హిందూరాయ సురత్రాణ - ఇస్లామీయకరణ

రాజులలో సుల్తాను: విజయనగర రాజాస్థాన వస్త్రధారణపై ఇస్లామీయకరణ ప్రభావం

ఫిలిప్ వాగ్నర్ వ్రాసిన వ్యాసం యొక్క సారాంశాన్ని ఖండిస్తూ ఇదివరకటి వ్యాసానికి ప్రస్తుత వ్యాసం పొడిగింపు. వాగ్నర్ పైకి చాలా ఓపెన్ గా రచించినట్టు కనిపించినా, ఆయన ఉద్దేశ్యం - విజయనగర సామ్రాజ్య సారథులైన హరిహర బుక్కరాయలిద్దరున్నూ నాటి ఢిల్లీ సులతానుకు సామంతులనీ, వారిమీద, ఆపై విజయనగరాన్ని పరిపాలించిన సంగమ, సాళువ, తుళువ, ఆరవీటి రాజులపై మహమ్మదీయ మత ప్రభావం తీవ్రంగా ఉందని చెప్పటమేనని గ్రహించవచ్చు. ఆ నేపథ్యంలో వాగ్నర్ - ’హిందూరాయ సురత్రాణ’ శబ్దాన్ని తన వ్యాసంలో ప్రతిపాదించిన విషయానికి అనుగుణంగా (అతి) తెలివిగా మలుచుకున్నాడు.

వాగ్నర్ - సురత్రాణ శబ్దాన్ని గురించి చేసిన ప్రతిపాదన చూద్దాం.

నేను ఈ విధంగా ప్రతిపాదిస్తున్నాను: సుల్తాను, హిందూరాజుల్లో సుల్తాను – ఈ రెండు బిరుదులు ఉపమానాలుగా కాక మాటకు మాటగా, ముఖ్యార్ధంగానే వాడబడ్డాయి. అంటే విజయనగర రాజులు తమని తాము సుల్తానులుగానే ప్రకటించుకున్నారు: అయితే ఈ సుల్తానత సాపేక్షికమైన రాచరికపు హోదాకు సంబంధించింది కాదు. ఇది సుల్తానులకున్న ఇస్లామీయ సాంస్కృతిక దృక్పథం ఆధారమైనది. ముఖ్యంగా, హిందూరాజుల్లో సుల్తానును అని ప్రకటించుకున్న రాజుకు ఇస్లామీయ నాగరిక రాజకీయ సమాజంతో పరిచయమున్నది అని, ఇందువల్ల మిగతా రాజులనుంచి ఈ రాజు భిన్నమైనవాడు అని ఈ బిరుదు సూచిస్తుంది.

’హిందూరాయ సురత్రాణుడు’ అంటే - ’నాటి హిందూ రాజులందరిలోనికి భిన్నమైనవాడు’ అని అర్థమట! ఎందులో భిన్నం అంటే - ఇస్లాము సాంస్కృతిక దృక్పథాన్ని జీర్ణించుకున్నాడు కాబట్టి అని భావించాలని వాగ్నర్ గారి తీర్పు.

నిజమా? కాదా? తెలియాలంటే మొదట ’సురత్రాణ’ ’హిందూరాయ సురత్రాణ’  శబ్దప్రయోగాలను గమనించాలి. అంతే కాక నిజంగా సురత్రాణ శబ్దం - మహమ్మదీయ రాజులపై విజయనగర రాజులకు ఉన్న Hero worship ను సూచిస్తుందా? అని కూడా గమనించాలి. నిజంగా మహమ్మదీయ ప్రభువులపై విజయనగర రాజులకు గొప్ప ఆదరాభిమానాలు ఉన్న పక్షంలో - మహమ్మదీయులను గురించి (కనీసం శాసనాలలో) సమ్మాన పూర్వకంగా ప్రస్తావించి ఉండాలని ఊహించటం తప్పుకాబోదు. మహమ్మదీయప్రభువులను విజయనగరపు రాజులు అంత ఆదరపూర్వకంగా ప్రస్తావించారా?

పై విషయాలను - తులనాత్మకంగా పరిశీలించటానికి ప్రయత్నం చేద్దాం.

