాల్లో కొన్ని పాఠాలు పేర్కొంటున్నాయి. ఈ విషయాన్ని పర్గీటర్ కూడా ప్రస్తావించాడు. అయితే 9,10 మంది మౌర్యుల పాఠాన్ని స్వీకరించాడీయన. వీరి కాలాలను కలిపితే రెండువందలకు పైబడి యేళ్ళు కుదురుతుంది. ఎందుచేతనో ఈయన 137 యేళ్ళు అన్న పాఠాన్ని స్వీకరించాడు. ’సప్తత్రింశత్ర్యయోత్తరమ్’ అన్న పాఠాన్ని ’సప్తత్రింశత్ శతోత్తరమ్’ గా స్వీకరించి 337 ను 137 యేళ్ళకు కుదించేశాడు. అయితే ఈ లెక్క భవిష్యపురాణంలో 316 యేళ్ళని  ఉంది. 

  
- పర్గీటర్ గారు రాజవంశావళినే కాదు సప్తర్షులనూ వదల్లేదు. యుధిష్ఠిరకాలానికి మహాపద్మనందునికి మధ్య 1500 వత్సరాలని, అంటే సప్తర్షులు ఒక్కో నక్షత్రంలో వందేళ్ళ చొప్పున 15 ఇళ్ళు మారి శ్రవణ నక్షత్రంలో ఉన్నారన్న స్పష్టమైన లెక్కను ఈయన మార్చాడు. పంచశత అన్న శబ్దాన్ని పంచాశత్ అని మార్చి 1500 ను 1050 అనే పాఠంగా నిలిపాడీయన. 

- ఆయన ప్రకారం సప్తర్షి మండలం ఆవృత్తి క్రీ. శ. నాలుగవ శతాబ్దంలో పూర్తయ్యింది. మరి ప్రస్తుతకాలానికి అనగా 19 వ శతాబ్దానికి కు రెండు ఆవృత్తులు పూర్తవటం ఖగోళానికి చెందిన ప్రత్యక్ష ప్రమాణం కదా? అంటే సమాధానం లేదు.  

అయితే ఈయన మత్స్య, వాయు పురాణ పాఠాలను పక్కపక్కన పెట్టి ప్రచురించాడు. అందులో అపపాఠాలను, భిన్న పాఠాలను పేర్కొన్నాడు. సమగ్రమైన పాఠాలను ఏర్పరుచుకున్న తర్వాత ఈయన ఈ పనికి పూనుకొని ఉంటే బావుండేది కానీ, అయినంతలో ఈయన చేసిన పని ఉపయోగపడుతుందని ఒప్పుకోవాలి. 

బౌద్ధ చరిత్ర 
-------

చరిత్ర రచన తాలూకు ఆధారాన్ని మాట్లాడుకునేప్పుడు బౌద్ధ చరిత్ర ను ప్రస్తావింపక తప్పదు. భారతదేశంలో కాశ్మీర రాజ్యంలో, కపిలవస్తు గణతంత్రంలో పుట్టిన గౌతమబుద్ధుడి జన్మ ఆధారంగా శ్రీలంక, చైనా దేశాల బౌద్ధ గ్రంథాలలో రాజవంశ చరిత్ర వివరాలు ఉన్నవి. ఇందులో చైనా సాంప్రదాయం ప్రకారం గౌతమబుద్ధుడిది క్రీ.పూ. 8 వ శతాబ్దం. గౌతమబుద్ధుని తాలూకు వివిధ సాంప్రదాయాలను సేకరించి ఐరోపాలో బుద్ధుని కాలాన్ని గణించటానికి విలియమ్ జోన్స్ కంటే మునుపే ప్రయత్నం జరిగింది. వారందరూ కలిసి ఏర్పరిచిన కాలప్రమాణం ప్రకారం బుద్ధుడు క్రీ.పూ. 1027 లో జన్మించాడు. Joseph De guignes అనే అతను 1756 లో ఈ కాలాన్నే ప్రమాణంగా తీసుకున్నాడు. అతణ్ణే తదనంతరం విలియమ్ జోన్స్ తన మొదటి వర్షన్ చరిత్రలో అనుసరించింది.

బుద్ధుడి పుట్టుక తేదీ సంగతి అలా ఉంటే మహావంశం, దీపవంశం, ఆర్య మంజుశ్రీ మూలకల్పం, లంకావతారసూత్రం ఇత్యాది రచనల్లో గుప్తుల గురించిన చక్కని సంగతులు వ్రాయబడి ఉన్నాయి. గుప్తుల కాలంలో స్కంధగుప్తుడు అందరు గుప్తులలోకి ప్రముఖుడు. ఆతని గురించి బౌద్ధ గ్రంథాలు బాగా పేర్కొన్నవి. 

