విజయనగర వస్త్రధారణపై ఇస్లామీయకరణ ప్రభావం ఎంత?
ఈ శీర్షికతో ఈమాట లో ఓ వ్యాసం వచ్చింది. ఆ విషయానికి సంబంధించి సోషియల్ మీడియాలో
ఈ వ్యాసంపై చిన్న చర్చ వచ్చి ఈ విస్తృత వ్యాఖ్య వ్రాయవలసి వచ్చింది.
కబాయి, కుళాయి అన్న రెండు వస్త్రవిశేషాలను పట్టుకుని, హిందూరాయసురత్రాణ శబ్దాన్ని
వాడుకుని ఇస్లామీయకరణ అనే బరువైన శబ్దాన్ని వాడుతూ చివరికి విజయనగర సామ్రాజ్య అస్తిత్వమే
మహమ్మదీయుల అనుమతితో నిలబడిందన్న ధ్వనితో వ్యాసకర్త చాలా తెలివిగా వ్యాసాన్ని అల్లారు.
అబ్దుల్ రజాక్ క్రోనికల్స్ ఒక్కటే చరిత్ర చిత్రణకు ప్రామాణికం కాజాలదు. అయినా అతని పుస్తకం
లోని ఒక ఉదంతాన్ని ఆకరంగా చేసుకుని ఈ వ్యాసకర్త మరిన్ని ఊహలు కట్టారు! ఆశ్చర్యం.
మతరహిత ఇస్లామీయకరణతో మొదలైన వ్యాసం, దుస్తుల వెనుక మతపరమైన కారణాలను అన్వేషిస్తూ,
ఊహిస్తూ, చివరకు వచ్చే సరికి ఒక అనూహ్య ప్రతిపాదనకు దారితీసింది.
ఈమాట వ్యాసంలో కొన్ని అనుమానాస్పదమైన విషయాలను ప్రస్తుతం ఉటంకిస్తాను.
ఈమాట వ్యాసంలో కొన్ని అనుమానాస్పదమైన విషయాలను ప్రస్తుతం ఉటంకిస్తాను.
మొదటగా కుళ్ళాయి గురించి. వ్యాసంలో రచయిత ఫిలిప్ వాగ్నర్ - కుళ్ళాయిని ఈ విధంగా నిర్వచించాడు.
>>ఇస్లామీయకరణలో భాగంగా ఒక ముఖ్యమైన మార్పు విజయనగరపు రాజాస్థానపు దుస్తులలో
వచ్చింది. అప్పటిదాకా ప్రాచుర్యంలో ఉన్న దక్షిణ భారత దేశపు సాంప్రదాయపు దుస్తుల వైఖరి,
పధ్నాలుగు, పదిహేను శతాబ్దాలలో పూర్తిగా తొలగిపోయి, >>ఇస్లాం దేశాలలో వాడే వస్త్రాల
ఆధారంగా వచ్చిన ఒక కొత్త వైఖరి – కబాయి అని పిలవబడే ఒక పొడుగాటి అంగీ (అరబీ ‘కబా’), కోలగా ఉండి జరీతో
అలంకరించబడి కుళ్ళాయి అని పిలవబడే తలపాగా(టర్కీ, పర్షియా దేశాల ‘కులా’ ఆధారంగా)
>>– ఆ స్థానే చోటు చేసుకుందనీ నేను ఈ వ్యాసం ద్వారా నిరూపించదలిచాను.
కుళ్ళాయి - అంటే కోలగా ఉండి జరీతో అలంకరించబడిన తలపాగా. ఇది గుడ్డటోపీ. చివర్న
జరీ పోగులు వ్రేలాడుతుండేది. ఫిలిప్ వాగ్నర్ దృష్టాంతాలుగా చూపిన లేపాక్షి కుడ్య చిత్రాలలోనూ
ఇలాంటివే ఉన్నాయి.
విజయనగర రాజులు ధరించింది నిజంగా జరీ గుడ్డ తలపాగాయేనా? కొన్ని ఆధారాలు చూద్దాం.
ఈ ఆధారాలు ప్రధానంగా కృష్ణరాయల కాలం నాటివి.
౧. తిరుమల లో వేంకటేశ్వరస్వామి గుడిలో రాయలు, తన దేవేరులు తిరుమల దేవి, చిన్నాదేవి
లతో కూడిన పోత పోసిన కంచువిగ్రహం. - ఇందులో రాయలు "కిరీటం/శిరస్త్రాణం" ధరించటం మనం చూడవచ్చు.