సురత్రాణ - ఇందులో ’త్రాణ’ ధాతువుకు ’రక్షించు’ లేక ’కాపాడు’ అని అర్థం. ’పరిత్రాణాయ సాధూనాం, వినాశాయ చ దుష్కృతాం" - అని భగవద్గీత. పరిత్రాణాయ - ఇక్కడ ’పరి’ ఉపసర్గకు ’అంతటా’ అని అర్హం. పరిత్రాణాయ - సాధువులను సర్వత్రా రక్షించుటకునూ’ అని అర్థం. సురత్రాణుడు - అంటే సురులను రక్షింపగలవాడని అర్థం. అయితే ఈ శబ్దం సంస్కృతభవం కాక, ’సుల్తాను’ కు సంస్కృత-తత్సమంగా ఏర్పడిందన్నది నిజం.

కావ్యప్రపంచంలో అయితే సురతాణ, సురతాణి, సురత్రాణ, సురథాణి, సురథాణు...ఇలా అనేక రూపాల్లో ఈ శబ్దం ఉపయోగించబడింది.  శ్రీనాథకవిసార్వభౌముడు తన కావ్యాలలో విస్తృతంగా ఉపయోగించిన అన్యదేశ్యాలలో ఈ శబ్దం ఒకటి. ఈ ప్రయోగాలు కావ్యవాతావరణానికి సంబంధించినవి.

ప్రస్తుతపరిశీలనకు మనం ఆ శబ్దం విజయనగర రాజులకు, నాటి కాలపు బిరుదనామాలకు సంబంధించిన వ్యవహారాలలో ఎలా ఉపయోగించారో తెలుసుకుంటే చాలు.    

సురత్రాణ - ఈ శబ్దాన్ని ఒక్కొక్క సారి ’సుల్తాను’ (మహమ్మదీయ పాలకుడు) కు పర్యాయవాచకంగా, కొన్ని సందర్భాలలో ’శ్రేష్టుడు’ అన్న విశేషణానికి పర్యాయపదంగా విజయనగరకాలంలో ఉపయోగించారు.

ఉదాహరణలు:

౧. ’పరిభూత సురత్రాణ’ - ఇది విజయనగర రాజ్యాన్ని పరిపాలించిన ప్రముఖతమ రాజు శ్రీకృష్ణరాయలవారు వహించిన బిరుదనామం. ఈ శబ్దం - హంపి విరూపాక్ష దేవాలయప్రాంగణంలో రంగమంటపానికి ముందు రాయిపైని శాసనంలో ఉత్తరముఖాన ఉంది. ఇది గతించిన శకవర్ష 1430  (క్రీ.శ. 1508) నాడు మాఘశుద్ధ చతుర్దశి నాటిది. ఆ పాఠంలో కొంతభాగం ఇది.

(Refer: Epigraphica Indica vol 1, Page 365, Inscription in nagari script, line 14)

"ఇహ కిల జగతి నిఖిల కవికులాభి నం
౧౨ ద్యమా నౌదార్య ధైర్య శౌర్యాది జనిత యశః పూర కర్పూరపూరిత బ్రహ్మాండ
౧౩ కరండేన సమరచండేన విహ(సి)త నృగమళ(?) నహుష నాభాగ దుంధుమార మాంధాతృ భరతభ-
౧౪ గీరథ దశరథ రామాది చరితేన కృతభూసుర త్రాణేన పరిభూతసురత్రాణేన గజపతి గజకూట 
౧౫ పాకలేన విది(తాననా)కలేన వదనవిజితాంభోజేన భోజేనాపరేణ కావ్యనాటకాలంకార మర్మ 
౧౬ జ్ఞే(న) ధర్మజ్ఞేన ప్రతివర్షప్రవర్తి(త) కనకవసంతమహోత్సవేన కృతార్థితవిప్రసార్థే
౧౭ (న) సార్థేన నిఖిలనృపతిమూర్ధన్యేన ధన్యేన నాగాంబికా నరస నృపనందనేన ని-
౧౮ ఖిలహృదయానందనేన సమరముఖవిజయేన విజయేన దిశాం విజయ-
౧౯ నగరే సింహాసనమారుహ్య శాసతా సకలాం భువం భుజవిజిత సాంపరాయే
౨౦ ణ కృష్ణదేవమహారాయేణ భువనభరణసావ (ధా)నాయ శ్రీవిరూపా-
౨౧ క్షాభిధానాయ వితీర్ణ వినతజన హేమకూటాయ హేమకూటాయత -
౨౨ నశాలినే శూలినే మధురఫలపూపాదిహృద్యాయ నైవేద్యాయ సింగేనాయక -
౨౩ నహళ్ ళీతి విఖ్యాతనామా చతుస్తోమాభిరామో గ్రామో దత్తో విత్తేపకారిణా
......"