బౌద్ధ గ్రంథాలలో అమూల్యమైన చారిత్రక అంశాలు ఉన్నప్పటికీ, మూలం - అంటే గౌతమ బుద్ధుని జన్మ దినం ఇదీ అని ఖచ్చితంగా ఒక తేదీని ఏర్పరిచి, దానిని validate చేయగలిగే ప్రమాణాలు సందేహాస్పదం. అలా నిర్ణయించాలంటే తిరిగి పురాణాల అవసరం తీసుకోవడం తప్పదు.  బుద్ధుడి జన్మదినం గురించి బౌద్ధ గ్రంథాల ప్రకారం తీర్మానించాలంటే యుధిష్ఠిర/కలి/సైరస్/విక్రమ/శాలివాహన శకాల ఆధారంగా తీర్మానం చేయవలసి ఉంటుంది.   

Modern method of validating Puranic verses related to astronomy  
-----------------------------------------------------

ఆధునికంగా - అంటే ఇప్పటి కాలంలో అత్యంతాధునిక సాంకేతిక పద్ధతుల సాయంతో మహాభారత యుద్ధ సమయాన్ని పరిశోధించటానికి పూనుకున్న వారు - ప్రొఫెసర్ B.N. Narahari Acharya. ఈయన మెంఫిస్ యూనివర్శిటీ లో ఫిజిక్స్ ప్రొఫెసర్. ఈయన Date of the Mahabharata War Based on Simulations using Planetarium Software  అని ఒక పరిశోధనపత్రం రచించారు. Celestial Mechanics కి సంబంధించిన ఆధునిక algorithms తో ఆయన Planetary software ను రూపొందించి కనుగొన్న మహాభారత కాలాది తేదీలను గణించారు. 

ఈ సాఫ్ట్ వేర్ ఎలా పని చేస్తుంది?

ముందుగా ప్రపంచం లోని ఏ ప్రాంతాన్ని అయినా (అక్షాంశ, రేఖాంశాల సహాయంతో) ఎన్నుకోవాలి.
చరిత్రలో ఏ తారీఖునైనా ఎన్నుకోవాలి.
ఆ తారీఖున ఆకాశంలో నక్షత్రాల, గ్రహాల, ఇతర ఖగోళ వస్తువుల యొక్క అమరికను ఈ software సహాయంతో కంప్యూటర్ తెరపై చూసుకోవచ్చు.  అదే రోజున అంతరిక్షంలో జరిగే ఖగోళ విషయాలను తద్వారా కనుక్కోవచ్చు. మహాభారతంలో కొన్ని తారీఖులను ఈ సాఫ్ట్ వేర్ ద్వారా పరీక్షించారు. 

మహభారతంలో ఈ క్రింది ఘటనలు ఉన్నై.

కృష్ణరాయబారం కోసం కృష్ణుడు బయలుదేరిన దినాన - రేవతి నక్షత్రం
హస్తినకు చేరుకున్నది - భరణి
చంద్రగ్రహణం - కార్తీక పౌర్ణమి
సభలో చర్చలు - పుష్య వరకు
హస్తిన వదులుట - ఉత్తర ఫల్గుణి
...
....
ఈ వివరాలను బట్టి సేన్ గుప్త, కొచ్చర్, రాఘవన్, సిద్ధార్థ వంటి ప్రముఖ చారిత్రకులు ఆ తారీఖును లెక్క కట్టడానికి ప్రయత్నించి, కొన్ని తారీఖులను ప్రతిపాదించారు. వారు ప్రతిపాదించిన తారీఖులను ఈ సాఫ్ట్ వేర్ కు అందించి ఆయా దినాలలో అంతరిక్షం ఎలా ఉంది అని పరిశీలించి ఖగోళ వివరాలను లెక్కగడితే - రాఘవన్ గారి ప్రతిపాదనకు సరిగ్గా వివరాలు సరిపోతున్నాయి. 

తద్వారా పైని ఘటనలు సెప్టెంబరు - 26 నుంచి 29, క్రీ.పూ. 3067 లో జరిగాయని సాఫ్ట్ వేర్ సూచించింది. ఇదే తారీఖును ఆధారంగా చేసుకుని మహాభారతంలో ఇతర ఖగోళ ప్రస్తావనలను సరిచూస్తే - వాటి లెక్కా సరిపోతున్నది. 

ఫలితంగా - మహాభారత యుద్ధకాలం క్రీ.పూ. 3067 లో అని ఈ సాఫ్ట్ వేర్ ద్వారా వెల్లడి అయింది. 

ఈ పరిశోధనలు ఇంకా జరుగుతున్నాయి . ప్రొఫెసర్ గారి పేజీ ఇది. ఇందులో ఆయన విష్ణుపురాణంపై, మహాభారతకాలంపై, ఋగ్వేద కాలంపై ప్రచురించిన పత్రాల జాబితా కూడా ఉంది.       