ఇలాంటివే కంచు విగ్రహాలు నిలువెత్తులో పోతపోసినవి
కామలాపురం మ్యూజియంలో ఉన్నాయి.
౨. నేటి హంపి విజయ విట్ఠలాలయం రంగమంటపం యాళి స్థంభాలపై - రాయల వారు యాళిపై,
గుర్రాలపై స్వారీ చేస్తున్న విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి. ఇందులోనూ రాయల వారు కోలగా
ఉన్న కిరీటం/లోహ శిరస్త్రాణం ధరించాడు. ఇలాంటి యాళి స్థంభాలు విజయనగర రాజులు దక్శిణ భారతదేశంలో నిర్మించిన అనేక దేవాలయాలలో కానవస్తాయి. ఒంటిమిట్ట రామాలయం, కంచి వరదరాజ దేవాలయం, వగైరా. ఆయా చోట్ల
గుర్రాన్ని లేదా యాళిని అధిరోహించిన రౌతు ధరించింది లోహ శిరస్త్రాణమని ఆ శిల్పాలను పరిశీలించి తెలుసుకోవచ్చు.
౩. వాగ్నర్ ఎక్కడైతే కుడ్యచిత్రాలు సేకరించాడో సాక్షాత్తు ఆ లేపాక్షిలో యాళి
పై స్వారీ చేస్తూ కత్తి దూసిన వీరుని విగ్రహం ఉంది. ఆ విగ్రహంపై కిరీటం ఉంది. కుళ్ళాయి లేదు. (యాళి - రాచరికానికి ప్రతీక. రాజు సింహంలా ప్రతాపం చూపాలి. ఏనుగులా గాంభీర్యం,మొసలిలా వేగం, డేగలా సూక్ష్మదృష్టి, పాములా నయం...ఇలా ఏడు జంతువులతో కూర్చిన సంజ్ఞ యిది. సాధారణంగా యాళిని అధిరోహించేది మహారాజు.)
౪. కొన్నేళ్ళ క్రితం రాయల వారి నిలువెత్తు చిత్రపటం - ఎవరో పోర్చుగీసు చిత్రకారుడు
గీసినదని, పూనా భండార్కర్ ఇన్స్టిట్యూట్ వారు ప్రకటించినట్టు వార్తలు వచ్చాయి. అందులో
రాయలు వారు ధరించింది పేఠా/పగిడీ. ఆ పగిడీకి కలికితురాయి కూడ ఉంది.
౫. హంపి విజయవిట్ఠలాలయం రంగమంటపంలో/హజారరామాలయంలో/బాలకృష్ణ దేవాలయంలో సామాజిక
జీవనాన్ని చిత్రిస్తూ శిల్పాలు ఉన్నాయి. ఒక శిల్పంలో రాయలవారు, ఇతర సామాజికులతో కూడిన
చిన్నపాటి శిల్పం ఉంది. అందులో రాయలపక్కన ఉన్న వృద్ధుడు తిమ్మరుసుగా గుర్తించవచ్చు.
తిమ్మరుసు పేఠా ధరిస్తే రాయలు కిరీటం/లోహ శిరస్త్రాణాన్ని ధరించాడు.
పై ఆకరాలను పరిశీలిస్తే - రాయలు జరీగుడ్డతో చేసిన పూర్తీ పిరమిడ్ (కూచి) ఆకారంలోని
"కుళ్ళాయి" ని ధరించనే లేదని, ఆయన ధరించింది లోహంతో చేసిన అర్ధపిరమిడ్ ఆకారపు
టోపీ/కిరీటమని తెలుస్తూంది. ఇది ’కిరీటం’ కాదు - కిరీటమైతే రత్నాలు, కలికితురాయి ఉండాలి అని వాదిస్తే
అందుకు సమాధానం ఇది.
ఆ లోహ శిరస్త్రాణం కిరీటం కాకపోతే ’టోపీ’ అవుతుంది. కానీ గుడ్డతో కుట్టిన జరీ కుళ్ళాయి కానేరదు. మరి
"టోపీ" విజయనగర కాలంలో ఉందా? అంటే "ఉంది" అని సమాధానం.
క్రీ.శ. 1050 కాలం నాటి చాళుక్య సోమదేవుని అభిలషితార్థచింతామణి కావ్యంలో
"వస్త్రభోగం" ప్రకరణంలో ఈ శ్లోకం ఉంది. విజయనగరం ఏర్పడ్డానికి రెండు వందల
యేళ్ళ ముందుకాలం నాటిది ఈ కావ్యం!