(ఈ రాజు కవికులానికంతటికీ ప్రీతిపాత్రుడు. ఈతని ఔదార్యం, ధైర్యం, శౌర్యం మొదలైన గుణాలతో జన్మించిన కీర్తికర్పూరం - బ్రహ్మాండమనే తాంబూలపు గిన్నె అంతటా నిండింది. ఇతడు యుద్ధంలో తీవ్రప్రతాపవంతుడు. ఇతని దివ్య చరిత్ర నాభాగ, దుంధుమార, మాంధాత, భరతభగీరథ దశరథ రామాది పురాణ ప్రవరులను ధిక్కరిస్తుంది. ఇతడు భూసురలను రక్షించేవాడు. ఇతడు సురత్రాణుని పరాభవించాడు. ఇతని వలన గజపతి యొక్క ఏనుగుల కుంభస్థలాలకు పాకలం అనే వ్యాధిపట్టుకుంది. ఇతడు భోజుడంతటి వాడు. ఇతడి ముఖం అరవిందాన్ని జయిస్తుంది. ఇతడు కావ్యనాటకాలంకార సర్వజ్ఞ మర్మజ్ఞుడు. ఇతడు ప్రతిసంవత్సరం వసంతోత్సవం జరిపి బ్రాహ్మణులతో ఆశీర్వాదాలను తీసుకొంటాడు. ...)

అందులో పదునాలుగవ పంక్తిలో "కృతభూసుర త్రాణేన" - అంటే "భూసుసురులను రక్షించిన వానిచేత" అని, పరిభూత సురత్రాణేన" అంటే "పరాభవించిన సుల్తాను గలవాని చేత" అని అర్థం. లేదా కర్తరి ప్రయోగంలో ’(మహమ్మదు శాహా/యూసఫ్ ఆదిల్ ఖాన్) అనబడే సుల్తానును పరాభవించిన వానిచేత’ అని అర్థం. The one who defeated the Sultan (Mahammad Shah/Yousuf Adil khan). Here the word 'suratraaNa' does not indicate any special quality, but it's merely a sanskritized synonim of ’Sultan’.

రాయలచేత పరాభవింపబడిన సుల్తాను గురించి చారిత్రకులు కూలంకషంగా చర్చించారు. ఆ సుల్తాను బహమనీ మహమ్మదు శాహా అని నేలటూరి వారు, బిజాపురపు యూసుఫ్ ఆదిల్ ఖాన్ అని చాగంటి శేషయ్య గారూ అభిప్రాయపడ్డారు. (చాగంటి శేషయ్య గారి వివరణ విపులంగా, అర్థవంతంగా ఉంది.) ఈ బిరుదాన్ని రాయలు పట్టాభిషేక సమయానికి ముందే ధరించాడు.

ఇక్కడ సురత్రాణ - శబ్దం - సుల్తానుకు కేవల పర్యాయపదంగా ఉపయోగించబడిందనేది స్పష్టం.

ఈ ’పరిభూత సురత్రాణ’ బిరుదు వంశపారంపర్యంగా కూడా కృష్ణరాయల వారికి వచ్చి ఉండవచ్చునని కొన్ని ఊహలు ఉన్నాయి. అట్టి పక్షంలో ఇది మరింత స్పష్టంగా సుల్తాన్ లపై, విజయనగరాధీశులకు గల ధిక్కారాన్నే తెలియజేస్తుంది.

౨. సురత్రాణుడు - శబ్దం రాచరిక విషయాలలో మాత్రమే కాక కవుల బిరుదనామాలలోనూ ఉంది. చరిగొండ ధర్మన్న - పదిహేనవ శతాబ్దపు కవి. కృష్ణరాయల సమకాలికుడు. చిత్తాపుఖాను అనే సులతాను కు ఆస్థానంలో ఉండేవాడు. ఈ చిత్తాపుఖాను కంబంమెట్టు, వరంగల్ పరిసరాలను పాలించే రాజు. (రాయవాచకంలో ఈతని ప్రస్తావన ఉంది).

చరిగొండ ధర్మన్న చిత్రభారతమనే కావ్యాన్ని రచించాడు. అందులో కావ్యారంభంలోని పద్యంలో తనకు గల బిరుదాన్ని చెప్పాడీయన.