ముగింపు
------

సర్ విలియమ్ జోన్స్ రచించిన చరిత్రకు మద్దతుగా/వ్యతిరేకంగా ఎన్నో ఉపపత్తులు, వాదప్రవాదాలు, అనుమానాలు తర్వాతి కాలంలో కొంతవరకూ వ్యక్తమయ్యాయి. అయితే ఆతను ఏర్పరచిన అలెగ్జాండరు - మౌర్యుడు సమకాలికులన్న క్రీ.పూ. 327 ఆధారం మాత్రం పాఠ్యపుస్తకాలలో ఏర్పరుపబడింది. 

ఏ శాస్త్రమైనా ఏదో ఒక్క చోట నిలిచి స్థిరంగా ఉండదు. కొత్త ప్రమాణాలు దొరికినప్పుడు చరిత్రలో ఖాళీలను తిరిగి బేరీజు వేసి పూడ్చవలసి ఉంటుంది. నేటి సాంకేతికయుగంలో చరిత్రపై కొత్తకోణంలో ప్రయోగాలు జరగాలి.

- ఆయా కాలాలలో త్రవ్వకాలలో దొరికిన వస్తువుల రేడియో ధార్మికతను బట్టి half life period గణన ఆధారంగానూ
- శాసనాల ద్వారా నిశిత పరిశీలన ద్వారానూ, (ఇందులో వచ్చే సమస్యలను మళ్ళీ ఎప్పుడైనా )
- శాసనాలలో కనిపిస్తున్న లిపుల లోని విభిన్నత (Comparative Philology) అధారంగానూ, 
- ఖగోళ శాస్త్ర ప్రమాణాల పరంగానూ,
- జ్యోతిశ్శాస్త్ర ప్రమాణాల ద్వారానూ,
- సమాంతర చరిత్రల సూక్ష్మ పరిశీలనల మూలంగానూ
- ఇతర పద్ధతుల ద్వారానూ 

చరిత్రలో ఖాళీలు పూరింపబడాలి. ఈ పరిశోధనా ఫలితాలు అందరికీ అందుబాటులోకి రావడం మరింత ముఖ్యం. అంతవరకూ పురాణాలు చాదస్తమైనవని త్రోసిపుచ్చడం కానీ, తదన్య చరిత్రలు వినూత్నమైన దృక్పథం గలవని  గుడ్డిగా ఆమోదించడం గానీ పొరబాటు కాగలదు. 

సంతః పరీక్షాన్యతరత్‌ భజంతే 
మూఢః పరప్రత్యయనేయబుద్ధిః |   

కామెంట్‌లు

  1. explained well
    Thanks for the details,

    Request: You can split in two posts, so that it will reach so many.
    Little bit lengthy, can't read in one stretch and took long time to understand

    రిప్లయితొలగించండి
  2. Agree. It is lengthy, but could not help. Will consider your suggestion if I continue this series.

    రిప్లయితొలగించండి
  3. మంచి వ్యాసం. చాలా ఉపయుక్తమైన విలువైన వ్యాసం. విశ్వనాథవారు గుర్తుకు వచ్చారు. భారతదేశచరిత్రను పాశ్చాత్యులు అస్తవ్యస్తం చేసి పారేసారు - మనవాళ్ళలో పాతుకొనిపోయిన పాశ్చాత్యవ్యామోహం కారణంగా మనదేశంలో మన చరిత్రగురించీ పురాణేతిహాసల గురించీ తప్పుడు అభిప్రాయాలు తరతరాలుగా పాతుకొని పోయాయి. ఈ‌పరిస్థితి మారాలి.

    ఈ వ్యాసాన్ని తమతమబ్లాగుల్లో అవశ్యపఠనీయంగా సూచించేందుకు దయచేసి అందరు బ్లాగర్లకూ దయచేసి అనుమతి నివ్వవలసిందిగా వ్యాసరచయితను అభ్యర్థిస్తున్నాను.

    సాటి బ్లాగర్లకు నా విన్నపం. వ్యాసరచయిత గారు అనుమతించిన పక్షంలో ఈ వ్యాసానికి విస్తృతప్రచారం కలిగించేందుకు తమతమ బ్లాగుల్లో తమ పాఠకులకు తప్పక సూచించవలసింది.

    మరొక చిన్నమాట. సతీష్ గారు చెప్పినట్లు కొంచెం‌ పొడుగైన వ్యాసమే. కాని సైధ్ధాంతిక విషయాలను చర్చించే వ్యాసం అన్న కోణంలో‌చూస్తే ఇది చిన్న వ్యాసమే అని చెప్పాలి తప్పక.

    రిప్లయితొలగించండి
  4. అనుమతులు గట్రా అనే అభ్యర్థనలు వద్దండి. పబ్లిక్ డొమైన్ లో వ్రాసింది. వాడుకోవచ్చు.