"అంగికా" చ తథోష్ణీషః "టోపికా" వివిధాకృతిః |
ప్రావారా బహుధాకారా దర్శితా వస్త్రధారిభిః || (1091)
విజయనగర సామ్రాజ్యానికి ముందే "అంగీ", "టోపీ" వాడుకలో
ఉన్నాయి.
అభిలషితార్థచింతామణిలో నాటి వస్త్రధారణ గురించిన వివరాలు ఇంకా వివరంగానే చదువుకోవచ్చును. నాటి (చాళుక్యుల) కాలంలో - పోహల, చిరపల్లి, అవంతి, నాగపట్టణ, పాండ్య, అల్లిక, సింహళ, చీనా, మూలస్థాన (ముల్తాన్), గుంజణ, సురాపుర, వంగ, కళింగ ఇత్యాది ప్రాంతాల నుంచి మహారాజుకోసం చిత్రవిచిత్రమైన వస్త్రాలు సేకరించేవారు. అందులో ఎన్నో వైవిధ్యభరితమైన బట్టలు ఉండేవి. వాటిలో "పట్ట సూత్రసమన్వితమైనవి" కూడా ఉన్నవి. (బొత్తాము, గుండీలు) ఈ వస్త్రాల పర్యవేక్షణ కోసం ఒక అధికారి ఉండేవాడు. ఏ సందర్భాల్లో, ఏయే ఋతువుల్లో ఎలాంటి వస్త్రాలు రాజు ఉపయోగించాలి అని వివరంగా ఆ పుస్తకంలో వ్రాశారు.

రాయల వారి దుస్తుల గురించి పైని తెలిపిన ఆకరాలు చాలా ప్రముఖమైనవి, ప్రసిద్ధమైనవీనూ.
అందులో ఒక ఋజువు (యాళిస్థంభం) సాక్షాత్తు లేపాక్షిలోనే ఉండగా ఫిలిప్ వాగ్నర్ వాటిని ఎందుకు పట్టించుకోలేదు?
కుళ్ళాయిని "మహారాజు" ధరించిన ఆనవాళ్ళు శిల్పాలలో, స్థానికచరిత్రలలో, శాసనాలలో, సాహిత్య వర్ణనలలో లేవు. ఫిలిప్ వాగ్నర్ గారు కేవలం ’వర్తెమా’ అన్న రాయబారి యొక్క వర్ణనలమీదే ఆధారపడడం గమనార్హం. ఒక్క వర్తెమ Chronicles మీద ఆధారపడి ప్రతిపాదనలు చేయడం ఆయన వ్యాసంలో ఒక లోపం.
స్థానిక చరిత్ర/సాహిత్యాలను ఎందుకు పరిగణించాలి? అవి మాత్రం అసమగ్రం కావా? అని ప్రశ్నించడం ఇక్కడ కుదరదు. ఉదాహరణకు - తాళ్ళపాక తిరువేంగళసూరి నాటి సామాజికులను వర్ణించాడు. పరమయోగివిలాసము లో కరణము వర్ణన ఇలా ఉంది.

"వనమించు తెలివలిపంపు పింజియలు సొసగచుట్టినయట్టి బోడకుల్లాలు
చింపి కుప్పసములు చెవిదోరములును సంపుటంబులతోడ జంపాడునొడలు.....కరణికులు చనుదెంచిరి"
బోడకుల్లాలు - చిన్న టోపీ, కుప్పసము వేసుకున్నాడు కరణం.
ప్రౌఢదేవరాయల కాలంలో విద్యానగరాన్ని సందర్శించిన రెడ్డిరాజుల ఆస్థానకవి శ్రీనాథుడు "కుళ్ళాయుంచితి కోక సుట్టితి మహాకూర్పాకమున్ దొడ్గితిన్..." అన్న చాటువు గురించీ మనకు తెలుసు.
ప్రౌఢదేవరాయల కాలంలో విద్యానగరాన్ని సందర్శించిన రెడ్డిరాజుల ఆస్థానకవి శ్రీనాథుడు "కుళ్ళాయుంచితి కోక సుట్టితి మహాకూర్పాకమున్ దొడ్గితిన్..." అన్న చాటువు గురించీ మనకు తెలుసు.
ఇప్పుడు వాగ్నర్ వ్యాఖ్య తిరిగి చూద్దాం.