మ||
శతలేఖిన్యవధానపద్యరచనాసంధాసురత్రాణ చి
హ్నితనామా! చరిగొండ ధర్మసుకవీ! నీ వాగ్విలాసంబు లా
శితికంఠోజ్జ్వల జూటకోటరకుటీశీతాంశురేఖాసుధా
న్విత గంగాకనకాబ్జనిర్భర రసావిర్భూతమాధుర్యముల్.   (1-18)

’శతలేఖిన్యవధాన పద్యరచనా సంధా సురత్రాణుడు’ అని ఈ కవికి బిరుదు.(శతలేఖినీసురత్రాణుడని మరొక బిరుదు) ఇక్కడ సురత్రాణుడు అంటే - ’శ్రేష్టుడు’, ’సమర్థుడు’, ’వరిష్టుడు’, ’అగ్రగణ్యుడు’ ఇలా అర్థాలు చెప్పుకోవచ్చు.

అలాగే పదిహేడవ శతాబ్దపు కవి ’చింతలపల్లి ఛాయపతి’ బిరుదు ’నవఘంట సురత్రాణ’. ఇక్కడానూ సురత్రాణ శబ్దం ’శ్రేష్ట’ అర్థంలో వాడబడింది.

పైని రెండు ప్రత్యక్ష ఋజువులను బట్టి విజయనగర రాజ్యపు కాలంలో సురత్రాణ శబ్దానికి వాగ్నర్ ’ఊహించే’ ప్రత్యేకార్థం ఏదీ ఉండనవసరం లేదని తెలుస్తూంది.

లేదూ, (’హిందూరాయ సురత్రాణ’ - అన్న పిలుపులో విజయనగర రాజులకు గల ఇస్లామీయ దృక్పథం, మహమ్మదీయులపై 'hero worship' ధ్వనిస్తూన్నవి అన్న) వాగ్నర్ వాదనలో తర్కం తప్పక ఉంది అంటే ఆ విషయాన్ని గురించి మరొక శాసనపు ఆకరం ద్వారా పరిశీలిద్దాం.

మొదటి బుక్కరాయల కాలం నాటి ఈ క్రింది సంస్కృత తామ్రశాసనపు పాఠాన్ని చూడండి. (Refer: Epigraphia Carnatica - Kolar District inscriptions, B Lewis Rice, Page 107, Inscription #158) ఇది సుప్రసిద్ధమైన శాసనం. ఎందుకంటే - ఈ శాసనం ద్వారా బుక్కరాయలు నాచన సోముడనే కవికి పెంచుకలదిన్న అనే అగ్రహారాన్ని, తారణ నామ సంవత్సరం, చైత్రశుద్ధనవమి (క్రీ.శ. 1344) న దానం చేశాడని తెలుస్తూంది.

ఈ శాసనం తెలుగువారికి చాలా ప్రీతిపాత్రమైనది కూడా.నాచన సోముని కాలం గురించి తెలుగు వాళ్ళు తమలో తాము కుమ్ములాడుకొని ఆనందించటానికి ఈ శాసనం చక్కగా ఉపయోగపడింది.  ఇందులో పాఠం రస(6)అభ్ర(0)నయన(2)ఇందుభిః(1) (అంటే శకవర్షం 1206 = క్రీ.శ. 1284) అనా లేక రస(6) ఋతు(6) నయన (2) ఇందుభిః(1) (అంటే శకవర్షం 1266 = క్రీ.శ. 1344) అనా? అని గొడవ నడిచింది. శాసనంలో తారణ నామ సంవత్సరం అన్నారు. మొదటి పాఠం (1206 శకవర్షం) తారణ నామ వత్సరం అవదు. కాబట్టి రెండవ పాఠమే సబబని వేటూరి ప్రభాకరశాస్త్రి పాదులు ఋజువు పర్చారు.

ఇందులో 3 పత్రాలున్నాయి. మొత్తం 95 పంక్తులు. మన వ్యాసానికి మొదటి ముప్పై పంక్తులతో పని. ఆ పంక్తులు ఇవీ.