    రిప్లయితొలగించండి
  5. Scholarly article.Not for one sitting. But essential reading. To get the argument reach, and make it acceptable to the larger sections of people is a huge task,especially in this atmosphere of irrational negativity against everything Indian among Indians.Congrats and thanks.

    రిప్లయితొలగించండి
  6. Ravigaru, Just THANKS is a very small word. I came to know about William Jones during my Translation Studies (PG Dipl) and wondered for his interest on our culture. I came to know many more details now. More than a scholarly article. Regards, Nagapadmini

    రిప్లయితొలగించండి
  7. Thanks - అంత లేదండి. :) ఈ వ్యాసం ఇతర రచయితల వ్యాసాల సంకలనం మాత్రమే. మీరు నన్ను పట్టుకుని స్కాలర్ అంటున్నారు. :) ఆ పైన వ్యాఖ్యలో ప్రొఫెసర్ మూర్తి గారు కూడా! :)

    వ్యాసభారతం విమర్శనము లో ఆంగ్లేయులైన వింటర్ నిట్చ్ ను, వెబర్ ను స్వామి - అక్కడక్కడా ఏకి పారేశారు. అది చదివినప్పుడు నాకు ఆశ్చర్యమేసింది. ఆ తర్వాత మెలమెల్లగా అర్థమవుతూ వచ్చింది. జోన్స్ గురించి కూడా - అలా పొగడమని నేర్పించారండి మనకు. ఇంగ్లీషు వాడు కాస్త మనపై ఆసక్తి చూపించగానే అతని గురించి కొండంతలుగా పొగడ్డం, ఏ కొంత రాసినా నెత్తిన పెట్టుకోవడం మామూలైపోయింది. వ్యక్తులకంటే శాస్త్రం, చరిత్ర, సాహిత్యం గొప్పవి. వాటికంటే భాష గొప్పది.

    రిప్లయితొలగించండి


  8. ఏమండీ రవిగారు

    మీరు బ్లాగాడిస్తా రవి గారేనా ?

    జిలేబి

    రిప్లయితొలగించండి
  9. dhruva nakshatram gurinchi inkontha parisodhana from RN Iyengar.
    https://www.youtube.com/watch?v=AphtLcMDGKs

    might be helpful in your research.
    Thanks for this wonderful article.
    Haven't read completely due to length.

    రిప్లయితొలగించండి
  10. Absolutely amazing speech by RN Iyengar.

    నేను Precision of equinox గురించి శ్రీ మహీధర నళినీ మోహన్ పుస్తకాల్లో చదివాను. ఆయనా క్రీ.పూ. మూడవ శతాబ్దంలో గ్రీకు శాస్త్రవేత్త హిప్పార్చిస్ అనే అతను ధృవచలనాన్ని కనుక్కునట్టు కేలండరు కథ పుస్తకంలో వ్రాశారు. భారతీయులకు ఈ విషయం తెలుసా తెలియదా అని మహీధర వారికీ సందేహంగానే ఉన్నట్టు అందులో వారు అన్నారు. తర్వాత పుస్తకం "నక్షత్ర వీథుల్లో". అందులో భారతీయులకు ధృవచలనం తెలుసు అన్నట్టు (గొబ్బూరి రాఘవరావు పుస్తకాన్ని) ఉటంకించి చెప్పారు.

    పైన వీడియోను బట్టి శిశుమార constellation బృహత్సంహిత కాలానికే ఉన్నట్టు స్పష్టంగా ఉన్నట్టూ, జాకోబీ, విట్నీ, కీథ్ వంటి పాశ్చాత్యులు భారతీయుల శాస్త్రజ్ఞానంపై పొరబడినట్టూ తేల్చారు. అయ్యంగారు గారు చెప్పిన మరో విషయం గమనార్హం. "మన పాఠాల్లో, కనీసం సంస్కృత కళాశాలల్లో ఈ అస్ట్రానమీ అంశాలున్న పురాణాలను నేర్పాలి."

    వీడియో పంచుకున్నందుకు ధన్యవాదాలు. (మీ పేరు పలకటానికి ఇబ్బందిగా ఉంది. సారీ. :) )

    రిప్లయితొలగించండి
  11. . . . . "మన పాఠాల్లో, కనీసం సంస్కృత కళాశాలల్లో ఈ అస్ట్రానమీ అంశాలున్న పురాణాలను నేర్పాలి. . . .
    అవునండీ.

    రిప్లయితొలగించండి
  12. అద్భుతమైన వ్యాసం. నమోవాకాలు.

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Comments ridiculing, abusing, bullying and forcing to agree in any form, if objectionable to the blog owner will be removed.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అశోకుడెవరు? - 1

Disclaimer

విద్యానగర విహారం