>>ఇస్లామీయకరణలో భాగంగా ఒక ముఖ్యమైన మార్పు విజయనగరపు రాజాస్థానపు దుస్తులలో
వచ్చింది. అప్పటిదాకా ప్రాచుర్యంలో ఉన్న దక్షిణ భారత దేశపు సాంప్రదాయపు దుస్తుల వైఖరి,
పధ్నాలుగు, పదిహేను శతాబ్దాలలో పూర్తిగా తొలగిపోయి, >>ఇస్లాం దేశాలలో వాడే వస్త్రాల
ఆధారంగా వచ్చిన ఒక కొత్త వైఖరి – కబాయి అని పిలవబడే ఒక పొడుగాటి అంగీ (అరబీ ‘కబా’), కోలగా ఉండి జరీతో
అలంకరించబడి కుళ్ళాయి అని పిలవబడే తలపాగా(టర్కీ, పర్షియా దేశాల ‘కులా’ ఆధారంగా)
>>– ఆ స్థానే చోటు చేసుకుందనీ నేను ఈ వ్యాసం ద్వారా నిరూపించదలిచాను.
"విజయనగర రాజాస్థానపు దుస్తులలో కోలగా జరీతో అలంకరించబడిన కుళ్ళాయి అనే
తలపాగా వచ్చిందట. " -మహా రాజు ధరించింది కుళ్ళాయి కాదని ఋజువులు ఎన్నో దొరుకుతున్నాయి. కుళ్ళాయిలు ధరించినట్టు ఒక్క వర్తెమా తప్ప మరెవరూ వ్రాయలేదు.
(ఇక్కడ మరొక్క గమనార్హమైన విషయం. The forgotten Empire పుస్తకంలో ఉన్న ఒక ఉటంకింపులో - రాజు ధరించిన శిరస్త్రాణాన్ని - రెండు జానల ’బంగారు టోపీ’ గానే పేర్కొన్నాడు. అది కిరీటం అవుతుంది కానీ జరీతో చేసిన కుచ్చుటోపీ అవదు. బహుశా నాటి కాలంలో తలపై ధరించే ఆభరణాన్ని వ్యవహారభాషలో కుళ్ళాయి అంటారని ఊహించవచ్చు. వేటూరి ప్రభాకర శాస్త్రి గారున్నూ ఓ చోట కాకతీయుల దేవత తలపై ఆభరణాని ’కుళ్ళాయి’ గా ప్రస్తావించారు. కుళ్ళాయి - అంటే తలపైని టోపి - అని వ్యవహారంలో అర్థం. ఏదేమైనా, ఈ విషయంలో వాగ్నర్ ప్రతిపాదన నిరర్థకమైనది.)
కబాయి.
కబాయి (p. 246) kabāyi or కబాయీ kabāyi. [H.] n. A
shirt, an ornamental garment. శృంగారార్థముగా అన్నిటికి పైన వేసుకొనే చిన్నచొక్కా
అంగీ.
"ననపుష్పవనము నానామణుల్, గ్రుచ్ఛినపచ్చపట్టుకబాయిబాగునెరప." K.
P. v. 232.
కబాయి - గురించి కళాపూర్ణోదయంలో ఉటంకించినట్టు నిఘంటువు. ఇది అంగీ.
’అంగీ’ తొడగటం భారతదేశంలో ఒక్కసారిగా, మహమ్మదీయ మతప్రభావంతో మొదలైనదన్న మాట సత్యదూరం. శ్రీనాథుని
చాటువు "కుల్లాయుంచితి కోక సుట్టితి మహాకూర్పాసమున్ తొడ్గితిన్.." లోని కూర్పాసము - అంటే అంగీ. కూర్పాసము/కుప్పసము/కుబుసము
అనే అంగీ భారతదేశంలో ఎప్పటి నుంచో వుంది. కూర్పాస శబ్దం - అమరకోశంలో ఉంది. (చోలః కూర్పాసకోऽస్త్రియామ్). అమరకోశం మహమ్మదీయమతం ఏర్పడడానికి కూడా ముందుదైన గుప్తుల కాలం నాటిది! అనగా గుప్తుల కాలంలోనే - భారతదేశంలో శరీరాన్ని పూర్తిగా కప్పుకొనే వస్త్రవిశేషం స్పష్టంగా అందుబాటులో ఉంది.