 శ్రీ గణాధిపతయేనమః| నమస్తుంగ శిరశ్చుంబి చంద్రచామర చారవే| త్రైలోక్య నగరారంభ మూల స్థంభాయ హేతవే||...
.....
.....
.....
ఆసన్ హరిహరః కంపో బుక్కరాయమహీపతిః|
మారపో ముద్దపశ్చేతి కుమారాస్తస్య భూపతేః|
పంచానాం మధ్యగ స్తేషాం ప్రశాస్తే బుక్కభూపతిః|
ప్రచండ విక్రమోమధ్యే పాండవానామివార్జునః |
భగ్నాః కళింగామితశౌర్యవృత్తేః వంగా విభిన్నాంగవిఘూర్ణనేత్రాః ఆంధ్రాశ్చ రంధ్రాణి విశంతి 
తురుష్కాః శుష్కవదనాః పాండ్య భూపాః పలాయితాః|
స్వభుజార్జిత వీర్యేణ తస్మిన్ రాజ్య ప్రశాసనః|
బుక్కరాయో భవచ్ఛ్రీమాన్ భుజార్జితపరాక్రమః |
మేదినీ చ ప్రజాయేన స్వపుత్రానివ రక్షితః |
రాజాధిరాజ స్తేజస్వీ యో రాజపరమేశ్వరః|
భాషాలాంఛితభూపాల భుజంగమవిహంగమః|
రాజరాజభుజంగోయః పరరాయభయంకరః |
హిందూరాయసురత్రాణ ఇత్యేతైరుపశోభితః|
విద్యాభిదాననగరీ విజయోన్నతిశాలినీ|
విద్యారణ్యకృతాతస్యాం రత్నసింహాసనే స్థితః |
యస్మిన్ షోడశదానానాం ధరాయాం పరిశోభితం|
దానాంబుధారయా తస్య వర్ధతే ధర్మపాదపమ్|
అలంకృత శకస్యాబ్ధే ర(సాభ్ర) నయనేందుభిః |
తారణాబ్ధే చైత్రమాసే నవమ్యాంక శుక్లపక్షకే |
పంపాయాం భాస్కరక్షేత్రే ........


(సంగముడనే మహీపతికి హరిహర, కంప, బుక్క, మారప్ప, ముద్దప్ప అని కుమారులు. మధ్యవాడైన బుక్కడు పాండవుల మధ్య అర్జునుడిలా ప్రచండ పరాక్రమవంతుడు. ఈతని పరాక్రమానికి అనేక రాజులు పలాయనం చిత్తగించారు. తురుష్కులు తెల్లముఖం వేశారు. పాండ్యరాజు పరిగెత్తాడు. ఇలా అందరినీ తన భుజబలంతో జయించి ఆ బుక్కడు రాజ్యాన్ని శాసించాడు. ఆతడు రాజాధిరాజు, తేజస్వి, రాజపరమేశ్వరుడు. రాజరాజభుజంగుడు, పరరాజభయంకరుడు, హిందూరాయసురత్రాణుడు. విద్యారణ్యుల చేత నిర్మింపబడినదైన విజయంతో అతిశయించే, విద్యా అనే పేరుగల నగరంలో రత్నసింహాసనాన్ని అధిష్టించి ఉన్నాడు. అతనియందు పదహారు దానాలతో భూమి శోభిల్లింది. అతడు దానం చేస్తూ ఇచ్చిన జలధారలతో ధర్మవృక్షం పెరిగింది. శకవర్షం 1206/1266 తారణ నామ వర్షం చైత్రమాసం శుక్లపక్షం నవమి రోజున పంప ఒడ్డున భాస్కరక్షేత్రమైన విరూపాక్షుని సన్నిధిని.... )

ఈ శాసనాన్ని ఫిలిప్ వాగ్నర్ చెప్పిన విషయాల దృష్ట్యా పరిశీలిద్దాం.

౧. ’హిందూరాయ సురత్రాణ’ - అన్నది ఇస్లామీయదృక్పథాన్ని, సుల్తానుపై గౌరవాభిమానాలను ప్రకటిస్తుందని కదా వాగ్నర్ ఉవాచ. అదే నిజమైతే - "తురుష్కాః శుష్క వదనాః" (తురుష్కులు తెల్లముఖం వేశారు) అన్న శబ్దానికి అర్థం ఏమిటి?  స్పష్టంగా ఇది మహమ్మదీయప్రభువులపై ఆక్షేపణను, తిరస్కారాన్ని తెలియజేస్తూంది. ఒకే శాసనంలో కేవలం ఐదారు పంక్తుల తేడాతో, ఒకే విషయంపై తిరస్కారమూ, గౌరవమూ కలగలిపి వ్రాయించడమనేది తార్కికంగా చెల్లదు. కాబట్టి ఇక్కడ 'హిందూరాయ సురత్రాణ' అంటే - అదేదో ’ఇస్లామీయ దృక్పథం అలవర్చుకున్న రాజు’ అన్న అర్థం పొసగదని,  హిందూరాజులలో శ్రేష్టుడని మాత్రమే ఇక్కడ అన్వయం కుదురుతుంది అని మనకు తెలుస్తుంది. ఇదే అర్థాన్ని ఇతర శాసనాలకూ వర్తింపజేయవచ్చు.