అంగీ అనే శబ్దాన్ని కూడా ఇదివరకే అభిలషితార్థచింతామణి శ్లోకంలో చూశాం. ఇంకా వివరంగా అదే కావ్యంలోని "వస్త్రభోగం" లో చదువుకోవచ్చు.
అంగీ అనే శబ్దాన్ని కూడా ఇదివరకే అభిలషితార్థచింతామణి శ్లోకంలో చూశాం. ఇంకా వివరంగా అదే కావ్యంలోని "వస్త్రభోగం" లో చదువుకోవచ్చు.
వాగ్నర్: >> ఈ వ్యాసం ద్వారా నేను ఈ నమ్మకాలని ప్రశ్నిస్తూ, విజయనగర
సంస్కృతిపై నిజానికి ఇస్లాం సంస్కృతీ సాంప్రదాయాల ప్రభావం ఎంతగానో ఉన్నదనీ, తద్వారా
ఎంతగానో మార్పు చెందిందనీ ప్రతిపాదిస్తున్నాను.
మతరహితమైన ఇస్లామీయకరణ అని చెప్పిన తర్వాత - వాగ్నర్ గారు ఉటంకించిన వ్యాఖ్య
ఇది! కాకితము, చీనాంబరము, కబాయి, దువ్వెన, కుళ్ళాయి -ఇవన్నీ ఉపకరణాలు. ఈ ఉపకరణాల వాడకపు వ్యాప్తికి మతం ఉంటుందా?
ఉపకరణార్థమైన వస్తువులను ఏ మతస్థులు మొదట ఉపయోగించినా అవసరం/అభిరుచి/సౌకర్యం మేరకు
అన్యమతాలలో వీటి వాడకం విస్తరిస్తుందని ఏల ఊహించరాదు?
వాగ్నర్:
>>ఇస్లామీయకరణకి ముందు హైందవ ధర్మం ప్రకారం, శరీరం మానవుని అస్తిత్వంలో
ఒక విడదీయరాని భాగం. మనిషి లోపలి గుణ స్వరూపానికి ఒక బాహ్య సంకేతం. ఈ సాంస్కృతిక సందర్భంలో
దుస్తుల ప్రయోజనం శరీరాన్ని >> కప్పడం,
అంటే దాచిపెట్టటం కాదు. దుస్తుల ప్రయోజనం శరీరాన్ని ప్రదర్శించడం, శరీరాకృతికి అనుగుణంగా
చుట్టుకొని, శరీరాన్ని బహిరంగపరచటం అవుతుంది.
హైందవ సంస్కృతిలో శరీరం ఒక ఉపకరణం, ధర్మసాధనం. (శరీరమాద్యం ఖలు ధర్మసాధనమ్
- భర్తృహరి). దేహానికి ముఖం/శీర్షం ప్రధానమైన అంగం. గుణగణాలు ముఖం ద్వారా బహిర్గతమవుతాయి. అందుకే ఆంగికం కన్నా సాత్విక అభినయాన్ని నాట్యశాస్త్రంలో ప్రధానంగా భావిస్తారు. ముఖం ప్రధానం
కాబట్టి - "ప్రముఖ" శబ్దం ప్రాధాన్యతకు సూచనగా మారింది.
పురుషుల శరీరానికి దుస్తులపరంగా ప్రత్యేక ప్రయోజనమూ, దుస్తులకై ఖచ్చితమైన నియమమూ హైందవ సంస్కృతిలో కనిపించవు. శరీరాలంకరణ - అభిరుచికి, సౌకర్యానికి, అందుబాటుకు చెందిన విషయమే కానీ, నియమానికి చెందినది కాదు. అందుచేత శరీరంపై - కలిగిన వారు గంధమాల్యాది భూషాదులతో అలంకరించుకోవటం, ఉపయుక్తమైన సమయాలలో అంగీ/స్వర్ణ భూషణాలను ధరించటం ఉండేది. భూషణాదులకు అవకాశం లేని వారు ఆచ్ఛాదనారహితంగా ఉంచుకుంటారు. "గుణాలను బహిర్గరతపర్చటానికై శరీరం" ఉన్నది అన్న ఫిలిప్ వాగ్నర్ వివరణ అసమంజసం, పేలవము, నిరర్థకమూ కూడా. సామాన్యులు నగ్నాచ్ఛాదనతో ఉండేవారు కదా అంటే - అది సౌకర్యార్థమనే తప్ప అందుకు ధార్మిక, మతపరమైన వివరణ ఖచ్చితంగా లేవు. ఈ సందర్భంలో కూడా వాగ్నర్ ఉటంకించిన ’బాణభట్టు’ వర్ణన అసమగ్రంగా ఉంది. రామాయణ కాలంలోనే వాల్మీకి - రాముని విగ్రహాన్ని సౌష్టవంగానూ, పరిపరివిధాలుగానూ వర్ణించాడు. ("సమస్సమవిభక్తాంగః స్నిగ్ధవర్ణః ప్రతాపవాన్ ఆజానుబాహుస్సుశిరస్సులలాటసువిక్రమః".) కావ్య వర్ణనల మూలంగా నగ్నాచ్ఛాదన - విహిత నియమం అని తీర్మానించడం - తెలివితక్కువ విషయం.