౨. కుల్కే అనే ఓ జర్మన్ చారిత్రకుని మాటలను ఖండిస్తూ వాగ్నర్ చెప్పిన మరో విషయం ఉంది. (అసలు కుల్కే ను వ్యతిరేకిస్తే చాలు, తన వాదం కరెక్ట్ అవుతుందని వాగ్నర్ ఎందుకు భావించాడో అర్థం కాదు.)

.....మొదటి బుక్క రాయలిని ఒక విరోధాభాసమైన స్థితిలో పెడుతుంది. ఒక పక్క హిందూరాజులలో సుల్తానునని చెప్పుకుంటున్నా, ఆ శాసనంలోని మిగతా బిరుదులు అతని సామంత రాజు హోదాలో మాత్రమే నిలబెడతాయి. ఒకరిద్దరు మినహా, సంగమ వంశ రాజులందరూ వారిని వారు మహా మండలేశ్వర, ఓఢియ అని గౌరవించుకున్న వారే కానీ, రాజాధిరాజ, రాజపరమేశ్వర వంటి రాచరికపు బిరుదులను రెండవ హరిహరరాయల కాలందాకా (1377-1404) ఎవరూ స్వీకరించలేదు. .....ఇలా హిందూరాయ అన్న విశేషకం లేనప్పుడు ఈ బిరుదు కుల్కే నిర్వచనం ప్రకారం సుల్తానుకు సంగతమైన, సమానధర్మ పదంగా ఎలా అవగలదు?

వాగ్నర్ పరిశీలనలో - ’రాజాధిరాజ రాజపరమేశ్వర’ బిరుదాలు బుక్కడు స్వీకరింపలేదట! మహామండలేశ్వరుడని పిలుచుకున్నాడు గనక బుక్కడు సామంతరాజవుతాడట!

హుళక్కి! బుక్కరాయల (క్రీ.శ. 1352) కాలపు శాసనాన్ని మాత్రమే వాగ్నర్ పరిగణించాడు. పైన ఉటంకించిన పెంచుకలదిన్న శాసనం అంతకు ఎనిమిదేళ్ళకు పూర్వపు (క్రీ.శ. 1344) నాటిది.  స్పష్టంగా ఈ పెంచుకల దిన్న శాసనంలో వాగ్నర్ ప్రతిపాదనకు విరుద్ధమైన విషయాలు కనిపిస్తున్నాయి. బుక్కరాయలు కేవలం ’మహామండలేశ్వరుడు’ (సామంతుడు) కాడని, రాజాధిరాజు, రాజపరమేశ్వరుడు అని ఇందుమూలకంగా తెలుస్తూంది. కాబట్టి ఖచ్చితంగా వాగ్నర్ గారి తర్కం ప్రకారం - హిందూరాయ సురత్రాణ శబ్దం సుల్తానుకు సమానమవుతుంది.

వాగ్నర్ రచనలో కనిపించే ప్రధానమైన లోపం కూడా ఇక్కడ ప్రస్తావనార్హం. అతడు ప్రతివిషయాన్ని ’సరళ రేఖ’ లో ఆలోచించి తీర్మానాలు చేశాడు. ’మహామండలేశ్వర’ అంటే - సామంతరాజు అని అతని సూటినిర్ణయం. ఇది పొరబాటు. బిరుదనామాలను Military disignations లా ఊహించటం పొఱబాటు అవుతుంది. ఉదాహరణకు ’రాజాధిరాజ’, ’రాజపరమేశ్వర’ - అంటే రాజులకు రాజు, గొప్పరాజు అని రాబర్ట్ సీవెల్ ఊహించాడు. మిగిలిన వారు దాన్నే అనుసరిస్తున్నారు. రాజాధిరాజు - అంటే కుబేరుడని సంస్కృతంలో అర్థం. రాజపరమేశ్వరుడంటే కూడా రాజులలో పరమ ఐశ్వర్యవంతుడని అర్థం వస్తుంది. బిరుదనామావళిలో సంస్కృత ఉత్ప్రేక్షలలో పొగడ్తలు లిఖించి ఉన్నప్పుడు - ఆయా ఉటంకింపులు చారిత్రక సత్యాలుగా నిర్ధారించటం ఎలా వీలుపడుతుంది? రాజాధిరాజు - అంటే కుబేరుడని అర్థం ఉన్నప్పుడు మహామండలేశ్వరుడంటే కూడా మరొక అర్థం ఉండటం సాధ్యమే. అందుచేత మహామండలేశ్వరుడు అంటే సామంతుడు - అని తీర్మానించటం ఖచ్చితం కాకూడదు. ఒక వేళ వాటిని పరిగణనలోనికి తీసుకుంటే కూడా పై శాసనం ప్రకారం బుక్కరాయలను రాజాధిరాజు గా ఒప్పుకోవలసి వస్తుంది.