వాగ్నర్ ప్రకారం - కబాయి, కుళ్ళాయి వస్త్రావిశేషాలను ధరించటం వెనుక ఉద్దేశ్యం
"మోజు" కాదట! రాజకీయమట!
ఈ ప్రతిపాదనా సందేహాస్పదమే. విజయనగర సామ్రాజ్యం సాధించిన సర్వతోముఖాభివృద్ధిని,
విద్యానగరం ప్రపంచపట్టణాలలోనే గొప్పపట్టణాలలో ఒకటి అన్న విషయాన్ని పోర్చుగీసు యాత్రికుడు డోమింగో పేస్ చాలా విశదంగా వర్ణించాడు. నాటి సమాజం శిల్పం, సాహిత్యం, ఇంజినీరింగు, ద్రవ్యవినిమయం, యుద్ధ పద్ధతులు, ఇలా అన్ని రంగాల్లో
కొత్తపుంతలు తొక్కినది. నేలకు అంటని స్థంభాలు, సంగీతాలు పలికించేవి, యాళి, రంగ మంటపాలు,
ఐదు పీఠాలు, రాతి రథం, వర్ణిక (నమూనా) - శిల్పవిషయంలో నాడు విస్తృతమైన వైవిధ్యాన్ని ప్రదర్శించారు. నదికి అడ్డుగా రాళ్ళను త్రోలించి తురుత్తు కాలువ కట్టటం, పోర్చుగీసు ఇంజినీరుతో
రాతికాలువలు ఏర్పాటు చేయించటం - ఇలా ఎన్నో కొత్త పోకడలు పోయారు. సిద్ధాంతరచనలలో, శాస్త్రాదులలో వేదభాష్యాలతో, ద్వైతాద్వైతవిశిష్టాద్వైతాలతో
మొదలెట్టి సాహిత్యంలో, ప్రబంధ సాహిత్యం తో ఆకాశమే హద్దుగా చెలరేగిన కాలమది. ఊహకందనన్ని
భోగాలు చవిచూసిన సమయం అది. ప్రౌఢదేవరాయల వారికి 12000 మంది భార్యలని చదువుకున్నాం.
అచ్యుతరాయని గుడి ఎదురు సూళియబజారు గురించిన/ఆధారంగా కల్పించిన వర్ణనలు తెలుగు సాహిత్యంలో విస్తృతంగా ఉన్నాయి. ఆ వేశ్యల సంపద ఆధారంతో త్రవ్వించిన ఎన్నో చెరువులూ
నేటికీ మన కంటి ముందు కనిపిస్తున్నాయి. జనజీవనమూ
అంతే. ప్రతి రంగంలో కొత్తదనం కోసం అర్రులు చాచిన సమయం అది. వీటి మీద మనకు ఎన్నో వ్యాసాలు
ఉన్నవి. ఎన్నో ఉదాహరణలు, కావ్యాలలో కావలసినన్ని దృష్టాంతాలు ఉన్నవి. ఇంత వైవిధ్యత, విస్తృతి,
అభిరుచి, ఆసక్తి, భోగాసక్తి గలవారికి అన్యమతం తాలూకు రెండు వస్త్రాలపై ఆసక్తి/అభిరుచి
ఏర్పడడంలో అసంగతం ఉందా? పైగా
అంగీ, టోపీ కూడా అదివరకు హిందూ మతంలో అదివరకు ఉన్నవే కదా?