దుస్తులపట్ల/శరీరం పట్ల భారతీయుల ధోరణిని అతడు బాణభట్టు కావ్యాన్ని ఉటంకించి ’గుణాలను బహిర్గత పరిచేది శరీరం’ అని తీర్మానించేశాడు. భారతీయుల కావ్యాలు నియమాలను శాసించవు. అవి ధర్మాలను ప్రియురాలిలా నచ్చచెబుతాయి. (కాంతాసమ్మితాః). అంతే కాదు, భారతీయ చింతన వర్తులాకార దృక్పథంలో ఉంటుంది. అందుకే అది గహనమైనది. ఇక్కడ ఈశ్వరుడనే ఓ ప్రాచీన దైవరూపం దిగంబరుడైతే, విష్ణువు నిండుగా ఆభరణాలు, గంధలేపనాలు అలదుకున్న పీతాంబరధారి. దిగంబరునికి, పీతాంబరధారికి మధ్య అనేక విధాలైన దుస్తులకు అవకాశం ఉంది, సున్నకు, అనంతానికి మధ్య ఉన్నట్టుగా. భారతదేశంలో పుట్టిన జైనమతంలో దిగంబరజైనులు, శ్వేతాంబరజైనులు వేరు వేరు. ఈ నేపథ్యంలో శరీరధర్మం - ఇదీ అని ఇతమిత్థంగా భారతీయసంస్కృతిలో నిర్ధారించటం కుదరదు. "ఎదుటివాడికి నచ్చినట్టు దుస్తులు ధరించు" - అని పర్షియనులకు నియమం కావచ్చును. కానీ ఇటువంటి ఖచ్చితమైన నియమం భారతీయవాతావరణానికి చెల్లదు. దానిని గురించి తీర్మానాలు చేయడం కుదరదు.    

ఆ వ్యాసం చివర్న వాగ్నర్ చేసిన ప్రతిపాదనల గురించి: అసలు మాలిక్ కాఫిర్ దురాగతాల గురించి, పైశాచికత్వం గురించి అన్ని దృష్టాంతాలు కనిపిస్తుంటే, మతమూఢులు ఆరునెలలు ఓవర్ డ్యూటీ చేసి మరీ నాశనం చేసిన హంపి శిథిలాలు దయనీయంగా నేడు కట్టెదుట కనిపిస్తున్నా శ్రీమాన్ ఫిలిప్ వాగ్నర్ - తద్విరుద్ధంగా విచిత్రమైన ప్రతిపాదనలు చేయడం ఆశ్చర్యం. మతమార్పిడి ప్రస్తావన - బార్నీ, ఇబ్న్ బటూతా క్రానికల్స్ లో కనిపిస్తుందని అతనే అంటాడు. కానీ దానిని పరిగణించక, రాజకాల నిర్ణయము, విద్యారణ్య కాలజ్ఞానము పుస్తకాలలోని ’భాష’ ను పరిగణనలోనికి తీసుకుంటానంటాడు! ఇతరత్రా - అంటే దుస్తుల విషయాల్లో మాత్రం పాశ్చాత్యుల (వర్తెమా, పేస్ క్రానికల్స్) ను పరిగణనలోనికి తీసుకుని, స్థానిక చరిత్రలను తృణీకరిస్తానంటాడు. అంటే అతని ప్రతిపాదనలకు అనుగుణంగా ఏది ఔననిపిస్తే అది ప్రామాణికం. తదన్యమైనది అప్రమాణికం. Wow! (కనిపిస్తున్న చారిత్రక సత్యాలకు, తదనుగుణమైన విషయాలకు విరుద్ధంగా ఏదో ఒక వినూత్న ప్రతిపాదన చేయకపోతే మార్కెట్ దొరకని రోజులాయె. :) )