అసలు సమాజంలో వస్త్రధారణ లో మార్పులు సామాజిక అవసరాలకు, ఆసక్తులకు, అనుకూలతలకు,
అభిరుచులకూ, అందుబాటులో ఉన్న మౌలిక వనరులకూ అనుగుణంగా ఏర్పడతాయని ఊహించవచ్చు తప్ప,
బలీయమైన రాజకీయ కారణాల కోసం ఏర్పడతాయనడం దూరాన్వయమైన విషయం. నిన్నటి తరాన ఓణి పరికిణీ
పోయి సల్వార్ కమీజు, చున్నీ వాడకం బలపడడం చాలామంది చూసి ఉన్నాం. ఓ వంద సంవత్సరాలు దాటిన
తర్వాత ఎవరైనా ఈ మార్పును "సిక్కీకరణ" (సిక్ఖుమత ప్రభావం) అంటే ఎలా ఉంటుంది?
>>విజయనగరపు రాజుల కాలం నాటి దుస్తుల ఆనవాళ్ళు కూడా దొరకనప్పటికీ
ఇక విజయనగర రాజుల కాలంలో సామాన్యులలో ఏయే వర్గం వారు ఎలాంటి దుస్తులు ధరిస్తారన్న
విషయం స్థానిక చరిత్రలలో ఉంది. కావ్యాలలో ఉంది. కన్నడ "కుమార రామయ్యన చరిత్రె"
లో కబాయిని ఉటంకించారు. కళాపూర్ణోదయంలో కబాయి పైన చూశాం.
ಭಟ್ಟರ ರೂಪಿದೇವಯ್ಯನ ಕರೆಸಿದ
ಹಚ್ಚಡ ದಟ್ಟಿ ಕಬಾಯಿ |
ಕೊಟ್ಟು ಕಂಪಿಲರಾಯ ಕಳಹಲು ಡಿಳ್ಳಿಗೆ
ಬಿಟ್ಟಲ್ಲಿ ಬಿಡದೆ ಬಂದಿಳಿದ || ೨೪. ೪೯ ||
>>ఇస్లామీయకరణ మత సంబంధమైన మార్పును కాక ఒక రాజకీయమైన మార్పును సూచిస్తుంది.
అప్పటికే ప్రబలి వున్న ఇస్లాం సంస్కృతిలో పాలు పంచుకోడం ద్వారా రాజ్యాధికారాన్నీ, స్వయంప్రపత్తినీ
నిలబెట్టుకోడానికి రాజులు >>తెచ్చుకున్న మార్పు ఇది - వాగ్నర్.
పైన వాగ్నర్ వ్రాసిన రాత - విజయనగర రాజులు మొఘలులకో, బహమనీ/నిజాం వారికో లోబడినట్టు
లోపాయికారీగా ధ్వనింపజేస్తుంది. విజయనగర సామ్రాజ్యం మతసహనాన్ని పాటించిన రాజ్యం. మహమ్మదీయ
మతమే కాదు జైన మతమూ నాడు ఆదరించబడింది. (రెండవ హరిహర రాయల నాటి జైనుల గాణిగిత్తి
దేవాలయం నేటికీ శిథిలంగా హంపిలో ఉంది. హేమకూటంపై జైనుల శిథిల దేవాలయాలను చూడవచ్చు). రెండవదేవరాయల కాలంలోనే సమర్థవంతమైన రౌతుల కోసం మహమ్మదీయులను సైన్యంలో చేర్చుకోవడం మొదలయించి. కృష్ణ రాయల సైన్యంలో వేలమంది మహమ్మదీయ సైనికులు ఉండేవారు. వారికై మసీదులు ఉండేవి. అలాగే పర్షియా భాషా శబ్దాలు, అవసరమైన ఉపకరణాలు నాడు తెలుగులో తగినన్ని ఉన్నవి. (రాయవాచకము).
అయితే - విజయనగర రాజ్యం ఏర్పడింది స్పష్టంగా హైందవ సంస్కృతి ప్రభావంతోనూ, విద్యారణ్యుల
ఆశీస్సులతోనూ. నెలటూరి వారు దీన్ని గురించి విపులంగానే వ్రాశారు. ఎన్నో స్థానిక చరిత్రలు,
ఉదంతాలు ఉన్నాయి. రాయచూరు, బెడదకోట, మధుర
- తదితర సుల్తానులను పూర్తీగా జయించిన విజయనగరం - ఇస్లామీయకరణలో భాగంగా ఓ రెండు వస్త్రాలను
సొంతం చేసుకుని, తమకు అడ్డు లేని "స్వయం ప్రతిపత్తి" ని నిలబెట్టుకోవడం కోసం
ఈ మార్పు కు ఒడిగట్టింది అనడం - వ్యాసకర్త ’మరో’ ఉద్దేశ్యాన్ని చెప్పకనే చెబుతూంది.
అదిల్షా - కృష్ణరాయలకు శ్రీముఖం పంపి, తన రాయచూరు దుర్గాన్ని తనకు తిరిగి ఒప్పగించమని, లేకపోతే మొఘలుల ఆసరాతో దండెత్తగలనని బెదిరిస్తే - రాయలు చాలా ఔద్ధత్యంతో జవాబిస్తాడు. తనకు రాజ్యం ఒప్పగించడం సమ్మతమేననీ, అయితే ఆదిల్షా తన పాదాలంటి సామంతు అని ఒప్పుకుంటే చాలని అంటాడు. ఇది పేస్ క్రోనికల్స్ లోనే ఉంది. అల్లసాని పెద్దన "తుముకి బాయిల బాయిదే గాఖూబు.." అనే చాటువు ఇతరత్రా ఎన్నో చాటువులూ, మధురా విజయమనే కావ్యమూ, ప్రబంధ కావ్యాలలో ఆశ్వాసాంతపద్యాలు విజయనగర రాజులు - మహమ్మదీయరాజులపై ప్రకటించిన అలక్ష్యాన్ని, విరోధాన్ని స్పష్టంగా చెబుతున్నాయి కదా? మరి వాగ్నర్ గారి బుజ్జగింపులెందుకు ఇక్కడ?

>> విజయనగరపు కాలం నాటి స్థూపాలలో కనిపించే ఇస్లాం శిల్ప శైలి అందరూ
గుర్తించినదే.
స్థూపాలు? ఇక్కడ కట్టడాలు అని ఉండాలి బహుశా.
విజయనగరంలో - దేవాలయాలు కాకుండా రాణివాసపు స్నానమందిరం, గజశాల ఇత్యాది కట్టడాలలో
ఇస్లాం శిల్పశైలి కనిపిస్తుంది. ఇది ఎవరూ కాదనరు.అలాగే రాతికాలువలు/జలనిర్వహణ విషయాలలో పోర్చుగీసు వారి కైవాడం
ఉందని స్పష్టంగానే చారిత్రకులు వ్రాశారు. ఇది వారి అభిరుచులకు/అవసరాలకు అనుగుణంగా ఏర్పాటు
చేసుకున్నదే కానీ బలీయమైన రాజకీయ కారణాల మూలకంగా కాదని సులభంగానే తెలుస్తుంది. అలాంటిదే
ఉంటే ఎంతో అభిరుచితో వారు కట్టించిన "హజార రామ", "బాలకృష్ణ" ఇత్యాది
దేవాలయాలలో ఏ ఒక్క చోటా మహమ్మదీయ శిల్పప్రభావం (కమానులు/పగోడాలు వగైరా) కనిపించవేమి?
రాయవాచకంలో "ఉచిత సప్తాంగము" ను ఉటంకిస్తూ వాగ్నర్ - హిందూ సాంప్రదాయంలో
మహమ్మదీయ వస్త్రాల వినిమయం గురించి చేసిన వివరణ సమగ్రం కాదు. హైందవమతంలో ఆత్మీయులకు
ఇచ్చే బహుమతి/సంభావన ఏదైనా తాంబూలం ద్వారా అందించి సత్కరించటం, నాటికీ నేటికీ పరంపరాగతంగా
వస్తున్న సాంప్రదాయం. "ఉచిత సప్తాంగము" - అన్నది వ్యావహారికమైన బహుమతి. అంతే
కానీ, ఖచ్చితంగా ఇచ్చే సాంప్రదాయం కాదు. అందులో కబాయి, కుళ్ళాయి రావడం వెనుక మతపరమైన
కారణాలు వెతకటం అనవసరం.
వాగ్నర్ - వ్యాసంలో స్థానిక చరిత్రలు, ఇతర భారతీయ రచనలను పరిశీలించకపోవటం పెద్ద లోపం.
అతని వ్యాసాన్ని మరింత నిశితంగా పరిశీలించి నిగ్గు తేల్చవలసిన అవసరం ఉంది. అంతవరకూ
ఈ వ్యాసాన్ని ప్రతిపాదనల వరకే అంగీకరించటం సమంజసం అవుతుంది కానీ ప్రామాణికంగా భావించటం
పొరబాటు కాగలదు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Comments ridiculing, abusing, bullying and forcing to agree in any form, if objectionable to the blog owner will be removed.