Empathy vs Argument

ఈమాటలో వాగ్నర్ వ్యాసాన్ని చారిత్రకంగా, సానుకూల దృక్పథంతో చదవాలి కానీ ఇలా తీవ్రంగా, agressive గా చదివి ప్రతిస్పందించడం ఎందుకని ఓ ప్రశ్న. :) వాగ్నర్ పాశ్చాత్యుడు. అతడు మన అస్తిత్వ చిహ్నాలైన విజయనగర సామ్రాజ్య చరిత్ర మీదా, స్థానిక లేపాక్షి దేవాలయపు చిత్రం ఆధారంగానూ విచిత్రమైన ప్రతిపాదనలు చేస్తే - ఆ విషయాన్ని Empathy ద్వారా కాక Argument ద్వారా నిగ్గు తేల్చుకోవడమే సరైన పద్ధతి. భారతదేశంలో పుట్టి పెరిగిన వారికి స్థానిక చరిత్రపై Emapthy ఉంటుంది కానీ, పాశ్చాత్యుల విచిత్రప్రతిపాదనల మీద, వారి దృక్పథాల మీదా సానుభూతి ఉండదు, ఉండనవసరమూ లేదు. ఇందులో అసంగతం ఏదీ లేదు.

ఈ వ్యాసం కేవలం వాగ్నర్ మీద నా వ్యక్తిగత వ్యతిరేకతను కాక చారిత్రక దృష్టిలో స్థానిక చరిత్రలపైన, సంస్కృతి, సాంప్రదాయాల అధ్యయనం పైన, 'సానుభూతి' యొక్క అవసరాన్ని కొంతవరకైనా తెలియజేయాలని, తెలియజేస్తుందని నా చిన్న నమ్మిక. హంపి గురించి తెలుసుకోవాలంటే మొదట హంపిని స్థానికుడి కళ్ళతో చూడాలి. స్థానికుల భాషను, యాసను, సాహిత్యాన్ని, పారంపరిక సంస్కృతిని, సాంప్రదాయాలను, వాటి విలువలను దయతో చూడాలి. ఈ అనుశీలనలో హృదయస్పర్శ, నిస్వార్థదృష్టీ ఉండాలి. అవేవీ లేని శుష్కప్రతిపాదనలు కొరగావు.   

కామెంట్‌లు

  1. ఆర్యా! నేను వ్రాసిన కథ'పరిభూత సురత్రాణము' 'పొద్దు' ఎనే ఆన్'లైను పత్రికలో ప్రచురించ బడింది. ఈ కథని నా బ్లాగు క్షీరగంగ లో పోస్టు చేసాను. దయచేసి చదవండి. ఇట్లు క్షీర గంగ బ్లాగు రచయిత// అ.శ్రీధర్

    రిప్లయితొలగించండి

  2. రవి గారు,

    Very good article

    Worthwhile to post in English as well so it reaches to many (those all who read Wagner may not be knowing Telugu to appreciate your view point)

    జిలేబి

    రిప్లయితొలగించండి
  3. శ్రీధర్ గారు, పొద్దు లో కథ గురించి తెలుసండి. మీ కథకు అప్పట్లో నేను వ్యాఖ్య కూడా వ్రాసినట్టు గుర్తు. అయితే మీ కథలో "పరిభూతసురత్రాణ" శబ్దం మనుచరిత్రలో ఉన్నట్టు చెప్పారు. మనుచరిత్రలో ఆ ప్రయోగం నాకు కనిపించలేదు.

    Zilebi గారు: ఇంగ్లీషులో వ్రాసినా పెద్ద ప్రయోజనం ఉంటుందన్న విశ్వాసం నాకు లేదు. ఈ వ్యాసంలో నిజం, నిజాయితీ ఉంటే దానంతట అదే బయటకు వస్తుంది లెండి.

    రిప్లయితొలగించండి
  4. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Comments ridiculing, abusing, bullying and forcing to agree in any form, if objectionable to the blog owner will be removed.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వాఙ్మయచరిత్రలో కొన్ని వ్యాసఘట్టాలు - శ్రీ ఏల్చూరి మురళీధరరావు గారు.

అశోకుడెవరు? - 1

ముకుందవిలాసః - కుంటిమద్ది శేషశర్మ.